బాపూకి జై!!
రాసిన వారు: అరిపిరాల సత్యప్రసాద్
******************************
బాపూకి జై..! బాపూ బొమ్మలకీ జై..!!
“బాపూ గొప్పవాడు..”
“అబ్బ ఛా.. ఏదైనా కొత్త విషయం చెప్పు..”
“సరే అయితే ఈ బాపూ బొమ్మలు వున్నాయే అవి మహా గొప్పవి..”
“ఇది మరీ బాగుంది… బాపు బొమ్మలు గొప్పవని తెలియనివాడు ఆంధ్రదేశంలో వున్నాడంటే వాణ్ణీ కాల్చి చంపేసినా నేరం కాదు.. ఇంకేదన్నా కొత్త సంగతి చెప్పు..”
“బాపు గీసిన బొమ్మే కాదు ఆయన స్పర్శకీ, ఆయన కుంచె స్పర్శకి గురైన కాగితం, రంగు కూడా గొప్పవి..”
“ఇదేదో కొత్తగా వుందే… ఇంతకాలం ప్రింటులో బాపు బొమ్మల్ని చూశాం కానీ, ఆయన స్వయంగా గీసిన అదే కాగితం, అదే ఒరిజినల్ రంగు చూసే భాగ్యం ఎవరికి కలుగుతుంది చెప్పు..”
“అవకాశం వుంది… మన భాగ్యనగరంలోనే ఆ భాగ్యం కలుగుతుంది.. ఈ నెల 4,5,6 తారీఖుల్లో, మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గేలరీలో జరుగుతున్న బాపు బొమ్మల కొలువులో… హలో.. నీకే చెప్తున్నా.. ఎక్కడికీ పరుగు?”
“అక్కడికే..”
***
అయ్యలారా, అమ్మలారా అదీ విషయం. బాపుగారు వచ్చారు. ఆయన గీసిన బొమ్మలు వచ్చాయి. ఆయన కలిపిన రంగులు వచ్చాయి. ఆయన గీసినప్పుడు ఎంత స్వచ్చంగా వున్నాయో అచ్చంగా అంతే స్వచ్చంగా, అచ్చైన తరువాత వెలిసిపోయినట్లు కాకుండా అలాగే వచ్చాయి. బాపుగారు గీసి – “ఎలావుంది వెంకట్రావూ..?” అంటూ రమణగారికి చూపించిన పెయింటింగ్, స్వాతి బలరాం గారికి పంపిన కార్టూను, దానికింద పెన్సిల్ తో “బ్యాక్ గ్రౌండ్ తెల్లగానే వుంచండి” అంటూ వ్రాసిన సూచన, వంశీ పసలపూడి కథలకి బొమ్మవేసి అసలు వంశీగారు పెట్టిన పేరు వ్రాయడం, తరువాత ఆ పేరు మార్పు రహస్యం.. ఇలాంటివి ఎన్నో చూడొచ్చు. ఇక ఏ కొంచెం చిత్రలేఖనంలో ప్రవేశం వున్నా (అవును ప్రవేశం చాలు, ప్రావీణ్యం కాదు..) ఏదో ఒక్క బొమ్మ దగ్గర నిలబడిపోయి – ఈ షేడ్ రావటానికి ఏ రంగు కలిపి వుంటారా అనో, నాలు మెలికలు తిరిగిన గీతలు మహానటి సావిత్రిగా ఎలా మారిపోయాయో అర్థంకాక ఒక చోటే నిలబడిపోయే ప్రమాదం వుంది. తస్మాత్ జాగ్రత్త..!!
ఇంత అరుదైన బొమ్మలను చూడటమే కానీ సొంతం చేసుకోలేమని బాధపడాల్సిన పనిలేదు. బాపు బొమ్మల కొలువుతో పాటు, బాపూ బొమ్మల పుస్తకాలు, ఇవే కాక అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి బాలకృష్ణుల చేతులమీద తొలిరోజు (04.06.2011) ఆవిష్కృతమైన బాపు (స్వాతి) రంగుల కార్టూన్ల సంకలనాలు రెండు దొరకబుచ్చుకోవచ్చు. ఇక బొమ్మలకొలువు ప్రత్యేకసంచికలో బాపూ బొమ్మల కొలువులో వుంచిన చాలావరకు చిత్రాలు, ప్రముఖుల విశ్లేషణలతో చూడవచ్చు.
***
నిన్నటి తొలిరోజు సభకి వెళ్ళే అవకాశం వచ్చింది. బాపుగారిని కలిసి ఆయన చిత్రమైన చేతిరాతలో నా పేరు చూసుకునే భాగ్యం నాకు కలిగింది. నిండు సభలో ఆయన “ఒంటరి”గా కూచోవడం చూసి బాధ కలిగింది. ఆయనమాత్రం “గోడలేని చిత్తరువులా మిగిలిపోయానంటూ” ఈ పుస్తకాలని రమణగారికి అంకితమిచ్చారు. ఆ మిశ్రమ అనుభూతుల్ని మీతో పంచుకునే ప్రయత్నమే ఈ వ్యాసం.
రవి
బాపు గారితో సంతకం, బాపు గారిపక్కన నిలబడ్డం, వంశీతో పక్కన నిలబడి ఫుటో, అన్వర్ వంటి సహృదయులతో పరిచయం – చాలా గుర్తుండిపోయే రోజు నాకు. అక్కడ కలిసిన అందరూనూ చాలా మామూలుగా ఉన్నారు. కళాకారులు అంత సాధారణంగా ఉంటారని ఎప్పుడూ ఊహించలేదు. ముఖ్యంగా బాపు. సంతకం పెట్టమంటే ముఖంలో కించిత్తు కూడా అసహనం ప్రదర్శించలేదు. వంశీ కూడా అంతే. ఆర్టిస్టు ఉత్తమ్ కలిసిపోయి జోకులు వేశారు. చాలా అందమైన రోజు ఆ రోజు.
gks raja
అవును! చూశాను. బొమ్మల కొలువు. బాపు బొమ్మల కొలువు.అందమైన బొమ్మాయిల కొలువు.ఆ సమయంలో తెలిసిన ప్రముఖులెవరూ కనబడలేదు గానీ, అక్కడ తిలకిస్తున్నవారంతా ప్రముఖులకన్నా గొప్పవాళ్ళయ్యి ఉంటారు. లేకపోతే, అందరికీ ఆ తన్మయత్వం ఏమిటి? పక్క వాడి స్పృహ లేకపొవడం ఏమిటి? ముందుకు జరగరేవిటి? బొమ్మల్లా అలా నిలబడిపోవడం ఏమిటి? నాకు మాత్రం ధ్యాస పూర్తిగా బొమ్మలపై కుదరడంలేదు. బాపు గారూ కాని అటు వస్తారేమో! ఆయనలో నేనెప్పుడు ఉహించని నైరాశ్యం కాని తొంగి చూస్తుందేమో అని తెగ భయపడి పోయేశాను. హద్రుష్టం!! బాపు గారు నేనున్నంతసేపు అటుగా రాలేదు. ఆయన స్నేహపూర్వక మందహాసం అలాగే నాలో ముద్రపడిన విధంగానే ఉండనీ. అయినా అంతటి స్నేహమేవిటి బాపూ! నేను కొంతలో అదృష్టవంతుణ్ణి. నీకులాగా వదలలేని స్నేహితుణ్ణి ఒక్కణ్ణి పొందలేనందుకు. ఎందుకు చెప్పు నీకులాగా స్నేహవైరాగ్యం బాధ పడడానికా! అమ్మయ్య! మొత్తం మీద బయట పడ్డాను బొమ్మల కొలువులోంచి. వాళ్ళు రాత్రీ పగలూ తెరిచి ఉంచరట మరి! అయినా బాపూ వచ్చేస్తోనో? విడిగా ఆయనను చూడడం నావల్ల కాదు బాపూ!
రాజా.
gksraja.blogspot.com
అరిపిరాల సత్యప్రసాద్
అమ్మలారా.. అయ్యలారా… వినండహో… ప్రజల కోరిక మేరకు బాపు గారి బొమ్మల కొలువు తిరిగి ఈ శనివారం మరియు ఆదివారం అనగా 11, 12 తేదీలలో మరల నిర్వహించబడుతున్నదని తెలియజేయటమైనదహో…!!! అదే వేదిక.. అవే బొమ్మలు.. రండి చూడండి.. ఆనందించండి…!!!
రవి వీరెల్లి
సత్యప్రసాద్ గారు,
వ్యాసం చాలా బాగుంది. చదివిన తర్వాత నిజంగా బాపు బొమ్మల కొలువుకు వెళ్లోచ్చినట్టుగా అనిపించింది. మీ అనుభూతుల్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు.
-రవి వీరెల్లి
సూరంపూడి పవన్ సంతోష్
మీరు అదృష్టవంతులు… మేము దౌర్భాగ్యులం.ఏ జన్మలోనో చిన్నపిల్లాడు వేసిన బొమ్మని చించి కాగితం పడవ చేసి ఉంటాను ఈ జన్మలో బాపు గారి ఒరిజినల్ బొమ్మల కొలువుకి వెళ్లే(మీరు వెళ్లారు కనుక వచ్చే అనాలా రాని పాఠకులు ఎందరో ఉంటారు కనుక వేళ్లే అనాలా..(రమణ గారుంటే చెప్పేవారు))/వచ్చే అదృష్టం లేకపోయింది. కనీసం తెలియకపోయినా తెలిస్తే వెళ్లేవాణ్ణి అని చెప్పుకునేవాణ్ణి నాకు నేను. ఈ బ్లాగులు, ఆ పేపర్లూ ఆ ఊరట కూడా లేకుండా చేసేశాయి. పోనీ లెండి ఆ పుస్తకాలైనా కొనుక్కుని తృప్తి చెందుతాను.
–సూరంపూడి పవన్ సంతోష్.