కవి, ప్రపంచమూ — వీస్వావ షింబోర్‌స్కా
పోలిష్ కవయిత్రి వీస్వావ షింబోర్‌స్కా 1996లో నోబెల్ బహుమతి స్వీకరిస్తూ చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం యిది. ఈ అనువాదానికి అనుమతులు పొందడం ఎలాగో తెలియక, అనుమతి తీసుకోకుండానే అనువాదం చేశాము. అనుమతి తీసుకోవడం తెలిసిన వారు editor@pustakam.net కు ఈమెయిల్ చేయండి.
Disclaimer: This article was translated with the motive of sharing the speech with Telugu readers. If there are any copyright issues associated, please contact editor@pustakam.net.
ఏ ప్రసంగంలోనైనా ఎపుడూ మొదటి వాక్యమే బాగా కఠినమైందని అంతా అంటూంటారు. దాన్ని దాటేసాను కాబట్టి ఫర్వాలేదు. అయితే రానున్న వాక్యాలు కూడా — మూడవదీ, ఆరవదీ, పదవదీ ఇలా చివరి వాక్యం వరకూ కూడా — అంతే కష్టంగా ఉండబోతున్నాయేమో అనిపిస్తోంది. ఎందుకంటే నేనిక్కడ మాట్లాడాల్సింది కవిత్వం గురించి. ఇదివరకూ ఈ విషయమై నేనేమైనా చెప్పింది చాలా స్వల్పం; నిజానికి దాదాపు ఏమీ లేదనే చెప్పాలి. ఎపుడైనా ఏమన్నా చెప్పినా, ఆ చెప్పటంలో నాకు పెద్ద ప్రజ్ఞ లేదన్న శంక పొంచి వుండనే వుంటుంది. కాబట్టి ఈ ప్రసంగం కాస్త చిన్నగానే ఉండబోతోంది. అన్ని లోపాలూ తక్కువ మోతాదుల్లో వడ్డించినట్టయితే సహించడం తేలిక.
సమకాలీన కవులు తమ గురించి ఎప్పుడూ సంశయాలతో అనుమానాలతో ఉంటారు. వారు అయిష్టంగా మాత్రమే తాము కవులమని బహిరంగంగా ఒప్పుకుంటారు, ఏదో కవులైనందుకు సిగ్గుపడుతున్నట్టు. మన ఈ అట్టహాసపూరితమైన కాలాల్లో సొంత లోపాల్ని ప్రకటించుకోవటమే ఎవరికైనా కాస్త సులభం (కనీసం అవి ఆకర్షణీయంగా ముస్తాబు కాబడినంత వరకూ); కానీ సొంత సామర్థ్యాల్ని గుర్తించడం మాత్రం కష్టం, ఎందుకంటే అవి ఎప్పుడూ నిగూఢంగా దాగి ఉంటాయి, పైపెచ్చు వాటిపై సదరు వ్యక్తికే ఎపుడూ పూర్తి విశ్వాసం ఉండదు. దరఖాస్తులు నింపుతున్నపుడో లేదా కొత్త వ్యక్తులతో సంభాషిస్తున్నపుడో — అంటే తమ వృత్తిని బయటపెట్టక తప్పని పరిస్థితి కలిగినపుడు — కవులు “రచయిత” అనే సాధారణ నామాన్ని వాడటానికే సుముఖత చూపిస్తారు; లేదా, “కవి” అనే బదులు, రాయడంతోపాటూ అదనంగా వారు ఏ వృత్తి చేస్తున్నారో దాని పేరు వాడతారు. తోటివుద్యోగులు మొదలుకొని బస్సు ప్రయాణికుల దాకా, తాము వ్యవహరిస్తున్నది ఒక కవితో అని తెలియగానే, కాస్త కంగారూ అపనమ్మకాలతో ప్రతిస్పందిస్తారు. బహుశా తత్త్వశాస్త్రకారులు కూడా ఇలాంటి ప్రతిస్పందనల్నే ఎదుర్కోవాల్సి వస్తుందేమోనని నేననుకుంటాను. అయితే వారి పరిస్థితి కాస్త మెరుగు. చాలా సందర్భాల్లో వారు తమ ఆసక్తికి ఏదైనా పాండిత్యాన్ని సూచించే పేరుతో అలంకరించగలుగుతారు. తత్త్వశాస్త్ర అధ్యాపకుడు — అంటే అది మరింత గొప్పగా ధ్వనించడం లేదూ!
కానీ ఎక్కడా కవిత్వ అధ్యాపకులు లేరు. అలా ఉన్నట్టయితే, కవిత్వం అనేది ఒక ప్రత్యేక అధ్యయనమూ, క్రమం తప్పని పరీక్షలూ, ఉపయుక్త గ్రంథపట్టికల తోపాటూ పాదసూచికలు జత చేయబడిన సిద్ధాంత వ్యాసాలూ, ఆఖర్లో, వేడుకగా అందజేసే యోగ్యతా పత్రాలూ… ఇవన్నీ అవసరమైన వ్యాసంగమన్న అర్థం వస్తుంది. మరలా దీన్ని బట్టి, అద్భుతమైన కవితలతో కాగితాలు నింపేసినంత మాత్రాన కవిగా అర్హత లభించదన్న అర్థం వస్తుంది. ఏదో ఒక అధికారిక ఆమోద ముద్రతో వున్న కాగితం ముక్క ఇక్కడ ముఖ్యమవుతుంది. రష్యన్ కవిత్వానికి గర్వకారణమైనవాడూ, దరిమిలా నోబెల్ గ్రహీతా అయిన జోసెఫ్ బ్రాడ్‌స్కీ ఈ కారణంగానే బహిష్కరణ శిక్షకు గురయ్యాడన్న సంగతి ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. కవి కాగలిగే హక్కును ఆయనకు దత్తం చేసే అధికారిక ధృవీకరణ ఏదీ లేదన్న కారణంగా వారు ఆయనపై “పరాన్న జీవి” అన్న ముద్ర వేశారు[1].
కొన్ని సంవత్సరాల క్రితం నాకు బ్రాడ్‌స్కీని వ్యక్తిగతంగా కలుసుకునే గౌరవమూ, భాగ్యమూ లభించాయి. నేను గమనించిందేమంటే, నాకు తెలిసిన కవులందరిలోనూ, తాను కవినని కులాసాగా చెప్పుకున్నవాడు ఆయన ఒక్కడే. ఆయన ఆ పదాన్ని ఏ మొహమాటమూ లేకుండా పలికాడు. మొహమాటం మాట అటుంచితే, ధిక్కారపూరితమైన స్వేచ్ఛతో పలికాడు. యువకునిగా తాను ఎదుర్కొన్న క్రూరమైన అవమానాల్ని గుర్తుచేసుకోవడమే దీని కారణమై ఉండవచ్చని నాకనిపించింది.
మనిషి మర్యాద ఇంత సులభంగా దాడికి గురికాని ఇంకాస్త అదృష్టవంతమైన దేశాల్లో, కవులు సహజంగానే ప్రచురింపబడాలనీ, చదవబడాలనీ, అర్థం చేసుకోబడాలనీ ఆశిస్తారు; కానీ, తమను తాము మామూలు గుంపు నుండీ, రోజువారీ నిస్సార వ్యవహారాల్నించీ వేరు చేసుకోవాలని పెద్దగా ప్రయత్నించరు. అయితే మనం దీనికి భిన్నమైన ధోరణిని చూసి కూడా ఎక్కువ కాలమేం కాలేదు. ఈ శతాబ్దపు తొలి దశాబ్దాల్లోనే కవులు తమ విపరీత వేషధారణతోనూ, వింత నడతతోనూ మనల్ని విస్మయపరచాలని ప్రయాసపడటమూ చూసాం. కానీ అదంతా కేవలం జనం ముందు ప్రదర్శన కోసమే. ఇలా ఎన్ని చేసినా, ఎట్టకేలకు, తమ వెనుకనే తలుపులు మూసి, తమ తొడుగుల్నీ, అలంకారాల్నీ, ఇతర అదనపుహంగుల్నీ విడిచిపెట్టి — నిశ్శబ్దంగా, సహనంతో తమ ఆత్మ సాక్షాత్కారానికై ఎదురుచూస్తూ — ఇంకా తెల్లగానే వున్న కాగితానికి ఎదురొడ్డి నిలవాల్సిన క్షణాలు రానే వచ్చేవి. ఎందుకంటే, అంతిమంగా లెక్కలోకొచ్చేది అదే కాబట్టి.
గొప్ప శాస్త్రవేత్తల, చిత్రకారుల జీవితాలపై ఇబ్బడిముబ్బడిగా సినిమాలు రావడంలో యాధృచ్ఛికమేమీ లేదు. అభిలాష వున్న దర్శకులు ఒక ముఖ్యమైన శాస్త్రీయ ఆవిష్కారానికి గానీ, ఒక చిత్రకళాఖండపు ఉద్భవానికి గానీ దారి తీసిన సృజనాత్మక ప్రక్రియను నమ్మశక్యంగా తెరపైకి ఎక్కించాలని తపన పడతారు. వివిధ రకాల శాస్త్రీయ ప్రయోగాల్ని సమర్థవంతంగా చిత్రీకరించటం సాధ్యమే కూడా. వాస్తవికత ఉట్టిపడేట్టు నిర్మించిన ప్రయోగశాలలు, రకరకాల పరికరాలు, సవిస్తారమైన యంత్రసామాగ్రి: వీటితో కూడిన సన్నివేశాలు ప్రేక్షకుల్ని కొంత ఆకట్టుకుంటాయి. అలాగే ఆయా సన్నివేశాల్లోని అనిశ్చితిని మంచి నాటకీయతతో చూపించవచ్చు (స్వల్ప మార్పుతో వెయ్యోమారు మళ్ళీ చేస్తోన్న ప్రయోగం చివరకు ఆశించిన ఫలితాన్ని ఇవ్వనుందా లేదా, వగైరా). చిత్రకారులకు సంబంధించిన సినిమాలు కూడా చక్కగా తీయవచ్చు. తొలి పెన్సిల్ గీత నుంచి తుది కుంచె మెరుగు దాకా ఒక గొప్ప కళాఖండపు పరిణామంలో ప్రతీ దశనీ పునఃసృజిస్తూ, కళ్ళు చెదిరేలా తీయవచ్చు. ఇక సంగీతకారులపై తీసిన సినిమాల్లో సంగీతం వెల్లువెత్తుతూ ఉంటుంది: సంగీతకారుని చెవుల్లో మ్రోగే గీతపు తొలి గమకాలు చివరకు సింఫొనీగా పరిణత రూపాన్ని సంతరించుకోవటాన్ని చూపించవచ్చు. నిజానికి ఈ ప్రయత్నాలన్నీ అమాయకత్వమే అయినప్పటికీ, వీటిల్లో ఏ ఒక్కటీ జనం “ప్రేరణ” పేరిట పిలిచే ఆ వింత మానసిక స్థితిని వివరించలేకపోయినప్పటికీ, కనీసం అక్కడ చూడటానికో, వినటానికో ఏదో ఒకటి వుంటుంది.
ఎటొచ్చీ కవుల స్థితే అధమం. వారి వ్యాసంగం చూడటానికి పరమ పేలవంగా ఉంటుంది. ఒకడు టేబిల్ ముందు కూర్చునో సోఫాలో పడుకునో, నిశ్చలంగా గోడనో లేక ఇంటికప్పునో చూస్తుంటాడు. అప్పుడపుడూ ఈ వ్యక్తి కదిలి ఓ ఏడు పంక్తులు రాస్తాడు, రాసిన వాటిలో మళ్ళీ ఓ పంక్తి కొట్టివేస్తాడు, ఇంకో గంట గడుస్తుంది, ఈ పర్యంతం ఏమీ జరగదు… ఇలాంటి సన్నివేశాన్ని చూసే ఓపిక ఎవరికి ఉంటుంది?
నేనిందాక ప్రేరణని ప్రస్తావించాను. సమకాలీన కవులను అది ఏమిటీ, అసలది నిజంగా ఉంటుందా అని అడిగితే జవాబుకు తడబడతారు. దీని అర్థం వారెపుడూ దీవెన ప్రాయమైన ఆ లోపలి ఆవేశాన్ని అనుభవించలేదని కాదు. నీకే అవగతం కాని విషయాన్ని వేరొకరికి వివరించడం కష్టం.
ఈ ప్రశ్న ఎదురైతే అప్పుడపుడూ నేనూ తప్పించుకుంటాను. కానీ నా సమాధానం ఇది: ప్రేరణ అనేది కవులకూ కళాకారులకూ మాత్రమే గుత్తగా లభించే అదృష్టం కాదు. ప్రేరణ తరచూ వచ్చి పలకరించే ఒక ప్రత్యేక మనుష్య సమూహం ఇప్పుడూ ఉంది, ఇదివరకూ ఉండేది, ఎల్లపుడూ ఉంటుంది కూడా. తమకు నచ్చి పనిని ఎన్నుకుని దాన్ని ప్రేమతో, ఊహాశక్తితో చేసే మనుషులతో కూడి ఉంటుంది ఈ సమూహం. ఇందులో ఉండేది వైద్యులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, తోటమాలులు కావచ్చు — నేనింకో వంద వృత్తులను ఈ జాబితాలోనికి చేర్చగలను. కొత్త సవాళ్ళను ఎదుర్కొనే కొద్దీ వారి పని వారికి ఒక నిరంతర సాహసకృత్యంగా మారిపోతుంది. కష్టాలూ, వైఫల్యాలూ వారి కుతూహలాన్ని అణచలేవు. వారు పరిష్కరించే ప్రతీ సమస్య నుంచీ మరిన్ని సవాళ్ళు ఉద్భవిస్తాయి. ప్రేరణ అనేది ఏదైనా, దాని ఉద్భవం మాత్రం “నాకు తెలీదు” అనే నిరంతర భావన నుంచి.
ఇలాంటి మనుషులు ఎక్కువమందేమీ లేరు. ఈ భూమ్మీద నివసించే వాళ్ళలో చాలామంది బతకటానికి పని చేస్తారు, పని చేయాలి కాబట్టి పని చేస్తారు. వారు ఆ పనో ఈ పనో ఎంచుకునేది ప్రేమతో కాదు; వారి జీవిత పరిస్థితులు వారికై ఆ ఎంపిక చేసి పెట్టాయి. అయిష్టమైన పనీ, నిరాసక్తమైన పనీ, ఎంత అయిష్టమైనా ఎంత నిరాసక్తమైనా వేరే వాళ్ళకి ఆ మాత్రం కూడా లేదన్న కారణంగా మాత్రమే విలువనందుకునే పనీ — ఇది మానవ దౌర్భాగ్యాల్లోకెల్లా కర్కశమైనది. ఈ విషయంలో రానున్న శతాబ్దాలైనా మార్పును తీసుకొస్తాయన్న సూచనేదీ లేదు.
అందుకే, కవులకు ప్రేరణపై గుత్తాధిపత్యాన్ని నేను నిరాకరించినప్పటికీ, ఆ అదృష్టపు ఆపేక్షనందుకున్న ఒక ప్రత్యేక సమూహంలోకి వారిని చేరుస్తాను.
అయితే ఇక్కడే నా శ్రోతల్లో కొన్ని సందేహాలు కలగొచ్చు. చాలామంది ఘాతకులూ, నియంతలూ, మతోన్మాదులూ, నినాదాల పొలికేకల ద్వారా అధికారం కోసం కొట్టుమిట్టాడే ప్రజానాయకులూ వీళ్ళంతా కూడా తమ పనులను ఆస్వాదిస్తారు; వారు కూడా తమ విధులను కల్పనాత్మక కుతూహలంతోనే నిర్వర్తిస్తారు. అవును, ఒప్పుకుంటాను. కానీ వారికి “తెలుసు”. యిక ఆ తెలిసిందాంతోనే ఎల్లకాలమూ సరిపుచ్చుకోగలరు. ఆ తెలిసింది తప్ప మరేదీ తెలుసుకోవాలనుకోరు. ఎందుకంటే అది తమ వాదనల్లోని తీవ్రతను క్షీణింపచేయగలదు. అయితే కొత్త ప్రశ్నలకు దారితీయని ఏ జ్ఞానమైనా త్వరగా చచ్చిపోతుంది: జీవించడానికి కావలసిన కనీస ఉష్ణోగ్రతను అది నిలబెట్టుకోలేకపోతుంది.
ఇందుకే నేను “నాకు తెలీదు” అనే ఈ పదబంధానికి అంత ఉన్నతమైన విలువనిస్తాను. ఇది చిన్నదే, కానీ బ్రహ్మాండమైన రెక్కలతో ఎగురుతుంది. మన అంతరంగ విస్తారాల్నే గాక, మన ఈ చిన్ని భూమి నిరాధారంగా వ్రేలాడే బాహ్య విస్తారాల్ని కూడా ఇముడ్చుకోగలిగేంతగా మన జీవితాన్ని విశాలపరుస్తుంది. ఐజాక్ న్యూటన్ “నాకు తెలీదు” అని అనుకోకపోయి వుంటే, అతని చిన్ని వనంలో ఆపిల్ పళ్ళు వడగళ్ళలా ఊరకనే నేలరాలి ఊరుకునేవి, మహా అయితే అతను వాటిని వంగి ఏరుకుని గుటకాయస్వాహా చేసి ఉండేవాడు[2]. నా తోటి దేశస్తురాలు మేరీ స్ల్కోదోవ్‌స్కా క్యురీ “నాకు తెలీదు” అని అనుకోకపోయి వుంటే, బహుశా ఏదో ఒక ప్రైవేటు ఉన్నత పాఠశాలలో కులీన యువతులకు రసాయనశాస్త్ర పాఠాలు చెప్పుకుంటూ ఉండిపోయేది, ఈ అన్యథా గౌరవప్రదమైన ఉద్యోగాన్ని నిర్వహిస్తూనే చివరకు మరణించి ఉండేది. కాని ఆమె “నాకు తెలీదు” అని తనకు తాను నిరంతరం చెప్పుకుంటూనే ఉంది; ఈ పదాలే ఆమెను — ఎక్కడైతే అవిశ్రాంతంగా అన్వేషించే వ్యక్తిత్వాలు అప్పుడపుడూ నోబెల్ బహుమతితో సత్కరింపబడతాయో ఆ స్టాక్‌హోమ్‌కు, ఒకసారి కాదు రెండుసార్లు, తీసుకువెళ్ళగలిగాయి[3].
కవులు కూడా, వారు నిజమైన కవులే అయితే, “నాకు తెలీదు” అనే ఈ మాటని నిత్యం పునశ్చరించుకుంటూనే ఉండాలి. కవి రాసిన ప్రతీ కవితా ఈ మాటకి సమాధానం చెప్పేందుకు చేసిన ఒక ప్రయత్నాన్ని సూచిస్తుంది. కాని కాగితం మీద చివరి పుల్‌స్టాప్ పెట్టగానే అతనిలో మళ్ళా అనిశ్చితి మొదలవుతుంది, సదరు సమాధానం కేవలం తనకు తాను ఆపద్ధర్మంగా కల్పించుకున్నదనీ, పైపెచ్చు అసమగ్రమనీ అతనికి అర్థం కావడం ప్రారంభమవుతుంది. కాబట్టి కవులు నిత్యం ప్రయత్నిస్తూనే ఉంటారు; చివరికెన్నడో, వారి ఈ స్వీయ-అసంతృప్తుల వరుస ఫలితాలనన్నింటినీ సాహితీ చరిత్రకారులు ఒక పెద్ద పేపర్ క్లిప్‌తో బొత్తంగా గుదిగుచ్చి, దాన్ని ఆ కవుల “రచనా సంచయం” అంటారు.
నేను ఒక్కోసారి అసంభవ సన్నివేశాల్ని కల కంటూంటాను. ఉదాహరణకి, నాకు రచయిత ఇక్లీసియాస్టిస్‌తో సంభాషించే అవకాశం వచ్చినట్టు ఊహించుకుంటాను[4]. ఆయన సకల మానవ ప్రయత్నాల నిష్పలత్వం పైనా కదిలించే విధంగా ఓ విలాపాన్ని రాసిన రచయిత. ఆయనకు వెన్ను వంచి ప్రణమిల్లుతాను. ఎందుకంటే ఆయన అత్యద్భుతమైన కవుల్లో ఒకరు, కనీసం నా వరకూ. తర్వాత ఆయన చేయి దొరకబుచ్చుకుంటాను, ” ‘సూర్యుని క్రింద కొత్త విషయంటూ ఏదీ లేదు’ అని నువ్వు రాసావు ఇక్లీసియాస్టిస్! కానీ స్వయానా నువ్వే ఈ సూర్యుని క్రింద కొత్తగా జన్మించ లేదూ. నీకు ముందు జీవించిన వారెవరూ నువ్వు రాసిన కవితను చదవలేకపోయారు కాబట్టి, నీ కవిత కూడా సూర్యుని క్రింద కొత్తదే. అలాగే నువ్వు ఏ సైప్రస్ చెట్టు క్రింద కూర్చున్నావో అది కూడా అనాది నుంచీ పెరుగుతున్నదేం కాదు. అది ఇలాంటిదే మరో సైప్రస్ నుంచి పుట్టింది, అయితే రెండూ ఒకటి మాత్రం కాదు. ఇక్లీసియాస్టిస్! నేన్నింకోటి కూడా అడగాలనుకుంటున్నాను. నువ్వు సూర్యుని క్రింద ఏ కొత్త ఇతివృత్తాన్ని స్వీకరించబోతున్నావ్? ఇదివరకూ వెలిబుచ్చిన ఆలోచనలకే అదనపు చేర్పా? బహుశా వాటిలో కొన్నింటిని ఇప్పుడు ఖండించాలనుకుంటున్నావు కాబోసు? నీ గత రచనలో — ఆనందం క్షణభంగురమైతేనేమి, అన్నావు? కాబట్టి నీ తదుపరి సూర్యుని-క్రింద-కొత్త-కవిత ఆనందం గురించినదై వుంటుంది? ఇప్పటిదాకా ఏమైనా పరిశీలనలు నమోదు చేసుకున్నావా, చిత్తుప్రతులు తయారయ్యాయా? ‘నేను రాయాల్సినదంతా రాసేసాను, ఇక రాయటానికేమీ మిగల్లేదు’ అని నువ్వు అనబోవని నాకనిపిస్తోంది. ప్రపంచంలో ఏ కవీ ఇలా అనలేడు, ముఖ్యంగా నీలాంటి గొప్ప కవి.”
ఈ ప్రపంచం — దీని గురించి మనమేమనుకున్నా, దీని భారీతనం ముందు మన స్వీయ దుర్బలత్వం స్ఫురించి భీతిల్లినా, లేదూ మనుషులూ జంతువులూ వృక్షాలూ అనుభవించే వేదనల పట్ల దీని ఉదాసీనతను ద్వేషించినా; అలాగే, నక్షత్ర కాంతి రేఖల్తో చొచ్చుకుపోబడిన ఈ శూన్యవిస్తారాల గురించీ, ఆ నక్షత్రాల చుట్టూ మనమిప్పుడిపుడే కనుగొనటం మొదలుపెట్టిన గ్రహాల గురించీ మనమేమనుకున్నా; మనకు ముందస్తుగానే టికెట్లు ఖరారైన ఎల్లలులేని ఈ నాటకరంగం గురించి మనమేమనుకున్నా (రెండు గుడ్డి తేదీలకు కట్టుబడిన ఈ టికెట్ల చెల్లుబాటు గడువు మాత్రం నవ్వొచ్చేంత కురచనైనది); ఈ ప్రపంచం గురించి మనం యింకా యిలా ఎన్ని అనుకున్నా గానీ — ఇది నివ్వెరపరిచే ప్రపంచం.
అయితే ఈ “నివ్వెర పరిచే” అనే విశేషణం ఒక తార్కికమైన ఎరను మరుగుపరుస్తుంది. సాధారణంగా మనల్ని నివ్వెరపాటుకు గురి చేసేవి ఏమంటే — సర్వత్రా తెలిసిన, విశ్వవాప్త ఆమోదాన్ని పొందిన పద్ధతి నుంచి పక్కదారి పట్టిన అంశాలు; మనకు ప్రస్ఫుటంగా అలవాటైన ధోరణి నుంచి దారి మళ్ళిన అంశాలు. ఇక విషయానికొస్తే, ఇక్కడ అలా ప్రస్ఫుట ప్రపంచమంటూ ఒకటి వేరే ఏదీ లేదు. మన నివ్వెరపాటు దానికదే స్వతంత్రంగా మన్నుతుంది, అది సాపేక్షాన్వయం కోసం వేరే దేని పైనా ఆధారపడదు.
ఒప్పుకుంటాను, ప్రతీ పదాన్ని ఆగి సమీక్షించుకోవాల్సిన అవసరం లేని రోజువారీ సంభాషణల్లో మనమంతా “సాధారణ ప్రపంచం”, “సాధారణ జీవితం”, “సాధారణ పరిస్థితుల్లో”… లాంటి పదబంధాలు వాడుతూంటాం. కానీ ప్రతి పదాన్నీ ఆచితూచే కవిత్వపు భాషలో, ఏదీ మామూలు కాదు, సాధారణం కాదు: ఏ ఒక్క రాయీ, దాని పైనున్న ఏ ఒక్క మేఘమూ; ఏ ఒక్క పగలూ, దాని తర్వాతవచ్చే ఏ ఒక్క రాత్రీ ; అన్నింటినీ మించి, యీ ప్రపంచంలో ఏ అస్తిత్వమూ, ఎవ్వరి అస్తిత్వమూ సాధారణం కాదు.
దీన్ని బట్టి చూస్తే, కవుల పని ఎప్పుడూ జటిలమే అనిపిస్తోంది!
౦—————౦——————౦——————౦——————౦——————౦
[1] జోసెఫ్ బ్రాడ్‌స్కీ (1940 – 1996) ప్రముఖ రష్యన్ కవి, నోబెల్ సాహిత్య బహుమతి గ్రహీత. సోవియెట్ రష్యాలో ఒక యూదు కుటుంబంలో జన్మించాడు. పేదరికం వల్ల పాఠశాల విద్యని తొందర్లోనే విడిచిపెట్టాడు. రకరకాల చిల్లర ఉద్యోగాలు చేస్తూ తనకు తనే విద్య చెప్పుకున్నాడు. తొందర్లోనే సాహిత్య అనువాదాలతో పాటూ, కవితలూ రాయటం ప్రారంభించాడు. ప్రస్తుత ప్రసంగంలో వీస్వావా షింబోర్‌స్కా ఆయన్ను గూర్చి చేసిన ఈ ప్రస్తావనకు యుక్త వయస్సులో ఆయన ఎదుర్కొన్న ఒక సంఘటన ఆధారం. అప్పటి సామ్యవాద రష్యాలో వయోజనులైన ప్రతీ ఒక్కరూ పని చేయాలన్న నిర్బంధం వుండేది. ప్రజలందరూ శ్రామికుల కిందే లెక్క. ప్రభుత్వం కూడా శ్రామిక ప్రభుత్వమే. అయితే ఈ ప్రభుత్వం దృష్టిలో శ్రమ అంటే ఎప్పుడూ శారీరకమైనదే! మేధోపరమైన శ్రమ లెక్కలోకొచ్చేది కాదు. దాంతో మేధావి వర్గం చాలా కటువైన జీవితాన్ని గడపవలసి వచ్చేది. రోడ్లూడ్చడం, చిమ్నీల్ని వెలిగించడం లాంటి పనులు చేస్తూ, ఖాళీ సమయాల్లో తమ మేధో సంబంధమైన వ్యాసంగాల్ని నిర్వహించుకోవాల్సి వచ్చేది. ఇలా శ్రమ చేయని వాళ్ళని ప్రభుత్వం “పరాన్నజీవులు” (పారసైట్స్) అంటూ ముద్రవేసి, గడ్డు వాతావరణ పరిస్థితులున్న ప్రాంతాల్లోకి బహిష్కార శిక్ష విధించేది. అప్పటికి యువకోత్సాహంతో, ఎవరినీ లెక్కచేయని స్వేచ్ఛతో కవిత్వం రాసుకుంటూ పోతున్న బ్రాడ్‌స్కీ తొందర్లోనే రష్యన్ సీక్రెట్ పోలీస్ దృష్టిలో పడ్డాడు. ఆయన్ని అరెస్టు చేసారు. అప్పటి ఆయన విచారణకు సంబంధించిన పాఠ్యప్రతి దరిమిలా ఒక జర్నలిస్టు ద్వారా బయటి ప్రపంచానికి పొక్కి ప్రసిద్ధమైంది. అది ఇలా సాగుతుంది:
జడ్జి: నువ్వు మామూలుగా ఏం చేస్తుంటావు?
బ్రాడ్‌స్కీ: నేను కవిని, సాహితీ అనువాదకుణ్ణి.
జడ్జి: కవిగా నిన్ను ఎవరు ఆమోదించారు? ఎవరు కవుల జాబితాలో చేర్చారు?
బ్రాడ్‌స్కీ: ఎవరూ కాదు. మనుషుల జాబితాలోకి నన్నెవరు చేర్చారు?
జడ్జి: నువ్విది అధ్యయనం చేసావా?
బ్రాడ్‌స్కీ: ఇదంటే?
జడ్జి: కవి ఎలా కావచ్చన్నది. మామూలుగా కవిత్వం బోధించేది, కవులు తయారయ్యేది పాఠశాలల్లో. నువ్వక్కడ కనీసం ఉన్నత విద్య కూడా పూర్తి చేయలేదు.
బ్రాడ్‌స్కీ: ఇది పాఠశాలల్లో నేర్చుకోవచ్చని నాకనిపించలేదు.
జడ్జి: మరి ఎలా?
బ్రాడ్‌స్కీ: నాకు తెలిసి… ఇది దేవుడి నుంచి వస్తుంది, అవును దేవుడి నుంచే.
ఈ విచారణ తరువాత ఆయనపై “పరాన్న జీవత్వం” అన్న నేరాన్ని నిర్థారించి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. ఇదీ, పై ప్రస్తావన వెనక కథ. తర్వాతి కాలంలో బ్రాడ్‌స్కీ అమెరికా చేరుకుని మేటి కవిగా ప్రసిద్ధి పొందాడు.
[2]ఐజాక్ న్యూటన్ (1643 – 1727) భూమ్యాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త. ఆయన తన ఆపిల్ వనంలో విహరిస్తుండగా నేల రాలిన ఆపిల్ పండును చూసి ప్రేరణ పొంది ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడని ప్రతీతి.
[3] మేడమ్ క్యురీ (1867 – 1934)గా ప్రసిద్ధి చెందిన ఈమె పోలండ్‌కు చెందిన శాస్త్రజ్ఞురాలు. రేడియో ధార్మికత విషయంలో పరిశోధనలకు ఆద్యురాలు. తొలిసారి రెండు నోబెల్ బహుమతులు అందుకున్న వ్యక్తి.
[4] హీబ్రూ బైబిల్‌లో భాగంగా వుండే పలు ఉప గ్రంథాల్లో ఒక దాని పేరు ఇక్లీసియాస్టిస్. దీన్ని రాసింది ఇక్లీసియాస్టిస్ (లేదా కొహెలెత్). ఈ గ్రంథంలో ఆయన మానవుల ప్రతీ చర్యా (ప్రతీ ప్రయత్నమూ) నిష్పలమూ, అర్థరహితమూ, అసంబద్ధమూ అని ప్రతిపాదిస్తాడు. ఈ గ్రంథంలో కొన్ని వాక్యాల్ని వీస్వావ షింబోర్‌స్కా ఇక్కడ తన ప్రసంగంలో ప్రస్తావిస్తున్నది. ఆ ప్రస్తావనకు మూలమైన వాక్యాలు ఇవి:
What has been will be again,
what has been done will be done again;
there is nothing new under the sun.
(ఏది వున్నదో అదే మరలా వుండబోతోంది,
ఏది సాగిందో అదే మరలా కొనసాగబోతోంది;
సూర్యుని క్రింద కొత్త విషయంటూ ఏదీ లేదు.)
మల్లిన నరసింహారావు
అనువాదం చక్కగా సాగించారు. చాలా బాగుంది. బాపుగారి మీద ఆయన చిత్రకళాభ్యాసం మీద ఆయనే ఓ చిత్రాన్ని మనకోసం నిర్మిస్తే బాగుంటుందని ఈ వ్యాసం చదువుతుంటే ఎందుకో కాని నాకు అనిపించింది.
kumaraswamy
pai vyasam bagundi. rachayatha bathakatanikin emi chesthunnado theliyadam ledu. kavi thana rachanalameeda vachhe dabbutho jeevisthe manchide. ala saadhyam kakapovachu kooda. emaina manchi anuvadam andincharu.
భావకుడన్
మంచి వ్యాసాన్ని పరిచయం చేసారు ధన్యవాదాలు. మీ కృషిలో నాకు చాలా నచ్చినది ఆంగ్ల పదాలకు చక్కని ఆంధ్రీకరణ చేయటం. “నాకు తెలీదు” అనేసుకుని ఆంగ్లపదాన్ని రాసి తప్పుకునే అలవాటుకు సిగ్గోచ్చేలా. అందుకూ థాంక్స్.
Anjali
Thanks for the article.
raani
తెలుగు కవులందరూ దీన్ని చదవాలి. అప్పుడు కొందరయినా దీని గురించి ఆలోచిస్తారు. ఆ కొందరిలో అతి కొద్దిమందయినా అర్ధం చేసుకుంటారు. ఆ కొద్దిమందిలో కనీసం ఒకరిద్దరయినా కవిత్వం రాసే ముందు దీన్ని గుర్తు చేసుకుంటారు. అప్పుడు గానీ తెలుగు కవులు అన్నీ తెలుసనే అమాయకత్వాన్నించీ బయట పడరు.
ఇంత అద్భుతమైన ప్రసంగ వ్యాసాన్ని అనువదించినందుకు అభివందనాలు.
John Hyde
wonderful lines to read…. thank you