శ్రీమదాంధ్రమహా భారతము – ఎందుకు చదవాలి ? ఆరణ్యపర్వము (పంచమాశ్వాసము- మూడవ భాగము- ఎఱ్ఱన కృతము)
***************
(ఈ సిరీస్ లో వస్తున్న వ్యాసాలన్నీ ఇక్కడ చదవొచ్చు. ఆది సభా పర్వాల పరిచయం ముగిసింది. అరణ్య పర్వం గురించిన పరిచయం లో నాలుగో వ్యాసం ఇది. మొదటి మూడు వ్యాసాలూ గతం లో వచ్చాయి. అరణ్యపర్వం గురించిన వ్యాసాలు ఇక్కడ చదవొచ్చు.)
****************
అగ్నిదేవుడు మునిపత్నులను కామించిన ఘట్టంలో —
ఆ సమయంబున నమ్మునీంద్రుల భార్య ! లందఱు సుస్నాన మొందఁ జేసి
రమణీయ మాల్యాంబర విభూషణాద్యలం ! కారంబు లొనరించి గారవమునఁ
జనుదెంచి పతులకు సన్మతిం బరిచర్య ! సేయుచు మెలఁగంగ వాయుసఖుఁడు
మెలఁతల వాలిక మెఱుఁగుఁ గన్నుల యొప్పుఁ ! దెలినవ్వుమొగముల విలసనములు
నడబెడంగులు నన్నువనడుములందు ! వెలయు వళులభావంబులు వలుఁదచన్నుఁ
గవల నిక్కును నేర్పడఁ గని, కరంగి ! మదనమార్గణ విదళిత హృదయుఁడయ్యె. 3-5-195
(అమావాస్యా హోమం చేస్తున్న సమయంలో సప్తర్షుల భార్యలు అందఱున్నూ చక్కగా స్నానం చేసి అందమైన పువ్వులు ముడుచుకొని, క్రొత్త బట్టలు కట్టుకొని, ఆభరణాలు ధరించి, సహధర్మచారిణులై తమ తమ భర్తలకు గౌరవంతో శుశ్రూష చేస్తూ ఉన్నారు. వాయుసఖుడైన అగ్నిహోత్రుడు సప్తర్షుల భార్యల సౌందర్యాన్ని చూచి, కనువేదురుతో మ్రందసాగాడు. ఆ అంగనల వాలుచూపులు, నునుసోగనేత్రాలు, మందహాసాలు చిందే వదనాలు, నడలలోని వయ్యారాలు, సన్నని నడుములలోని ముడుతలు, గబ్బిగుబ్బల పొటమరింతలు చూచి కరగి అగ్నిహోత్రుడు మన్మథబాణాలకు గుఱి అయి చలించిన హృదయం కలవాడయ్యాడు.)
వ. ఇట్లు వికలేంద్రియుండై వైశ్వానరుం డమ్మునిపత్నులయందుఁ దగిలిన డెందంబు మగిడింప నేరక వారలం గదియ నప్పళించి గార్హపత్యకుండంబునం దావేశించి.3-5-196
(ఈ విధంగా అగ్నిహోత్రుడు ఇంద్రియనిగ్రహాన్ని కోల్పోయినవాడై, ఆ ఋషుల భార్యలయందు తగుల్కొనిన తన హృదయాన్ని మరలింప జాలకపోయాడు. ఆ మునీంద్రుల భార్యలను సమీపంలో ఉండి తాకగోరినవాడై, అగ్నిహోత్రుడు గార్హపత్య కుండంలో చేరాడు.)
అతివలు దన్నుఁ జేరుటకు నాసపడుం, బొరిఁ జేరుట నా
యత విలసచ్ఛికాగ్రముల నల్లన వారల నంటుఁ, గౌతుకం
బతిశయమై తదంగలత లాదటఁ గౌఁగిటఁ జేర్పఁ గోరుఁ, గం
పిత ధృతి యై కలంగుఁ, గడుఁ బెల్లగు రాగరసంబు ముంపగన్. 3-5-197
(అగ్నిదేవుడు కనువేదురుచేత కామవికారానికి లోనయ్యాడు. అందువలన ఆ మునిభార్యలు తనదరికి చేరవలె నని పరితపించ సాగాడు. తన దరికి చేరినప్పుడు, వరుసగా వారిని తన జ్వాలలచేత మృదువుగా తాకి స్పర్శసుఖం అనుభవించాడు. సుకుమారమైన లతలను బోలు వారి శరీరాలను తాక గోరాడు. వారిని తన కౌగిలిలో బంధింప తలపోశాడు. ఈ విధంగా అతడు స్థైర్యాన్ని కోలుపోయి మన్మథ వికారానికిలోనై బాధపడసాగాడు.)
అమావాస్యహోమం ముగుస్తుంది. అగ్నిహోత్రుడు విరహబాధ భరింపలేక ఓ నిర్జనమైన అడవికలోనికి పోయి దేహత్యాగం చేయాలని తలపోస్తాడు. అప్పుడు అగ్నిభార్య స్వాహాదేవి సప్తఋషులలో ఒకరైన అంగిరసుని భార్య శివ అనే ఆమె రూపంలో అతనివద్దకు వచ్చి ఆ రూపంలో అతడిని కలుస్తుంది. అగ్నియొక్క తేజోధాతువును ఆమె గ్రహించి శ్వేతపర్వతంమీద రెల్లుగడ్డిచేత కప్పబడిన బంగారు కలశంలో నిక్షిప్తం చేసి తిరిగి వచ్చి మరలా ఇంకొక ఋషిపత్ని రూపంలో అగ్నిడేవుడిని కలుస్తుంది. వరుసగా అలా ఆరుగురు ఋషిపత్నులరూపంలో అగ్నిని కలసి ఆ ఆరుసార్లు అగ్నివీర్యాన్ని ఆ బంగారు కలశంలో నిక్షిప్తం చేసి వస్తుంది. కాని ఆమెకు వశిష్ఠుని భార్యయైన అరుంధతి రూపాన్ని మాత్రం ధరించటం సాధ్యం కాకపోతుంది. ఆ ఆరుసార్లు సేకరించబడిన అగ్నివీర్యంనుండి కుమారస్వామి జన్మిస్తాడు. కుమారస్వామి పెరిగి పెద్దై సింహనాదాన్ని చేస్తాడు.
ఆ నాదానికి
కులశైలంబులు గ్రక్కునం గదలె; దిక్కుల్ వ్రయ్య లయ్యెన్; మహీ
వలయం బంతయు దిర్దిరం దిరిగె; దేవవ్రాతముల్ సాధ్వసా
కులతం బొందెఁ; బయోధు లన్నియును సంక్షోభించె; సప్తాశ్వుస
ప్తులు బిట్టుల్కి రధంబు నలిదెసలకుం బో నీడ్చె సంభ్రాంతమై. 3-5-208
(కులపర్వతాలు వేగంగా చలించాయి. దిక్కులు బ్రద్దలయ్యాయి. భూమండలం గిరగిర తిరుగసాగింది. వేల్పుల సమూహాలు తొట్రుపాటుతో సంచలించారు. సముద్రాలు పొంగులు వారాయి, సూర్యుడి గుఱ్ఱాలు మిగుల కలత చెంది రథాన్ని నాలుగు దెసలకు ఈడ్వసాగాయి.)
విశేషం:కులపర్వతాలు ఏడు. “మహేంద్రో మలయ స్సహ్య శ్శుక్తిమాన్ గంధమాదనః, వింధ్యశ్చ పారియాత్ర శ్చ సప్తై తే కులపర్వతాః”. ఈ ఏడు కులపర్వతాలున్నూ భూమిని భరించేవి అని పురాణ కథనం. సూర్యుడి రథానికి అశ్వాలు ఏడు అని ప్రాచీన సాహిత్యసమయం. సూర్యకాంతిలో ఏడు వర్ణాలు కలసి ఉన్నాయి కదా.
ఈ విధంగా ఏర్పడిన భూతవికారాల ఉపద్రవాల నివారణకు లోకకల్యాణానికి ఋషులు శాంతిక విధులను నిర్వహించారు. అప్పుడు చైత్త్రరథ మనే వనంలో నివసించే జనులు ‘ఈ ఉపద్రవాలను కలిగించినది ఋషులభార్యలకు అగ్నిదేవుడివలన జన్మించిన బాలకుడు’ అని ఘోషించారు. ఆ నిందలకు తాళలేక వశిష్ఠుడు తక్క మిగిలిన ఋషులందరూ తమ తమ భార్యలను వదలివేసారు. కాని, కొందరు ప్రజలు మాత్రం ‘పాపం ఈ ఋషుల భార్యలు చేసిన తప్పు ఏమి ఉన్నది ? ఈ నాటకం మొత్తం ఆడినది అగ్నిదేవుని భార్యయే కదా ‘ అని పలికారు. అంతట అగ్నిదేవుని భార్య ఆ మునుల దగ్గఱకు వెళ్ళి ఈ విధంగా చెప్పింది.
‘వినుఁ డేను వహ్నివలనం ! గనిన కుమారుండు వాఁడు; గడు నిజమిది; మీ
వనితలకుం బని గా దిటు ! సనునే కులసతుల విడువ సత్పురుషులకున్? ’ 3-5-211
(‘అయ్యలారా! నా మనవి ఆలకించ వేడికోలు. ఈ బాలుడు నాకును నా భర్త అయిన అగ్నిదేవుడికిని జన్మించినవాడు. ఇది మీ భార్యలవలన జరిగిన పని కాదు. సజ్జనులు పతివ్రతలైన భార్యలను విడనాడటం న్యాయం కాదు గదా!’) అని చెప్పింది. కాని, ఆ ఋషులు సమ్మతించలేదు. అటుపిమ్మట విశ్వామిత్రుడు అనే ఋషి వెళ్ళి ఆ బాలునికి జాతకర్మాదులను నిర్వహించాడు. ఆ విషయాన్ని అంతా తెలిసికొని దేవతలు దేవేంద్రుడి దగ్గఱకు వెళ్ళారు.
విశేషం: మనిషికి నిర్వహించవలసిన షోడశ కర్మలు ఇవి: గర్భాదానం, పుంసవనం, సీమంతం, జాతకర్మం, నామకరణం, అన్నప్రాశం, చౌలం, ఉపనయనం, ప్రాజాపత్యం, సౌమ్యం, అగ్నేయం, వైశ్వదేవం, గోదానం, సమావర్తనం, వివాహం, అంత్యసంస్కారం.
వారంతా ఇంద్రుడితో ఆ బాలుడు ఇంద్రపదవిని ఆశించి నీ మీదకు దండెత్తి రాగలడు. అందుకని నీవే ముందుగా అతని మీదకు యుద్ధానికి వెళ్ళటం మంచి దంటారు. ఇంద్రుడు సప్తమాతృకలను కుమారుని పైకి యుద్ధానికి పంపగా వారు అతని ప్రభావానికి లొంగి తమను మాతృభావన చేయమని కోరతారు. అగ్నదేవుడు కుమారస్వామికి తోడుంటాడు. సప్తమాతృకల కోపాన్నుండి పుట్టిన లోహితాస్య అనే ఆమె కుమారునికి దాదిగా ఉంటుంది. ఇదంతా తెలిసికొన్న ఇంద్రుడు కోపించి కుమారస్వామిపై దండెత్తి వస్తాడు. దేవతలందరూ కుమారుని క్రోధాగ్నికి భయపడి అతడిని శరణు వేడతారు. అప్పుడు దేవేంద్రుడు ఆగ్రహోదగ్రుడై కుమారునిమీద వజ్రాయుధాన్ని ప్రయోగించగా అది వచ్చి కుమారుని కుడిభాగాన తాకింది. ఆ భాగం నుండి బంగరుమిసిమిరంగు శరీరంతో మేక మొగంతో విశాఖుడు అనేవాడు, లెక్కకు మించిన బాల బాలికలు ఉద్భవిస్తారు. అదిచూచి భయపడి దేవేంద్రుడు కుమారస్వామిని శరణు వేడతాడు. దేవతలంతా వారిద్దరి చుట్టూ చేరి సంతోషంతో సింహనాదాలు చేస్తారు – అని చెప్పి మార్కండేయుడు ఇంకా ఇలా అంటాడు.
అయ్యగ్నిసంభవు నాయతోన్నతబాహు, ! నాముక్తకవచుఁ, దేజోమహిష్ణు,
నాలోహితాంబరు, హారికుండలకర్ణుఁ, ! గనకరత్నోజ్వల ఘనకిరీటు,
సంపూర్ణయౌవను, సర్వలక్షణయుక్తుఁ ! గని, యనురాగిల్లి కమలనిలయ
సాకార యై వచ్చి యఖిలంబుఁ జూడంగ ! సితపద్మహస్త యై యతనిఁ బొందె;
శ్రీసమేతుఁడై విశేషకాంతిస్ఫూర్తి ! నొలసి పూర్ణచంద్రుచెలువు దాల్చి
యున్నవానిఁ జూచి రుత్ఫుల్లలోచన ! కుముదు లగుచు మునులు నమరవరులు. 3-5-221
(అగ్నిహోత్రుడి పుత్త్రుడైన ఆ కుమారస్వామి నిడివి అయి ఎత్తైనభుజాలు కలవాడు, కవచాన్ని ధరించినవాడు, దేదీప్యమానమైన వెలుగు వెల్లి విరిసిన ముఖం కలవాడు, మిక్కిలి ఎఱ్ఱనైన వస్త్రాలు ధరించినవాడు, మణులు పొదిగిన బంగారుకిరీటం ధరించినవాడు, నిండు జవ్వనం తొణికిసలాడుతున్నవాడు, సర్వ సద్గుణ విరాజితుడు, అట్టి అతనిని చూచి ప్రేమించి లక్ష్మీదేవి శరీరధారిణి అయి వచ్చి అతడిని చేరింది. ఆమె చేతిలో శృంగారకమలం విరిసి ఉంది. ఆ రీతిగా లక్ష్మీయుక్తుడై దేదీప్యమానంగా వెలుగొందుచున్న కుమారస్వామిని పూర్ణచంద్రుడివలె సౌందర్యంతో ఒప్పారేవాడిని ఋషులు వేల్పులు ఆనందంతో ఆశ్చర్యంతో తిలకించారు.)
వారంతా కుమారస్వామిని నీవు పుట్టిన ఆరురోజులలోనే అవలీలగా జగాలనన్నింటినీ జయించావు. కాబట్టి ఇంద్రపదవిని అధిష్టించతగి ఉన్నావు. అనగా కుమారస్వామి ఇంద్రపదవిలో ఉండేవారు నెరవేర్చవలసిన పనులు ఏవి అని అడుగుతాడు. దానికి వారు
‘బలముం దేజము నించి లోకముఁ గృపం బాలించు టర్కేంద్రుభూ
జల తేజః పవనాంబరంబులకు నస్థైర్యంబు గాకుండ ని
శ్చలశక్తిస్థితి నీఁగి శిష్టజనరక్షాదుష్టశిక్షాసమా
కలనం బింద్రపదస్థుఁ డౌ నతనికిం గర్తవ్యముల్ షణ్ముఖా! 3-5-225
(‘ఆరుమోముల దేవరా! ఓ కుమారస్వామీ! స్వీయసామర్థ్యం తేజస్సు లోకంలో నిలిపి, దుష్టులను శిక్షించటం శిష్టులను రక్షించటం మూలంగా పరిపాలన చేయటం, పంచభూతాలు సూర్యచంద్రులు స్థిరంగా ఉండేటట్లు చూడటం ఇంద్రపదవి నధిష్టించేవాడు చేయదగిన పనులు.)
అప్పుడు ఇంద్రుడు కూడా షణ్ముఖుని ఇంద్రపదవిని అధిష్టించమని కోరతాడు. షణ్ముఖుడు దానికి అంగీకరించడు. దేవసేనాపతిగా షణ్ముఖుడిని అభిషిక్తుడిని చేస్తారు. అప్పుడు శివుడు దేవసేనాపతిని చూడటానికి వస్తాడు.
నానాసిద్ధగణంబు గొల్వఁ బరమానందంబునం జంద్ర రే
ఖా నవ్యాంచితమౌళి భూరిభుజగాల్పోజ్జ్వలాకారుఁ డీ
శానుం డానతశంకరుండు గిరజాసంయుక్తుఁడై వచ్చెఁ ద
త్సేనానిం బ్రియసూను షణ్ముఖుని వీక్షింపం గడుం బ్రేమతోన్. 3-5-233
(బాలచంద్రధరుడు భక్తులకు శుభం కలిగించేవాడు, నాగభూషణుడు అయిన ఈశ్వరుడు సిద్ధగణాలు తనను సేవిస్తూ ఉండగా, పార్వతీ సమేతుడై తన కుమారుడైన షణ్ముఖుడిని చూడటానకై ప్రేమతో అరుడెంచాడు.)
విశేషం: సిద్ధులు = అణిమాదులైన అష్ట సిద్ధులు కలిగిన దివ్యపురుషులు. కుమారస్వామి శివుని కుమారుడైన కథ. పార్వతీ పరమేశ్వరులు శృంగారమందిరంలో ఉండగా అగ్నిదేవుడు ‘బల్లి’ రూపంలో గోడపై నక్కి ఉన్నాడు. ఆ బల్లిని చూచి పార్వతీదేవి ఇంచుక సంచలించినపుడు శివుడికి రేతఃస్ఖలన మైనది. అప్పుడు శివుడాగ్రహించి ఆ రేతస్సును ఆ బల్లి నోటిలో పోశాడు. అగ్నిహోత్రుడు ఆ వీర్యాన్ని భరించజాలక ఆవేదన పడుతూ తదుపరి మునిపత్నులను వలచాడు. స్వాహాదేవి సంగ్రహించిన రేతస్సుకు మాతృక శివుడే. ఆ విధంగా షణ్ముఖుడు ఈశ్వరుడికి ప్రియపుత్రుడు. శివుడు తన వీర్యాన్ని అగ్నిహోత్రుడిలో నిక్షేపించటం, తద్వారా షణ్ముఖుడు ఉద్భవించటం జరిగింది కాబట్టి షణ్ముఖుడు శివపుత్రు డయ్యాడు. అలాగే స్వాహాదేవి కృత్తికలు అనే పేరుకల మునిపత్నుల రూపాలు ధరించి అగ్నిని కలియటం వలన పుట్టినవాడు కాబట్టి కార్తికేయు డనిన్నీ, అగ్నిభార్య తన పతియొక్క రేతస్సును స్కందం చేయటం వలన పుట్టినవాడు కాబట్టి స్కందు డనీ షణ్ముఖునికి పేర్లు కలిగినాయి.
అప్పుడు ఇంద్రుడు పూర్వం తాను బ్రహ్మచే సృజించబడి తన వద్ద పెరుగుచున్నదేవసేనను షణ్ముఖిడికి ఇచ్చి వివాహం జరిపిస్తాడు. ఆరోజు షష్టి. దానినే స్కందషష్టి లేక సుబ్రహ్మణ్య షష్టి అని పండుగగా జరుపుకొంటారు. షణ్ముఖుని శ్రీదేవి వరించిన రోజు పంచమి. ఆరోజున కూడా జనులు పండుగ జరుపుకుంటారు. నిజ భర్తలచేత పరిత్యజించబడిన ఆరుగురు మునిపత్నులు స్కందుని దగ్గఱకు వచ్చి దుర్జనుల నీలాపనిందల వలన మా భర్తలు మమ్ము విడిచిపెట్టారు. ఇకనీవు మాకు పుత్రనిర్విశేషుడవు. మమ్మల్ని నీవు కాపాడాలని కోరతారు. అప్పుడు కుమారస్వామి దేవేంద్రునితో వీరికి తగిన స్థానం కల్పించాల్సి ఉంది అని చెప్పగా దేవేంద్రుడు ‘ దక్ష ప్రజాపతికి పుట్టిన పుత్రికలు పలువురు చంద్రుడి భార్యలయ్యారు. వారిలో రోహిణి ప్రక్కన ఉండే అభిజిత్తు అనే ఆమె తానే చంద్రుడికి అందరికంటె ప్రియమైన భార్యగా కాగోరి తపస్సునకు వెళ్ళింది. ఇప్పుడు ఆ స్థానం ఖాళీగా ఉంది. ఈ కృత్తికలను ఆ చోట నిల్పవచ్చు’ అంటాడు. అప్పటినుండి వారు ఆ స్థానంలో నిలుస్తారు. తరువాత స్వాహాదేవి కుమారుని వద్ద నివసించగోర్తుంది. ఆమెకు స్కందుడు అందుకు అనుజ్ఞ ఇస్తాడు. తరువాత కుమార మాతృకలు ఏడుగురు – హవిష, కాళి, కౌశిక, ఉద్ధత, శారిక, ఆర్య, వైధాత్రి అనేవారు కుమారస్వామిని మమ్ము మూడులోకాలకు మాతృకలుగా నియమించమని ప్రార్థిస్థారు. కుమారస్వామి వారిని బాలగ్రహాలుగా నియమిస్తాడు. నియమించి పసిబిడ్డలకు హాని చెయ్యకుండా ఉండమని కోర్తాడు. పదహారేళ్ళ వయసు వచ్చేవరకూ బాలబాలికలను బాధించండి. వారికి అంగరక్షకుడుగా ఉండేటందుకు స్కందాపస్మారం అనే పిశాచాన్ని సృష్టించి ఇస్తాడు.
విను డెబ్బది యేఁడుల దాఁ ! కను మానవులకు గ్రహోపఘాతంబులు గ
ల్గు; ననంతరంబ గ్రహముల ! పని వలవదు; ముదిమి యెల్ల పనులకుఁ జాలున్. 3-5-254
(సావధానంగా వినుము. డెబ్బది యేండ్లు వచ్చేవరకూ మానవులకు గ్రహాలవలన సంక్రమించే జాడ్యాలు ఏవో సంక్రమిస్తాయి. ఆపైన గ్రహాలు పీడించే అవసరం లేదు. ఎందుకంటే ముసలితనమే అన్ని జాడ్యాలను సంక్రమింపజేస్తుంది కదా.)
నియతి గలిగి యింద్రియముల ! జయించి శుచులైన శాంతిసంపన్నులకున్
భయ మొనరింపఁగ లే వ! వ్యయ పుణ్యా! గ్రహము లే యవస్థల యందున్. 3-5-255
(గొప్ప పుణ్యాన్ని ఆర్జించిన ఓ ధర్మరాజా! ఇందులో ఒక కిటుకు వున్నది. ఈ గ్రహభాధలు పిశాచపీడలు దుర్బలమనస్కులకు హాని చేయగలవే కాని, నీతినియమ నిష్ఠలు కలిగి ఇంద్రియాలను గెలువగలిగిన వారికి ఎట్టి భీతిని కలిగించలేవు.)
మార్కండేయ మహర్షి పాండవులకు ధర్మబోధ చేస్తున్నపుడు శ్రీకృష్ణుడు సత్యభామా సహితుడై విచ్చేసి ఆ బోధనలను పాండవులతోపాటుగా వింటూ ఉన్నాడు. సత్యభామ ద్రౌపదితో సంభాషణ సాగిస్తుంది. ఈ సత్యా ద్రౌపదీ సంవాదం అనే ఘట్టం చాలా అందమైన ఘట్టం. దీని లోనికి ప్రవేశిద్దాం, రండి.
సత్యభామ ద్రౌపదితో
‘ నీ ప్రియభర్తల నిర్మలచరితులఁ ! బ్రకటతేజుల లోకపాలనిభులఁ
బార్థుల నీ వొకభంగిన వదలక ! చెలువ! యెబ్భంగి భజింతు తగిలి?
యొక్క రొక్కనికంటె నువిద! నీ కేవురు ! ననురక్తులగుట యత్యద్భుతంబు;
నగుమొగంబుల కాని నళినాక్షి ! నీ దెసఁ బతులకుఁ గింకిరిపాటు లేదు;
వ్రతము పెంపా? మంత్రౌషధ వైభవంబొ? ! సరస నైపథ్యకర్మ కౌశలమొ? చతుర
విభ్రమోల్లాస రేఖయొ? వెలఁది! నీ వి !శేష సౌభాగ్య హేతువు సెపుమ నాకు. 3-5-291
(‘పద్మాలవంటి కన్నులు కల ఓ ద్రౌపదీ ! నీ భర్తలు అయిదుగురును నీయందు మిక్కుటమైన అనురాగం కలవారు. ఒకరిని మించి మరొకరు నీ మీద ప్రేముడి ప్రదర్శిస్తుంటారు. వారందరి యెడల నీవు సమానమైన ఆసక్తి గలిగి మసలుకొంటూ వుంటావు. వారు అందరు దేదీప్యమానమైన తేజస్సు కలవారు, పరిశుద్ధమైన శీలం కలవారలు, దిక్పాలకులతో సమానమైన ప్రాభవం కలవారు. అటువంటి వారు అందరును నీయెడ ఎల్లప్పుడు మురిపంతో ముసిముసినవ్వులు ప్రసరింపచేయటం వింతలలో వింత. ఇట్టి అద్భుత మహిమ నీకు ఏ విధంగా చేకూరింది? ఏవైనా గొప్ప నోములు నోచావా? మంత్రతంత్రాలు అభ్యసించావా? మందులు మాకులు ప్రయోగించావా? వస్త్రాద్యలంకారాలలో తెలివితేటలు కారణమా? చురుకుదనాలు ఒయ్యారాలు ఒలికించగల నేర్పు ఏదైనా నీకు ఉన్నదా? భర్తల అనురాగాన్ని ఈ విధంగా చూరగొనటానికి గల కారణం నాకు చెప్పగోరుతున్నాను.)
ఏనును నీవలన నిజము ! గా నిది యంతయును నెఱిఁగి కమలదళాక్షుం
బూని వశగతునిఁ జేసి య ! నూన స్నేహానుభోగయుక్తిఁ దలిర్తున్.’ 3-5-292
(ద్రౌపదీ ! నీ వ్యక్తిత్వం అసాధారణ మైనది. నీవు ఏవిధంగా నీ భర్తల అనురాగాన్ని చూరగొనగలిగావో ఆ కిటుకును, ఆ లోగుట్టును, నాకు నిజంగా తెలిపితే నేను కూడా ఆవిధంగానే నా భర్త అయిన శ్రీకృష్ణుడి ప్రేముడి చూరగొంటాను.’)
అని యడిగిన మది నించుక ! గినుక వొడమ నడఁచుకొనుచుఁ గృష్ణ మృదులహా
సిని యగుచుఁ గృష్ణభామినిఁ ! గనుఁగొని యి ట్లనియె నిర్వికారాకృతియై.3-5-293
(సత్యభామ ఆ విధమైన ప్రశ్నలు వేయటం చేత ద్రౌపదికి మనస్సులో కొంచెం కోపం వచ్చింది. తాను భర్తలప్రేమ చూరగొనటానికి మంత్రాలు, మాయలు, మందులు, మాకులు, అలంకరణలో నేర్పరితనం- ఇట్టివానిని హేతువులుగా పేర్కొనటం సత్యభామకు ఉచితమగు ప్రవర్తన కాదు కదా! అందుచేత ద్రౌపదికి కోపం వచ్చింది. అయినను, తన కోపాన్ని అణచుకొన్నది. ( కోపాన్ని అణచుకొనటం ఉత్తమ లక్షణం). తదుపరి శ్రీకృష్ణుడి భార్య ఐన సత్యభామతో ద్రౌపది ఈ విధంగా పలికింది.)
‘నను నిట్లు దుష్టవనితా! జనమునటులుగాఁ దలంపఁ జనునే నీకున్?
మన సొప్పదు పురుషోత్తము ! వనితవుగాఁ దగవు నీవు వనరుహనయనా!’ 3-5-294
(‘పద్మాలవంటి కన్నులు కలదానా ! నీవు ఎంతటి అందకత్తెవైనను, నన్ను తక్కువ స్థాయిలోని ఆడవారితో జమకట్టి ఇటువంటి మాటలు మాటలాడవచ్చునా ? అసలు నీవు ఇటువంటి మాటలు పలుకుతావనే విషయాన్ని నా మనస్సు అంగీకరించటం లేదు. పురుషోత్తము డైన శ్రీకృష్ణుడికి భార్యగా ఉండదగిన యోగ్యత నీలో లేదు సుమా’- అని మెత్త మెత్తగా చీవాట్లు పెట్టింది ద్రౌపది. – సత్యభామతో సరస సల్లాపాలు చేస్తున్న మాదిరిగా కనబడుతూనే.)
వ. అని మేలంపుఁ జందంబున దాని వివేకహీనత యెఱుకవడఁ నాడి, పాంచాలి మఱియు ని ట్లనియె. 3-5-295
(ద్రౌపది ఆ విధంగా హాస్యగర్భిత మైన మాటలలో సత్యభామకు ఆమె తెలివితక్కువతనాన్ని తేటతెల్లం చేసి ఇంకను ఈ రీతిగా పలికింది.)
‘అలయక మంత్ర తంత్ర వివిధౌషధ భంగులఁ జేసి యెంతయున్
వలతురు కాంతు లంట మగువా! కడుబేలతనంబు; దాన మున్
గలిగిన ప్రేమయుం బొలియుఁ గాని యొకండును సిద్ధిఁబొంద; ద
ప్పొలతుక తోడి మన్కి యహిపొత్తుగఁ జూచు విభుం డెఱింగినన్.3-5-296
(‘ఓ సత్యభామా! మంత్ర తంత్రాలతో మందులుమాకులతో భర్త వశుడౌతాడని అనుకొనటం తెలివితక్కువతనం మాత్రమే. దానివలన, భార్యపైన భర్తకు అంతకుముందు ఏర్పడిన అనురాగం కూడా నశిస్తుంది. ఎట్టిలాభం కలుగదు. అట్టి భార్యతో కాపురం చేయటం, పాముతో చెలిమి చేయటంవంటిదే అని భర్త భావిస్తాడు.)
మగువ యొనర్చు వశ్యవిధి మందులు మాఁకులు నొండుచందమై
మగనికిఁ దెచ్చు రోగములు, మానక మూకజడాదిభావముల్
మొగి నొనరించు, నద్దురితముల్ దన చేసిన చేఁత లై తుదిన్
జగమున కెక్కి నిందయును సద్గతిహానియు వచ్చు నింతికిన్. 3-5-297
(భర్త తనకు లోబడి ఉండాలనే ఆరాటం చొప్పున భార్య వశీకరణ తంత్రాలు, మందులు, మాకులు ప్రయోగిస్తే, అవి బెడిసికొట్టి అనుకొనని విధంగా భర్తకు మూగతనం, మనస్సు, శరీరం మొద్దుబారటం, మున్నగు జబ్బులు కొని తెచ్చి పెట్టుతాయి. ఆమెకు లోకంలో అపకీర్తి వస్తుంది. అది అంతయు ఆమె స్వయంకృతాపరాధమే కాబట్టి, ఆమెకు ప్రాప్తించేది తుదకు నరకయాతన మాత్రమే.)
కావునఁ బతులకు నెప్పుడుఁ ! గావింపం దగదు కపటకర్మంబులు; ద
ద్భావ మెఱిఁగి యనువర్తిని! యై వనిత చరింప నదియ యగు నెల్లవియున్. 3-5-298
(కాబట్టి భార్యలు ఎప్పుడును భర్తలయెడ మోసపు పనులు చేయరాదు. భర్త అభిప్రాయాలు తెలిసికొని, వాటికి అనుకూలంగా భార్య ప్రవర్తించాలి. అట్టి అనుకూల దాంపత్యమే సకల రీతుల భర్తను ఆకట్టుకొనే ఉత్తమ విధానమని గ్రహించాలి.)
వ. పాండవులయెడ నే నెట్టిదాన నై యిట్టి సౌభాగ్యంబు నందితి ; నది నీకు నెఱింగించెద నేర్పడ వినుము. 3-5-299
(పాండవులపట్ల నేనెటువంటి దానినై వ్యవహరించి, ఇట్లాంటి పతివాల్లభ్యాన్ని(పతుల అనురాగాన్ని) పొందగలిగానో, దాన్ని నీకు తెలియపరుస్తాను. విశదంగా వినుము.)
పతు లాత్మ నొండొక్క పడఁతులఁ ! గలసిన నలుగ, నెయ్యెడల నహంకరింప;
మదముఁ బ్రమాదంబు మాని వారికిఁ జిత్త ! మేకముఖంబుగ నెల్లప్రొద్దు
భక్తి సేయుదుఁ; జూపుఁ బలుకును గోర్కియుఁ ! జెయ్వులు వింతగాఁ జేయనెపుడు;
నమర గంధర్వ యక్షాదులం దైనను ! బురుషు నన్యునిఁ దృణంబుగఁ దలంతు;
స్నాన భోజన శయనాది సంప్రయోగ ! మర్థిఁ బతులకు మున్నెందు నాచరింపఁ;
బతులు వచ్చిన నాసన పాద్య విధుల ! భక్తితో నేన కావింతుఁ బనుప నొరుల. 3-5-300
(భర్తలు అన్యకాంతలయెడ అనురక్తులయి వారిని కూడినప్పటికీ నేను కోపం చెందను; ఎప్పుడును స్వాతిశయం చూపక, ఎల్లప్పుడును భర్తలయెడ వినయంతో పూజ్యభావంతో వారికి పరిచర్య చేస్తాను. వింత పనులను చేయను. వింతమాటలు పలుకను. పరపురుషులు దేవతలైనా సరే, యక్షులైనా సరే, వారిని గడ్డిపోచతో సమంగా చూస్తానే కాని వారియెడల పతిభావన చేయను. స్నానం, భోజనం, శయనం మున్నగు సౌకర్యాలను భర్తలకు ముందుగా ఏర్పరచి, తదుపరి నేను అనుభవిస్తాను. భర్తలు ఇంటికి విచ్చేసినపుడు, వారికి కాళ్ళు కడుగుకొనటానికి నీరు, కూర్చొనటానికి ఆసనాదులు నేనే స్వయంగా ఏర్పాటు చేస్తాను కాని, ఆ పనులు చేయటానికై సేవకులను నియోగించను.)
తగియెడు వేళలందు నియతంబుగ మజ్జన భోజనక్రియల్
దగ నొడఁగూర్తు భర్తలకు; ధాన్యధనంబులు రిత్తమై వ్యయం
బగుటకు నోర్వ నెప్పుడు, గృహస్థలభాండ విశోధనంబు లి
మ్ముగ నొకనాడు నేమఱఁ, ప్రమోదము సల్పుదు బంధుకోటికిన్. 3-5-301
(నా పతులకు ఆయా సమయాలలో కనిపెట్టి క్రమపద్ధతిలో నిర్ణీతపద్ధతి తప్పకుండా స్నానం, ఆహారం మున్నగు సదుపాయాలను సమకూరుస్తాను. ధాన్యం కాని ధనం కాని వ్యర్థం కానీయను, అనవసరంగా వెచ్చింపను; ఇల్లు వాకిళులు పాత్రలు ఎప్పుడు పరిశుభ్రంగా ఉండేటట్లుగా, మరపు ఏమరుపాటు లేకుండ సదా కాచుకొని చూచుకొంటాను. చుట్టాలందరికీ సదా సంతోషం కలిగిస్తాను.)
పలుమాఱుం దలవాకిట !మెలఁగుట, యసతీజనైకమిత్రత, కలహం
బుల కెలయుట, నగుపలుకులఁ ! బెలుచ నగుట నాకుఁ గాని పేరివి మగువా! 3-5-302
(పలుమారులు ఇంటిగుమ్మం దగ్గఱ, ముంగిలి వాకిట్లో తిరుగుతూ ఉండటం, చెడ్డ ఆడువారితో ఎక్కువగా స్నేహం చేయటం, వాదులాడటం, హాస్యపు మాటలలో మితిమీరి నవ్వటం మున్నగునవి నాకు ఇష్టం కలిగించేవి కావు. అట్టి పనుల జోలికి నేను ఎన్నడూ పోను.)
పతు లిచ్చమెయిఁ బ్రవాస ! స్థితులైనం బుష్పగంధ దీప్తాభరణ
ప్రతతి ధరియింపఁ దద్గత ! మతి నగుచుం దదాగమంబ మదిఁ గాంక్షింతున్. 3-5-303
(భర్తలు వారి వారి కోరికమేరకు వేరుచోటులకు వెళ్ళితే, నేను పువ్వులు ముడువను. పరిమళపు మైపూతలు పూసికొనను. మిరుమిట్లు గొలుపుతూ వెలుగొందే ఆభరణాలను ధరించను. భర్తపట్లే మనస్సు లగ్నం చేసి వారు ఎప్పుడు ఇంటికి తిరిగి చేరుతారా అని యెదురుతెన్నులు చూస్తూ వారి రాకకై నిరీక్షిస్తుంటాను.)
అత్తకు భక్తి గల్గి మది నాయమ సెప్పిన మాడ్కి జీవికా
వృత్తము లావహింతు ; గురువిప్రజనాతిథిపూజనంబు ల
త్యుత్తమభక్తి నేన తగ నోపి యొనర్తుఁ ; బ్రియంబుఁ దాల్మియున్
మెత్తఁదనంబు సన్మతియు మేలుగఁ దాల్తు సమస్తభంగులన్. 3-5-304
(అత్తగారియెడ పూజ్యభావం కలిగి, ఆమె చెప్పిన రీతిగనే నా దినచర్యను తీర్చి దిద్దుకుంటాను. పెద్దలు బ్రాహ్మణులు అతిథులు విచ్చేసినపుడు, వారి సేవకు అనుచరులను నియోగించక, పూజ్యభావంతో వారికి సపర్యలు నేను చేస్తాను; సంప్రీతి, క్షమ, వినయం, మంచితనం అనే శుభగుణాలను ఎల్లప్పుడును విడనాడక సదా ప్రవర్తిస్తాను.)
విశేషం: పెద్దలకు సేవలు చేయటంలో గమనించవలసిన ముఖ్యాంశాలు. 1. సేవకులకు ఆ పనులు నియోగించక, తానే చేయటం, 2. ఆ సేవ హృదయపూర్వకంగా భక్తి భావంతో చేయటం.
కడు మృదువు లనుచుఁ దేఁకువ ! సెడి యెపుడుఁ జరింప భరతసింహులు గోపం
బడరిన నాశీవిషముల ! వడువునఁ గ్రూరు లని వెఱపు వదలక కొల్తున్.3-5-305
(భరతవంశంవారిలో శ్రేష్ఠులైన పాండవులు ఎంత మెత్తటివారో అంత కఠినులు. వారు మనసు మెత్తనివారని తెలిసినా ఎప్పడూ వారిపట్ల భయం లేకుండా ప్రవర్తించను. వారికే కోపం వస్తే పాముల్లాగా భయంకరులు. మనసు గట్టిపడి బాధిస్తారు కూడా. అందువలన వారికి ఎప్పుడూ భయంతోనే సేవలు చేస్తుంటాను.)
మాయత్త పృధ్వీసమానఁ బృథాదేవిఁ ! గుంతిభోజాత్మజఁ గోమలాంగి
సతతంబు భోజనస్నానాదికములయం ! దిమ్ముగఁ బరిచర్య యేన చేసి
సంప్రీతఁ జేయుదు; జనవంద్యుఁ డగు ధర్మ ! తనయునిబంతి నిత్యంబుఁ బసిడి
పళ్ళెరంబులఁ గుడ్చు బ్రాహ్మణు లతిపుణ్యు లెనిమిదివేలు సమిద్ధమతులు
యతులు పదివేలు; వారల కనుదినంబు ! నన్నపానంబు లర్హసహాయ నగుచు
నొడికముగ నేన కావింతు నుచిత వస్త్ర ! భూషణాదులఁ బరితోషముగ నొనర్తు.3-5-306
(మా అత్తగారు కుంతీదేవి కుంతిభోజుడు అనే మహారాజుగారి కూతురు. ఓర్పులో భూదేవితో పోల్చదగింది. సుకుమారి. ఆమెకు స్నానం, ఆహారం మున్నగు సదుపాయాలను స్వయంగా నేనే సమకూరుస్తుంటాను. ప్రజలచేత ఆరాధించబడే ధర్మరాజు ప్రతిదినం భోజనసమయాన తన సహపంక్తిని ఎనిమిదివేలమంది బ్రాహ్మణులకు బంగారుకంచాలతో అన్నసంతర్పణ చేస్తాడు. అట్లే సన్యాసులు పదివేలమందికి భోజనం పెడతాడు. వారికి అందరికి నేనే స్వయంగా వడ్డన వార్పులు సరిచూచి, వారికి తగిన బట్టలు ఆభరణాలు, సమకూరుస్తుంటాను. అందరికీ సంతోషం సమకూర్చటం నా కర్తవ్యంగా పరిగణిస్తాను.)
ఇంకను చెప్పుతాను. సావధానంగా వినుము. ధర్మరాజు దినచర్య విశిష్టవైభవోపేతమైనది. ఆయన అంతఃపురంలో నూరువేలమంది సేవకులు పవలు రాత్రి అనక సేవలు చేస్తుంటారు. ఆ సేవకులు రత్నాలతో పొదుగబడిన బంగారు ఆభరణాలు ధరించేవారు. వారు చేతులలో ఎల్లప్పుడు పాత్రలను పూని అతిథులకు అభ్యాగతులకు ఆహారపానీయాలు సమకూరుస్తుంటారు. వారందరు ఎట్టి జాగరూకతతో ఉన్నవారో ఏ ఉపచారాలు చేస్తున్నారో ఏ అపచారాలు చేస్తున్నారో అని నేను ఎల్లప్పుడూ కనిపెట్టుతుంటాను. ఎల్లప్పుడూ మదజలం స్రవించే పట్టపు టేనుగులు లక్షలు; గొప్పబలం వేగం కల గుర్రాలు లక్షలు ఉన్నవి. వాటికి అన్నింటికి సరిఅయిన ఆహారాన్ని సమకూర్చటానికి, వాటిని అదుపులో పెట్టి క్రమశిక్షణలో నిర్వహించటానికి తగినవారిని నేనే నియమిస్తుంటాను. బొక్కసంలో ఉండే రత్నరాసులు బంగారు వస్తువులు నిత్యం జరిగే ఆదాయవ్యయాలు అన్నీ నాకు తెలియును. నాకు తెలియని అంశం ఒక్కటికూడా లేదు. సేవకులలో చివరిశ్రేణికి చెందిన గొల్లవారలకు, తదితరులకు ఇచ్చే జీతభత్యాలు నేనే సరిచూస్తుంటాను. సుగృహీత నామధేయులైన పాండవులు తమ సంసారపు బరువును నామీద మోపి, హాయిగా తమకు ఇష్టమైన తావులలో విహరిస్తుంటారు. కుటుంబాన్ని అంతటిని ఈదే దానిని నేనే. అన్నివిషయాలను నేనే చూచుకొంటాను. అన్నివైపులా జాగరూకత వహిస్తాను.
వేగ జాము కలుగ వెడనిద్రఁ బొందుదుఁ ! గాని రాజ్యభారకార్యయుక్తి
నబ్జనయన! నాకు నాహార నిద్రల ! కెడయు లేదు సువ్వె యెల్లప్రొద్దు.3-5-308
(పద్మాలవంటి కన్నులు కల ఓ సత్యభామా! తెలవారుటకు ఇంకా ఒక జాము సమయం మాత్రమే ఉన్నప్పుడు నాకు కొంత నిదుర పోవటానికి అవకాశం లభిస్తుంది. ఎల్లప్పుడు నాకు కడుపునిండ తిండి తినటానికి, కనుల నిండ నిదుర పోవటానికి సరిఅయిన తీరికే ఉండదు.)
ఇట్టి వర్తనముల నెపుడుఁ బాండవులకుఁ ! దగిలి ప్రియము సేయ దగితిఁ గాని
మగువ ! నీవు సెప్పు మందులు మాఁకులు ! నింద్రజాలములను నే నెఱుంగ.‘ 3-5-309
(ఓ సత్యభామా! నేను నుడివిన పతివ్రతాచర్యలవల్లనే నా భర్తల అనురాగాన్ని చూరగొనగల్గితిని. పాండవులకు ప్రియం చేయటం మాత్రమే నే నెఱిగిన ధర్మం. నీవు చెప్పిన మందులు, మాకులను గూర్చి నాకు తెలియదు. ఇంద్రజాలకళ నాకు చేతగాదు.’)
ఇలా ద్రౌపది సత్యభామకు మెత్తమెత్తగా చీవాట్లు పెడుతూ తా ననుసరించే విధానాలను చెప్పింది. సత్యభామ తన ప్రవర్తనకు సిగ్గుపడి తన మాటలను నవ్వులకు అన్నమాటలుగా తీసుకోమని ద్రౌపదితో అంటుంది. ద్రౌపది సరే అని పలికి ఇంకా పతివ్రతా ధర్మాలను సత్యభామకు చెప్తుందీ విధంగా.
‘పతిమనసు నాఁచికొనియెడు ! చతురోపాయంబు నీకుఁ జపలాక్షి! సుని
శ్చిత మతిఁ జెప్పెద విను మూ ! ర్జితమును ధర్మాన్వితము సుశీలంబునుగన్. 3-5-313
(‘చంచలమగు కన్నులు గల ఓ సత్యభామా! భర్తయొక్క మనస్సును ఆకర్షించి పట్టుకొనే ఉపాయం నీకు చెప్పగలను. సావధానంగా ఆకర్ణించుము. ఆ ఉపాయం అచ్చమైన తెలివితేటలతో కూడింది; గొప్పతనాన్ని చేకూర్చేది. ధర్మంతో కూడింది. మంచి నడవడి చేకూర్చేది సుమా! ( మందులకు, మాకులకు వశీకరణ తంత్రాలకు ఇంద్రజాలానికి సంబంధించినది కాదు అనే హెచ్చరిక అంతర్గర్భితం ).
పతిఁ గడవంగ దైవతము భామల కెందును లేదు; ప్రీతుఁడై
పతి గరుణించెనేనిఁ గలభాషిణి ! భాసురభూషణాంబరా
న్విత ధనధాన్యగౌరవము విశ్రుతసంతతియున్ యశంబు స
ద్గతియును గల్గు; నొండుమెయిఁ గల్గునె యెన్నితెఱంగు లారయన్?3-5-314
(అవ్యక్తసుందర వాక్యాలు పలుకునట్టి ఓ సత్యభామా! భర్తను మించిన దైవం భార్యకు మరొకరు లేరు. భర్త దయచూపితే భార్యకు ఆభరణాలు లభిస్తాయి. ధన ధాన్య సంపదలు కలుగు తాయి. మంచి సంతానం ఏర్పడుతుంది. కీర్తి లభిస్తుంది, పుణ్యం ప్రాప్తిస్తుంది. ఆలోచించి చూస్తే భర్తవలనకాక వేరువిధంగా భార్యకు అభ్యుదయ పరంపరలు సంప్రాప్తించవు గదా!)
విశేషం: చపలాక్షి, కలభాషిణి అనే సంభోదనలలో సత్యభామ పట్ల ద్రౌపది ’ఎత్తిపొడుపు’ ధ్వనిస్తుంది.
కరము దుఃఖపడిన గాని యొక్కింత సౌ ! ఖ్యంబు ధర్మగతియుఁ గలుగ దెందుఁ
జూడు మబల ! భర్తృశుశ్రూష ఫలము సం ! తత శుభంబు గలదు, ధర్ము వొదవు. 3-5-315
(ఓ సత్యభామా! ఎంతో శ్రమిస్తే కాని కొంచెం సుఖం కలుగదు. పుణ్యం లభించటానికి మిక్కిలి శ్రమించవలసి ఉంటుంది. భర్తకు పరిచర్య చేస్తే సులువుగా పుణ్యం లభిస్తుంది. శీఘ్రంగా ఎల్లప్పుడూ మేలు కలుగుతుంది. దానివలన ధర్మం కూడా ప్రాప్తిస్తుంది.)
కావున నిత్యము సమ్య ! గ్భావము ప్రేమంబు వెరవు భక్తియుఁ బ్రియముం
గావింపుము నీ ప్రియునెడ ! భావముఁ దా నెఱిఁగి భర్త బాగుగ మరగున్. 3-5-316
(ఓ సత్యభామా! నీకు ప్రియుడైన నీ భర్తయెడ ప్రతిదినం సరైన ఆలోచన, ప్రేముడి, ఉపాయం, ఆరాధనాభావం, సంప్రీతి ప్రసరింప జేయుము. నీ ప్రేముడి గుర్తించి నీభర్త నీయెడ అనురాగంతో ప్రవర్తిస్తాడు.)
వనజాక్షుండు గడంగి నీ దగు గృహద్వారంబు సేరంగ వ
చ్చెననంగా విని లెమ్ము సంభ్రమమతోఁ జెన్నొందు నభ్యంతరం
బునకున్ వచ్చిన నాసనాదికరణంబుల్ దీర్పఁ దత్తజ్జనం
బు నియోగించితి నంచు నుండక ప్రియంబుల్ సేయు మీవుం దగన్. 3-5-317
( నీ భర్త అయిన శ్రీకృష్ణుడు పద్మాలవంటి కన్నులు కలవాడు. అతడు నీ ఇంటి గుమ్మం దగ్గఱికి చేరగానే నీవు తొట్రుపాటుతో శీఘ్రంగా ఎదురేగి స్వాగతం పలుకుము. అతడే చెచ్చెఱ నీ అంతఃపురంలో ప్రవేశిస్తే, అతడికి కూర్చొనటానికి సదుపాయాలు చేయటానికై సేవకులను పలువురిని నియమించాను కదా అని నీవు ఉపేక్ష చేయరాదు. నీవే స్వయంగా ఎదురేగి అతడిని మన్నించి అతని అనురాగాన్ని చూరగొనుము.)
తివిరి మురారి నీకుఁ గడు తీపుగఁ జెప్పిన పల్కు గల్గినం
గువలయనేత్ర ! నీ మనసు గూడినవారికి నైన నెప్డుఁ జె
ప్పవలదు; దాన నొండొక నెపంబు ఘటింతు రెఱింగి రేని నీ
సవతులు కృష్ణుబుద్ధి విరసంబగు నీదెసఁ దత్ప్రయుక్తిచేన్. 3-5-318
(నల్లకలువలవంటి కన్నులు కల ఓ సత్యభామా! నీయందు మిక్కుటమైన మక్కువ చూపి, శ్రీకృష్ణుడు నీకు సరససల్లాపప్రసంగవశాన ఏదైన రహస్యం చెప్పితే, దానిని నీవు నీ అనుగు నెచ్చెలులకు కూడ చెప్ప కూడదు. ఒకవేళ ఆ సంగతి నీ సవతులకు తెలిస్తే నీమీద నింద మోపి ఆ రహస్యాన్ని బట్టబయలు చేయగలరు. అప్పుడు నీ మీద గల ప్రేమాభిమానాలు శ్రీకృష్ణుడి మనస్సులో సన్నగిల్లుతాయి జారత్త.)
పతికి ననుంగు లైన తగు బంధుల మిత్త్రుల భోజనాది స
త్కృతముల నాదరించుచు నకృత్రిమభక్తినియుక్తి సంతతో
త్థితమతివై చరింపుము; తదీయ హితేతరవృత్తు లైన వా
రతివ ! భవత్సుహృజ్జనము లైనను గైకొనకుండు మెప్పుడున్. 3-5-319
(ఓ సత్యభామా! భర్తకు ప్రీతిపాత్రులైన చుట్టాలకు, మిత్రులకు, ఆహారపానీయాలు మొదలైన సదుపాయాలను సమకూర్చటంలో నీవు ప్రత్యేకమైన జాగ్రత్త వహించుము. వారిని పూజ్యభావంతో గౌరవించుము. భర్త మేలు కోరక అతడికి వ్యతిరేకమైన చర్యలు చేసేవారు, నీకు మిత్రములైనప్పటికిని వారిని ఆదరించకుము.)
విను, ప్రద్యుమ్నాది ! భవ త్తనయులయెడ నైన నేకతంబున నేకా
సనమున నుండుట దూష్యం ! బని యెఱుంగుము; సతులచరిత లతిదుష్కరముల్. 3-5-320
(సత్యభామా! శ్రధ్ధతో ఆలకింపుము. ఆడువారి నడవడి మిక్కిలి కష్టంతో జాగరూకతతో తీర్చిదిద్దుకొనవలసి నట్టిది. ప్రద్యుమ్నాదులు నీకు పుత్ర విర్విశేషులే, అయినప్పటికిని అట్టివారితో కూడి ఏకాంతంగా, ఒకే వేదికపై ఉండరాదు.)
విశేషం : ప్రద్యుమ్నుడు రుక్మిణికి శ్రీకృష్ణుడికి పుట్టిన కొడుకు.
కులవతులును సతులును ని ! ర్మల మతులును నయిన యట్టి మగువలతోడం
జెలిమి యొనరించునది; దు ! ర్విలసిత వనితాభియుక్తి విడువుము తరుణీ ! 3-5-321
(జవ్వని వైన ఓ సత్యభామా! మంచికుటుంబానికి చెంది మంచిబుద్ధి గల పతివ్రతలతో మాత్రమే నీవు స్నేహం చేయుము. వన్నెలవిసనకర్రలై విర్రవీగే వనితలతో ఎన్నడూ కలసిమెలసి తిరుగవద్దు.)
వ. ఇది నీకు పరమ సౌభాగ్యమూలం బయిన యుపాయం’ బనినం ప్రీతచిత్తయై సత్యభామ యిట్లనియె…
ఇక్కడితో సత్యభామకు ద్రౌపది చేసిన పతివ్రతా ధర్మాల బోధ ముగుస్తుంది. ఇది ఒక మంచి ఘట్టం అనిపించి పూర్తిగా వ్రాయటం జరిగింది.
–
Leave a Reply