నండూరి రామమోహన రావు గారి “విశ్వదర్శనం”

రాసిన వారు: విష్ణుభొట్ల లక్ష్మన్న
*****************
ఈ మధ్య జాలంలో మతస్వరూపాలపై ఒక వ్యాసం ప్రచురించబడింది. అందుకు స్పందనగా కొందరు పాఠకుల అభిప్రాయాలు చదివాను. మతంపై మనకున్న విశ్వాశాలకి, నమ్మకాలకి కారణం ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఉండగా ఇప్పుడు పరిచయం చెయ్యబోయే పుస్తకం మళ్ళీ చదవటంతో ఈ పుస్తకం విలువ (నా దృష్టిలో) ఇంకా ఎక్కువైందని అనిపించింది. అందుకే మళ్ళీ ఇలా మీ ముందుకి…..

కొన్ని సంవత్సరాల క్రితం వృత్తి రీత్యా మూడేళ్ళు ఫ్రాన్సులో గడిపినప్పుడు ఫ్రెంచ్ వారి మనస్తత్వాన్ని అర్ధం చేసుకోటం కష్టం అనిపించింది నాకు (నిజానికి ఒక వ్యక్తిని మరొకరు అర్ధం చేసుకోటం కష్టమని నా అభిప్రాయం). ఆ విషయాన్ని ముచ్చటిస్తూ ఉండగా నాకు ఫ్రెంచ్ నేర్పిన ఉపాధ్యాయిని “లక్కీ, ఫ్రెంచ్ వారిని అర్ధం చేసుకోవాలని ఉంటే ముందు నువ్వు ఫ్రెంచ్ చరిత్ర తెలుసుకోవాలి. ముఖ్యంగా 18వ శతాబ్ది తొలిసంవత్సరాల్లో జరిగిన ఫ్రెంచ్ రివల్యూషన్ గురించిన వివరాలు విపులంగా తెలిస్తే తప్ప ఫ్రెంచ్ వారిని అర్ధం చేసుకోటం సులభం కాదు!” అన్న సలహా ఇచ్చింది. ఆవిడ మాటలకు అర్ధం నాకు అనుభవంలోకి రావటానికి చాలా రోజులు పట్టింది. ఇప్పుడు పరిచయం చెయ్యబోయే పుస్తకం ఇటువంటి ఆలోచనా ధోరణిలో సాగే ఒక గొప్ప పుస్తకం. అంటే పశ్చిమ దేశాల సంస్కృతులను అర్ధం చేసుకోవాలంటే వారి తత్వచింతన ముఖ్యంగా అర్ధం చేసుకోవాలన్న మాట! ప్రస్తుతం అమెరికా (టెక్సాస్) నుంచి జర్మనీలో వృత్తి పని మీద వచ్చిన నాకు ఇంకా తేలికగా ఈ పుస్తకంలో విసృతంగా చర్చించిన విషయాలు అర్ధమవుతున్నాయి.

తత్వశాస్ర్తం ఎంతో జటిలమైనది. అది ప్రాచ్య, పాశ్చాత్య తత్వచింతనలో ఏదైనా కావచ్చు. ఇంగ్లీషులో ఎన్నో పుస్తకాలు పాశ్చాత్య తత్వవిచారం పై ఉన్నాయి. అన్ని కాకపోయినా భారతీయ తత్వచింతన మీద తెలుగులో పుస్తకాలకి కొరత లేదు. ఈ రెండు విభిన్నమైన తత్వచింతనలని కలగలుపుకొని తెలుగులో ఉన్న పుస్తకం ఇదొక్కటేనేమో! ఇక్కడ ఒక సంగతి గుర్తుంచుకోవాలి. ఈ పుస్తకంలో పరిచయం చేయబడ్డ విషయాలు భారతీయ తత్వచింతన దృష్టితో పశ్చిమ దేశాల తత్వచింతనను సమగ్రంగా అర్ధం చేసుకోటానికి సంబంధించింది. అందుకే ఈ పుస్తకంలో ముచ్చటించిన విషయాలు మరే తెలుగు పుస్తకాల్లోనూ కనపడక ఈ పుస్తకంలో మాత్రమే కనపడే విశేషం!

ఇంత జటిలమైన వస్తువును పుస్తకానికి ఎన్నుకొని రాయబూనటం సాహసమే! అందులో క్లిష్టమైన భావాలని సరళమైన భాషలో సూటిగా చెప్పగలగటం ఒక కళ. అంతే కాకుండా ఈ విషయంలో ఒక ఉన్నత స్థాయిని చూపించారు ఈ రచయిత. ఇదేదో డిటెక్టివ్ నవలకి మల్లే చదువుదామనుకుంటే కుదరదు. అంటే ఒక్క బిగిన కూర్చొని ఈ పుస్తకం చదివి, అర్ధం చేసుకోటం సాధ్యం కాదు. నెమ్మదిగా చదివి అర్ధం చేసుకోవాలి ఈ పుస్తకాన్ని. బుర్రకు బాగా పదును పెట్టే విషయాలు ఎన్నో ఉన్నాయి ఈ పుస్తకంలో. ఒక పక్క క్రీస్తు పూర్వం 1500 సంవత్సర ప్రాంతాల్లో మొదలైన గ్రీకుల తత్వశాస్త్రం మొదలుకొని మరొక పక్క మొన్న మొన్నటి జీన్‌పాల్ సార్త వరకు అన్నీ ఉన్న పాశ్చాత్య వేదాంత ధోరణలను ముచ్చటిస్తూనే భారతీయ తత్వజిజ్ఞాసను కూడా పాఠకుల ముందు ఉంచుతుందీ పుస్తకం.గమ్మత్తైన విషయం ఏమిటంటే ఈ తత్వవిచారణ ప్రయాణంలో ఒక మేధావి తరవాత వచ్చిన మేధావులు పాత వారి సిద్ధాంతాలను విమర్శిస్తూ కొత్త సిద్ధాంతాలను ప్రతిపాదించేవారు. కొంత మంది తత్వశాస్త్రజ్ఞులు తమ పాతతరం వారికి ఏమీ తెలియదని, అవన్నీ తప్పుల తడకలని కొత్తగా తమ సిద్ధంతాలే సరైనవని వాదించేవారు. కానీ అందరూ ఏకాభిప్రాయానికి వచ్చిన విషయం తత్వశాస్త్రం యొక్క ఆవశ్యకత గురించి. మనిషి మనుగడలో తత్వశాస్త్రానికి గల ప్రాముఖ్యత ఏమిటి? మానవులకు తత్వవిచారణ ఎప్పుడు మొదలైంది? దాదాపు మూడు వేల సంవత్సరాల క్రితం ఉన్న గ్రీకుల తాత్విక ఆలోచనలు ఇప్పుడు తెలుసుకుంటే నవ్వు పుట్టవచ్చు. కాని, ఆ కాలానికి అటువంటి ఆలోచనలు ఎంత సాహసోపేతమైనవి? అందుకు సమాంతరంగా భారతీయ తత్వచింతన ఎలా కొనసాగింది? బుద్ధుడు, నాగార్జునుడు, ఆది శంకరుడు మొదలైన మహామనీషుల తాత్వికచింతన వల్ల మన ఆలోచనలు ఎలా ప్రభావితం అయ్యాయి? ఇటువంటి ప్రశ్నలకి సమాధానాలు ఈ పుస్తకంలో దొరుకుతాయి.

ఒక జాతి యొక్క సంస్కృతిని మహోన్నతంగా ప్రభావితం చెయ్యగలిగింది ఆ జాతి యొక్క తాత్విక చింతన. పశ్చిమ దేశాల్లోవారి ఆలోచనా సరళి మన ఆలోచనా విధానానికి విభిన్నంగా ఉండటానికి గల కారణాలని వారి తాత్వక చింతనతో తేలికగా ముడిపెట్టవచ్చు.

తత్వచింతన అంటే?

నేను ఎవరు? ఎందుకోసం పుట్టాను? నేను చూస్తున్న ప్రపంచం నిజమా? కాదా? ఈ విశ్వం ఎంత పెద్దది? ఇందుకు కారణం ఎవరు? చావు అంటే ఏమిటి? మనం చనిపోయిన తరవాత ఏమవుతాం? అసలు చావుపుట్టుకలు ఎందుకు? వీటికి కారణాలు ఏమిటి? కారణభూతులు ఎవరు? సుఖం – దుఖః అంటే ఏమిటి? అసలు వీటికి అతీతంగా మనం బతకగలమా?

ఈరకంగా సాగే ఆలోచనా ప్రవాహాల చింతనే తాత్విక చింతన అంటే! ప్రాచ్య, పాశ్చాత్య తాత్వికచింతనలో ఉన్న ఆలోచనల మూలం పైన పేర్కొన్న ప్రశ్నలే? వీటికి సమాధానాలు ఒక్కొక్క సంస్కృతిని బట్టి ఒక్కోలా ఉండొచ్చు. ఒక్కొక్కసారి ఈ సమాధానాలు ఒకేలా ఉండవచ్చు. భారతీయ సంస్కృతికి మూలాలు మాత్రమే కాక ప్రమాణాలైన వేదాలు, పురాణాలు, భగవద్గీత మొదలైన వాటిలో పైన ఉదాహరించిన ప్రశ్నలు వాటి సమాధానాలు దొరుకుతాయి. అలాగే ఇటువంటి విషయాల్లో ఆశక్తి ఉన్నవారు పాశ్చాత్య సంస్కృతుల్లో నుంచి పై ప్రశ్నలకు ఎటువంటి సమాధానాలు వచ్చాయి అన్నది ఈ పుస్తకంలో తెలుసుకోవచ్చు. అయితే, ఈ సమాధానాలకి మూలమైన ఆలోచనా పద్ధతి ఏమిటి? ఈ పుస్తకంలో ఒక అధ్యాయం నుంచి తరువాత అధ్యాయానికి వెడుతున్నపుడు తత్వశాస్త్రంలో ఏర్పడ్డ పరిణామాలు తెలుసుకోవటం ఎంతో ఆసక్తిగా ఉంటుంది.

పాశ్చాత్య తత్వ చింతన ఎందుకు?

నిజమే! మన సంస్కృతిలోనే తెలుసుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. కానీ మనం అక్కడితో ఆగిపోకుండా ప్రపంచ సంస్కృతుల్లో ఏ ఏ దేశాల్లో జనజీవనం ఎటువంటి అభివృద్ధి సాధించింది? అన్న విషయాలు తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవాలి. సాధారణంగా అందరి ఇంటిపేర్లలోనూ మా ఇంటి పేరు గొప్ప, అన్ని భాషల్లోకి మా భాష గొప్ప, అన్ని సంస్కృతుల్లోకి మా సంస్కృతి గొప్ప అన్న ఆలోచచనలు మనం గమనిస్తూ ఉంటాం! అటువంటి ఆలోచనలను దాటి ఇతర సంస్కృతుల్లో – ముఖ్యంగా పశ్చిమ దేశాల్లో తాత్వికచింతనకు ఎటువంటి పరిణామాలు ఏర్పడ్డాయి? ఆ పరిణామాలు ఎటువంటి అభివృద్ధిని సాధించాయి? అన్న విషయాలను వివరిస్తుంది ఈ పుస్తకం. నా ఉన్నత విద్య ఆ తరువాత నా పరిశోధన జరిగింది భౌతిక శాస్త్రంలో కాబట్టి ఈ పుస్తకంలో ముచ్చటించిన కొన్ని విషయాలు నాకు కొంత తేలిగా అర్ధమయ్యాయని అనిపిస్తుంది. అలా అని ఇతరులకు ఈ పుస్తకం చదివి అర్ధం చేసుకోవటం కష్టమవుతుందని నా అభిప్రాయం కాదు. కాకపోతే ఈ పుస్తకానికి ఎన్నుకున్న విషయం మాత్రం అరుదైనది, అంత తేలికగా పట్టుబడే విషయం కాదని మాత్రం నేను గట్టిగా చెప్పగలను. ఎవరైనా సరే శ్రద్ధగా చదవాల్సిన పుస్తకం ఇది.

ఈ పుస్తకంలో చాలా భాగం పశ్చిమ దేశాల్లో సాధించిన తత్వచింతన పరిణామాలు, వాటి వెనుక ఉన్న మహోన్నత వ్యక్తుల సంక్షిప్త జీవిత చరిత్రలు, ఆ వ్యక్తులు తమ తమ జీవిత కాలాల్లో ఎదుర్కొన్న సవాళ్ళు ముచ్చటించబడ్డాయి. ఉదాహరణకు క్రీస్తు పూర్వం జన్మించి ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి తరాలను కూడా ప్రభావితం చేసిన సోక్రటీస్, ఆరిస్టటిల్ వంటి మహోన్నత వ్యక్తులతో బాటు 19వ శతాబ్దిలో పేరుపొందిన బ్రిటీష్ తత్వశాస్త్రవేత్త అయిన బెట్రాండ్ రసెల్ వంటి వ్యక్తుల తత్వ చింతనలను పరిశీలించారు నండూరివారు ఈ పుస్తకంలో. అయితే, పుస్తకం పేరు “విశ్వదర్శనం” కాబట్టి మరే ఇతర (ప్రాచ్య, పాశ్చాత్య తత్వ విచారణలో భారతీయ ధృక్పధంతో పాటు పశ్చిమ దేశాల ఆలోచనలు మాత్రమే పరిగణలోకి తీసుకోబడ్డాయి) సంస్కృతుల తత్వ చింతనలు పరిగణలోకి రచయిత తీసుకోకపోవటం కొంత వెలితిగానే తోచింది నాకు. ఉదాహరణకి చైనీస్ సంస్కృతిలో కంఫ్యూసియస్ వంటి మేధావుల ప్రభావం ఎంతో ఉంది కాబట్టి పేరుకైనా కోందరి ప్రస్తావన రచయిత తీసుకొస్తే బాగుండేదేమో! మరి ఒక్క పశ్చిమ దేశాల తత్వచింతన చర్చే ఎంతో విసృతమైన అంశం. బహుశా ‘గ్రంధ విస్తర భీతి ‘ వల్ల రచయిత తమ పుస్తకాన్ని కొన్ని విషయాలకే పరిమితం చేశారేమో!

ఒక విజ్ఞప్తి

ఈ పుస్తకాన్ని పలుసార్లు చదివిన పాఠకుడిగా నాదొక మనవి. ఈ పుస్తకం మీరు ఇప్పటికే చదివి ఉంటే మళ్ళీ చదవటానికి నా పరిచయం ఉపయోగపడితే సంతోషం. ఇప్పటి వరకు ఈ పుస్తకం మీరు చదవకపోతే తప్పకుండా చదవండి. ముఖ్యంగా ఇప్పటి యవతరానికి ఈ పుస్తకం గురించి తెలియకపోతే ఈ పుస్తకం పరిచయం చేసి చదివించండి.


పుస్తకం ప్రచురణ వివరాలు

“లిఖిత ప్రచురణలు”, విజయవాడ.
అన్ని ప్రముఖ పుస్తక కేందాల్లోనూ దొరుకుతుంది.
వెల: రెండొందల యాభై రూపాయలు
“లిఖిత” వారి మాత్రుసంస్థ పల్లవి పబ్లికేషన్స్ ఫోను:6648060 (విజయవాడ)

ఆర్కైవ్.ఆర్గ్ లో ఈ పుస్తక పాఠం ఉంది. (లంకె ఇక్కడ)

ఏవీకేఎఫ్ కొనుగోలు లంకె ఇక్కడ.

ఈ సందర్భంలోనే తారసపడ్డ లంకె – నండూరి కుటుంబం వారి రచనలను షాప్ డాట్ నండూరి డాట్ కాం లో కూడా కొనవచ్చు.

You Might Also Like

3 Comments

  1. ఎలక్ట్రాన్

    పుస్తకం గుఱించి సమీక్షలు చాలాసార్లు చదివాను. దూరంగా వుండటం వలన పుస్తకం ఎక్కడా దొరక్క ఇప్పటి వఱకు చదవలేదు. ఇంక ఊరినుంచి తెప్పించుకునే ప్రయత్నంలో ఉండగా ఇక్కడ మీ సమీక్ష కనబడింది. లింకులు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఇప్పుడే చదవడం మొదలుపెట్టాను. చాలా సంతోషం సర్.

  2. రవి

    ఈ పుస్తకం నాకు భగవద్గీత. ఆంధ్రజ్యోతిలో సీరియల్ గా వచ్చే రోజుల్లో అర్థం కాకపోయినా చదివాను. ఇలాంటి పుస్తకం తెలుగులో మరొకటి లేదు. వస్తుందో రాదో కూడా తెలియదు.

  3. Independent

    నాకు సంబంధించిన వరకీ నా జీవితం మీద ప్రత్యక్షంగా ప్రభావం(direct impact) చూపిన అతి కొన్ని పుస్తకాల్లో ఈ పుస్తకం మొదట్లో ఉంటుంది. అంతకన్నా ఇంకెక్కువ చెప్పలేను. ఎన్నెన్ని ద్వారాల్ని తెరచిందో, నన్నెక్కడెక్కడికి తీసుకెళ్ళిందో ఈ ఒక్క పుస్తకం!! మా అమ్మ కూడా నాకింత హెల్ప్ చేసి ఉండలేదు నాకు.

    నా దగ్గర రెండు కాపీలు పెట్టుకున్నాను, ఎవరైనా తీసుకెళ్ళినా ఒకటి ఉంటుందని. కాని తమాషాగా, ఈ ఒక్క పుస్తకం మాత్రం, ఠంచనుగా నాకు ఎప్పుడూ తొందరగా తిరిగొస్తుంది ఎవరు తీసుకెళ్ళినా:-) మహానుభావులు నండూరి గారు, ఏదో నీళ్ళు తాగినంత సరళంగా రాయకపోతే, అంత చిన్నప్పుడే పుస్తకం ముందుకు సాగేది కాదు.

    పోతే గత రెండు సంవత్సరాలుగా Last Lecture లోపల్నుంచి ఉక్కపెడుతోంది నన్ను.

Leave a Reply