A fraction of the whole – Steve Toltz
మీకెందుకో పట్టరాని కోపంగా ఉంది. భరించలేనంత అసహనం. స్పష్టత లోపించిన కారణాల వల్ల ఉక్రోషం కూడా. భయం, నిరాశ, జుగుప్స లాంటివెన్నో మిమల్ని చుట్టుముడుతున్నాయి. నరాలు తెగేంతటి భావోద్వేగాలు. ఆ క్షణాల్లో ఎదురుగా గోడ కనిపించింది. తలను ఆ గోడకేసి కొట్టుకోవడానికి సిద్ధపడిపోతారు. ఒంట్లో ఉన్న శక్తినంతా కూడగట్టుకొని తలను బలంగా ఆ గోడకేసి కొట్టారు కూడా! కాని అక్కడున్నది ఎండమావిలాంటి గోడ. సరిగ్గా మీ తల దాన్ని తాకే వేళకు అక్కడ గోడ మాయం. తల బద్దలైవ్వలేదు, సరే! అయినా, తల గాలికేసి బలంగానే కొట్టుకుంది గదా. రక్తస్రావం లేదు. కాని తలబాదుకోడానికి పడ్డ శ్రమ తక్కువేమీ కాదు కదా!
మీరుగాని ప్రాక్టికాలిటీకి దగ్గరగా బతికేవారైతే ఆ కోపం పోయాక బుర్ర చితికిపోనందుకు ఊరటగా ఊపిరి పీల్చుకొని ఆ ప్రయత్నాన్ని అక్కడితే ఆపేస్తారు.
ఒకవేళ మీరుగాని “A fraction of the whole” అనే నవలలో Steve Toltz సృష్టించిన Martin Dean లాంటి వారైతే గోడలేదనీ తెల్సీ ప్రతీ క్షణం తలను గాలికేసి బాదుకుంటూనే ఉంటారు. (అనిపిస్తున్నంత తేలిక కాదు. కావాలంటే ప్రయత్నించి చూడండి.) మిమల్ని చూసినవాళ్ళకి రవ్వంత జాలి, బోలెడంత వినోదం కలిగిస్తూ ఉంటారు.
“నేను” ఎవర్ని? ఇక్కడికి ఎలా వచ్చాను? ఎలా ఆలోచించగలుగుతున్నాను? ఎందుకు ఆలోచించగలుగుతున్నాను? ఎవరో చెప్పింది చెయ్యడం కాక నాకు నేనుగా ఎందుకు కొత్తవి ఏర్పాటు చేసుకోలేకపోతున్నాను? సమాజాలు ఎందుకు? ప్రభుత్వాలు దేనికి? దేవుడున్నాడా? ఉంటే, ఎందుకు, ఎలా ఉన్నాడు? లేకపోతే ఉన్నాడని ఎందుకు అనుకుంటున్నాం? మనిషికీ మనిషికి బంధం ఎలా ఏర్పడుతుంది? వివాదాలు ఎందుకు వస్తాయి? గిరి గీసుకొని “దేశభక్తి” అని ఎందుకు మురిసిపోవటం? – ఇవ్వన్నీ మనిషికి కనిపించీ కనిపించని గోడలే! చాలా సందర్భాల్లో మనలోని చాలా మంది వాటిని విస్మరించుకుంటూనో, తప్పించుకుంటూనో వెళ్ళిపోగలం. వెళ్ళిపోతాం. కొంతమంది ఇంతకు ముందే తలలు బద్ధలు కొట్టిన ఏర్పాటు చేసిన థియరీలను బట్టీయం వేసి ఊరుకుంటూ. అత్యల్ప సంఖ్యలో కొందరు మాత్రం ఆ ప్రశ్నలతోనే జీవితాన్ని గడిపేస్తారు, సమాధానాలు లేకుండా. (The answer is there is no answer! అని నేనుకుంటున్నాను.) అట్లాంటి ఒక తండ్రి-కొడుకు కథ ఇది. మూడు తరాల కథ. కథా కాలం రెండు ప్రపంచ యుద్ధ కాలం నుండి మొన్న మొన్నటి వరకూ. ఏడొందల పేజీల కథ! అంతకు మించి కథ గురించి ఏమీ చెప్పలేను. (కథలో మాత్రం ఒక సెన్సేషనల్ హాలివుడ్ సినిమా తీయడానికి సరిపడా సరుకుంది. అంత gripping!)
కొన్ని సందర్భాల్లో ఒక ఆట చూస్తున్నప్పుడు, ఒక సంగీతపు కచేరీ వింటున్నప్పుడో, ఒక ఆక్షన్ సినిమా చూస్తున్నప్పుడో, ఒక నాట్యం వీక్షిస్తున్నప్పుడో – అవి ముగిసీముగియంగానే మొదట చేయాల్సి వచ్చే పని మనం ఇంకా ఊపిరి తీసుకుంటున్నామా? అని. మన ముక్కు కింది వేలు పెట్టుకొని (మన గుండె మీద మన చెవి పెట్టలేమనుకోండి..) మనం ఊపిరి తీసుకుంటున్నామా అని చూసుకోవడం అన్నది కాస్త విడ్డూరంగా అనిపించచచ్చు గాని కొందరు కళాకారులు ప్రదర్శించటం అలా చేస్తారు.. breathtakingly good! ఈ పుస్తకం ముగిసాక కూడా అలానే అనిపిస్తుంది. ఇంకా ఊపిరి పీల్చుకుంటున్నందుకు ఊరట! ఎందుకంటే ఇది exhilarating and excruciating!
People are too fond of adjectives! పదసంపద ఏ మాత్రం ఉన్నవారైనా తమ అనుభవంలోకి వచ్చినదాన్ని ఏకపద వర్ణణ చేయాలని చూస్తుంటారు. ఇప్పుడీ పుస్తకం గురించి కూడా మీరు గూగుల్ చేస్తే హాస్యభరితమనీ, అద్భుతమనీ, మనోరంజకమనీ, కామిక్ అనీ -ఇలాంటి వర్ణనలు చాలానే కనిపిస్తాయి. అందులో ఏ ఒక్కటీ తప్పు కాదు. కాని “ఆ ఒక్కటే” ఈ రచనను పూర్తిగా నిర్వచించలేవు. ఒక అనుభవానికి స్పందనగా వచ్చే భావావేశాన్ని-అన్ని వేళలా – పదబంధాల్లో ఇమడ్చలేము. ఇందులో ఒక పాత్ర తను ప్రేమిస్తున్న అమ్మాయి ఇంటికొచ్చినప్పటి భావావేశాన్ని వర్ణించడానికి ఇలా చెప్పుకొస్తాడు:
I was experiencing one of those horriblebeautifulterrifyingdisgustingwondrousinsaneunprecedented-euphoricsensationaldisturbingthrillinghideoussublimenauseatingexceptional feelings that’s quite hard to describe unless you chance upon the right word.
ఈ పుస్తకం సంగతి కూడా ఎంచుమించు అలానే ఉంటుంది మాట. అసలు, మొదటి వాక్యమే కట్టిపాడేస్తుంది. ఎంతగా అంటే, స్థలకాలాదులను లెక్కచేయకుండా పుస్తకం మొదలెట్టేలా. ఏడొందల పేజీలూ ఏకబిగిన చదవాలి అనిపించేంత! దానికి తోడు ఉరకలెత్తించే కథనం. అద్భుతమైన వచనం. ఏకబిగిన పూర్తి చేయటం కష్టసాధ్యం గనుక పుస్తకాన్ని మూయబూనిప్పుడల్లా నిరాశ. చదువుతున్నంత సేపూ సాగిపోతున్న నవ్వుకు మధ్యమధ్యన నిట్టూర్పులతో విరామ చిహ్నాలు ఇవ్వడం. అక్కడక్కడా ఆ కనిపించని గోడలకేసి ఇక కొట్టేసుకుందామన్నంత ఆవేశం. మళ్ళీ తిరిగి పుస్తకంలో పడ్డం. ఇవ్వన్నీ అనుభవంలోకి వస్తే తప్ప అర్థం కావు.
అలా అని నచ్చనివి లేవని కావు. అన్నీ పాత్రల మోనోలాగ్ ఒకే గొంతులో సాగడం. కొన్ని తిప్పి తిప్పి చెప్పటం. అక్కడక్కడా హాస్యం అతక్కపోవటం. మరి కొన్ని చోట్ల మరీ తక్కువ ఎమోషనల్ భావాలు ఉండడం – ఇలాంటివి కొన్ని నచ్చకుపోయినా అసలుకు వచ్చే మోపేమీ లేదు.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అనంతరం పుట్టుకొచ్చిన రచనలు కొన్ని అలా నిలిచిపోయాయి. కామూ, వాన్‍గట్, జోసెఫ్ హెల్లర్ లాంటి వారు, యుద్ధ సమయాల్లోని అనుభవాల వల్లే తమ రచనలు సంభవించాయి అని అభిప్రాయపడ్డారు. ఫైట్ క్లబ్ అనే నవల్లో చెక్ ఫాల్హునాయిక్, “మనకి యుద్ధాలు లేవు. డిప్రెషన్స్ లేవు. మన జీవితాలే మనకున్న అతి పెద్ద డిప్రెషన్స్.” అని అంటాడు. కాచ్ – 22 చదువుతున్నప్పుడు, “అబ్బ.. ఇప్పుడు ఇలాంటి మరో రచన రావాలంటే ప్రపంచ యుద్ధం రావాలా? టూ మచ్!” అని గొణుకున్నాను. ప్రస్తుత కాలాల్లో ఉన్న పరిస్థితుల్లో ఎవరైనా మనిషి జీవితంలో ప్రశ్నలనీ మళ్ళీ కొత్తగా, ప్రతిభావంతంగా లేవనెత్తగలడా అని అనుమానం పీకుతూ ఉండేది. 2008లో అచ్చైన ఈ రచన చదివాక మాత్రం పట్టలేని ఆనందం. నాకు నచ్చేలాంటి పుస్తకాలు ఈ కాలం మనుషులూ రాయగలరని నమ్మకం.
ఈ పుస్తకం బుకర్ ప్రైజ్‍కి షార్ట్ లిస్ట్ అయింది కూడా! రచయిత తొలి రచన. అందమైన వచనం రాయడమే గగనమంటే వచనంలో అందం, లయ, హాస్యం, అభినయనం, చమత్కారం, వ్యంగ్యం, చురుక్కుమనిపించే తత్వం అన్నీ తెప్పించగలిగాడంటే ఈ రచయిత సామాన్యుడు కాడు. కాలేడు. రానున్న కాలంలో కాలగర్భంలో మరుగునపడిపోని ఎన్నో రచనలు ఇవ్వగలడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇతడి గురించి ఇంటర్నెట్‍లో లభ్యమయ్యే సమాచారం స్వల్పంగానే ఉన్నా ఇతడి సాహిత్యపు ప్రయాణం ఔత్సాహిక రచయితలకు మంచి ప్రేరణ కాగలదు. నిలకడైన ఆదాయం లేకుండా ఐదేళ్ళ పాటు ఒకే పుస్తకాన్ని నమ్ముకొని, పట్టుదలతో పూర్తి చేసి, సాహిత్య ప్రపంచానికి అందించిన స్టీవ్‍కు అభినందనలు. (రెండో పుస్తకాన్నీ ఇంతే పట్టుదలగా రాసే ఓపిక అతడికున్నా, మాకు(అనగా ఫ్యాన్స్ కు) లేదు.
It’s an indescribable book. Take my word, it’s gonna stick with you, for a long time. ఎక్కడైనా, ఎప్పుడైనా ఈ పుస్తకం కనబడితే తెరచి మొదటి వాక్యం చదవండి. వీలైతే వాక్యం ముగియగానే పుస్తకాన్ని మూసేయండి. వీలుపడకపోతే ఏడొందల పేజీలయ్యాక మీరేమనుకుంటున్నారో నాకూ చెప్పండి. 🙂
————————————————————–
Links to reviews of this book.
రామ
పరిచయం బాగుంది. ఈ మధ్య “పూర్ణిమ” అనే పేరుచూసిన వెంటనే ఏపుస్తకాన్ని పరిచయం చేస్తున్నారనేది చూడకుండా డైరెక్ట్ గా రివ్యూలోకి వచ్చేస్తున్నా.. గుడ్ గోయింగ్. 🙂
జంపాల చౌదరి
పరిచయం బాగుంది.
వెంటనే లైబ్రరీలో పుస్తకాన్ని రిజర్వ్ చేసుకునేంతగా.
RG
Why did you have to introduce it so wonderfully ?
Damn, one more addition to my EverGrowingButNotSureWhenImGonnaFinish “to-read” shelf 🙁
Independent
Splendid!!Ma’m!!!. ఓపెనింగ్ పేరా ఉంది చూసారూ.. 🙂
Thank you SO MUCH.