మరువలేని మాటలు: గుంటూరు శేషేంద్ర శర్మ
ఈ ఏడు మొదలుపెట్టాలి అనుకున్న శీర్షికల్లో ఒకటి – మరువలేని మాటలు అని రెండో వార్షికోత్సవం పోస్టులో చదివే ఉంటారు. అది చదివాకే, నేనే మొదలుపెడదాంఅనుకుని, రాస్తున్నా!
ఈ వాక్యాలు/పద్యాల్లోని భాగాలు – గుంటూరు శేషేంద్ర శర్మ గారి కవితల్లోనివి.
’పక్షులు’,’సముద్రం నా పేరు’,’ఈ నగరం జాబిల్లి’ అన్న మూడూ ఉన్న ఒక కలెక్షన్లో ని ’పక్షులు’, ’సముద్రం నా పేరు’ భాగాలలో నన్ను ఆకట్టుకున్న అక్షరాలివి. భాష నా స్థాయికి మించినది. దానికి తోడు అంతులేనన్ని అచ్చుతప్పులు… కామాలు, ఫుల్ స్టాపుల ఇబ్బందులు. కానీ, నేను చదివి, అర్థం చేసుకున్నంతలో నన్ను ఆకర్షించినవి ఇవీ!
‘కళ్ళపని చెవులూ, చెవుల పని కళ్ళూ, చేతుల పని కాళ్ళూ, కాళ్ళ పని చేతులూ ఇలా శరీరంలో ఒకదానిపని మరొకటి చేస్తే, చావు సారాంశం బ్రతుకులో తెలుసుకోవచ్చు. బ్రతుకు సారాంశం చావులో తెలుసుకోవచ్చు’
-శబ్దాలూ-శతాబ్దాలూ, ఒక కావ్యాత్మక కథనం (ఏమాటకామాటే చెప్పాలి…. నన్ను వేరే లోకంలోకి తీసుకెళ్ళలేదు కానీ, అయినాకూడా ఇదొక అద్భుతమైన వ్యాసం!)
“అయ్యో, నేనీ దశలో,
ఈ నిశలో నిలువలేను;
నా సర్వస్నాయువులను
బాధామూషిక దంష్ట్రలు
పటపట కొరికేస్తూంటే
దేహం మహోగ్రకీలా
వ్యూహంలో, నిరుత్సాహంలో
చిటచిట నశించుతుంటే;
ఈ దశలో, ఈ నిశలో
నిలువలేను, నిలువలేను;” (విశ్వఘోష, 1953)
“అసలీలోకము లోకమా! విషభుజం గానీక వల్మీకమా!” (జ్వాల, 1951)
“సురుచిర ప్రేమకై యెదురు
చూచి విశాల ప్రపంచ వీథులం
దరిగిన జోళ్ళతో దిరిగి
అర్రులుజూచి వృథా నిరీక్షయై
చిరిగిన నావవోలె దరి
జేరక యూరక సాగరమ్మునం
దొరిగెదనో విలాస మధు
రోహల మేడగ కూలిపోదునో” ( నిరీక్ష, 1958)
‘ఏ తీరున జూచినం బ్రతుకు తెన్నులు భాష్పకణ ప్రపూర్ణముల్” (అశ్రువు, 1958)
“కలిమి జూచి నేను కట్టుబడ్డది లేదు
బలిమి జూచి బెదిరి పారలేదు
చెలిమి నన్ను బట్టి సేవకునిం జేయు
చిగురుగుత్తి నాదు చిత్తవృత్తి” (ఒక మైత్రి, 1957)
సముద్రం నా పేరు – నుంచి
“సముద్రాలెక్కడ ఆకాశాల్ని పిడికిళ్ళతో పొడుస్తూంటాయో అక్కడికే పోతాను. తుఫానులతోనే స్నేహం చేస్తాను. సింహాల సౌందర్యాన్నే ఉపాసిస్తాను. నా ప్రాణాలక్కడే పారేస్తాను..”
“గాలి సముద్రభూముల్నుంచి మేఘాల్ని పోగుచేసుకుని పోతుంది. కొండల శిఖరాల మధ్య విడుస్తుంది. అరుస్తున్న అడవులమీద ఉన్మత్త ఆకాశాల పరాకాష్ఠల మీద వదులుతుంది, శిశువుల్లా యధేచ్ఛగా విహరించండని. గాలి సముద్ర స్వప్నాల రాయబారి. గాలి తన చక్రవాతశరీరంతో సాగారోపనిషత్తులు రాస్తుంది; గాలి సముద్ర హృదయ వ్యాఖ్యాత. ఎవడు అర్థం చేసుకుంటాడో వాడి ఆస్తే హృదయం”
“నాకూ ఉంటుంది పక్షుల్లా పాడాలనీ, ఆకుల నీడల్లో గడపాలనీ. కానీ, బ్రతుకు పంజాలో పడతానని నాకేం తెలుసు?”
“నిద్రలో నిశబ్దం వెలిగిస్తుంది నా స్వప్నాల దారుల్ని”
loknath kovuru
సర్ శేషేంద్ర గారి మిస్సెస్ ఇందిరా ధనరాజ్ గారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు..తెలిస్తే దయచేసి ఈ సెల్ కి చిన్న మెస్సేజ్ పెట్టండి సర్ ప్లీజ్….9849995538
mohanramprasad
NICE ONE