అద్భుతమైన చైతన్య భావ సముద్రం- “కుంకుడుకాయ”

రాసిన వారు: శైలజామిత్ర
***********************

సముద్రంలో ఎన్ని అలజడులున్నా గంభీరంగానే ఉంటుంది. పైకి చూసేందుకు నీటితో, కెరటాలతో, రాత్రయితే ఆకాశంతో, మరీ చిరా కనిపిస్తే పదిహేను రోజుల కొక్కసారి నిండు చందమామతో నేస్తంగా మనకు కనిపిస్తుంది. నదీ అంతే.. కానీ సెలయేర్లు అలలు లేకున్నా పసిపిల్లల్లా అల్లరి చేస్తాయి. మౌన ముద్రలో ఉన్న మనల్ని కూడా మురిపిస్తాయి.. మరింతగా అలరిస్తాయి.

ప్రఖ్యాత కవి, మచిలీ పట్నం వాస్తవ్యులు డా. రావి రంగారావు గారి ” కుంకుడు కాయ” వచన కవితా గ్రంథం అనేక భావాలతో, ఎన్నెన్నో అనుభవాలతో, అలరించిన ఒక గంభీర స్వరం. ఒక్క మాటలో చెప్పాలంటే ఇదొక అద్భుత మైన భావాల సముద్రం. ఇందులో సామాజిక సమస్యలు అనేకం ఉన్నాయి..
” కవి గుండె తప్పును మాత్రమే వెదకదు. తప్పును ఎత్తిచూపి సరిచేసేందుకు ప్రయత్నిస్తుంది- కవి కాసులకు లొంగడు కనుక.”
– సమాజంలో గుండెను నమ్ముకున్నవారు అచ్చమయిన కవులే తప్ప వేరెవరు కారు. ఇక్కడ కవుల్లో తేడా లున్నాయి. తయారుచేయబడిన వారు, పుట్టుకతో కవులు. ఈ తయారు చేయబడినవారు తమ సొంతగొంతు వినిపించడానికి చాలాకాలం పడుతుంది. కానీ జన్మతః కవులు మాత్రం – ఒక్క కవిత తోనే వారి లోని తీవ్రత, స్వచ్ఛత కనిపిస్తుంది. రంగారావు గారు జన్మతః కవులు అనడం అతిశయోక్తి కాదు.. ఇక ఉదాహరణలోకి వెళదాం..

మనిషికి మనిషికి మధ్య ఒక విధ మయిన భయం ఉంది. ఉంటుంది కూడా. కారణం ఒక మనిషిని మరోమనిషి అంగీకరించలేకపోవడమే. మనసుకు మనసుకు మధ్య ఒక వంతెన ఉంటుంది. కారణం ఒకరికంటే మరొకరు మించినవారు అనుకోవడమే.. ఇలాంటి భేషజాలు లేకుండా కవి ఉంటాడు అనడానికి నిదర్శనం- ఇక్కడ చూడండి... “విమాన ఘోషలు/రైళ్ళ శబ్దాలు/కార్ల హారనులు/స్కూటరు మోతలు కాదు/పాత సైకిలు హృదయం/ నా కవిత్వం…” మరోచోట “ముతక బట్టలు ధరించిన/రైతు నాన్న స్వేదం / నా కవిత్వం…” ఇంకోచోట ” ఈనాటి తరానికి తెలియని /రేపటి తరానికి తెలియాల్సిన / వావిలాల గోపాలకృష్ణయ్య లాంటిది / నా కవిత్వం…”అంటూ తన కవిత్వంలోని వాస్తవాన్ని, గుండెలోని స్వచ్ఛతను మన ముందు ఉంచుతారు. ఇదీ తన కవిత్వం అంటూ మొదటే మనకు పరిచయం చేసుకున్నారు.

కవిత్వం ఎలా ఉండాలనేది ఒక్కొక్కరు తమకు తోచిన రీతిలో చెప్పుకుపోవడం ఆనవాయితీ. కానీ ఆ మాట కూడా అన్న వ్యక్తిని బట్టి విలువ నిచ్చారు తప్ప అందంగా అన్నారని కాదు. నిజంగా అందంగా అనాలన్నా, అందరికి అర్థం అయ్యే రీతిలో చెప్పాలన్నా ఈ వాక్యాలు చూడండి:
“అలంకారాల్ని చూపించి / ఆడంబరాల్తో మెరిపించి / స్పష్టంగా ముఖం చూపించని / పెండ్లికొడుకు కాకూడదు కవిత…”అన్నారు. ” బలవంతంగా ముఖం చూపించని పెండ్లి కొడుకు కాకూడదు / పాటకుడు ” అన్నారు. ఇక్కడ అభివ్యక్తీకరణ గమనించండి. కవిత ఎలా ఉండకూడదో అని తెలిపే తీరు అందర్నీ ఆకట్టుకుంటుంది.

కలలు కనే దేహానికి ఎప్పుడూ విలువ ఉండదు. కలతపడే ప్రాణానికి గుర్తింపు ఉండదు. కారణం కల అవాస్తవం.. కలత వాస్తవం. ఇలాంటి వాస్తవ, అవాస్తవాల మధ్య ఒక పోరాటంలా ఉన్న కవిత “దీపమూ-దేహమూ” దేదీప్యమానంగా వెలిగే కవిత. ఈ సుకవి పదాలు వినండి.. “దీపం తలెత్తుకు బతికేదే కానీ/ తల దించి ఎరుగదు…/ నవ్వుతూ నవ్వించేదే కానీ /నవ్వుల పాలు చెయ్యదు…/ ఈ దీపం/ నా దేశం/పర్యాయ పదాలయితే/ఎంత బావుణ్ను!” అంటారు. ఎంత గొప్ప పదాలు ఇవి? దీపాన్ని, దేశాన్ని పర్యాయ పదాలైతే బావుండుననడం ఎంత గొప్ప అక్షర సాక్షాత్కారం? మనిషి ఆశావాది అనేది నిజం. మనసున్న కవులు ఆశావాదులు అయితే ఇలానే దేశ భవిష్యత్తును కోరుకుంటారు.

చెట్టుకింద చేరిన పిల్లలందరూ చెట్టుకు చిక్కుకున్న గాలిపటం కోసమే కానీ ఆకాశంలో ఎగురుతున్న పక్షుల కోసం కాదు. అలాగే మనిషి కూడా తనకు కావాల్సిన వస్తువు కోసం ఎక్కడ ఉంటుందో వెదుకుతాడు. అలాగే ఇక్కడ ” స్వదేశీ ఆవు” అనే కవితలో ఇలా అంటారు –” ఇప్పుడు /ఒక ఆవు పాలిస్తోంది/ దానికి కాళ్ళు లేవు/ కళ్ళు లేవు/ అయినా పాలిస్తోంది/ ఊరు తాగుతోంది ” అని మొదలు పెట్టి చివరిలో అంటారు “ఆ మధ్య అనుకోకుండా/దాన్ని కొష్టంలోంచి తెచ్చి/ పెత్తందార్ల భవనంలోకి / మార్చారు../పెద్ద సింహాసనంలోకి చేర్చారు../ విదేశీ ‘ఇంజక్షన” చేయించుకుంటున్న / స్వదేశీ ఆవు గురించి / భ్రమలింకా కరిగినట్లు లేదు/పాపం, ప్రజలకు!” అని ముగిస్తారు. వీరి కవిత్వంలో ఈ భావం సులువుగా మనసుకు తాకదు. తప్పనిసరిగా మెదడుకు పని పెట్టాల్సిందే. ఏదో కవిత్వం ఘాటుగా రాసామా, ఆవేశంగా రాసామా అని కానీ, తమ భావాలకు ఎదుటివారు ఆశ్చర్యపోవాలనే ఆలోచనగాని మచ్చుకైనా కనబడవు. ఈ కవి బాధంతా ప్రజల్ని అమాయకుల్ని చేసి మోసం చేస్తున్న ప్రజాస్వామ్యం మీదే.. నిత్యం దగా పడుతున్న సామాన్య జనాల్ని చైతన్యవంతం చేసే దిశలో అర్థవంతమయిన ప్రయోజనాలకోసమే.. వీరి కవితలు “క్షణాల్ని పట్టుకోవాలి”, “మాకూ తలలున్నాయి”, ” పువ్వుల కళ్ళ జెండా”,…మొదలైన కవితల్ని వివరించడానికి ఎన్ని పేజీ లయినా తక్కువే. ఎంత విశ్లేషణ అయినా ఇంకా చాలదేమో అనిపిస్తుంది.

నేడు మనిషి చెయ్యాల్సిన పనిని, చేస్తున్న పనిని వదిలేసి ఏమాత్రం కష్టంలేకుండా సంపాదించాలని, ప్రయత్నించకుండా విజయాన్ని వరించాలని కలలు కంటూ జ్యోతిష్యం వెంట, వాస్తువెంట పరుగులు తీస్తూ, ఊహల్ని వాస్తవాలుగా అనుకుంటూ జీవితమంతా ఒక అయోమయంలో కొట్టుకు పోతున్నాడనేది ఈ కవి ఆవేదన. మనిషిని మేల్కొలిపేదే కవిత అయితే.. ఇక్కడ ఈ కవితలోని కొన్ని అమూల్యమయిన వాక్యాలను మననం చేసుకుందాం:” మన తిండిని/ ఎదురుగా దాచేస్తున్నా/ మనం పట్టించుకోంకానీ /ఆకలి తేరే దెపుడని/ జ్యోతిషం వెంటపడి పరుగులు తీస్తున్నాం / మనకు తాయిలం పెట్టి / మన సుఖాల్ని దోచుకెళుతుంటే / మనకు ఆనందమే కానీ/ కష్టా లెందుకు వచ్చాయని / వాస్తుకు సాగిలపడి మొక్కుతున్నాం..” అని మొదలుపెట్టి చివరి వాక్యాలలో “ఉన్న రెండు కళ్ళు/ మూసేసుకున్న వాడికి /చిచ్చర కన్ను మొలిచే డెప్పుడు? /చీకటి మూలాల్ని కాల్చేసే దెప్పుడు? “అంటూ ముగిస్తారు. ఆంటే కళ్ళు మూసుకుని బతుకుతున్నారు అని ప్రజానీకాన్ని హెచ్చరించే ప్రయత్నమే ఇది. .

కవిత్వమంటే ఒక్కో కవి ఒక్కో నిర్వచనం ఇస్తారు. కొందరు తమ అభిప్రాయాన్ని తమ కవిత్వంలో చూపుతారు. కొందరు విషయాన్ని విశ్లేషణ చేస్తారు. కొందరు మౌనంగాను విశ్లేషిస్తారు. నిత్యం రచనల ద్వారాను, లేక మౌనంతోను వ్యక్తిని, సమాజాన్ని అభివ్యక్తీకరించిన తీరు ఒకే ఒక్క రావి రంగారావు గారికే చెల్లింది. ఇందుకు నిదర్శనం ఈ కవిత “ఒరేయ్.. ప్రశ్నను తన్నిన వాడా?” అనే కవితలో…ఒక కలెక్టర్ ఎదురుప్రశ్న వేసిన రైతును తన్నాడని విని అరవలేదు.. అలాగని మౌనంగాను ఉండలేదు. కవిగా తన ఆవేదనను అక్షర రూపంలోకి మార్చారు. నిజంగా ఈ కవిత ఆ మహానుభావుడు చదవగలిగితే ముఖం మీదే తిరిగి తన్నిన తీరులో ఉండేదనడంలో ఆశ్చర్యం, అతిశయోక్తి లేవు.

“ఒరేయ్ తెల్ల చొక్కా వాడా!/ ‘ఎసి ‘ కారులో తిరిగే ‘టక్’ చేసిన టక్కరివాడా!/ నీవు తన్నింది ఎవరినో తెలుసా!/ ఈ ప్రపంచాన్ని సృష్టించిన బ్రహ్మ దేవుడ్ని./.ప్రాణి కోటిని పోషిస్తున్న విష్ణు మూర్తిని ../చీడలు తెగుళ్ళు కాల్చేసే పరమేశ్వరుడ్ని”… “నీతో తన్నులు తిన్న రైతు/ నిన్ను తిరిగి తన్నలేదు / ఎందుకో తెలుసా/ నీకు భయపడి కాదు/ నీ సంస్కారం చచ్చిపోయింది కాని / అతని సంస్కారం ఇంకా బతికే ఉంది” అంటారు.

సామాన్యంగా కాలానికి అనుగుణంగా నడిచే తీరు మనిషిది. కానీ కవులు మనసున్న మనుషులు కనుక కానితనం, కర్కశత్వం లాంటివి కనబడితే కాలాన్ని ఆయుధంలా వాడతారు. అది ఎలా ఆంటే ఖచ్చితంగా ఇలాగే..దేశం అవినీతి మంటల్లో దహించుకు పోతోంది. అక్రమాల హారాన్ని మెడలో ధరిస్తోంది. అబద్ధాన్ని అందలం ఎక్కిస్తోంది. అత్యాశను అలంకారంగా మలచుకుంటోంది.. మరి ఇవి ఎవరి కర్థం కావాలి? ఎలా అర్థం కావాలి? అనేది ప్రముఖ కవులు రంగారావు గారి ఆవేదనతో సమాజంపై విసిరిన మరో అక్షరాయుధం ” ఈ మంటలు అరెదేప్పుడు” అనే కవిత. దేశం దిగజారుడు చేష్టలు చేస్తుంటే ..” మంటలిలా దేశాన్ని తగలేస్తుంటే/ప్రజలు గొంతు విప్ప రేంటి ?/ మంటలు పెంచుతున్న వాళ్ళను తన్నరేంటి?/కళ్ళు తెరిచి ఫైర్ ఇంజన్లుగా మార రేంటి?/ “ అని వాపోతారు. నిజమే- నీరు ఎవరి కిందకు వస్తే వారే లేవాలి. ఎదుటివారు లేస్తే సరిపోతుందని అనుకుంటే పొరపాటే అవుతుంది. అన్యాయం జరిగిన చోటే నిలదీసి అడగాలి అనే ఈ కవికి అభినందనలు చెప్పాల్సిందే. “ఇప్పుడు మనిషికి తీరిక లేదు/దేశం గురించి ఏడవడానికి…/ముందు ముందు ఎలాగు వీలుండదు/తన గురించి తానే ఏడవడానికి”– ఎంత అద్భుత వ్యక్తీకరణ ? జీవితాన్ని అంచనా వేయడానికి ఎన్నో జన్మలు ఎత్తక్కర్లేదు.అనుభవం చాలు. కాలాన్ని తరచి చూడడానికి మేథ అక్కర్లేదు . మనసుంటే చాలు. అలాగే “మనిషీ -ప్రకృతీ” కవిత చదవాలంటే సమయం కాదు. సమయస్పూర్తి కావాలి.

1952 జూలై 10 వ తారీఖున గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలంలోని అనంతవరప్పాడు గ్రామంలో అచ్చమ్మ, వీరయ్య గార్ల కు జన్మించిన వీరు కృత్రిమ కల్పనా కవులు కారు. అక్షర శిల్పులు. ఈ కవితా గ్రంధం ” కుంకుడు కాయ” అనే పేరులోనే సమాజాన్ని శుభ్రం చేసే తీరులో ఉంది. ఇందులో ఉన్న 51 కవితలలో ప్రతి కవిత మెదడుకు పదును. సమాజానికి అరుదైన బంగారు రజను. చదివిన కొద్దీ ఇంకా ఏదో మిగిలిందనే భావ గర్బితమయిన వచన కవితల సంపుటి ఇది. ఎన్నోవచన కవితల గ్రంధాలు, పద్యాలు, మినీ కవితలతో పాటు ఎన్నో సమీక్షలు, రకరకాల ప్రయోగాలు, కవిత్వమంటే తన స్వార్థమనే ఆలోచన లేకుండా విద్యార్దులను కూడా కవిత్వం వైపు నడిపించాలనే తపన కలిగిన వీరికి ఎన్నో అవార్డులు, రివార్డులు, ఇటు వృత్తిపరంగా, అటు ప్రవృత్తి పరంగా పైరవీలు లేకుండానే సాధించుకుని, తమదైన శైలిని, సాహితీ ప్రపంచంలో తమదైన ముద్రను వేసుకున్నారు. అక్షరమంటే ఆవేదన, ఆగ్రహం… అక్షరం ఆత్మాశ్రయం అయినా సామాజిక చైతన్యం. వీరి ” కుంకుడు కాయ ” కవితాప్రియులకు దివ్య దర్శనం!

You Might Also Like

One Comment

  1. పిఆర్ తమిరి

    కుంకుడు కాయ కవితా సంకలనం లోని కవితలు ( ఇటీవల చదివాను) ఎంత బావున్నాయో సమీక్ష కూడా అంత బావుంది… “మనిషీ -ప్రకృతీ” కవిత చదవాలంటే సమయం కాదు. సమయస్పూర్తి కావాలి. నిజమే మరి… మంచి కవితలు అందించిన రావి గారికీ చక్కగా విశ్లేషించిన శైలజామిత్ర గారికీ ధన్యవాదాలు…..

Leave a Reply