అక్షరానికి ఒక సవాలు-”మినీకవిత-2009″ ఆనవాలు
రాసిన వారు: శైలజామిత్ర
వ్యాసాన్ని యూనీకోడీకరించడంలో సహకరించిన శ్రావణ్ కుమార్ గారికి ధన్యవాదాలు. – పుస్తకం.నెట్
***********************************
ఉదయాస్తమయాలకు ఆకలి,నిద్ర ఉండవు.అలాగే హృదయానికి కూడా..కానీ వర్షిస్తున్నా,ఎండవేడిమిలో కాల్చేస్తున్నా ఉదయాస్తమయాలు సృష్టిని కంచెలా కాపుకాస్తాయి.వీటన్నింటినీ మించిన హృదయం మాత్రం నేడు కాసులకు కాపలా కాస్తోంది..అయితే శరీరంలో ప్రతి భాగం చిక్కిశల్యమై వైద్యులను పోషిస్తోంది.ఇక్కడ తప్పు ఎవరిది?అని ప్రశ్నించుకుంటే హృదయానిదే..మొక్కకు సరైన మట్టి వేసి..నీరుపోస్తే ఏపుగా పెరిగి వృక్షమై కొన్నివేల మందికి నీడనిస్తుంది.అలాగే బతుకు వృక్షానికి కాస్తంత ఓదార్పును,ప్రేమను అందిస్తే తనతోటి వారిని ఆదరిస్తుంది.కవిత్వం హృదయమున్న వారి సంతానం.ఏలాంటి కదలిక లేని జీవితాలు రాతిశిలలతో సమానం.కొందరికి హృదయమున్న సంగతికూడా తెలియదు.అలాంటివారిని తట్టిలేపి తమ భావాలను వెలికితీసే ప్రయత్నం కొందరు చేస్తారు.బిడ్డకు తల్లి,శిశ్యునికి గురువు,అంతే!ఇక్కడ అదే జరిగింది.ప్రముఖ కవివరేణ్యులు,ఎందరో కవులకు గురువులు,కవిత్వం రాయించటం ఒక భాద్యతగా తీసుకుని 22 గ్రంధాలు రచిస్తే,సంపాదకులుగా 2000 సంవత్సరంనుండి నేటి వరకు దాదాపుగా పది పుస్తకాలు సంస్థ తరఫున ముద్రించారు.మినీ కవిత్వాన్ని ఒక శ్వాసగా ఆశగా తీర్చిదిద్దారు.ఇందులో ప్రతి అక్షరం ఒక సవాలే అనడానికి అతిశయోక్తి కాదు.
ముందుగా వీరి సవాలునే తీసుకుందాం మన జాతీయ పతాకం గురించి అధ్భుతమయిన మినీ కవిత రాసారు.ఇది చాలా ప్రౌఢమయిన మినీ కవిత.”ఆవు తెల్లపాలు/భూమి పచ్చపాలు/దీపం ఎర్రపాలు/మువ్వన్నెలజెండా/ప్రపంచ శాంతికి ఎజెండా!” అనే రావి రంగారావుగారి మినీ కవితలో శుభసూచకాలయిన ఆవును,భూమిని,దీపాన్ని కలగలిపిన జెండాను గుర్తిచేస్తారు..మువ్వన్నెల జెండాలో ఉన్న ఆంతర్యాన్నివిపులీకరించినతీరు మేధోసంపన్నమై ఉండటం విశేషం.మరో అక్షరముత్యాలు వీరివే గమనించండి “కష్టపడి/ప్రక్రియలన్నీ దాటగలిగితేనే/చెరుకుగడ/పంచదారగా మారేది!” అనుకోగానే అన్నీ అయిపోవాలని,అనుకున్నది సాధించేయాలని,లేకుంటే ఆవేదన పడుతున్న నేటి సమాజానికి మంచినీతి ఇది..వీరి కవితలలో విరుపులున్నా వాస్తవికత వుంటుంది.విమర్శలున్నా వైరుధ్యం వుంటుంది.మినీ కవిత 2009 సంకలనంలో ఒక్కో కవిత ఒక్కో మెరుపు అనేది అతిశయోక్తికాదు.”పెరుగులో నీరు పోసినకొద్దీ/మజ్జిగ పలచబడుతుంది.అక్షరాలు ఎక్కువైన కొద్దీ భావం పలచబడుతుంది అనేది నిజం.అందుకు నిదర్శనం పాలపర్తి ధనరాజ్ మినీ కవితను గమనించండి.”ఆటోలు వెళుతుంటే/ఆకాశంలో తిరుగుతున్నాయి/ఆకాశంలో గద్దలు” అనేది నేడు నిత్యం జరుగుతున్న ఆటోల ప్రమాదాలే!అది తెలిపే తీరులో ధనరాజ్ కృతకృత్యులయ్యారనే చెప్పలి.
ఇష్టాఇష్టాలు మనిషిని నిలువునా నిర్వీర్యం చేస్తాయి.ఇష్టమయితే ఆరాలం,కష్టమయితే పోరాటం,రెండూ కుదరకుంటే అసహనం.మనం చాలాసార్లు ఆలోచిస్తాం..ఆవేశపడిపోతాం..ఎందుకిలా అనుకుంటూనే ఉంటాం..కానీ ఈ ఆలోచన అవసరమైనదైతే ,ఆవేశం వికారమవుతుంది..అపుడు హృదయంలో కట్టుకున్న గూడు చెదరిపోతుంది.శరీరానికి అలసట మొదలవుతుంది.అలాంటి సందర్భంలో కొన్ని వాక్యాలు మనల్ని హెచ్చరిస్తూ పలకరిస్తాయి “ఆకాశం అరువు/వెన్నెల దిగులు/భూమి ఏడుపు/మనిషి ఎక్కడ అనేదే/వాటి బాధ” అనే నర్రాప్రభావతి గారి కవిత అర్థమయితే గుండె కొండంత సేదతీరుతుంది.
అలాంటిదే మరొక కవిత “తెల్లకాగితం/కళ్ళొత్తుకుంది/స్వచ్చమైన మనసుమీద/పిచ్చికవిత/పరుచుకున్నందుకు” అంటున్న రావెళ్ళ శ్రీనివాసరావు తీరు ఆలోచింపజేస్తోంది..
అమ్మ అనే పిలిపు ఎన్ని యుగాలయినా అపురూపమే!నాన్న అనే పిలుపు ఎంతకాలమయినా ఆనందమే..కానీ నేడు ఆ అపురూపం ఆరుబయట,ఆ ఆనందం గుడిమెట్లమీద పడి అనాధలవుతుంటే మాత్రం అపురూపం కాస్త అసహ్యంగా మారి,ఆనందం కాస్త ఆవిరవుతుంది.అదే తీరులో జంజం కోదండరామయ్య కవిత “నిన్న అడుక్కుని/సంతానాన్ని పోషించింది/నేడు సంతానం పోషించక/అడుక్కుంటోంది.”అలాంటిదే మరో కవిత కాళహస్తి వెంకట శేషగిరిరావు కవిత “నలుగురికి/గోరుముద్దలు పంచింది/నలుగురింట్లో/గుప్పెడన్నం కోసం/తిరుగుతోంది”…ఇవి చాలు నేటి కుటుంబ విలువలు ఎంతగా జారిపోయాయో తెలియడానికి..
కాలాలన్నీ కలాలయితే కమ్మని గీతమే మన గుండెను తాకుతోంది.కానీ కలాలన్నీ కాలాన్ని అనుసరిస్తే ఆవేదనే మిగులుతుందనే మాటకు..ఒక ఉదాహరణ మనం చూద్దాం “చెప్పులు కుట్టేవాడి/జీవితం కన్నా/చెప్పులే నయం/మాసికలతో/మరమ్మతు చేసుకుంటాయి” అనే పి.అనంతరావు గారి కవితలో ఎంతో అంతరార్థం మనకు గోచరిస్తుంది.అలాంటిదే మోపూరి పెంచల నరసింహం కవిత “బాల్యమంతా/బుట్టబొమ్మ/యవ్వనంలో/ఆటబొమ్మ/వృధ్ధాప్యంలో/బుట్టదాఖలయిన “బొమ్మ”.అధ్భుతం!ఇలాంటి అరుదైన భావ సంపద ఈ మినీ కవితాసంకలనంలో ఉంది..మచ్చుకు కొన్ని గమనిద్దాం “కిలపర్తి దాలినాయుడు కవిత “పద్యం/క్షీరమైతే/మినీ కవిత/వెన్న”
గుడిమెట్ల గోపాలకృష్ణ కవిత “చెప్పు విసరడం/ఫ్యాషనైపోయింది/నేతయ్యాక/’చెప్పు’ చేతల్లో ఉంటె కదా మరి!.” చిమ్మపూడి కవిత “మగ్గం గుంటకి /ఎంత దూరదృష్టి/సాగితే బతుక్కి/సాగకుంటే చావుకి!”
కవిత రాయడానికి కరణం అక్కర్లేదు.కసరత్తు అవసరంలేదు.కలముంటే చాలు.గుండెలో రాయాలనే తపన,తడి వుంటే చాలు.ఈ “మినీ కవిత 2009” పుస్తకంలో ఏ కాగితం తిప్పినా కవిత్వమే కనిపిస్తుంది.ఏ కవితను చదివినా వాస్తవమే కనిపిస్తుంది..ఒక విధంగా మినీ కవితల ద్వారా ఎందరో కవులయ్యారు.మహాకవుల వారసులుగా నిలబడే సాహసం సంపాదించుకుంటున్నారు.అలా ఒకప్పటి కందుర్తి వచనకవిత పితామహులైతే,అదే వారసులుగా మినీకవితా పితమహులు డా||రావిరంగారావు అనడంలో ఆశ్చర్యం లేదు.అతిశయోక్తి అంతకంటే లేదు.
ప్రతులకు
వెల: 116 రూ||
డా|| రావి రంగారావు,20/151-1,3/1,మోనికా రెసిడెన్సీ,కొబ్బరితోట,చిలకలపూడి,మచిలీపట్నం-521002..
సెల్:9247581825
M.V.Ramanarao
మినికవితలకన్నా ముందే చాటువులు ,ఖండ కావ్యాలు,శతకాలు, ఉన్నాయి.మినీ కవితలు మరీ పోట్టివైపోయి బికినీల లాగా ,పిప్పెర్మేంట్ బిల్లలవలె తయారైనవి.Dr .రావి రంగారావుగారుమంచి
కవేకాని ,ఇకపై ఆయన పెద్ద కావ్యాలు రాస్తే బాగుంటుంది. ==రమణారావు.ముద్దు