Too soon to say Goodbye – Art Buchwald

నేను స్కూల్లో చదువుకునేటప్పుడు హిందూ పత్రిక చివరి పేజీలో ఆర్ట్ బుక్వాల్డ్ అనే ఒకాయన నవ్వుతూ రోజూ దర్శనమిచ్చేవాడు. అలా చాలా ఏళ్ళు ఆయన రాసింది ఎప్పుడూ చదవకపోయినా, రోజూ చూస్తూ ఉండేదాన్ని. కాలేజీలూ, ఉద్యోగాలు అంటూ మొదలయ్యాక కూడా ఈ అలవాటు కొనసాగింది. అంతలో ఒకరోజు ఆయన మరణవార్త చదివి – అయితే, ఆ నవ్వుల తాత మళ్ళీ కనబడ్డు అనమాట అనుకున్నాను. దాదాపు ఐదేళ్ళౌతూ ఉండగా, ఇటీవలే బుక్వాల్డ్ ఆఖరు రోజుల్లో రాసిన “Too soon to say Goodbye” అన్న పుస్తకం అనుకోకుండా దొరికి, చదవడం మొదలుపెట్టాను.

ఈ పుస్తకానికి మా అమ్మ పెట్టిన పేరు “హ్యాపీ మ్యాన్ పుస్తకం”. సరిగ్గా సరిపోయింది ఈ పేరు దానికి! ఈ పుస్తకం బుక్వాల్డ్ రాసుకున్న స్వగతం. ఇలాంటి స్వగతాలు అనేకం రాసి ఉంటారాయన. అయితే, దీని ప్రత్యేకత ఏమిటంటే, ఆయన చివరి రోజుల్లో హోస్పిస్ లో గడుపుతున్నప్పుడు రాసిన పుస్తకం ఇది. హోస్పిస్ మరణం తప్పిస్తే వేరే గత్యంతరం లేని వారు ఉండే చోటు. అలాంటి చోట ఉంటూ కూడా, బుక్వాల్డ్ తన స్వభావ సిద్ధమైన హాస్యాన్నీ, వ్యంగ్యాన్నీ వదలక కడ దాకా అందర్నీ నవ్విస్తూనే బ్రతికారన్నమాట!!

నిజానికి, ఈ పుస్తకం చదవక ముందు ఈయన గురించి నాకేమీ తెలియదు. ప్రఖ్యాత అమెరికన్ కాలమిస్టు, హ్యూమరిస్టు అని తప్ప. అయితే, ఇదే వ్యక్తి ఒకప్పుడు డిప్రెషన్ పేషంటని తెలిసాక మాత్రం చాలా ఆశ్చర్యం కలిగింది. డిప్రెషన్ కి లోనై బయటపడ్డ వారిలో ఇంత జీవనోత్సాహం ఉంటుంది అన్న విషయం నాకు అప్పుడే తెలిసింది. ఆ విషయంలో మాత్రం ఆయన వద్ద నేర్చుకోవలసినది ఎంతో ఉంది. ప్రతి ఫెయిల్యూర్ కీ డిప్రెషన్ కారణం అని చెప్పేస్తూ బ్రతికేసేవాళ్ళని చూశాను కానీ, ఇంత ఉత్సాహంతో, నవ్వుతూ, నవ్విస్తూ బ్రతికిన ఈ మనిషి క్రానిక్ డిప్రెషన్ పేషంటనీ, ఇతని తల్లి దాదాపు ముప్పై ఏళ్ళ పై చిలుకు మానసిక ఆసుపత్రిలోనే గడిపిందనీ తెలిశాక, కొంతమందికి రోగం ఉందని చెప్పడం ఒక రోగం…కొంతమంది జోలికి వెళ్తే రోగానికే రోగమొస్తుందని అర్థమైంది.

“ట్యూజ్డేస్ విత్ మోరీ” పుస్తకం లో బ్రతికుండగానే “మెమోరియల్ సర్వీసులు” ఏర్పరుచుకోవడం గురించి ఒక ఘట్టం ఉంటుంది. బుక్వాల్డ్ అటువంటిదే ఒకటి చేసాడు. తన మెమోరియల్ సర్వీసులో ఎవరెవరు మాట్లాడాలో, ఎవరు పాటలు పాడాలో – ఇటువంటివన్నీ తనే స్వయంగా పర్యవేక్షించాడు. వాళ్ళ ప్రసంగ పాఠాలూ, పాటలూ కూడా ఈ పుస్తకం చివర్లో పొందు పరిచారు. ఆయన స్నేహితులూ మొదట ఈ వింత పోకడకి ఆశ్చర్యపడ్డా, తరువాత సహకరించారు. “అమ్మాయ్, నా మెమోరియల్ సర్వీసుకు నువ్వు మాట్లాడే ముక్కలు నాకు రేపట్లోగా పంపేయ్! పబ్లిషర్లకి ఇచ్చేస్తా. పుస్తకం ప్రచురణ సమయం దగ్గరికొస్తోంది” – ఇలా ఉండింది ఆయన వాలకం!

పుస్తకం అమెరికా దేశాల్లో ఉన్న వారికి బాగా నచ్చుతుంది. నాకు కొన్ని చోట్ల కల్చరల్ కాంటెక్స్ట్ అర్థం కాక, వ్యంగ్యం అర్థం కాలేదు. అయితే, ఏ దేశపు కాలమిస్టులతో అన్నా, ఏ దేశపు హ్యూమరిస్టులతో అన్నా ఈ విధమైన ఇబ్బంది తప్పదేమో. వాళ్ళు వారి సమకాలీన సాంఘిక పరిస్థితులకి స్పందించి రాస్తారు కనుక! కనుక, పుస్తకం చదువుతారా లేదా, చదవాలా వద్దా అన్న నిర్ణయం మీకే వదిలేస్తున్నాను.

పుస్తకం స్ట్రాండ్ వారి షాపులో కొంటే రెండొందలు. బయట కొంటే కొంచెం ఎక్కువ వెల.

పుస్తకం వివరాలు:
Too soon to say Goodbye
Art Buchwald
Publishers: Random House

ఫ్లిప్కార్ట్ కొనుగోలు లంకె ఇక్కడ.

You Might Also Like

Leave a Reply