బాపు బొమ్మల కొలువు

జూన్ 4-6 తేదీల్లో హైదరాబాద్‌లో బాపు బొమ్మల కొలువు జరుగుతుందని తెలిసినప్పుడు చాలా రోజుల తర్వాత బాపుగారి బొమ్మల ప్రదర్శన పెద్ద ఎత్తున జరుగుతున్నందుకు చాలా ఆనందం, ఆ పండగలో ప్రత్యక్షంగా పాలుపంచుకొనే అవకాశం లేనందుకు కొంత బాధ కలిగాయి. ఈ ప్రదర్శన సందర్భంగా బ్నిం గారి సంపాదకత్వంలో ఒక ప్రత్యేక సంచిక వస్తుందని తెలిసినప్పుడు చాలా ఉత్సుకత కలిగింది. ప్రదర్శన మొదటిరోజున పత్రికల్లోనూ, పుస్తకంలోనూ, ఇతర బ్లాగుల్లోనూ వివరాలు చూశాక ఆ ఉత్సుకత ఇంకా పెరిగింది. మూడో రోజున ప్రదర్శన చూడడానికి వెళ్ళినవారికే ఈ సావెనీర్లు దొరకలేదంటే కొంత దిగులు; ఐనా, ఈ పుస్తకం కాపీ .ఎలాగోలా దొరుకుతుందిలే అన్న ధీమా. అనుకున్నట్లుగానే జూన్‌లో ఆఖరువారంలో అమెరికా వచ్చిన మిత్రుడు నవీన్ నాకోసం ఈ పుస్తకం పట్టుకొచ్చారు. అమెరికా మొదటిసారి వస్తున్న నా చెల్లెలు కూడా పనిగట్టుకొని ప్రత్యేకంగా ఒక కాపీ తీసుకువచ్చింది.

పుస్తకంపై అట్ట మీద ఉన్న బాపు గారి ఫొటో అద్భుతంగా ఉంది (ఫొటోగ్రాఫర్: శివ మల్లాల; ముఖచిత్రం డిజైన్: అన్వర్). మనసారా ఆనందంగా, స్వచ్ఛంగా నవ్వుతున్న బాపుగారి బొమ్మ ఆయన సహజ స్వభావాన్ని పట్టుకుంది – బాపుగారు తాను వేసే బొమ్మల్లో ఇతరుల స్వభావాలని పట్టుకున్నట్టు. నేను చూసిన బాపుగారి ఫొటోలన్నిటిలోకీ నాకు బాగా నచ్చిన ఫొటో ఇది. అంకితం పేజీలో రమణగారి రేఖాచిత్రం, దానికింద బాపు గారి వ్యాఖ్య (నను గోడలేని చిత్తరువును చేసి వెళ్ళిపోయిన నా వెంకట్రావు కోటికోట్ల జ్ఙాపకాలకు సభక్తికంగా), ఇంతకుముందు చూసినప్పటికీ, మరొక్కసారి గుండెని పట్టేశాయి. గోడలేని చిత్తరువు! ఏం మాట్లాడగలం?

మొదటి బొమ్మ (పే. 9 – కుమారస్వామి, గణపతులతో అర్థనారీశ్వరుడు) చూడగానే మళ్ళీ గుండె ఝల్లుమంది. మాకు అత్యంత ఇష్టమైన, అపురూపమైన బొమ్మ. మమ్మల్ని ఆశీర్వదిస్తూ రమణగారురాసిన పద్యంతో సహా బాపుగారు మాకు బహుకరించిన బొమ్మ ప్రతిరూపం.

ఒక్కో పేజీ తిప్పుతూంటే పులకరింపచేస్తూ, నవ్విస్తూ, కవ్విస్తూ, జ్ఞాపకాలను వెదకి తవ్వుతూ, ఠక్కున ఆపి నిలబెట్టేస్తూ, ఆలోచింపచేస్తూ, ఆనందపరుస్తూ, ఆశ్చర్యపరుస్తూ, అబ్బురమనిపించే చూడచక్కని బొమ్మలు. సీరియల్స్ బొమ్మలు, కథల బొమ్మలు, పిల్లల కథల బొమ్మలు, పురాణ కథల బొమ్మలు, పండుగల బొమ్మలు, శుభాకాంక్షల బొమ్మలు,   పద్యాలకు  బొమ్మలు, ఘజళ్ళకు బొమ్మలు,  పుస్తకప్రపంచం బొమ్మలు,  పుస్తకాలు చదువుకుంటున్న బాపు బొమ్మల బొమ్మలు,  దేవుళ్ళ బొమ్మలు, తెరవేలుపుల బొమ్మలు,  తెలుగు వెలుగుల బొమ్మలు,  రకరకాల డేన్సింగ్ పిల్లల బొమ్మలు, పసలపూడి, దిగువ గోదావరి బొమ్మలు, పుస్తకాల పై అట్టల బొమ్మలు, ఎమెస్కో ముఖచిత్రాలు, ఎప్పట్నుంచో గుర్తుపెట్టుకున్న బాపు సంపాదకత్వంలో వెలువడిన 11 కథల కథ-1 బొమ్మలు, ఒకటి కాదు, రెండు కాదు, నూట అరవై పేజీల బాపు బొమ్మలు. ఇంతకు ముందు చూడని కొత్త బొమ్మలు కొన్ని, ఎంతో కాలంగా పరిచయమున్న పాత నేస్తాల్లాంటి బొమ్మలు మరిన్ని. ఎప్పుడో చదివిన కథలు, పుస్తకాలు, జరిగిపోయిన సంఘటనలు, మిత్రులతో చర్చలు గుర్తుకు వచ్చాయి.

ఈ పుస్తకంలో ప్రత్యేకత ఏమిటంటే బాపుగారి గురించి ఉన్న వ్యాసాలు. బాపు చిన్నతనం గురించి  శివరాజు సుబ్బలక్ష్మిగారు (బుచ్చిబాబుగారి శ్రీమతి – సుబ్బలక్ష్మి గారిపై నిడదవోలు మాలతిగారు రాసిన వ్యాసం ఇక్కడ  చూడండి.), బివిఎస్ రామారావుగారు వ్రాసిన వ్యాసాలు ఇంతకుముందు నేనెక్కడా చదవలేదు. బుచ్చిబాబుగారిచ్చిన డ్రాయింగ్‌పేపర్‌మీద బాపు గీసిన మొదటి బొమ్మ తాలూకు మూడు గీట్ల గురించి సుబ్బలక్ష్మిగారు చెప్పిన వివరం హృద్యంగా ఉంది. చిన్నప్పటి బాపు పదివేల పై గంటల ప్రాక్టీసు గురించి బివిఎస్ రామారావుగారు ఆసక్తికరంగా చెప్పింది కొత్త విషయాలే ఐనా ఆశ్చర్యంగా లేదు. ఇంకా రమణగారు వివిధ సంధర్భాల్లో రాసిన వ్యాసాలు, నండూరి రామ్మోహనరావుగారు, కొ.కు, సి,రామచంద్రరావు, ఆరుద్ర, సినారె, అక్కినేని, శంకర్, సదాశివరావు, సుధామ, విజయశాంతి, చిరంజీవి వగైరాలు రాసిన వ్యాసాలు, తన గాడ్‌ఫాదర్ ఆర్టూర్ ఈసెన్‌బర్గ్ గురించి బాపు గారు రాసిన వ్యాసం కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి.

ఈ పుస్తకానికి సంపాదకత్వం వహించింది శ్రీ బ్నిం (బి.ఎన్. మూర్తి). 1995లో దశమ తానా సమావేశాలలో బాపు-రమణల స్వర్ణోత్సవం జరుపుతున్నప్పుడు బాపు చిత్రకళా ప్రదర్శనం ఏర్పాటు చేద్దామని ప్రయత్నించాను (ఇంతకు ముందు బొమ్మా-బొరుసు పుస్తకం గురించి రాసినప్పుడు చెప్పిన కథే). నవోదయా రామ్మోహనరావు గారి సహాయం అడిగితే, ఆయన, “బ్నిం అనే ఆర్టిస్టు హైదరాబాదులో ఉంటారు. బాపుగారి బొమ్మల కలెక్షన్ ఇప్పుడు ఆయన దగ్గరే ఉంది. నా దగ్గర ఉన్న బొమ్మలన్నీ కూడా ఆయనకే ఇచ్చేశాను; ఆయన్ని కలవండి” అన్నారు. హైదరాబాదులో బ్నింగారిని వెతుక్కుంటూ వెళ్ళాను. బొమ్మల గురించి అడిగాను. ఆయన మంచం కిందంతా చెక్క అరలు ఏర్పాటు చేసి ఉన్నాయి. ఆ అరలనిండా బాపుగారి బొమ్మలు – పత్రికలకి వేసినవీ, ముఖచిత్రాలుగా వేసినవీ వందల (వేల?) సంఖ్యలో ఉన్నాయి. అవన్నీ చూస్తూ, ఆయనా, మోహన్ అనే ఇంకో ఆర్టిస్టూ (పి. రామకృష్ణారెడ్డి గారి అబ్బాయి; ప్రసిద్ధుడైన ఇంకో మోహన్ కాదు) బాపు బొమ్మల గురించి చర్చించుకొంటూ నాకు వివరిస్తూంటే వినటం నేను మర్చిపోలేని మంచి అనుభవాల్లో ఒకటి. ఆ తర్వాత బ్నిం రచయితగా (మిసెస్ అండర్‌స్టాండింగ్; వివిధ టీవీ సీరియళ్ళు) పేరొందారు. బాపుగారి బొమ్మలన్నిటినీ కంప్యూటరు కెక్కించి శాశ్వతత్వం కల్పిస్తున్న గంధం దుర్గాప్రసాద్‌గారు ఈ పుస్తకంలో బొమ్మల్ని సేకరించి పెట్టారు.

పుస్తకంలో బొమ్మలు అపురూపంగానే ఉన్నా, చాలా పేజీల్లో ఈ బొమ్మల అమరిక ఇంకా బాగా చేయవచ్చేమో అనిపించింది. ఒకే పేజీలో రకరకాల Genres సంబంధించిన బొమ్మలు, రకరకాల పద్ధతుల్లో, వివిధ సమయాల్లో వేసిన బొమ్మలు కలిపివేయడం కంటికి ఇంపుగా లేదు. రంగుల బొమ్మలు పక్కపక్కనే పెట్టేటప్పుడు ఆ బొమ్మల మధ్య తూకం ఉండేట్టు చూసుకోవలసిన అవసరం ఉంటుంది. కొన్ని పేజీలు గజిబిజిగా అనిపించి, ప్రతి బొమ్మని విడివిడిగా ఆస్వాదించటానికి కష్టమయ్యింది. బాపు మొదటి రోజుల బొమ్మలు (ఆంధ్రపత్రిక రోజుల్లోవి) మరిన్ని,  కాసిని కార్టూ(ట్యూ)న్లు కూడా ఉంటే ఇంకా బాగుండేది.

మంచి వ్యాసాలున్నాయని ముందు చెప్పాను కదా; ఐతే ఈ వ్యాసాలు చదువుతున్నప్పుడు అచ్చుతప్పులు మిక్కుటంగా ఉండి చాలా ఇబ్బంది పెట్టేశాయి; ముఖ్యంగా ఆంగ్లపదాలు వచ్చినప్పుడు. ఒక మరీ విపరీతమైన ఉదాహరణ: So, Bapu as a film director. Hi knows what is happining is the film world. నిఝం.  ఐనా, మేము చాలా తప్పులు చేశాం అని ప్రచురణకర్త (శివలెంక పావని ప్రసాద్ – ముఖీ మీడియా) ముందే ఒద్దికగా ఒప్పేసుకున్న తర్వాత ఇంకా ఎక్కువగా మాట్లాడగూడదు. ఏ పనైనా ఇంకా బాగా చేయొచ్చు అని చెప్పటం తేలికే. (ఒక ఒప్పుకోలు: అంతగా రాయని బాపుగారితో ఆయన సినిమాలగురించి వ్యాసం రాయించి దాన్ని కొన్ని క్షమించరాని అచ్చుతప్పులతో ప్రచురించిన సంపాదక ఘన చరిత్ర నాకూ ఉంది).

బాపుగారి బొమ్మల వెలుగుల ముందు ఈ క్రీనీడలు పెద్ద పట్టించుకోదగ్గవేమీ కాదు.  తప్పకుండా కొనుక్కుని,  రోజూ కాసిన్ని బొమ్మలు చూసుకొని, మనసు తేలిక చేసుకుని, మళ్ళీ జాగ్రత్తగా దాచిపెట్టుకోవలసిన పుస్తకమే. మంచి ఆర్ట్‌పేపర్ మీద బొమ్మలు శ్రద్ధగా ముద్రించారు (విప్ల కంప్యూటర్ సర్వీసెస్). ప్రకటనలు చాలా ఉన్నా, వాటినీ బాపు బొమ్మలతో కూర్చి మిగతా పుస్తకంలో కలిసిపోయేలా చేయడం బాగుంది.

ఈ పుస్తకం చూస్తుంటే ఇంతకు ముందు చూసిన బాపు బొమ్మల కొలువుల ప్రత్యేక సంచికలు గుర్తుకు వచ్చాయి. వాటి గురించి వీలువెంట మరోసారి.

బాపు బొమ్మల కొలువు ప్రత్యేక సంచిక
జూన్ 4,5,6 – 2011, స్టేట్ ఆర్ట్ గ్యాలరీ, మాదాపూర్
సంపాదకుడు: బ్నిం
చిత్రసేకరణ: గంధం దుర్గాప్రసాద్

ప్రచురణ: ముఖీ మీడియా, నం. 4, బీమా వ్యాలీ,
రోడ్ నం. 5, బంజారా హిల్స్,హైదరాబాద్
ఫోన్: 9966567449
e-mail: mukhimedia@gmail.com

ప్రతులకు: విశాలాంధ్ర, నవోదయ
166 పేజీలు; 300 రూ. /10 $

********************
చికాగో మెడికల్ స్కూల్‌లో సైకియాట్రీ ప్రొఫెసర్ డా. జంపాల చౌదరికి తెలుగు, సాహిత్యం, కళలు, సినిమాలు అంటే అభిమానం. తానా పత్రిక, తెలుగు నాడి పత్రికలకు, మూడు తానా సమావేశపు సావెనీర్లకు, రెండు దశాబ్దాలు కథాసంపుటానికి సంపాదకత్వం వహించారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), ఫౌండేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫారంస్ ఇన్ ఇండియా (ఎఫ్.డి.ఆర్.ఐ.), మరికొన్ని సంస్థలలోనూ, కొన్ని తెలుగు ఇంటర్నెట్ వేదికలలోనూ ఉత్సాహంగా పాల్గొంటుంటారు; చాలాకాలంగా తానా ప్రచురణల కమిటీ అధ్యక్షులు. తానా పాలక మండలి (Board of Directors) అధ్యక్షులుగా ఇటీవలే ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. పుస్తకం.నెట్‌లో జంపాల గారి ఇతర రచనలు ఇక్కడ చదవవచ్చు.

**************************

You Might Also Like

Leave a Reply