ఆనాటి గుంటూరు జిల్లా – ప్రొఫెసర్ రాబర్ట్ ఎరిక్ ఫ్రికెన్‌బర్గ్ పుస్తకానికి ఇన్నయ్యగారి అనువాదం
నేను మెడికల్ కాలేజీలో చదువుకునే రోజుల్లో, ఆంధ్రజ్యోతి దినపత్రికలో “మార్క్స్‌కు కమ్యూనిస్టులు పట్టించిన గ్రహణం” అనే శీర్షికతో కొన్ని వ్యాసాలు వచ్చాయి. వ్యాసకర్త శ్రీ. ఎన్. ఇన్నయ్య పేరు అప్పుడే నాకు పరిచయమయ్యింది. ఆ తర్వాత, 80లలో ఆయన రాసిన ఆంధ్రప్రదేశ్‌లో కుల రాజకీయాలు (1985), వి.ఆర్.నార్ల – జీవితం, అనుభవాలు (1987) కూడాచదివాను. నేను డేటన్ (ఒహాయో) వెళ్ళిన కొత్తలో ఇన్నయ్యగారి అబ్బాయి రాజు నరిశెట్టి డేటన్ డెయిలీ న్యూస్ పత్రికకు బిజినెస్ రిపోర్టర్‌గా ఉండేవాడు (కాలక్రమేణా రాజు వాల్‌స్ట్రీట్ జర్నల్‌లో పెద్ద పదవులు నిర్వహించి, ఇండియాలో మింట్ పత్రికకు సంస్థాపక సంపాదకుడిగా ఉండి, రెండేళ్ళ క్రితం – మనం తెలుగువారిగా గర్వపడేట్టుగా – వాషింగ్టన్ పోస్ట్‌కు మానేజింగ్ ఎడిటర్ అయ్యాడు). మా ఇద్దరికీ స్నేహితులైన మిత్రుల వల్ల ముందు రాజుతో, ఆ తర్వాత ఇన్నయ్యగారితో పరిచయం అయ్యింది. అప్పటినుంచీ మా పరిచయం కొనసాగుతూ వచ్చింది.
ఆంధ్రజ్యోతి సంపాదకవర్గంలో పనిచేసి రిటైర్ అయిన శ్రీ ఇన్నయ్య తమ విశ్రాంతజీవనం మేరీలాండ్‌లో గడుపుతున్నారు. నిజానికి ఇది విశ్రాంత జీవనం కాదు. హ్యూమనిజం, రేషనలిజం సిద్ధాంతాలని నమ్మి ఆచరిస్తున్న ఇన్నయ్యగారు ఆ సిద్ధాంతాల వ్యాప్తికి నిర్విరామమైన కృషి చేస్తూనే ఉన్నారు. అలాగే పాత్రికేయునిగా తన అనుభవాలని, తెలుగు నాటి రాజకీయ చరిత్రను పుస్తకాల రూపంలో రాస్తున్నారు. అంతర్జాలంలోనూ చాలా కాలంగా క్రియాశీలకంగా పనిచేస్తూ చాలా వెబ్‌సైట్లు నిర్వహిస్తున్నారు. ఇన్నయ్య గారి శ్రీమతి కోమల తస్లిమా నజ్రీన్ పుస్తకాలను తెలుగులోకి అనువదించారు.
శ్రీ ఇన్నయ్య గుంటూరు జిల్లా చేబ్రోలులో జన్మించారు. హైదరాబాద్‌లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏసియన్ స్టడీస్‌లో పనిచేస్తున్నప్పుడు, రాబర్ట్ ఎరిక్ ఫ్రికెన్‌బర్గ్ (Robert Eric Frykenberg) రాసిన Guntur District (1788-1848): A History of Local Influence on Central Authority in South India (Oxford: Clarendon Press 1965) చదివారు. 1975లో తొలి ప్రపంచ తెలుగు మహాసభల్లో ఇన్నయ్యగారు ఫ్రికెన్‌బర్గ్‌ను కలుసుకున్నారు. ఊటీలో పుట్టిన ఫ్రికెన్‌బర్గ్ చాలా చిన్నతనంలో స్వీడిష్ మిషనరీ అయిన తండ్రితో గుంటూరు వచ్చాడు. పన్నెండేళ్ల వరకు తండ్రితో గుంటూరు, నల్గొండ జిల్లాల గ్రామాల్లో సంచరించాడు. తెలుగు బాగా మాట్లాడగలిగేవాడు. కాలక్రమేణా ఇంగ్లండ్‌లో పిహెచ్‌డీ చేసి, విస్కాన్సిన్ (మాడిసన్) విశ్వవిద్యాలయంలో చేరి, ప్రస్తుతం చరిత్ర, దక్షిణ ఆసియా విభాగాల్లో ఎమెరిటస్ ప్రొఫెసర్‌గా ఉంటున్నారు. ఆయన అనుమతితో శ్రీ ఇన్నయ్య ఈ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించారు.
గోల్కొండ నవాబుల కాలంలో (1687?) కొండవీటి సీమకు ముర్తుజానగర్ సర్కార్ అన్న పేరు పెట్టి, 14 భాగాలుగా విభజించారు. అప్పటినుంచి పేరుకు గోల్కొండ (ఆ తర్వాత నిజాం) నవాబుల పాలనలో ఈ ప్రాంతం ఉన్నా, పెత్తనం మాత్రం మరాఠీ, దేశస్థ బ్రాహ్మణుల చేతిలో ఉండేది. గుంటూరు, చేబ్రోలు, నరసరావుపేట (మల్‌రాజు నరసరావు నిర్మించిన కోట వల్ల ఆ పేరు వచ్చింది), కొల్లూరు, ఇతర ప్రాంతాలకు జమీందార్లు ఉండేవారు. వీరిలో వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు (చేబ్రోలు / అమరావతి జమీందారు) చాలా స్వతంత్రంగా వ్యవహరించేవాడు.
భారతదేశంపై ఆధిపత్యానికి బ్రిటిష్‌వారికి, ఫ్రెంచ్ వారికి జరిగిన ప్రత్యక్ష, పరోక్ష యుద్ధాలు, రాజకీయ ఎత్తుగడలలో నెమ్మదిగా బ్రిటిష్‌వారిది పై చేయి అయ్యింది. 1779లో బసాలత్‌జంగ్ నుండి గుంటూరును మద్రాస్ గవర్నర్ థామస్ రంబోల్డ్ అద్దెకు తీసుకున్నాడు. 1782 నుండి పెత్తనం మారుతూ వచ్చి 1788కల్లా (కారన్‌వాలిస్ కాలం) గుంటూరుపై సర్వాధికారాలు బ్రిటిష్‌వారికి వచ్చాయి.
హక్కులైతే వచ్చాయి కాని, అవి చెలాయించుకోవటానికి బ్రిటిష్‌వారికి కష్టమే అయ్యింది. స్థానికంగా ఉన్న జమీందారులతోనూ, గ్రామాల్లో పెత్తనం చెలాయిస్తున్న గ్రామాధికారులతోనూ తమకు కావాల్సినట్టుగా పని చేయించుకోవడం కష్టమయ్యింది. రాబడి (రెవెన్యూ) బాగా తక్కువయ్యింది. ప్రజలకు, రైతులకు సౌకర్యాలు కల్పించటంలో ప్రభుత్వం విఫలమయ్యింది. జిల్లాలో కొన్నిచోట్ల జమీందారీ పద్ధతి, కొన్నిచోట్ల రైత్వారీ పద్ధతిని అమలు చేశారు. గ్రామ కరణాలు, జమీందారులు, బ్రిటిష్ కచేరీలలో పని చేస్తున్న స్థానిక అధికారులు రైతుల, గ్రామాల విషయం పట్టించుకోకుండా, వసూలు చేసిన పన్నులు బ్రిటిష్ ప్రభుత్వానికి పూర్తిగా ఇవ్వకుండా అనుభవించసాగారు. 1792లోనూ, 1832లోనూ వచ్చిన కరువులవల్ల విపరీతమైన జననష్టం జరిగింది. గుంటూరులో పని చేయటానికి బ్రిటిష్‌వారు ఇష్టపడేవారు కాదట. దీన్ని ఒక శిక్షప్రాంతంగా భావించేవారట. దానికి పరిహారంగా గుంటూరు కలెక్టరుకు సాలీనా 2 వేల రూపాయలు ప్రత్యేకంగా ఇచ్చేవారట.
1837లో జిల్లా కలెక్టర్‌గా వచ్చిన గోల్డింగ్‌హం స్థానిక అధికారులు – నక్కలపల్లి సుబ్బారావు, న్యాపతి శేషగిరిరావు – చేస్తున్న అక్రమాలను గమనించి , వారిని తొలగించటానికి పలుసార్లు ప్రయత్నించాడు. అలా చేసిన ప్రతిసారి, వారు మదాసులో ఉన్న రెవెన్యూ బోర్డుకి అప్పీలు చేసుకొని తమ ఉద్యోగాల్ని నిలబెట్టుకున్నారు. జిల్లాలో ఉన్న వివిధ అధికార స్థానాల్లో తమ బంధువుల్ని, కులస్థుల్నీ కూర్చోపెట్టారు. భూమి, రెవెన్యూ రికార్డులను మాయం చేశారు. పరిపాలన, రెవెన్యూ సంస్కరణల గురించి గోల్డింగ్‌హం చేసిన సిఫారసులను బోర్డు బొత్తిగా పట్టించుకోలేదు. గోల్డింగ్‌హం తర్వాత వచ్చిన స్టోక్స్‌ను శేషగిరిరావు, అతని అనుయాయులు మరీ ఆట పట్టించారు. దీనితో జిల్లా ఆదాయం బాగా పడిపోయింది. బకాయిలు బాగా పెరిగిపోయాయి.
క్షేత్ర స్థాయిలో ఉన్న దేశీయ అధికారులు ప్రజాధనాన్ని దోచుకుంటూ ప్రజల్ని పీడిస్తున్నారు. స్థానికంగా ఉన్న కలెక్టర్ అధికారాలను మద్రాసులో ఉన్న బోర్డు తీవ్రంగా నియంత్రిస్తూ, వారి సిఫారసులను పట్టించుకోవటం లేదు. మద్రాసులో రెవెన్యూ బోర్డుకు, లండన్‌లో ఉన్నా కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్‌కు క్షేత్రంలో జరుగుతున్న విషయాల మీద సరైన పరిజ్ఞానం ఉండేది కాదు. గవర్నర్ అసమర్థుడు. రెవెన్యూ బోర్డు మెంబర్ల మధ్య అధికారపు పెనుగులాట. వీటన్నిటివల్ల పరిపాలనావ్యవస్థ అస్తవ్యస్తంగా తయారయ్యింది.
మద్రాసు గవర్నర్ ఈ పరిస్థితిని చక్కదిద్దటానికి వాల్టర్ ఎలియట్‌ను (అతని ఇష్టానికి వ్యతిరేకంగా) ప్రత్యేక కమిషనర్‌గా నియమించాడు. అప్పజెప్పిన పనిని సరిగా చేయడానికి, విపరీత పరిస్థితుల్ని లెక్కచేయకుండా, ఎలియట్ జిల్లా మొత్తం విస్తృతంగా పర్యటించి, నిశితంగా పరిశీలించి స్థానిక కట్టుబాట్లను, పన్నుల ఎగవేత రహస్యాలను, రికార్డుల్లో లోపాలను క్షుణ్ణంగా ఆకళింపు చేసుకున్నాడు. ఎలియట్ అంచనా ప్రకారం అప్పటికి జమీందార్లు, అధికార్లు కాజేసిన, దాచిన సొమ్ము రు. 74,14,378లు 14 అణాలు 5 దమ్మిడీలు. 1846 ఏప్రిల్ 17న సమర్పించిన 400 పేజీల రిపోర్టులో జిల్లా చరిత్రను, అప్పటి పరిస్థితిని సమీక్షించి ఎనిమిది సంస్కరణలను సూచించాడు.
అప్పటికి రెవెన్యూ బోర్డు సభ్యులు, గవర్నరు మారిపోయారు. ఈ నివేదికను చూసి కలవరపడిన మద్రాసు ప్రభుత్వం ఆ సంస్కరణలు చేపట్టింది. జమీందారీ వ్యవస్థను రద్దు చేసింది; గ్రామాల్లో కరణాల పలుకుబడిని తగ్గించడానికి మునసబు వ్యవస్థను ప్రవేశపెట్టింది. భూముల కొలతలను, రికార్డుల నిర్వహణను, పన్నుల సేకరణనూ క్రమబద్ధీకరించింది. ఉద్యోగాలలో ఒకే కులం ఆధిపత్యం లేకుండా నిబంధనలు అమలుచేసింది. జిల్లాను 14 తాలూకాలుగా పునర్వ్యవస్థీకరించారు. తాలూకా కచేరీనుంచి ఏ గ్రామానికైనా రెండు మూడు గంటల్లో చేరుకోవచ్చు. కలెక్టర్లకు అధికారాలు పెరిగి, స్థానిక పరిపాలనలో స్వతంత్రం పెరిగింది. అప్పటివరకూ పాలనావ్యవస్థలో ఉన్న స్థబ్ధత తగ్గిపోయింది.
1850-70 మధ్య ఈ సంస్కరణలు పూర్తిగా అమలు చేయబడ్డాయి. ఇదే సమయంలో కృష్ణానదిపై ఆనకట్ట నిర్మాణం పూర్తి కావడంతో వ్యవసాయం అభివృద్ధి అయ్యింది. కరువు పరిస్థితులు పోయాయి. ఇంగ్లీషు పాఠశాలలు వచ్చాయి. కులంతో సంబంధం లేకుండా ఉద్యోగాలకు ప్రవేశ పరీక్షలు పెట్టారు. ఇండియన్ సివిల్ సర్వీసులోకి భారతీయుల్ని అనుమతించటం మొదలు బెట్టటంతో దేశస్తులు పై స్థానాలు పొందటం మొదలుబెట్టారు.
ఈ పుస్తకం వల్ల చరిత్రలో ఒక కీలక ఘట్టం గురించిన ఆసక్తికరమైన అనేక విషయాలు తెలుస్తాయి. పేరుకు ఇది గుంటూరు జిల్లాకు సంబంధించిన పుస్తకమే అయినా దీనిలో విషయాలు మద్రాసు ప్రెసిడెన్సీలో అనేక ప్రాంతాలకు అన్వయిస్తాయి.
పాతరోజులు బంగారు రోజులు, అప్పటి మనుషుల్లో నీతి నిజాయితీలు ఎక్కువ అనుకొనేవారికి ఈ పుస్తకంలో విషయాలు (ఉద్యోగుల్లో అవినీతి, మాయోపాయాలు, కర్కశత్వం) చాలా ఆశ్చర్యంగా ఉండవచ్చు. బ్రిటిష్ అధికారులకు పేదరైతుల పట్ల సానుభూతి ఉండగా, దేశీయ అధికారులు మాత్రం వారిని పట్టించుకునేవారు కారు అన్న ఫ్రికెన్‌బర్గ్ పరిశీలన ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సబ్ఆల్టర్న్ చరిత్రను కొత్త దృక్కోణంతో విశ్లేషిస్తున్న ఆధునిక చరిత్రకారులేమంటారో మరి.
ఎలియట్ నివేదిక తర్వాత శేషగిరిరావును ఉద్యోగంలోంచి (మళ్ళీ) తీసేశారు. ఐనా అతను చాలాకాలం తన ఉద్యోగంకోసం పోరాడాడు. ఈసారి మాత్రం అతనికి ఓటమే ఎదురైంది. శేషగిరిరావులో ఎన్ని దోషాలు ఉన్నా, ఆరోజుల్లో ఒక దేశీయ ఉద్యోగి, పదేళ్ళ పాటు తన పై బ్రిటిష్ అధికారిని ధిక్కరించి పోరాడుతూ తన ఉద్యోగాన్ని నిలబెట్టుకోగలగడం నాకు చాలా అబ్బురంగా అనిపించింది.
ఫ్రికెన్‌బర్గ్ ఈ చరిత్రను శాస్త్రీయ పద్ధతిలో శ్రద్ధగా పరిశీలించి, ప్రతి విషయానికి ఆధారాల జాబితా ఇస్తూ, సాధికారికంగా పుస్తకం రాశారు. ఎప్పుడో మరుగునపడిన ఈ పుస్తకాన్ని ఇన్నయ్యగారు ఇప్పుడు ఈ అనువాదం రూపంలో ప్రాచుర్యం కలిగించడం ముదావహం. పుస్తకం చివర ఇచ్చిన ఆధారపత్రాల సూచిక ఈ విషయాలపై ఆసక్తి ఉన్నవారికి కొత్త దారులని చూపిస్తుంది.
పుస్తకాన్ని మామూలుకన్నా పెద్ద ఫాంట్లతో చదువుకోవడానికి అనుకూలంగా ప్రచురించారు. గట్టి బైండుతో పుస్తకం అందంగా ఉంది. లెక్కకు మించిన అచ్చుతప్పులు, అక్కడక్కడా అన్వయం కుదరని వాక్యాలు, ఇంతకుముందు పరిచయం లేని టెక్నికల్ పదాల వల్ల చదవడానికి కష్టపడవలసి వచ్చింది. పుస్తకం చివర ఒక పట్టికలో పరిపాలన, రెవెన్యూ వ్యవస్థలకు చెందిన కొన్ని పదాలకు వివరణ ఇస్తే ఇంకా ఉపయుక్తంగా ఉండేది.
18వ శతాబ్ది చరిత్రపై లేక స్థానిక చరిత్రపై అభిరుచి ఉన్న వారు తప్పకుండా చదవవలసిన పుస్తకం.
—
ఆనాటి గుంటూరు జిల్లా (1788-1848) : దక్షిణాదిలో స్థానిక, కేంద్ర పెత్తన చరిత్ర
రాబర్ట్ ఎరిక్ ఫ్రికెన్‌బర్గ్
అను: నరిశెట్టి ఇన్నయ్య2011
ప్రచురణ: వెనిగళ్ళ కోమల
2 Hawlings Ct
Brookville, MD, 20833, USAఅక్షర, నవోదయ పుస్తకాల షాపుల్లో దొరుకుతుంది.
303 పేజీలు; 500 రూ. 20 డా.
ఈ పుస్తకం ఇ-బుక్‌గా కూడా దొరుకుతుంది.
***********************************
చికాగో మెడికల్ స్కూల్‌లో సైకియాట్రీ ప్రొఫెసర్ డా. జంపాల చౌదరికి తెలుగు, సాహిత్యం, కళలు, సినిమాలు అంటే అభిమానం. తానా పత్రిక, తెలుగు నాడి పత్రికలకు, మూడు తానా సమావేశపు సావెనీర్లకు, రెండు దశాబ్దాలు కథాసంపుటానికి సంపాదకత్వం వహించారు. తానా, ఫౌండేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫారంస్ ఇన్ ఇండియా (ఎఫ్.డి.ఆర్.ఐ.), మరికొన్ని సంస్థలలోనూ, కొన్ని తెలుగు ఇంటర్నెట్ వేదికలలోనూ ఉత్సాహంగా పాల్గొంటుంటారు; చాలాకాలంగా తానా ప్రచురణల కమిటీ అధ్యక్షులు. పుస్తకం.నెట్‌లో జంపాల గారి ఇతర రచనలు ఇక్కడ చదవవచ్చు.
***********************************
cbrao
ఆనాటి గుంటూరు జిల్లా – ప్రొఫెసర్ రాబర్ట్ ఎరిక్ ఫ్రికెన్‌బర్గ్ పుస్తకావిష్కరణ షికాగో పట్టణం లో జరిగినప్పటి చిత్రమాల ఇక్కడ చూడవచ్చు.
https://picasaweb.google.com/telugu1/GunturBookRelease?authkey=Gv1sRgCL-jo57ppcj2KA&feat=email
జంపాల చౌదరి
మొన్న (జులై 16, శనివారం) ఈ పుస్తకం ఆవిష్కరణ చికాగోలో జరిగింది. శ్రీయుతులు ఇన్నయ్య, ఫ్రీకెన్‌బర్గ్ , ఇతరులు ప్రసంగించారు. కారణాంతరాల వల్ల నేను సమావేశం వేళకు వెళ్ళలేకపోయాను. సమావేశం వివరాలకు: http://innaiahn.blogspot.com/2011/07/blog-post_18.html
ramaraja yalavarthi
oka manchi pustakaaniki chakkani vyaakhaanam ichina jampala chowdary gaariki dhanyavaadaalu.