అమ్మపదం కవిత్వ సంకలనం

(మదర్స్ డే సందర్భంగా…)

ఈ మధ్య అందిన విలక్షణమైన పుస్తకం అమ్మపదం. నన్నయ నుంచి ఇప్పటి కవుల వరకూ, అమ్మ, అమ్మతనం అన్న అంశాలపై వ్రాసిన 156 కవితల సంకలనం. శ్రీమతి ఘంటశాల నిర్మల సంపాదకత్వం, డా. నాయని కృష్ణకుమారి గౌరవ సంపాదకత్వం వహించారు. డా. చేకూరి రామారావు, శ్రీ కె. శివారెడ్డి సంపాదక సభ్యులు. శ్రీయుతులు శీలా వీర్రాజు, నాళేశ్వరం శంకరం, శిఖామణి, ఎండ్లూరి సుధాకర్ సలహా మండలిలో ఉన్నారు.

శ్రీ కోవెల సంపత్కుమారాచార్య, డా. అద్దేపల్లి రామమోహనరావు విపులమైన పీఠికలు వ్రాశారు. ప్రాచీన సాహిత్యంలో మాతృత్వాన్ని ఉదాత్తంగా చిత్రీకరించిన కొన్ని ఘట్టాలనూ, శ్లోకాలనూ, పద్యాలను విశదంగా వివరించారు శ్రీ కోవెల. భావ కవిత్వం రోజుల్నుంచీ ఇప్పటిదాకా కవులు అమ్మను చూసిన విధానాల్ని విపులంగా విశ్లేషించారు డా. అద్దేపల్లి.

ఈ పుస్తకానికి ప్రత్యేక ఆకర్షణ ప్రముఖ చిత్రకారుడు శ్రీ బాపు వేసిన మాతృషోడశి చిత్రాలు. వాయుపురాణంలో మాతృషోడశి పేర 16 శ్లోకాలు ఉన్నాయట. ఈ విభాగాన్ని పరిచయం చేసిన శ్రీ తత్త్వమసి దీక్షిత్ (జి.ఎం.ఆర్. గ్రూప్ ఆధ్యాత్మిక సలహాదారు) మాటల్లో, “మాతృషోడశి తల్లిదనానికి ఇచ్చే నివాళి. ముందుగా తనను బీజదశనుండి భూమిమీదకు సాకారంగా తీసుకువచ్చేదాకా, తర్వాత మనిషిగా తీర్చి దిద్దే క్రమంలో తల్లి పడే బాధలూ, కష్టాలూ ప్రతిబిడ్డకీ ఒకసారి గుర్తుచెయ్యడమేగాక, తను ఎంతచేసినా తల్లిరుణం తీర్చుకోలేడని, అందువల్ల తను చేసే ఈషణ్మాత్రపు సేవలను ఎక్కువగా అంచనా వేసుకోవద్దని బిడ్డలకు విశదపర్చే ఉద్దేశంతో ఈ శ్లోకాల మాలికను ఇక్కడ పొందుపరచటం జరిగింది.”

కొన్ని శ్లోకాలు (తెలుగు అనువాదం):

మొదటి శ్లోకం (ఈ పుస్తకం ముఖచిత్రం బొమ్మ ఈ శ్లోకానికి వేసిందే) అర్థం: గర్భం ధరించడమే దుఃఖం. దానికితోడు ఎగుడుదిగుడు నేల మీద నడవడం అంతకన్నకష్టం. ఆ కష్టం కలిగించినందుకు ప్రతిగా ఈ మాతృపిండాన్ని సమర్పిస్తున్నాను.

ఐదవ శ్లోకం: ప్రసవం అయిన దగ్గరనుండి చిక్కి శల్యమైపోయినా, నాకు ఎన్నో సేవలు చేయవలసి వచ్చింది. అందుకు ప్రతిగా ఈ మాతృపిండాన్ని సమర్పిస్తున్నాను.

పదమూడవ శ్లోకం: నేను వ్యాధితో బాధ పడుతున్నప్పుడు బాధపడేదానివి నువ్వే. అందుకు ప్రతిగా ఈ మాతృపిండాన్ని సమర్పిస్తున్నాను.

ఇలా పదహారు శ్లోకాలు; అన్నిటికీ బాపు తనదైన శైలిలో అందమైన భావస్ఫోరకమైన బొమ్మలు వేశారు. మచ్చుకు ఇంకో బొమ్మ అందిస్తున్నాను.

మాయమ్మ నామీఁద మలపు చల్లనిచూపు మంచువెన్నెలఁ బుక్కిలించునేమో అంటూ పరవశించిన జాషువా, చిమ్ములదూడ వంక నెగజిమ్మెడుకోరలకన్నుదోయితో గుమ్మమువద్దనున్నదదిగో కను నీకయి గుమ్మపాల గోవమ్మ అంటూ చిన్నికృష్ణుని నిద్రలేపటానికి ప్రయత్నిస్తున్న యశోదను వర్ణిస్తున్న విశ్వనాథ, గర్భవతులైనవార్ని గాంచినంత ప్రసవవేదన నెంచి మానసమునందు నెంతయో భయమొందు నా కిప్పు డింత మధురభావన గల్గ నే మాయయొక్కొ! అని ఆశ్చర్యపోతున్న దొప్పలపూడి అనసూయాదేవి, నీవు మడిగట్టుకొని పోయినావు పండ్లు పుష్పములు తీసుకొని దేవపూజకెటకొ నేను నీ కొంగు పట్టుక నీదు వెంట పోవుటకు లేక కన్నీటి బొట్లు రాల్తు అని శోకిస్తున్న నాయని సుబ్బారావుల పద్యాలు ఇందులో ఉన్నాయి.

వీటితో పాటే, (బిడ్డ) ఆకలితోబాటు అమ్మనీ గుర్తుపట్టిన ప్రతీసారీ మూలపడ్డ సంగీతంపెట్టెలోని సంగతులపారవశ్యం వొళ్ళంతా వొలికినట్టవుతుంది అని మురుస్తున్న కొండేపూడి నిర్మల, ఊరి ముంగిట కాపలుండే పోచమ్మోలే ఎయికండ్లతో ఎలిగిపోయే ఎల్లమ్మోలే మాయమ్మ…మమ్మల్నెప్పుడు కంటికి రెప్పోలే కాపాడ్తనే వుంటది అంటున్న జాజుల గౌరి, అవ్వ యాదికొస్తున్న కౌముది, అమ్మ ఎక్కడికి వెళుతుంది? మహా అయితే తాను పెంచిన రక్తంలోకే తిరుగుప్రయాణం కడుతుంది అని ఓదార్చుకొంటున్న ప్రసాదమూర్తి, నన్ను గెలిపించడానికే తను ఓడిపోతుంది, అలా ఓడిపోవటమే గెలుపనుకుంటుంది అమ్మ ఎప్పుడూ అంతే అంటున్న పూడి శ్రీనివాసరావులతో పాటు, ఇంకా చాలామంది ప్రసిద్ధ, అప్రసిద్ధ ఆధునిక కవుల వైవిధ్యభరితమైన కవితలు ఈ సంకలనంలో ఉన్నాయి.

ఇది ఒక్క ఊపులో చదివే పుస్తకం కాదు. కొద్ది కొద్దిగా ఆస్వాదిస్తూ, అనుభవిస్తూ చదువుకొనే పుస్తకం. ఈ సంకలనం వెనుక దాదాపు రెండు సంవత్సరాల కృషి ఉన్నదంటున్నారు సంపాదకులు ఘంటశాల నిర్మల. ఆ కృషి వృధా పోలేదు; సత్ఫలితాన్నే ఇచ్చింది.

పుస్తకం అందంగా ఉంది; అచ్చు తప్పులు నాకెక్కడా అడ్డం తగులలేదు. బాపు బొమ్మలు మరింత సొగసులు కూర్చాయి. ఇంటి గ్రంథాలయంలో ఉండవలసిన పుస్తకం.

అమ్మపదం – కవిత్వ సంకలనం
ఘంటశాల నిర్మల (సం.)
ఫిబ్రవరి 2011
Founders Business Office
on behalf of GMR Varalakshmi Foundation
25/1, Skip House, Museum Road
Bengaluru, Karnataka, 560 025
దొరుకు చోటు: విశాలాంధ్ర, నవోదయ, ప్రజాశక్తి
314 పేజీలు; 300 రూ.; 20 డా.

***********************************
చికాగో మెడికల్ స్కూల్‌లో సైకియాట్రీ ప్రొఫెసర్ డా. జంపాల చౌదరికి తెలుగు, సాహిత్యం, కళలు, సినిమాలు అంటే అభిమానం. తానా పత్రిక, తెలుగు నాడి పత్రికలకు, మూడు తానా సమావేశపు సావెనీర్లకు, రెండు దశాబ్దాలు కథాసంపుటానికి సంపాదకత్వం వహించారు. తానా, ఫౌండేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫారంస్ ఇన్ ఇండియా (ఎఫ్.డి.ఆర్.ఐ.), మరికొన్ని సంస్థలలోనూ, కొన్ని తెలుగు ఇంటర్నెట్ వేదికలలోనూ ఉత్సాహంగా పాల్గొంటుంటారు; చాలాకాలంగా తానా ప్రచురణల కమిటీ అధ్యక్షులు. పుస్తకం.నెట్‌లో జంపాల గారి ఇతర రచనలు ఇక్కడ చదవవచ్చు.
***********************************

You Might Also Like

2 Comments

  1. Madhu

    Dear Chowdary Garu

    Thanks for good review. We need some good knowledge to understand many of the poems. This book should be read by the people with good knowledge of Telugu.

Leave a Reply