శ్రీమదాంధ్రమహాభారతం – ఎందుకు చదవాలి – 3.1 (ఆరణ్యపర్వం – రెండవ ఆశ్వాసం)
(ఈ సిరీస్ లో వస్తున్న వ్యాసాలన్నీ ఇక్కడ చదవొచ్చు). ఆది సభా పర్వాల పరిచయం ముగిసింది. అరణ్య పర్వం గత వ్యాసంలో ప్రారంభమైంది.
*********************
వనవాసం చేస్తున్నపాండవుల దగ్గఱకు బృహదశ్వుడనే మహాముని వస్తాడు. ఆయనకు ధర్మరాజు తమ వృత్తాంతమంతా వినిపించి
‘ పుడమియు రాజ్యము బంధుల! విడిచి మృగావలులఁ గలసి విపినంబులలోఁ
గడుకొని మా యట్లిడుమలఁ ! బడిన నృపులు గలరె యొరులు పరమమునీంద్రా’ ! 3-1- 3
(‘నివాసస్థలాన్ని, రాజ్యాన్ని, చుట్టాలను విడిచిపెట్టి మృగాలతోపాటు అరణ్యాలలో మా వలె ఈ విధంగా ఇక్కట్ల పాలైన ఇతరరాజులు ఎవరైనా ఉన్నారా? ఓ పరమఋషిశ్రేష్ఠుడా! దయచేసి చెప్పండి.’) అని ధర్మరాజు బృహదశ్వుని అడుగుతాడు. ధర్మరాజు ఈ మాటలలో తామే అందఱికన్నా ఎక్కువ కష్టాల ననుభవిస్తున్నామనే ధ్వని వినిపిస్తుంది.
మహాభారతంలో ధర్మరాజు మునీశ్వరులను, పెద్దలను అడిగే ప్రశ్నలవలన మనకు మంచి మంచి ఉపాఖ్యానాలు ఎన్నో లభ్యమౌతాయి. ఈ ప్రశ్నవల్ల మనకు బృహదశ్వుని ద్వారా నలోపాఖ్యానం లభించింది. నలోపాఖ్యానం చాలా సొగసైన కథ. భారతం లోని ఉపాఖ్యానాలన్నింటిలోకీ పెద్దది. దానిని ఇలా ప్రారంభిస్తాడు బృహదశ్వుడు.
నరసుతుఁడు దొల్లి నలుఁ డను ! ధరణీశుఁడు జూదమాడి తన విభవము పు
ష్కరుచేత నోటువడి యొ ! క్కరుఁడ కరం బిడుమఁ బడఁడె కాననసీమన్. 3-2-6
(నిషధేశ్వరుడైన వీరసేనుని కుమారుడు నలుడు. అతడు మహా తేజస్వి. ఎన్నో అక్షౌహిణులసేనకు అధిపతి. జూదంలో మిక్కిలి ఆసక్తి కలవాడు. విదర్భాధిపతి యైన భీముడి కుమార్తె దమయంతి. దమనుడనే మునిని సేవించగా పుట్టినదామె. అందుచేతనే ఆమె పేరు దమయంతి. ఆమె మంచి అందగత్తె, సుగుణాల ఖని.
నలుగుణములు దమయంతికి నలునకు దమయంతి గుణగణంబులు జను లి
మ్ములఁ బొగడుట నిరువురకును వెలసి మనోభవ వికార విభ్రమ మొదలెన్. 3-2-10
(నలుడి సద్గుణాలను దమయంతికి, ఆమె గుణగణాలను నలునికీ అగ్గించి ప్రజలు అభివర్ణించి చెప్పటం చేత వారి ఇరువురిలో శృంగారభావాలు వెల్లివిరిశాయి.)
ఒకర్ని ఒకరు ప్రత్యక్షంగా చూసుకోకుండానే వారిరువురిలో ఒకరి పట్ల ఇంకొకరికి ప్రేమ జనించిందన్నమాట. కేవలం గుణగణాలను వినటం ద్వారానే ప్రేమ జనించిటం ఆశ్చర్యాన్నే కొలుపుతుంది. నలుడొకనాడు ఉద్యానవనంలో విహరిస్తూ దమయంతి తలపోతలలో ఉండగా అక్కడికో హంసల గుంపు వచ్చింది. నలుడు వాటి వెనక పరిగెట్టి అందంగా ఉన్న ఆ హంసలలో ఒకదానిని పట్టుకున్నాడు. అది ప్రాణాపాయాన్ని శంకించి నలుడితో మనుష్యభాషలో- నన్ను విడిచిపెట్టు, నీహృదయేశ్వరియైన దమయంతికి నీ గుణగణాలను వర్ణించి చెప్పి ఆమె నీయందు బద్ధానురాగియై నిన్నే పెండ్లాడేలా చేస్తాను – అని ప్రార్థిస్తుంది.
నలుడు అప్పుడా హంసను విడిచిపెడ్తాడు. ఆ హంస మిగిలిన హంసలతో కలసివెళ్ళి దమయంతి చెలికత్తెలతో విహరిస్తుండగా ఆమె చేతిలో కావాలని చిక్కుతుంది. హంస దమయంతితో మనుష్యభాషలో – నీ హృదయేశ్వరుడైన నలుని దగ్గఱనుండి వస్తున్నానని చెప్పి నలునికి ఆమె గుఱించి చెప్పినట్లుగానే ఆమెకూ నలుని గుఱించి చెప్పి నలుని యందు ఆమె అనురాగం వృద్ధిపొందేలా చేస్తుంది. మీ ఇద్దరూ ఒకరికొకరు తగి ఉన్నారు. మీ పెండ్లి అన్నివిధాలా మంచిది అని అంటుంది. దమయంతి హంసతో తన గుఱించి నలునికి కూడా చెప్పి కార్యాన్ని సానుకూలం చెయ్యమని ప్రార్థిస్తుంది. హంస సరేనని బయలు దేరి వెళ్ళి నలునికి విషయమంతా చెప్తుంది. అప్పుడు
నలదమయంతు లిద్దఱు మనఃప్రభవానల బాధ్యమానలై
సలిపిరి దీర్ఘవాసర నిశల్ విలసన్నవనందనంబులన్
నలినదళంబులన్ మృదుమృణాళములన్ ఘనసారపాంసులం
దలిరుల శయ్యలన్ సలిలధారలఁ జందనచారుచర్చలన్. 3-2-24
( నలదమయంతులు ఇరువురున్నూ ( ఒకరికొకరు సుదూరంలో ఉండి) మన్మథ తాపంచేత బాధించబడినవారై చెలువం చిందే నందనవనాల వంటి క్రొత్త తోటలలో, తామరపూలరేకులలో, మెత్తని తామరతూండ్లలో, కర్పూరపరాగంతో, మంచిగంధపు మై పూతలతో, పన్నీటి జల్లులయందు, చిగురుటాకుల శయ్యలపై పెక్కు పొడవయిన రేయింబవళ్ళు గడిపారు.)
ఈ పద్యం మేం చదువుకునే రోజుల్లో కంఠస్థం చేయవలసిన పద్యంగా ఉండేది. దానిలో -మనఃప్రభవానల దహ్యమానులై – అని ఉండేది ఎందుచేతనో. అర్థం సరిపోతుందనుకోండి. మా తెలుగు మాష్టారు వ్యాసేశ్వరశాస్త్రిగారు ఈ పద్యాన్ని ఎంత అందంగా వర్ణించి వర్ణించి అర్థం మరీ మరీ విడమరచి చెప్పేవారో తలచుకుంటుంటే – మళ్ళీ చిన్నపిల్లలుగా మాఱిపోయి స్కూలుకువెళ్ళి తెలుగు క్లాసులో చేరి చదువుకోవాలని పిస్తుంది ఈనాటికీను. దమయంతి విరహబాధను, ఆమె నలుడిని ప్రేమించటం, హంస రాయబారం – వగైరా విషయాలన్నింటినీ చెలికత్తెలు రాజుగారైన భీమునికి చేరవేస్తారు. అప్పుడాయన నలుని రప్పించటం ఎలానా అని ఆలోచించి దమయంతికి స్వయంవరం ప్రకటించి నలునితో పాటుగా అందఱు రాజులనూ స్వయంవరానికి ఆహ్వానిస్తాడు.
ఇదిలా ఉండగా పర్వత నారదులనబడే మునీశ్వరులు ఇద్దరు ఇంద్రసభకు వెళ్ళినప్పుడు ఇంద్రుడు వారిని భూలోకవిశేషాలని గుఱించి( పూర్వం యుద్ధాలలో అసువులు బాసినవారంతా స్వర్గానికి వస్తుండేవారు, కాని ఈమధ్యను ఎవరూ రావటం లేదు ఎందుచేత అని) అడగ్గా వారు ఇంద్రునికి దమయంతి అందచందాల గుఱించీ ఆమెకు ఆమె తండ్రి స్వయంవరం ప్రకటించటాన్ని గుఱించీ రాజులందరూ దమయంతి స్వయంవరానికి వెళ్తున్నసందర్భంగా వారిలోవారు వైరాలు మానినట్టు గానూ చెప్తారు. ఇది విన్న ఇంద్రుడికీ దమయంతి స్వయంవరానికి వెళ్ళాలనిపించి తనతోబాటుగా దిక్పాలకులని తోడుతీసుకుని భూమిమీదకు వచ్చి దమయంతీ స్వయంవరానికి వెళ్తుండగా వారికి దారిలో ఆ స్వయంవరానికే వెళ్తున్న నలుడు తారసిల్లుతాడు. వారతనిని ఆపి మాకు నీవలని సహాయం కావాలని అడుగుతారు. నలుడు సరే చేస్తాను అనగానే తమ తరఫున దమయంతి దగ్గఱకు తమలో(దేవతలలో) ఒకరిని వివాహమాడాల్సిందని రాయబారం చేయమని అడుగుతారు. దానికాతడు అయ్యా! నేనూ దమయంతిని పెళ్ళాడగోరిన వాడినే కదా! నన్నిలా అడగటం న్యాయం కాదంటాడు. వాళ్ళతనితో నీవు మాకు సహాయం చేస్తానని వాగ్దానం చేసి, ఇప్పుడు కాదనవచ్చా ? అని నిలతీయగా, సరే! అని అంగీకరించి దమయంతి దగ్గఱకు వెళ్తాడు. దారిలో ఎవ్వరూ అతనిని గుర్తుపట్టి అడ్డుకోకుండా వుండేలా వరం ఇస్తారు దేవతలు. నలుడు దమయంతి దగ్గఱికి వెళ్ళి విషయం తెలియజేసి దేవతలలో ఒకరిని పెళ్ళిచేసుకోమంటాడు. అప్పుడు దమయంతి అతనితో
(తరువోజ)
‘ ఏ నేడ? నింద్రాదు లేడ ? వారలకు ! నెప్పుడు మ్రొక్కుదు: నేను నీ ధనమ
భూనాథ ! నీ గుణంబులు హంసచేతఁ ! బొలుపుగా విని మనంబున నిల్పియున్న
దాన : భవన్నిమిత్తమున ని ట్లఖిల ! ధారుణినాథ సార్థంబు రావింపఁ
గా నిప్డు వలసె లోకఖ్యాతకీర్తి ! కరుణించి పతిబుద్ధిఁ గావింపు మిందు. 3-2-47
నీవు దీని కొడంబడనినాఁడు రజ్జు విషాగ్ని జలంబుల బ్రాణ పరిత్యాగంబు సేసికొందు’ అన్నదామె నలునితో.
(‘ మానవమాత్రురాలయిన నేనెక్కడ ? దేవతలైన ఇంద్రాదు లెక్కడ ? నేను వారిని సదా నమస్కరించి అర్చిస్తాను గదా ! ఓ నలమహారాజా ! నేను నీ సొత్తును మాత్రమే. నీ గుణాలు హంస చెప్పింది మొదలు నిన్నే సదా నా మనస్సులో ధ్యానిస్తున్నాను. నీరాకకొఱకే ఇపుడు ఈ రాజులందరినీ ఆహ్వానించవలసి వచ్చింది. ఓ నలమహారాజా ! దయచేసి నాకు పతిగా ఉండటానికి అంగీకరించ ప్రార్థన.)
నీవు నా భర్తగా ఉండటానికి అంగీకరించకపోతే నేను ఉరిపోసుకుని లేదా విషం త్రాగి, లేదా నీటిలో దూకి అసువులు విడుస్తాను’ అని అన్నది. అంత గొప్ప దేవతలే నిన్ను వరిస్తుండగా , వారి పాదరజం తో కూడా పోలికలేనివాడిని నన్ను వరిస్తా నంటావేమిటి ? అని చాలా విధాలుగా ఆమె మనస్సు మరలింప చూచి సాధ్యం కాక దేవతల దగ్గఱికి వెనుతిరిగి వచ్చి వారికి విషయాన్ని వివరిస్తాడు. దమయంతి నలునితో – వారిసమక్షంలోనే నేను నిన్ను స్వయంవరంలో వరిస్తాను. అప్పుడు వారు నీయందు దోషారోపణ చెయ్యలేరు కదా అంటుంది. సరే, ఆమె నలుడిని ఎలా వివాహమాడుతుందో చూద్దామని అనుకొని వారందరూ నలుని రూపంలోనే స్వయంవరానికి వస్తారు.
అప్పుడు దమయంతి నలుని తెలుసుకొనే విధం ఏదో తెలిజేయమని తన మనస్సులోనే దేవతలను ప్రార్థిస్తుంది. వారు ఆమె యెడల దయతో అనిమిషులుగాను, తమ పాదాలు భూమికి తాకకుండా వుండేలానూ కనిపిస్తారు. ఆ గుర్తులను బట్టి దమయంతి నలుని గుఱ్తెఱిగి అతని మెడలో మాల వేసి అతన్ని వరిస్తుంది. అప్పుడా వివాహసమయంలో ఇంద్రుడు నలుడు చేసే యజ్ఞాలలో స్వయంగా పాల్గొంటాననీ, అగ్ని వరుణులు నలుడు కోరిన చోటులలో నిప్పు, నీరు లభించేట్లుగా వరాలు ఇస్తారు. యముడు నలుని మనస్సు ఎప్పడూ ధర్మంపైనే లగ్నమయ్యేట్లుగా వరం ఇస్తాడు. దేవతలిలా నలునికి వరాలిచ్చి స్వర్గానికి వెళ్తుండగా దారిలో కలి, ద్వాపరపురుషుడితో పాటు దమయంతీ స్వయంవరానికొస్తూ ఎదురుపడతాడు. వీరివలన దమయంతికి నలునితో వివాహమైన విషయం విని వారిద్దరికీ రాజ్య పరిత్యాగం, పరస్పర వియోగం
కలుగజేస్తానని పలికి నలుడికి పాచికలు అంటే ఇష్టమని యెఱిగి ద్వాపరుణ్ణి పాచికలలో ఉండమని నియమించి తాను నలునిలో ప్రవేశించదలచి పెద్దకాలం నిరీక్షించి చివరకో రోజు నలుడు మూత్ర విసర్జన చేసి కాళ్లు కడుక్కోవటం మఱచినప్పుడు ఆ అశౌచాన్ని సాకుగా తీసుకుని నలునిలో ప్రవేశిస్తాడు. ( అందుకే పెద్దలు కాలకృత్యాలు తీర్చుకున్న వెంటనే కాళ్ళు పరిశుభ్రంగా కడుగుకోవాలని మనకు చెప్తారు. ఇటువంటి మంచి విషయాలెన్నో మనకు భారతం ద్వారా తెలియవస్తాయి.) కలి పుష్కరుని నలునితో జూదమాడమని ప్రోత్సహించి ఆ జూదంలో నలుడు తన సర్వసామ్రాజ్యాన్నీ, సంపదలనూ పోగొట్టుకునేలా చేస్తాడు. మధ్యలో దమయంతి బ్రాహ్మణులను పంపించి జూదం ఆపించాలని చేసిన యత్నం కూడా కొనసాగదు. కలి ప్రభావం అంత అధికంగా పనిచేస్తుంది.
‘ఎంత యోటువడిన నంతియ జూదంబు ! నందుఁ దగులుఁ, జలము నతిశయిల్లు,
నేమి సేయు దాన ? నిది యెగ్గునకు మూల’! మని లతాంగి దుఃఖితాత్మ యగుచు. 3-2-63
అదీ జూదం యొక్క మహిమ. నలుని పరిస్థితి యెఱిగినదై దమయంతి అతని అనుమతితో తన పిల్లలనిద్దరినీ ఓ సారధిని తోడిచ్చి తన తల్లిదండ్రులింటికి పంపిస్తుంది. తఱువాత వారిద్దరూ సర్వస్వాన్నీ కోల్పోయి ఊరిబయట 3 రోజులు గడుపుతారు. పుష్కరుని వలని భయంతో ప్రజలెవ్వరూ వారిని చూడటానికి రారు. అప్పుడు వారాకలితో ఆలమటిస్తుండగా రెండు బంగారు పక్షులు కనిపిస్తాయి. వాటిని ఆహార నిమిత్తం పట్టుకుందామని పైపంచెను వాటిమీదకు విసరగా అవి ఆ పంచెను పట్టుకుని ఎగిరిపోతూ – మేము నీవు జూదంలో ఉపయోగించిన పాచికలమని చెప్పి మరీ పోతాయి. నలుడు దమయంతి కట్టిన వస్త్రాన్నే తనూ ధరిస్తాడు.
వాళ్ళిద్దరూ ఓ నాలుగురోడ్ల కూడలికి చేరుకోగానే నలుడు ఆమెతో ఈదారి దక్షిణాపథానికి, ఇది విదర్భకు, ఇది కోసలకు, ఇది ఉజ్జయినికి వెళ్తాయి. వీటిలో మనకెళ్ళాల్సినది ఏది అని అడుగుతాడు. దానికామె మనం నా పుట్టినిల్లు అయిన విదర్భకు వెళదామంటుంది. అడవులలో నాతో కష్టాలు పడలేవు, అందుచేత నీవు విదర్భకు వెళ్ళి సుఖంగా ఉండు అంటాడు నలుడు. మనమిద్దరమూ కలసి విదర్భకే వెళదాము, అడవులలో కష్టాలు పడటం ఎందుకు ? అంటుందామె. నీవన్నట్లుగా విదర్భేశ్వరుని రాజ్యం కూడా మనరాజ్యం లాంటిదే, కాని పూర్వం అధికమైన ఐశ్వర్యంతో అలరారుతూ అక్కడికి వెళ్ళిన నేను ఈనాడు ఈ దీనస్థితిలో ఎలా వెళ్ళగలను – అంటాడు. ఇక్కడో రెండు మంచి పద్యాలున్నాయి.
‘అధికదుఖఃరోగార్తున కౌషధంబు ! సురుచిరంబుగ భార్యయ చూవె యెందు
నొనర భార్యాసమేతుఁడై యున్నవాని ! కెంతలయ్యును నాపద లెఱుక పడవు. 3-2-74
(అన్నిరోగాలలో గొప్పరోగం దుఃఖం. గొప్ప దుఃఖ మనే రోగంతో పీడితుడైనవాడికి మంచిమందు భార్యయే సుమా! భార్యతో కూడి ఉన్నవాడికి ఎంతటి కష్టాలైనా అనుభవిస్తున్నట్లు అనిపించవు.) (ఇది నా విషయంలో అనుభవానికి వచ్చిన విషయం.)
అలసి నెడ, డస్సి నెడ, నాఁ కలి దప్పియు నైన యెడలఁ గడుకొని ధరణీ
తలనాథ ! పురుషునకు ని మ్ముల భార్యయ పాచుఁ జిత్తమున దుఃఖంబుల్. 3-2-75
(ఓ నలమహారాజా ! విసిగివున్న సమయాలలో, బడలిన సమయాలలో, ఆఁకలి అయిన వేళలో, దాహం వేసినపుడు, మగవాడికి ప్రీతితో తోడ్పడి, భార్యయే అతని మనస్సులోని పరితాపాన్ని పోగొట్టుతుంది.)
అందుచేత నన్ను ఈ సమయంలో విడిచిపెట్టవద్దు అంటుంది దమయంతి నలునితో. అలాగే, ప్రాణసమానవైన నిన్ను వదలిపెట్టను అని మాటిస్తాడు. వారిద్దరూ ఎవరూలేని ఓ చోట నిద్ర కుపక్రమించగా నలునికి నిద్ర దూరమవుతుంది. అలసటతో నిద్రిస్తున్న ఆమెను చూచి, బాధపడి, తను దూరంగా వెళితే ఆమె తండ్రిదగ్గఱకు వెళ్తుంది కదా అనే ఆలోచనతో ఆమెను ఆ అడవిలో విడిచి ఆమె చీరలో సగం తను చింపుకుని వెళ్ళిపోతాడు. కలిప్రభావం వలన ఆమెను విడిచి వెళ్దామనీ, ఆమెకు తనయందుగల అఖండమైన ప్రేమకు వివశుడై వెళ్లకూడదనీ చాలాసేపు వితర్కించి, వితర్కించి చివరకు వెళ్ళిపోతాడు. అదీ కలి ప్రభావం అంటే. దమయంతి లేచి నలుడు లేకపోవటం చూచి నీ వెన్నండు ధర్మంబు దప్పనివాడవు, సూనృతవ్రతరతుడవు, ఓడకుము నీతోనే ఉంటాను అని నన్నూరడబలికి ఇలా చేయదగునా – అని విలపించి ఇలా అంటుంది.
వగవఁగ సాంగోపాంగము ! లగు నాలుగు వేదములయు నధ్యయనము పొ
ల్పుగ నొక సత్యముతో నెన ! యగునే యెవ్వియును పోల వటె సత్యంబున్. 3-2-83
(ఆలోచించి చూస్తే నాలుగు వేదాలు, వేదాంగాలు, వేదోపాంగాలు చదివినప్పటికిన్నీ ఆ వైదిక వాజ్ఞ్మయ పరిజ్ఞానం అంతయూ ఒక్క సత్యంతో సరితూగదని పెద్దలు చెపుతారు. సత్యానికి ఏవీ సరిపోలవు.)
వేదాలు నాలుగు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం. వేదాంగాలు 6.శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పం. ఉపాంగాలు 4. మీమాంస, న్యాయశాస్త్రం, పురాణం, ధర్మశాస్త్రం. ఉపవేదాలు : ఋగ్వేదానికి ఆయుర్వేదం, యజుర్వేదానికి ధనుర్వేదం, సామవేదానికి గాంధర్వవేదం, అథర్వవేదానికి స్థాపత్య శస్త్రవేదాలు ఉపవేదాలు. ఈ పద్యం నన్నయ రుచిరార్థసూక్తి.
అలా భర్తను వెదుకుతూ అరణ్యంలో తిరుగాడుతున్న దమయంతిని ఆహారార్థమై ఒక కొండచిలువ పట్టుకోగా ఆమె ఆర్తనాదం విన్న ఒక యెఱుకు వేగంగా వచ్చి ఆమెను కొండచిలువ బారినుండి రక్షించి ఆమె సమాచారం అంతా తెలిసికొని ఆమె పట్ల కామపరవశుడవగా ఆమె ఆతడిని తన శాపంతో మృతునిగా చేస్తుంది. తరువాత ఆమె అడవిలో ఈ క్రిందివిధంగా వాపోతూ భర్తను వెదకుతుంది.
‘ సహకార ! మత్ప్రియసహకారుఁ, బున్నాగ ! పున్నాగుఁ, దిలక ! భూభువనతిలకుఁ,
జందన ! బుధహరిచందనుఁ బుష్పితా ! శోక సుహృజ్జనశోకదమను,
వకుళ ! కులైకదీపకు, విభీతక ! భయో ! పేతార్తుహరు నలుఁ బ్రీతితోడఁ
గానరే కానలలోన లోకోత్తరు?’ నని మ్రాని మ్రానికి నరిగి యరిగి
యడుగు, నడుగు లెండఁ బొడ నొడఁ బొక్కిన ! నిర్ఝరాంతరముల నిలుచుఁ బిలుచు,
గిరుల దరుల యెడల నురుగుహాగృహములఁ ! దొంగి తొంగి చూచుఁ దోయజాక్షి. 3-2-95
( ‘ఓ సహకార వృక్షమా ! నాకు ప్రీతిని చేకూర్చి నాతో సహకరించే నాభర్త నలమహారాజును చూచావా? ఓ పున్నాగవృక్షమా ! పురుషులలో పున్నాగుడైన నలుడిని చూచావా ? ఓ తిలక వృక్షమా ! భూలోకంలో తిలకుడైన (శ్రేష్ఠుడైన) నలుడిని చూచావా ? ఓ చందన వృక్షమా ! బుధులలో హరిచందన ప్రాయుడైన నలుడిని చూచావా ? పూచిన అశోకవృక్షమా ! ఉత్తములగు మిత్రుల శోకాన్ని నివారించే నల చక్రవర్తిని చూచావా ? ఓ వకుళవృక్షమా ! కులదీపకుడైన నలమహారాజును చూచావా ? ఓ విభీతక వృక్షమా ! భయోపేతులకు విభీతకుడైన నలుడిని చూచావా ? నలుడు లోకోత్తరుడు. నలుడిని చూడలేదా ?’ అని ఆమె ఎండలో అడవిలో అడుగులు బొబ్బలెక్కేటట్లు తిరుగుతూ చెట్టు చెట్టునూ పలకరిస్తూ తిరిగింది. వేడినేలపై నడువలేక సెలయేళ్ళలో నిలబడి పిలిచింది. కొండ చరియల దాపుల్లో వెదకింది. కొండ గుహలలో తొంగి తొంగి చూచింది). ( ఓ చిన్న సందేహం. అడవిలో దట్టమైన అన్ని వృక్షాలమధ్య అసలు ఎండ నేలపై పడదు కదా ? ఆమెకు కాళ్ళు ఎలా కాల్తాయి ? అని)
దమయంతి అలా అలా అడవులలో క్రుమ్మరుతూ సుబాహుపురం చేరుతుంది. ఈమెను చూసి ఆ పుర రాజమాత తన దగ్గఱకు పిలిపించుకొని ఆశ్రయం కల్పిస్తుంది. నేను సైరంధ్రీ వృత్తినవలంబించాను. నలుని వెదకటానికి వెళ్ళే బ్రాహ్మణులతో తప్ప ఇతరులతో మాట్లాడను అని తన నియమం చెపుతుంది ఆ రాజమాతకు దమయంతి. ఈలోగా నలుడు కర్కోటక విషాగ్నిచే తన రూపాన్ని పోగొట్టుకొని వికృతరూపుడై ఉంటాడు. ఋతుపర్ణుడనే రాజును సేవించి అతనికి తన అశ్వహృదయమనే విద్యను ఇస్తానని చెప్పి అతనివద్దనుండి అక్షహృదయమనే విద్యను పొందుతాడు నలుడు. ప్రచ్ఛన్నవేషంలో బాహుకుడనే నామంతో నలుడు ఋతుపర్ణుని దగ్గఱ ఉంటాడు. ఈలోగా దమయంతి తంఢ్రి విదర్భరాజు భీముడు వారిరువురినీ వెదకటానికి వేగులను పంపుతాడు. ఆయనచే పంపబడిన సుదేవుడనే బ్రాహ్మణుడు సుబాహుపురంలోని రాణివాసంలోని దమయంతిని చూచి ఆమె భ్రూమధ్యంలోని ( పుట్టుమచ్చ)సూక్ష్మలక్షణాన్ని గమనించి ఆమెను దమయంతిగా గుర్తుపడతాడు. అతడు తనలో ఆమెగుఱించి – ఈమె భర్తనుండి విడివడి నీటిపారుదల ఎండిపోయిన ఏటి వలె, పద్మాలు లేని తామరతూటివలె, మామిడిచెట్టులేని వనం వలె ఉన్నాకూడా తన పాతివ్రత్యమహిమచేత ప్రకాశిస్తున్నది కదా అనుకుంటాడు.
అనపహార్యంబు తేజోమయంబు సర్వ ! గుణములకు నలంకారంబు గురుతరంబు
భామలకుఁ బతిభక్తియ పరమ మైన ! భూషణం బిట్టివే పెఱ భూషణములు? 3-2-143
( ఆడువారికి పతిభక్తియే వారినుండి అపహరించటానికి వీలులేనిది, ప్రకాశమానమైనది, మిక్కిలి గొప్పదైనది, సమస్త సద్గుణాలలో ఎన్నదగినది అయిన అలంకార విశేషం. ఇలాంటి అలంకారం ఆడవారికి ఇంకొకటి లేదు కదా).
ఇలా అనుకొంటూ ఆమె దగ్గఱికి వచ్చి తన గుఱించి ఆమె తండ్రిగుఱించీ చెప్తాడు. రాజమాత సునంద దమయంతిని గుర్తించి ఆమెతో – నీవు నాకు కూతురివి, ఎలానంటే మీ అమ్మ నేను అప్పచెల్లెళ్ళమవుతామని చెబుతుంది. దమయంతి అక్కడినుండి విదర్భకు చేరుతుంది. తండ్రిని నలాన్వేషణకు బ్రాహ్మణులను అన్నిదిక్కులకు పంపించమని చెప్పి వారితో అన్ని సభలలో మీరు – నీవు నిత్యసత్యవ్రతుడివి. నీభార్యను మోసం చేసి ఆమెచీరలో సగం చించి కట్టుబట్టగా చేసికొని పోవటం న్యాయమా? భరింపబడేది భార్య అని కదా ధర్మం. ఆ ధర్మం నీపట్ల అసత్యమైనది కదా ! నీవు ఇటువంటి దయలేని కఠినమైన బుద్ధిని అవలంబించ తగునా? అటువంటి పతివ్రతా శిరోమణి పట్ల అనుగ్రహం చూపుము – అని పలకండి , ధీనికి ఎవరైనా ప్రత్యుత్తరం ఇస్తే అతడే నలుడని గుర్తించి అతనికి నా వివరం చెప్పి తీసుకుని రండి. రాకపోతే గనక అతని వివరాలు తెలియజేయండి అని చెప్పి పంపిస్తుంది. ఆబ్రాహ్మణులు అన్నిచోట్లా వెదగ్గా వారిలో పర్ణాదుడనే వాడికి ఋతుపర్ణుని సభలో నూఱుగద్యాణముల జీతానికి పనిచేస్తున్న కుఱుచచేతులు మఱియు అందవికారం కలిగినవాడు, శీఘ్రంగా రథాన్ని తోలగలిగినవాడు, సూదక్రియానిపుణుడు అయిన బాహుకు డనేవాడు రహస్యంగా కలసి వెలవెల నవ్వుతూ ఇలా అన్నాడు –
‘ పురుషుండు దోషపుంజంబు గలిగిన ! నెఱిఁగి యెద సహించునేని భార్య
పురుషునం దభీష్టభోగంబు, దేహాంత ! రంబునందు ధర్మరతియు బడయు ‘ 3-2-160
అని చెప్పాడు అంటూ దమయంతికి వివరిస్తాడు. దమయంతి ఇంకా వివరాలు సేకరించదలచి, నలుని రప్పించటం కోసమని సుదేవుని రప్పించి అతనితో నన్ను గుర్తుపట్టి విదర్భకు చేర్చినట్లే మీరు నలునికూడా తీసుకుని రావలసినది. ఋతుపర్ణుని సభకు వెళ్ళి ఆయనతో – విదర్భరాజు నలుని వెదకి వెదకి కానజాలక దమయంతికి ద్వితీయ స్వయంవరం ప్రకటించాడు. రేపే ఆ స్వయంవరం, దానికి రాజులందఱూ వస్తున్నారు, మిమ్మల్నీ ఆహ్వానించారు అని చెప్పి రండి – అని పంపిస్తుంది. ఋతుపర్ణుడు బాహుకుడిని పిలచి – నాకు దమయంతీ స్వయంవరం చూడాలని ఉంది. రేపే ఆ స్వయంవరం, మనం ఒక్కరోజులో అక్కడికి చేరాలి. నీ అశ్వచాలన విద్యతో నన్ను అక్కడికి వేగంగా తీసుకుని వెళ్ళాలి.- అంటాడు. బాహుకుడు అలాగే అని మనస్సులో దమయంతి గూర్చి ఈ విధంగా చింతిస్తాడు.
‘ అడవిఁ దన్నుఁ బాసి యరిగిన నలిగి కా ! కున్నె యిట్లు సేయ నువిద గడఁగె;
నెట్లయేనిఁ గూర్తు రింతులు మా కని ! విశ్వసించువారు వెడగు లెందు 3-2-165
( ఆనాడు అడవిలో తనను ఎడబాసి వెళ్ళాను, అని కదా ఆమె నాపై కోపం పూని ఈవిధంగా రెండవ స్వయంవరానికి పూనుకుంటుంది. తా మేమి చేసినా తమనే వనితలు ప్రేమిస్తూ ఉంటారని నమ్మే పురుషులు అవివేకులు.)
సాధ్వి నాకుఁ గూర్చు సంతతి గలయది ! చెలువ యిట్టులేల చేయు ? నైన
నెఱుఁగవలయు దీని నే ఋతుపర్ణుతోఁ ! బోదు’ నని నలుండు బుద్ధి దలఁచి 3-2-16
(దమయంతి పతివ్రతా తిలకం. నాపట్ల అనురాగం గల బిడ్డలు ఉన్నారామెకు. ఆమె ఈ విధంగా రెండవ స్వయంవరానికి ఎలా ఒప్పుకుంటుంది ? అని వితర్కించి, ఋతుపర్ణునితో వెళ్ళి చూడాలి)-
అని అనుకుని వెళ్ళటానికి బక్కగా కనిపించే గుఱ్ఱాలతో వార్ష్ణేయునితో కలసి రథాన్ని సిద్ధం చేసి తీసుకువస్తాడు. ఋతుపర్ణుడు ఆ రథం ఎక్కగానే ఆ అదురుకు గుఱ్ఱాలు కొంచెం కుంగుతాయి. అదిచూసి ఈ పేదగుఱ్ఱాలు వేగంగా పరిగెత్తలేవు, గుఱ్ఱాలను మార్చమంటాడు ఋతుపర్ణుడు. దానికి బాహుకుడు ఈ గుఱ్ఱాలు పూర్వం నలుని రథానికి వార్ణేయునితో కూర్పబడినవి. ఇవి వాయువేగంతో పరిగెత్తి నేడు పోద్దువాలే సమయానికి మనల్ని విదర్భకు చేరుస్తాయంటాడు. సరే అలా అయితే నీకు మంచి బహుమతి నిస్తానని చెప్తాడు ఋతుపర్ణుడు. ఆ రథం వెళ్తుంటే ఆ వేగానికి ఆశ్చర్యపోతాడు వార్ష్ణేయుడు. ఆ రథ వేగానికి ఋతుపర్ణుని ఉత్తరీయం జారి క్రిందపడగా ఋతుపర్ణుడు బాహుకుని రథవేగాన్ని కొంచెం తగ్గిస్తే వార్ష్ణేయుడు దిగి వెళ్ళి ఉత్తరీయాన్ని తెస్తాడని అనగా ఆ ఉత్తరీయం పడినచోటునుండి అప్పుడే ఒక యోజనం గడచి వచ్చేసామని, వార్ష్ణేయుడు నడచి వెళ్ళి దానిని తిరిగి తీసుకురావటం సాధ్యం కాదనీ అంటాడు బాహుకుడు. అదీ ఆ రథ గమన వేగం. అలా వారు వెళ్తుండగా దారిలో వారికి పెక్కు ఆకులతో కప్పబడివున్న విభీతక వృక్షం(తాండ్ర చెట్టు) కనబడుతుంది. అప్పుడు ఋతుపర్ణుడు బాహుకుడితో ఇలా అంటాడు.
‘ ఎల్లవారు నెఱుఁగ రెల్లవానిని; భిన్న! విషయు లెల్లవారు విద్యలందుఁ;
దొలఁగ కే నెఱుంగుదును దృష్టిమాత్రన ! సకల మైన వస్తుచయముసంఖ్య. 3-2-174
వ. ఇవ్విభీతకంబున ఫలపర్ణ సముదాయసంఖ్యఁ జెప్పెద విను ; మీరెండు శాఖలం గల పర్ణ ఫలంబులు పదివేలు నొక్కండు దక్కిన శాఖలం గల యవి రెండు వేలుం దొంబదే’ – నని చెప్తాడు .బాహుకుడు, లెక్కపెట్టి చూసిగాని నమ్మనని రథమాపి దిగి వెళ్ళి ఆ చెట్టును పడగొట్టి శ్రద్ధగా లెక్కిస్తే సరిగ్గా లెక్క సరిపోతుంది. ఈ విద్య నాకు ఉపదేశించవలసింది అని బాహుకుడు ఋతుపర్ణుని కోరతాడు. ఋతుపర్ణుడు దానికిలా అంటాడు.
‘ఇది యక్షహృదయ మనఁగా విదితం బగు విద్య దీని విధ్యుక్తముగా
మది నెఱుఁగు నరుఁడు విదుఁ డగు దుష్కృతకళంకవిషముక్తుఁడగున్. 3-2-175
(ఇది అక్షహృదయం అని ప్రసిద్ధి కెక్కిన విద్య, దీన్ని శాస్త్రీయంగా అభ్యసించిన మనుజుడు సంఖ్యావేత్త అవుతాడు. అతడు పాపాలనుండి, దుర్గుణాలనుండి , విషం నుండి విముక్తి పొందుతాడు.)
సకలగుణప్రసిద్ధుఁ డగు సర్వహితుం డగుఁ జూవె’ – అని చెప్పి బాహుకునకు ఆ విద్యను శాస్త్రీయంగా బోధిస్తాడు. బాహుకుడు కూడా ఋతుపర్ణునికి అశ్వహృదయం అనే విద్యను బోధిస్తానంటే తర్వత ఆవిద్యను గ్రహిస్తానని అంటాడు. విద్యను ఒకరినుంచి ఒకరు ధనమిచ్చి గానీ మరో విద్యను ఇచ్చిగానీ గ్రహించాలి కానీ ఊరకనే గ్రహించరాదని పెద్దలంటారు.
“ముఖే ముఖే సరస్వతీ” – అంటారు. ఒక్కొక్కరికి ఒక్కో ప్రజ్ఞ ఉంటుంది. ఎవ్వరునూ సర్వజ్ఞులు కారు. 174 పద్యం మొదటి పంక్తిలోని భావం ఇదే. నలుడు రథసారథ్యంలో నిపుణుడైతే, ఋతుపర్ణుడు గణితశాస్త్రప్రవీణుడు.
అక్షహృదయ విద్య మహిమచేత నలుడు కలిచేత విముక్తుడు అవుతాడు. కలి అప్పటినుండి ఆ విభీతక వృక్షాన్ని ఆశ్రయిస్తాడు. నలుడు కలికి శాపం ఇవ్వబోగా కలి అతడిని ప్రార్థించి- నిన్నును, నీ చెలువను కీర్తించిన జనంబులు నావలని భయంబును పొందరు – అని వరమిస్తాడు. నలుడు వికృత రూపం ఒక్కటి తప్ప మిగిలిన అన్ని దోషాలనుండీ విముక్తి చెందుతాడు. వారు ముగ్గురూ విదర్భకు వెళ్తారు. ఆ రథ ధ్వని విని అది నలుని రథ ధ్వనిగా దమయంతి గుర్తిస్తుంది. అక్కడ చూస్తే స్వయంవరం ఏర్పాట్లేమీ లేవు. ఋతుపర్ణుడు – దమయంతి ఇంకొకరిని వరించేంతటి ధర్మేతర కాదు – అని అనుకొని తాను వచ్చినందుకు సిగ్గుపడతాడు. భీముడు ఋతుపర్ణునికి అన్ని మర్యాదలూ చేస్తాడు. బాహుకుడు రథసమీపంలో విశ్రమించి యుండగా దమయంతి అతని వద్దకు కేశిని అనబడే దానిని పంపిస్తూ ఋతుపర్ణుడూ, వార్ష్ణేయుడూ మనకు తెలిసినవారే. బాహుకుడే మన పర్ణాదునకు జవాబు చెప్పినవాడు. అతని విషయం వివరంగా తెలుసుకుని-రా అని పంపిస్తుంది. దమయంతి కేశినిని వివరాలు తెలుసుకోవటం కోసమని బాహుకుని వద్దకు 3 లేక 4 సార్లు పంపిస్తుంది. ఒకసారి అతడు గడ్డితో కూడిన పిడికిలిని వీచితే నిప్పు పుట్టి ఇంధనం అక్కఱ లేకుండానే వంట మొత్తం అయ్యేంతవఱకూ ఆరకుండా మంట మండుతూ ఉండటాన్ని, మాంసాన్ని కడగాలని అతడు తలవగానే కడవల నిండుకూ నీరు నిండటాన్ని, అతని చేతుల రాపిడికి నలిగిన పువ్వులు వాటి పరిమళాన్ని పోగొట్టుకొకుండా ఉండటాన్ని తెలిసికొంటుంది. అతడు చేసిన మాంసం కూరలు తెప్పించి వాటిని రుచి చూసి అవి నలుడు వండినవే అని నిర్ధారించుకుంటుంది. తన కొడుకునూ కూతురును కేశినితో పంపించి వారిని బాహుకుడు కౌగలించుకొని బాధ పడటాన్ని బట్టి అతడు నలుడే అని నిర్ధారించుకొంటుంది. ఇలా నిర్ధారించుకొన్న తఱువాత తన తల్లి దగ్గఱకు వెళ్లి విషయాన్నిలా వివరిస్తుంది.
‘ సందియ మేల ? సర్వగుణసంపదఁ జూడఁగ బాహుకుండు భూ
వందితుఁడైన నైషధుఁ డవశ్యముఁ దా నగు; నామనంబు నా
నందముఁ బొందుచున్నది ఘనంబుగ ; వాఁ డిట వచ్చువాఁడొ ? నే
నందుల కేఁగుదాననొ ? రయంబున నాపని నిశ్చయింపుమా!’ 3-2-203
(ఇక సందేహించవలసిన అగత్యమే లేదు. సమస్త సద్గుణసంపదలో పరిశీలించిచూస్తే బాహుకుడు తప్పనిసరిగా భూజనులచేత నమస్కారాలు అందుకునే నిషధేశ్వరుడైన నలుడే. నా మనస్సు మిగుల ఆనందతన్మయమైనది. అతడు ఇక్కడికి రావటమా? నేను అతడిదగ్గఱకు వెళ్ళటమా? సత్వరం ఈ కర్తవ్యాన్ని నిర్ణయించాలి సుమా!) అనగా దమయంతి తల్లి భీముని అనుమతితో బాహుకుడిని అక్కడకు రప్పిస్తుంది.
చనుదెంచి యందు దీనా నన నవిరళపంకమలిననతగాత్రఁ దప
స్విని నతికృశ దమయంతిం గనియె నలుం డుదితబాష్పకణకలితముఖిన్. 3-2-205
(నలుడు అచటికి చేరి, దైన్యం ఉట్టిపడే ముఖం కలదీ, ఎల్లప్పుడు దుమ్ముతో మాసి క్రుంగినదేహం కలిగినదీ, చూపరులకు జాలిగొలిపేదీ, చిక్కి కృశించినదీ, జారే కన్నీటిబొట్టులతో కూడిన మొగం కలదీ – ఐన దమయంతిని చూశాడు.
దమయంతి నలుని – విజనంబైన విపినంబునందు నలసి నిద్రవోయినదాని నబల నతిసాధ్వి ననువ్రత నగ్నిసన్నిధిఁ పాణిగ్రహణవిధిలబ్ధ యైన దానిం బాసి నలునట్లు నిర్దయులై యరిగినవా రొరు లెవ్వరు లేరు.
సురవరులఁ దొఱఁగి తన్నున్ ! వరియించితి ; నన్నుఁ బుత్త్రవతి నేలొకొ చె
చ్చెర విడిచె ? నాతనికి ని ! ష్కరుణున కే నేమి యెగ్గు గావించితినో? 3-2-208
‘ నిన్ను విడువ నోడకుండు’ మని పలికిన యప్పలుకు లేల మఱచెనో?’ – అని అడిగింది.
(జనులు లేని అడవిలో అలసి నిదురబోయినదానిని, బలహీనురాలైన ఆడుదానిని, సహధర్మచారిణి అయి తన వెంట అడవికి వచ్చినదానిని, సౌమ్యమైన సత్ప్రవర్తన కలదానిని, అగ్నిసాక్షిగా శాస్త్రీయమైన పద్ధతిలో పెండ్లి చేసికొని చేపట్టినదానిని నలుడి వలె కఠినాత్ములై విడిచిపెట్టి వెళ్ళినవారు ఇతరులు మరెవ్వరూ లేరు. దేవతాశ్రేష్ఠులను విడిచిపెట్టి తననే భర్తగా వరించాను కదా! అటువంటి నన్ను సంతానవతి నైనదానిని శీఘ్రంగా ఎందుకు విడిచిపెట్టినట్లు? నాపట్ల కనికరం లేకపోవటానికి అతడికి నేను ఎటువంటి అపచారం చేశానో? – నిన్ను నేను ఎన్నటికీ విడిచిపెట్టజాలను, భయపడకుము – అని నాతో పలికిన పలుకులు ఎట్లా మఱచిపోయాడో? ) అని కన్నీరు కారుస్తూ పలికింది.
దానికి నలుడు —
‘కలిసమావిష్టమతి నయి కష్టవృత్తి ! నట్టి యిడుములఁ బడితి నే; నవి మదీయ
తపము బలమున, నీ దుఃఖదాహమునను ! నష్టమై పోయెఁ ; గలి యిప్టు నన్ను విడిచె. 3-2-210
నేను ఇప్పుడు ఇక్కడకు నీ విషయం తెలుసుకొనటానికే వచ్చాను. అది అట్లా ఉండనీ! నేను నీకు కూర్చేవాడిని. సహధర్మచారిని. నన్ను విస్మరించి తిరిగి స్వయంవరం ఏర్పరచటం అంటే అది కులపాలికకు తగిన న్యాయం కాదు. రాజులందరినీ ఆహ్వానించటం చేతనే కదా ఋతుపర్ణమహారాజు ఇప్పుడు విదర్భకు విచ్చేసింది’- అని నలుడు అధిక్షేపించగా, భయపడి దమయంతి నలునకు నమస్కరించి – నిన్ను వెదకటానికి పంపించిన బ్రాహ్మణులలో పర్ణాదుడు అయోధ్యలో నీ వద్దనుండి ప్రతివచనం విని నిన్ను నలునిగా అనుమానించి నాకు చెప్పటం చేత, నిన్ను ఇక్కడికి రావించే వెఱవును ఆలోచించి రేపే దమయంతి ద్వితీయ స్వయంవరం అని ఋతుపర్ణునికి మాత్రమే వార్తను పంపించటం జరిగింది.
నరవరుఁడు నలుఁడు గా కె ! వ్వరు శతయోజనము లొక్కవాసరమున వ
త్తురు నరు లొరు ? లని దీనిం ! బరికింపఁగఁ గడఁగి యిట్లు వంచితి నధిపా! 3-2-214
(ఓ నలమహారాజా! నరులలో శ్రేష్ఠుడైన నలమహారాజు తప్ప మానవమాత్రులలో మరెవ్వరూ ఒక్కదినంలో నూఱామడలమేఱ దూరంనుండి రాగలరు ? అని ఆలోచించి ఈ విధమైన ఏర్పాటు చేసాను. )
ఏ నతిపాపభావమును నెగ్గుఁ దలంపక యుండునట్లుగా
నానతవైరి ! నీ యడుగు లంటఁగ నోపుదు : నట్టిదైన న
న్నీ నలినాప్తుఁ డీ యనలుఁ డీ మృగలాంఛనుఁ డీ సురోత్తముల్
జాను సెడంగ నీక్షణమ చంపరె ! కోపపరీతచిత్తులై,’ 3-2-215
(శత్రువులను నిర్జించిన మహావీరుడవైన ఓ నలమహారాజా ! నేను ఎటువంటి పాపపు తలంపునుగాని, అపచారాన్నిగాని నీపట్ల తలపోయలేదని నీపాదాల సాక్షిగా ప్రమాణం చేయగలను. నాలో ఎటువంటి చెడుతలంపు ఉన్నట్లయితే ఈ సూర్యుడు, ఈ అగ్నిహోత్రుడు, ఈ చంద్రుడు, ఈ దిక్పాలకులు నన్ను ఈ క్షణంలోనే శోభమాసిపోయేటట్లుగా చంపివేయరా ? ‘)
ఇలా ఆమె శపథం చేసేసరికి వాయుభట్టారకుడు ఆకాశం నుండి అందరూ వినేటట్లుగా దమయంతి పాతివ్రత్యాన్ని గుఱించి తెలియజేసి ఆ మూడు సంవత్సరాలూ తనూ, సూర్యుడూ, చంద్రుడూ కలసి ఆమెను సదా కాపాడుతున్నామని, ఆమెను పరిగ్రహించమనీ చెప్తాడు. దేవతలు పుష్పవృష్ఠి కురిపిస్తారు. నలుడు ఆ క్షణంలో కర్కోటకుడిని తలచి వానిచే యీయబడిన ఉత్తరీయాన్ని ధరించి తన నిజరూపాన్ని పొందుతాడు. దమయంతిని నలుడు కలవటాన్ని చూసి భీమమహారాజు తన రాజ్యంలో అష్టశోభనాలు ( ఎనిమిది విధాలైన అలంకారాలు – 1.నీళ్ళు చల్లటం, 2. పందిళ్ళు వేయించటం, 3. తోరణాలు కట్టించటం, 4. చిత్రాలు వ్రాయించటం, 5. జెండాలు నెలకొల్పటం, 6. పూర్ణకుంభాలు ప్రతిష్టించటం, 7. ధూపదీపారాధనలు ఏర్పరచటం, 8. నృత్యగీతవాద్యాలు ఏర్పరచటం) చేయించాడట.
ఋతుపర్ణుడు నలుడిని నలుడని తెలియక నీచకార్యాలలో నియోగించినందులకు క్షమాపణ చెప్పి అశ్వహృదయోపదేశాన్ని నలునినుంచి గ్రహించి తన రాజ్యానికి వెళ్తాడు. నలుడు పుష్కరుని యుద్ధానికి గాని జూదానికి గాని రమ్మని ఆహ్వానించి అతడు జూదమాడటాన్నే కోరుకోగా జూదంలో అతన్ని ఓడించి తిరిగి తన రాజ్యవైభవాన్ని పొందుతాడు. – ఈ విధంగా బృహదశ్వుడు ధర్మరాజుకు నలోపాఖ్యానాన్ని సాంగోపాంగంగా చెప్పి నీవు జూదంలో ఓడిపోయి రాజ్యాన్ని పోగొట్టుకున్నందులకు చింతించకు. నీవుకూడా శత్రువులను జయించి నీ రాజ్యాన్ని తిరిగి పొందగలవని చెప్పి ధర్మరాజుకు అక్షహృదయవిద్యను ఉపదేశిస్తాడు. ఈ నలోపాఖ్యానాన్ని విన్నవారికి కలిభయం ఉండదని ఫలశ్రుతి.
నరసింహారావు మల్లిన
రాఘవ గారూ,
వైదిక ధర్మానికి విఘాతం కలిగినప్పుడల్లా మహాభారతం తిరిగి తిరిగి తనను తాను ప్రచారించుకొంటుందట.ఈ విషయాన్ని గరికిపాటి నరసింహారావు గారు వారి శ్రీమదాంధ్రమహాభారత ప్రవచనాల్లోనూ, వారి ఇతర ఉపన్యాసాలలోనూ తఱచుగా అంటూండటం వింటున్నాం కదా. అంతర్జాలంలో జరుగుతున్న అటువంటి ఓ చిన్ని ప్రయత్నానికి ఉపకరణంగా ఉండటం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావించుకుంటున్నాను.దానికి మీ బోటివారి ఆశీఃప్రశంసలు మంచి ఉత్సాహాన్ని కలుగజేస్తాయి. ధన్యవాదములు.
రాఘవ
నలోపాఖ్యానం పూర్తయ్యిందన్నమాట. చాలా బాగుందండీ. ఇంత ఓపికగా మాకు భారతాన్ని అందిస్తున్నందుకు మీకు సహస్రవందనాలు.