‘నెంబర్‌ వన్‌ పుడింగు’ కాదు! ‘నెంబర్‌ వన్‌ బెగ్గింగ్‌’!!

రాసిన వారు: జె.యు.బి.వి. ప్రసాద్

(ఈ వ్యాసం మొదట ఆంధ్రజ్యోతి “వివిధ” లో, జూన్ ఆరోతేదీన వచ్చింది. ఆపై వ్యాసరచయిత పుస్తకం.నెట్ కు పంపారు. ఈ పుస్తకం పై ఇదివరలో పుస్తకం.నెట్ లో వచ్చిన జంపాల చౌదరి గారి వ్యాసాన్ని ఇక్కడ చూడవచ్చు. – పుస్తకం.నెట్)

************************

ఈ మధ్యనే, నామిని కొత్తగా రాసిన పుస్తకం ఒకటి వచ్చింది. ఈ పుస్తకం లోంచి, దాదాపు ఒక అధ్యాయాన్ని ‘వివిధ’లో ప్రచురించారు. అది చదివాక, ఆ పుస్తకం సంపాదించాను. ఈ పుస్తకంలో చెప్పలేనన్ని వింతలు వున్నా, నేను కొన్నివింతల గురించి మాత్రమే పట్టించు కున్నాను. ఈ పుస్తకంలో, ఎంతో ‘అడుక్కుతినే తనం’, అదీ నిరు పేదలు ‘అడుక్కునేటట్టు’ గాక, ‘వేలూ, లక్షలూ’ ఉంచుకుంటూ, ‘స్థలాల’ కొనుగోళ్ళూ/అమ్మకాలూ చేస్తూ, ‘ఎసుట్లోకి బియ్యమెలాగా’ అనే మాయ మాటలతో, నిర్భయంగా, నిర్మొహమాటంగా, ‘హక్కు’గా అడుక్కునేటట్టు, వుంది. ఈ సంగతులన్నీ పక్కన పెట్టి, మొదట్లో చెప్పిన కొన్ని వింతలు చూద్దాం.

ఒకటి: ఈ రచయిత తన ఉద్యోగం పోగానే, రచయిత్రి సోమరాజు సుశీల గురించి, “4, 5 లక్షలు తనకెంతనీ, ఎక్కడన్నా ఐద్రాబాదులో దూరంగా ఒక సింగిల్‌ బెడ్రూం ప్లాట్‌ కొని”స్తుందని చాలా ఆశ పడ్డాడు. అంటే, ఉద్యోగం వుండటం కన్నా, పోవటమే లాభం అన్న మాట ఈ రచయితకి. అలా అపార్టుమెంటు కొనివ్వక పోతే, అది చెప్పుకోదగ్గ నేరమట. సుశీల కధలు రాస్తే, వాటికి పేర్లు పెట్టడమూ, కొండొకచో అవి పుస్తకంగా వచ్చినప్పుడు ఫ్రూఫ్‌ దిద్దడమూ చెయ్యడం వల్ల, అలా ‘అడుక్కునే’ హక్కు వచ్చేసింది. ఏం వింత!

రెండు: ఈ రచయిత “నోరంతా తెరిచి కంప్యూటర్‌ తీసీమని అడిగితే”, సుశీల, “మా బ్యాంకు మేనేజరుతో మాట్లాడతాను. డ్వాక్రా మహిళల పధకం కింద లోను వచ్చేటట్టు ట్రై చేస్తాలెండి. మీరు నెల నెలా కట్టుకోవచ్చు” అని అన్నారు. దానికి, ఈ రచయితకి “గుండె పోటొచ్చి అట్లనే వొరిగి పొయ్యుంటే నా అంత అద్రురుష్టమంతుడు యింకొకడు వుండేవాడు గాదు” అని అనిపించిందట. “పిచ్చిపట్టి పోతాదేమానని బిత్తర పోయా”డట. ఆ విషయం తన భార్యకి చెబితే, ఆ భార్య “బిత్తరపోయింద”ట. ఆ భార్య ఎలాంటి భార్యో! ఆ భార్యే, “సుశీల మేడమ్‌ యింటికిపోతే ఏం నాయినా! ‘మేడమ్‌ మాకు 20, 30 వేలు పెట్టి ఒక కంప్యూటర్‌ కొనియ్యండి. డి.టి.పి. వర్కులు చేసుకుని మీ పేరు చెప్పుకోని బతికిపోతాం’ అనంటే ఆమె తలగిల్లి మొలేచేస్తిందా?” అని భర్తని ఎగదోసి పంపిన మనిషి. ఎవరికి పడితే వారికి బేంకులో అప్పు ఇవ్వరు. ష్యూరిటీ వుంటేనే ఇస్తారు. అలా, “ష్యూరిటీ వుండి అప్పు ఇప్పిస్తానూ” అని సుశీల గారు అంటే, ఈ రచయితకి గుండాగి పోయినంత పనయింది! “అప్పు తీసుకో” అంటే గుండాగి పోయిందా? పిచ్చెక్కి పోతుందా? ‘అడుక్కు తినడానికి’ హద్దా, పద్దా? సుశీల ఆ కంప్యూటరు అప్పనంగా కొనియ్యకుండా, ‘బేంకు లోను ఇప్పిస్తానూ మీ భార్య పేరటా, మీరే ఆ కంప్యూటరు కొనుక్కుని, హాయిగా ఆత్మ గౌరవంతో బతుకుతూ, మీ అప్పు మీరే తీర్చుకోండీ’ అన్నట్టుగా చెప్పారు. అది ఎంత పెద్ద తప్పో! కాదూ మరీ? ‘మహా రచయితలు’ అడిగినప్పుడు, ఐ.బి.ఎమ్‌ వాళ్ళ మెయిన్‌ ఫ్రేము కూడా అప్పనంగా కొనిచ్చేయాల. ఇదీ వింతే!

మూడు: “సోమరాజు సుశీల రాసిన ‘చిన్నపరిశ్రమలు – పెద్దకధలు’ సీరియల్‌ కింద లెక్కేసి దానికి 15 వేలు” రెమ్యూనరేషన్‌ ఇప్పించాడట, ఆంధ్రజ్యోతి వీక్లీకి అప్పట్లో ఇన్‌ఛార్జిగా వున్నఈ రచయిత. ఇంకో రచయిత నవలకి కూడా ఐదు వేలిప్పించాడట. ఎందుకు అలా చేశాడూ? “ఆల్రడీ కోటీస్పరులు కావడం వల్ల ఆ డబ్బు తిరిగి నాకే ఇచ్చేస్తారని” చాలా ఆశగా అనుకున్నాడట. రచయితలకి అందవలసిన ప్రతిఫలం ఎడిటరుకే అందాలా? స్వయంగా రచయిత అయ్యుండీ, ఇతర రచయితల రెమ్యూనరేషన్ల మీద కన్ను ఈ మనిషికి. అప్పుడు సుశీల ఏం చేశారూ? “అది వాళ్ళ అబ్బ సొత్తన్నట్టు గమ్మునుండి పొయ్‌నారు” అట! ఆ డబ్బుని వాళ్ళు తమ “అబ్బ సొమ్ము”లా తీసేసుకున్నారట. అది నామినికే అందితే, ఆ డబ్బు తన “అబ్బ సొమ్ము”లా తీసేసుకునేవాడా? ఇది తిండి తినే వాళ్ళు అనే మాటేనా? సుశీల ప్రతిఫలం ఈ ఎడిటరు గారి “అబ్బ సొత్తా”, ఆశించడానికి? ఇది ఇంకో వింత!

నాలుగు: మొగుడితో, “ఏదన్నా పని చేసుకుని బతకమని” చెప్పకుండా, “సుశీల దగ్గరకి పోయి డబ్బు అడుక్కురా” అని అడుక్కుతినే తనానికి ప్రోత్సహించే పెళ్ళాం వుండటం కూడా ఈ రచయితకి మంచి ఎస్సెట్‌ లాగే వుంది.

ఐదు: ఈ రచయితకి ఆ మధ్య పది లక్షలతో సన్మానం జరిగిందిగా! ఇంకా డబ్బూ, డబ్బూ అని బేంకు నెంబర్లు ఇచ్చాడేంటీ?

ఆరు: మేనకోడలిని పెంచానంటాడు. ఈ మేనకోడలికి మూడెకరాల పొలం వుందని రాశాడు. బేంకులో బంగారం వుందని రాశాడు. ఇంకేం నొప్పీ? ఈ డబ్బు పిచ్చికి అంతం ఎక్కడన్నా వుంటుందేమోనని వెతికాను గానీ, ఎక్కడా దొరకలా!

ఇవన్నీ ఝూటా తనాలూ కావు, గడుసు తనాలూ కావు. అంత కన్నా వేరే రకంవి. గొప్ప వింతలు!! ఇంకా వింతలు కావాలంటే, ఎన్నైనా దొరుకుతాయి అక్కడ!

నామిని గారి “అమ్మ చెప్పిన కథలు” పుస్తకం పై “బడి పిల్లల అయోమయం” పేరిట ఈ రచయిత రాసిన వ్యాసం ఇక్కడ చదవొచ్చు.

నామిని ఇతర రచనలపై పుస్తకం.నెట్ లో వచ్చిన వ్యాసాలు ఇక్కడ చదవొచ్చు.

You Might Also Like

13 Comments

  1. varaprasad

    tappanukunte vadileyandi,sandhikalam samasyalaku moolam,,enduku chestunnado naminike telusu,edo oka roju cheptadane naa nammakam,appatidaka agandi,

  2. sreelalitha

    Raka rakaalugaa secured life lalo batukutunna vaariki,paisaa paisaa venakeyadamlo siddha hasthulayina vaarikee- veedhi kukkalanu,chuttoo vunnavaari avasaraalanu tana bhujaskandaala meeda teesukuni talladilli poye naamini ardham kaavadam kashtamemo.

  3. sambasiva, hubli

    నామిని తనలోని అవలక్షణాలను మహా గొప్ప లక్షణాలుగా చిత్రికరించుకోవడం అనేదాన్ని, శ్రీశ్రీ నుండి ప్రేరణ గా
    తీసుకున్నట్లు గా అనిపిస్తోంది. అనంతం చదివినవారు దీన్ని సులభంగా గ్రహించుకోవచ్చు. పైగా దీన్ని చాల ఓపెన్ గా
    రాస్తున్నట్టు ఫోజ్ ఒకటి. ఇకపోతే, ఎవరు ఏ ఉద్దేశ్యాలతో విమర్శ చేస్తున్నారనేది ముఖ్యం కాదు. విమర్శ కి సరైన
    జవాబు ఇవ్వలేని వారే ఇలాంటి పక్కదోవ పట్టించే వ్యాఖ్యలు చేస్తుంటారు, మన రాజకీయనాయకుల్లాగా.
    ప్రసాద్ గారి పైన తార గారి వ్యాఖ్యలు ఇలాంటివే.

  4. తేజస్వి

    సూరంపూడి పవన్ సంతోష్ గారి వాదన సబబుగా ఉంది.. రచయిత వ్యక్తిత్వం ఎలా ఉన్నా, తన అవలక్షణాలను పుస్తకాలకెక్కించడం ఖచ్చితంగా తప్పే. అసలు, అవి అవలక్షణాలన్న స్పృహ కూడా ఆ రచయితకు లేకపోవడం ఎంత దారుణం.

    ఆ రచయితను విమర్శించడం తప్పన్నవాళ్ళదే తప్పు. ఎందుకంటే, పుస్తకాలను అందరూ మీలాంటి మేధావులు, ఏదిమంచి, ఏది చెడు తెలుసుకోగలవారు మాత్రమే చదవరుకదా….అలా రాయడం రచయిత తప్పని నిర్ధారించుకోవడానికి. అలా నిర్ధారించుకోలేనివారు ఆ రచనను చదివి, ఆ మార్గాన్ని అనుసరించే అవకాశంకూడా ఉంటుంది. కనుక ఇలాంటివాటిని విమర్శించడంలో తప్పేమీలేదు. వీలైతే, ఇంకా పెద్ద వేదికమీద విమర్శించాలి.

  5. కర్లపాలెం హనుమంత రావు

    నామినితో వ్యక్తిగత పరిచయం కొంత కాలం వున్న(నా బోటి) వారికీ ఈ వ్యాసం లోని విషయాలు నిజమేనని తెలుసు.

  6. తార

    పుస్తకం మీద విమర్శకన్నా, రంగనాయకమ్మగారిని ఎదో అన్నాడు, ఇతన్ని ఏకే ఏ అవకాశం వచ్చినా వదలకూడదు అన్నట్టు ఉన్నది.

    ఆయనది అడుక్కోవడం ఐతే ఇది ఇంకో వైకల్యం.

  7. Raghava

    You too live on others. You want others to be polite and gentle while writing on your blog.
    That’s the irony.
    If you can’t beat somebody pl. ignore them.

  8. సూరంపూడి పవన్ సంతోష్

    @రమణ:ఒక పాఠకుడిగా నాకు నామిని వ్యక్తిత్వం ఎలాంటిదైనా పర్వాలేదు. ఆయన పుస్తకాలే నాకు ముఖ్యం. కానీ ఆయన వ్యక్తిత్వంలోని లోపాలు, పుస్తకానికెక్కేస్తేనే సమస్య. బ్యాంకు అకౌంటు నెంబరు ఇచ్చెయ్యడం, సోమరాజు సుశీల గారిపై అర్ధంపర్ధం లేని విమర్శలు చేయడం లాంటివి ఆయన ఏకంగా పుస్తకాలకెక్కించేస్తే, దాన్ని విమర్శించడంలో తప్పేముంది. ఇలాంటి పనికిమాలిన పుస్తకాల గురించి చెప్పుకునేకొద్దీ అవి పాపులర్ ఐపోతాయ్ కనుక విడిచిపెట్టాలి.

  9. ప్రసాద్‌

    ఆ పుస్తకం అమ్ముడు పోతున్నంత వరకూ దాని మీద విమర్శలు వస్తూనే వుంటాయి. ఒక పుస్తకాన్ని మార్కెట్‌లో పెట్టినప్పుడు, మెప్పుకోళ్ళకే కాదు, విమర్శలకి కూడా సిద్ధ పడాలి. నచ్చిన పుస్తకాన్ని, పాతికేళ్ళయినా (అది దొంగ లెక్క అని, ఆ రచయితే చెప్పేసుకున్నప్పటికీ) నచ్చిన వాళ్ళు ఇంకా మోస్తూనే వున్నారు కదా? అలాగే ఇదీ!

    ప్రసాద్‌

  10. raani

    రమణ గారూ,
    ఆశ్చర్యం..,
    సరిగ్గా పావుగంట క్రితం హేమలత గారికి ఇదే విషయం గురించి మెయిల్ పంపాను. అంతలోనే మీరు ఇలా వ్యాఖ్యానించారు.

  11. రమణ

    నామినిని ఎంతకాలం తిడతారు ? ఎప్పుడో అమెరికా చౌదరిగారు ఈ పని మొదలెట్టారు . ఈ నామిని ధూషణా పర్వం చికాగ్గా ఉంది . ఇది సాహిత్య విమర్శ కాదు . మీకు ఇబ్బందనిపిస్తే అతనిని విస్మరించవచ్చుగదా .

  12. జయదేవ్

    సి.బి.రావు గారు ,నామిని మీకు మాత్రం మంచిగా కనిపిస్త్త్హే చాలదు కదా..నామిని అంత విలక్షణమైన మనిషి ప్రపంచంలో ఎవడూ ఉండడు…నే౦.వన్ బెగ్గిన్న్గు ..సందేహమే లేదు.నామినితో నా పరిచియం,సాహచర్యం కేవలం తొమ్మిది నెలలే అయినా..అతడిలోని అవలక్షణాలను తొందరగానే గుర్తించి పక్కకు తప్పుకోవడం జరిగింది…

  13. cbrao

    సమీక్షకుడి విమర్శ సహేతుకమే. నామిని బాంక్ పేరు, నంబరు ఇవ్వాల్సిన అవసరం ఉందా అనిపిస్తుంది. నామిని కి ఈ పుస్తకం తనకున్న మంచి పేరును బాగా నష్ట పరిచింది. తుమ్మపూడి -సంజీవదేవ్ ఆత్మకధ (http://deeptidhaara.blogspot.com/2011/04/blog-post_9343.html) పుస్తకానికి నామిని ప్రూఫులు దిద్ది, చెన్నై లో పుస్తక ముద్రణగావించి తనవంతు సహకారిన్నిచ్చారు. ఈ సమీక్షలో నామిని గతం లో చేసిన మంచి పనులనుదహరిస్తే బాగుండేది.

Leave a Reply