పరికిణీ – తనికెళ్ళ భరణి
భరణి గారి వ్యాసాలు (ముఖ్యంగా – “ఎందరో మహానుభావులు”) అప్పుడప్పుడూ చదువుతూ ఉండేదాన్ని. చాలా విషయాలు తెలిసేవి, అందునా మానవభాషలో ఉండేవి కాబట్టి, నచ్చేవి. కానీ, కవిత్వం చదవడానికి సంకోచించాను. చాన్నాళ్ళ దాకా ముట్టలేదు. కవిత్వం అనగానే నాలో పుట్టుకొచ్చే భయం అందుకు కారణం అనుకుంటాను. ఇటీవలే, కినిగె.కాం పుణ్యమా అని, “పరికిణీ” కవితల్ని చదివాను. ఏది కవిత్వం, ఏది కాదు – ఇలాంటివన్నీ నాకు తెలీదు కానీ, వీటిలో కొన్ని చోట్ల ఉన్న ఇమేజరీ, అలాగే చాలా చోట్ల పదాల కూర్పూ నాకు నచ్చాయి. అంచేత, ఈ పుస్తకానికి నా వంతు ప్రచారం నేనూ ఇద్దామనీ…ఈ టపా!
మొదటి కవిత – “మధ్యతరగతి నటరాజు” లో మధ్యతరగతి వాడినీ, నటరాజునీ పోల్చిన పద్ధతి నాకు బాగా నచ్చింది. దానికోసమే దీన్ని రెండు, మూడు సార్లు చదివాను.
“విరబోసుకున్న
జటాజూటం లాంటి బెంగ
అందులో ఒక నెలవంక లాగ
లీలగా మెరిసే ఫస్టు తారీఖు”
-ఇలా సాగుతుంది కనుక, మధ్యతరగతి నటరాజు కళ్ళ ముందు కనిపిస్తాడు 🙂
“ప్రపంచం ఎప్పుడూ రెడ్ కార్పెట్టే వేసింది
నేను తారురోడ్డు మీద కాలినడకన నడుస్తున్నా!”
(గ్రాడ్యుయేట్)
-అన్నప్పుడు ఆయన ఉద్దేశ్యం ఏమిటో నాకు అర్థం కాలేదు కానీ, మామూలుగా, ఎప్పుడూ ఏదో ఒకదాని మీద కంప్లైంట్ చేస్తూ ఉండే వాళ్ళకి ఇదొక్క లైన్ చూపించాలి అని బలంగా అనిపించింది నాకు మాత్రం 🙂
“నీ కడుపు కుండలో ఉన్న విషం
నా గొంతులోకి వొలుకుతుంది
నా వెన్నముకలో దాచుకున్న కత్తి
నీ గుండెల్లోకి దిగుతుంది.
అంతే! అడ్డం భళ్ళున బద్దలుతుంది!
ఇక నువ్వు లేవు!
నేనూ లేను….!!
ఇద్దరి మధ్య కుప్పగా
హిపోక్రసీ మసి!”
(పరస్పర సర్పాలం!)
-“ఇద్దరి మధ్యా కుప్పగా హిపోక్రసీ మసి” అన్న వాక్యం అలా నా చెవుల్లో రింగుమంటూనే ఉంది. ఎన్ని సంబంధాలు ఇలా తగలడ్డం లేదు జీవితాల్లో!
సరస్వతీ, మీల్స్ రెడీ : అన్న కవిత ఆయన ఎందుకు రాసారో కానీ, ఇలా ఎప్పుడుపడితే అప్పుడు, నాకు తోచిందల్లా రాసి వదుల్తున్నాను కనుక,
“నీ రెండు గుండెల మీద
మేం కుంపట్లం తల్లీ
ఓ దానిమీద సాహిత్యపు అత్తెసరు…పలుకు… పలుగ్గా.
మరో దాని మీద
సంగీతపు సాంబారు…ఉడికీ ఉడక్కా…”
(సరస్వతీ….మీల్స్ రెడీ!)
-అన్నది నా విషయంలో అక్షర సత్యం!
మనిషి గురించిన ఈ వర్ణన కూడా నాకు చాలా నచ్చింది.
“సృష్టికర్త
పగటి కన్నీటి బొట్టు పేరు…
సూర్యుడు….
రాత్రి అశ్రుబిందువు పేరు చంద్రుడూ
మధ్యలో ఉండే
ఏడుపు పేరే…
మనిషి!”
(బిందు స్వరూపిణి!)
అక్కినేని అమల కి అంకితమిచ్చిన ఒక కవితలో, ఈ వ్యంగ్యం కూడా నాకు భలే నచ్చింది. శివభక్తుడైన భరణి గారే ఇది రాయడం మరీ నచ్చింది.
“ఏనుగు దంతం తో బుద్ధుడి బొమ్మా?
ఎద్దు కొమ్ముతో ఏసుక్రీస్తా?
సర్లే!
పులితోలు నీ దేవుడి డ్రస్సూ!
జింకతోలు మీద కూర్చుని
వాడికోసం నీ తపస్సూ!”
(చిలక ప్రశ్న)
నవరసాల భరణి – కశ్మీరాన్ని గురించిన ఈ మాటల్తో ఒక్క క్షణం నాకు మాటలేకుండా చేశాడు:
“ఆ లోయల్లో
హిమాలయాలు సైతం
మూర్తీభవించిన
వైధవ్యాల్లా ఉంటాయి”
(కుంకుం పూవు)
“కృష్ణవేణి ఆమె నెత్తి మీద నుంచి
పాయలు కట్టీ…
వెన్నుపూసల మెట్లు దిగీ
పాపికొండల్లోంచి
పాతాళానికి ప్రవహిస్తూ
అకస్మాత్తుగా
ఘనీభవించీ
జెడగంటలై మోగుతుంది!”
(-వాత్సాయని)
– కాలపురుషుడిని స్త్రీ గా ఊహించుకుని రాసిన కవితలో భాగం ఇది!! ఎంత అద్భుతంగా ఊహించారో!
నటి రేఖ గురించి రాస్తూ-
ఆమె చూపు మార్మికంగా
నవ్వు నర్మగార్భంగానూ
మాట తాత్వికంగానూ
మనిషి సామన్యంగానూ ఉంటుంది.
(రేఖ)
అంటారు.
ఇలా, వివిధాంశాలపైన, భరణి గారి కవితల సంకలనం ఇది. నవరసాల కవితలూ ఉన్నాయి. చీర గురించి రాసిన మరో కవిత కూడా నాకు చాలా నచ్చింది. అయితే, ఇలా అన్నీ కోట్ చేస్కుంటూ పోతే కష్టం కనుక, ఇక్కడికి ఆపుతున్నా. మామూలు మనుషుల భాషలో, చదవగానే కళ్ళకు కట్టే భావచిత్రాలతో ఉందీ పుస్తకం. నాకు చాలా నచ్చింది. చదవగానే, వెంటనే దీని గురించి పక్క వాళ్ళకి చెప్పాలి అని, లైన్లు కోట్ చేసేయాలి అనిపించే పుస్తకాలు కొంచెం అరుదే. నాకీ పుస్తకం అలాంటిది. ఇలా ఈ వాక్యాలు చదివిన నా స్నేహితుడు, నాలాంటి వాళ్ళ కోసమే, సింపుల్ భాషలో రాసారు అనుకుని ఈ పుస్తకం చదవడంలో ఆసక్తి కనబరిచాడు. అందుక్కూడా ఈ పుస్తకం నాకు నచ్చింది. సాధారణంగా తెలుగు పుస్తకాలు చదవని మనిషిని కూడా ప్రేరేపించింది కనుక.
పుస్తకం కినిగె.కాం లో ఇక్కడ కొనుగోలు చేయవచ్చు.
Parikini – Tanikella Bharani
Pages 64
Ebook: 90Rs.
Telugu ramudu
Tanikella Bharani
Middle class ముచ్చట padi raasukunna arakora thikamaka nana ardhala kavitha akasmathuga sivadagnaki manishayyinda……..Leka mana bhrama…. Eeee teluginti kavitha jhrumbhanam
శబ్బాష్ రా శంకరా :నాకు నచ్చిన కొన్ని తత్వాలు | పుస్తకం
[…] చేస్కుని సేవ్ చేస్కున్నా. ఆ తరువాత “పరికిణీ” చదివాను. అందులోనూ, కొన్ని చాలా […]
నెల్లూరోడు
మంచి విశ్లేషణ …..త్వరలో చదవాలి……..
lokesh
vennello challati manchulo vesavi thapanni marachi nattu ento anandangaundi
chavakiran
నాక్కూడా మధ్యతరగతి కవిత నచ్చింది. కాకుంటే మధ్యతరగతి ముందుకు వెళ్లినట్టుంది, ఆ స్థితి నుండి.