జ్ఞాపకాల పరిమళాలు: స్వర్ణయుగ సంగీతదర్శకులు (1931-1981)

నిఘంటువులు, విజ్ఞానకోశాలు (ఎన్‌సైక్లోపీడియాలు) వంటివి ఎలా తయారవుతాయి? ముందు అలాంటివి తయారు చేయటానికి అవసరమైన ప్రతిభ ఉన్న మనుషులు కావాలి. ఐతే ప్రతిభ ఒకటే చాలదు. దానికన్నా ముఖ్యావసరం ఆ పని చేయాలన్న తపన. ఆ తపనకు తోడు కొంత మొండితనం (అప్పుడప్పుడూ వెర్రితనం కూడా) కావాలి. వీటికి తోడు అవసరమైనవి కూర్చిపెట్టి, ఆలంబన ఇచ్చేవారు కావాలి.

పూర్వం రాజులో, జమీందారులో, సంపన్నులో ఇటువంటి పనులకు ఆసరాగా నిలచేవారు. రాజులూ జమీందార్లూ పోయాక, ఇలాంటి పనులు చేసే బాధ్యత ప్రభుత్వ అకాడెమీలదీ, విశ్వవిద్యాలయాలదీ అయ్యింది. అక్కడ పనులు తొందరగా జరగడం ఆగిపోయాక, స్వచ్ఛంద సంస్థలు ఆ లోటు పూరించటానికి ప్రయత్నిస్తున్నాయి. వీరు చెయ్యాల్సిన (కానీ చెయ్యని) పనులు ఈనాటికీ తపన ఉన్న వ్యక్తుల పూనికతోనే జరుగుతున్నాయి.

సినిమాల్లో సంగీతాన్ని విపరీతంగా అభిమానించి, ఆ సంగీతాన్ని, సంగీతానికి సంబంధించిన వివరాల్ని అందరితోనూ పంచుకోవాలని తపన పడే కొంతమంది చేసిన బృహత్ప్రయత్నం ఈ పుస్తకం. అంతర్జాలంలో తెలుగు చిత్రాల పాత పాటలను వెదుక్కొనేవారికి బాగా పరిచయమైన పాత పాటల పర్ణశాల చిమటమ్యూజిక్.కాం. 1990ల వరకు వచ్చిన తెలుగు సినిమా పాటలు చాలా రకాల వర్గీకరణలతో (తరచు లిరిక్స్, విడియోలతో సహా) ఇక్కడ దొరుకుతాయి. ఆ వెబ్‌సైట్ నిర్వహించే శ్రీయుతులు చిమట శ్రీనివాస్, గూడూరు సూర్యనారాయణలకు సినిమా పాటలంటే ప్రాణం. శ్రీనివాస్‌గారికి “మనం నిత్యం స్మరించుకునే సంగీత దర్శకుల జీవిత చరిత్ర విశేషాలను ఒక పుస్తక రూపంలో పొందుపరచాలనే ఆలోచన” కలిగింది. ఈ పని చేయడానికి ఆయన శ్రీ పులగం చిన్నారాయణను ఎంచుకున్నారు.

పులగం చిన్నారాయణకూ సినిమాలంటే చాలా ఆసక్తి. ప్రస్తుతం సాక్షి సంస్థలో పనిచేస్తున్న చిన్నారాయణ ఇంతకు ముందే మూడు సినిమా పుస్తకాలు – జంధ్యా మారుతం, ఆనాటి ఆనవాళ్ళు, సినీ పూర్ణోదయం – ప్రచురించారు (మా తెలుగునాడి పత్రికకూ కొన్ని వ్యాసాలు వ్రాశారు). శ్రీనివాస్ ప్రోత్సాహంతో చిన్నారాయణ రెండేళ్ళపాటు శ్రమించి, శ్రద్ధగా వివరాలు సేకరించి ఈ పుస్తకాన్ని తయారు చేశారు. అరుదుగా లభ్యమయ్యే ఫొటోలు చాలా సేకరించారు. వ్యాసాలన్నిటినీ చక్కగా సరళంగా తేలిగ్గా చదువుకోవటానికి వీలుగా రాశారు. చాలా వివరాలను బాక్సులు కట్టి ఇవ్వటం బాగుంది. ఇన్ని వివరాలు, విశేషాలు సేకరించిన చిన్నారాయణ ప్రచురణకర్తలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలపెట్టుకున్నారు.  శ్రీ చిన్నారాయణను అభినందించాల్సిందే.

పుస్తకం ప్రచురించామని చెప్పుకోవటానికి ఏదో రకంగా పుస్తకం వేసేసి చేతులు దులుపుకోవటం కాకుండా ఒక ప్రణాళిక ప్రకారం అందంగా, ఆకర్షణీయంగా తీర్చి దిద్దారు. ముందు 18 మంది సంగీత దర్శకులనుకున్నారట; ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం గారి సలహా మేరకు తొలితరం సంగీత దర్శకులను కూడా కలుపుకుంటే చివరికి 30మంది అయ్యారు. వారందరి జీవిత చరిత్రలూ బాల్యంతో మొదలుపెట్టి వీలైనంత వివరంగా చెప్పటంతోపాటు, వారి సంక్షిప్త జీవితచిత్రాలు, సంగీత దర్శకత్వం చేసిన చిత్రాలు, ప్రముఖమైన పాటలు, వారు రాసిన (లేదా వారిగురించి ఇతరులు రాసిన) వ్యాసాలు, సన్నిహితులతో ఇంటర్వ్యూలు, అరుదైన ఫొటోలు, ఇతర పట్టికలు కలిపి వీలైనంత సమగ్రంగా పరిచయం చేశారు. ఉదాహరణకు ఇళయరాజా పరిచయం 46 పేజీలు, ఎస్‌పీబీ పరిచయం 50 పేజీలు ఉంది. అన్నీ కలిపి 597 పేజీలు, అదీ 9.5×7 అం. (1/4 క్రౌన్) సైజులో. మొత్తం ఆర్టుపేపరు. ప్రతి పేజీలో ఫొటోలు, పెద్ద మార్జిన్లు, చదవటానికి వీలుగా కంపోజ్ చేసిన ఫాంట్లు, లేఅవుట్ (డిజైన్ చేసింది జ్యోతి తడికమెళ్ళ), అందమైన ముద్రణ (నవ్య, హైదరాబాదు), మంచి హార్డ్ కవర్ బైండింగు అన్నీ చూస్తే ఈ పుస్తకాన్ని ఎంతో ప్రేమగా, శ్రద్ధగా ప్రచురించారని తెలుస్తుంది. చిమట మ్యూజిక్ సంస్థకు సహాయం చేసే పాటల అభిమానులు చాలామంది జాగ్రత్తగా ప్రూఫులు చూశారట. బాలసుబ్రహ్మణ్యం గారు కూడా స్వయంగా ప్రూఫులు చూశారట. అందుచేత అచ్చుతప్పులు బాగా తక్కువగానే ఉన్నాయి (ఐతే బాలు గారి వ్యాసంలోనే అచ్చుతప్పులు కనిపించటం ఓ ఐరనీ). ప్రణాళికాబద్ధంగా, మంచి ప్రమాణాలతో ఖర్చుకు వెనుకాడకుండా ఈ పుస్తకాన్ని కలెక్టిబుల్ ఎడిషన్‌గా ప్రచురించినవారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.

ఈ పుస్తకానికి  శ్రీమతులు సుశీల, రావు బాల సరస్వతీదేవి, శ్రీయుతులు సినారె, బాలు, కీరవాణిలతో పాటు, రచయిత, ప్రకాశకులు, వారి మిత్రులు ముందు మాటలు రాశారు.

ఇక ఈ పుస్తకంలో ఉన్న సంగీత దర్శకుల వివరాలు:

1) మొట్టమొదటి తెలుగు టాకీ చిత్రానికి (భక్త ప్రహ్లాద; 1931) సంగీతం చేకూర్చిన తొలి తెలుగు చలనచిత్ర సంగీత దర్శకుడు శ్రీ హెచ్.ఆర్. పద్మనాభ శాస్త్రి జీవిత చరిత్ర తొలి ప్రకరణం. ఆ చిత్రం పాటలు ఇప్పుడు అలభ్యం అంటున్నారు.

2) గాలి పెంచల నరసింహారావు గారు 1934లో సీతాకల్యాణం చిత్రంతో తన ప్రస్థానం మొదలుబెట్టి చిత్రంగా సీతారామకల్యాణం (1961) చిత్రంతో ముగించారు. శ్రీ సీతారాముల కల్యాణము చూతము రారండీ పాటే కాక 1936 మాయాబజార్ చిత్రంలో వివాహ భోజనంబు… పాట కూడా ఆయనదే అట.

3) భీమవరపు నరసింహారావు – ఈయన మంచి నటులు కూడానట.

4) ఓగిరాల రామచంద్రరావు – నాగయ్యతో, వాహినితో చాలా చిత్రాలు చేశారు. అక్కినేనితో సినిమాల్లో మొదటి పాటలు పాడించింది ఈయనే (శ్రీ సీతారామ జననం 1944).

5) సాలూరు రాజేశ్వరరావు – 38 పేజీల ప్రకరణంలో ఆయన స్వయంగా రాసిన ఒక వ్యాసంతో పాటు, రావు బాల సరస్వతీదేవి, ఆయన కుమారులు (సంగీత దర్శకులు) వాసూరావు, కోటి, రామలింగేశ్వరరావు రాసిన వ్యాసాలు కూడా ఉన్నాయి. గొప్ప ప్రతిభతోపాటు విపరీతమైన ఆత్మగౌరవం ఉన్న రాజేశ్వరరావుగారు చేసిన సినిమాలకంటే వదిలేసిన సినిమాలే ఎక్కువ అంటారు కోటి.

6) చిత్తూరు వి.నాగయ్య (ఉప్పల దడియం నాగేశ్వరం)

7) బాలాంత్రపు రజనీకాంతరావు– ఆయనతో పెద్ద ఇంటర్వ్యూ ఉంది.

8 ) మాస్టర్ వేణు (మద్దూరు వేణుగోపాల్) – వైజయంతిమాలతో రెండు ప్రైవేటు రికార్డ్స్ పాడించారట. వారి కుమారుడు (నటుడు) భానుచందర్, మిత్రుడు మైలవరపు పూర్ణచంద్రరావుల జ్ఙాపకాలు.

9) సుసర్ల దక్షిణామూర్తి – ఆయనతో పెద్ద ఇంటర్వ్యూ ఉంది.

10) సి.ఆర్ సుబ్బురామన్ – ప్రముఖ గాయని లీల ఆయన దగ్గర సంగీతం నేర్చుకొందట. 31 ఏళ్ళ వయసులోనే చనిపోయారు.

11) ఘంటసాల – శ్రీమతి సావిత్రమ్మ, కుమారుడు రత్నకుమార్‌ల జ్ఞాపకాలు.

12) సాలూరు హనుమంతరావు – రాజేశ్వరరావుగారి సోదరులు.

13) పెండ్యాల నాగేశ్వరరావు – ఆయనే విజయచిత్రలో రాసిన వ్యాసంతో పాటు, కె.బి. (అనుపమ) తిలక్, పెండ్యాల కుమార్తెల జ్ఙాపకాలు.

14) ఆదినారాయణరావు – అల్లూరి సీతారామరాజు చిత్రానికి (తెలుగు వీర లేవరా.. పాటకు శ్రీశ్రీకి జాతీయ పురస్కారం వచ్చింది) సంగీత దర్శకత్వం వహించిన ఆదినారాయణరావు, తొమ్మిదేళ్ళ వయసులో రంప పితూరీ రోజుల్లోనే నర్సీపట్నంలో (సీతారామరాజు విప్లవాన్ని అణచివేశాడని మనం చెప్పుకునే) కలెక్టర్ రూథర్‌ఫొర్డ్ నుంచి సావిత్రి నాటకంలో తన పాటలకు సువర్ణపతకాన్ని అందుకున్నారట. ఆదినారాయణరావుగారు కూడా మన జాతే – పుస్తకాల పురుగు – అట. కొన్ని సినిమాలకి పాటలు, పల్లెటూరి పిల్ల, సువర్ణసుందరి చిత్రాలకు కథలూ రాశారు. భారతీయ సంగీత శాస్త్రము – ఆదినారాయణీయము అనే పుస్తకం రాశారు. ఆయన తొలి సినిమా అగ్రిమెంటు (వరూధిని 1945; ఎస్వీ రంగారావుక్కూడా మొదటి చిత్రం), భార్య అంజలీదేవి జ్ఙాపకాలు ఉన్నాయి.

15) అశ్వత్థామ – భార్య కమల జ్ఞాపకాలు.

16) టివిరాజు – కుమారుడు (సంగీత దర్శకుడు) రాజ్ జ్ఞాపకాలు.

17) ఎమ్మెస్ విశ్వనాథన్. హీరో అవుదామని వచ్చి ఆఫీస్‌బాయ్ అయి చివరికి గొప్ప సంగీత దర్శకుడయ్యాడు; ఆయన ఇంటర్వ్యూ. విశ్వనాథన్ జోడీ రామమూర్తి వివరాలు, ఆయన ఇంటర్వ్యూ కూడా ఉన్నాయి.

18) తాతినేని చలపతిరావు – నటుడూ, పాటల రచయిత కూడా, సినీ మ్యుజీషియన్స్ యూనియన్ ప్రారంభకుడు

19) భానుమతీ రామకృష్ణ

20) బి.  గోపాలం. ప్రజానాట్యమండలితో మొదలైన ప్రస్థానం. ఎందుకనో పల్నాటి యుద్ధం చిత్రంలో ఈయన పాడిన పల్నాడు వెలలేని మాగాణిరా… (ఈయన సిగ్నేచర్ గీతం) ప్రస్థావన ఈ పుస్తకంలో లేదు.

21) రమేశ్ నాయుడు. మొదట బొంబాయిలో మరాఠీ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారట. కిశోర్ సాహు హిందీ చిత్రం హామ్లెట్ చాలా పేరు తెచ్చింది. మేఘసందేశం చిత్ర సంగీతానికి జాతీయ అవార్డు. పిల్లల చిత్రం ఆజాదీ (మాకూ స్వాతంత్ర్యం కావాలి) నిర్మాతగా ఇంకో జాతీయ అవార్డు. రావు బాల సరస్వతీదేవి జ్ఙాపకాలు.

22) రాజన్-నాగేంద్ర – తెలుగువారేనట. ఇంటిపేరు ఐరావతం వారు. రాజన్‌తో ఇంటర్వ్యూ.

23) కె.వి.మహదేవన్ – కృష్ణన్ కోయిల్ వెంకటాచలం మహదేవన్. పుహళేందిపై వ్యాసం, బాపురమణ, బాలు జ్ఞాపకాలు.

24) ఎస్.పి. కోదండపాణి – ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యాన్ని చలనచిత్రాలకు, జేసుదాస్‌ను తెలుగువారికి పరిచయం చేసిన ఈయన 42 ఏళ్ళ వయసులోనే చనిపోయారు. కుమారసముడు ఎస్‌పీబీ, కుమారుడు ఈశ్వర్‌ల జ్ఞాపకాలు.

25) జి.కె. వెంకటేశ్ – గురజాడ కృష్ణదాస్ వెంకటేశ్ తెలుగువాడే ఐనా కన్నడ చిత్రాల నటరాజు రాజ్‌కుమార్ చితాల్లో చాలావాటికి ఈయనే సంగీత దర్శకుడు, బాలనటుడుగా సినిమాల్లో ప్రవేశించారట. పీబీ శ్రీనివాస్ జ్ఞాపకాలు.

26) సత్యం – చెళ్ళపిళ్ళ సత్యన్నారాయణశాస్త్రి గురించి ఎస్‌పీబీ, వాసూరావు జ్ఞాపకాలు.

27) జె.వి. రాఘవులు – ఆయనతో ఇంటర్వ్యూ

28) చక్రవర్తి – కొమ్మినేని అప్పారావు ముందు నటుడు, డబ్బింగ్ ఆర్టిస్టు. దర్శకుడు అవ్వాల్సినవాడు 497 తెలుగు చిత్రాలకి సంగీతదర్శకత్వం చేశాడు.

29) ఇళయరాజా – డేనియల్ రాజయ్య. భారతీ రాజా, బాలుల మిత్రుడు; సినిమాల్లోకి రాకముందు బాలు, ఇళయరాజా, ఆయన సోదరుడు గంగై అమరన్ కలసి ఆర్కెస్ట్రాగ్రూప్‌గా కచేరీలు చేసేవారు. 1976 -2000 సంవత్సరాల మధ్య 700 పై చిత్రాలకు సంగీతదర్శకత్వం వహించారు; నాలుగు జాతీయ అవార్డులు. వంశీ జ్ఞాపకాలు.

30) శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. 44 ఏళ్ళలో తెలుగులో 10,033 పాటలు పాడిన బాలు 30 చిత్రాలకి సంగీత దర్శకత్వం వహించారు.

పుస్తకం చివరిలో ఇచ్చిన పట్టిక ప్రకారం అప్పటి హెచ్.ఆర్. పద్మనాభ శాస్త్రి నుంచి ఈనాటి యోగేశ్వర శర్మ దాకా 278 మంది సినీ సంగీత దర్శకులు ఉన్నారట.

ఈ పుస్తకాన్ని బాలసుబ్రహ్మణ్యంగారికి అంకితమిచ్చారు.

ఈ పుస్తకంలో సంగీతదర్శకుల వివరాలు విపులంగా, ఆసక్తికరంగా ఉన్నా సంగీతం వివరాలు తక్కువగా ఉన్నాయి. ఇక చరిత్రల్లో తప్పొప్పుల విషయాలు వీఏకేరంగారావుగారో, పరుచూరి శ్రీనివాసో చెప్పాలి.

సంగీతదర్శకుల ప్రముఖ గీతాలని ప్రకరణలకి శీర్షికలుగా వినియోగించుకోవటం బాగుంది. ముందు మాటలు కొద్దిగా ఎక్కువయ్యాయి అనిపించింది.

పుస్తకం ధర ఎక్కువగా అనిపించవచ్చు కానీ, ఇంత బాగా ప్రచురించిన పుస్తకానికి సరైన ధరే. సినీ సంగీత ప్రియులు, సినీ చరిత్ర ప్రియులు కొని దాచుకోవాల్సిన పుస్తకం.

స్వర్ణయుగ సంగీతదర్శకులు (1931-1981)
పులగం చిన్నారాయణ

2011

ప్రతులకు:
www.chimatamusic.com (paypal can be used at this site)
లేక
Srinivas Chimata
34361 Eucalyptus Terrace
Fremont, CA 94555
chimata.music@gmail.com
600రూ, 60$; 597 పేజీలు


***********************************
చికాగో మెడికల్ స్కూల్‌లో సైకియాట్రీ ప్రొఫెసర్ డా. జంపాల చౌదరికి తెలుగు, సాహిత్యం, కళలు, సినిమాలు అంటే అభిమానం. తానా పత్రిక, తెలుగు నాడి పత్రికలకు, మూడు తానా సమావేశపు సావెనీర్లకు, రెండు దశాబ్దాలు కథాసంపుటానికి సంపాదకత్వం వహించారు. తానా, ఫౌండేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫారంస్ ఇన్ ఇండియా (ఎఫ్.డి.ఆర్.ఐ.), మరికొన్ని సంస్థలలోనూ, కొన్ని తెలుగు ఇంటర్నెట్ వేదికలలోనూ ఉత్సాహంగా పాల్గొంటుంటారు; చాలాకాలంగా తానా ప్రచురణల కమిటీ అధ్యక్షులు. పుస్తకం.నెట్‌లో జంపాల గారి ఇతర రచనలు ఇక్కడ చదవవచ్చు.

***********************************

You Might Also Like

16 Comments

  1. jagadeeshwar reddy

    అశ్వత్థామ పాటలన్నీ విలక్షణ బాణీలు. ఆయన పాటల్ని ఉటంకించకపోవడం కొంత బాధనిపించింది. ముఖ్యంగా ‘ఎంత మధుర సీమ ప్రియతమా, కలయేమో ఇది నా జీవిత ఫలమేమో’ పాటలు నభూతో నభవిష్యతి. ఈ పుస్తకం రెండో ముద్రణకోసం కొన్ని పాటల్ని ప్రత్యేక జాబితాగా పంపుతున్నాను.

    అశ్వత్థామ పాటల పల్లకి
    …………………………….
    01. జోజోజో వయ్యారి కదే – చిన్నకోడలు (1952)
    02. రారాదొ రా చిలుకా – చిన్నకోడలు (1952)
    03. కలయేమో ఇది నా జీవిత ఫలమేమో – పక్కింటి అమ్మాయి (1953)
    04. ఆ మనసేమో – రేచుక్క (1954)
    05. ఎక్కడిదీ అందం – రేచుక్క (1954)
    06. ఆహా భలే చిరుగాలి – సంక్రాంతి (1955)
    07. వద్దురా కన్నయ్యా – అర్ధాంగి (1955)
    08. కలలోని గాలిమేడ – చివరికి మిగిలేది (1960)
    09. అందానికి అందం నేనే – చివరికి మిగిలేది (1960)
    10. కవికోకిల తీయని పలుకులలో – చివరికి మిగిలేది (1960)
    11. ఎంత మధురసీమ ప్రియతమా – దేవాంతకుడు (1960)
    12. జగమంతా మారినదీ జవరాలా – దేవాంతకుడు (1960)
    13. కలలుగనే వేళ ఇదే కన్నయ్యా – మా వదిన (1967)
    14. శ్రీగౌరి శ్రీగౌరినే – విచిత్ర దాంపత్యం (1970)
    15. బ్రహ్మపట్నం పోదమంటే – విచిత్ర దాంపత్యం (1970)
    16. నా మనసే వీణయగా మ్రోగనీ – విచిత్ర దాంపత్యం (1970)
    17. నిన్నే వలచితినోయి – పసిడి మనసులు (1970)
    18. జీవితమే ఓ పూబాట ఆడుకో సయ్యాట (1970)
    19. రానిక నీకోసం సఖీ రాదిక వసంతమాసం – మాయని మమత (1970)
    20. అమ్మాలాంటి చల్లనిదీ – మానవుడు దానవుడు (1972)
    21. అణువు అణువున వెలసిన దేవా – మానవుడు దానవుడు (1972)
    22. పచ్చని మన కాపురం పాల వెలుగై – మానవుడు దానవుడు (1972)
    – గొరుసు

  2. venkateswara rao nandipati

    endaro mahanu bhavulu andhariki vandanalu.mukhyanga alanati sangeeth vythalikulu ga keerthincha badina maha sangeeth darsakula vishayalu
    uthama abhiruchi kala telugu prajalaku andhinchina thiyya theniya utta
    ee pustakamu.andhinchina prathi okkariki telugu prajala tharapuna naa
    kruthgnathalu thelupu kuntunnanu.

    thank you sir

    venkateswara rao Nandipati

  3. nandish

    Nice site to listen songs of different films
    HAT’S OFF

  4. dvrao

    2) ‘దానవీరశూరకర్ణ’లోని ‘ఏ తల్లి నినుగన్నదో’ పాట పెండ్యాల లిస్టులో ఉంది. అది సాలూరువారు చేసింది కాదా?

    దీని వెనుక ఏమైనా కధ వుందా?

  5. Srinivas Chimata

    Chowdary gaaru,

    I think that Pulagam already mentioned in his foreword that the filmography of many music directors was not complete and would try to compile the complete list of movies in the second edition.

    Thanks for the corrections. We will take them in to the second edition. Whoever bought the first edition would get the second edition book for the half price (in US only).. does the deal sound fair? 🙂

  6. Jampala Chowdary

    @Srinivas Chimata:

    >> 28) చక్రవర్తి – 497 తెలుగు చిత్రాలకి సంగీతదర్శకత్వం చేశాడు
    */
    I guess Chakravarthi did 950+ movies. Let me check the correct number in his chapter

    చక్రవర్తి 959 సినిమాలకు సంగీతదర్శకత్వం చేశారని (పే. 485)లో ఉన్నా, పట్టికలో ఇచ్చినవి 497 మాత్రమే.
    ఇంకో విషయం: రాజా (1999) చిత్రంలో చక్రవర్తి నటించింది సంగీత దర్శకుడిగానే (చక్రవర్తి?), సౌందర్య తండ్రిగా కాదు.
    చక్రవర్తి బంగారు సంకెళ్ళు చిత్రానికి సహాయ సంగీతదర్శకుడిగా పనిచేశారా? ఒక పాట పాడారు ఆ చిత్రంలో.

  7. Srinivas Chimata

    Sure Chowdary gaaru.
    We have decided to go cheaper on the second edition. We are planning to price it @ Rs 350.00 with 200 more additional pages. One reviewer in India ironically wrote that the book was meant for the US based Telugu folks, not for the locals!!

    Thanks for all your support.
    Srinivas Chimata

    1. Jampala Chowdary

      పుస్తకం ధర తగ్గించటమూ, రెండో ఎడిషన్ రావటమూ బాగానే ఉంది కానీ, అప్పుడే రెండో ఎడిషన్‌కి రెండు వందల పేజీల కొత్త విషయాలు అంటే మొదటి ఎడిషన్ కొనుక్కొన్నవాళ్ళం వెర్రిముఖాలేసుకొని, ఐఫోన్ రాగానే ఎగబడి కొనుక్కున్నవాళ్ళు తర్వాత వెర్షన్ వచ్చినప్పుడు ఇదైనట్లు, ఇదవుతూ ఉండాలా? 🙁

  8. Jampala Chowdary

    ఈ పుస్తకం అప్పుడే రెండవ ముద్రణకు వస్తుందంటే ఆశ్చర్యంగానూ, సంతోషంగానూ ఉంది. ఈ పుస్తకాన్ని తక్కువ ధరలో (పేపర్‌బాక్, తక్కువ ధర కాగితం వగైరా; అఫ్‌కోర్స్, పుస్తకం నాణ్యత కూడా తగ్గుతుందనుకోండి) అందించే ఆలోచన ఉందా?

    బంగారు సంకెళ్ళు చిత్రానికి సంగీతం అందించిన చాంద్ అసలు పేరు పూర్ణచంద్రరావే. ఇంటిపేరు గుర్తు లేదు. దాని తర్వాత ఇంకే చిత్రానికీ అతను సంగీతం అందించిన గుర్తు లేదు.

  9. Sharath Krishna

    Dear Sirs

    Reading the review itself is so plesant. I know how much happiness I would be experiencing when I read the book itself.

    My humble salutations to Pulagam garu, Srinivas garu and more so to beloved balugaru. Andaru mahanubhavule andariki vandanamulu.

    Samastha Lokah Sukhinobhavanthu…

    Sharath

  10. Srinivas Chimata

    /*
    1) ఘంటసాల గారి కన్నడ సినిమాల లిస్టులో ‘మాయాబజార్‌’ లేదు. (20 ఏళ్లక్రితం ఆఫీసు పనిమీద నేను బెంగళూరు వెళ్లినప్పుడు ఆ కేసెట్‌ కొన్నాను. అన్ని బాణీలూ తెలుగులోవే. తెలుగు మాయాబజార్‌ పాటలకు ఏమాత్రం తీసిపోనివి)
    */
    I will let Pulagam know about it.

    /*
    2) ‘దానవీరశూరకర్ణ’లోని ‘ఏ తల్లి నినుగన్నదో’ పాట పెండ్యాల లిస్టులో ఉంది. అది సాలూరువారు చేసింది కాదా?
    */
    I should be at fault, as I compiled all the list. I was very well aware of the fact that this song was done by Saluru only. I deliberately avoided such songs (that were originally done by a different MD – a few examples: three songs in nammina banTu’ taluchukunTE mEnu pulakarinchEnu etc).. somehow, this song slipped from our proof-reading. I will correct it in the next edition. Thanks for pointing it out.

    /*
    3) పుస్తకం చివర్లో ఇచ్చిన మిగతా సంగీత దర్శకుల జాబితాలో చాంద్‌, మైలవరపు పూర్ణచంద్రరావు (అందం ఉరికింది – వయసుతో పందెం వేసింది/ బంగారు సంకెళ్లు) అనే పేర్లు విడిగా ఉన్నారు. ఇద్దరూ ఒక్కటి కాదా?
    */
    No idea.. Pulagam has to check his sources.

    /*
    4) ఆయా దర్శకుల ఆణిముత్యాలంటూ ఇచ్చిన పాటల జాబితాలో కొన్ని అపురూపమైన పాటలు వదిలేసి, అనవసరమైన పాటల్ని చేర్చారేమో అనిపించింది.
    */
    I am curious to know which songs you were refering to. As a rule of thumb, we did not want to go over three pages. I put down all the songs that I usually like.. probably due to our age differences (I am in the early 40’s), I may have preferred more 70’s to the 50’s/60’s of a few music directors.

    /*
    5) గొప్ప పాటలకు బాణీలు సమకూర్చిన ‘విజయా కృష్ణమూర్తి’లాంటి మరికొందరు సంగీత దర్శకులతో ఇలాంటి పుస్తకం మరొకటి వస్తే నాలాంటి వారికి పండగే.
    */
    I like Vijaya Krishnamurthy too.. I instantly fell in love with his Jaganmohini song, http://www.chimatamusic.com/telugu_songs/playcmd.php?plist=8036, though I listened to it for the first time a few years ago. But Pulagam could not even get his picture, though he tried very hard to find some sources in Chennai. We can not get even 2, 3 pages of matter on little-known music directors like him.

    /*
    ఈ సందర్భంలో పులగం చిన్నారాయణగారిని ‘పుస్తకం డాట్‌.నెట్‌’ ముఖంగా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.
    */
    Thanks for your kind wishes and I will pass them on to Pulagam.

  11. jagadeeshwar reddy

    పులగం చిన్నారాయణగారి ‘స్వర్ణయుగ సంగీత దర్శకుల’ పుస్తకంపై జంపాలగారి సమీక్ష బాగుంది. నిజమే! వారన్నట్లు తపన ఉన్న వాళ్ల పూనికతోనే ఇలాంటి అద్భుత గ్రం«థాలు ఉద్భవిస్తాయి. ఈ మధ్య కాలంలో ఎంతో శ్రద్ధతో, మక్కువతో చివరంటూ చదివిన పుస్తకం ఇది. ఈ పుస్తకం వెనక రచయిత శ్రమ కొట్టొచ్చినట్టు కన్పిస్తోంది. ఇక ఇలాంటివి తయారు చేసేప్పుడు కొన్ని పొరపాట్లు దొర్లడం చాలా సహజం. అవి లెక్కలోకి తీసుకోవడం కూడా అనవసరం. అయినా నాకున్న చిన్న అనుమానాల్ని ఈ సందర్భంలో నివృత్తి కోసం అడగొచ్చనుకుంటున్నాను.
    1) ఘంటసాల గారి కన్నడ సినిమాల లిస్టులో ‘మాయాబజార్‌’ లేదు. (20 ఏళ్లక్రితం ఆఫీసు పనిమీద నేను బెంగళూరు వెళ్లినప్పుడు ఆ కేసెట్‌ కొన్నాను. అన్ని బాణీలూ తెలుగులోవే. తెలుగు మాయాబజార్‌ పాటలకు ఏమాత్రం తీసిపోనివి)
    2) ‘దానవీరశూరకర్ణ’లోని ‘ఏ తల్లి నినుగన్నదో’ పాట పెండ్యాల లిస్టులో ఉంది. అది సాలూరువారు చేసింది కాదా?
    3) పుస్తకం చివర్లో ఇచ్చిన మిగతా సంగీత దర్శకుల జాబితాలో చాంద్‌, మైలవరపు పూర్ణచంద్రరావు (అందం ఉరికింది – వయసుతో పందెం వేసింది/ బంగారు సంకెళ్లు) అనే పేర్లు విడిగా ఉన్నారు. ఇద్దరూ ఒక్కటి కాదా?
    4) ఆయా దర్శకుల ఆణిముత్యాలంటూ ఇచ్చిన పాటల జాబితాలో కొన్ని అపురూపమైన పాటలు వదిలేసి, అనవసరమైన పాటల్ని చేర్చారేమో అనిపించింది.
    5) గొప్ప పాటలకు బాణీలు సమకూర్చిన ‘విజయా కృష్ణమూర్తి’లాంటి మరికొందరు సంగీత దర్శకులతో ఇలాంటి పుస్తకం మరొకటి వస్తే నాలాంటి వారికి పండగే.
    ఈ సందర్భంలో పులగం చిన్నారాయణగారిని ‘పుస్తకం డాట్‌.నెట్‌’ ముఖంగా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.
    – గొరుసు

  12. Srinivas Chimata

    /*
    20) బి. గోపాలం. ప్రజానాట్యమండలితో మొదలైన ప్రస్థానం. ఎందుకనో పల్నాటి యుద్ధం చిత్రంలో ఈయన పాడిన పల్నాడు వెలలేని మాగాణిరా… (ఈయన సిగ్నేచర్ గీతం) ప్రస్థావన ఈ పుస్తకంలో లేదు.
    */
    We (Pulagam and myself) both were not aware of the song. We will add it in the second edition.

    /*
    28) చక్రవర్తి – కొమ్మినేని అప్పారావు ముందు నటుడు, డబ్బింగ్ ఆర్టిస్టు. దర్శకుడు అవ్వాల్సినవాడు 497 తెలుగు చిత్రాలకి సంగీతదర్శకత్వం చేశాడు
    */
    I guess Chakravarthi did 950+ movies. Let me check the correct number in his chapter.

    /*
    సంగీతదర్శకుల ప్రముఖ గీతాలని ప్రకరణలకి శీర్షికలుగా వినియోగించుకోవటం బాగుంది. ముందు మాటలు కొద్దిగా ఎక్కువయ్యాయి అనిపించింది.
    */
    The chapter titles’ credit majorly goes to Sarada Akunuri gaaru (A well known singer and the current President of Houston Telugu Association).

    Many people had cordially helped me out and I did not want to ignore their kind support and hence more forewords. But a few people passed me on nice compliments on the forewords as well. 🙂

  13. Srinivas Chimata

    Chowdary gaaru!!

    amOgham.. chAlA chakkagA rASAru. ippaTi varaku pustakam meeda vacchina vyAsAlanninTilO deenikE agra tAmbUlam.

    I have to clarify two things here. First thing is that the book was meant to be a comprehensive bio-graphical one.. It took six months for me to collect the last names of the music directors, Sathyam and Ramesh Naidu. Ironically, many people in the film industry themselves don’t know these two surnames. I am very poor in the music details (raagaalu etc) of the songs and hence I wanted to concentrate more on the bio-graphical details in this book and I hope some one else would step forward to publish a book with a focus on the music details. 🙂

    Secondly, we were proof-reading until the last minute. Even I was correcting a few typos/ mistakes, while we were in the press on the last day and realized that there were still a few minute typos left out here and there. The main reason was that there were too many proof-readers (my friends and Pulagam’s friends) and the typist slightly got lost in the end in incorporating all those corrections.

    I had to ready the book ready by the Feb 20th, as that was the only date that SP Balu gaaru was available for the book inauguration function. But we will correct all typos and mistakes in the second edition, which will be coming in next three, four months. We would provide a platform for enthusiastic readers to let us know the printing mistakes in the first edition and we will later incorporate those ones in to the second edition.

    What else I can tell about Pulagam!! Where can we find such a talented yet humble and non-egoistic writer these days??

    Thanks for all your support. You truly amazed me with this review, as I just had mailed you the book a couple of weeks ago and you already read it and reviewed it. Kudos to you!! You are a great asset to the US based Telugu literary world!!!

    Best Regards,
    Srinivas Chimata
    ChimataMusic.com
    chimata.music@gmail.com

  14. Jampala Chowdary

    I regret that there was an error (now corrected) in the original post with regards to the e-mail address of Srinivas Chimata. The correct address is chimata.music@gmail.com

  15. M.V.Ramanarao

    తెలుగుసినిమా సంగీత దర్శకుల గురించిన సమాచారం చదివాను.చాలా సంతొషం.ఇటువంటి పుస్తకాల అవసరం బాగా ఉంది.కొన్ని తప్పులు ఉన్నా పరవాలెదు.సరి చెసుకొవచ్చును. ఇతర రంగాలు,వృత్తుల గురించీ కూడా ఇలాంటి గ్రంథాల ఆవశ్యకత ఎంతైనాఉంది. ప్రచురణ కర్తలకు నా అభినందనలు. ==
    రమణారావు .ముద్దు

Leave a Reply