పుట్టపర్తివారి “శివతాండవం” లో నాకు నచ్చిన పదాలు, పాదాలు

పరిచయం వ్రాసిన వారు: కాశీనాథుని రాధ, డోవర్, న్యూజెర్సీ
(ఈవ్యాసం NATS వారి అమెరికా తెలుగు సంబరాలు 2011సంచికలో ప్రచురించబడింది. పుస్తకం.నెట్ కు ఈ వ్యాసం అందించినందుకు వైదేహి శశిధర్ గారికి ధన్యవాదాలు – పుస్తకం.నెట్)
**********
శ్రీ పుట్టపర్తివారి శివతాండవానికి ఇది వ్యాఖ్యానం గాని వివరణ గాని కాదు. దానిని చదివినపుడు నాకు ఆనందం కలిగించిన విషయాలను గురించి చెప్పడం మాత్రమే. ఎందుకంటే “ఈ కావ్యంలో సంగీత,నాట్య,సాహిత్య సంకేతాలు పెనవేసుకొని ఉన్నాయి. ఈ మూడింటి యొక్క సంప్రదాయాలు కొంతకు కొంత తెలిస్తేగాని ఈ కావ్యం అర్ధం కాదు” అని ఎవరో కాదు సాక్షాత్తు పుట్టపర్తివారే అన్నారు. పై మూడు విషయాల్లో మొదటి రెండింటి గురించి నాకు బొత్తిగా తెలియదు. మూడోది కూడా అంతంత మాత్రమే. అయితే నీకేం అధికారం ఉంది దీనిగురించి మాటాడ్డానికి అంటే … తెలుగు నామాతృభాష కాబట్టి, అందులోనూ “శివతాండవం” విని భాషరాని వాళ్ళే తన్మయతతో తలలూపితే, నాకు అది కొంతవరకైనా అర్ధం అయివుంటుందని నా నమ్మకము, ధైర్యము – అన్నదే నా జవాబు.

కలమెత్తి, తన గళమెత్తి “శివతాండ”వాన్ని దేశమంతటా వినిపించిన సరస్వతీపుత్ర శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు తన పాండిత్యపటిమతోను, బహుభాషాపరిజ్ఞానంతోను, కావ్యరచనాచాతురితోను, వాగ్గేయరచనాపాటవంతోను,సునిశిత విమర్శనాగరిమతోను తెలుగు సాహిత్యంలో ప్రత్యేకస్థానం సంపాదించుకున్నారు. వేదాంతగ్రంధాలు మొదలుకుని వ్యాకరణఛందోలంకార శాస్త్రాలదాకా ఆకళింపు చేసుకోవడమే కాకుండా, తాళం వేస్తూ సంగీతంలో సంగతులు తెలుసుకున్నారు, కాలికి గజ్జె కట్టి నాట్యం నేర్చారు, ఆఖరికి ముఖాన రంగువేసుకుని రంగస్థలం ఎక్కేరు. అంతేకాదు తదుపరి కాలంలో నాట్య శాస్త్రగ్రంధాలని అధ్యయనం చేసి అవగాహన చేసుకున్నారు. ఆయన ఈ నాట్య సంగీత పరిచయము, పరిజ్ఞానము “శివతాండవం”లోని ప్రతిపాదంలో ఘలు ఘల్లుమని వినబడుతుంది. వీరవైష్ణవుడైన ఈ స్వామి తెలుగులో శివతాండవాన్ని, సంస్కృతంలో శివకర్ణామృతాన్ని వ్రాయడం ఏమిటా అని అనిపిస్తుంది. దానికి సమాధానంగా శివకర్ణామృతంలో ఆయనే

“శేషశైల శిఖరాధివాసినః
కింకరాః పరమ వైష్ణవావయమ్
తత్తథాపి శశిఖండ శేఖరే
శాంకరీ మహసి లీయతే మనః “

– మేము శేషాద్రిపై కొలువైన శ్రీనివాసుని దాసులము, పరమ వైష్ణవులము, ఐనను చంద్రరేఖను శిరోభూషణంగా ధరించిన శంకరాకృతి కాంతి యందే మనస్సు లీనమౌతుంది.” అంటారు. నిజానికి పుట్టపర్తివారికి దేవుళ్ళందరూ ఒక్కటే అవడమే కాదు, ఆయన దృష్టిలో మతాలన్నీ కూడా ఒకటే.

ఆదిదంపతుల నాట్యాన్నితన మనోవీథిలో దర్శించిన భక్తుడు, పారవశ్యంతో పాడిన పాటే “శివతాండవం.” ప్రొద్దుటూరులో అగస్తేశ్వరస్వామికి నలభైరోజులపాటు ప్రదక్షణాలు చేస్తూ, స్వామి ప్రేరణతో ఆ నలభై రోజుల్లోనే ఈ కావ్యాన్ని ముగించానని పుట్టపర్తివారే స్వయంగా చెప్పుకున్నారు. ఈ కావ్యరచనకి ప్రేరణలు:

వస్తువు – చిదంబరంలో నటరాజు ఆలయంలో చూసిన శివతాండవ నృత్యం, శివకవి పాల్కురికి సోమనాధుని శివ స్తుతులు.
ఛందస్సు – కన్నడ శివకవుల రగడలు.
చేసిన ప్రయత్నం – తమిళం అభ్యసించి, తమిళ శివతాండవస్తుతుల్ని అవగాహన చేసుకోవటం.

ఆయనలో ఇంత ప్రయత్నము, ప్రేరణ, దీక్ష పోతపోసుకోవడం చేతనేనేమో నటరాజంతటి వాడిని “తాండవింపగా తరుణంబైనది ఖండేందుధరా! గదలుము నెమ్మది” అని ఆనతి ఇస్తారు. శివతాండవంలో నంది నాంది పలుకక ముందు రంగస్థలం అమరుతుంది. భగవంతుడికి లోకమంతా వేదికే. అందుకే అలలై బంగరుకలలైన మబ్బులు, వేదవాక్కులను పలుకుతూ పక్షులు, జలదాంగనలై వచ్చిన అచ్చరకాంతలు, కొమ్మలు ఆనందోత్సాహాలతో తలలూపితే, హైమవతీ కుసుమాలంకారములలో తానొకటి కావాలనే కోరికతో జలజలా రాలే పూలు, శ్రుతికలపాలని గొంతు సవరించు కొంటూ భృంగాలు, సెలయేళ్ళు, సంధ్యాదేవి, దినమణి, ఒకరనడం ఎందుకు అన్ని వైపులనుంచి “లోకమ్ముల వేలుపు నెమ్మిగ నిలబడి తకఝం తకఝం తకదిరికిట నాదమ్ములతో నృత్యమాడు“ సమయాన అందరూ సిద్ధమయ్యారు. ఇక స్వామికి, దేవికి అలంకారాలు చెయ్యాలి. సంగీతసాహిత్యాధిదేవత “భారతి యట పార్వతికి నలంకారముఁదీర్చెడునది” సకల సృష్టికి రచయత “చతురాననుడే సవదరించునట శర్వునకుత్తమ సర్పవిభూషలు“. కాని “సకల నక్షత్రములు కలాపములుగా” (భూషణాలుగా)గల వాడికి అలంకారాలు చెయ్యడం ఆ బ్రహ్మకు మాత్రం సాధ్యమా ?

సిద్ధమైన శివుని రూపాన్ని వర్ణిస్తున్నవి… ఇవి పదాలో లయబద్ధంగా కదులుతున్న శివుని పాదాలో…

“మొలక మీసపుఁ గట్టు, ముద్దుచందురుబొట్టు
పులితోలు హొంబట్టు, జిలుఁగు వెన్నెలపట్టు
నెన్నడుమునకు చుట్టు క్రొన్నాగు మొలకట్టు
క్రొన్నాగు మొలకట్టు గురియు మంటలరట్టు”

కులుకు నీలపుఁగండ్ల తళుకుఁజూపులను వర్ణిస్తూ … తమ్ములై, ఘటిత మోదమ్ములై , సుకృత రూపమ్ములై, శాస్త్ర భాగ్యమ్ములై, నవకోరకమ్ము లై ”…. “మలక మెఱుపులు కొన్ని, నిలువుమెఱపులు కొన్ని, సొలపు మెఱపులు కొన్ని, సూది మెఱపులు కొన్ని” అంటూ శబ్దాలను చిందులు తొక్కిస్త్తారు పుట్టపర్తి వారు.

“సకలభువనంబు లాంగికముగా శంకరుడు, సకలవాజ్మయము వాచికముగాగ మృడుండు“ ఆడుతున్న తాండవాన్ని వర్ణిస్తూ ..

“కిసలయజటాచ్ఛటలు ముసురుకొని వ్రేలాడ
బుసలుగొని తలచుట్టు భుజగములు బారాడ
మకరకుండలచకాచకలు చెక్కులఁ బూయ
అకలంక కంఠహారాళి నృత్యము సేయ
శృంఖలారుండములు చెలగి తాండవమాడ
శంఖావదాత లోచనదీప్తి గుమిగూడ
వలగొన్న యెముక పేరులు మర్మరము సేయ”

– ఎఱ్ఱని చిగుళ్ళలా వేలాడుతున్నాయట జటలు, బుసలు కొడుతూ కదులుతున్నాయట సర్పాలు, ఇవే కాకుండా మరి నృత్యం కోసం వేసుకున్న వేషం ఉందిగా మరి, మకరకుండలాలు కాంతులు చెక్కిళ్ళ మీద పడుతుండగా, మెళ్ళో వేసుకున్న హారాలు కూడా ఆయనతో పాటు ఆడుతున్నాయట, అంతటితో అయిపోయిందా ? మరి పుర్రెల సంగతేమిటి, బొమికల మాటేమిటి అన్నిటికి ఒకటే చిందులాట.
శూలంబున నాభీలత లేవగఁ
గీలాచయములు లేలీహానములు
ధగధగితములై నిగుడఁగ నగవులు

– పట్టుకున్న త్రిశూలం నుండి అగ్నిజ్వాలలు లేవగా, కదులుతున్న సర్పాలు ధగధగ కాంతులతో నవ్వుతున్నట్టున్నాయి.
మరి ఈ ఉధ్ధత నృత్యమేనా లేదా ఈయనకి మరొక రూపం ఉందా అంటే … శరీరంలో సగభాగం సతి ఇచ్చిన వాడికి మరో “సైడు” లేక పోవటం యేమిటి. తనలో సగభాగం తాండవమైతే మరో సగభాగం “లాస్యమైన” లాలిత్యమయింది.
“తరగలను చిఱుగాలి పొరలు లేచినయట్లు
చిరుగాలిలో తమ్మి విరులు గదలిన యట్లు
విరులలో నునుతావి తెరలు లేచినయట్లు
తెరలపై చిత్రాలు పరిఢవించిన యట్లు
మొగలి పూవులు దావి బుక్కిలించినయట్లు
తొగకన్నె నీలంపు నగవు జార్చిన యట్లు
నవ వసంత శోభ భువి గప్పికొన్నట్లు “

ఎంత చక్కటి భావమో ! చిఱుగాలి పొరలలో కదులుతున్న కమ్మని తమ్మిపూల తావులు తెరలుకట్టగా వాటి మీద చిత్రాలు “పరిఢవించాయి” అంటారు. అంటే అతిశయంతో కనబడ్డాయి. మరి శివుని ఉధృతతాండవం కదా. మొగలి పూవులు తావి పుక్కిలించటం అంటే అంతటా వేదజల్లాయని, తొగకన్నె నగవు జార్చటం శృంగారమధురభావనకు సూచనలు. అలాగే ..
“ఎలగాలిపైఁ దేలి పొలయు గీతిక వోలె
యెలపాప పెదవిపై మలయు నవ్వును వోలె
సెలకన్నె యెడదలో తలపు గలగలల వలె
చలివెలుగు వెన్నెలల మొలక తుంపర వలె “

– ఎలగాలిపై తేలి” ,”ఎలపాప పెదవిపై” అనీ, “వెన్నెలల మొలక తుంపర” అన్నచోట వెన్నెలజల్లులా కాకుండా, చిరుతుంపరలా అంటూ ఆహ్లాదాన్ని, సెలకన్నె కాబట్టి సౌకుమార్యాన్ని సూచించారు.
“నవ్వులకు కింకిణుల నాదములె ప్రతినవ్వ
నవ్వులే మువ్వలై నాట్యమున నెలుగివ్వ
నెలుగులను శ్రుతిరుతులు నెలయు నంఘ్రుల గతులు
కలిసియో! కలియకో! కడు క్రొత్త రుచి నివ్వ “

– పరమేశ్వరుని కాలి మువ్వల నాదం ఆయన నవ్వులకి వంతపాటవలె ఉన్నదట. ఆ నవ్వులే నాట్యానికి పాటగా, ఆశబ్దాల్లో ధ్వనించే వేదనాదాలు పదగతులలో కలిసో కలియకో ఒక గొప్ప ప్రకాశాన్ని ఇస్తున్నాయి.

ఇక ఏకళకైనా రసావిష్కరణే పరమార్ధం.
“కరముద్రికలతోనె గనుల చూపులు దిరుగ
తిరుగు చూపులతోనె బరుగెత్త హృదయమ్ము
హృదయమ్ము వెనువెంట కదిసికొన భావమ్ము
కుదిసి భావముతోనె కుదురుకోగ రసమ్ము

“ శిరము, గ్రీవమ్ము(మెడ), పేరురము(విశాలమైన వక్షస్థలం), హస్తయుగమ్ము(రెండు చేతులు)” వీటన్నిటితో తీర్చి దిద్దినట్టుగా చక్కని భంగిమలో ఉన్న శివుడు, “ సరిగాగ మలచిగండరువు(చెక్కిన బొమ్మ నిలబెట్టినట్టు) నిల్పిన యట్ల “ ఉన్నాడుట. మరి ఇలాగ అయ్యవారు,
“ప్రతి గజ్జెయెడదలో భావములు బులకింప
ప్రతిభావమున రసము వాఱి దిక్కుల ముంప”

– ఇలా అమ్మవారు, నృత్యం చేస్తుంటే దేవతావరులు భక్తిని గొల్వక ఏంచేస్తారు? వీతరాగులు ఋషులు వినుతులు సేయక మరేంచేస్తారు? రాసావిష్కరణకి ఇంతకు మించిన ఋజువు, ఉదాహరణ గాలించి చూసినా మరెక్కడైనా కనబడేనా? వినబడేనా?

తాళం వేస్తూ శివుని తాండవమాడించిన ఈ కవి హరిహరాద్వైతాన్ని చక్కగా ప్రతిపాదించారు. “ హరి హరుడై, లచ్చి యగజాతయై, సరికి సరి తాండవములాడ “ విష్ణువు శివుడై, శ్రీదేవి గిరిజయై నాట్యమాడగా ….
“హరునిలో హరిఁ జూచి, హరియందు హరుఁ జూచి
వెఱది దేవతలు విస్మితులు, మునులెల్ల
రధిగతానంద భావావేశచేతస్కు
లెదవిచ్చి యుప్పొంగి, యెగిరి స్తోత్రము సేయ
భేదవాదములెల్ల బ్రిదిలిపోవగ సర్వ
మేదినియు నద్వైతమే బ్రతిధ్వనులీన “

– శివుడిలో విష్ణువుని, విష్ణువులో శివుడిని చూసిన దేవతలు ఆశ్చర్యపోయారట, వికసించిన హృదయాలతో, ఉప్పొంగే ఆనందంతో మునులు స్తోత్రాలు చేసారుట. భేదాలన్ని సమసి పోయాయట. అప్పుడు అద్వైతమే అంతటా వినబడింది.
“హరుఁ జూచి హరి నవ్వె, హరుఁడె హరియైనవ్వె, విరిసికొనె నొక వింత వెన్నెలలు లోకముల” “భూతేశ! భూతభావాతీత! ” యని పల్కి స్తోత్రములఁ బఠియింప చోద్యమున వైకుంఠుడు” – విష్ణుమూర్తి వింతగా శంకరుడిని స్తుతి చేయగా..
“శౌరి నీతేజమే సంక్రమించెను నన్ను, పూరించె తాండవము పూర్ణ చిత్కళతోడ” నని “నిటాలమునందు హస్తమ్ములను మొగిచి వినతుడై శంకరుడు విష్ణువును నుతింయించె” – ఈశ్వరుడేమో “నీ తేజస్సే నాలో ప్రవేశించి, నాతాండవ కళని పరిపూర్ణం చేసింది.” అంటూ వినయంతో ఆ మాధవుని కీర్తించాడు. మరొక చోట శివుని నాట్యభంగిమని వర్ణించటంలో … ఆ శివుడు, తనకు విష్ణువుకి అభేదాన్ని ప్రకటిస్తూ వామనావతారాన్ని మరొకసారి చూపుతున్నట్టుగా ..
“ఒకకాలు దివిఁగొల్వ నొకకాలు భువినిల్వ” – తాండవమాడుతుంటే, కలలెల్ల నిజములై కానుపించటం సబబే కదా !

పరమేశ్వరుడి లీల చిత్రమైనది. ఆయన నాట్యతాండవకేళిలో ఆకాశం కళ్ళు విప్పి ఆశ్చర్యంతో తొంగి చూస్తోంది, నదులన్నీ మది పొంగి తాము కూడా నటింపసాగాయి. “భావమే శివుడుగా బ్రమరి చుట్టెడు భంగి భూవల యమెల్ల మదిఁ బొంగి యాడెడు భంగి“ భూమికే హృదయం ఉప్పొంగి ఆడింది. తన నాట్యాన్ని చూసి మునులు, సకల దేవతలు, దిక్కులు, చుక్కలు ఆదిగా గల సమస్త సృష్టి పరవశిస్తే… మరి ఆ పరమశివుడు తానేమయ్యాడు..
“యెక్కడను దన నాట్యమే మాఱుమ్రోయంగఁ
తానె తాండవమౌనొ ! తాండవమెదానౌనొ!
యేనిర్ణయము దనకె బూని చేయగఁ రాక!
దామఱచి, మఱపించి తనుఁ జేరినవారి “

-తనే నాట్యమో, నాట్యమే తానో అన్న విషయాన్ని తేల్చుకోలేక తన తాండవలీలలో తానే మగ్నం అయిపోయాడు, తనను జేరిన వారిని కూడా మగ్నుల్ని చేసాడు.

“ఒకసారి దను మఱచు నుప్పొంగు నాట్యమున
నొకసారి మఱపించు నూది, తాండవకళనె”
– ఒకసారి హృదయం పొంగగా నాట్యకళలో తాను మైమఱచిపోయి, మరొక సారి తాండవ కళనే తన నేర్పుతో మైమరపిస్తాడు. ఆ ప్రతిభను చూచి భరతముని పరమానందంతో ఆ పరమశివుని పాదపద్మాలు పట్టి “హరహరా!” యని తూగిపోతాడు. బ్రహ్మ ఈ సృష్టికి తను కర్తని అన్న గర్వం తొలగి కళ్ళనీళ్ళు పెట్టుకుని స్తబ్దుడై నిలబడతాడు.

“తనవేయి కనులు జాలని బిడౌజుడు, గౌతముని శాపమున గొఱంతను గూర్చి చింతింప”
– తనకున్న వేయికనులు శివతాండవ వైభవాన్ని చూడటానికి చాలకపోగా… ఇంద్రుడు తనకు “ వేయి కన్నులని మాత్రమే” ఇచ్చిన గౌతముని శాపంలోని లోపాన్ని గురించి బాధపడతాడు. ఇంత కన్నా అద్భుతం మరెక్కడుంది?

ఇక పార్వతి లాస్యమో…
“తెగ మిగులు దొగల జిగి బుగులు గన్నులదోయి
నిగనిగలు మిట్టింప నిలచి చూచెను గౌరి
నిలుచు వాలకములో నెలవంపు, వంపులో
కులికినది యమృతమో, కోటిసౌందర్యాలొ “

– గౌరి కన్నుల వెలుగు నిండగా నిలబడిన తీరు “నెలవంపు” అయితే, మరి కులికేది, ఒలికేది అమృతం కాక మరొకటి ఎలా అవుతుంది? ఆ శాంకరి తానే నెలవంక అయినప్పుడు, కళలనెలవైన చోట కోటి సౌందర్యాలు కాక మరేం తోస్తాయి?

“లలితముగఁ బలికినది మొలనూలు, కోయిలలు
జిలుఁగుగొంతుక తీపి జలజలా పారించి,
యావాకలో నిల్చె నాగమాంబురుహమ్ము
లావిరులపై నాడె నానందబ్రహ్మమ్ము!“

-ఇలా శబ్దార్ద్ధాలు రెండు పార్వతి పరమేశ్వరుల్లా కలిసిపోయినపుడు రసావిష్కృతి ఒక్కటే దానికి ఫలితం అవుతుంది. “ ఏమానందము భూమీతలమున శివతాండవమట శివలాస్యంబట “ అంటూ శివుని తాండవంలోని, పార్వతి లాస్యంలోని ఊహాతీతానందాన్నితాను అనుభవించి, అందరికి అందించిన పుట్టపర్తివారు ధన్యజీవులు. శివతాండవం జర్మను,హిందీభాషల్లోకి అనువదించబడింది. “నా పుస్తకాల్లో నాకు ఎక్కువ ఖ్యాతిని తెచ్చింది శివతాండవమేనని చెప్పవచ్చు. ఇతర భాషలవారు కూడా, తెనుగు రాని వారు కూడా, దీన్నివిని ఎంతో మెచ్చుకున్నారు. దానిలోని “లయ” వాళ్ళ నంతగా ఆకర్షించి ఉంటుందనుకుంటాను” అన్న మాటల్లో ఇది “లయ” ప్రధానంగా కల కావ్యం అని పుట్టపర్తి వారే నిర్ధారణ చేసారు. నా మటుకు “లయబద్ధమైన సౌందర్య సృష్టి కవిత్వం (The rhythmic creation of Beauty )” అన్న ఎడ్గర్ ఆలెన్ పో కవిత్వ నిర్వచనానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ లేదేమో అనిపిస్తుంది.

ఆ మధ్య “పొద్దు” ఆన్ లైన్ పత్రికలో, శ్రీ చంద్ర మోహన్ గారు “పుట్టపర్తి వారితో నా పరిచయ స్మృతులు” అన్న వ్యాసంలో “ శివతాండవం చదవకుంటే తెలుగు సాహిత్యంలో ఒక గొప్ప రచనను మీరు కోల్పోయినట్లే. ఒక గొప్ప అనుభూతి మీ అనుభవంలోనికి రానట్లే. చదవండి. గట్టిగా చదవండి. లయబద్ధంగా చదవండి. లయ అందులోనే ఉంది. మీరు చెయ్యాల్సిందేమీ లేదు. చదవడమే ! ఆ ఆనందాన్ని అనుభవించండి.” అంటారు. నిజానికి ఈ మాటలు శివతాండవం చదివిన ప్రతి ఒక్కరు అనేవి, అనవలసినవి. (పొద్దు.నెట్ లంకె ప్రస్తుతం పనిచేయడంలేదు)

********
శివతాండవం రేడియో సంగీత రూపకాన్ని మాగంటి.ఆర్గ్ సైటులో ఇక్కడ వినవచ్చు. ఇక్కడ పీడీఎఫ్ దిగుమతి చేసుకుని చదవవచ్చు. పుట్టపర్తి వారి గురించి వారి కుటుంబసభ్యులు నడుపుతున్న బ్లాగు ఇక్కడ చూడవచ్చు. ఆయనపై ఆంగ్లంలో ఉన్న మరొక వెబ్సైట్ ఇదిగో.

You Might Also Like

5 Comments

  1. srivani

    please put a audio or vedio file of siva thandavam . we are unable to sing

  2. Narayanaswamy

    చాలా బావుందండి. అద్భుతమైన కావ్యానికి చక్కని పరిచయం.

  3. రవి

    శివతాండవ కావ్యం – కావ్యస్థాయిని మించి స్తోత్రస్థాయిని చేరుకున్న రచన. ఒకానొక తాదాత్మ్య దశలో వెలువడిన భావనాస్రవంతి తప్ప బుద్ధితో ఆలోచించి, కూర్చిన రచన గా ఇది అగుపించదు. ఈ కావ్య సౌందర్యాన్ని అర్థం చేసుకోనవసరం లేదు. గొంతెత్తి పాడుకుంటే చాలు. ఒక ఘాటైన శబ్ద పరిమళం మనసులను వివశుల్ని చేస్తుంది.


    మొలక మీసపుఁ గట్టు, ముద్దుచందురుబొట్టు
    పులితోలు హొంబట్టు, జిలుఁగు వెన్నెలపట్టు
    నెన్నడుమునకు చుట్టు క్రొన్నాగు మొలకట్టు
    క్రొన్నాగు మొలకట్టు గురియు మంటలరట్టు


    ఈ విధమైన అంత్యానుప్రాసాభిమానం పుట్టపర్తి వారి మిత్రులు విద్వాన్ విశ్వం గారికీ ఉందనుకుంటాను.


    కలమపాలికల యాలలమేటి పాటల జుమ్మని మ్రోయు మించులసితారు,
    తెనుగుపెద్దన్నల గొనబుపల్కుల గుబాళించిన జాజిమల్లెలగుడారు,
    జిలుగుజరీబుటావలువ సింగారింపు మెలకువలూర్చు నిగ్గులకొఠారు,
    తలకు మించిన సత్యముల లోతులను జీల్చి కొనివెళ్ళు తెల్వియంచులకఠారు

    ..


    బహుశా పోతన గారి ప్రభావం కావచ్చు.

  4. వీరభద్రం

    “శేషశైల శిఖరాధివాసినః
    కింకరాః పరమ వైష్ణవావయమ్
    తత్తథాపి శశిఖండ శేఖరే
    శాంకరీ మహసి లీయతే మనః “

    మేము శేషాద్రిపై కొలువైన శ్రీనివాసుని దాసులము, పరమ వైష్ణవులము, ఐనను చంద్రరేఖను శిరోభూషణంగా ధరించిన శంకరాకృతి కాంతి యందే మనస్సు లీనమౌతుంది.” అంటారు. నిజానికి పుట్టపర్తివారికి దేవుళ్ళందరూ ఒక్కటే అవడమే కాదు, ఆయన దృష్టిలో మతాలన్నీ కూడా ఒకటే.>>>>>>

    ఈ శివ కర్ణామృతము బహుశః లీలాశుకుని కృష్ణ కర్ణామృతము తరహాలో వ్రాయబడి ఉంటుంది.ఈ లీలా శుకుడు నిజానికి శైవుడు. కాని కృష్ణ కర్ణామృతములో ఇలా అంటారు.

    శైవావయం న ఖలు తత్ర విచారణీయమ్
    పంచాక్షరీ జప పరా నితరాం తథాపి
    చేతో మదీయ మతసీ కుసుమావభాశమ్
    స్మేరాననం స్మరతి గోప వధూకిశోరమ్

    “మేము శైవులము.మాకు పరమ శివుడంటే మహా ప్రీతి.మేము పరమ భక్తితో శివుణ్ణి ఆరాధిస్తాం.కానీ చెప్తున్నది కృష్ణుని గురించి కదా అనే ఆలోచన అవసరం లేదు.మేము ప్రతి క్షణం పంచాక్షరీ మహా మంత్రాన్ని ఉపాశన చేస్తూ ఉంటాము.కాని మా మనస్సెప్పుడూ అవిసి పువ్వు కాంతితో భానిల్లే వాడు,నవ్వుతున్న మోము కలవాడు అయిన గోప కాంతకి పుట్టిన చిన్ని కృష్ణుని గురించే ఆలోచిస్తూ ఉంటుంది.”

    రాయల వారి గురువులైన తాతాచార్యుల వంశంలో పుట్టిన ఈ వీర వైష్ణవుడు లీలా శుకుని లాగానే తన శివ భక్తిని తద్వారా తనకు గల శివ కేశవుల అభేదాన్ని చమత్కారంగా తెలియజేశారు.

  5. సూరంపూడి పవన్ సంతోష్

    పుట్టపర్తి వారి “శివతాండవం” గ్రంధరచనకు గాను వారికి ఙ్ఞానపీఠ పురస్కారం వచ్చే అవకాశం ఏవో కారణాల వల్ల తప్పిపోయి సినారె “విశ్వంభర”కు లభించిందని విన్నాను. ఆ పురస్కారం వస్తే వచ్చే నగదుతో ఒక గ్రంధాన్ని ప్రచురించుకోవాలనే ఉద్దేశంతో ఉన్న పుట్టపర్తి నారాయణాచార్యులు ఆయన చివరిదశలో ఆ పుస్తకం ప్రచురించుకోలేక చాలా బాధపడ్డార్ట.

Leave a Reply