మా తాతయ్య

రాసిన వారు: కామరాజు శ్రీలత
(శ్రీలత గారు నండూరి రామ్మోహనరావు గారి మనవరాలు. నండూరి గారి పై పుస్తకం.నెట్లో వచ్చిన వ్యాసానికి స్పందించి, ఆయనతో తన అనుభవాల గురించి రాసినందుకు వారికి ధన్యవాదాలు – పుస్తకం.నెట్)

********************
nanduriఅందరు పిల్లలూ సెలవు వస్తే ఎప్పుడెప్పుడు ఊరు వెళదామా అని ఎదురు చూస్తూంటారు. మేమూ అలాగే ఎక్కడో హైదరాబాద్ లో ఉంటే మా అమ్మమ్మ తాతయ్య,పిన్ని,అత్త,బాబాయ్ అందరు విజయవాడలో ఉంటారు.అందరు ఎండాకాలం సెలవులు వస్తే చల్లటి ప్రదేశానికి వెళ్ళి హాయి పొందితే మేమేమో విజయవాడ వెళ్ళి అక్కడ ఎండల్లో హాయి పొందుతాము. ఇక్కడ తాతయ్య గురించి రాస్తున్నా, అమ్మమ్మ గురించి రాయకుండా ఉండలేము ఎందుకంటే వాళ్ళు ఇద్దరూ ఒకటే కదా. దుర్గ గుడి,కృష్ణా నది తరువాత అమ్మమ్మ వంట,తాతయ్య మాట ఇవే మాకు విజయవాడ ప్రధాన ఆకర్షణలు.

అలగే తాతయ్య గురించి రాస్తూ పుస్తకాల గురించి అస్సలు రాయకుండా ఉండలేము. మా తాతయ్య మొదట నాకు బాగా తెలిసింది ఆయన రాసిన “హరివిల్లు” ద్వరనే.అది లేకుండా ముద్ద దిగదు,నిద్ర రాదు.. అంతగా చిన్న పిల్లలకి నచ్చే విధం గా రాసి అమ్మల పాలిట వరం గా అయ్యారు. ఎందుకంతే ఆ పాటలు చెప్తూంటే పిల్లలు కిమ్మనకూండా చెప్పింది చేస్తారు. అలగ మాకు పుస్తకాలు అంటే ఇష్టం పెంచి పుస్తకాలు మనుషులకి మంచి స్నేహితులు అన్న ననుడి మాకు అనుభవం లోకి తెచ్చారు.హరివిల్లు తరువాత నాకు టాం సాయర్ గుర్తుకువస్తాడు.. ఆయన అనువదించిన మార్క్ ట్వేన్ పుస్తకాలు చదువుతూంటే మేము అమెరికాలోని అమేజాన్ నదిఎలా ఉంటుందో ఊహించుకోవడమే కాకుండా, మేమూ టాం సాయర్ తో పాటుగా సాహసాలు చేస్తున్నామని ఊహించుకునేవారం. పుస్తకాలే కాకుండా మా తాతయ్య మాకు బోరు కొట్టకూడదని ఆయన చిన్నప్పటి ఆరుగొలను విశేషాలు, రావికొండలరావు గారి తెలుగు మాస్టారు జోక్స్, ఆయన తిరిగి వచ్చిన ప్రదేశాల కబుర్లు, ఇలా ఎన్నో అలుపెరగకుండా చెప్పేవారు. పాపం ఎపుడైనా అలిసిపోతే, మేము ఊరుకోకుండా, “పాడు తాతయ్యా, చెప్పు తాతయ్యా!” అని ఒకటే గొడవ చేస్తే, “అబ్బా, ఏమిటే, ఎంతసేపూ చెప్పు తాతయ్యా, పాడు తాతయ్యా అంటారూ” అని పదాల అర్థాలు మార్చి మమ్మల్ని నవ్వించేవారు.

నాకు మాత్రం వాళ్ళింటికి వెళ్తే ఇష్టమైన పని ఆయన దగ్గరున్న పుస్తకాలు, కేసెట్లు, ఫొటోలు సర్దడం. ఆ పని చేస్తూ, తాతయ్య చేత అప్పటి విశేషాలు చెప్పించుకుంటూ ఉంటే సమయం తెలిసేదే కాదు. ఆయన దగ్గర నుంచే మాకు హిందుస్తానీ సంగీతం, బిస్మిల్లా ఖాన్ షెహనాయీ, పండిట్ రవిశంకర్ సితార్, హరిప్రసాద్ ఛౌరాసియా ఫ్లూటు, ముఖ్యంగా సైగల్ పాటలూ తెలిసాయి అంటే అతిశయోక్తి కాదు. “సైగల్ పాటలా, అబ్బా బోర్ తాతయ్యా!” అని తెలియనితనంలో అంటే, ఆయన అభిప్రాయంతో మేము ప్రభావితం కాకూడదని ఊరుకునేవారు. అలా మౌనంతోనే మాకు అవి ఎంత గొప్పవో తెలిసేలా చేసారు. మాకు ఎలాంటి పుస్తకాలు చదవాలో, ఎవరి పుస్తకాలు చదవితే బాగుంటుందో చెప్పింది ఆయనే. ఇలాగే ఒకసారి వేసవి కాలం సెలవుల్లో విజయవాడ వెళ్ళినపుడు స్టేషన్ లో కొన్న సిడ్నీ షెల్డన్ పుస్తకం చదువుతూఉంటే, ఇంతకన్న మంచి పుస్తకాలు ఉన్నాయని ఆయన తన గ్రంథాలయం (ఆయన సేకరించిన పుస్తకాలు చూస్తే మీరూ ఒప్పుకుంటారు) నుంచి రవీంద్రనాథ్ టాగోర్, షేక్స్‌పియర్, ఇంగ్లీష్ హాస్యం, చిన్న కథల పుస్తకాలు ఇచ్చారు. ఇంకోసారి నాకు నటి భానుమతి గారంటే ఇష్టం అని చెబితే, ఆయన దగ్గరున్న “నాలోనేను, అత్తగారి కథలు” పుస్తకాలు నాకు ఇచ్చేసారు. (ఆయన ఎప్పుడు పుస్తకాలు కొనడమే కానీ, ఎవరికీ ఇవ్వరు, అది మళ్ళీ తిరిగిరాదనో, పుస్తకం పాడైపోతుందనో అని)

అలాగే, నాకు చాలా స్పూర్తి కలిగించే సంఘటన ఏమిటంటే, ఆయనకు జరిగిన సన్మానాల్లో ఒక్కటే నేను చూశాను. అది ఆయనకు గౌరవ డాక్టరేటు పురస్కారం. అప్పటి ప్రధాన మంత్రి పి.వి.నరసింహారావు గారి దగ్గర నుంచి అందుకుంటున్నప్పుడు. అలాగే, ఇంకోసారి ఆయనకి అజోవిభో వాళ్ళు ఆయన చదువుకున్న ఊరు రాజమండ్రిలో సన్మానం చేస్తే, మా ఇంటికి వచ్చిన తరువాత ఆయనకు ఇచ్చిన సన్మాన పత్రం నా చేత చదివించుకుని, చదివిన తరువాత బాగా చదివావని చెప్పడం. అలాగే, ఇంకోసారి నేను ఏడో తరగతి మంచి మార్కులతో పాస్ అయ్యాననీ, నా పుట్టినరోజు కి కలిపి టైమెక్స్ వాచ్ నాకు కానుకగా ఇచ్చారు. ఈ మూడూ నేను ఎప్పటికీ మరిచిపోలేని సంఘటనలు.

ఒకసారి వెళ్ళినపుడు నేను చుట్టుపక్కల ప్రదేశాలు ఏమీ తెలియవు అంటే మమ్మల్ని కారులో విజయవాడ కృష్ణా బ్యారేజీ, ఇంకా అక్కడి ఇతర ప్రదేశాలు దగ్గరుండి తీసుకుని వెళ్ళారు. ఇది ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నాను అంటే, మా తాతయ్యకు చాలా భయం మమ్మల్ని ఒక్కళ్ళని ఎక్కడికన్నా పంపించాలి అంటే. వీథి చివర ఉన్న కొట్టుకు వెళ్ళాలన్నా కారులో వెళ్ళు, లేకపోతే నేను వస్తానని అంటారు. నువ్వు వస్తే ఇంక మేము వెళ్ళడం ఎందుకు తాతయ్యా అంటే వినరే! అలాగే ఆయన కి టైం అంటే టైం ఏ. భోజనానికి, నిద్రపోవడానికి, ప్రయాణానికి, ఆఖరుకి మమ్మల్ని స్టేషన్ కి పంపించడానికి కూడా! మచ్చుక్కి ఒక్క సందర్భం చెప్తాను. నేను విజయవాడ నుంచి ఎప్పుడు బయలుదేరినా పొద్దున్నే శాతవాహనకి బయలుదేరతాను. అది ఆరున్నర కి బయలుదేరితే, మా తాతయ్య నాకు మూడున్నర నుంచి మేలుకొలుపు పాడతారు. అదే, ఫోన్ లో అలార్మ్ పెట్టి లేపుతారు. “ఇంకా టైం ఉంది కదా తాతయ్యా!” అంటే “అమ్మో, ఇక్కడ నుంచి స్టేషన్ కి వెళ్ళడానికి చాలా సమయం పడుతుంది. నీ మాట వినేది లేదు” అంటారు. విజయవాడ దూరాల గురించి తెలిసిందే కదా, పట్టుమని పదిహేను నిముషాలు లేక అరగంట పట్టదు స్టేషన్ కి కార్లో వెళ్ళడానికి. ఇహ నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు మా ఆఫీసు కారులో వెళ్ళేదాన్ని. దానికి ఈయన పడే ఖంగారు చూస్తే అప్పట్లో నవ్వొచ్చేది కానీ, ఇప్పటి పరిస్థితులు చూస్తూంటే ఆయన ఖంగారుకు కూడా అర్థం ఉంది అనిపిస్తుంది. ఇలాగే ఒక రోజు బయలుదేరుతూ ఉంటే నేను కార్ ఎక్కే లోపల ఆ డ్రైవర్ గురించి పుట్టు పూర్వత్తరాలు తెలుసుకునేంత వరకు మా అమ్మా నాన్నల్ని వదిలి పెట్టలేదు. అలాగే, ఇంకొకసారి ఆయన తన ఊరి గురించి చెప్తూ ఉంటే నేను పల్లెటూరు ఎప్పుడూ చూడలేదు అన్నాను. ఆయన అప్పటికప్పుడు మమ్మల్ని అమ్మమ్మవాళ్ళ ఊరు విస్సన్నపేటకి పంపించడానికి అక్కడ మా బంధువులకి చెప్పి అన్ని ఏర్పాట్లూ చేసి, మాకూ ఊరంతా చూపించాలని వాళ్ళకి చెప్పి, గంట గంటకీ విషయాలు కనుక్కుంటూ వచ్చారు.

ఆయన మాటల్లో చెప్పక పోయిన ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు జరిగినప్పుడు మేమంటే ఎంత ఇష్టమో కదా! అనిపిస్తుంది. నేను విజయవాడలో ఉంటే ఆదివారం వచ్చింది అంటే చాలు, నాకు మా తాతయ్యకి ఈనాడు ఆదివారం పుస్తకంలో గడినుడి పూర్తి చెయ్యడం లో పోటీ ఉండేది. ఆయనతో ఇలాంటి చిన్న చిన్న విషయాలూ, కబుర్లూ ఎన్నో, ఎన్నెన్నో! రాసుకుంటూ పోతే ఆయన గురించి మేము అందరం రాస్తే పెద్ద పుస్తకమే తయారవుతుంది. మా అందరికీ ఆయన నడుచుకునే తీరు, ఆయన జీవన సరళి చూపి జీవితంలో ఎలా ఉండాలో, కష్టాలు వస్తే ఎంత ధైర్యంగా ఉండాలో, ఇలా ఎన్నో విషయాలు చెప్పకనే చెప్పారు. ఆయన ఎప్పుడూ చెప్పే ఒక మాట తో ఆయన గురించి నేను రాసేది ముగిస్తాను. “ఏ విషయమూ ఎక్కువగా ఆలోచించి మన మనసు పాడు చేసుకోకూడదు. అన్నింటికి మితి పాటిస్తే, జీవితం ఎంతో బాగుంటుంది.”

You Might Also Like

3 Comments

  1. Sudheer

    శ్రీలత గారికి,

    మీ తాతయ్య గారి గురించిన కొన్ని మంచి విషయాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. దురద్రుష్టవశాత్తూ ఆయన వ్రాసిన పుస్తకాల్లో కొన్ని మాత్రమే ఇప్పుడు దొరుకుతున్నాయి. ఎంత కాలం గానో వెతుకుతుంటే, అద్రుష్టవశాత్తూ నిన్నటి బుక్ ఫెయిర్ లో, టాం సాయర్ మరియు విచిత్ర వ్యక్తి పుస్తకాలు దొరికాయి. ఇంకా ‘బాలరాజు ‘ అనే పుస్తకం కూడా వ్రాసారు అని వికీపీడియా లో చదివాను.

    ఈ పుస్తకాలు మరో ముద్రణ పొందే అవకాశం ఏమైనా వుందా? పుస్తక రూపం లో కాకపొయినా, కనీసం డిజిటల్ రూపంలో అయిన పబ్లిష్ చేయగలిగితే, ఎప్పటికీ వారి పుస్తకాలు అందుబాటులో వుంటాయి. ఈ విషయం లో ఏ విధంగానైనా మేము కూడా సహయపడే అవకాశం వుంటే తప్పక చెప్పగలరు.

    – సుధీర్

  2. పుస్తకం » Blog Archive » నండూరి రామ్మోహనరావు – జీవిత విశేషాలు

    […] చెప్పిన విశేషాలు పుస్తకం.నెట్లో ఇక్కడ చదవండి. ఆయన్ని కలిసినప్పుడు సౌమ్య […]

  3. radhikagudipati

    srilatha mee taatayya gurinchi chala baga rasavu..chaduvutunte naku mana chinnapati vishayalu gurtuku vachai….ila nee khaburlato malli aa paata rojulu nemaraveskuntu chala anandinchanu…chala chakkati bhashaa lo rasavu.nuvvannatu Tomswayer ,Huckulberfyn pustakalu chaduvutunte aa khada lo manam kooda aa patralaipoyi munigiteltuntam..chuttuprakkala prapancham teliyadu paiga pustakam poortiayyaka Arey !!!manam ikkade unnama ani ee lokamloki vachipaddaniki konta samayam padtundi…ilage nuvvu inka yenno manchi vishayalu rayali…..RADHIKA akka!

Leave a Reply