మాతృషోడశి (అమ్మపదం -2)

మదర్స్ డే (మే 8, ఆదివారం ) సందర్భంగా అమ్మపదం పుస్తకాన్ని పరిచయం చేసినప్పుడు ఆ పుస్తకంలో పొందుపరచిన మాతృషోడశి అనే 16 శ్లోకాలు (వాయుపురాణం నుంచి తీసుకొన్నవి) గురించి ప్రస్తావించాను. ఈ 16 శ్లోకాలన్నిటికీ, సంస్కృత మూలం, తెలుగు అనువాదం పొందుపరచి, ప్రముఖ చిత్రకారుడు శ్రీ బాపు భావస్ఫోరకమైన, హృదయానికి హత్తుకొనే అందమైన వర్ణ చిత్రాలు గీశారు. వీటిలో మూడు శ్లోకాల అనువాదాల్ని ఇంతకుముందు వ్యాసంలో ఇచ్చాను. అన్ని శ్లోకాల వివరాలు ఇస్తే బాగుంటుందన్న సూచన ననుసరించి అన్నీ ఇప్పుడు ఇస్తున్నాను.

1. గర్భం ధరించడమే దుఃఖం. దానికితోడు ఎగుడుదిగుడు నేల మీద నడవడం అంతకన్నకష్టం. ఆ కష్టం కలిగించినందుకు ప్రతిగా ఈ మాతృపిండాన్ని సమర్పిస్తున్నాను.
2. కొడుకులు కలిగేదాకా తల్లి చింతతో బాధ పడుతుంది. అటువంటి చింత కలిగించినందుకు ప్రతిగా ఈ మాతృపిండాన్ని నీకు సమర్పిస్తున్నాను.
3. ప్రసవపర్యంతం నెల నెలా కష్టం కలిగించినందుకు ప్రతిగా ఈ మాతృపిండాన్ని నీకు సమర్పిస్తున్నాను.
4. పది నెలలు నిండిన తర్వాత, తల్లివైన నీకు ఎక్కువ కష్టం కలిగించినందుకు ప్రతిగా ఈ మాతృపిండాన్ని నీకు సమర్పిస్తున్నాను.
5. ప్రసవం అయిన దగ్గరనుండి చిక్కి శల్యమైపోయినా, నాకు ఎన్నో సేవలు చేయవలసి వచ్చింది. అందుకు ప్రతిగా ఈ మాతృపిండం నీకు సమర్పిస్తున్నాను.

6. తల్లివైన నీకు కష్టం కలుగుతుందన్న ఆలోచన లేక, గర్భంలో ఉన్నప్పుడూ, బయటపడిన తర్వాత కూడా, కాళ్ళతో తన్నినందుకు ప్రతిగా ఈ మాతృపిండాన్ని నీకు సమర్పిస్తున్నాను.
7. మరణం తర్వాత మూడు రాత్రులు దేహం అగ్నిలో శోషిస్తుంది ఆహారం లేక. అందుకు ప్రతిగా నీకు ఈ మాతృపిండాన్ని సమర్పిస్తున్నాను.
8. ఇది అది అనకుండా అన్నిరకాలైన చేదు, కషాయాలూ తినడం, తాగడం చెయ్యవలసి వచ్చింది నావల్ల. అందుకు ప్రతిగా ఈ మాతృపిండాన్ని నీకు సమర్పిస్తున్నాను.
9. రాత్రి పగలు అన్న తేడా లేకుండా నాకు నీ స్తన్యాన్ని ఇవ్వమని వేధించినందుకు ప్రతిగా నీకు ఈ మాతృపిండాన్ని సమర్పిస్తున్నాను.
10. రాత్రిపూట మలమూత్రాలతో నీ పక్క తడిపి నీకు సుఖం లేకుండా చేసినందుకు ప్రతిగా ఈ మాతృపిండాన్ని నీకు సమర్పిస్తున్నాను.
11. చాలా దీర్ఘమైన మాఘమాసరాత్రులందు శిశిరాతపాన్ని దుఃఖాన్ని అనుభవింపచేసినందుకు ప్రతిగా ఈ మాతృపిండాన్ని నీకు సమర్పిస్తున్నాను.
12. ఆకలితో అలమటించిన నాకు, తినడానికో తాగడానికో ఇచ్చి రక్షించినందుకు ప్రతిగా ఈ మాతృపిండాన్ని నీకు సమర్పిస్తున్నాను.
13. నేను వ్యాధితో బాధపడుతున్నప్పుడు బాధపడేదానివి నువ్వే. అందుకు ప్రతిగా నీకు ఈ మాతృపిండాన్ని సమర్పిస్తున్నాను.
14. అందరు పిల్లలూ తినగా మిగిలినదానినే అల్పాహారంగా స్వీకరించిన నీకు ప్రతిగా ఈ మాతృపిండాన్ని సమర్పిస్తున్నాను.
15. శరీరం కళతగ్గి మృత్యుముఖంలోకి వెళ్ళి తిరిగివస్తుంది అందుకు ప్రతిగా ఈ మాతృపిండాన్ని సమర్పిస్తున్నాను.
16. యమద్వారం ముందు మహా ఘోరమైన వైతరణీ నది ఉంటుంది. ఆది నువ్వు దాటటానికి వీలుగా నీకు ఈ మాతృపిండాన్ని సమర్పిస్తున్నాను.

అమ్మపదం – కవిత్వ సంకలనం
ఘంటశాల నిర్మల (సం.)
ఫిబ్రవరి 2011
Founders Business Office
on behalf of GMR Varalakshmi Foundation
25/1, Skip House, Museum Road
Bengaluru, Karnataka, 560 025
దొరుకు చోటు: విశాలాంధ్ర, నవోదయ, ప్రజాశక్తి
314 పేజీలు; 300 రూ.; 20 డా.

***********************************
చికాగో మెడికల్ స్కూల్‌లో సైకియాట్రీ ప్రొఫెసర్ డా. జంపాల చౌదరికి తెలుగు, సాహిత్యం, కళలు, సినిమాలు అంటే అభిమానం. తానా పత్రిక, తెలుగు నాడి పత్రికలకు, మూడు తానా సమావేశపు సావెనీర్లకు, రెండు దశాబ్దాలు కథాసంపుటానికి సంపాదకత్వం వహించారు. తానా, ఫౌండేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫారంస్ ఇన్ ఇండియా (ఎఫ్.డి.ఆర్.ఐ.), మరికొన్ని సంస్థలలోనూ, కొన్ని తెలుగు ఇంటర్నెట్ వేదికలలోనూ ఉత్సాహంగా పాల్గొంటుంటారు; చాలాకాలంగా తానా ప్రచురణల కమిటీ అధ్యక్షులు. పుస్తకం.నెట్‌లో జంపాల గారి ఇతర రచనలు ఇక్కడ చదవవచ్చు.
***********************************

You Might Also Like

8 Comments

  1. GANTI SRIRAMA CHANDRA MURTHY

    జంపాల గారు, చాలా ధన్యవాదాలు. నిన్ననే మాతృవందనం అంటూ బాపుగారి షోడశి మీద శ్రీ చాగంటి వారి అనుగ్రహభాషణం వినే భాగ్యం కలిగింది. వీలయితే మితృలంతా వినండి. ఈటీవీ వాళ్ళేమైనా లంకె పెట్టారైమో చూస్తాను.

    1. Padmaja Godavarthy

      Please check the url for Chaganti`s talk on the book.
      https://www.youtube.com/watch?v=bPExfqQwjog

      Kind regards,

      Padmaja Godavarthy

  2. Padmaja Godavarthy

    Jabali Muni gAru,

    Could you please let us know if we can buy this book online?
    Where can I find the vayu purana/matru sodashi sanskrit slokas ?
    Both original and translation?

    Kind regards,

    Padmaja Godavarthy

  3. పుస్తకం » Blog Archive » తెలుగు పద్యమూ – మా నాన్న

    […] చేశాను. (మొదటి భాగం ఇక్కడ, రెండో భాగం ఇక్కడ). సమతూకం కోసం ఫాదర్స్ డేకి ఏ […]

  4. padmaja Godavarthy

    Namaskaram :

    Thank you so much for introducing us to mAtru sODashi.
    Can you give us the original sanskrit slokas or a link where
    we can find them with English translations ?

    Padmaja

  5. Rajesh Devabhaktuni

    జంపాల చౌదరి గారు.

    ఈ పుస్తకం గురించి ఇక్కడ తెలియచేసినందుకు కృతజ్ఞతలు. చాల చక్కని రివ్యూ. కొన్ని కవితలు అద్బుతంగా ఉన్నాయి. మీరన్నట్లు ఒక్క దాటిన చదివే పుస్తకం కాదిది.

  6. జాబాలిముని

    బిడ్డ గర్భం లో పడిన నాటినుండి శైశవదశ వరకు తల్లి తన సౌఖ్యమును లెక్క చేయక సంతానం కోసం అహర్నిశలు చేసిన త్యాగానికి విలువ కట్ట లేము. పిల్లలు వారి కాళ్ళ పై వారు నిలబడేవరకు వారి పోషణ,రక్షణకు ఆమె పూర్తిగా బాధ్యత తీసుకుంటుంది.ఇట్టి తల్లి ఋణము తీర్చుటకు ఆమె బ్రతికియున్నాంత కాలం ఆమెకు అన్ని సేవలు చేస్తూ శాంతి,సౌఖ్యాలను కలుగజేయడమేగాక,మరణానంతరము పిండ ప్రదానము చేసి ఆమె మనశ్శాంతికి ప్రార్ధనలు చెయ్యవలసిన అవుసరం మన పురాణెతిహాసాలనుండి గ్రహించగలము.

  7. kovila

    Hello, I have read ur Matrushowdasi…wonderful description in that book.. especially the work rendered by Bapus’ Vaayupuraanam slokas as excellent..

Leave a Reply