తక్కువ వేతనాల కాపిటలిజం
రాసిన వారు: ఇ.ఎస్. బ్రహ్మాచారి
ఇ ఎస్ బ్రహ్మచారి ఇంగ్లిషు అధ్యాపకులుగా పనిచేసి రిటైరయ్యారు. ఆర్థిక, సామాజిక అంశాల మీద చాలా వ్యాసాలు రాశారు.
(ఈ వ్యాసం మొదట ’వీక్షణం’ పత్రిక జనవరి 2010 సంచికలో ప్రచురితమైంది. వ్యాసాన్ని తిరిగి పుస్తకం.నెట్లో ప్రచురించేందుకు అనుమతించిన వీక్షణం సంపాదకులకి ధన్యవాదాలు – పుస్తకం.నెట్)
*********************************
గత మూడు దశాబ్దాల్లో అమెరికా కార్మికుల వేతనాలు ఎలా తగ్గుతూ వచ్చిందీ వివరించారు రచయిత. పెట్టుబడిదారులు పాలకుల సాయంతో ఎలా పట్టుదలతో సాధించిందీ, కార్మిక నాయకులు సైతం బాధ్యతల నుంచి ఎలా తప్పుకున్నదీ వివరించారు.
రష్యా,తూర్పు యూరప్ దేశాలూ పతనమయ్యాక పెట్టుబడిదారీ కార్పొరేషన్లకి దొరికే ప్రపంచ శ్రామిక శ్రేణులు రెట్టింపయ్యాయి. ఐ.ఎల్.ఓ అధ్యయనం ప్రకారం 1985 -2000 మధ్య ప్రపంచ కార్పొరేట్లకి 147 కోట్ల మంది శ్రామికులు అదనంగా దొరికారు. ఎలాగా? చైనా విదేశీ పెట్టుబడులకి తలుపులు తెరిచింది. రెండు, సోవియట్ రష్యా పడిపోయింది. మూడు, 1991లో భారత పెట్టుబడిదారీ వర్గం ఐ.ఎం.ఎఫ్.కి లొంగి విదేశీ పెట్టుబడిని స్వాగతించింది.
చైనా, భారతదేశం, పాత సోవియట్ యూనియన్, తూర్పు యూరప్ దేశాలు ద్వారాలు తెరిచాయి. దాంతో 147 కోట్ల మంది శ్రామికులు కొత్తగా దొరికారు. అప్పటికి ప్రపంచ పెట్టుబడిదారులకి 146 కోట్ల మంది శ్రామికులు అందుబాటులో ఉన్నారు. ఈ మూడు కొత్త ప్రాంతాల కలయికతో మార్కెట్‌లో పోటీ పడే శ్రామికులు రెండింతలయ్యారు. 2000లో ప్రపంచ కార్మికుల సంఖ్య 293 కోట్ల మంది. కార్మికుల సరఫరా పెరిగింది. దాంతో వేతనాలు తగ్గించే అవకాశం యజమానులకి కలిగింది. పారిశ్రామికదేశాల కార్మికులు వేతనాల విషయంలో వర్ధమానదేశాల శ్రామికులతో పోటీ పడాల్సొచ్చింది.
ఉత్పత్తి రంగంలోనూ సమాచార రంగంలోనూ డిజిటల్ యుగం తెచ్చిన పెను సాంకేతిక మార్పుల్ని ఉపయోగించుకొని భారీ కార్పొరేషన్‌లు పెద్దజీతాల ఉద్యోగాల్ని నాశనం చేయగలిగాయి.
ప్రపంచీకరణ వల్ల కార్మికుల మధ్య పోటీ పెరిగింది. అప్పటికి పోటీ దేశంలోని శ్రామికుల మధ్య ఉండేది. అంటే ఉదాహారణకి అమెరికా కార్మికుడు ఇతర అమెరికా కార్మికులతో పోటీ పడాల్సివచ్చేది. వేతనాలు అమెరికా జీవన స్థితిగతులను బట్టి ఉండేవి. ప్రపంచీకరణ వేతనాల్లో మార్పు తెచ్చింది. అమెరికా ఉద్యోగి ఫిలిప్పైన్స్ శ్రామికులతో పోటీ పడాల్సొచ్చింది. పెట్టుబడికి రెక్కలొచ్చాయి. ఏదేశానికైనా ఎగిరిపోగలదు. ఎక్కడ వేతనాలు తక్కువయితే అక్కడకు అమెరికా కంపెనీలు వెళ్లిపోయాయి. ఇండియాలో శ్రామికునికి వచ్చే ఆదాయం 10వ వంతే.
దేశ దేశాల నుంచీ ఉద్యోగాల కోసం అమెరికా చేరారు. అమెరికా కార్మికులు వీళ్లతో పోటీ పడాల్సి వచ్చింది. కంపెనీలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నాయి. జీతాలు తగ్గించాయి. గతంలో మాంద్యాలలో పోయిన ఉద్యోగాలు వికాసకాలాల్లో తిరిగి వచ్చేవి. ప్రపంచీకరణ, శాస్త్ర సాంకేతిక విప్లవం పరిస్తితుల్లో మార్పుతెచ్చాయి.1981, 1991, 2001 మాంద్యాలలో పొయిన ఉద్యోగాలు వికాసకాలల్లో మళ్లీ రాలేదు. అంతేకాదు, గుంపు తొలగింపులు కొనసాగాయి. ప్రస్తుత మాంద్యంలో తొలగింపులు ప్రమాదస్థాయిలో ఉంటాయని రచయిత అభిప్రాయం. 1973 నుంచీ 1995 వరకూ స్టీల్ పరిశ్రమలో కార్మికుల సంఖ్య 6 లక్షల నుంచీ 1,80,000కు తగ్గింది. 1980-2005 మధ్య 2 కోట్లమంది ఇతర దేశస్తులు చట్ట ప్రకారవేు అమెరికా చేరారు. ఇదే కాలంలో ఆన్‌డాక్యుమెంటెడ్ వర్కర్స్ 1 కోటీ 20 లక్షల మంది ప్రవేశించి ఉంటారని అంచనా.
2006లో ఇద్దరు పెద్దలూ, ఇద్దరు పిల్లలూ ఉన్న కుటుంబానికి ఏడాదికి ఆదాయం 20,444 డాలర్లకి తగ్గితే పేదరిక స్థాయి. అంటే ఒకరికి పూర్తి పని గంటకి 9.83 డాలర్‌లు వచ్చేది ఉండాలి. ఈ నిర్వచనం ప్రకారం అమెరికాలో 2006 లో 3 కోట్లా 65 లక్షల మంది పేదరికంలో ఉన్నారు. అంతే ఆదాయం అయితే ఏదో బతుకుతారంతే. జనరల్ మోటార్స్ ఫోర్డ్ క్రిజ్లర్ మూడూ 2008 మొదట్లో 70,000 యూనియన్ ఉద్యోగాలని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాదు. అమెరికాలో 20 ప్లాంట్లు మూసేస్తానంది. వాటిని తక్కువ వేతనాలున్న దేశాలకు మళ్లిస్తానంది. మెక్సికోలో అసెంబ్లీ శ్రామికుడికి గంటకి 3.5 డాలర్లు. అదే డెట్రాయిట్‌లో 27 డాలర్లు.
డెల్ఫి, విస్ట్యాన్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆటో విడిభాగాలు సరఫరా చేసే కంపెనీలు. డెల్ఫి అమెరికాలో దివాలా దాఖలు చేసింది. విదేశాలలో- మెక్సికో, చైనా లాంటి తక్కువ వేతన దేశాల్లో ఆ కంపెనీకి 1,15,000 మంది కార్మికులున్నారు. దాని లక్ష్యం అమెరికాలో శ్రామికుల వేతనాలు 27 డాలర్ల నుంచి 16.5 డాలర్లకు తగ్గించడం. అమెరికాలో ఉన్న 32,000 మందిని 7000కి కుదించడం. అంటే 25 వేల యూనియన్ ఉద్యోగాల్ని నాశానం చెయ్యడం.
2004 మే లో ఫొరెస్టర్ రిసెర్చ్ సంస్థ 2015 కల్లా 33 లక్షల వైట్ కాలర్ ఉద్యోగాలు విదేశాలకి వెళ్లిపోతాయని చెప్పింది. అంటే 13,600 కోట్ల డాలర్ల వేతనాలు అమెరికా నుంచి తక్కువ వేతన ప్రాంతాలకి వెళ్లిపోతాయి. అమెరికాలో ఒక కంప్యూటర్ ప్రోగ్రామర్‌కి గంటకి 60 డాలర్లిస్తే, ఇండియాలో 10 డాలర్లు చాలు అని ఆ సంస్థ చెప్పింది. ఒక నిర్వచనం ప్రకారం కీతావేతనం అంటే గంటకి 11.11 డాలర్లు, అంతకు తక్కువ. 2006లో అమెరికాలో అంతకు తక్కువ వచ్చే ఉద్యోగాలు 4 కోట్ల 40 లక్షలున్నాయి. 1973లో సగటు శ్రామికుని వారం వేతనం 581.67 డాలర్లు (2005 విలువలో). అక్కడనుంచి 1995 దాకా పడుతూ వచ్చింది. తిరిగి 2000 దాకా పెరిగి మళ్లి పడిపోయింది. 2006 లో 543.65 డాలర్లకు పడింది. అంటే 30 ఏళ్లలో వారానికి 40 డాలర్లు తగ్గింది. దీన్ని బట్టి నూటికి 80 మందికి 7 శాతం వేతనం తగ్గింది.
1981లో రొనాల్డ్ రీగన్ అధ్యక్షుడయ్యాడు. యూనియన్లని దెబ్బ తీశాడు. యజమానుల ఇష్టారాజ్యం ఏర్పరిచాడు. పునర్ వ్యవస్థీకరణని అడ్డూ ఆపూ లేకుండా ప్రోత్సహించాడు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రొలర్స్ యూనియన్‌ని విచ్చిన్నం చెయ్యడానికి సర్వశక్తులూ ఒడ్డాడు. తన ముందు అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ పేదరికాన్ని సమర్థవంతంగా అమలు పరిచాడు. 11,400 మంది కార్మికుల్ని తొలగించాడు. వాళ్లని జీవితకాలం పాటు ప్రభుత్వోద్యోగాలకి అనర్హులుగా ప్రకటించాడు. పాలకవర్గాలకి పట్టు చిక్కింది. అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. జనరల్ ఎలక్ట్రిక్ పగ్గాలు పట్టిన జాక్ వెల్చ్ 72,000 మందిని తొలగించాడు. తర్వాత ఆర్‌సిఎని కొని అందులో ముందు 51,000 మందిని తర్వాత మరొక 31,000 మందిని తీసివేశాడు. అతన్ని అందరూ న్యూట్రాన్ జాక్ అనేవారు. (న్యూట్రాన్ బాంబ్‌లాగా చట్రాలలోనే ఉంచి జనాన్ని చంపడంలో నేర్పరి అని). 1980 రికవరీ కాలంలో గుంపు తొలగింపులు (మాస్ లేఆఫ్స్) నిరాటంకంగా కొనసాగాయి. ఒక్క ఆటో పరిశ్రమలోనే 35 ప్లాంట్లు మూసివేశారు. తర్వాతి 1990 మాంద్యంలోనూ, 2001 మాంద్యం లోనూ రెండు రికవరీల్లోనూ గుంపు తొలగింపుల జోరు తగ్గలేదు. వికాస కాలంలో కూడా ఉద్యోగాలు రద్దవుతున్నాయి. కార్మికుల కష్టాలు పెరుగుతూనే ఉన్నాయి
1997 యునైటెడ్ పార్సెల్ సర్విస్ శ్రామికులు సమ్మె చేశారు. 1,85,000 మందిలో నూటికి 60 మంది పార్ట్‌టైం వాళ్లు. వాళ్లకి గంటకి 9 డాలర్లు. అదే ఫుల్ టైం వాళ్లకి గంటకి 19.95 డాలర్లు. ఫుల్ టైం ఉద్యోగాలు డిమాండ్ చేశారు. పైగా 10,000 మంది పార్ట్ టైం వేతనమిస్తూ వారానికి 35 గంటలు పనిచేయిస్తున్నారు. సమ్మె బాగా జరిగింది. పెట్టుబడిదారులు బిల్ క్లింటన్ మీద ఒత్తిడి తెచ్చారు. ప్రభుత్వం సమ్మెని తొక్కివేసేందుకు సిద్ధమైంది. ఎఎఫ్‌ఎల్-సిఐఒ నాయకులు వెనక్కి తగ్గారు. శ్రామికులంతా సమర్థించిన సమ్మె క్రమంగా ముగిసింది. ఇందుకు రచయిత నాయకుల్ని తప్పుపట్టాడు.
కార్మిక పోరాటాలు తప్ప వేతనాలని నిలబెట్టుకునే మార్గం లేదని స్పష్టంగా పదే పదే చెబుతాడు. మార్క్సిస్టు అవగాహానతో రాసిన పుస్తకం ఇది. ఆయన రచనల నుంచి చాలా చోట్ల కోట్ చేశాడు. మొదలుపెడితే చివరి దాకా చకచకా సాగిపోతుంది. ఉద్యోగులూ, కార్మికులూ, వేుధావులూ అందరూ తప్పక చదవాల్సిన పుస్తకం ఇది.
ఈపుస్తకాన్ని గురించి మరిన్ని వివరాల కోసం ఈ వెబ్సైట్లో చూడండి.
Praveen Sarma
లింక్ ఓపెన్ చెయ్యడానికి ప్రయత్నిస్తే ఈ మెసేజ్ వస్తోంది:
>>>>>
404 Error File Not Found
The page you are looking for might have been removed,
had its name changed, or is temporarily unavailable.
>>>>>
pustakam.net
@Praveen Sarma garu: తెలియజేసినందుకు ధన్యవాదాలు. వ్యాసం సంవత్సరం క్రితం నాటిది. అప్పటీకి బహుశా ఆ లంకె ఉండేదేమో. ప్రస్తుతానికి ఆ సైటులో పుస్తకం చూస్తే అమ్మకానికి ఉంది. కనుక, ఉచిత దిగుమతి ఉందో లేదో మరి. కనుక, సైటు లంకె మాత్రం ఇస్తున్నాము ఇప్పుడు.