ఆ కుటుంబంతో ఒక రోజు – జె యు బి వి ప్రసాద్

జెయుబివి ప్రసాద్ గారు నాకు మొదట (2003 ప్రాంతాల్లో) ఇంటర్నెట్‌లో తెలుగు చర్చావేదిక రచ్చబండలో పరిచయం. అక్కడ చర్చల్లో రంగనాయకమ్మగారి వీరాభిమానిగా ఆయన మాలో చాలామందికి గుర్తు. ఆతర్వాత కొన్నాళ్ళకు (2004 జనవరి) ఈమాటలో ఆయన కథ ’చెప్పులు’ చదివాను. మనసులో నిలచిపోయింది ఆ కథ. ఈ సంకలనంలో వివరాల ప్రకారం అది ఆయన మూడో కథ. ఆయన మొదటి కథ అంతకుముందు సంవత్సరమే ప్రచురింపబడిందట. అప్పట్నుంచీ ఆయన రెగ్యులర్‌గా కథలు వ్రాస్తున్నారు. అవి ఇండియాలో పత్రికలలోనూ, అమెరికాలో వెబ్, ప్రింట్ పత్రికలలోనూ ప్రచురితమయ్యాయి. నేను సంపాదకుడిగా ఉన్న తెలుగునాడి పత్రికకు, తానా సమావేశపు ప్రత్యేకసంచిక తెలుగు పలుకు (2009)కు కూడా ఆయన కథలు వ్రాశారు. మూడునెలల క్రితం ప్రసాద్‌గారి కథలన్నిటినీ (20 కథలు) ’ఆ కుటుంబంతో ఒక రోజు’ పేరుతో ప్రచురించారు.

తన కథలకి ఆధారం తన అనుభవాలూ, జ్ఞాపకాలూ, ఇతరులు చెప్పగా విన్నవీ, స్వయంగా చూసినవీ అని ప్రసాద్‌గారు ముందుమాటలో చెప్పుకున్నారు. ప్రసాద్‌గారి కథలు రెండు రకాలుగా ఉంటాయి. మొదటి రకం కథల్లో గోదావరి జిల్లాలలో (ఆ తర్వాత హైదరాబాదులో) ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలో పెరుగుతున్న ఒక బాలుడి (యువకుడి) జీవితం ఉంటుంది. రెండవరకం కథల్లో కాలిఫోర్నియాలో కంప్యూటర్ రంగంలో పనిచేస్తున్న, కొన్ని ఖచ్చితమైన అభిప్రాయాలున్న ఒక నిక్కచ్చి మనిషి కథలు. ప్రసాద్‌గారి కథలు చాలా వరకూ ఉత్తమపురుషలోనే ఉంటాయి; లేకపోతే సూర్యం అనే కథానాయకుడు ఉంటాడు. సాధారణంగా కథానాయకుడి భార్య పేరు వరలక్ష్మి అని ఉంటుంది.

ఈ కథలన్నిటిలో సామాన్యంగా కనిపించే విషయమేమిటంటే ఈ కథల నాయకుడికి తన చుట్టూ సమాజంలో సాధారణంగా కనిపించే విషయాలను సునిశితంగా పరిశీలించి ప్రశ్నించే తత్వం ఉంటుంది. ఆడవారిని, మగవారిని వేరుగా చూడటం, పిల్లల్నీ, భార్యల్నీ కష్టపెట్టడం వంటి విషయాలు అసలు ఇష్టం ఉండదు. వీలైనంతవరకూ తన అభిప్రాయాలను సూటిగా చెబుతాడు. అతని ఆర్థికస్థితి అతని ఆత్మవిశ్వాసాన్ని నియత్రించదు. పేదరికమంటే అతనికి భయం లేదు. మధ్యతరగతి మిధ్యా మర్యాదలు తెలీవు. మిగతావారికి నచ్చినా, నచ్చకపోయినా తను నమ్మినదాన్ని ఆచరించటానికి సిద్ధపడతాడు. తద్వారా వచ్చే చిక్కులకు వెరవడు. చాలా కుతూహలం, కొంత అమాయకత్వం, లౌక్యలేమి, నిష్కపటత్వం, పట్టుదల (కొందరు మొండితనమనో, తిక్క అనో అనవచ్చు) కలిపిన వ్యక్తిత్వం కథానాయకుడిది.

ఈ కథల్లో కాలక్షేపం కథలు తక్కువ. దాదాపు ప్రతి కథ ఏదో ఒక విషయం చర్చించటానికే వ్రాసినట్లుంటుంది. చనిపోయినవారి బంధువులకు స్వాంతన తెలుపటానికి సైతం అడ్డం వచ్చే మైల ఆచారం ఎందుకు పాటించాలి? పెళ్ళైన ఆడపిల్లలకు పుట్టింట్లో హక్కులే కాని బాధ్యతలు ఎందుకు ఉండవు? ఇంట్లో దేవుడి పూజలు వంటివి చేయటంలో నాస్తికులే ఎందుకు సరిపెట్టుకోవాలి? తేలుమంత్రాలు, అంజనాలు, శాపాలు వంటి వాటిని ఎందుకు నమ్మటం? ఇవన్నీ ప్రసాద్‌గారికి కథా వస్తువులే.

ప్రసాద్‌గారి రచనాశైలి గురించి చెప్పాలంటే, ఆయన వ్రాసుకొన్న ముందుమాటలోంచి కొన్ని మాటలు ఉదహరిస్తే చాలేమో: ”ముందు మాట రాయనా? ఏం రాయను? నా మొహం! కథలంటే ఏవో మిడికాను. చిన్నప్పుడు మా ఇంట్లోనూ, నేనున్న ఊళ్ళల్లోనూ ఏవో అనుభవాలు దొరికి, అవి అప్పుడప్పుడు గుర్తొచ్చి ఏవో చిట్టిపొట్టి కథలు రాశాను…” కథలు కూడా ఈ తీరులోనే ఉంటాయి. ప్రసాద్ గారి కథల్లో ఏ రకమైన భేషజాలూ, ఆర్భాటాలూ, అనవసర ఆరాటాలూ ఉండవు. రసాలూ, రసానుభూతులూ తక్కువే. శైలి,టెక్నిక్ అన్న తాపత్రయాలు ఉండవు. మనబోటి మనిషి మన పక్కన కూర్చుని తన అనుభవాలను, అభిప్రాయాలను మనతో పంచుకుంటున్నట్లుంటాయి ఆయన కథలు. ఐతే, చాలా కథలు మనల్ని ఒక్క క్షణం నిలబెట్టి ఆలోచించేలా చేస్తాయి. చెప్పుల్లేకుండా కాలేజీలో కెమిస్ట్రీ ల్యాబ్‌లోకి వెళ్ళవలసివచ్చిన కుర్రాడు, అన్నం కోసం పరీక్షలో పక్కవాణ్ణి కాపీ చేసుకోనిచ్చిన పిల్లాడు, ముష్టివాడిముందు ఇంటిగుట్టు విప్పేసిన బాలుడు, ఆ ముష్టివాడు మన మనస్సులో నిలచిపోతారు. ఇంట్లో తల్లి పట్ల తండ్రి, ఇతర ఆడవాళ్ళ పట్ల వారి భర్తలు ప్రవర్తించే తీరు చూసిన చిన్న పిల్లవాడు పెద్దయ్యాక తాను మగవాడిలా అవకుండా ఉండటానికి ఏం చేయాలని అడిగిన ప్రశ్న ఆ తల్లినే కాదు మనల్నీ నివ్వెర పరుస్తుంది. ప్రసాద్‌గారి కథల్ని సింగిల్ పాయింట్ కథలు అని కొట్టిపారేయకుండా ఉండటానికి కారణం ఈ కథల్లో ఉండే సింప్లిసిటీ, నిజాయితీ.

పుస్తకం కూడా సింపుల్‌గానూ, ముచ్చటగానూ ఉంది. ఈ మధ్యలో ఇలా రెండు కాలంలలో ప్రచురించిన కథల పుస్తకం చూడలేదు; కొద్దిగా ఆశ్చర్యం వేసింది. ఎందుకు ఇలా వేశారు అని? ఈ సైజు (1/8 డెమీ) పుస్తకాల్లో ఇలా రెండు కాలంలు వేయటం తక్కువ. పాతరోజుల మాసపత్రికలు గుర్తుకు వచ్చాయి.

ఆ కుటుంబంతో ఒక రోజు (20 కథల సంకలనం)
జె. యు. బి. వి. ప్రసాద్
అక్టోబరు 2010
నవోదయా బుక్ హౌస్
ఆర్యసమాజం ఎదురుగా, కాచిగూడా చౌరస్తా
హైదరాబాదు – 500 027
రచయిత ఫోను: 408-202-4704;
ఈమెయిల్: jubv@yahoo.com
182 పేజీలు; హార్డ్‌బౌండు
40 రూ.
కినిగేలో ఆన్లైన్ చదువుకు/ఈబుక్ కొనుగోలుకూ లభ్యం.

You Might Also Like

6 Comments

  1. chavakiran

    This book is now available for sale as e-book for Rs. 40/- only @ http://kinige.com/kbook.php?id=126

  2. komara puli

    Naaku navalalu chadavadam ante chala istam mee daggara emina manchi navalalu unte naa mail ki pampagalarani korutunna nu.

    naa mail puli.komaram34@gmail.com

  3. p.shiva

    konnalla kritam nenu anukuntu undevaadini, ranganayakamma gari tarwata evaru? ani. tana adugujaadallo nadustoo, tana prabhavamto rachanalu chestunna prasad garu aa sandeham, benga teerchestunnaru.

    prasadgaru, keep it up. thanq.

  4. manjari lakshmi

    నేను ఆ పుస్తకం చదివి మనసులో అనుకొన్నవాటిని మాటలలో పెట్టి నాకు చాలా ఆనందం కలిగించారు. ధన్యవాదాలు.

  5. sarada

    I also felt the same when i read the story “cheppulu”, in some website. From that time i am searching for his stories. Good to know that all stories are now together in a book.. 🙂
    Can you please tell me where i can get this book in Bangalore?
    Thank you..

  6. వేణు

    మీ సమీక్ష సమగ్రంగా ఉందనిపించింది. రెండు కాలాల్లో పుస్తకాలు ప్రచురించటం వల్ల పేజీల సంఖ్య తగ్గుతుంది. దాంతో పుస్తకం రేటు కూడా తక్కువకు ఇచ్చే వీలుంటుంది. రంగనాయకమ్మ గారి పుస్తకాలు ఈ ఉద్దేశంతోనే రెండు కాలాల్లో వస్తున్నాయి.

    ప్రసాద్ గారి పుస్తకం గురించి డిసెంబర్ 19న నా బ్లాగులో
    టపా రాశాను.

Leave a Reply