బొమ్మా బొరుసూ: తెర వెనుక కథ, కొన్ని జ్ఞాపకాలు

గత బుధవారం (ఫిబ్రవరి 23) సాయంకాలం. ముళ్ళపూడి వెంకటరమణ గారి అమ్మాయి అనూరాధనుంచి ఫోను. నాన్న గారు ఇక లేరు అని. ఉన్నట్టుండి కమ్ముకున్న విషాదం. ఆరోగ్యం బాగుండటం లేదని తెలుసుగాని, ప్రాణాంతకం ఔతుందని అనుకోలేదు. వేసవిలో అమెరికా వస్తారని, కొంతకాలం వారితో గడపవచ్చని ప్లాన్లు వేసుకొంటున్న మాకు ఇది షాక్. బాపుగారితో మాట్లాడితే మనసులో బరువు ఇంకా పెరిగింది. అప్పటికింకా ఆ కబురు టీవీలోనూ, వెబ్‌సైట్లలోనూ రాలేదు. రచ్చబండ మిత్రులకి, ఇంకొందరు బాపు-రమణ అభిమానులకి ఆ కబురు చెప్పాను. రమణగారి గురించి ఏదన్నా వ్రాయాలని మొదలుబెట్టాను కానీ ఏం వ్రాసినా, ఎన్ని రకాలుగా వ్రాసినా అసంతృప్తిగానే అనిపించింది. ఒకరోజంతా అలాగే గడిచింది. మర్నాడు ఉదయం శ్రీరమణగారితో మాట్లాడటం మొదలుబెట్టాను. కాసేపు బాధను పంచుకున్నాక ఇద్దరమూ రమణ గారి కబుర్లు నెమరువేసుకోవటం మొదలుబెట్టాము. మంచి విషయాలు చాలా జ్ఞాపకమొచ్చాయి. అప్పుడు అనుకున్నాను మనల్ని అందర్నీ  నిత్యమూ, ఆశావహ మానవతావాదంతో హాయిగా, ఆనందంగా ఉంచడానికే ప్రయత్నించి, మనం ఆయనకి చాలా బాకీ పడేట్టుగా చేసిన రమణ గారి జ్ఞాపకాలను ఋణంగా కాక ధనంగానే గుర్తుపెట్టుకోవాలని.

చిన్నప్పట్నుంచీ పాఠకుడిగా ముళ్ళపూడి వెంకటరమణగారితో పరిచయం ఉన్నా, కాలేజీ రోజుల్లో అది హీరో ఆరాధనగా మారినా, ఆయన్ని నేను మొదటిసారిగా కలుసుకున్నది మాత్రం 1995లో. ఆ సంవత్సరం చికాగోలో తానా సమావేశాలు జరగబోతున్నాయి. అంతకుముందు చాలా కాలంనుంచి తానా సమావేశాల సమయంలో సాహిత్యానికి సంబంధించి ఏదైనా ప్రత్యేకంగా చేయటం ఆచారంగా ఉండేది. ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్య చరిత్ర కొత్త ఎడిషన్, కాళీపట్నం మాస్టారి యజ్ఞంతో తొమ్మిది, తానా తెలుగుకథ సంకలనం, పెమ్మరాజుగారి సంపాదకత్వంలో మచ్చుతునకలు కవితా సంకలనం తానా సమావేశాల సందర్భంగా ప్రచురింపబడినవే. చికాగో సమావేశానికి ప్రత్యేకంగా ఏం చేద్దామా అనుకొంటుండగా ఎం.బి.ఎస్. ప్రసాద్ పేర ఆంధ్రప్రభ వారపత్రికలో ఒక సంవత్సరం ముందు వచ్చిన ఒక ఉత్తరం గుర్తుకు వచ్చింది.   రమణ గారు వ్రాసిన కొన్నికథలు, వ్యాసాలు ఎప్పుడూ పుస్తకరూపంలో రాలేదని, అలాటివన్నీ సేకరించి, ప్రచురించి పాఠకులకు అందించవలసిన అవసరం ఉందని  రమణగారి జన్మదినసందర్భంగా (జూన్ 28, 1993) ఆయన వ్రాసిన ‘ముళ్ళపూడికి బహిరంగ లేఖ’ సారాంశం.  ఆ స్ఫూర్తితో, తానా సమావేశాల సందర్భంగా రమణగారి రచనలన్నీ  సేకరించి ఒక పుస్తకంగా, బాపు గారి కార్టూన్లు ఇంగ్లీషు కేప్షన్లతో ఒక పుస్తకంగా ప్రచురించి, బాపు-రమణలను తానా  అతిథులుగా ఆహ్వానిస్తే బాగుంటుందనిపించింది. (అప్పట్లో తానా పత్రికలో బాపు కార్టూన్లని ఇంగ్లీషు కేప్షన్లతో వేస్తుండేవాణ్ణి – తెలుగురాని యువతరం బాగా ఆనందించేవారు; చాలా అభినందనలు వచ్చేవి.)

ఆరోజుల్లో బాపురమణల పుస్తకాలన్నీ వారి మిత్రులు ‘నవోదయ’ రామ్మోహనరావుగారే ప్రచురించేవారు. గుంటూరు నవోదయతో కాలేజీ రోజుల్లో నాకున్న సన్నిహిత సంబంధాన్ని ఆధారం చేసుకొని ఆయన్ని సంప్రదించాను. ఆ సందర్భంగా ఆయన ఒక ముఖ్య విషయం చెప్పారు. బాపుగారి మొదటి బొమ్మ (కవ్వపు పాట అనే గేయానికి వేసింది – ఆ బొమ్మ గీయించుకొన్న అదృష్టవంతుడైన రచయిత పేరు దూర్వాసుల విశ్వేశ్వరరావు, విశాఖపట్నం) , రమణ గారి మొదటి రచన (అమ్మ మాట వినకపోతే – అనే కథ, బాల శతకం పద్యాలు), న్యాపతి రాఘవరావు గారు (బాలన్నయ్య – మద్రాసు రేడియోలో బాలానందం  కార్యక్రమ ప్రయోక్త) నిర్వహించే ’బాల’ పత్రికలో 1945లో –  ప్రచురింపబడ్డాయి. అంటే వారి కళాసృష్టి మొదలై 1995కి 50యేళ్ళు అవుతుందన్న మాట. తెలుగువారందరూ పండగ చేసుకోవాల్సిన సందర్భం అనిపించింది.

బాపు–రమణల గీత-రాతల స్వర్ణోత్సవ సంబరాలని తానా సమావేశాలలో నిర్వహిస్తే బాగుంటుందని నేను కార్యక్రమ నిర్వాహకులకు ప్రతిపాదించి, ఒప్పించి, ఆ బాధ్యత నేనే తీసుకొన్నాను. ఈ స్వర్ణోత్సవాల సందర్భంగా రమణగారి సాహిత్యసర్వస్వాన్ని ప్రచురించాలని, బాపు గారి చిత్రప్రదర్శన, బాపు-రమణల చలనచిత్ర ప్రదర్శన ఏర్పాటు చేయాలనీ రకరకాల ప్రణాళికలు చేశాము. ఇలాటి ఆర్భాటాలకు దూరంగా ఉండే బాపు-రమణలని ఒప్పించటానికి నవోదయ రామ్మోహనరావుగారు చాలా సహాయం చేశారు. ఆ సందర్భంలో మద్రాసు వెళ్ళి బాపుగార్ని కలిశాను. (రమణగారి ఒరవడిలో చిన్న కో.కొ: బాపుగార్ని నేను అంతకు ముందు రెండుసార్లు కలిశాను కానీ ఆయనకు గుర్తుండే అవకాశం లేదు. రెండవసారి కలిసింది చికాగోలో ఆయన రాక సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో (జులై 1985). ఆ సమావేశం నిర్వహిస్తున్న వేలూరి వెంకటేశ్వరరావుగారి ద్వారా బాపుగారి దగ్గరకు వెళ్ళి చాలా మొహమోటంగా, భయంగా నాకొక బొమ్మ కావాలండీ అని అడిగాను. బొమ్మలు అమ్మకానికైతే కొనుక్కొందామని ఉద్దేశం కానీ బొమ్మలు ప్రదర్శనకి మాత్రమేనో లేక కొనుగోలుకు కూడా దొరుకుతాయో తెలీదు. అంత గొప్పాయన్ని మీ బొమ్మలు అమ్ముతారా అని అడిగే సాహసం చేయలేకపోయాను. ఏ బొమ్మ కావాలో (ఊరికే) తీసుకొండి అని ఆయన ఎంతో ఉదారంగా అంటే నాకు మతిపోయినంత పనయ్యింది ఆనందంతో. మీరు (రమణగారి) కానుక కథకి వేసిన బొమ్మ కావాలండీ అని అడిగితే, ఆటోగ్రాఫ్ చేసి మరీ ఇచ్చారు. పటం కట్టిన ఆ బొమ్మ మా ఇంటి ఫోయర్‌లో ఎదురుగా వేలాడుతూ ఉండేది. ఇంటికి వచ్చిన వాళ్ళందరూ ఇదేమిటి అని అడిగేవారు; అప్పుడు నేను కానుక కథ చెప్పి, బాపు-రమణలగురించి చెప్పటం మొదలుబెట్టేవాణ్ణి. శైలీ పరంగా గోదావరి ప్రవాహపు వడితో, శిల్పపరంగా గొప్ప ఉత్కంఠతో, వస్తుపరంగా విలక్షణమైన తాత్వికతతో రమణగారు వ్రాసిన కానుక కథ తెలుగులో వచ్చిన ఉత్తమ కథలలో ఒకటి అని నా నమ్మకం. బాపుగారి బొమ్మ సరేసరి.)

మద్రాసులో బాపుగారికి మళ్ళీ నన్ను నేను పరిచయం చేసుకొన్నాక బాపుగారు, “ఇదిగో వెంకట్రావ్, ఇలా రా, అమెరికానుంచి జంపాల చౌదరిగారు వచ్చారు” అని ఫోన్లో రమణగార్ని పిల్చారు. కాసేపటికి రమణగారు వచ్చారు. అరచేతుల చొక్కా, తెల్ల లుంగీ. ఎంతో ఆదరంగా పలకరించారు. కాసేపు (తక్కువగానే; మితభాషి :-)) మాట్లాడి వెళ్ళిపోయారు. (ఇంకో కో.కొ. నేను ఆ ట్రిప్పులో ఇండియాలో ఉన్నది కొన్నిరోజులే ఐనా, ఈ ప్రాజెక్టుకోసం చాలామంది బాపు-రమణల మిత్రుల్నీ, అభిమానుల్నీ కలిశాను – నండూరి రామ్మోహనరావు, శ్రీరమణ, భరాగో, రచన శాయి, ఈనాడు శ్రీధర్, చలసాని ప్రసాదరావు, బ్నిం, మోహన్, ఎం.బి.ఎస్. ప్రసాద్,  శంకు లాంటి వారితో అప్పుడే పరిచయమయ్యింది. బాపు గారి బొమ్మల ఒరిజినల్స్ వేల సంఖ్యలో చూసే అదృష్టం కలిగింది, ఎప్పటికీ జ్ఞాపకముండే ఆ ట్రిప్పులో).

ముళ్ళపూడి సాహిత్య సర్వస్వం ప్రచురించటానికి సమయం సరిపోదని రామ్మోహనరావుగారు అభిప్రాయ పడ్డారు (రామ్మోహనరావు గారు ప్రచురణ విషయంలో చాలా నిర్దుష్టమైన ప్రమాణలు కల పబ్లిషర్). ముళ్ళపూడిగారి సాహిత్యాన్నంతా ప్రచురించలేకపోతే, కనీసం అప్పటిదాకా పుస్తకం రూపంలో లేనివాటినైనా ప్రచురించాలని నిర్ణయించాము. బాపురమణలు సరేనన్నారు. ఎం.బి.ఎస్.ప్రసాద్‌గారు అప్పుడు మద్రాసులో సౌరాష్ట్ర బ్యాంక్‌లో పనిచేస్తుండేవారు. రమణగారికి వీరాభిమాని. అప్పటికే ఆయన, ఆయన సోదరులు మొక్కపాటి శ్రీధర్, నాగరాజు వివిధపత్రికలలో తనపేరుతోనూ, మారుపేర్లతోనూ, పేరులేకుండానూ రమణగారు వ్రాసిన చాలా రచనలు సేకరించి పెట్టారు. శ్రీరమణ గారు, బి.ఎన్.మూర్తి (బ్నిం) గారు సంపాదకత్వ బాధ్యత తీసుకొన్నారు. పుస్తకానికి బొమ్మా బొరుసూ అని  శ్రీరమణగారే పేరు పెట్టారు. మొదటి పేజీల్లో బాపురమణల మీద వ్యాసం కూడా శ్రీరమణగారిదే. మామూలుగానే బాపుగారు ఆకర్షణీయంగా ముఖచిత్రాన్ని డిజైన్ చేశారు.

బొమ్మా బొరుసూలో బాపు రమణల  పరిచయ వ్యాసాలతో పాటు, ఆదుర్తి సుబ్బారావు, అయ్యవారు (ఆంధ్రపత్రిక సంపాదకులు శివలెంక శంభుప్రసాద్‌గారు), భమిడిపాటి కామేశ్వరావులు చనిపోయినప్పుడు రమణగారు వ్రాసిన నివాళులు, ఆంధ్రపత్రికలోనూ, జ్యోతి మాసపత్రికలోనూ ఆయన వ్రాసిన వ్యాసాలు, చేసిన చమత్కారాలు, కొన్ని కథలూ ఉన్నాయి. ’ మంచి స్క్రిప్టు అంటే’ ఏమిటో వివరిస్తూ రమణగారు విజయచిత్రలో వ్రాసిన వ్యాసం సినిమా ఔత్సాహికులకు చక్కటి పాఠం. బాపుగారు వేసిన చాలా బొమ్మలతో పాటు, ఆయన వ్రాసిన రెండు కథలు (మబ్బూ వానా మల్లెవాసనా; అమ్మ బొమ్మ) ఉన్నాయి. బాపుగారిని ఆర్టిస్టుగా మాత్రమే ఎరిగిన మనమందరమూ అచ్చెరువు పొందేట్లుగా ఉంటాయి ఆ కథలు. ఆయన మరిన్ని కథలు వ్రాయకపోవటం మన దురదృష్టం.

బొమ్మా బొరుసూ పుస్తకం ఆవిష్కరణ చికాగోలో తానా దశమవార్షికోత్సవాల ప్రారంభ సదస్సులో 1995 జులై మూడు ఉదయం జరిగింది. అనారోగ్యకారణంగా రమణగారు చికాగో రాలేకపోయారు కాని బాపు గారు వచ్చారు. ఈ పుస్తకంతోపాటు, బాపుగారి బొమ్మలన్నిటితో తీసిన 120 నిమిషాల విడియో ’బాపు బొమ్మలకొలువు’, మొదటిసారిగా బాపుగారి బొమ్మ పోస్టర్ – బ్రహ్మ కడిగిన పాదము (విజయవాడ ఇంప్రెషన్స్ వారు వేసింది) విడుదల చేశాం. బాపురమణల సినిమాలు ప్రదర్శించాం. రమణగారి పుస్తకాల స్టాలు పెట్టాం. సావెనీర్లో రమణగారి పైన నండూరిగారు, బాపు గురించి రమణగారు వ్రాసిన వ్యాసాలు, రమణగారి ఛాయలు కథకు ఎంబిఎస్ ప్రసాద్ ఇంగ్లీషు అనువాదమూ ప్రచురించాం (నేనూ బాపుగారిపైన ఇంగ్లీషులో ఒక వ్యాసం వ్రాశాను). ఆంధ్ర చిత్రకళపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టిన ఆ సావెనీరు బాపు గారి వర్ణచిత్రాలు (ఆయన వేసిన భాగ్యలక్ష్మిగారి బొమ్మ – ఉత్తరం చదువుకొంటున్న కొత్త పెళ్ళికూతురి బొమ్మ-తో సహా), రేఖాచిత్రాలతో చాలా అందంగా వచ్చింది. బాపు-రమణల స్వర్ణోత్సవ కానుకగా భరాగో గారు ప్రచురించిన సరదా కథలు కూడా ఆవిష్కరించాం. రెండు రోజులూ బాపుగారితో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించాము. బాపు-రమణల స్వర్ణోత్సవాన్ని అలా ఆ తానా సమావేశంలో ఘనంగా సంబరంగా జరుపుకొన్నాం (తానాలో ఈ స్వర్ణోత్సవాల వార్తలు బయటకు వచ్చాక కానీ తెలుగునాట కదలిక మొదలు కాలేదు). ఈ స్వర్ణోత్సవం ఇంత బాగా జరగడానికి కారణం బాపురమణల అభిమానుల ఉత్సాహం, కార్యకర్తల దీక్ష, సమావేశ నిర్వాహకుల (ముఖ్యంగా కన్వీనర్ యడ్లపాటి యుగంధర్, సావెనీర్ కమిటీ ఛైర్మన్ ఉప్పులూరి సుబ్బారావుల) ప్రోత్సాహం, ప్లానింగ్‌లో పాలుపంచుకొన్న మిత్రుడు రావెళ్ళ రమేష్ (వర్జీనియా) సహాయం. వారందరికీ మరోసారి ధన్యవాదాలు.

గత పదహారేళ్ళలో వివిధ సందర్బాల్లో రమణగారితో మాట్లాడి సమయం గడిపే అవకాశాలు దొరికాయి.  రమణగారిలో కొట్టొచ్చినట్టు కనబడేవి ఉదారత్వం, మనుషులమీద ప్రేమ, నిరంతర ఆశావాదం, హాయిగా, మనసారా నవ్వగలగటం, తనకు నచ్చినవాటిని మెచ్చుకొని ఆనందించటం, నచ్చని వాటినీ, నొప్పించినవాటినీ పట్టించుకోకుండా వదిలేయటం. చిన్నపిల్లడితనాన్ని చివరిదాకా వదులుకోకపోవటం ఆయన అదృష్టం. ఇంతమంది అభిమానులు పడిచచ్చే రచయితనని, లభ్ధప్రతిష్ణుణ్ణని ఆయనకు తెలిసినట్టు ప్రవర్తించేవారు కాదు. చిన్నప్పుడే యువరాజులా పెరిగినా, ఆవెంటనే పేదరికంలో మగ్గినా, డబ్బుమీద యావ, పీనాసితనమూ లేవు. సంపాదించినంత ధారాళంగా ఖర్చుపెట్టేవారు.  నిరాడంబరంగా ఉంటూనే మహారాజులాగా బతకగలగటం ఆయనకే చెల్లింది. నెమ్మదైన మనిషే అయినా ఆయన మాటే సాగేది. నిర్మాతగా ఆయన పెద్దవాళ్ళనీ, బడుగుజీవుల్నీ ఒకే శ్రద్ధతో చూసుకున్న విధానం గురించి, చూసినవాళ్ళు ఇప్పటికీ   కథలుగా చెప్పుకుంటారు. పొడుగాటి కన్నప్పగారు ఆయన్ని కొట్టినదెబ్బని ఆయన కాబట్టి బాపుతో కలసిఉండటానికి దేవుడే ఈ ఏర్పాటు చేశారు అని సర్దేసుకోగలిగారు.

నాకూ ఆయనకూ ఒక బాదరాయణ సంబంధం ఉందని తర్వాత తెలిసింది. నేను పెరిగిన మా అమ్మమ్మగారి ఊరు చాటపర్రులో రమణగారు కొంతకాలం ఉన్నారని ’కక్కిగారి అబ్బాయి’లో చదివాను. బాపు రమణలు మా తెలుగునాడి పత్రిక సంపాదకమండలిలో ఉందటం మా అదృష్టం. తెలుగునాడి మొదటి సంచిక తర్వాత రమణగారు చెప్పారంటూ బాపుగారు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్ పత్రికకు ఒక ప్రత్యేకస్వరూపం రావటానికి చాలా ఉపయోగపడింది. రమణ గారు నేనన్నా, అరుణన్నా చాలా ఆప్యాయత చూపేవారు. మా మీద ఆశీఃపూర్వకంగా ఒక సరదా పద్యం కూడా వ్రాశారు (దానికి బాపుగారు గొప్ప బొమ్మ వేశారు). కోతికొమ్మచ్చిలో ఆయన నా పేరును ప్రస్తావించడాన్ని చూసినప్పుడు  ఇంట్లో ఉండబట్టి సరిపోయింది కానీ, లేకపోతే నా కాలర్‌వంక అందరూ విచిత్రంగా చూసి ఉండేవారు.

రమణగారి రాతలో మెరుపు, చురుకు, చమక్కు ఏమాత్రమూ తగ్గలేదని ఈ మధ్యే వచ్చిన కోతికొమ్మచ్చి నిరూపించింది. ఇంకా ఆయన దగ్గర్నుంచి మనం చాలా ఆశిస్తున్న సమయంలో ఆయన కనీసం ముక్కోతి కొమ్మచ్చి తాలూకు బాకీ ఐనా పూర్తిగా తీర్చకుండా వెళ్ళిపోవటం మనకు నిజంగా తీరని లోటే. ఆయన కుటుంబసభ్యులకు (అంటే బాపురమణల కుటుంబసభ్యులకు), మిత్రులకు, అశేష అభిమానులకు  ప్రగాఢ సానుభూతి.

బొమ్మా బొరుసూ ఇప్పుడు బహుశా దొరకకపోవచ్చు. బొమ్మా బొరుసూలో ఉన్న రమణగారి రచనలన్నీ, ఆరేళ్ళ తర్వాత వచ్చిన ముళ్ళపూడి వెంకటరమణ సాహితీ సర్వస్వం సంపుటాల్లో చోటు చేసుకొన్నాయి. ఆ సంపుటాలకి ఎం.బి.ఎస్. ప్రసాద్‌గారే సంపాదకత్వం వహించారు; విశాలాంధ్ర ప్రచురణ.

రమణగార్ని సంస్మరిస్తూ శుక్రవారంనాడు టీవీ9 వారు ప్రసారం చేసిన కార్యక్రమంలో బొమ్మా బొరుసూ పుస్తకం ముఖచిత్రం చూస్తున్నప్పుడు అప్పటి సంగతులన్నీ జ్ఞాపకమొచ్చాయి. నా ప్రమేయం కొద్దో గొప్పో ఉన్న పుస్తకాల్లో మొదటిదైన బొమ్మా బొరుసూ అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం.

(ఈ వ్యాసంలో స్వోత్కర్ష ఎక్కడైనా ధ్వనిస్తే క్షంతవ్యుణ్ణి.  బాపురమణలను ఒక్కసారి కలవటమే భాగ్యంగా భావించిన మాకు వారి ఆప్యాయత దొరకటం ఎనలేని అదృష్టం; ఆ సంగతులు ఇవాళ పంచుకోవాలనిపంచింది.)

బొమ్మా బొరుసూ
బాపు రమణ
జులై 1995
నవోదయ పబ్లిషర్స్, విజయవాడ
173 పేజీలు. 75 రూ.

************************

చికాగో మెడికల్ స్కూల్‌లో సైకియాట్రీ ప్రొఫెసర్ డా. జంపాల చౌదరికి తెలుగు, సాహిత్యం, సినిమాలు అంటే అభిమానం. తానా పత్రిక, తెలుగు నాడి పత్రికలకు, మూడు తానా సమావేశపు సావెనీర్లకు సంపాదకత్వం వహించారు. తానా, ఫౌండేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫారంస్ ఇన్ ఇండియా (ఎఫ్.డి.ఆర్.ఐ.), మరికొన్ని సంస్థలలోనూ, కొన్ని తెలుగు ఇంటర్నెట్ వేదికలలోనూ ఉత్సాహంగా పాల్గొంటుంటారు; చాలాకాలంగా తానా ప్రచురణల కమిటీ అధ్యక్షులు. పుస్తకంలో జంపాల గారి ఇతర రచనలు ఇక్కడ చదవవచ్చు.

You Might Also Like

10 Comments

  1. తెలుగు భాష – తానా సేవ | పుస్తకం

    […] వారిద్దరి మొదటి ప్రచురణల గుర్తుగా బొమ్మా-బొరుసు అనే పుస్తకాన్ని ప్రత్యేకంగా […]

  2. బాపు బొమ్మల కొలువు | kapilaramkumar

    […] ప్రయత్నించాను (ఇంతకు ముందు బొమ్మా-బొరుసు పుస్తకం గురించి రాసినప్పుడు చెప్పిన […]

  3. పుస్తకం » Blog Archive » Mithunam and Other Stories

    […] శ్రీ ఎం.బి.ఎస్. ప్రసాద్‌ని కలిశాను.  బొమ్మ బొరుసు పుస్తకం విషయాలు వ్రాసినప్పుడు […]

  4. పుస్తకం » Blog Archive » బాపు బొమ్మల కొలువు

    […] ప్రయత్నించాను (ఇంతకు ముందు బొమ్మా-బొరుసు పుస్తకం గురించి రాసినప్పుడు చెప్పిన […]

  5. MBS Prasad

    Thank you very much, Jampala garu
    You have narrated everything very well
    And your editing of my translation “Shadows” was very good and I cherish the memory.
    I am one of those very few lucky guys who had association with Ramana garu till the end
    A great soul
    Inspired a generation of writers!

    Long live Ramana kind of humour and humanity

    Best regards
    prasad mbs

  6. జంపాల చౌదరి

    బొమ్మా బొరుసు పుస్తకం గురించి ఎం.బి.ఎస్.ప్రసాద్‌గారి జ్ఞాపకాలను ఇక్కడ చూడవచ్చు.
    http://www.andhrabhoomi.net/aadivavram-andhrabhoomi/oka-abhimani-prasthanam-859

    @GKS Raja: నా ఇ-మెయిల్ అడ్రస్: cjampala@gmail.com

    @వంగూరి, Elchuri, Voleti and GKS Raja: Thanks

  7. gks raja

    జంపాలచౌదరి గారూ! అనేకమంది బాపు రమణల అభిమానుల ప్రతినిధిగా, ఆ వ్యధను మీరు చక్కగా వెలిబుచ్చారు. మిగతా అభిమానులకు మీకు ఒక తేడా– మీరు వారికి మరింత సన్నిహితులు. అందుకే మీకు మరొక గురుతర బాధ్యత ఉంది. వారి సాన్నిహిత్యపు గుభాళింపుని, మీరెప్పటికీ మావంటి బాపు రమణల అభిమానులకు పంచుతూ, ఓదారుస్తూ ఉండాల్సిందే! నేను బొమ్మా బొరుసూ పుస్తకం వి పి పి ద్వారా విజయవాడ నుండి ఆగష్టు,3,1995 నాడే తెప్పించుకున్నాను. అలాగే నా దగ్గర 1980, జనవరి ‘బాపుబొమ్మలకొలువు’ క్రోక్విల్ న్యూస్ ప్రత్యేక అనుబంధం-1980 ఉంది. ముఖచిత్రం ఇందులో పంపడం నావల్ల కావడం లేదు. మీ ఇ మెయిలు ఐ.డి. ఇవ్వడానికి అభ్యంతరం లేకపోతె దానికి పంపిస్తాను. ఆ గొప్ప స్నేహ ద్వయం మీద అభిమానాన్ని, నేను చదివే కొన్ని పుస్తకాలను గురించి వ్రాయడానికి, నేనొక బ్లాగు వ్రాసుకుంటున్నాను. దయచేసి ఒక్కసారి చూడగలరు. పాత పుస్తకంలో దొరికిన బొమ్మాయిని నా బ్లాగులో ప్రచురించుకున్న కొద్ది రోజులకే రమణగారు భౌతికంగా ఇకలేరన్న వార్తను వినాల్సి వచ్చింది. వారితో మీకు గల సానిహిత్యం వల్ల మీమీద మరో బాధ్యత కూడా వేసుకోండి దయ చేసి… బాపు రమణల అభిమానులందర్నీ కలిపే ఒక వెబ్ సైట్ గాని, అటువంటి మరేదైనా గాని చెయ్యండి ప్లీజ్! మీరు ఉదహరించినవారిలో వంగూరి చిట్టెం రాజు గార్ని కలిశాను. శ్రీ రమణ గారితో ఫోనులో మాట్లాడాను. మిమ్మల్ని ఇలాగయినా కలుసుకోగలిగినందుకు ఈ వ్యధాభరిత సందర్భంలో కొంత ఊరటగా ఉంది. వారిని స్మరిస్తూ మరిన్ని వ్యాసాలు వగైరా వ్రాస్తూ ఉంటారని ఆశిస్తూ!
    రాజా. gksraja.blogspot.com, gksraja@gmail.com

  8. voleti venkata subbarao

    ‘bomma- borusu’ venuka kadhanu sri jampala choudary garu tana anubhavaala nepadhyam lo chakkagaa vivarinchaaru.’bapu-ramaneeyam’ pustakam vidudala sandarbhamgaa vijayawada lo aa naadu jarigina sabha- andulo- sri ravi konadala rao garu- telugu maastaaru gaa -‘jeevinchi’ vedikapayina chesina ‘allari’ jnaapakam vastondi.

  9. Elchuri Muralidhara Rao

    SIR,

    The memoir is touchy and we had a glimpse in to the many facets Of Maullapudi Venkata Ramana garu through your eyes.

  10. వంగూరి చిట్టెన్ రాజు

    చౌదరి గారూ,

    బాపు-రమణలకి మీ మీద ఉన్న ఆప్యాయత, గౌరవం నాకు తెలిసినదే. ఇది అభినందనలు తెలిపే సమయం కాదు కానీ, ముళ్ళపూడి వారి మీద నేను అనుకుంటున్నట్టుగానే మీరు చాలా మంచి వ్యాసం వ్రాశారు. మీరు ప్రస్తావించిన చికాగో సభలలో నేనూ ఉన్నాను ..వెనకాల బెంచీలలో. ఆ సభలోనే నేను వేసిన నాటకం వైఫల్యం చెందింది. అది చూసి “మీ డ్రామా పేల లేదండి. పరవా లేదు. అప్పుడప్పుడు మేము తీసిన సినిమాలు కూడా పేలవండి” అని బాపు గారు నన్ను ఊరడించారు.

    రమణ గారి తోటి…నా వ్యక్తిగత అనుభవాలు కూడా ఈ నెల కౌముది లో పంచుకున్నాను.

    ముళ్ళపూడి గారి వ్యక్తిత్వం కాస్తో, కూస్తో తెలిసిన వారందరికీ తెలిసేది ఏమిటంటే, ఆయన ఎక్కడికీ వెళ్ల లేదు. కేవలం చిరునామా మార్చుకున్నారు అంతే! అందు చేత ఆయన ఇక్కడే, నా దగ్గరే కలకాలం ఉంటారు…..నా చిరునామా మారిన తరువాత కూడా! తర తరాల పాటు యావత్తు తెలుగు ప్రజలందరికీ అదే వర్తిస్తుంది.

    -వంగూరి చిట్టెన్ రాజు
    వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా

Leave a Reply