బాహ్య ప్రపంచపు మసి వదిలి తళతళలాడే ‘ రెండో పాత్ర’
రాసిన వారు: తమ్మినేని యదుకులభూషణ్
************************
విన్నకోట రవిశంకర్ మూడవ పుస్తకం రెండో పాత్రలో ముప్ఫై మూడు కవితలు. పాతికేళ్ళుగా కవితా సేద్యం చేస్తున్నా,ఇతని ఫలసాయం బహు స్వల్పం. అధిక దిగుబడినిచ్చే వంగడాలు ఇతనికి అందుబాటులో లేవు. అంతేగాక,కంపుగొట్టే రసాయన ఎరువులు చల్ల లేదు. ఊపిరాడనివ్వని పురుగు మందుల పిచికారీ లేదు. ఇతనికి సహజ వ్యవసాయ పద్ధతుల మీద గురి ఎక్కువ.( కాబట్టి, పాఠకుడు కాస్త ఊపిరి పీల్చుకోగలడు. పొలం గట్ల మీద తిరిగి వచ్చిన అనుభూతి పొందగలడు. ). కావున ఇతని కవిత్వంలో –
” అందంగా
స్వచ్ఛంగా
అప్రయత్నంగా కురుస్తుంది వాన “ ( వాన -పాట).
అలాగని , అక్కడితో ఆగిపోడు కవి ..
” వాన ఒట్టి భోళా పిల్ల
ఆకాశం నుంచి మోసుకొచ్చిన కబుర్లన్నీ
వస్తూనే గల గలా చెప్పేస్తుంది “ ( అక్క -చెల్లెలు ) అని వాన రూపు గట్టిస్తాడు.
sprinklers కురిపించే జల్లును ‘నేల కురిసే వాన’లా ఆదరిస్తాడు.
” ఇల్లేముంది-
ఒళ్ళంతా కప్పుకొని
ఒక చోట ముడుచుకు కూచుంటుంది.
మూత పెట్టిన వెలుగులతో
తలపోతలో మునిగి ఉంటుంది “ ( గమనం )
అన్నా కూడా , రవిశంకర్ కవితా గమనాన్ని పట్టి ఇచ్చే కవిత ఇది. ముందు నుండీ ఇతని కవిత్వంలో తలపోత ఎక్కువ. ఈ సంకలనంలో కూడా అటువంటి కవితలు (చేయూత,మధ్యస్థం, బాధ,గమనం,లోతు,సవాలు ) తక్కువేమీ కాదు.
” నడినెత్తికి చేరిన బ్రతుకు పొద్దు
నిశితంగా చూస్తుంది
నెరిసిన చెంపలతో సముద్రం
పలకరిస్తుంది ” (మధ్యస్థం)
రవిశంకర్ కవిత్వానికి ఇంటితో , దాన్ని చక్క బెట్టే ఇంతితో ఎక్కువ ప్రమేయం, కాబట్టే ‘రెండో పాత్ర ‘ అంత బలమైన కవిత కాగలిగింది.( ఉటంకించ వలసి వస్తే, ఈ కవితను మొత్తం ఉటంకించ వలసిందే, ముక్కలు చేయలేని సమగ్ర కవిత ఇది. ) ఇంటి చుట్టూ పరిసరాలు కూడా నిరాటంకంగా ఇతని కవిత్వంలోకి జొరబడతాయి.
అనివార్యమైన బంధాలు, మృత్యువు గురించి తనదైన దృష్టితో రాసిన కవితలు ( గొడుగు,బంధుత్వం,తదనంతరం, నిష్క్రమణ) సున్నితమైన కవి అంతరంగాన్ని ప్రదర్శిస్తాయి. అలాగే, పక్షులు , ఆలోచనల మధ్య అభేదాన్ని దర్శించిన కవిత కూడా అందరూ రాయగలిగేది కాదు. ఆ లెక్కన , కవిత్వం మీద రాసిన కవితలన్నీ (అవకాశం,ఒకోసారి, అసంపూర్ణ పద్యం ) ఆ ప్రక్రియలో చేయి తిరిగిన కవి దారి తప్పకుండా ఎంత దూరం పోగలడో నిరూపిస్తాయి. ఇటువంటి కవితలే కవి
సత్తాను పట్టి ఇచ్చేవి. ఏ భాషలోకి అనువదితమైనా ఇటువంటి కవితలు అభిరుచిగల పాఠకులను ఆకట్టుకోగలవు.
” పొడిపొడి మాటలు చాలవు
పరిచిత దృశ్యాలు పనికి రావు
తెలియని అడవి దారుల వెంట
తెలవారే దాకా సాగే అన్వేషణకి
మళ్ళీ తెరతీయాలని ఉండదు.” (ఒకోసారి)
” రూపొందుతున్నంత సేపు
మట్టిలా మెత్తగా ఉండే పద్యం
అలక్ష్యంతో ఆలస్యం చేస్తే
రాయిగా మారిపోతుంది ” (అవకాశం)
” అలజడి ఉన్నప్పుడే పద్యం పూర్తి కావాలి
ప్రతిరూపం తిరిగి ఏర్పడిందంటే
ఇక, పద్యం పూర్తి కాదన్నట్టే “ (అసంపూర్ణ పద్యం)
పారదర్శకమైన ఊహా శక్తిని ప్రకటించే కవితా కెరటం :
వచ్చి పోయే అల
దిగులుతో ఉన్న తీరాన్ని
జాలిగా ముద్దాడింది.
అప్పుడా ఇసుక కొన్ని క్షణాల పాటు
ఆకాశాన్ని ప్రతిబింబించింది.
‘బాహ్య ప్రపంచపు మసి వదిలి తళ తళలాడే’ అంతరంగాన్ని, అది ప్రతిఫలించే ఆనుభవిక ప్రపంచాన్ని అలతి అలతి పదాల్లోకి ప్రవేశ పెట్టడం రవిశంకర్ కవితా మార్గం. తనకు అనుభవంలోకి రానిది కవిత్వంలో కనిపించదు.అందువల్లే, పాతికేళ్ళ కవితా సాధనలో రవిశంకర్ రచించిన కవితలు కేవలం శతమానం అంటే కవిగా అతని నిజాయితీని అట్టే అంచనా వేయవచ్చు.
చివరిగా , ఇంకో మాట చెప్పుకోవాలి. ఇమేజీలు వేయడంలో నిపుణత చూపించే ప్రతి కవిని ఇస్మాయిల్ అనుయాయి అనుకోవడం విపర్యయ చిత్తవృత్తిని సూచిస్తుంది. ఇస్మాయిల్ కవితా రచన మొదలు పెట్టక ముందే , ఇంకా గట్టిగా చెప్పాలంటే ఆయన పుట్టక ముందు నుండే imagism మొదలయింది. imagism రాక ముందు కవిత్వంలో పదచిత్రాలు లేవనుకోవడం అవిద్య.కవిత్వంలో ఈ ధోరణి వేల సంవత్సరాలుగా ఉంది. కాబట్టి, రవిశంకర్ మీద ఇస్మాయిల్ ప్రభావం ఉంది అనడం సులభం, కానీ, అది పరిశీలనకు నిలబడదు. “కుండీలో మర్రి చెట్టు” రోజుల నుండి రవిశంకర్ తనదైన మార్గంలోనే ఉన్నాడు. ఈ సంకలనంలో అనుభవ విస్తీర్ణం తగ్గినట్టు అనిపించడానికి కారణం అనుభవ తీవ్రత పెరగడమే, అలాగే, కొన్ని కవితలు పలుచ బడినట్టు అనిపించడానికి కారణం అభివ్యక్తిలో ప్రసాద గుణం పెరిగి లయ లుప్తం కావడమే. ఈ సంకలనం లోని ఇంకొక విశేషం చివర చేర్చిన మూడు అద్భుతమైన అనువాద కవితలూ ( గ్రీకు కవి ఒడిస్సస్ ఎలిటస్ వి రెండు , ఒక చెక్ కవిత ), “ఈ పద్యాలూ ఎలా చదవాలా” అన్న వెల్చేరు నారాయణ రావు ఆప్త వాక్యం.
[రెండో పాత్ర పుస్తకం గురించి పుస్తకం.నెట్ లో హెచ్చార్కె గారు రాసిన వ్యాసం ఇక్కడ, మూలా సుబ్రహ్మణ్యం గారి వ్యాసం ఇక్కడా చదవవచ్చు. అలాగే, కె.వి.ఎస్.రామారావు గారు ఈమాటలో రాసిన వ్యాసం ఇక్కడ చదవొచ్చు.]
విన్నకోట రవిశంకర్ గారి మరో సంకలనం – ‘వేసవి వాన’ పై వచ్చిన సమీక్షలు : ఈమాట లో ముకుంద రామారావుగారి వ్యాసం ఇక్కడ, పుస్తకం.నెట్ లో ప్రచురించిన మూలా సుబ్రమణ్యం గారి వ్యాసం ఇక్కడ చదవొచ్చు. అలాగే, రవిశంకర్ గారి కవిత్వం పై ఈమాటలో వేలూరి వెంకటేశ్వరరావు గారి వ్యాసం ఇక్కడ చదవొచ్చు.
విన్నకోట రవిశంకర్ గారి కవితలు,వ్యాసాలు కొన్ని ఈమాట సంచికల్లో ఇక్కడ చదవొచ్చు.
పుస్తకం » Blog Archive » పద్యాలతో విశ్వసత్యాలను ఆవిష్కరించే తాత్విక కవి విన్నకోట రవిశంకర్
[…] తమ్మినేని యదుకులభూషణ్ గారి వ్యాసంఇక్కడా, మూలా సుబ్రహ్మణ్యం గారి వ్యాసం […]
మెహెర్
సాహిత్యానికి వచ్చిందే సందర్భం. దొరికిందే చోటు. “పుస్తకం.నెట్” వున్నది అందుకేగా. “బైస్టాండర్స్ బెనిఫిట్” కోసం కూడా అన్నాను. అందుకే అభిప్రాయ ప్రకటనలో విస్తారం.
>> “1979 లోని వ్యాసం కాఫ్కా కథలకు బోర్హేస్ రాసిన కాదు…”
ఊ… తెలుసు. కానీ ముద్రింపబడిన ప్రతీదీ రాయబడిందే నా మెదడుకో భ్రమ వుంది, అంతే.
సంగ్రహానువాదం వున్న మీ పుస్తకం నా దగ్గర లేదు. TLSలో మీరు చెప్పిన వ్యాసం ఇవాళే చదివాను. విలువైంది! తెలిపినందుకు కృతజ్ఞతలు.
తమ్మినేని యదుకుల భూషణ్
సమీక్షను కళాఖండంగా మార్చగలడు బోర్హేస్ అంటాడు బ్రాడ్ స్కీ . చిక్కల్లా ఇక్కడే వస్తుంది. అసలు ఏమాత్రం భావావేశం లేకుండా , అతని సమీక్షను శాంత చిత్తంతో సమీపిస్తే తప్ప అతను సూచించిన అర్థం మనకు స్ఫురించదు.నైపాల్ లాగు కుండ బద్దలు కొట్టడు బోర్హేస్. నేను ముందు నుంచి నేను సూచన అన్న పదాన్నే వాడుతున్నది ఇందుకే. నా పుస్తకంలో పుట 128 అని చెప్పినది అందుకే. అక్కడ విట్మన్ గురించి అతని అభిప్రాయం తెలుసుకోవడం చాలా అవసరం. ఒక వాక్యాన్ని పట్టుకొని నేను ఆ అభిప్రాయానికి రాలేదు. ఎన్నో చోట్ల చదివాకే ఈ అభిప్రాయాన్ని స్థిర పరచుకున్నాను. కేవలం అభిప్రాయ పరిధికి లోబడి మీకు ఒక సూచన చేశానంతే. ఇటువంటి భావ పరిణామాన్ని ఇస్మాయిల్ గారిలో కూడా గమనించాను. ఈ విషయం ఆయనతో నేను చర్చించాను కూడా.’దుఃఖాన్ని దిగులును కుర్రతనపు వికారాలుగా కొట్టి వేయడం’ అన్న బోర్హేస్ అభిప్రాయం ఇస్మాయిల్ కు నివాళి గా నేను రాసిన చివరి వ్యాసంలో ఉటంకించింది అందుకే. నేను పేర్కొన్న అభిప్రాయం (“సూటిగా చెప్పిన దానికన్నా సూచన ప్రాయంగా వెల్లడించినది..” ) మిమ్మల్ని చిన్న బుచ్చాలని కాదు చేసింది , బోర్హేస్ ను చదవడానికి అర్థం చేసుకోవడానికి అది ఎంతో అవసరం . అది నా పుస్తకంలోనిదే , ఇవాళ అనువదించి నేను రాయలేదిక్కడ. అలాగే , అది సంగ్రహితం అని స్పష్టంగా చెప్పాను కదా. ఆయన వంద పుటల్లో చెప్పింది నేను నాలుగు పేజీల్లో ఊదాలంటే , నా అభిరుచి మేరకు నేను బోర్హేస్ లో గమనించిన విలువైన విషయాలను సంక్షిప్తంగా రాయక తప్పదు. గద్యానువాదంలో నుడికారం పోకుండా పట్టుకు రావడానికి ప్రతి రచయిత కొన్ని పద్ధతులు అలవరచుకుంటాడు. అందులో భాగమే , మీరు మూలంలో లేనిది నేను రాశాను అనుకొంటున్నది. నా అనువాదాల్లో లోపాలగురించి రాయదలిస్తే నాకు అభ్యంతరం లేదు. అది అభిప్రాయ పరిధిని మించినది కనుక విడిగా మీరు ఒక వ్యాసమే రాయవచ్చు.అంతే కాకుండా ,నేను ఎందుకు ఆ అభిప్రాయానికి వచ్చాను అన్నది నాలుగు మాటల్లో చెప్పలేను. దానికి ప్రత్యేకించి ఒక వ్యాసమే అవసరం అవుతుంది. ఈ అభిప్రాయ వేదిక రవిశంకర్ కవిత్వం కోసం ఉద్దేశించినది , చర్చ అసందర్భం కాబట్టి , కానీ పాఠకులను దృష్టిలో పెట్టుకొని, ఆ అభిప్రాయం వెల్లడించినది నేనే కాబట్టి దాని బాధ్యత నాదే, కాబట్టి , వీలైన తక్కువ మాటల్లో విషయం విశదం చేసి తప్పుకొనే ప్రయత్నం చేశాను. అంతేకాక, మీకు చదివే అలవాటు ఉంది కాబట్టి , THIS CRAFT OF VERSE కు నేను చేసిన సంగ్రహానువాదం చదవమని చెప్పాను. దాని వల్ల నేను బోర్హేస్ ను ఎలా అర్థం చేసుకొన్నానో మీకు తెలిసి వస్తుంది. మీ అభిప్రాయాలను బట్టి , మీరు నేను చదవమన్నది చదివినట్టు లేరు, కాబట్టే, నేను ఏదో కాఫ్కా మీద స్థిరాభిప్రాయం ఏర్పరచుకొని ,దాన్నే బోర్హేస్ రచనల్లో చూస్తున్నాను అనుకొంటున్నారు. అలాంటిదేమీ లేదు. ఒక గొప్ప రచయిత రచనల గూర్చి మరొక గొప్ప రచయిత కాలం గడిచే కొద్దీ ఎలా ఆలోచిస్తాడు ..ఆ భావ పరిణామం నాకు ఆసక్తి గొలిపే విషయం. ఉదాహరణకు టాగోర్ కవిత్వాన్ని కీర్తించిన యేట్స్ తర్వాత కాలంలో ఎందుకు అతనికి విమర్శకుడిగా మారాడు ( అమర్త్య సేన్ వ్యాసం చదవండి ఆసక్తి గల వారు ) ..ఇలాంటి భావ పరిణామం రచయితలో , పాఠకునిలో నేను గమనించేది. కొ.కు తన రచనలను పాఠకులు చదివి పక్కన పడవేయాలి అనుకోవడం వెనుక ఉన్న ఆలోచన అదే. భావ పరిణామాన్ని అందరు రచయితలు ఒకేలా వెల్లడించరు.కాబట్టి ఇన్ని కష్టాలు.
చెప్పడం మరిచాను , 1979 లోని వ్యాసం కాఫ్కా కథలకు బోర్హేస్ రాసిన కాదు కాదు dictate చేసిన ముందు మాట. అతను అనేక సంభాషణల్లో వెల్లడించిన విషయాల వెలుగులో చదివితే ఇందులో కూడా నేను చెబుతున్న భావ పరిణామం కనిపిస్తుంది. అయితే , అది ఉపన్యాసాల నాటికి స్థిరపరచుకొన్న అభిప్రాయాలకు కొనసాగింపే అని నా అభిప్రాయం.
ఇక TLS లోని వ్యాసం చదవమనడానికి కారణం రాసినవాడు (Martin Schifino) బోర్హేస్ రచనలు (మూలంలో) ప్రతి ఒక్కటి చదివిన వాడు. పై పెచ్చు ఇద్దరిదీ ఒకే వూరు .ఆయన రాసిన ఒక వాక్యంతో అభిప్రాయం ముగిస్తాను:(A Complete Works exists in Spanish.Even this is incomplete). కాబట్టి , పరభాషా రచయితలు మంచు వెనుక ఉన్న కొండల లాంటి వాళ్ళు , స్వరూపం అవగతం చేసుకోవడం అంత సులువు కాదు.
మీ అభిప్రాయాలు అతి దీర్ఘాలైనందున మీరు వ్యాస ప్రక్రియను ఎంచుకోవడం మేలు అని నా అభిప్రాయం. అభిప్రాయాలు వీలయినంత క్లుప్తంగా ఉండాలి. అయితే వ్యాస పరిమితి వేరు.,మీరు స్వేచ్చగా పలు చర్చలు /వాదాలు చేయవచ్చు. . ఇక, నా అభిప్రాయం కూడా పరిధులు దాటుతోంది.ఈ అసందర్భ చర్చను ఓపికతో అనుమతించిన పుస్తకానికి , ఎవరైనా పాఠకులు చదువుతూ ఉంటే వారికి నా కృతజ్ఞతలు.
మెహెర్
@ తమ్మినేని యదుకుల భూషణ్
మళ్ళీ అసలు వాక్యాల్ని మీకు సానుకూలంగా అనువదించి అసందర్భమైన చోటకు తీసుకొస్తున్నారనిపిస్తోంది (ఉదాహరణకు, ఇక్కడి “శుష్క వాదాల కన్నా” అనే మాట మీ సొంతమే తప్ప, దాని మూలమైన పదం అక్కడ విట్మన్ మాటల్లో ఏదీ లేదు). అసందర్భమైన ఉటంకింపులు, అనువాద వక్రీకరణలూ మూల రచనల గౌరవాన్ని తక్కువ చేయటమే. అక్కడ బోర్హెస్ మాట్లాడుతున్నది కవిత్వం గురించి. కవి “రాబర్ట్ ఫ్రాస్ట్” పంక్తుల్ని ఉదాహరణగా తీసుకుని కవిత్వంలో ఏదైనా సూటిగా నిర్థారించి చెప్పడం కంటే, సూచనప్రాయంగా చెప్పి వదిలేయడం ఎక్కువమంది అంగీకారాన్ని పొందుతుందంటున్నాడు. తర్కానికీ, వాదానికీ వచ్చేసరికి మాత్రం సూటిదనమే కదా ప్రాణం. అయినా నిజానికి మన మధ్యనున్నది వాదం కూడా కాదు. బోర్హెస్ కాఫ్కా రచనల్ని కొట్టిపారేసాడన్నారు. ఎక్కడో చెప్పమన్నాను. మీరు అనుకున్నది చూపించారు. అర్థం చేసుకోవడంలో తడబాటు మీకు అలా అనిపింపజేసివుంటుందని తెలిపే ప్రయత్నం చేసాను. బోర్హెస్ సమకాలీన ప్రపంచతత్త్వానికి దిగులుపడుతున్నాడే తప్ప, కాఫ్కాని ఎక్కడా విమర్శించలేదని చూపించాను. ఇక మీ పై అనువాదానికి అసలు ప్రతి ఇది:
పైన బోల్డు చేసిన వాక్యాలు మీరు అనువదించినవి. కానీ అక్కడ విషయమంతా వాటి చుట్టూతావున్న వాక్యాల్లోనే వుంది కదా. విషయాన్ని వదిలేసి అక్కడి రెటోరిక్‌ని మాత్రం నరుక్కు తెచ్చి ఉదహరించడం మొదలుపెడితే ఏ వాక్యాల్తోనయినా ఏదైనా చెప్పించవచ్చు. ఒకవేళ సూటి వాక్యంలో మీరు అన్నారు గనుక నేను స్వీకరించలేదు అన్నది మీ భావమైతే, లేనిదాన్ని సూటిగా చెపినంత మాత్రాన వున్నదయిపోదు కదా!
చాలాసార్లు మనలో ముందే పేరుకుపోయివున్న స్థిరాభిప్రాయాలు మనం చదివేవాటి సారాన్ని కూడా వక్రీభవింపజేస్తాయి. బహుశా కాఫ్కా పట్ల అలాంటి పేరుకుపోయిన భావనే ఏదో బోర్హెస్ మాటల్లో మీకు “కాఫ్కా రచనల్ని కొట్టిపారే”యడమన్నదాన్ని చూపించివుంటుంది.
నిజానికి ఇదంతా పెద్ద విషయం కాదేమో. మీరు వేరే మాట చెప్తూ ఒక ఉదాహరణగా ఈ మాటన్నారంతే. బోర్హెస్ అలా ఎక్కడన్నాడో తెలుసుకోవాలన్న కుతూహలం నన్ను కొంత ప్రేరేపించింది. అంతకన్నా ముఖ్యకారణం మరొకటి. కాఫ్కా గురించి తెలియని వాళ్లకూ, మీ మాటల్ని ముందువెనకలు తరచక ముఖతః తీసుకునేవాళ్లకూ, లేదా బోర్హెస్‌ని అథారిటీగా స్వీకరించేవాళ్లకూ కాఫ్కా కానివాడైపోతాడు కదా. అయినా, వానిటీల్ని పక్కన పెట్టగలిగితే, సాహిత్యంలో ఏదీ చిన్న విషయం కాదు కదా.
తమ్మినేని యదుకుల భూషణ్
” సూటిగా చెప్పిన దానికన్నా సూచన ప్రాయంగా వెల్లడించినది బాగా తలకెక్కుతుంది.
సూటి వాక్యాలను స్వీకరించదు మనసు. ఎమర్సన్ ఏమన్నాడు ? ‘ వాదాలతో ఎవరినీ
ఒప్పించలేవు’. వాదాన్ని తిరగా బోర్లా వేసి, పరిశీలించి తిరిగి వాటికి విరుద్ధంగా వెళతాము.
అలా కాకుండా , మామూలు మాటలు, సూచనగా చెప్పినవి మరింత సులువుగా మనసుకు పడతాయి విట్మన్ ఎన్నడో అన్నాడు.. శుష్క వాదాల కన్నా – రాత్రి వీచే గాలి,
పెద్దగా ప్రకాశించే తారలు మన చిత్తాన్ని తేలికగా ఆకట్టు కొంటాయి.”
This Craft of Verse – Jorge Luis Borges (1899-1986) అన్న ఉపన్యాస సంకలనం నుండి ‘కవిత్వమంటే ‘ అన్న శీర్షికన సంగ్రహితం .
మెహెర్
వివరణకు కృతజ్ఞతలు!
మీ పై వాక్యాన్ని బట్టి చూస్తే ఈ ఉపన్యాసాల కాలంనాటికి (1967-68) బోర్హెస్ వ్యక్తిత్వంలో క్రమేణా వచ్చిన మార్పు వల్ల కాఫ్కా రచనల్లోని దిగులునీ, ఫలితంగా కాఫ్కా రచనల్నీ, కుర్రతనపు వికారాలుగా కొట్టివేసి ముందుకు సాగిపోయాడని చెప్పబోయినట్టు తోస్తోంది. నా ముందు కామెంట్‌లో నేను ఉదహరించిన — కాఫ్కాను మెచ్చుకుంటూ బోర్హెస్ అన్న — మాటలు అటుతర్వాతి కాలానివే (1979). అయితే అది కాదు నా ప్రస్తుత వాదన. మీ వివరణ మొత్తంలో నా కామెంట్‌లోని ప్రశ్నకు సంబంధించిన భాగం ఇది:
మీరు చెప్తున్న The Telling of the Tale అనే ఉపన్యాసం నేను చదివాను. పై కొన్ని వాక్యాల్నీ ఉదహరించి అందులో కాఫ్కాని బోర్హెస్ కొట్టిపారేసాడని చెపుతున్నారు. ఉపన్యాసపు మొత్తం ఉద్దేశాన్ని దృష్టిలోకి తీసుకుంటే, ఆకళింపు చేసుకోవడంలో బోల్తా పడితే తప్ప, మనకు యిందులో కాఫ్కాని కొట్టిపారేయడమన్నది ఎక్కడా కనిపించదు. బోర్హెస్ ఉపన్యాసపు విస్తృత లక్ష్యమేమంటే, మానవాళి చరిత్ర గతిలో కథ చెప్పడమనే కళ మహాకావ్యాల (epics) ఉద్భవం నుంచీ మొదలుకొని ఎన్నెన్ని మలుపులు తిరుగుతూ ఏయే మజిలీలు చేరుకుందో సమీక్షించడమూ, నవలా ప్రక్రియకి కాలం చెల్లిందన్న సంగతి గుర్తుచేయడమూ, ఈ సందర్భంగా మరలా మహాకావ్యాల పునరుద్భవాన్ని ఆశగా ఆకాంక్షించడమూను. క్లుప్తంగా ఈ మొత్తం ఉపన్యాసాన్ని మహాకావ్యాల మీద బోర్హెస్ నొస్టాల్జియాగా చెప్పుకోవచ్చు:
ఒడిస్సీ, ఇలియడ్ లాంటి ప్రాచీన మహాకావ్యాల్లో కవిత్వ రూపంలో కథ చెప్పడమనే లక్షణాన్ని ఆయన మళ్ళీ రావాలని కోరుకుంటున్నాడు:
ఇలా ఆయన ఉపన్యాస లక్ష్యం విశదమయ్యింది కాబట్టి, ఇపుడు మీరు కాఫ్కాని “కొట్టిపారేశాడంటు”న్న భాగానికొద్దాం. నిజానికి బోర్హెస్ కొట్టి పారేస్తుంది కాఫ్కాని కాదు. అసలు ఆయనక్కడ దేన్నీ కొట్టిపారేయటం లేదు కూడా. మహాకావ్యాలు పుట్టినప్పటి కాలంలో ప్రజలకు జీవితానందం పట్లా అంతిమ సాఫల్యం పట్లా నమ్మకం వుందనీ, అది ప్రస్తుత కాలంలో ప్రజలకు లేదనీ చెప్తున్నాడు. ఆ వాతావరణం లేకపోవడం వల్ల ఇక మహాకావ్యాలు రాకపోవచ్చని తీర్మానిస్తున్నాడు. దేవుడు చనిపోయాకా (నీషే తర్వాత), విలువల గోపురాలు విరిగి, ఆదర్శాల హారతులు ఆరిపోతున్నపుడు, నిర్భయంగా నిలవటానికి ఏ నెలవూ లేని వాతావరణంలోకి మనిషి నెట్టివేయబడినపుడు, సహజ పరిణామంగా ఎలాంటి రచనలు పుడతాయో చెప్తూ కాఫ్కా రచన “ద కాసల్”ని ఉదహరించాడు. అంతేకాదు, ప్రక్కనే తాను ఆరాధించే మరో రచయిత హెన్రీ జేమ్స్ రచన “ది ఆస్పెర్న్ పేపర్స్”నీ ప్రస్తావించడం మీరు గమనించాలి. ఈ విషయం ఆంగ్ల ప్రతిలో విశదంగానే వున్నా, అనువదించాలనిపించి చేసాను:
“కాఫ్కా రచనల్లో ఆనందమే లేదు. … అందుకే కాఫ్కా తన పుస్తకాలను నాశనం చేయమని చెప్పాడు” అన్న మీ అనువాదం అసలు విషయాన్ని మరుగుపరుస్తుంది. రచన విలువ నిర్దేశించేది అందులో ఆనందమూ, ఆశావాదమూ అని బోర్హెస్ ఎపుడైనా అనుకున్నాడని నేననుకోను. చెస్టర్‌టన్ను మినహాయిస్తే, బోర్హెస్ మెచ్చే ఎడ్గార్ అలెన్ పో, రాబర్ట్ లూయీ స్టీవెన్‌సన్, థామస్ డిక్వెన్సీ మొదలైన రచయితల రచనల్లో ఆనందమూ లేదు, ఆశావాదమూ లేదు. అవి ఆయన ప్రమాణాలు కావు. మహాకావ్యాలు పుట్టని ప్రస్తుత పరిస్థితులకు దిగులుపడుతూ, అలాంటి పరిస్థితుల పర్యవసానమైన రచనల్ని కొన్నింటిని ఉదహరించదలచి, హెన్రీ జేమ్స్ రచన ఒకటీ కాఫ్కా రచన ఒకటీ పేర్కొన్నాడంతే. ఇక్కడ కాఫ్కా రచనల్ని తీసిపారేయడమన్న ప్రశ్నే రాదు.
చెస్టర్‌టన్‌తో పోల్చాల్సి వస్తే బోర్హెస్ ఎవరికైనా తక్కువ మార్కులే వేస్తాడు. ఆ అభిమానం అలాంటిది. నిజానికి చెస్టర్‌టన్‌కి కాఫ్కా కూడా అభిమానే. అది కూడా ఆయన రచనల పట్ల కన్నా, వాటిల్లోని ఆశావాదం పట్లనే ఎక్కువనిపిస్తుంది. చెస్టర్‌టన్ గురించి కాఫ్కా మాటలు:
అలాగే ఆనందమనేది దేవునిపై విశ్వాసానికి పర్యవసానమా అన్న ప్రశ్నకి కాఫ్కా సమాధానం:
ఇక బోర్హెస్ టాగోర్ గురించి ఏమనుకున్నాడూ, అసలు ఏమైనా అనుకున్నాడా, అన్న విషయంలో నాకు ఏ పేచీ లేదు. బోర్హెస్ ఎక్కడా కాఫ్కా రచనల్ని కొట్టిపారేయలేదన్నదే నేను చెప్పదల్చుకున్నది.
TLS సంచిక వివరాలకు థాంక్స్!
తమ్మినేని యదుకుల భూషణ్
మొట్ట మొదట మీరు గుర్తుంచుకోవలసినది Borges సమగ్ర సంకలనం ( ఏ ప్రక్రియలోనైనా , మరీ ముఖ్యంగా వ్యాసాలు ) ఇంత వరకు రాలేదు. మీరు ఉటంకించిన దాన్ని బట్టి మీ దగ్గర ఉన్నది Selected Non-Fictions( 1999, Eliot Weinberger) అని తెలుస్తూనే వుంది. ఆయన శత జయంతి (1999) సందర్భంగా వచ్చిన పుస్తకాల్లో అది ఒకటి. ( అది అసమగ్రమని ఆ పుస్తకం ముందుమాటలో స్పష్టంగా పేర్కొన్నారు కదా )కాఫ్కా మీది ఆ వ్యాసం కూడా అందులోదే. వ్యాసం రాసే నాటికి (1951 )ఆయనకు కంటిచూపు పూర్తిగా పోలేదు. 1956 లో ఆయనకు అంధత్వం సంప్రాప్తించింది. (తర్వాత ఆయన ఎక్కువ కవిత్వం రాశారు. వ్యాసాలు ముట్టుకోలేదు.) అప్పటికే ఆయన కీర్తి దిగంతాలకు వ్యాపించింది. ఆయన మరణించేదాకా (1986 ) , అంటే దాదాపు మూడు దశాబ్దాలు ఆయన ఉపన్యాసాల కోసం జనాలు ఎగబడే వారు. Norton Lectures (1967-68) లో భాగంగా The Telling of the Tale అన్న ఉపన్యాసంలో కాఫ్కా మీద ఆయన వెలిబుచ్చిన అభిప్రాయం ఇది. ఆ సందర్భంలో ఆయన చెప్పిన వాక్యం ” we do not really believe in happiness and this is one one of the poverties of our time” చాలా ప్రసిద్ధి గాంచింది. ‘కాఫ్కా రచనల్లో ఆనందమే లేదు. ఒక వేళ జీవితానందాన్ని కీర్తించే రచన చేసినా ఇతరులు అతను సత్యానికి కట్టుబడి ఉన్నాడు అనుకునే వారు కాదు. అందుకే కాఫ్కా తన పుస్తకాలను నాశనం చేయమని చెప్పాడు. (బెర్నార్డ్ షా , చెస్టర్ సన్ ల కన్నా కాఫ్కా తక్కువ స్థాయి రచయిత అన్నది Borges అభిప్రాయం ) ‘ ఈ సందర్భాన్ని సూచించేది నా ‘కొట్టి పారవేయడం’. “దుఃఖాన్ని దిగులును కుర్రతనపు వికారాలుగా కొట్టి వేయడం” Borges వ్యక్తిత్వంలో వచ్చిన మార్పు.(ఈ సందర్భం ఇంకా బాగా అర్థం కావాలి అంటే ఈ ఉపన్యాసాలు మీరు చదివి ఉండాలి. దీని సంగ్రహానువాదానికి నా విమర్శ పుస్తకం తిరగేయండి ,పు.128 ) ‘టాగోర్ మీద కూడా ఆయన రాసింది విమర్శ కాదు.మీరు జాగ్రత్తగా ఆ వ్యాసం చదివితే. కాబట్టి, కొసన మీరు రాసిన వాక్యం నేను చెప్పదలచుకున్న సందర్భానికి పొసగదు. .ఇక పోతే , ఇటీవల Borges సాహిత్యం మీద వచ్చిన మంచి సమీక్ష కోసం TLS జనవరి 21 సంచిక చదవండి.
మెహెర్
@ తమ్మినేని యదుకుల భూషణ్
“ఈ సందర్భంగా అర్జెంటీనా కవి Borges గురించి తెలుసుకోవడం మనకు లాభిస్తుంది. Borges కవి, కథకుడు వెరసి గొప్ప సమీక్షకుడు ; ఆయన కాఫ్కా రచనలను కొట్టి పారేస్తాడు. అలాగే టాగోర్ కవిత్వంలో రూప పరమైన ఇబ్బందులను ఏకరువు పెడతాడు.”
Just a curious aside, quite out-of-place too (for the benefit of uninformed bystanders 🙂 ):
Where did Borges ever dismiss Kafka’s writings outright?—as this statement in your 4th comment to “oori chivara” book review implies. I have the complete non-fiction works of Borges with me, and I read online whatever I could find by him. On the contrary, like many of Kafka’s readers, Borges was quite enticed by Kafka’s queer genius. He even wrote an essay titled “Kafka and His Precursors”. And whenever he mentioned the German author, he has only nice things to say. For example, some excerpts from one of his book reviews:
May be what you have read is just an instance.
On the other hand, yes, his denouncement of Tagore is complete to the hilt. Again, from one of his reviews:
Actually your statement should have been the other way around: Borges dismissed Tagore’s writings; and, if at all, he must have found absurd the mythical reverence allotted to Kafka by the existentialist academia. (I sense it in his attitude towards Kafka.)
తమ్మినేని యదుకుల భూషణ్
రవిశంకర్ అన్నారు..
ధన్యవాదాలు. హైదరాబాదులో ఈ పుస్తకం నవోదయా బుక్ హౌస్ లో దొరుకుతుంది. రెండో పాత్ర, వేసవి వాన కాపీలు ఈ క్రింది అడ్రసుకి సంప్రదించి కూడా పొందవచ్చు :
V.Phaneendra
G2 Indra Heritage Apartments
Ashok Nagar Extn
Hyderabad-500020
Phone 040)27671494
sravana
namskaralu..
chala bagundi ee pustakam..me vyasam ee pustakanni nenu tappakunda konela chestundi..meku velyte ee pustakam ekkedeka labhyamavtundo telupagalaru..
dhanyavaadaalu..