నాయకురాలు నాగమ్మ
తొలి మహామంత్రిణి నాయకురాలు నాగమ్మ
(చరిత్ర దాచిన పల్నాటి ప్రామాణిక దర్పణం)
ఈ పుస్తకం – పల్నాటి చరిత్ర గురించి జనబాహుళ్యంలో స్థిరపడ్డ సత్యాసత్యాల గురించి రచయిత చేసిన పరిశోధనల సారాంశం అని చెప్పవచ్చు.
“పల్నాటి యుద్ధం – ఈ పేరు వింటేనే తెలుగు వారి గుండెలు ఉప్పొంగుతాయి. తెలుగు మహాభారతంగా ప్రసిద్ధికెక్కిన ఈ దాయాదుల పోరు తెలుగు వారందరికీ సుప్రసిద్దమే. ”
-అంటారు కానీ, నా మట్టుకు నాకేం తెలీదు. “పల్నాటి యుద్ధం” సినిమా, భానుమతీ, ఎన్‌టీఆరూ, కొన్ని సంభాషణలూ లీలగా గుర్తున్నాయంతే! నాకు గుర్తున్నంత వరకూ, బ్రహ్మనాయుడు హీరో, నాగమ్మ విలన్ అన్నట్లే చూపించారు సినిమాలో. ఇంకా, బయట ఎప్పుడన్నా ఒకటీ అరా కథలు విన్నా కూడా, నాగమ్మ ప్రస్తావన అంతగా రాదు కానీ, బ్రహ్మనాయుడిని గురించి మాత్రం గొప్పగా చెబుతారు. స్కూలు రోజుల్లో ఆయనపై పాఠం ఏదో కూడా ఉన్నట్లు గుర్తు. ఈ నేపథ్యంలో “నాయకురాలు నాగమ్మ” అన్న పుస్తకం గురించి తెలియగానే కుతూహలం కలిగింది. నాగమ్మ గురించి ఒక పుస్తకం రాసారు – అది కూడా ఆవిడ గురించి జన బాహుళ్యంలో గల అపోహలను తొలగించే ప్రయత్నం చేశారు అని ముందుమాటలో చదవగానే, కుతూహలం ఎక్కువైపోయింది.
కానీ, పుస్తకం చదవడం మొదలుపెట్టాక, కాస్తంత నిరాశ పడ్డాననే చెప్పాలి. ఎందుకంటే, పుస్తకం పేరును బట్టి నేను ఊహించినది వేరు. నేను ఈ పుస్తకం నాగమ్మ జీవిత చరిత్ర అయిఉంటుందని ఊహించాను. కానీ, కాదు. పల్నాటి రాజకీయాలలో నాగమ్మ పాత్ర గురించిన అపోహలు తొలగిస్తూ, తాము పరిశోధించిన సాక్ష్యాల ఆధారంగా నాగమ్మ నాయకత్వంలోని గొప్ప విశేషాలను గురించి తెలుపడమే ఈ పుస్తకం ఉద్దేశ్యం. పుస్తకం లో వ్యాసాల కూర్పు, రాసిన పద్ధతి కూడా ఈ ఉద్దేశ్యానికి అనుగుణంగానే ఉంది.
పుస్తకం పేరు – పల్నాటి చరిత్ర, వాస్తవాలు అనో, అలాంటి మరేదో పెట్టి ఉంటే బాగుండేది అనిపించింది. కవర్ పేజీగా నిలువెత్తు నాగమ్మ విగ్రహం కూడా పెట్టాక, పుస్తకంలో నాగమ్మ కథలో ఒక పాత్ర మాత్రమే కావడం (కథే హీరో కావడం) వల్ల ఈ పుస్తకానికి ఈ పేరు నప్పలేదేమో అనిపించింది. అయితే, చిన్న పుస్తకం కనుక, ఆపకుండా చదివించేలాగానే ఉంది. ఇందాక చెప్పినట్లు, కథే హీరో కదా! మీగ్గానీ నాగమ్మ విలన్ అన్న భావన ఉంటే, ఈ పుస్తకం చివరికొచ్చేసరికి – “ఛ! కాదులే!” అనిపించవచ్చు (మీరు స్త్రీ ద్వేషులు కాకపోతే!). ఎక్కడికక్కడ రిఫరెన్సులు కూడా ఇవ్వడం బాగుంది.
చివరగా, నాకు పుస్తకం చదువుతున్నంతసేపు “What is history, but a fable agreed upon?” అన్న వాక్యం పదే పదే గుర్తొచ్చింది. ఈ పుస్తకంలోని వ్యాసాల్లో ఎక్కడికక్కడ జనం మధ్యలో అసలు కథ గురించి ఎలాంటి వదంతులు స్థిరపడ్డాయో తెలుస్తూ ఉంటే పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్లు ఎందుకు అవసరమో బాగా అర్థమైంది.
పుస్తకం రచన: వై.హెచ్.కే. మోహనరావు
ఈ పుస్తకాన్ని కినిగె.కాం లో ఈ లంకె ద్వారా కొనుగోలు చేయవచ్చు.
రాజేంద్ర కుమార్ దేవరపల్లి
నేను కాదనటం లేదండి.నాయకురాలు నాగమ్మ అంటే నాకేమి చిన్నచూపూ లేదు.సాక్షాత్తు మా అమ్మ పేరు నాగమ్మ.మా బాబాయిల్లో ఒకాయన బ్రహ్మనాయుడు ఉన్నారు.ఇంకొందరికి(మా కుటుంబాల్లో) ఈ పేర్లున్నాయి.నేను అనేదేమంటే ఈ రోజుల్లో … పరిశోధనకు ఉపకరణాలు పెరిగిన ఈరోజుల్లో కూడా, పరిశీలన,పరిశోధన పధ్ధతుల్లో యెంతో మార్పులొచ్చాక కూడా యేదో ఒక పక్షం వహించక రాయలేరా అని?
సౌమ్య
@Rajendra kumar: ఈ విషయంలో నా ఊహ చెబుతాను – బ్రహ్మనాయుడిని అంచనా వేసేందుకు నాగమ్మను చిన్నబుచ్చినప్పుడు, నాగమ్మను అంచనా వేసేందుకు బ్రహ్మన్నను చిన్నబుచ్చాల్సి వచ్చిందేమో. అలా చిన్నబుచ్చకుండా కూడా రాయవచ్చు కానీ, ఇందాక అన్నట్లు, నాకు తోచిన కారణం ఇది.
రాజేంద్ర కుమార్ దేవరపల్లి
బ్రహ్మనాయనిం వారు,నాయకురాలు నాగమ్మల మధ్య వైరుధ్యాలను శైవ-వైష్ణవ,కాపు-వెలమ కులాల మధ్య ఘర్షణలుగా చిత్రిస్తూ వచ్చిన ఒక పరిశోధనా వ్యాసం నేను గతంలో చదివాను.వీలు చూసుకుని ఆ వివరాలు ఇస్తాను.నాయకురాలు వ్యక్తిత్వాన్ని అంచనా వేసేందుకు బ్రహ్మనాయనింవారిని చిన్న బుచ్చాల్సిన అవసరముందా అన్నది నా ప్రశ్న.