పారిస్ నగరం – కొన్ని పుస్తకాల షాపులు
ఈమధ్యే, ప్యారిస్ నగరం లో మూడురోజులున్నాను. ఇక్కడికి వెళ్ళే ముందు – తప్పకుండా రెండు పుస్తకాల దుకాణాలను సందర్శించాలని అనుకున్నాను – వాటి గురించి ఇదివరలో విని ఉండడం వల్ల. అయితే, వీటితో పాటు, కొన్ని వీథి కొట్లను కూడా అనుకోకుండా చూసాను. సమయాభావం వల్ల, ఎక్కడా ఎక్కువసేపు గడపలేక పోయాను, ఎక్కడా ఏమీ తెలుసుకోలేకపోయాను. కానీ, వివిధ కారణాల వల్ల అన్నీ గుర్తుండిపోయాయి. అందుకే, ఈ అనుభవాల గురించి ఈ టపా.
మొదటిది – షేక్స్పియర్ అండ్ కో. పారిస్ లో “కిలోమీటర్ జీరో” వద్ద ఉన్నదీ దుకాణం. 1951 లో జార్జి విట్మన్ ఈ పుస్తక దుకాణం స్థాపించారట. ఇప్పటికీ అదే భవనంలో ఉందీ దుకాణం. నిజానికి, కింది భాగం పుస్తకాల షాపు, పై భాగంలో పాత పుస్తకాలు, టైపు రైటర్లు వగైరాలతో – మ్యూజియం వంటిది ఉందట. అక్కడ కావాలంటే ఆ పాత పుస్తకాలు తిరగేయొచ్చట, ఆ టైపు రైటర్ల దగ్గర కూర్చుని టైపు కొట్టొచ్చట. కానీ, నేను వెళ్ళిన రోజు పైన ఏదో రిపేరు జరుగుతోందని ప్రవేశం రద్దు చేసారు. కనుక, నేను చూడలేకపోయాను. ఇక లోపలికి వెళ్ళగానే, నాకు ఎందుకోగానీ, సెలెక్ట్ బుక్ షాప్ గుర్తు వచ్చింది. ఎందుకూ? అంటే సమాధానం చెప్పలేను. బహుసా – ఆ “ఓల్డ్ లుక్” వల్ల కావొచ్చు. ఆ పుస్తకాల అమరికలో మనకి కావలసినవి వెదుక్కోవడం కొంచెం కష్టం కానీ, అదొక ఆనందం. కొత్త పుస్తకాలతో పాటు, కొంత తక్కువ ధరలకి, సెకండ్ హ్యాండ్ కాపీలు కూడా లభ్యం. అలాగే, మనం కూడా మన వద్ద ఉన్న పాత పుస్తకాలు వీళ్ళకి ఇవ్వొచ్చట (అమ్మొచ్చట). వీరు 1967 లో “ది ప్యారిస్ మేగజీన్” అన్న సాహిత్య పత్రిక మొదలుపెట్టారట. అది ఇంకా వస్తోంది. ఇటీవలే “ప్యారిస్ లిటరరీ ప్రైజ్” పేరిట, కొత్త రచయితలను ప్రోత్సహించడం కోసం ఒక అవార్డు స్థాపించారు.
రెండవది: “గాలిగ్నని“: “The first english bookstore established on the continent” అని చెప్పుకుంటారు వీరు. అసలు నిజానికి ఆ క్యాప్షన్ చూసే అర్జెంటుగా దీనికి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నది. 1520 లో సిమోన్ గలిగ్నని అన్న వ్యక్తి వెనిస్ నగరంలో ఒక లాటిన్ వ్యాకరణ పుస్తకాన్ని ప్రచురించాడట. ఆ తర్వాత క్రమంగా ఎదుగుతూ, కొన్ని సంవత్సరాల తరువాత, మొదట లండన్ కి, ఆపై ఆఖరుకి 1801 లో పారిస్ కి వచ్చి “గలిగ్నని” పుస్తకాల దుకాణం స్థిరపడింది. ఇంగ్లీషు పుస్తకాలకి ఇప్పుడు కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఈ షాపులో. ఈ రెండునెలల్లో అడపా దడపా కొన్నా, కొనకపోయినా, పుస్తకాల దుకాణాల్లోకి వెళ్తూనే ఉన్నాను. ఎక్కడా ఇన్ని ఇంగ్లీషు పుస్తకాలు చూడలేదు. పుస్తకాలన్నీ వర్గాల వారీగా చక్కగా అమర్చారు. కొన్ని పుస్తకాలు ఒకటి -రెండు యూరోలకి సేల్ లో కూడా అమ్ముతారిక్కడ! (ఐరోపాలో పుస్తకాల రెట్లు చూసాక, అలాంటి సేల్ ఎక్కడుంటుందో గమనించడం అలవాటు ఐపోతోంది లెండి!). అయితే, ఇక్కడ ఒకే ఒక్క విషయం నాకు నిరాశ కలిగించింది. నేను ఇక్కడికి వెళ్లేముందు – ఇది ఏ సెలెక్ట్ బుక్షాపు లాగానో, సుధా బుక్ హౌస్ (బెంగళూరు) లాగానో ఉంటుందని అనుకున్నాను. ఇది చూస్తే ఆధునికంగా, మొన్న మొన్న పెట్టినట్లుగా ఉంది. బహుసా, వీరు పైన చెప్పిన షేక్స్పియర్ వారిలా కాక, ఎప్పటికప్పుడు షాపు స్వరూపం మారుస్తున్నారు అనుకుంటాను.
మూడవది: ఒకటి కాదు. ఒక ఇరవై అన్నా ఉంటాయి. సీన్ (Seine) నదీ తీరంలో, పలు చోట్ల ఫుట్పాత్ పై వెలసిన పుస్తకాల షాపులు. ఇక్కడ పాత పుస్తకాలు మొదలుకుని, బ్లాక్ అండ్ వైటు ఫోటోల దాకా, చాలా ఉన్నాయి. అయితే, ఈ పుస్తకాలన్నీ చాలామటుకు ఫ్రెంచిలో ఉన్నవి కనుక, నాకు అర్థం కాలేదు. కానీ, చూపులకి చాలా పాత పుస్తకాల్లా అనిపించాయి. అలాగే, భాష సమస్య వల్ల, ఎవరినన్నా కదిలించాలన్నా భయమేసింది (కదిలించి, ఒకవేళ వాళ్ళు స్పందించాక, నాకు ఫ్రెంచి రాదు అన్నా, నేను కొనడానికి రాలేదు అన్నా – ఏమౌతుందో అని!). కానీ, నాకు హైదరాబాదు కోటీలో ఒకప్పుడు రోడ్డు మొత్తం నింపేసిన కాలేజి పుస్తకాల వాళ్ళు గుర్తొచ్చారు (ఇప్పుడు సబ్వేలో ఉంటున్నారు అనుకుంటాను పాపం!). అబిడ్స్ సండే మార్కెట్ కూడా గుర్తొచ్చింది.
నాలుగవది – యాదృచ్చికంగా కనబడ్డా, వీటన్నింటికంటే నన్ను ఆకర్షించినది – నా స్నేహితుల ఇల్లు ఉండే ప్రాంతం లో రోడ్డుపై పరిచిన ఒక ఫుట్పాత్ షాపు. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే, ఉన్న పుస్తకాలు బహు స్వల్పం కానీ, బోలెడు భాషల్లో ఉన్నాయి. అందులో, హిందీ, ఉర్దూలు కూడా ఉన్నాయి. ఒకే పుస్తకం పలు భాషల్లో ఉంటుందంట ఇక్కడ. ఎ పుస్తకం? అన్నది తరుచు మారుస్తారు అనుకుంటాను. “చోటా రాజ్కుమార్” అన్న హిందీ అనువాదం చూపిస్తూ, ఇది ఇండియాదే కదా? అనో ఏదో అడిగాడు ఆయన. నా స్నేహితురాలు ఏదో చెప్పింది – అదీ నేను వినలేదు. రాత్రి పదకొండు ప్రాంతంలో కూడా తెరిచి పెట్టుకుని, నవ్వుతూ కూర్చుని ఉన్న ఆయన ఓపికకి జోహార్లు. నేను చెప్పిన వివిధ భాషల అనువాదాలు కుడివైపు కింది వరుసల్లో ఉన్నాయి. (నా సెల్ఫోన్ అనుమతించినంత మేరకు తీసాను)
వీక్షణం-8 | పుస్తకం
[…] Wound – అనితా నాయర్ నవల గురించి వ్యాసం, Paris కు చెందిన Shakespeare & Co bookshop గురించి ఒక […]
sujata
The Paris I have seen is very down to earth. I hope you will come up with the stories of each bridge (on the regular tours that visitors see) in your blog. (Becoz u are there, U might run into some more legends.)