సంభాషణ

రాసిన వారు: బి.అజయ్ ప్రసాద్
*********************

గత ఇరవైఏళ్ళ కాలంలో తెలుగు సమాజం చాలానే చూసింది. పోగొట్టుకోగా ఇంకేమైనా మిగిలింది చూసుకోవాలనుకుంటే ఈ పుస్తకం చదవాల్సిందే. ఇప్పుడు మనం ఒక గొప్ప మలుపులోనో లేక మరొక యుగసంధిలోనో ఉన్నామని కాస్తంత రాజకీయ పరిజ్ఞానం ఉన్నవారెవరైనా చెప్తారు. అదలా ఉంచి కొన్ని సంవత్సరాలపాటు ధారాపాతంగా ప్రవహించిన కాలం ఇప్పుడు కాస్త ఒళ్ళు విరుచుకుని విస్తరించి ఇటు గ్రామాలను, పట్టణాలను మహా నగరాలను కబళిస్తూ ఉంది. అటు అడవి కన్న కలలనూ తనలో కలిపేసుకుంది. ఇప్పుడు ఎవరెక్కడ మునుగుతారో తెలియదు. ఎవరెక్కడ తేలుతారో తెలియదు. ఎవరేమి పోగొట్టుకుంటారో తెలియదు. ఎవరిచేతిలో ఏవి మిగులుతాయో తెలియదు. ఈ మహాసంగ్రామంలో అస్త్రసన్యాసం చేసినవారు కొందరు. కొంగొత్త శస్త్రాలను భుజానికెత్తుకున్నది మరికొందరు. అయినా ఎవరు మిత్రులో ఇంకెవరు శత్రువులో తెలియని సందిగ్దంలో కడదాకా నిలబడేదెవ్వరు?ఇప్పుడు మనిషిలోపల వైరుధ్యాలను విరుచుకుతింటున్నదెవ్వరు? మరెందుకో ముఖాలన్నీ ఒకేపోలికలతో ఉన్న కాలమిది. భిన్నాభిప్రాయాలతో నిప్పులు చిమ్ముకున్న ఇరువురి మౌనం ఒకేలా ఉంది. ఉప్పెన ముంచుకువచ్చిన విపత్కర పరిస్థితుల్లో ఇక అవతలి ఒడ్డుకు చేర్చాల్సినవేమిటి?

ఇదంతా చాలా కాలం క్రితం సంగతి. అసలిదంతా చాలాకాలం తరవాత సంగతి. అప్పుడెప్పుడో బ్లాక్ & వైట్ లో అంతా క్రిస్టల్ క్లియర్ గా ఉండేది. మనమంతా కోరస్ గా ఖండిస్తూ వచ్చాం. రానురాను మరెందుకో అంతా పునరుక్తిలా అనిపించింది. మరెందుకో మనగొంతులన్నీ తడబడ్డాయి. అంగీకరించడానికీ విభేదించడానికీ మధ్య రాగం శృతి తప్పింది. గందరగ్లోబళీకరణ కలర్స్ మనలను కన్ ఫ్యూజ్ చేసాయి. అసలు మనం కళ్ళతో చూస్తున్నదంతా నిజమేనా అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఈ పరిస్థితిని ఎలా వర్ణించాలి. అక్షరాలు అవే. పదాలు అవే. అర్థాలే తెలియక పిచ్చిపట్టే స్థితి. చూడలేక ఆత్మ అవాక్కవుతుంది. చెప్పలేక మనసు మూగపోతుంది. అసాంతం తలకిందులయిన జీవన వ్యాకరణంలో మనకొక కొత్త భాష కావాలి.

ఇది వచనానికి కవిత్వానికి మధ్య సరికొత్త సాహిత్య ప్రక్రియని కొందరంటారు. ఇందులోని వచనం ఆశ్చర్యం గొలుపుతుంది. ఇదంతా మనగురించేనా అని సిగ్గు కూడా కలుగుతుంది. ఈ భాషలోని గాఢతకు ఏ రసాయనాలు మూలమో తెలియదుకాని అంతకు మించిన విషాద మైకమేదో కనిపిస్తూ ఉంది. మంచి వచనానికి హృదయమే ముడివస్తువుతప్ప చేతినైపుణ్యం కాదుకదా. ఈ గ్రంధకర్త అనేక గాయాలను చూసినవాడు. మనకు తెలియని అనేక అస్థిత్వ ఉద్యమాల ఘర్షణలనీ, వైరుధ్యాలనీ అవలీలగా మింగిన గరళకంఠుడు. మనమెవ్వరమూ ఇంకా చూడని యుద్ధాలని ముందే చూసిన నిర్వికల్పుడు. రూబెన్ చిత్రించిన వర్ణపటంలో గుహలోపల సింహాలమధ్య చెప్పలేనన్ని హావభావాలతో కూర్చున్న డేనియల్ లా కనిపిస్తాడు. ఈ స్థితప్రజ్ఞత పలాయనం నుంచి రాదు. దీనికి చాలా ధైర్యం కావాలి. చాలా గాయపడాలి.

భోధివృక్షం కింద జ్ఞానోదయం సరే. నదీజలాల పంపిణీలో ఇరురాజ్యాల వాదప్రతివాదాలనుంచి రాకుమారుడైన సిద్ధార్థుడు గౌతమబుద్ధుడిగా పరిణామం చెందాడని కొందరు నమ్ముతారు. ఇరువురూ యుద్ధం తప్ప మరింకేదైనా చేయండని చెప్తాడు సిద్ధార్థుడు. అది క్రీస్తుపూర్వపు మానవుడి మొదటిసూత్రం. మనం చిక్కుకున్న ఆధునికతలో యుద్ధం అనివార్యం. నిశ్చలనిశ్చితాలులేని నైరూప్యదృశ్యంలో మరిక యుద్ధం దేనికోసం అన్నది మరొక ప్రశ్న. వైరివర్గాలు ఎప్పుడూ మోహరించే ఉంటాయి. అంతా అనుకున్నట్లే జరుగుతుందనీ, అంతిమ విజయం మనదేననీ అందుకు చరిత్ర, వేళ్ళమధ్య సూత్రాలే సాక్ష్యమనీ అందరూ నిశ్చింతగా ఉంటారు. మరెందుకొ యుద్ధం జరగకుండానే అందరూ క్షతగాత్రులవుతూ ఉంటారు. నిరంతర యుద్ధరంగంలో ఎందుకు గాయపడాలో మరెందుకు రాయిగా మారాలో జీవకుడు జరిపే సంభాషణ ఇది. ఈ గాయం తీరేదికాదు. ఈ హృదయం చల్లారేదికాదు.

ఇంతకీ ఇదంతా చర్వితచరణమే. ఇదంతా ఎప్పుడో ఇంపోజిషన్స్ రాసేశాం. ఈ వ్యాసాలనిండా ఒక అంతఃసూత్రం కనిపిస్తూ ఉంది. అది కేవలం ఒక చూపుమాత్రమే కావచ్చు. ముఖచిత్రంలో ఒడ్డును తాకిన కెరటం విస్ఫోటనం చెందినట్లు ఈసంభాషణలో శకలాలుశకలాలుగా విడిపోతున్న అంతర్ముఖం కనిపిస్తుంది. దుఃఖం నిత్యం కదా. బంధవిముక్తులం కావడానికి బహుముఖాలను అంగీకరించాలి. రచయిత కేవలం ఇదొక స్వగతమేనంటాడు. కొన్ని యుగాలపాటు వెనక్కువెళ్ళి పాతరాతియుగంతో చేసిన సంభాషణలు ఇందులో వినిపిస్తాయి. మరొకసారి అంతరిక్షం అవతలికి వెళ్ళి కూడా మనిషి అంతరంగంలోని ఊర్ధ్వలోకాలతో చెప్పుకొన్న ఊసులు వినిపిస్తాయి. తన సితార్ తో అనేక స్వరాలను పలికించే ఈ పరివ్రాజకుడు ఖండాంతరాలను దాటి ఫిడెల్ కాస్ట్రో, సద్దాంలను పరామర్శించడమేకాక అంతరిక్షం చేరి చందమామ మీద నీటిఛాయ సరే, మనిషి మనసులో ఆర్ద్రత, కళ్ళలో నీటిపొర ఏదని పరితపిస్తాడు.

జీవితాన్ని వెలిగించడానికి ఒక అబద్ధం కావాలి ప్లీజ్ అంటూ ఆశ యొక్క ఆవశ్యకత గురించి చెప్తాడు. ఎన్నో పదాలూ, వాక్యాలూ మీద నుంచివెళ్ళినా ఒక్క అక్షరమూ పలకలేని మనిషి ఆత్మహననం గురించీ చెప్తాడు. ఒక సముద్రప్రళయంలో కొట్టుకుపోయిన మనిషి అత్యున్నతమైన చైతన్యాన్ని పరిహసిస్తాడు. జ్ఞాపకముంచుకోవలసిన ఒక స్వప్నం గురించి గుర్తుచేస్తాడు. పాజ్ ప్లీజ్ అంటూ మనలను ఈడ్చుకుని వెళ్తొన్న సమయం గురించీ చెప్తాడూ, అంతేకాక అసంఖ్యాకమైన ఆలోచనల మధ్య చిక్కుకుపోయి మాటలులేక మ్రాన్పడిపోయే ఒక ఆరంభ సంశయం గురించీ మూగపోతాడు.

ఇతడు మార్క్సునూ కలవరిస్తాడు, నాస్తికుడై ఉండీ మార్మికతనూ కావాలంటాడు. అర్థం కాని సృష్టిరహస్యం మనిషిలో ప్రతిసృష్టిని ప్రేరేపిస్తుందంటాడు. ఆశాదీపం కొడిగట్టకుండా ఉండాలంటే మరి ఒక అబద్ధమైనా పరవాలేదంటాడు. వర్తమానంలో ఈ వైరుధ్యాలను అర్థం చేసుకొకపోతే దృష్టిగతమైనట్లే. అందుకేనేమో “నేను వైరుధ్యాలను వెన్నెముకగా ధరించినవాడిని” అన్నాడు అజంతా.

ఈ సంభాషణ పత్రికారంగంలో ఒక తరం ప్రతినిధులకు ఒక జ్ఞాపిక. సిద్ధాంత రాద్ధాంతాలు లేకపోవడం చేత ఇందులో వైరుధ్యాలేం లేవు. పేచీ పడటానికి ఇందులో రాజకీయ అభిప్రాయాలేంలేవు. అందుచేతనే కావచ్చు దీనికొక సర్వకాల ప్రాసంగికత ఏర్పడింది. మెటామార్ఫాసిస్ కు లొంగని మందుగుండేదో ఇందులో దట్టించి ఉంది. డైల్యూట్ కాని డెల్యూజన్స్ ఏవో ఇందులో ఉన్నాయి. ఈ పుస్తకంలో ఉన్న కొన్ని వ్యాసాల దృష్ట్యా ఇది తొందరగా ఎక్ స్పైర్ అయిపోవాలని కోరుకుంటున్నాను. ప్రతిదినం ఒక ప్రతిధ్వని కాని కాలంలో ఈ పుస్తకం అవసరం లేదు. మన జీవితాలలో పునరుక్తిలేని సందర్భంలో ఈ పుస్తకం ఒక అసందర్భం. మరి ఇప్పట్లో అది జరిగేట్లు లేదు. అప్పటిదాకా ఇదొక నిత్యపారాయణ గ్రంధం. అంతేకాక చలనంలేని మన దైనందిన చిత్రాన్ని చూపడానికి ఇంతకుమించి ఇప్పట్లో మరొక భాషను ఊహించలేకుండా ఉన్నాను.
********************
పుస్తకం వివరాలు:
సంభాషణ – కె.శ్రీనివాస్ (ఆంధ్రజ్యోతిలో వచ్చిన వ్యాసాల సంకలనం)
ప్రచురణ – 2011
పుటలు – 172
ఆన్లైన్ కొనుగోలుకు ఏ.వీ.కే.ఎఫ్ లో ఇక్కడ చూడండి.

You Might Also Like

14 Comments

  1. KumarN

    “కిక్ ఇచ్చే వచనం శ్రీనివాస్ సొంతం”
    భలే చెప్పారు. Amen. Srinivas is one of the people I respect.

    “సిద్ధాంత రాద్ధాంతాలు లేకపోవడం చేత ఇందులో వైరుధ్యాలేం లేవు. పేచీ పడటానికి ఇందులో రాజకీయ అభిప్రాయాలేంలేవు” I disagree.

  2. perugu.ramakrishna

    ఒక విలువైన పుస్తకాన్ని నిజమైన విశ్లేషణ రాసిన అజయ్ కి అభినందనలు..
    కిక్ ఇచ్చే వచనం శ్రీనివాస్ సొంతం..మంచి సమీక్ష ఆసాంతం..

  3. m s naidu

    ajay, your review is good.
    kaaranakriti’s comment is too vague.
    keep it up.

  4. kothapalli ravi babu

    it is a very good review. Exemplary to those who review books in the magazines nowadays. Ajayprasad though a short story writer proved to be a good literary critic also.
    kothapalli ravibabu

  5. kiran

    hi kaaranakriti
    your comment is vague. please make it clear.

  6. kaaranakriti

    as per the reading of ajay, sambhaashana or some bhaashana is a collection of sum of the editorials published in a telugu daily newspaper. then? what’s wrong with it? in essence holistically?

    any editor or subeditor grown journalist over a period of time will get popular or made popular for his writings.

    if so is the case of deliberate jaundice of appreciation, one can ignore reading books like sambhaashana. a treacherous attempt of linkage of twenty amorphous years of journalistic writing.

    contexts of history, economy, politics, homages, analysis of contemporary happenings,etc., are can be requestioned or redebatable in this juncture.

    ajay’s review may be a squint review.
    reader
    please don’t fall into the trap of analytical writers. they damage our opinions/living in the form of editorials/reviews?

  7. మల్లీశ్వరి

    సిద్ధార్ద్ గారూ
    రాజకీయాభిప్రాయాలున్న ప్రతి రచన కీ సర్వకాల ప్రాసంగికత ఉంటుందని నేను నా వ్యాఖ్యల్లో ఎక్కడా చెప్పలేదు… రాజకీయాభిప్రాయాలున్నప్పటికీ శ్రీశ్రీ మహాప్రస్థానం,గోర్కీ అమ్మ,టాల్ స్టాయ్ యుద్ధము శాంతి లాంటి పుస్తకాలను కాలాతీతంగా చదువుతూనే ఉన్నాం కదా రాజకీయాభిప్రాయాలు లేవు కాబట్టే సంభాషణ కి సర్వకాల ప్రాసంగికత ఉంటుంది అన్న అజయ్ గారి వాక్యాల పట్ల విభేదంతో నా అభిప్రాయాలు చెప్పాను.

  8. siddharth

    రాజకీయ అభిప్రాయాలున్న సాహితీవేత్తలకు నమస్కారం.

    కె.శ్రీనివాస్ రాజకీయ అభిప్రాయాలకు సర్వకాల, సర్వజన ప్రాసంగికత లేదు.

    మహాప్రస్థానానికి ఉన్న సర్వకాల ప్రాసంగికత మరో ప్రస్థానానికి ఎందుకులేదో మల్లీశ్వరిగారే చెప్పాలి.

  9. మల్లీశ్వరి

    కొత్త పాళీ గారూ,
    సంపాదకీయాలకి సర్వ’జన’ ప్రాసంగికతని సమకూర్చడం సంపాదకులకి యిపుడు ప్రధాన బాధ్యతగా మారింది కదా…

    ”సర్వకాల ప్రాసంగికత కోసమో అన్నట్టు నిష్పాక్షికంగా ఉండడం రాణించదు.”అన్నారు మీరు. మిత్ర వైరుధ్యం లో నిష్పాక్షికంగా ఉండడం వేరు…కానీ శత్రు వైరుధ్యంలో శ్రీనివాస్ గారి కాలమ్ అయినా,వారు రాసిన సంపాదకీయాలైనా స్పష్టమైన స్టాండ్ తోనే ఉన్నాయనుకుంటున్నాను. మార్క్స్ ని , మార్కెట్ స్వేఛ్చని వొకేలా పలవరించడం ఎక్కడా కనపడదు.సద్దాం కి చెప్పిన కృతజ్ఞత ల్లో జార్జ్ బుష్ కి ఎప్పుడూ వాటా దక్కలేదు. మీకు గుర్తున్న ఉదాహరణలు ఇచ్చి ఉంటే బావుండేది.

    అనేసారా!!మీరూ అనేసారా!!వస్తువు గురించి కాక వచనం గురించి ప్రశంస మీరూ చేసేసారా!

  10. కొత్తపాళీ

    “ఈ సంభాషణ పత్రికారంగంలో ఒక తరం ప్రతినిధులకు ఒక జ్ఞాపిక. సిద్ధాంత రాద్ధాంతాలు లేకపోవడం చేత ఇందులో వైరుధ్యాలేం లేవు. పేచీ పడటానికి ఇందులో రాజకీయ అభిప్రాయాలేంలేవు. అందుచేతనే కావచ్చు దీనికొక సర్వకాల ప్రాసంగికత ఏర్పడింది. ”

    ఆసక్తికరమైన తీర్మానం. ఎటొచ్చీ ఏదో ఒక పక్షాన నిలబడవలసిన సందర్భాల్లో కూడా – పైన సమీక్షకులు చెప్పినట్టు – సర్వకాల ప్రాసంగికత కోసమో అన్నట్టు నిష్పాక్షికంగా ఉండడం రాణించదు. ఈ నా వ్యాఖ్య ఈ పుస్తకాన్ని గురించి కాదనుకోండి, ఆం.జ్యో.లో వారు రాసిన కొన్ని సంపాదకీయాల గురించి. ఒకటి నిజం – శ్రీనివాస్ గారు అద్భుతమైన వచనం రాస్తారు.

  11. lakshmi

    మల్లీశ్వరి గారూ,
    అజయ్ గారు “సంభాషణా కర్త తాత్వికతని అదే టోన్ లో విశ్లేషించడానికి చేసిన ప్రయత్నం అభినందనీయం, వ్యాసంలో విశ్లేషణా శైలి చాలా బావుంది” అనే విషయాలతో, మీతో నేనూ ఏకీభవిస్తున్నాను. సర్వజన ప్రాసంగికతకీ, సర్వకాల ప్రాసంగికతకీ ఉన్న భేదం గురించి మాత్రం మీ దగ్గరే పాఠం నేర్చుకున్నాను. కృతఙ్ఞతలు
    లక్ష్మి

  12. మల్లీశ్వరి

    అజయ్ గారూ,
    సంభాషణా కర్త తాత్వికతని అదే టోన్ లో విశ్లేషించడానికి మీరు చేసిన ప్రయత్నం అభినందనీయం.అయితే మీరు రాసిన ఈ కింద వాక్యాల మీద నాకు అభిప్రాయ భేదం ఉంది.
    ” సిద్ధాంత రాద్ధాంతాలు లేకపోవడం చేత ఇందులో వైరుధ్యాలేం లేవు. పేచీ పడటానికి ఇందులో రాజకీయ అభిప్రాయాలేంలేవు. అందుచేతనే కావచ్చు దీనికొక సర్వకాల ప్రాసంగికత ఏర్పడింది.”అన్నారు మీరు…సిద్ధాంతాలు రాద్ధాంతాలు చేస్తాయా?చేస్తే ఎందుకు చేస్తాయి? అన్న చర్చ పక్కన పెడితే..కె.శ్రీనివాస్ గారు స్పష్టమైన బలమైన రాజకీయాభిప్రాయాలున్న సాహితీ వేత్త.బాధితుల పక్షాన నిలబడే ప్రతి రాజకీయ దృక్పధం పట్లా సహనంతో ఉండొచ్చేమో ,మార్క్స్ నీ మార్మికతనూ పలవరించవచ్చేమో కానీ సందర్భం వచ్చినపుడు తన రాజకీయ దృక్పధాన్ని స్పష్టం గా ప్రకటించగల తాత్వికత తెలిసిన ఉద్యమకారుడు కూడా…ఆ ఖచ్చితమైన రాజకీయ దృక్పధం లోంచే, అదిచ్చే వెలుగు లోంచే సంభాషణా వస్తువు రూపొందింది.వస్తువు తన శిల్పాన్ని తానే వెతుక్కున్నట్టు అప్పటి వరకూ ఉన్న మూస ప్రక్రియలని తోసేసి ఓ కొత్త ప్రక్రియని ఆవిష్కరించుకుంది.రాజకీయ అభిప్రాయాలు లేకపోవడం మూలంగా కొన్ని సందర్భాల్లో సర్వజన ప్రాసంగికత ఏర్పడొచ్చేమోగానీ సర్వకాల ప్రాసంగికత ఉంటుందని చెప్పలేం…అటువంటపుడు మహాప్రస్థానానికి సర్వకాల ప్రాసంగికత లేదా? రాజకీయ అభిప్రాయాలు లేకపోతేనే సర్వకాల ప్రాసంగికత ఉంటుంది అన్న అర్ధం మీ వాక్యాల్లో రావడంతో దాని పట్ల విభేదంతో మాత్రమే ఈ రెండు వాక్యాలు.

    వ్యాసంలో మీ విశ్లేషణా శైలి చాలా బావుంది…చాలా రోజుల తర్వాత మంచి సమీక్షని చదివిన సంతోషం కలిగింది.

  13. leo

    పుస్తకం దేని గురించండీ? జంపాల గారు ఇచ్చిన లింకు చందాదారులకి మాత్రమే అంట.

Leave a Reply