పుస్తకం
All about booksపుస్తకభాష

April 27, 2011

నామిని – నెంబర్ వన్ పుడింగి : పడుతూ లేస్తూ ఉన్న ఏనుగు కత

More articles by »
Written by: Jampala Chowdary
Tags:

పుడింగి అన్న పదం మొట్ట మొదట క్షణక్షణం సినిమాలో శ్రీదేవి నోట విన్నాను. ఆ పదానికి అర్థమేమిటో కచ్చితంగా ఇప్పటికీ తెలీదు కానీ, పోటుగాడు, పోటుగత్తె అని అర్థం అనుకొంటున్నాను. తొందరపాటు మనిషేమో అన్న అనుమానం కూడా ఉంది. నామిని అని అందరం పిలుచుకునే మిట్టూరోడు, నారప్ప కొడుకు సుబ్రమణ్యం నాయుడు ఈమధ్యే రాసిన ఆత్మకథకు పెట్టుకున్న పేరు నెంబర్ వన్ పుడింగి. అంతకు ముందు నాకు తెలీని మాటలు నామిని పుస్తకాల్లో నేర్చుకోవడం కొత్తేం కాదు. పుస్తకం పూర్తి చేసేటప్పటికి అర్థం తెలుస్తుందిలే అనుకొన్నాను.

కతలు రాయకూడదు, కతలు చెప్పాలి అన్నది తాను అనుసరించే సూత్రం అని నామిని ఈ పుస్తకంలో ఒకసారి చెప్పాడు. కతలు చెప్పటంలో నామిని మొగలాయీ అని మనకు బాగా తెలిసిన సంగతే. ఈ తన సొంత కతని కూడా ఎప్పట్లాగా మనం ఆపకుండా చదివేట్టు చెప్పాడు. నిలుకు  లేకుండా ఐదు రోజుల్లో ఈ కతంతా కాయితం మీద పెట్టాట్ట. మధ్య మధ్యలో ఈ కతంతా మనకు చెప్పాల్సిన అవసరం ఈయనకూ, చదవాల్సిన అవసరం మనకూ ఉందా అని అనిపించినా, ఒక గాసిప్ కాలం చదువుతున్నట్టూ, వలువలు విప్పేసిన ఒక జీవితం కళ్ళెదుట కనిపిస్తున్నట్టూ, పట్టాలు దాటేసి వేగంగా కొండ మీంచి కిందకు దూకుతున్న రైలును స్లోమోషన్లో చూస్తున్నట్టూ (watching a train wreck in slow motion) ఉండటంతో, నిలుకు  లేకుండా పుస్తకమంతా పూర్తి చేశాము నేనూ, అరుణా. దేవినేని మధుసూదనరావుగారి పుణ్యమా అని పుస్తకం మా ఇంట జేరిన మూడో రోజుకే ఇద్దరం చదవడం ఐపోయింది.

నామిని సుబ్రహ్మణ్యం నాయుడు నేను (అరుణ కూడా) అభిమానించే రచయితల్లో ఒకడు. అతను ఉదయంలో పచ్చనాకు సాక్షిగా రాసి గొప్ప పేరు సంపాదించుకొన్నప్పుడు ఆ విషయం అమెరికాలో ఉన్న మాకు తెలీదు. 1989 డిశంబర్లో విజయవాడ వచ్చినప్పుడు నవోదయా బుక్‌షాపులో సినబ్బ కతలు పుస్తకం బాపు గారి ముఖచిత్రంతో కనిపించింది. రచయిత పేరు నాకు పరిచితం కాకపోయినా నవోదయా ప్రచురణల నాణ్యతపై ఉన్న నమ్మకంతో ఆ పుస్తకం కొనుక్కొన్నాను.

ఆ పుస్తకం చదవడం మొదలుబెట్టాక అంకితం పేజీ దగ్గర్నుంచే షాకులు మొదలు. నాకు అసలు పరిచయం లేని మాండలికం, అప్పటిదాకా నేనెక్కడా చూడని పద్ధతులు (తండ్రిని కొడుకు నాకొడకా అని సంబోధించడం నాకు అప్పటికి ఊహక్కూడా అందని విషయం). ఆ తర్వాత పేజీల్లో భాష, వస్తువులు కూడా ఆశ్చర్యపరిచాయి. పల్లెటూళ్ళలో పెరిగిన నాకు బూతు మాటలు (పోనీ శారీరక, లైంగిక వ్యవహారాల గురించిన గ్రామ్యాలు) కొత్త కాదు; అమెరికాలో సంభాషణల్లో, ముఖ్యంగా నా పేషెంట్ల మాటల్లో, చాలా రకాల బూతులు వినటానికి అలవాటు పడిపోయినవాణ్ణే. ఐనా, తెలుగులో అందరికోసం ఉద్దేశించిన అచ్చుపుస్తకంలో అలాటి మాటలు చూడటం, అందులోనూ అలాటి మాటలు తల్లి గురించి, బంధుమిత్రుల గురించి ఉంటే సర్దుకోవటానికి నాకు కొంచెం సమయం పట్టింది.

ఐనా ఆ కతలు నవ్వించాయి, ఏడిపించాయి; గుండెని సూటిగా చాలాసార్లు తాకాయి. ఆ కతల్లో కనిపించిన నిజాయితీ, రచయిత తన చిన్నతనాన్నీ, తన పరిసరాల్నీ, తన బంధుమిత్రుల్నీ పరిచయం చేసిన తీరు నాకు చాలా నచ్చింది. ఇలా చెప్పటంవల్లే ఈ కతలు ఇంత బాగా చెప్పగలిగాడేమో అనిపించింది. ఆ తరువాత వాకబు చేస్తే పచ్చనాకు సాక్షిగా గురించి ఎంతో మంది చెప్పారు కానీ నాకు ఆ పుస్తకం దొరకటానికి చాలా కాలం పట్టింది. నవోదయా రామ్మోహనరావుగారే ఒక సెకండ్‌హేండ్ కాపీ పట్టుదలగా సంపాదించి పంపారు (పుస్తకం చూసేవరకు నేను పుస్తకం పేరు పచ్చ నాకు సాక్షిగా అనుకొనేవాణ్ణి; అంటే ఏమిటో అర్థమయ్యేది కాదు; పుస్తకం చూశాక అర్థమయ్యింది అది పచ్చనాకు అని; నామిని పెట్టిన పేరు పచ్చనాకు సత్తెంగా అని అట; ఏబీకే ప్రసాద్ సాక్ష్యంగా అని మార్చారట). అంతకంటే ముందే మిట్టూరోడి కతలు, మునికన్నడి సేద్యం, పాలపొదుగు చదివాను. అప్పటినుంచి ఇప్పటిదాకా నామిని ప్రచురించిన పుస్తకాలన్నీ కొని చదువుతున్నాము. రావణ జోస్యం గొడవలప్పుడు నామినిపై దౌర్జన్యాన్ని గొంతెత్తి ఖండించిన మొదటివాళ్ళం రచ్చబండ మిత్రులమే. అలాగే నామిని ధర్మాగ్రహంతో రాసిన చదువులా, చావులా పుస్తకాన్ని నేను చాలామందితో పంచుకొన్నాను ( రచ్చబండ గ్రూపులో మెయిల్ లంకె ఇక్కడ). రెండుసార్లు పనిగట్టుకుని ఆయన కుటుంబాన్ని తిరపతిలో కలుసుకున్నాము.

నామిని ఇప్పుడు కొత్తగా ఆత్మకథ వ్రాయటమేమిటి, ఇన్నాళ్ళూ అతను రాసింది ఆత్మకథ కాక మరేమిటి అని అనుమానం రావచ్చు. నామిని జీవితం గురించి మనకు ఇప్పటిదాకా తెలీనిదంతా తెలియజెప్పాలని ఇంతకు ముందు చెప్పని కథంతా హోల్‌మొత్తం ఏమీ విడిచిపెట్టకుండా మనకు ఇప్పుడు ఈ పుస్తకంలో చెప్పేస్తున్నాడన్న మాట. ఒక జీవితం కథంతా ఒక్క పుస్తకంలో వివరంగా చెప్పటం కష్టం అనుకోండి; అది వేరే విషయం.

ఈ పుస్తకంలో నామిని చిన్ననాటి ముచ్చట్లు తక్కువ. మిట్టూరు కబుర్లూ తక్కువే. ఈ పుస్తకం నామిని ఆంధ్రజ్యోతి వారపత్రికకు సంపాదకుడిగా నియమించబడ్డప్పట్నుంచి మొదలౌతుంది. తర్వాత ముందుకూ వెనక్కూ తిరుగుతూ ఒకట్రొండు నెలల క్రితం కబుర్లతో ముగుస్తుంది. ఈ పుస్తకంలో ఒక ప్రకరణం, నారప్ప కొడుకు సుబ్రమణ్యం రచయిత నామినిగా ఎట్టయ్యినాడో చెప్పిన కత, ఆంధ్రజ్యోతి దినపత్రిక వివిధ శీర్షికలో అచ్చయ్యింది.

నామిని జీవితం కొద్దిగా విచిత్రంగానే ఉంటుంది. వెనుకబడ్డ పల్లెటూర్లో ఆస్థి తక్కువగా ఉన్న వ్యవసాయ కుటుంబంలో పుట్టి పెరిగాడు. టెంత్ ఫస్ట్‌క్లాస్‌లో పాసై స్కాలర్షిప్ సంపాదించుకొన్నాడు. వ్యవసాయప్పనులకు ఇంట్లో వాళ్ళకు సాయపడుతూనే రోజూ బస్సులో తిరుపతికి వెడుతూ ఇంజనీరింగుకు సరిపడే మార్కులు తక్కువై చివరికి ఎమ్మెస్సీ మేథ్స్ చదివాడు. అప్పటివరకూ  సాహిత్యం ఏమీ చదవకపోయినా తనకు తెలిసిన జీవితాల గురించి రాయాలని తపన ఎక్కువై, మిగతావాళ్ళు ఎట్లా రాస్తారో తెలుసుకోవటానికి మిగతా వాళ్ళ పుస్తకాలు చదవటం మొదలుబెట్టాడు (అప్పుడు చదివిన లబ్ధ ప్రతిష్టుల రచనలేవీ నామినికి పెద్దగా నచ్చలేదు). పేపర్లో పని చేస్తే తన కతలు ప్రచురిస్తారేమోనని ఈనాడులో – ఇంట్లోవాళ్ళ ఇష్టాలకు వ్యతిరేకంగా – చేరాడు. అక్కడ పరిచయమైన రచయిత పతంజలి నామినికి అండగా నిలబడి తనతోపాటు ఉదయం పత్రికకి తీసుకెళ్ళి ఒక కాలంగా పచ్చనాకు సాక్షిగా రాయటానికి అవకాశం కల్పించాడు. దాంతో నామిని తెలుగులో ఆత్మకథాత్మక హ్రస్వ కథలు అనే కొత్త ఒరవడికి ఆద్యుడయ్యాడు. చాలామందికి అభిమాన రచయిత అయ్యాడు. నెమ్మదిగా ఆంధ్రజ్యోతి వారపత్రిక సంపాదకుడయ్యాడు.

పాత్రికేయుడుగా తిరప్తిలోనూ, ఐద్రాబాదులోనూ ఉద్యోగాలు చేసిన నామిని 2000 డిశంబరు 31న ఆంధ్రజ్యోతి మూసేసినప్పుడు, రిజైన్ చేసి లక్షా అరవై వేల గ్రాట్యుటీ తీసుకుని తిరప్తి ఎలబారిపోయినాడు. అక్కడికి పోయాక అమ్మ చెప్పిన కతలు అనే పుస్తకాన్ని పిలకాయల కోసం రాసి, కొన్నాళ్ళు స్కూళ్ళ చుట్టూ తిరిగి ఆ కతలు పిల్లలకి చెప్పి వారితో పుస్తకాలు కొనిపిస్తూ కష్టపడ్డాడు. ఆ తర్వాత కొన్నాళ్ళు ఏమీ చేయకుండా, కదీర్‌బాబు, ఆర్.ఎం. ఉమామహేశ్వరరావుల్లా ఉద్యోగమూ చేయకుండా, రెండు పూటలా తాగుతుండగా రకరకాల ఐడియాలు వచ్చేవి కానీ ఏదీ ఆచరించినట్లు లేదు. ఒక ఏడాది క్రితం కొందరు మిత్రులు, అభిమానులు కలిసి పచ్చనాకు సాక్షిగా వ్రాసి పాతిక సంవత్సరాలైందని తిరప్తిలో 2010 జనవరి 9న సభ పెట్టి సన్మానం చేసి పది లక్షల రూపాయల పర్సు బహుమతిగా ఇచ్చారు. నా బోటి రచయితను ఇట్టా పదిమంది పోగు చేసి ఇచ్చిన డబ్బు తీసుకొనే దౌర్భాగ్య స్థితికి తేవటం తెలుగుదేశంలో మంచి సాహిత్యానికి పట్టిన చీడకు నిదర్శనం అన్నట్లుగా నామిని అప్పుడు చెప్పిన మాటలు చాలా కలకలం రేపాయి. ఆ డబ్బులతో అప్పటికి ఉన్న అప్పులన్నీ తీరిపోగా, తర్వాత తాగటం మానేసి మిట్టూరోడి పుస్తకం ఐదువేల కాపీలు, పచ్చనాకు సాక్షిగా, సినబ్బ కతలు కలిపి వేసిన పుస్తకం ఇంకో ఐదువేల కాపీలు మళ్ళీ కాలేజీలు, స్కూళ్ళకూ తిరిగే అమ్మాడు. అమెరికా నుంచి కొంతమంది అభిమానులు ఒక లక్షా ఎనభై వేలు పంపిస్తే దానికి ఇంకో లక్షా ఇరవై వేలు కలిపి, తన సైటులో టీచర్లకూ తల్లితండ్రులకూ స్కూల్ పెట్టడం కోసం ఒక ’పెద్దల బడి’ కట్టించాడు (ఇంకా మొదలుబెట్టలేదు లెండి). నామిని కుమార్తె ప్రస్తుతం అమెరికాలో ఎం.ఎస్ (ఫార్మసీ) చేస్తుంది; కుమారుడు విశాఖపట్టణంలో ఇంజనీరింగ్ చదువుకుంటున్నాడు. నామిని, ప్రభావతి గార్లు ఇద్దరే ప్రస్తుతం ఖాళీ గూట్లో (empty nestలో) ఉంటున్నారు.

2001లో ఆంధ్రజ్యోతి మూసేసినప్పుడు నామిని సోమరాజు సుశీలగార్ని ఆర్థిక సాయం అడిగితే ఆవిడ, ’ఏనుగు పడిందండీ, ఏనుగే లేవాలండీ, ఒకరు లేపలేరు కదా’ అన్నారట. అప్పట్నుంచీ ఈ ఏనుగు చాలాసార్లు లేచింది, మళ్ళీ మళ్ళీ పడుతూ లేస్తూ ఉంది.

పై కబుర్లతోపాటు ఈ పుస్తకంలో రచయితగా, ఆంధ్రజ్యోతి వీక్లీ ఎడిటర్‌గా తన అనుభవాలు, తన పెళ్ళి కబుర్లు, కొంతమంది బంధుమిత్రులతో తను వ్యవహరించిన విధానాలు, భూములు కొనటానికి చేసిన ప్రయత్నాలూ, పుస్తకాల ప్రచురణల, అమ్మకాల కతలు కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి. ఈ కతలో ప్రకరణాల పేర్లు: మా దెయ్యాల బాట పక్కనేఐద్రాబాదు; ఆంధ్రజ్యోతిలో నా తోకాటలూ, జూటాతనాలూ; నక్కతోక తొక్కిన మా టాంసాయర్ బుక్స్; ఏనుగు పడింది, ఏనుగే పైకి లేచింది; రియల్ ఎస్టేట్లో కూడా శోబన్‌బాబు కంటే, చెడ్డతనంలో వర్మా కంటే నాలుగాకులు ఎక్కువే; నారప్ప కొడుకు సుబ్రమణ్యం గాకుండా నామిని ఎట్టయినాడంటే; పది లచ్చల కోసరం నేను తలొంచింది దీనికీ; పది కుయ్యో మొర్రోలు.

ఇందులో నామిని కొన్ని విపరీత సంఘటనలను, తాను పొందిన అవమానాల గురించి (ముఖ్యంగా ఒక ఇంటాయన వేసిన తప్పుడు అభియోగాన్ని గురించి) చెప్పినప్పుడు అయ్యో అనిపిస్తుంది. మరి కొన్ని విషయాలు చెప్పిన తీరుకు నవ్వొస్తుంది. మరి కొన్నిసార్లు ఈ మనిషి ఈ విషయాల గురించి ఇక మాట్లాడ్డం ఆపేస్తే బాగుంటుందనిపించింది. ఈ పుస్తకం చదువుతున్నప్పుడు చాలాసార్లు ఏమిటి ఈయన ఇలా రాస్తున్నాడు, ఎందుకు ఇలా రాస్తున్నాడు అని సందేహాలు. పుస్తకం పూర్తయ్యాక కూడా అవే ప్రశ్నలు. మనబోటి మనుషులు తమతో తామే చెప్పుకోవటానికి ఇబ్బంది పడే విషయాలను ఈయన ఎందుకిలా అందరితోనూ పంచుకొంటున్నాడు? ఈ పుస్తకం వల్ల ఏం ఒరుగుతుంది ఈయనకుగాని, మనకుగాని అని అనిపించింది.

ఈ పుస్తకంలో నామీద బలంగా ముద్ర వేసిన మంచి విషయాలు రెండు.

మొదటిది: ఒక తెలుగు రచయిత రచనలని అమితంగా అభిమానించిన కొందరు మనుషులు, వివిధ ఆర్థిక సామాజిక స్థితుల్లో ఉన్న వాళ్ళు, రచయితతో ప్రత్యక్ష పరిచయం లేనివాళ్ళు ఆ రచయితకు వీలైనంత సహాయం చేయడానికి ప్రయత్నించడం. ఈ విషయంలో నామినికి జరిగినట్టు ఇంకెవరికైనా జరిగిందా అనిపిస్తుంది. పది లక్షల పర్సు మాట అట్టే పెట్టండి, 2001 నుండి 2010 దాకా ఆయనకు సహాయం చేసిన వారి వివరాలు వింటుంటే నాకు వారందరి మీదా చాలా గౌరవం కల్గుతుంది. తెలుగువాళ్ళు తమ రచయితలకి ఏమీ చెయ్యరు అన్నది అపప్రధ అనిపించింది. ముఖ్యంగా సాకం నాగరాజ వంటి వారిగురించి చదివినప్పుడు మనసు నిండిపోయింది.

రెండవది: తాను రాసిన అమ్మ చెప్పిన కతలు అనే పుస్తకాన్ని ఐదారేళ్ళలో దాదాపు లక్షా అరవై వేల కాపీల్ని పిల్లలకు నామిని (చాలా కష్టాలు పడుతూనే) స్వయంగా డైరెక్ట్‌గా అమ్మానంటే ఆశ్చర్యం వేసింది. గత ఏడాది, నాలుగు నెలల్లో మిట్టూరోడి పుస్తకం 5వేల కాపీలు, పచ్చనాకు సాక్షిగా, సినబ్బ కతలు కలిపిన ఇంకో పుస్తకం 5వేల కాపీలు రెసిడెన్షియల్ కాలేజీ హాస్టల్ విద్యార్థులకు డైరెక్ట్‌గా అమ్మగలిగారట. ఈ విషయాలు చదివితే తెలుగు పుస్తకాలకు లేనిది మార్కెట్ కాదు, సరైన మార్కెటింగ్ అనిపించింది.

కోతి కొమ్మచ్చి మొదటిపేజీల్లో ముళ్ళపూడి గారు, ’ఆత్మకథ అంటే సొంతడబ్బా – మరియు పరనింద అని తాత్పర్యం” అన్నారు. నామిని ఆత్మకతలో ఈ రెండూ ఎక్కువ పాళ్ళలోనే ఉన్నాయి. ఈ రెంటికీ తోడు ఈ కతలో చేరిన కొత్త దినుసు ఆత్మనింద: తాను చేసిన జూటాతనాల, చేయగూడని పనుల గురించి మనతో చెప్పుకోటం. ఈ మూడు దినుసులు కలసిన వంటకం కొన్నిచోట్ల చాలా వెగటుగా అనిపించింది. ఈ పుస్తకంలో నాకు, ఇష్టులూ, సన్నిహితులూ ఐన వారి గురించీ, నాకు తెలియనివారు చాలామంది గురించీ కటువైన మాటలూ, కొంటె మాటలూ ఉన్నాయి. మిత్రుల గురించిన మాటలు నన్ను కొద్దిగా కష్టపెట్టినా, ఆ ఇబ్బంది మరీ పెద్దది కాదు. ఎవరి అనుభవాలు, అభిప్రాయాలు వారివి అని సరిపెట్టుకోగలిగాను. కానీ ఈయనకు సహాయం చేసినవారి గురించి కూడా ఆక్షేపణగా వ్రాస్తున్నప్పుడు మాత్రం చిరాకు అనిపించింది.

నాకు బాగా ఇబ్బంది కలిగించిన విషయాలు రెండు. మొదటిది పుస్తకం మొదటినుండి చివరిదాకా కనిపించిన అతిశయం, ప్రపంచమంతా నామిని గొప్పదనాన్ని తగినట్లుగా గుర్తించి ఆయన్ని పట్టించుకొని ఆయనకు ఇష్టమైన రీతిలో సహకరించటం లేదన్న ఆక్రోశం (దీన్నే ఇంతకుముందు రంగనాయకమ్మ గారు నామిని బడాయిగా వర్ణించారు). నామినికి తనపై తనకు జాస్తిగానే నమ్మకం ఉంది. అమ్మని గురించి, పల్లెజీవనాన్ని గురించి రాయటంలో తనకు సాటి (తెలుగు సాహిత్యంలో) మరొకరు లేరని, పల్లెటూళ్ళగురించి మిగతావారు రాసినవాటిలో నిజాయితీ, సాధికారత లేవని ఆయన నమ్మకం. ఆయన నమ్మకానికి ఆయన నమ్మకంతప్ప వేరే దాఖలాలేమీ ఆయన చూపెట్టలేదు. అలాగే ప్రపంచంలో మిగతా మనుషుల ప్రవర్తన తాను అనుకొన్నట్టుగానే ఉంటేనే రైటని కాకపోతే తప్పనీ చెప్పటానికి ఆయనేమీ వెరవడు. ఆయనకు సహాయం చేసేవాళ్ళు కూడా ఆయనకు రైటనిపించిన మార్గంలోనే చెయ్యాలి. ఐతే వచ్చిన చిక్కేమిటంటే ఆయన ఆలోచనలు, నమ్మకాలు కొంచెం ప్రత్యేకమూ, విలక్షణమూ అవటంతో, వాటిని పంచుకోలేని స్థాయిలో మిగతా ప్రపంచమంతా ఉంది మరి.

నామిని తిరపతి సన్మానసభ ఉపన్యాసంలోనూ, ఈ పుస్తకంలోనూ రకరకాల వైనాలుగా కనిపించే విషయం: సమాజానికి మంచి చేసే తన (పోనీ తనబోటి రచయితల) బాగోగుల్ని పట్టించుకొని, పుస్తకాలు కొనేసి, ఎలాంటి ఆర్థిక ఇబ్బందులూ లేకుండా చూసుకోవలసిన బాధ్యత సమాజంలో మిగతావారందరిపైనా ఉందని. అలా చూసుకోకుండా ఏదో పనిచేసి కుటుంబం గడపవలసి రావటం మంచి సమాజం లక్షణం కాదని. మంచి (అంటే ఏమిటి అన్నది వేరే ప్రశ్న; బహు గడ్డు ప్రశ్న) రచయితలు తమ రచనల మీద వచ్చే ఆదాయంతో బతికే పరిస్థితి ఉండాలని భావించేవాళ్ళలో నేనూ ఒక్కణ్ణి. నామిని తిరపతి సభలో మాట్లాడినా మాటల్ని మిత్రులు చాలామంది విమర్శించినా, నేను వారితో చేరలేక పోయాను. కానీ, ఈ పుస్తకంలో నామిని చెప్పినదాన్ని బట్టి, నామిని తన రచనల ద్వారా బతకటానికి చాలామంది – నామినితో రచనలద్వారా తప్ప ఏ రకమైన పరిచయం లేనివాళ్ళు – కేవలం నామిని రచనల మీద అభిమానంతో – తమ వంతు సాయం అనేక రూపాల చేశారు. ఐనా ఆయన ఆర్థిక పరిస్థితి ఆయనకు కావలసినట్లు లేదంటే దానికి ఆయన తీసుకున్న కొన్ని వ్యక్తిగతమైన, వ్యాపారాత్మక నిర్ణయాలే కారణం. తాను తీసుకున్న నిర్ణయాలకు సమాజాన్ని, ప్రజలను బాధ్యులుగా చూపించబోవటం, తనకు మల్లే కాక ఆర్థికంగా విజయం పొందినవారిని నిందించటం హాస్యాస్పదమతుంది.

నన్ను ఇబ్బంది పెట్టిన రెండవ విషయం: ఈ పుస్తకంలో నామిని విప్పి చూపిన స్వంత తప్పుల చిఠ్ఠా – ముఖ్యంగా భార్య పట్ల, కొందరు దగ్గర బంధువుల పట్ల ఆయన ప్రవర్తించిన తీరు. ఆయన బలహీనతలు ఆయనవి అని వదిలేద్దామనుకున్నా అవి బలవంతంగా మన ఎదుట ఆయన ప్రదర్శనకు పెట్టినప్పుడు మనం ఏమనుకోవాలి? ఏం చేయాలి? పదిమంది ముందూ తప్పులొప్పుకొని పశ్చాత్తాపం ప్రకటించి పాపాల్ని కడిగేసుకొని (public confession and catharsis) కొత్త జీవితం ప్రారంభించే ప్రయత్నం అనుకోవాలా? లేక ఈ తప్పుల్ని నామిని కాబట్టి ఇంత బహిరంగంగా ఒప్పుకొన్నాడని మెచ్చుకొని ఆయన నిజాయితీని పొగడాలా? ఇంతకు ముందు నామిని రచనల్లో వచ్చిన కొన్ని విషయాలను, బహిరంగ ఒప్పుకోళ్ళను అప్పుడే ఖండించక అతని నిజాయితీకి ఇచ్చిన కితాబుల ఫలితమా ఇది?

ఈ పుస్తకం ఆఖరి భాగం ’పది కుయ్యో మొర్రోలు’లో నామిని యీ పుస్తకాన్ని చదివేవాళ్ళకూ, ప్రవాసాంధ్రులకూ ఒక వుజ్జోగం ఇచ్చాడు: తనకొక వుజ్జోగం యిచ్చి తనను దత్తత తీసుకోమని. ఆ పని ఎట్లా చెయ్యొచ్చో పది రకాలుగా చెప్పాడు. అందులో ఆఖరి మార్గం (పుస్తకంలో ఆఖరు పేరాగ్రాఫు) ఇది: “ ఇంకా పుస్తకాలు చదివేవాళ్ళంతా కూడా – నామిని జ్యోతిలో వున్నప్పటికంటే యిప్పుడే మంచి పని జేస్తుండాడు. వుజ్జోగాలేంది కదీర్‌బాబూ, ఉమామహేశ్వరరావూ కూడా చేస్తారు. యీ పని నామిని తప్ప యింకొక్కడు చెయ్యలేడు అనుకునే వాళ్ళంతా కూడా వాళ్ళకు తోచింది నా చేతుల్లో పెట్టండి. కుటుంబం కష్టంగా గడిచేవాళ్ళు నవ్వుమొకంతో దీవిస్తే చాలు. నా రెక్కల కష్టంతో ఇంకా ఇరవై లక్షల మంది పిల్లకాయల్ని కలిసి యీ పుస్తకాలమ్మి చిన్న యిల్లు కట్టుకొని దానికి ’పుస్తకం’ అని పేరు పెట్టి, దాంట్లోనే కుదురుగా ఉండాలనేది నా కోరిక…మీరంతా తలా ఒక చెయ్యందించాలని యీ మాదిరి A/c number యివ్వడానికి నాకేం సిగ్గుగా లేదు, కులుగ్గానే ఉండాది.’ డబ్బు ట్రాన్స్‌ఫర్ చేయడానికి వీలుగా అకౌంటు వివరాలు ఇవ్వడంతో పుస్తకం ముగిసింది. ఇదంతా చదివాక ఈయన మనల్ని ఆట పట్టిస్తున్నాడు అన్న అనుమానం వస్తే తప్పు మీది కాదు.

సాధారణంగా ఆత్మకథలు ఆ రచయితల స్థలకాలాల్ని పాఠకులకు పరిచయం చేస్తాయి. నామిని పాత పుస్తకాలు (ఇస్కూలు పుస్తకాలతో సహా) ఈ పనిని బాగా చేశాయి. ఈ పుస్తకంలో మాత్రం అలాంటివి తక్కువ. ఎక్కువగా నామిని గురించీ, కొద్దిగా ఆయనకు తెలిసినవారి గురించీ తెలుస్తుంది. ఈ పుస్తకానికి కొద్దిగా సాహిత్య చరిత్ర విలువలున్నాయేమో చెప్పలేను కాని సాహిత్యంగా విలువ మాత్రం తక్కువ అనిపించింది.

నామిని చెప్పిన దాని ప్రకారం ఆయన రాసిన కతలు – మిట్టూరోడి పుస్తకంలో ఉన్న సొంత కతలు (పచ్చనాకు సాక్షిగా, సినబ్బ కతలు, మిట్టూరోడి కతలు), తెలిసినవాళ్ళ కతలు (మునికన్నడి సేద్యం, పాల పొదుగు, సుందరమ్మ కొడుకులు) – అన్నీ 1985-1989ల మధ్య రాసినవే. ఈ ఇరవై ఏళ్ళలో ఇస్కూలు పిల్లల పుస్తకంలో ఉన్న విషయాలు (ఇవన్నీ కూడా 1999-2002 మధ్య రాసినవే), పతంజలి మీద వ్యాసం తప్ప ఇంకేమీ రాసినట్లు లేదు. నామిని చెప్పగల కతలు ఐపోయాయా? తన పాత కతల్ని కొత్త పాఠకులకు చేర్చడమే నామినికి మిగిలిన వ్యాపకమా?

ఇంతకు ముందు రచనల్లో నామిని కష్టమైన పరిస్థితుల మధ్య పెరిగినా, నలుగురు తొక్కిన దారికి పెడగా నడిచినా, చిన్న చిన్న మాటకారీ మోసకారీ పనులు చేసినా, మొండిగా తనదైన దారి తాను వెదుక్కొని స్వయంకృషితో పెద్దవాడైన ఒక పల్లెటూరి అమాయకుడిగా, తనబోటి వారి కష్టాలను మర్చిపోని సున్నిత మనస్కుడిగా, స్నేహం చేసుకోవలసిన మనిషిగా కనిపించేవాడు. ఈ పుస్తకంలో నామిని అహంకారిగా, ఒకోసారి అమాయకుడిగా, ఇంకోసారి అతితెలివిగా, మోసకారిగా, అప్పుడప్పుడూ అవివేకిగా, కొండొకచో సోమరిగా, ఎప్పుడూ మొండిగా, పెడసరి మనిషిగా, దూరంగా ఉండి జాగ్రత్తగా మెసులుకోవలసిన వ్యక్తిలా కనిపిస్తున్నాడు. పాత నామిని ఇట్లా బహిరంగంగా నామిని చేతిలోనే హత్య చేయబడడం విషాదం.

ఇంతకీ నాకు పుడింగి అంటే ఏమిటో పుస్తకం పూర్తయ్యాక కూడా స్పష్టంగా తెలీలేదు.

పుస్తకం అందంగా ముద్రించబడింది. అచ్చు తప్పులు బాగా తక్కువ.

నామిని
నెంబర్ వన్ పుడింగి
మార్చ్ 2011
టాం సాయర్ బుక్స్
ప్లాట్ నం. 211, అన్నమయ్య టవర్స్
యాదవ కాలనీ, తిరపతి 517 501
ఫోన్: 0877-224 2102
212 పేజీలు; 150 రూ.

***********************************
చికాగో మెడికల్ స్కూల్‌లో సైకియాట్రీ ప్రొఫెసర్ డా. జంపాల చౌదరికి తెలుగు, సాహిత్యం, కళలు, సినిమాలు అంటే అభిమానం. తానా పత్రిక, తెలుగు నాడి పత్రికలకు, మూడు తానా సమావేశపు సావెనీర్లకు, రెండు దశాబ్దాలు కథాసంపుటానికి సంపాదకత్వం వహించారు. తానా, ఫౌండేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫారంస్ ఇన్ ఇండియా (ఎఫ్.డి.ఆర్.ఐ.), మరికొన్ని సంస్థలలోనూ, కొన్ని తెలుగు ఇంటర్నెట్ వేదికలలోనూ ఉత్సాహంగా పాల్గొంటుంటారు; చాలాకాలంగా తానా ప్రచురణల కమిటీ అధ్యక్షులు. పుస్తకం.నెట్‌లో జంపాల గారి ఇతర రచనలు ఇక్కడ చదవవచ్చు.
***********************************About the Author(s)

Jampala Chowdary

చికాగో మెడికల్ స్కూల్‌లో సైకియాట్రీ ప్రొఫెసర్ డా. జంపాల చౌదరికి తెలుగు, సాహిత్యం, కళలు, సినిమాలు అంటే అభిమానం. తానా పత్రిక, తెలుగు నాడి పత్రికలకు, మూడు తానా సమావేశపు సావెనీర్లకు, రెండు దశాబ్దాలు, కథ-నేపథ్యం కథాసంపుటాలకు సంపాదకత్వం వహించారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), ఫౌండేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫారంస్ ఇన్ ఇండియా (ఎఫ్.డి.ఆర్.ఐ.), మరికొన్ని సంస్థలలోనూ, కొన్ని తెలుగు ఇంటర్నెట్ వేదికలలోనూ ఉత్సాహంగా పాల్గొంటుంటారు; చాలాకాలంగా తానా ప్రచురణల కమిటీ అధ్యక్షులు. తానాకు 2013-2015కు కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా, 2015-2017కు అధ్యక్షుడిగా ఇటీవలే ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. పుస్తకం.నెట్‌లో జంపాల గారి ఇతర రచనలు ఇక్కడ చదవవచ్చు.55 Comments


 
 

 1. శివప్రసాద్

  మనలో చాలా మందికి నిజం చెప్పే ధైర్యం ఉండదు. ఆ పని నామిని చేస్తే ఎందుకు ఉలికిపాటు? మనం గొప్పవాళ్ళు అనుకున్నవాళ్ళని తను కాదు అంటున్నాడు, కాబట్టి ఇన్నాళ్ళు మనం పిచ్చోళ్ళం కాబోలు అనే ఫీలింగ్ వల్ల నామిని అంటే కొంతమందికి కోపం వస్తున్నట్టుంది


 2. rajeev

  ఈ పుస్తకం నేను చాల ఆసక్తి గా చదివాను నామిని మా చిత్తూరు జిల్లా వ్యక్తీ కావడం ముఖ్య కారణం కాగా ఆయన కథ చెప్పే శైలి నాకు బాగా నచ్చడం కూడా ఒక కారణం. ఒక వ్యక్తీ తన సొంత గొడవలు స్వయం ప్రతిభ గురించి ఎంత ఎక్కువ చెప్పుకుంటే అది అంత మంచి కథ అవుతుంది అనే కొలబద్ద తో చూస్తె నామిని నెంబర్ వన్ పున్దిగే సందేహం లేదు.

  కాని ఒక పుస్తక ప్రయోజనం ఏమిటి అనే కోణం లో చూస్తె ఈ పుస్తకం పనికిరానిది అని చెప్పొచ్చు. రావి శాస్త్రి మొదలుకొని ఈ నామిని గారికి ఎవ్వరు నచ్చలేదు అంటే లోపం ఆయనదా తెలుగు రచయిథలదా, తెలుగు సాహిత్యానిదా అన్న ప్రశ్న వస్తుంది.

  పుస్తకాలూ వాటి అమ్మకం గురించి నేర్చుకోవలన్నవారు చదవాలిసిన పుస్తకం ఇది


 3. varaprasad

  చౌదరి గార్కి నామిని అంటే ఎంతో అబిమానం,ఆ విషయం నామిని గురించి అయన వ్రాసిన దాన్ని బట్టి అర్ధం అవుతున్నా కావాలని రంద్రాన్వేషణ చేయటం అవసరమా,చౌదరి గారు నామిని విషయం చెయ్యాల్సిన దానికన్నా ఎక్కువే చేసారు,ఇప్పుడు కూడా అయన బాధపడేది నామిని గారు ఇంకా స్దిరపదలెదనె తప్ప వేరేమి కాదు,నేను కూడా నామిని గార్కి వీరాబిమానినే అయితే నాకున్న పనుల వల్ల,2012 వరకు అయన గురించి తెలియలేదు,పుస్తకం పుణ్యమా అని చౌదరి గారివంటి వల్ల మా అబిమాన రచయిత గురించి తెలుసుకో గలిగాం.చౌదరి గారు ఎక్కడో ఉండి మనం చేయలేని ఎన్నో పనులు చేస్తున్నారు.ఇదే విషయం లో ఇంకో అయన బాపు,వంశీ లను కూడా విమర్శించారు,అదీ తప్పని నా అబిప్రాయం మనం అభిమానించే వారి కోసం వెరెవర్ని కించపరచటం మన తెలుగు సంప్రదాయం కాదు,దయచేసి అందరకి ఉపయోగపడే ఇటువంటి చోట భాష పట్ల అప్రమత్తత చాలా అవసరం,అన్యదా బావించవద్దు.


 4. badrinath

  kaanti ni paravartinchakapote,vajramu kuda graphyte/boggenu.Naku naminigaru 2000 lo,hyd vidichi tpt velleppudu naku varu lunch ichharu intilo samanlu transport appatike ayipoinakuda.Nadi appatiki 1 day parichayame,through yalla achutaramaiah ane mutual friend dwaara.Naminidi paci manasu.Athaniki debba thagilina,evaraina chusi anandistarantene edusthadu.Thanu chaste edavadu.AA geera mendu.Paci manasu.Deevinchandi.’.kalamu- mananamu-,manamu’ kalagalisite oka vyakti-smrutulu.AYYALARA,NAMINI PINA OKKA COMENT KUDA BADHAKARAMGA CHEYAKUDI..ENDUKANTE AA NAMINI MANALONE UNTADU,JAVAJEEVALLO,JEEVANAJALALLO,MANA ANTARANTARALLO..VANDANALU..BADRINATH,JNTU ATP


 5. murali

  ii mittuuroodi maatallo arava (tamila) padaalu dorladam sahajam.
  konni arava anuvaada cinimaalaloo pudimgi anee maata vinipistumdi.
  teluguloo diiniki samaanartham podagari anee kaakumdaa ‘pootugaadu’ amtee podicheeseevaadu monagaadu ani kuudaa artham vinipistumdi.

  ‘aayana raasipaareesina kavithaa sumaalu gubaalistumdagaa
  aayana taagipaareesina siisaala goola manakeela’
  ani oo abhimaana vimarsakudu Mahaakavi SriSri gurimchi annaaru. vyaktigatamgaa mahaakaviki aneeka balahiinatalu
  umdavacchu, ayinaa aayana Mahaakvee.

  Alaagee naamini kuudaa balahiinatalaku atiitudemii kaadu.
  palle sogasulu, piillala manasulu, talli hridayam—- visleeshimchi
  mana mumdu paricinappudu aaa pudimgitanaaniki accheruvomdaam.
  aakasaanikettam. kaani aa pasitanam, amaayakatvam muurthiibhavinchina mitturoodu maaripooyaadu.
  udyoogamloo umdagaa sahoodyoogulavishayamloo

  amaanushamgaa pravarthimchee vaadani aaroopanalunnayi.
  Raavi Saastri, Kaalipatnam vamti vaaru peedarikanni glamaras gaa
  varnimchaaranna Namini kuudaa imchumimchu alaane cheesaadu.
  Aayana abhimaanulu dhanam gala maaraajulu kaavadam aayana
  adrishtam.
  pustakam maarketimgloo emtamamdi rachayitaluu imta gadusarigaa
  chorava tiisukoni pudigmgulu avutaroo veechi chuudaalsimdee.


 6. సురేశ్ కొలిచాల

  నామిని గురించి నాకు ఏమీ తెలియదు కానీ పుడింగి అన్న పదం గురించి చెప్పగలను. ఈ పదం *పొడంగు (పొడవు) అన్న పదానికి సంబంధించినది. పుడుంగి అంటే పొడగరి, అధికుడు అన్న అర్థాలు తెలుస్తూనే ఉన్నాయి కదా. మధ్యాచ్చులు (ఎ-, ఒ- లు), అగ్రాచ్చులు (ఇ-, ఉ- లు) గా మారడం తమిళంలోనూ, తమిళ ప్రభావం ఉన్న చిత్తూర్ మాండలికంలోనూ తరచుగా కనిపిస్తుంది. పొర (layer) > పురై (తమిళం); పొగ (smoke) > పుగై (తమిళం); దొర (lord) > దురై (తమిళం). మొ ॥ ఇటువంటి ధ్వని మార్పుకు కొన్ని ఉదాహరణలు.


  • Thirupalu

   తమిళంలో పొడుంగు అన్న మాట లేదండి. తమిళము తెలుగు కలిపి మాట్లాడే వారు ఇలా పొడుంగు లాంటి మాటలకు ఇంగు చేర్చి మాట్లాడతారు. పుడింగి అన్న మాటకు జంపాల చౌదరి గారు వాడిన ” పోటుగాడే ” సరి అయినది. పుడుంగు అన్న తమిళ పదానికి తెలుగులో అర్ధం చెప్పుకోవాలంటె ‘ పెరుకు ‘ ‘ పుడుంగు’ కు ఇ అనే ప్రత్యయం చేర్చటం ద్వారా అది ‘ పుడింగి ‘ అవుతుంది. అర్దం : పెరుకు వాడూ కాస్త సెటైర్‌ గా చెప్పాలంటె చాతుర్య వంతుడు. నెంబర్‌ ఒన్‌ పుడింగి అంటె గొప్ప చాతుర్యవంతుడు అని అర్ధ చెప్పుకో వచ్చు. దాన్నే సెటైర్‌ గా- అంటె వ్యంగ్యంగా వచ్చాడండి పెద్ద పోటుగాడు అని వాడుక. ఇది కేవలం వివరణ సరిగా ఉంటె బాగుంటుందనే ఉద్దేశం తో రాస్తున్నాను.


 7. పాపుదేశి ఝాన్సీ

  నేను నామిని గారి పుస్తకం ‘ నెంబర్ వన్ పుడింగి ‘ చదవడం ఈరోజే పూర్తిచేశాను. పూర్తిగా చదివాక గొంతులో ఏదో అడ్డుపడ్డ భావన. పుస్తకం చదవడం పూర్తయ్యకే నేను ఇక్కడి వ్యాఖ్యలను చూశాను. పుస్తకాలు అమ్మడానికి స్కూళ్ళకు వెళ్ళిన నామినిని ఎగిరి తన్నిన కొందరి కంటె ఇక్కడ నామినిని ఆడిపోసుకుంటున్న వారిని చూసే నాకు కళ్ళలో నీళ్ళు కమ్ముకున్నాయి. నిజానికి ఇన్ని కష్టాలను అనుభవించిన నామిని వాటిని, వాటితోపాటూ తన అవలక్షణాలను పదిమందికి చెప్పాలనుకోవడమే ఒక సాహసం. దాన్ని అభినందించకపోగా ఆక్షేపించడం నాకు అంత బాగా అనిపించడంలేదు. నా వరకు నాకు ఇతరత్రా రచనలపై విమర్శలు సరే కానీ, ఆత్మకథను ఒకవ్యక్తి జీవనపోరాటంగా మాత్రమే చూడాలనిపిస్తుంది. సాహిత్యంపై, సాహితీ విమర్శకులపై విమర్శలు చేసే స్థాయి నాకు లేకపోయినా నేను ఒక్కటి మాత్రమే చెప్పదల్చు కున్నాను.నామిని రాసిన పుస్తకాన్ని విమర్శిస్తున్న వాళ్ళకంటె ఆయన బ్రతుకుతెరువు ఇలాగే ఉండాలని, నామిని అన్నవ్యక్తి ఇలాగే రాయాలని ఆయన ప్రవర్తిస్తున్న తీరును కూడా శాసించే వాళ్ళే ఎక్కువగా ఇక్కడ నాకు కనిపిస్తున్నారు. మనందరికీ గొప్పవాళ్ళైన వ్యక్తులను నామిని ఏ ధైర్యంతో విమర్శిస్తున్నాడన్న ప్రశ్న కనిపిస్తోంది. ఆయన తనకు అనిపించిన ఫీలింగ్స్ ను యధాతథంగా పుస్తక రూపంలో బయటపెట్టడం మీకెవరికీ నచ్చలేదు.లోపలున్న ఫీలింగ్ ను బయటకు కనిపించకుండా ఫలానా వాళ్ళు చాలా మంచోళ్ళని చెప్పిఉంటే, వాళ్ళే వచ్చి ఆయన పుస్తకాలకు బ్రాండ్ అంబాసిడర్లు అయ్యేవారేమో. అప్పుడు మీరంతా కూడా నామినిని మెచ్చుకునేవారేమో. ఒక వ్యక్తిని, అతనిలోని ఫీలింగ్స్ ను ఒక మూసలో పోసి చూడకుండా, వివిధ సందర్భాల్లో ఎంత గొప్ప వారయినా ఎలా ప్రవర్తిస్తారో తెలుసుకుని, వారినలాగే ఆదరించడం బావుంటుందేమో ఆలోచించండి.


  • hat’s off jhansi garu.


  • Naresh

   Chala baga chepparu jhansi garu


  • Ravi Tangeda

   Jansi Ji – Bravo, well said.
   Sorry can’t type in Telugu so going on in English..
   It’s an other book with a different concept, I don’t see anything wrong in Namini’s narration on his defects. It’s his story and he got all rights to share his experiences and to tell what he would like to.. good or bad.

   Not able to understand why some making so much noise about it.


  • acharya

   unnatamina vaalla life lo balaheenatalu manakenduku Hats;off jhansi medam


  • శివప్రసాద్

   మంచిమాట చెప్పారు….


 8. loknath kovuru

  ఏ గొప్ప ఆదర్శాల గురించి నామిని ఎప్పుడు మాట్లాడలేదు ఏ కథలోనూ తను పాటకుల మీద పెమానం చేసి “నేను నూటికి ఇన్నూరు శాతం సత్తె పెమనికంగా సెప్తుండా నేను సత్తె అరిచ్చేన్ద్రుడ్ని అని రోమ్మిరుస్కుని నిలబడింది లా.
  నా నంగి చేష్టలు, నా జుటాతనాలు, నా లోబి తనాలు,నా తాగుబోతు బుద్ధి, నా దొంగతనాలు అని తను వొంగొంగి దణ్ణాలు పెట్టుకున్న సందర్బాల గురించి సూళ్ళురుపేట, రాజంపేట లో తనని నలగోట్టిన సంగతిని రాసుకున్నాడు గాని నిక్క నీలుక్కుని బిర్ర బిగుసుకుని ఫోటోకి ఫోజిచ్చుకోల కదా ఇంకా ప్రముఖ రచియిత వంశి తన “పసల పూడి పులిసిన పులుసుని” నాలికి మిందేస్కుని అ టేస్ట్ మింద ఒక టెక్స్ట్ మెస్సేజ్ పంపమని సేత పోరిన నామిని కలం యవన్న వొంగిదా?
  బాపు చేత ఫోన్ చేయిస్తే మాత్రం బాపు కాదు వాళ్ళ బాబు చెప్పిన మరి నామిని అంటే మొగాలయే కదా మళ్ళా రెకమండేషన్లు అంటే మా వోడికి అరికాలు మంట నేత్తికేక్కధ మరి. (ఇల్లేరమ్మ కథలేసినాడంటే కుసింత అర్ధం ఉండాదప్ప సుసీలమ్మ పైగా నువ్వే నా గురువంది ఐన ఈ కేడి నాయాలు తన పేరుని మాత్రం యేస్కోనీల కద అ యమ్మ పుస్తకంలో) నామిని కల్పనా సాహిత్యం రాయలేడు అని ఒక విసురు కల్పనా సాహిత్యం అందురు ఎలాగబెడతాఉండారుగదా ఏందీ భూమి పుట్టినప్పట్నుండీ …

  ఇట్ట ఇలావరిగా పక్కకు పిల్చుకేల్లి నా ఒక్కడితోనే తోనే మాట్లాడతున్నట్టు ఎవోక్కడు అన్న మనకు చెప్పినాడ కథలు అని.. శైలి కంటే వస్తువే ముఖ్యమా? ఇప్పటిదాకా తెలుంగు సాహిత్యం తన చూపులు సారించని వస్తువులు ఉన్నాయా జంపాల గారు? అయిన నామిని ని మీరుగాని నేనుగాని తన బుక్స్ ఇష్టంగా చదివే వారందరూ నచ్చేది తన శైలినే కదా? అచ్చరం పొల్లుబోకుండా కయ్యిల్లో ఊర్లల్లో అచ్చరం మొకం చూడని వాళ్ళు మాట్లాడే మాటల్ని అచ్చులోకి దింపిన విలేజ్ బెమ్మ కదా సా. నామినంటే.

  ఉడికాయో లేదో అని వేడి వేడి అవుర్లోంచి ఎత్తుకు తిన్న వేరు శేనక్కాయలా లేవ?లేత తాటి ముంజులలో నీళ్ళ ను జుర్రుకుని ముంజుని తిన్నట్టులేదా దాని చుట్టూ ఉన్న వొగరు తపక ని ఉసేసినట్టే జ్యోతి లో తప్పుడు లెక్కలు సుసీలమ్మ కంప్యూటర్ సంగతిని ఉసేసి సామాన్యుడి ఆనందాన్ని ఆస్వాదించండి సా. నామిని లాంటి సేతురోడు లేని ఊరు ఊరే కాదని నా ఇన్నపం.

  కథంటే సేప్పినట్టు ఉండాలే కానీ రాసినట్టే ఉండకూడదనే మాట తెలుగచ్చరం పోయేదాకా నిలబడే మొగలాయ్ మాట కదా..ఇప్పటి దాక యేన కొడుకు సేప్పినాడో ఇంత నికార్సుగా..” అ గుడిసెలో కిరసనాయులు దీపం ఆరు సబ్జెక్టులు ఫెయిల్ అయి పోయిన పదో తరగతి కుర్రాడిలా బిక్కు బిక్కు మంటోంది”… అన్న పోలికని మనోడు ఎదిరించి నాడంటే నాకెంత సంతోషమో మాటల కందట్లేదురా నాయనలారా అమ్మలారా..కాకపోతే కిరసనాయులు దీపం కి తగులుకుని ప్రాణం కోటకలాడతున్న రెక్కలున్న ఏ పురుగో దోమో ఈగో అని రాయొచ్చు కద. రావి శాస్త్రి , కేశవరెడ్డి మింద నామిని విసుర్లకి నాకు శాన కులుగ్గానే ఉండాది..హాయిగా వల్లిరుసుకుని అవులించినట్టే…… నామిని ఈ రోజున కోత్తగా అర్ధం అవడం ఏంటో నాకు పూర భోదపడట్ల..పచ్చనాకు సాక్షి గా చదివిన బుర్రున్న పెతోడికి యిట్టె తెలిసి పోవల్న్నే కానీ తెలియకపోతే మళ్ళ ఇకొక తురి చదవాలా.నామిని రాసిన కతలు అనేకంటే సెప్పె కతలంటేనే మరేద నాకు వాళ్ళమ్మతో కలిసి చేసిన జుటా పనులు జూస్తే తెలిద అని వీళ్ళకి అని నాకు ఒకటే ఆచ్చేర్యంగ మనోఎద గా ఉండాదప్ప ……….
  నాకు చిన్నప్పుడు ఒక కల వచ్చేది అదేంటంటే నేను చెప్పుల్లేకుండా మట్టిలో ఓ అంట ఆడుకుంటూ దుమ్ములో కాలితో నాగల్లగా దున్నుకుంటా పోతుంటే రుపాయి బిళ్ళలు వచ్చేవి అట్టా ఎన్ని గేలకత ఉంటె అన్ని.. ఈ రకంగా ఎవురికన్నా డాలర్లు దొరకతా ఉండయనుకునే అడిగాడేమో ఐన ఎన్జీ ఓ లు జెపి కంటే పిల్లలో జీకే పెంచుతాననే నామినే బెటర్ కద …..ఛా..నాశినం ఈ మాటగూడ నాతో చెప్పించాల ఏందీ..


  • Srinivas Chowdary .Sadhanala

   Super counter by Lokanath to Jampala. I think no one need to agree as ” Namini is the great”, His stories says he is superb. There are so many to write good grammatical and Telugu literature. But one and only is there to give rebirth to village slang. Thats why I really proud to say……..

   (sorry no Telugu software available. Leka pote naa samiranga iragadeesunde vanni).


  • Ravi Tangeda

   dandalu dora 🙂
   Mannchiga cheppinav
   I met Naminin at his kukatpally house way back in 2001. They were moving houses and apart from handful of books and some house hold stuff nothing left at home. He sat on floor and insisted me to sit in the only chair leftover.. such a humble man.
   Gave me a good suggestion which I am following for my life.. to give a book as gift on any occasion if i have to give some one with a gift.

   Bravo – Namini looking forward for more books from you. they are your stories no one can decide what needs to be there and what not to be..


 9. dvrao

  ఇప్పుడే ఈ పుస్తకం చదివాను. చాలా డిజప్పాయింట్ అయ్యాను. ఆంధ్రజ్యోతి లో అయన అనుభవాలు రాస్తారేమో అనుకొన్నాను. మనకి అవసరం లేని విషయాల తో పుస్తకం నింపేసి నామిని పేరుకు వున్న గ్లామర్ కాష్ చెసుకుతున్నాడు అనిపించింది. పుస్తకం డబ్బు పెట్టి కొన్నప్పుడు వ్యాఖ్య చేసే హక్కు మాకు వుంటుంది అనుకొంటున్నా 🙂


 10. Jampala Chowdary

  అనిల్‌గారూ:

  మీ వ్యాఖ్యలు చదవటానికి చాలా కష్టపడవల్సి వచ్చింది. మీరు submit బటన్ నొక్కే ముందు ఒకటి రెండు సార్లు సరిచూసుకుంటే నాబోటివారికి సహాయం చేసినవారౌతారు.

  నా వ్యాసాలపై వచ్చే ప్రతి వ్యాఖ్యకూ ప్రతిస్పందించే అలవాటు నాకు లేదు. అవసరం అని నాకు అనిపించినప్పుడే ఆ పని చేస్తాను.

  పరిమి, వరప్రసాదరెడ్డిల గురించి నామిని చెప్పిన మాటలు మీకు సమంజసంగా అనిపించాయి. నాకు అనిపించలేదు.

  నామినిగారు పుస్తకంలో తలదాచుకున్నట్లు మీకు అనిపించింది. నాకు అలా అనిపించలేదు. నామినిని నేను జుత్తు పట్టుకుని వీధిలోకి ఈడ్చుకు రావడమేమిటి? సొంత విషయాలను అచ్చువేసి మనం అడక్కుండానే ఆయన రచ్చకెక్కి చెప్తుంటే.

  నామినికి శత్రువులను ఇంకా నేను కూడగట్టాలా? ఆ పని ఆయనే విజయవంతంగా చేసుకుంటున్నట్టు ఉందే!

  మీకు నేను ఈ సమాధానం రాయడానికి ఒకటే ముఖ్యకారణం: ఈ పరిచయంలో నేను వ్రాసిన మాటలను మీరు, ఇంకొందరు జాగ్రత్తగా చదివినట్లుగా లేదు.

  ఒక ఉదాహరణ: నామిని గాసిప్ రాశాడని, అందుచేత అది సాహిత్యం కాదని నేను అన్నట్లు మీ మొదటి స్పందనలో ధ్వని. నేను రెండవ పేరాలో పుస్తకం ఎలా చదివించిందో చెప్పిన వాక్యంలో నాలుగు మాటలు, 21వ పేరాలో పుస్తకం మొత్తాన్నీ బేరీజు వేస్తున్న ఆఖరు వాక్యంలో నాలుగు మాటలూ సందర్భాన్ని విస్మరించి మీరు కలుపుకుంటే తప్ప ఆ అర్థం రాదు.

  నామినిపై నాకేదో శతృత్వమో, పగో, కోపమో ఉన్నట్లు మీరు భావిస్తే, అది చాలా పెద్ద పొరపాటు.


  • varaprasad

   “kudirite nalugu pages raste chalu,anandamga chaduvutam,avasaramite emi kavalanna istam”………..meeru rasina namini story vandasarlu chadivanu,namini patla meekunna concern ardam chesukotam maa dharmam.hates of chowdary garu nenu mee abhimanini.


  • g b sastry

   sree choudary gaaru,
   saahityam meeda mee abhimaanam gurinchi ‘mithunam’ kadhaki meeru icchina protsaaham dwaaraa telusukunnaanu.
   sree naamini gaari meeda meeru,meeru raasinadaanimeeda marikondaru raasinadi chadivaaka naaku kaligina sandeham meeto panchukuntunnaanu.
   rachyita raasinadi nacchite mecchukovaali nacchakunte nacchaledani odileyaali ilaa enduku raasaavani adige hakku paatakulaki ledani anukuntunnaanu.
   namskaaraalu
   g b saastry


 
   Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

మూలింటామె

వ్యాసకర్త: కె. సురేష్ ******* ఒక మంచి కథకుడు కథని చెప్పాలి, కథ కాకుండా ఏదో చెప్పటానికి ప్ర...
by అతిథి
7

 
 

‘నెంబర్‌ వన్‌ పుడింగు’ కాదు! ‘నెంబర్‌ వన్‌ బెగ్గింగ్‌’!!

రాసిన వారు: జె.యు.బి.వి. ప్రసాద్ (ఈ వ్యాసం మొదట ఆంధ్రజ్యోతి “వివిధ” లో, జూన్ ఆరోతేదీన...
by అతిథి
13

 
 

నామిని కొత్త సంకలనం వచ్చిందోచ్

రాసినవారు: కే.బి.ఎల్.శర్మ ************** “ఆరో తరగతి సిలబస్లో ఏమేమి వుండాది అనే ముందు, సిలబస్ ఎ...
by అతిథి
2

 

 

నామిని కతలు..

ఈ పదేళ్ళలో అన్నిసార్లు ద్వారా విన్నా కూడా నేనెందుకు దీన్ని చదవలేదా? – అని ఇప్పుడు చ...
by సౌమ్య
26

 
 

మా అమ్మ చెప్పిన కతలు

మా పాపాయి కి మొన్నామధ్య 4 నెలలు నిండినయ్యి. వాళ్ళ అమ్మ, అమ్మమ్మ , పాపాయికి పాలతో బాటు ర...
by రవి
12