అమెరికా ఇల్లాళ్ళ కథలు
ఉన్న ప్రదేశాన్ని విడచి వేరే ప్రాంతానికి వలస వెళ్ళటం తేలికైన విషయం కాదు. అలవాటైన మనుషుల్నీ, పరిసరాల్నీ వదలి కొత్త చోట నివాసం ఏర్పరచుకోవటానికీ, అక్కడ పరిస్థితులతో సర్దుబాటు అవడానికీ పడాల్సిన అవస్థ సామాన్యమైనదేమీ కాదు. దేశంలో ఒక ప్రాంతంనుండి ఇంకో ప్రాంతానికి పోవడమే కష్టం అనుకొంటే, మన భాష, పద్ధతి ఏమాత్రమూ పరిచయంలేని పరాయి దేశంలో జీవితం కొత్తగా ప్రారంభించడమంటే మాటలా? మొదటి తరంలో (1980కి ముందు, కొంతవరకూ 80లలో కూడా) అమెరికా వలస వచ్చిన భారతీయులకి చాలా ఇబ్బందులుండేవి. ఆ ఇబ్బందుల్ని మగవాళ్ళకన్నా ఎక్కువగా భరించింది ఆడవాళ్ళు.
ఆ తరంలో అమెరికా వచ్చిన భారత స్త్రీలలో ఎక్కువమంది (అందరూ కాదు) తాముగా పెద్దగా చదువుకొన్నవారు కాదు. డాక్టరో, ఇంజనీరో, సైంటిస్టో అయిన భర్త వెనుక ఈ దేశానికి వచ్చిన వారు. ఇంగ్లీషు పెద్దగా రాదు. అప్పటి సంఘపు సంప్రదాయాలు, కట్టుబాట్లు మధ్య పెరిగిన ఆడపిల్లలకు బయట సమాజంలో కలివిడిగా తిరగడం అలవాటు లేదు. దుస్తులు, పద్ధతులలో పాశ్చాత్య పోకడలు (గట్టిగా మాట్లాడితే పంజాబీ డ్రస్సులు కూడా) ఆడవారిలో అప్పటికింకా లేవు. అమెరికా వచ్చినా మగవారు ప్రవర్తనలోనూ, ఆలోచనాధోరణిలోనూ – ముఖ్యంగా ఇంటిపనుల, పిల్లల పెంపకం విషయాల్లో – ఇంకా ఇండియాలో ఉన్నట్లే ఉండేవారు. వీటన్నిటికీ తోడు ఆర్థిక అభద్రత.
అప్పుడు అమెరికా ఇండియాకి ఇప్పటికన్నా చాలా దూరంగా ఉండేది. ఉత్తరాలు తప్పించి విడిగా కబుర్లు తెలిసేవి కావు. ఫోను చేయాలన్నా (అదీ అవతలవారికి ఫోను సౌకర్యం ఉంటే), కాల్ బుక్ చేసి గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి. అలవాటైన కూరగాయలూ, తిండి దినుసులూ సులువుగా దొరికేవి కావు. దగ్గర్లో తెలుగు మాట్లాడే కుటుంబాలు చాలా తక్కువగా ఉండేవి. ఇంటర్నెట్ సంగతి సరే, విడియోలు కూడా అప్పటికి ఇంకా రాలేదు. ఎప్పుడో ఒకసారి స్థానిక తెలుగుసంఘం వారు 16మి.మీ ప్రొజెక్టరుతో ఏదో స్కూల్లో ఒక తెలుగు సినిమా వేస్తే పండగ్గా ఉండేది. ఇండియా ప్రయాణాలు తరచుగా చేయడానికి వీలు పడేది కాదు.
ఐనా, ఆ తరం స్త్రీలు అమెరికాలో చాలా చొరవ చూపించారు. ఇంటిపనీ, బయటపనీ చేసుకోవటం ఎలాగో నేర్చుకొన్నారు. ఇంగ్లీషు నేర్చుకొని, ఏదైనా ట్రైనింగ్ తీసుకొని, చిన్నవో పెద్దవో ఉద్యోగాలు సంపాదించుకొని భర్తలకు అన్నిరకాలుగా చేదోడువాదోడుగా నిలిచారు. అప్పటి సగటు భారత స్త్రీలలాగే ఇంటిపనీ, వంటపనీ, పిల్లలపనీ వారే చూసుకొనేవారు. ఐనా తమదైన వ్యక్తిత్వాన్ని పెంపొందించుకొని నిలబెట్టుకొన్నారు ఆ తరం తెలుగు స్త్రీలు.
1975 ప్రాంతాల్లో అమెరికా వచ్చిన ఇద్దరు తెలుగు ఆడవారు తమ అనుభవాలని, పరిశీలనలని స్వగతాల, సంభాషణల రూపంలో వ్రాసిన రెండు పుస్తకాలను మీకు పరిచయం చేస్తాను. వీటిలో మొదటిది శ్రీమతి కమల చిమట వ్రాసిన అమెరికా ఇల్లాలు. రెండవది శ్రీమతి శ్యామలాదేవి దశిక వ్రాసిన అమెరికా ఇల్లాలి ముచ్చట్లు. పురాణం సీత (సుబ్రహ్మణ్యశర్మ)గారి ఇల్లాలి ముచ్చట్లు కొంతవరకూ వీరికి ప్రేరణ అని వేరే చెప్పక్కర్లేదు కదా. రెండు పుస్తకాలనూ వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు ప్రచురించారు.
ఈ ఇద్దరు రచయిత్రులకీ కొన్ని పోలికలు ఉన్నాయి. కమలగారు ప్రకాశం జిల్లా ధర్మవరంలో పుట్టి, హైదరాబాదులో హైస్కూలు వరకూ చదివి, తర్వాత నరసారావుపేట కాలేజీలో చదివి వివాహమైన తరువాత 1975లో చికాగో వచ్చారు. చికాగో తెలుగు వెలుగు పత్రికలో తరచూ వ్రాస్తుండేవారు. శ్యామలాదేవిగారు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పుట్టి, బాపట్ల దగ్గర చెరుకూరులో (ప్రకాశం జిల్లా?) పెరిగి, హైదరాబాదు రెడ్డీస్ కాలేజ్‌లో చదువుకొని 1976లో న్యూజెర్సీ వచ్చారు. 2004నుంచి న్యూజెర్సీ తెలుగు కళాసమితి ప్రచురించే తెలుగుజ్యోతికి అసోసియేట్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.
ఈ పుస్తకాలు రెండూ ఒక దశాబ్దం తేడాతో వ్రాయబడినా, రెండూ ఒక తరం అమెరికా తెలుగు కుటుంబజీవితానికి అద్దం పడుతాయి. పెళ్ళిరోజుల మధుర జ్ఞాపకాలూ, అమెరికాలో కొత్తగా కాపురం పెట్టినప్పుడు పడ్డ ఇబ్బందుల్ని మురిపెంగానే గుర్తు చేసుకోవడం, అలవాటూ, ఇష్టమూ ఐన చీరలు కట్టడం మార్చుకోవాల్సి వచ్చినా ఆ ఇష్టాన్ని మరచిపోలేకపోవడం, పిల్లలతోనూ, శ్రీవారితోనూ పడే చిరు చిరాకులూ, పండగల తలపోతలూ, పుట్టింటి గుర్తులూ, ఇండియా ప్రయాణాలూ, డయెట్, ఎక్సర్సైజుల అనుభవాలూ వగైరా దైనందిన జీవన వ్యవహారాలు ఈ కబుర్లకు, కథలకు ముడిదినుసులు.
ఈ రెండు పుస్తకాలలోనూ చక్కగా చదివించే గుణం ఉంది. సునిశితమైన హాస్యం ఉంది. మధ్యతరగతి కుటుంబజీవితంలోని మాధుర్యం ఉంది. మగమహారాజుల మీద మంచి చెణుకులున్నాయి. పాతరోజుల్ని మళ్ళీ హాయిగా గుర్తు చేయటముంది. చురుక్కుమనిపించే నిజాలు ఉన్నాయి.
సరదాగా చదువుకోగల పుస్తకాలు ఈ రెండూ. కమల గారి పుస్తకం ప్రచురించి పదేళ్ళు దాటింది. కాపీలు ఇంకా దొరుకుతున్నాయో లేదో తెలీదు.
అమెరికా ఇల్లాలు
కమల చిమట
ఆగస్టు 2000
75 పేజీలు, 10 డాలర్లు
—
అమెరికా ఇల్లాలి ముచ్చట్లు
శ్యామలాదేవి దశిక
అక్టోబరు 2010
139 పేజీలు, 100 రూపాయలు
—
ప్రతులకు:
Vanguri Foundation of America
PO Box 1948
Stafford, TX77497, USA
Ph: 832-594 9054
E-mail: vangurifoundation@yahoo.com
వంగూరి చిట్టెన్ రాజు
డా. జంపాల చౌదరి గారి అంతటి గొప్పాయన మేము పదేళ్ళ క్రితం ప్రచురించిన “అమెరికా ఇల్లాలు” , ఈ మధ్యనే ప్రచురించిన “అమెరికా ఇల్లాలి ముచ్చట్లు” పుస్తకాలపై సమీక్ష వ్రాయడం నాకు ఆశ్చర్యాన్నీ, ఆనందాన్నీ కలిగిస్తోంది. వాటిల్లో చిమట కమల గారి పుస్తకం కాఫీలు లేవు కానీ, క్సీరాక్స్ కాపీలు మా దగ్గర అందుబాటులో ఉన్నాయి. శ్యామలా దేవి దశిక గారి పుస్తకం ప్రస్తుతం ఇండియాలో “విశాలాంధ్ర” లోనూ, నవోదయా” లోనూ, వంగూరి ఫౌండేషన్ దగ్గరా, మరొక నెలలో అమెరికాలోనూ మా దగ్గరా అందుబాటులో ఉంటాయి.
కావలసిన వారు దయ ఉంచి నాకు ఈ మెయిల్ పంపించండి…
వంగూరి చిట్టెన్ రాజు
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా..
vangurifoundation@yahoo.com
Houston Phone: 832 594 9054
Hyderabad Phone: 98490 23852