తెనుఁగు తోట

నా చిన్నతనంలో నాకు తెలిసిన, తాతల వరసైన చాలామంది పెద్దవాళ్ళు  పత్రికలుగానీ, పుస్తకాలుగానీ చదువుకొనేటప్పుడు దాంట్లో ఓ వాక్యమో, పద్యమో, వార్తో, విశేషమో తమకు ఇష్టమనో, ఉపయోగమనో అనిపించినప్పుడు ఆ విషయాన్ని శ్రద్ధగా, ఓపిగ్గా ఒక నోటు పుస్తకం పెట్టుకొని అందులో రాసుకుంటూ ఉండేవారు.  అట్లాంటి నోటుపుస్తకా లెప్పుడన్నా కనిపిస్తే వాటిని చదవటం చాలా సరదాగా ఉండేది. అంతకుముందు తెలియని విశేషాలెన్నో తెలుస్తూ ఉండేవి.

ప్రముఖ కవి, మిత్రుడు విన్నకోట రవిశంకర్ తండ్రి  విన్నకోట వెంకటేశ్వరరావు గారికి కవిత్వమంటే, ముఖ్యంగా పద్యకవిత్వమంటే, ఎక్కువ మక్కువట. ఆయన చదువుకునే రోజుల్లో (అంటే 1920-30 సంవత్సరాలలో) వివిధ సాహిత్య పత్రికల్లో వచ్చిన కవితలనుండి తనకు ఇష్టమైన వాటిని ఒక నోట్‌బుక్‌లో రాసుకున్నారట.   ఈ కవితలన్నిటినీ ఒక పుస్తకంగా ప్రచురించాలన్న ఆయన కోరికకి, ఈ నోటుపుస్తకాన్ని 75 సంవత్సరాలనుండి జాగ్రత్తగా కాపాడుకొంటూ ఉన్న వారి కుటుంబసభ్యులు, ఆయన శతజయంతి సంవత్సర స్మృతిచిహ్నంగా రూపమిచ్చారు.

శ్రీ రవిశంకర్ తమ పరిచయంలో చెప్పిన మాటలు: “భావకవిత్వం మలిరోజుల్నుంచి అభ్యుదయ కవిత్వం తొలిరోజులవరకు వచ్చిన వివిధ కవితలు ఈ సంకలనంలో చోటుచేసుకున్నాయి… సాధారణంగా ఇటువంటి సంకలనాలు కూర్చినవారు స్వయంగా సాహిత్యంలో కృషి చేసినవారై ఉంటారు. లేదా పలువురు సాహితీ ప్రముఖులతో సన్నిహితంగా మెలుగుతూ సాహిత్యోద్యమాల్లో, సభల్లో చురుకుగా పాల్గొనే కార్యకర్తలన్నా అయివుంటారు.  దానికి భిన్నంగా ఈ సంకలనం ఒక పాఠకుడు వేరే యే ప్రభావాలు లేకుండా కేవలం తన అభిరుచి మాత్రమే ప్రాతిపదికగా ఎంచి కూర్చినది. అదే దీని ప్రత్యేకత. దీనివల్ల ఆ కాలంలో వచ్చిన కవిత్వానికి ఒక సగటు పాఠకుడు ఎలా స్పందించిందీ, పాఠకుల వివేచనను ఆ కవిత్వం ఎలా పెంపొందించిందీ మనకు అర్థమౌతుంది. ఒక విధంగా చూస్తే, తెలుగు కవిత్వం ఒకప్పటి పరిణామ క్రమంలో తీసిన స్నాప్‌షాట్‌గా దీన్ని భావించవచ్చు. ఇది ఈ సంకలనానికున్న చారిత్రక నేపథ్యం. అదే సమయంలో, గొప్ప కవిత్వం ఎప్పటికీ పాతబడదని, దశాబ్దాల క్రితం రాసినదైనా ఒక మంచి పద్యం ఈనాటికీ తాజాదనంతో అలరారుతూ ఉంటుందని ఈ సంకలనం నిరూపిస్తుంది… చిన్నపటినుంచి ఈ పుస్తకం మాదగ్గరే ఉండటంతో ఇందులోని కొన్ని అరుదైన పద్యాలు చదివినప్పుడల్లా వీటిని ఇతర పాఠకులతో పంచుకుంటే బాగుండేదని మాకనిపించేది.”

నూరు పైగా కవితలున్న నోట్‌బుక్‌నుంచి 85 కవితలను ఎంపికచేసి ఈ పుస్తకంలో ప్రచురించారు. బసవరాజు అప్పారావు, సౌదామిని,  జాషువ, శ్రీశ్రీ, కొంపెల్ల జనార్దనరావు, మల్లవరపు విశ్వేశ్వరరావు, చావలి బంగారమ్మ, నాయని సుబ్బారావు, ఉమర్ ఆలీషా, రాయప్రోలు సుబ్బారావు, అడవి బాపిరాజు, కొడాలి సుబ్బారావు వంటి ప్రసిద్ధ రచయితల కవితలు, నాకు అంతగా పరిచయంలేని ఇంకొందరు కవుల రచనలూ ఈ పుస్తకంలో ఉన్నాయి.

హృద్యమైన పద్యాలు ఈ పుస్తకం నిండుగా ఉన్నాయి. కొడాలి సుబ్బారావు, కామరాజుగడ్డ శివయోగానందరావు, 1925 జులై, ఆగస్టులలో భారతిలో మాతృవియోగం మీద వ్రాసిన రెండు పద్యాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. వాటిలో మొదటిపద్యంలో  మాయమ్మ మాకిత్తువా దైవమా అని వేదిస్తున్న వ్యక్తి భగవంతునితో చెప్పుకొంటున్న మాటలు:

అమ్మ నాకేదంచు
అడుగుతావేమోను
నీకు లేదని మాకు
నిరసింప న్యాయమా
ఉన్న వారిని వ్రేల్చుటా దైవమా
నిన్ను మాతో పోల్చుటా

ముసుఁగు తీయక తనను యడియాసఁ బెట్టు ప్రేయసికి ఉమర్ ఆలీషా అందిస్తున్న కానుక:

వేడి క్రొన్నెత్తురదిగొ నీ ప్రేమగీత
ములఁ బఠించుచు బుసబుసఁ పొంగిపొరలి
వచ్చుచున్నది నీ పాదపద్మంబంట
వేరె పారాణి నీవిఁకఁ బెట్టుకొనకు

ఇంకా చావలి బంగారమ్మ మాపాప, అడవి బాపిరాజు వరద గోదావరి, జాషువ శ్మశానవాటి పద్యాలు, బసవరాజు అప్పారావు మధురమైన బాధ (ప్రేమతత్వము అన్న పేరుతో ఈ పద్యం ఇంకొన్ని పంక్తులతో నాకు జ్ఞాపకం) వంటి ప్రసిద్ధ గీతాలతోపాటు మహాప్రస్థానం ముందురోజుల్లో శ్రీశ్రీ పద్యాలు కూడా ఉన్నాయి. ఈ పుస్తకంలో ప్రచురించిన శ్రీశ్రీ మహాప్రస్థానానికి మనకు పరిచయమున్న గేయానికి చాలా తేడాలు ఉన్నాయి. వెంకటేశ్వరరావుగారు రాసుకొన్న శ్రీశ్రీ మహాప్రస్థానంనుంచి కొన్ని పంక్తులు (శీర్షికలో మహాప్రస్థానం అని లేదు, మరోప్రపంచం, మరో ప్రపంచం అని ఉంది):

…మనసు కుళ్ళిన, హృదయం సళ్ళిన
సోమరులారా, పోపొండి!
శక్తులు నిండే సాహసముండే
సైనికులారా, రారండి!
జయ జయ జయ జయ జయ భగవన్ అని
జయా జయా అని కదలండి!

… కనబడలేదా మరోప్రపంచపు
సత్యకిరీటపు నిగనిగలు!
ప్రేమ బావుటా ధగధగలు!
అమృత కాంతుల భుగభుగలు!
గాలుల్లాగా కడలుల్లాగా
త్రాచుల్లాగా ధనంజయునిలా
పదండి! పదండి!
ముందుకు! ముందుకు!

ఈ పాఠాంతరం నిజంగా శ్రీశ్రీదిగా ఎక్కడన్నా ప్రచురితమయిందో లేక వెంకటేశ్వరరావుగారు ఎవరన్నా  చెప్పగా దీన్ని రాసుకొన్నారో తెలియదు.

ఈ పుస్తకంలో వెంకటేశ్వరరావుగురించిన వివరాలు చాలా తక్కువగా ఉన్నాయి. రవిశంకర్‌గారి పరిచయం బట్టి ఈయన బందరు నోబెల్ కాలేజీలో చదివే రోజుల్లో రెండుసార్లు లిటరరీ అసోసియేషన్ సెక్రటరీగా ఎన్నికయ్యారని, ఆ కాలపు కొంతమంది సాహితీ ప్రముఖులతో పరిచయం ఉండేదని తెలుస్తుంది. మండలి అభివృద్ధి అధికారి (Block Development Officer?)గా  పని చేసేవారని, స్త్రీవిద్య ఆవశ్యకతపై ప్రత్యేకంగా కృషి చేశారని మాత్రం తెలుస్తుంది. ఆయన చేతివ్రాత చక్కగా ఉండేదని ముఖచిత్రం మీద ప్రచురించిన ఫేసిమిలీ వల్ల తెలుస్తుంది. స్మృతిచిహ్నంగా ప్రచురించిన పుస్తకం కాబట్టి ఆయన జీవన విశేషాలు ఇంకొన్ని ఇచ్చి ఉంటే బాగుండేది.

ఈ పుస్తకం చదువుతుంటే మొదటి సారి వైతాళికులు కవితాసంకలనం చదువుకొన్నప్పటి అనుభూతి జ్ఞాపకం వచ్చింది. ఈ పుస్తకాన్ని ప్రచురించినందుకు ఆయన కుటుంబానికి, నాకందించినందుకు శ్రీ రవిశంకర్‌కూ నా కృతజ్ఞతలు.

ఈ పుస్తకానికి పరిచయపద్యంలో శ్రీ గురుజాడ రాఘవశర్మ చెప్పినట్లు, సమదృష్టి రసజ్ఞులు ప్రేమ జేకొనన్ వెంకటేశ్వరరావుగారు పెంచగా, చిగిర్చి మొగ్గదాల్చి  నెత్తావులఁ జిమ్మలిచ్చిన ఈ తెనుఁగు తోటలో విహరించండి. అపురూపమైన కవితాపుష్పాలను చూస్తూ, ఒక యుగసంధి పరిమళాలను ఆఘ్రాణించండి.

తెనుఁగు తోట
సంపాదితము: విన్నకోట వెంకటేశ్వరరావు
ప్రచురణ: 250 కాపీలు; ఆగస్టు 2010; విన్నకోట రవిశంకర్  (teluguthotabook@gmail.com)
పేజీలు 110
వెల: అమూల్యము; Not For Sale; For Private Circulation Only

You Might Also Like

4 Comments

  1. Jampala Chowdary

    @Brahmanandam Gorti: స్థలాభావం సమస్య కాకపోయినా, సమయాభావం, వ్యాస విస్తరణ భీతి సమస్యలేగా? మరి 🙂

  2. Jampala Chowdary

    పైన ఉదహరించిన కొడాలి సుబ్బారావు, కామరాజుగడ్డ శివయోగానందరావుల మాతృవియోగం పద్యాలు ఈ మధ్య వచ్చిన అమ్మపదం (సం: ఘంటశాల నిర్మల తదితరులు) అన్న పుస్తకంలో వచ్చాయి. ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ పద్యాలు తెనుఁగు తోట నుంచి తీసుకొన్నట్టు ఉంది. ఇది వెంకటేశ్వరరావుగారు సంకలించిన తెనుఁగు తోట పుస్తకమా, లేక ఈ పేరుతో ఇంకో పుస్తకం ఉందా అని అనుమానం వచ్చింది. నిర్మల గారికి కూడా తెనుఁగు తోట కాపీ పంపించారా, రవిశంకర్ గారూ?

  3. పుస్తకం » Blog Archive » నా జీవిత చరిత్ర – విన్నకోట వెంకటేశ్వరరావు

    […] వెంకటేశ్వరరావుగారు సంకలించిన తెనుఁగు తోట పుస్తకాన్ని పరిచయం చేస్తూ, “ఈ […]

  4. Brahmanandam Gorti

    ఇలాంటి పుస్తకాలు చాలా అరుదుగా వుంటాయి. ఒక పాఠకుడిగా దాచుకున్న కవిత్వాభిరుచిని పుస్తకరూపంలో తీసుకురావడం నాకు తెలిసీ ఇదే ప్రథమం అనుకుంటాను. అప్పట్లో ప్రతీ రచనా పుస్తక రూపం ధరించేది కాదు. అక్కడక్కడ చమక్కుమనిపించిన కవితలూ కనుమరుగయ్యే అవకాశం చాలా వుంది. అలాంటి సందర్భాల్లో ఇలాంటి పుస్తకాల అవసరం తెలుసుతుంది.
    కన్నవాళ్ళే ఒక జ్ఞాపకంగా ప్రచురించినా సాహిత్యానికిదొక పూదోటగానే అనుకోవాలి.
    ఇలా ప్రచురించాలన్న రవిశంకర్ గారి ఆలోచన మెచ్చుకోతగ్గది.
    జంపాలగారు ఇంకొన్ని కవితల్లో విషయాలు రాస్తే బావుండేది.

    స్థలాభావం సమస్యకాదు కదా?

    -బ్రహ్మానందం

Leave a Reply