వైవిధ్య భరితం, జొన్నవిత్తుల కథా కథన శిల్పం
రాసిన వారు: కవిత పలమనేరు
******************
పుస్తకం పేరు ‘ ది డెత్ ఆఫ్ లాస్ట్ ఇండియన్’.
ముఖచిత్రం చూస్తే, రెడ్ ఇండియన్ దారు శిల్పం.
ఎందుకిలా?
ఇదీ నాకు వచ్చిన సందేహం.
దాన్ని నివృత్తి చేసుకోవడానికే ఆ పుస్తకం కొన్నాను.
అందులోని ‘ ది డెత్ ఆఫ్ లాస్ట్ ఇండియన్’ కథ చదివాక గానీ, ఆ పుస్తకానికి ముఖ చిత్రంగా రెడ్ ఇండియన్ దారు శిల్పాన్ని ఎందుకు వేశారనేది అర్ధం కాలేదు. ప్రపంచీకరణ పర్యవసానంగా మనకి తెలియకుండానే మనకి మనం పరాయివారిగా ఎలా మారిపోతున్నామో తెలియజేస్తుంది ఈ కథ. మనకంటే వందల సంవత్సరాల క్రితమే పరాయీకరణం చెంది చివరికి తన ఉనికినే కోల్పోయిన స్థానికతని సూచించడానికే ఆ ముఖ చిత్రం ఎంచుకున్నారు. ఈ ముఖ చిత్రం లాగే ఆయన రాసిన కొన్ని కథల్లో కూడా ఒక కథని చెబుతూ మరో కథని సూచించడం గమనించవచ్చు. ఇది ఈ రచయిత కథా కథన శిల్పం లోని ప్రత్యేకత.
దీనికి ముందు మాట రాసిన మధురాంతకం నరేంద్ర ఈ రచయితని గురించి ‘ చిత్తూరు జిల్లాకి ఒక సహజమయిన ‘outsider – insider ‘ గా పేర్కొనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే, ఈ రచయిత పశ్చిమ గోదావరి జిల్లాలో పుట్టిన వాడు. చిత్తూరు జిల్లాలోని పాపిరెడ్డిగారి పల్లెలో కొంతకాలం నివసించారు. ఆయన రాసిన ‘ వలస దేవర ‘ నవలకీ ఈ కథా సంపుటిలోని చాలా కథలకీ కేంద్ర స్థానం ముష్టూరే. ముష్టూరు అంటే పాపిరెడ్డి గారి పల్లెకి పూర్వ నామం.
ఎక్కడి పశ్చిమ గోదావరి ? ఎక్కడి చిత్తూరు ?
ఇక్కడినించీ వెళ్లి అక్కడి మాండలికాన్ని పట్టుకోవడం, అక్కడి సామాజిక, ఆర్ధిక, సాంస్కృతిక జీవనంలో మమైకం కావడం, అక్కడి ప్రజల సమస్యలనీ వాటి మూలాలనీ అర్ధం చేసుకుని వాటికి సాహిత్య స్థాయి కల్పించడం అంత సామాన్యమయిన విషయం కాదు. దాన్ని మించిన విశేషం ఏమిటంటే, ఈ రచయిత ఈ టీవీ కన్నడ చానెల్లో కన్నడ రచయితగా ఉద్యోగం చెయ్యడం. ఈ రెండింటినీ మించిన విచిత్రం ఏమిటంటే, ఈయన చదివింది పదోతరగతే అయినా, ఎల్కేజీ నించీ టెన్త్ క్లాస్ వరకూ కాన్వెంట్ స్కూల్ నడపడం, పిల్లలకి విద్యా బుద్ధులు నేర్పడం, విద్యారంగాన్ని గురించి వ్యాసాలు రాయడం. బహుశా ఆయన సాహిత్య వ్యాసంగం ఇలా స్పష్టమయిన ప్రయోజనాన్ని ఉద్దేశించి ప్రారంభం కావడం వల్లనే ఆయన కథలు కూడా బాధ్యతాయుతమయిన భూమికని నిర్వహించాయనిపిస్తుంది.
ఆయన జీవితం కూడా ఆయన కథల్లాగే వైవిధ్య భరితంగా కనిపిస్తుంది. ఈ కథా సంపుటిలో ఉత్తయ్య సింహాసనం, మెకాలే మంచాలు, పంచన్ లామా, పావు, లెక్కలు, బ్లేడు ముక్క కథలు ఉపాధ్యాయులందరూ తప్పక చదవ వలసిన కథలు. మరీ ముఖ్యంగా ‘ఉత్తయ్య సింహాసనం’ కథని చదువుతూంటే గుజరాతీలకి గిజూభాయ్ భగేకా, బెంగాలీలకి రవీంద్రనాథ టాగూర్లు గుర్తుకి వస్తారు. మనకి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ పండితులు గుర్తు రావాలి. ఒకవేళ గుర్తు రాకపోతే ఈ కథ గుర్తు చేస్తుంది. ఇది ఔత్సాహికులయిన ఉపాధ్యాయులందరికీ విద్యా బోధనలో ఒకానొక కొత్త దృక్పథాన్ని సూచిస్తుంది. పాత్రికేయులు బుర్రా శ్రీనివాస్ అన్నట్టు ఈ కథని విద్యా విధాతలందరిచేత వల్లె వేయించాలి. ‘మెకాలే మంచాలు’ చైతన్య స్రవంతి ధోరణిలో సాగిన ఒక ఉపాధ్యాయుడి అంతర్మధనం. దీన్ని చైతన్య స్రవంతి ధోరణి అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే, చైతన్య స్రవంతిలో ఇంతసేపు ఒకే అంశం చుట్టూ ఆలోచనలు పరిభ్రమించడం అనేది అసంభవం. ఇది విద్యా వ్యాపార సంస్థల డొల్ల తనాన్ని ఎండగడుతుంది. పంచన్ లామా, పావు, లెక్కలు కథలు మూడూ, మూడు విభిన్నమయిన వస్తువులతో దళిత కోణంలోంచీ విద్యా వ్యవస్థని నిలదీస్తాయి.
‘పంచన్ లామా ‘ కథ ఉపాధ్యాయుల్లో కరడుగట్టిన కులాహంకారాన్ని ప్రశ్నకి గురిచేస్తుంది. ఈనాటికీ మన ఊళ్లలో, తేన్సన్ అలియాస్ పంచన్ లామా అనబడే తేనే వెంకట రమణ లాగా టీచర్ల నిక్ నేమ్స్ బారిన పడని విద్యార్ధుల సంఖ్యని వేళ్ళమీద లెక్కించవచ్చు.’ పంచన్ లామా’ అనే పేరు వెనక ఒక కులాన్ని వెక్కిరించే మేధో పరనయిన ఇంత పెద్ద కుట్ర వుందని తెలిస్తే లామాలందరికీ ‘తాము హైందవాన్ని వీడిపోయి వందల ఏళ్ళు గడిచినా దాని తాలూకూ నీలినీడలు ఇలా కూడా పడే అవకాశముందా ? ‘అని జుట్టు పీక్కుంటారు.
‘పావు’ కథలో ఒక టీచర్ తన వృత్తిని అడ్డు పెట్టుకుని తన దగ్గరకి చదువు చెప్పించుకోవడానికి వచ్చిన పన్నెండేళ్ళ అమ్మాయిని లోబరుచుకునే ప్రయత్నం చేస్తాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి వచ్చిన ఆ అమ్మాయి తండ్రి అతనిపై చెయ్యి చేసుకుంటాడు. ఆ సన్నివేశాన్ని అతనికి శత్రువయిన మరో అగ్ర కులస్థుడు చూస్తాడు. అతను, ఆ టీచర్ పుట్టిన కులాన్నీ దానికి చట్టం కల్పించిన భద్రతా పరమయిన అదనపు సౌకర్యాలనీ అడ్డు పెట్టుకుని తన శత్రువుపై పగ తీర్చుకోవడానికి పూనుకుంటాడు. మనుషులు బలహీనతల చేతుల్లోనూ, బలహీనులు బలవంతుల చేతుల్లోనూ, స్త్రీలు పురుషుల చేతుల్లోనూ, దళితులు అగ్ర వర్ణాల చేతుల్లోనూ, చట్టం వీళ్ళందరి చేతుల్లోనూ పావులని నిరూపించే ఈ కథకి తెలుగు సాహిత్యంలో లభించ వలసిన గౌరవం లభించ లేదు.
‘లెక్కలు’ కథలో ఒక దళిత యువకుడిని ఒక అగ్రకులస్తుడు ఎన్ని రకాలుగా వేధించగలడో అన్నిరకాలుగానూ వేధిస్తాడు. కానీ ఆపత్సమయంలో ఆ యువకుడు తన ధర్మాన్ని నిర్వర్తించడంలో ఏ మాత్రం వెనుకాడడు. మన సమాజంలోని సంకీర్ణతని అర్ధం చేసుకోవడానికి ఈ కథ ఎంతగానో ఉపయోగిస్తుంది. అలాగే మానవ సంబంధాలని కులం ఎలా విడదీస్తుందో, మానవత్వం ఎలా కలుపుతుందో కూడా ఈ కథ వివరిస్తుంది. అయ్యవారు తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవడం ద్వారా దళిత అస్తిత్వాన్ని శిఖరాయమానం చెయ్యడంతో ఈ కథ సంపన్నం అవుతుంది. బహుశా ఇలాంటి కథలని చదివాకే పలమనేరు బాలాజీ ఈ రచయిత పరిచయ వ్యాసానికి ‘ఒక రాజనీతిజ్ఞుడి కథలు’ అనే శీర్షికని పెట్టారనిపిస్తుంది. విద్యలో విజ్ఞానంతో బాటు వికాసానికి ఇవ్వవలసిన స్థానాన్ని ఇవ్వకపోవడం వల్ల కలిగే విపరిణామాలని కళ్ళకి కట్టే కథ’ బ్లేడుముక్క’. ఇందులో చెప్పిన కథ ఎంత వుందో దాన్ని చదివాక అర్ధం చేసుకోవలసిన కథ కూడా అంతకంతా వుంది.
ఇందులో ఇంకా, నిమ్న కులాలవారిని అగ్ర వర్ణస్తులు తమ రాజకీయ నిచ్చెనలు ఎక్కే క్రమంలో ఎలాంటి జీతం బత్తెం లేని సైనికులుగా ఎలా తయారుచేసుకుంటారో తెలియజేసే తునకలు, ఆధిపత్య కులాల మధ్య ఉన్నట్టుగానే దళితుల మధ్య కూడా ఎంత దూరముందో ఆ దూరాన్ని ఎలా దగ్గర చెయ్యగలరో తెలియజేసే సిద్దులమర్రి, అలవాటులేని వాణిజ్య పంటలని పండించి మెల్లగా వ్యాపారంలోకి అడుగుపెట్టి ఆ తెలియని ప్రపంచంలో ఉనికిని నిలబెట్టుకోలేక ఉత్త చేతులతో నిలబడిన రైతు చేతిలో నిశ్శబ్ద హింసకి గురయిన స్త్రీ జీవితాన్ని ఆవిష్కరించే తక్కాళి, తెలుగు భాష గురించి వేదనతో రాసిన తెలుగు పతాకం, దళితుని అంతరంగ మధనంగా సాగే చైతన్య స్రవంతి ధోరణిలో కథనం చేసిన వైతరణి కథలు దేనికవే వైవిధ్యవంతమయిన కథా వస్తువులతో మన్ని ఆలోచించేలా చేస్తాయి.
ఇందులో ప్రత్యేకంగా ప్రస్తావించ వలసిన కథలు వంజే, బిత్తల బోకి. ఒక పల్లెటూరి సామాన్య రైతు కుటుంబంలోని రెడ్డెమ్మ, పురుషాహంకారాన్ని ఎంతో సహనంతో భరిస్తుంది. స్త్రీకి భూదేవంత సహనం ఉంటుందంటారు. కానీ రెడ్డమ్మ అంతకంటే ఓపిక కలిగిన స్త్రీ. అలాంటి రెడ్డమ్మే తిరగబడి చెకప్పుకి సిద్ధమయితే ? మన సంస్కృతీ, అందులోని ఆచారాలూ, వాటిలోని మూఢ నమ్మకాలూ అన్నీ పటాపంచలై స్త్రీ ఔన్నత్యం ముందు మోకరిల్లాల్సిందే. స్త్రీలోని కరుణా పూరితమైన హృదయానికి వయసుతో పని లేదు. బిత్తల బోకి కథలోని నాయకి ఒక మగాడి దుర్మార్గానికి బలవుతుంది. అతనే పాము కాటుకి గురై చావు బతుకుల్లో ఉన్నప్పుడు అతడిని కాపాడుతుంది. మనిషి గుండెల్లోని తడి ఆరిపోతే మనుషులు మనుషులుగా మిగాలరని సూచిస్తూ కథ ముగించిన తీరు అపూర్వం. ఇందులో మనం ఏర్పాటు చేసుకున్న విలువలల్లోని ద్వంద్వ ప్రమాణాలని ప్రశ్నిస్తూ కోతి అడిగిన ప్రశ్నలకి మనుషుల దగ్గర జవాబుల్లేవు. ఇది రచయిత దృష్టిలోని నైశిత్యానికి మచ్చు తునక.
సానుభూతికీ సహానుభూతికీ మధ్య అనుభవం ప్రధాన పాత్ర వహిస్తుంది. అనుభవం లేని అనుభూతులన్నీ కుయ్యో మొర్రో కథల్లాగే వుంటాయి. కానీ, ఈ రచయిత ఆ అనుభవ లేమిని ఆలోచన, అవగాహన, పరిశీలనలతో అధిగమించారు. ఈయన రాసిన దళిత స్త్రీ వాద కథలని చదువుతున్నప్పుడు.., సమస్యని అధిగమించే క్రమంలో ఆ సమస్యలో పడి కొట్టుకుంటూ ఉన్నంత సేపూ పరిష్కారాలు లభించవనీ ఆయా సమస్యలలోంచీ బయటకి వచ్చి చూస్తే తప్ప సమ దృష్టితో చూడటం సాధ్య పడదనీ, ఆ సమ దృష్టి లేకుండా చేసే పరిష్కారాలు ఏక పక్షం గానే ఉంటాయనే సత్యం బోధ పడుతుంది.
.
ప్రతి కథకీ ఒకో చిత్రాన్నీ , ఆ కథని చదివిన ప్రసిద్దుల అభిప్రాయాన్నీ ఇవ్వడం ఈ పుస్తకం ప్రత్యేకత. అలాగే రచయిత శ్రీరామచంద్ర మూర్తి, తన తండ్రిగారయిన జొన్నవిత్తుల రామకృష్ణ శర్మ గారి గురించి అక్కిరాజు ఉమాపతిరావుగారు రాసిన పరిచయ వ్యాసం, ఆయన రాసుకున్న రామకోటిలో ఆకృతి దాల్చిన హనుమంతుని చిత్రం, ఎటు చదివినా అదే పద్యం వచ్చేలా రాసిన రస భరితమైన సీతారామ స్తుతిగా రూపొందించిన సర్వతోభద్ర బంధం, శ్రీ రామ పట్టాభిషేకం చిత్రంలో అమర్చిన చంపకమాల పద్యం మొదలయినవాటిని అదనపు ఆకర్షణలుగా అందించారు.
************************
‘ ది డెత్ ఆఫ్ లాస్ట్ ఇండియన్’ (The death of last indian)
కథలు, 2008
పుటలు: 228
ఏ.వీ.కే.ఎఫ్ కొనుగోలు లంకె ఇక్కడ.
“ప్రాణహిత” పత్రికలో ఈ పుస్తకం పై 2008లో వచ్చిన “విహారి” గారి సమీక్ష ఇక్కడ చదవవచ్చు.
palamaneru balaji
kathalu bavunnai murty garu..viriviga rayali
palamaneru balaji
పుస్తకంలోని కథా వస్తువు, శైలి, కథన శిల్పాలలో ఎంతో వైవిధ్యం వుంది
putta sreedhar
hi andi…jonnavithula garu na frnd kavatam na adrustam…nadiche medhassula untadu ayana….ee subject naina avaleelaga rayagalige ayana style chala asuya kaligistundi…nenu ee book eppudo chadivaanu…kavitha garu chala takkuva rasarani na feeling…aavida analysis aakasani ki adham pattinattu undi….overal ga chepte kavita done a great job….muthy garu marinni manchi kathalu rayalani manasara korukuntu…..putta sreedhar sr.producer,cinema desk..hmt.v….hyderabad
krishnakumari
కవితగారి సమీక్ష చాలా వివరణాత్మకంగానూ విశ్లేషణాత్మకంగానూ సమగ్రంగానూ వుంది. పుస్తకంలో కథలన్నీ పరిచయం చెయ్యడం బాగుంది. నేను ఈ పుస్తకం చదివాను. ఇందులో మాండలికం, ప్రామాణిక భాషలతోబాటు సరళ గ్రాంధికంలో రాసిన తెలుగు పతాకం అనే కథ కూడా వుంది. ఈ పుస్తకంలోని కథా వస్తువు, శైలి, కథన శిల్పాలలో ఎంతో వైవిధ్యం వుంది. విహారిగారు రాసిన వ్యాసం కూడా బాగుంది.
Nagesh
I had the great opportunity to work with this great writer. JSR murthy garu is a great writer…
shashikanth
Good work both of u.
narasimharao mallina
జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి గారి వంటి గొప్ప రచయితను గుఱించి ఇప్పటివరకూ నాకు తెలియకపోవటం నాకు చాలా బాధను కలిగించింది. వారి పుస్తకాలను సంపాదించి చదువుతాను.
కుమార్
కవిత గారూ,
మంచి పుస్తకం.
ఇందులో కథలన్నీ దేనికదే ప్రత్యేకమైనవి.
మీ సమీక్షతోబాటు విహారి గారి వ్యాసం కూడా బాగుంది.
అలాగే ఈ రచయిత తెలుగు పద్యమూ మా నాన్న సమీక్షపై స్పందించిన తీరు చాలా విశిష్టంగా వుంది.