నండూరి రామ్మోహనరావు గారితో..

నండూరి రామ్మోహనరావు గారి గురించి ప్రత్యేకం చెప్పాలీ అంటే, ఒక్క ముక్కలో చెప్పాలి అంటే – గొప్ప మేధావి, మితభాషీనూ! మార్క్ ట్వేన్ వంటి వారి రచనలకు సరళానువాదాలు చేసి పిల్లలకూ, ’నరావతారం’. ’విశ్వరూపం’ వంటి సైన్సు పుస్తకాలు అందరికీ అర్థమయ్యేలా రాసి సైన్సు ఆసక్తులున్న యువతకూ,పెద్దలకూ, ’విశ్వదర్శనం’ – పేరిట భారతీయ, పాశ్చాత్య చింతనల సారాంశం రాసి, దాదాపు యాభై ఏళ్ళ జర్నలిస్టు జీవితంలో రాసిన అసంఖ్యాక వ్యాసాలతో అందరికీ దగ్గరైన పేరు నండూరి గారిది. ఈ వర్ణన బహుశా డెబ్భై ఎనభైలలో పెరిగిన వారికి బాగా అర్థమవుతుందేమో. అయితే, వారి పిల్లలకి, వారి పిల్లలకి కూడా అర్థం అవాలి – అని నా వాదన 🙂 విజయవర్ధన్ గారి పుణ్యమా అని, నండూరి గారిని కలిసే భాగ్యం కలిగింది. మేము ఇద్దరం విజయవాడ మొగల్రాజపురంలోని వారి ఇంటికి వెళ్ళి కాసేపు గడిపాము. ఆ అనుభవాన్ని అందరితో పంచుకుందామని ఈ టపా.

రామ్మోహనరావు గారంటే నాకు చాలా ఇష్టం. ఆయన రచనలంటే ఇష్టం, ఆయన చదువరితనం అంటే ఇష్టం. యాభై ఏళ్ళ ఆయన జర్నలిస్టు కెరీర్ అంటే ఇష్టం. అందుకే, రామ్మోహనరావు గారి ఆరోగ్యం బాగోలేనందువల్ల ఆయన బహుశా ఏమీ మాట్లాడకపోవచ్చు అని తెలిసినా, ఆయన్ని చూస్తే చాలు అన్న తాపత్రేయంతో వెళ్ళిపోయాను, రోజులో బోలెడంత సేపు ట్రైను-బస్సుల్లో ఉండాలి అన్న విషయం అర్థమై కూడా. అక్కడ ఇంట్లో ఆయనా, ఆయన భార్య రాజేశ్వరి గారూ ఉన్నారు. పరిచయాలూ అవీ అయ్యాక, రామ్మోహనరావు గారిని చూశాను. ఆయన వచ్చి ఎదుట కూర్చోగానే నా మనసు లోపల ఎన్ని రకాల డాన్సులు వేసిందో ఏమని చెప్పేది??

విజయవర్ధన్ గారు ఆయనతో మాట్లాడుతూ ఏవో ప్రశ్నలూ అవీ వేస్తూంటే, ఆయన జవాబులు ఇచ్చారు. అక్కడక్కడా రాజేశ్వరి గారు అందిస్తూ వచ్చారు. అయితే, ఆయనకి వార్థక్యం వల్ల కాస్త మరుపు వచ్చింది. అందువల్ల, కొంచెం ఇబ్బంది పడ్డారు జవాబులు ఇచ్చేటప్పుడు. నేను కూడా ఇలాగే ఏవో రెండు మూడు ప్రశ్నలు అడిగాను – ఆయన మీద ఎవరి ప్రభావం ఎక్కువ? ఎలాంటి పుస్తకాలు ఇష్టం ఇటువంటివి. అయితే, ఆయన సరిగా గుర్తులేవని కొంచెం నిస్సహాయంగా చూడ్డంతో మరేం అడగకుండా, ఆయనా, ఆవిడా మాట్లాడేది వింటూ, మధ్య మధ్య వాళ్ళ చిన్నప్పటి విశేషాల గురించి, ఇలాంటివి అడుగుతూ కాసేపు ఉన్నాము. నండూరి వారికి నార్ల వారి ప్రోత్సాహం గురించి రాజేశ్వరి గారు చెప్పారు. అలాగే, పుస్తకాలు అవీ కొనేవారింట్లో వాటిని సంరక్షించే వారు చెప్పే టిపికల్ సమాధానం – ’ఈయన పుస్తకాలు అలా తెచ్చి పోగు చేస్తూ ఉంటే మహా విసుగొచ్చేది ఒక్కోసారి” అన్నది ఆవిడ నోట కూడా విని, నవ్వాగలేదు.

అయితే, ఆయన తన గురించి, తన జీవితానుభవాల గురించీ ఏదన్నా రాసి ఉంటే తెలుసుకోవాలన్న కోరిక కలిగి అడిగాను. అలా రాద్దామనుకున్నప్పటికే ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల అది అలాగే ఉండిపోయిందట 🙁 అలాగే, విశ్వదర్శనం మూడో భాగం కూడానూ! దానితో, పోనీ, ఆయన గురించి కుటుంబసభ్యులేమన్నా రాసారా? అంటే – ఇప్పటివరకూ అయితే రాయలేదన్నారు. దానితో, నేను పట్టువదలక – ఆయన గురించి ఇతరులు రాసిన వ్యాసాలేవన్నా ఉన్నాయా? అని అడుగుదాం అనుకుంటూ ఉండగా – రాజేశ్వరి గారు ఒక పుస్తకం చూపించారు. అది నండూరి గారికి జర్నలిజం లో యాభై ఏళ్ళు పూర్తైన సందర్భంగా వచ్చిన పుస్తకం. వివిధ వ్యక్తులు వారిపై రాసిన వ్యాసాల సంకలనం. కానీ, అసలు అదిప్పుడు దొరకదేమో! అన్న అనుమానం కొద్దీ, వారి అనుమతితో అక్కడే దాన్ని ఫొటో తీయడం మొదలుపెట్టాను. పేజీ టు పేజీ.

చిన్న పుస్తకమే – నూటిరవై పేజీల్లోపే! అయితే, చల్లటి వాతావరణానికి అలవాటు పడ్డ నా సెల్లు బ్యాటరీ బ్లేజ్‍వాడ వేడికి ట్రబులివ్వడం మొదలై, పుస్తకం సగం దాకానే తీయగలిగాను. ఇప్పుడా పుస్తకం ఎలాగో ఎక్కడ దొరుకుతుందో చూసి సంపాదించాలనమాట. పల్లవి పబ్లికేషన్స్, విజయవాడ వారి వద్ద దొరకొచ్చు అన్నారు రాజేశ్వరి గారు. ఈ పుస్తకంలో నే, మహీధర నళినీమోహన్ గారు నండూరి గారి గురించి రాసిన వ్యాసం కూడా ఉంది. ఒక సైన్సు మేధావి మరొక మేధావి గురించి ఏం రాస్తారో అని నాకు మహా కుతూహలంగా ఉంది. దాదాపు గంటన్నర పాటు వాళ్ళింట్లో ఉన్నాక (నేను విశ్వదర్శనం పుస్తకంపై ఆయన ఆటోగ్రాఫ్ తీసుకున్నాక) ధన్యవాదాలు చెప్పి బయటకొచ్చేశాము.

నండూరి రామ్మోహనరావు గారు నా మెడకాయెత్తి నేను ’వావ్’ అనుకుంటూ చూసేవారిలో తొలి వరుసలో ఉంటారు. నళినీమోహన్ గారి లాగే, ఈయనవి కూడా పుస్తకాలు చదువుతూ పెరిగి పెద్దయ్యాను. చదివినదాన్నే మళ్ళీ చదువుతూ కూడా! అందువల్ల, ఈమధ్య సైన్సును తెలుగులో రాసే ప్రయత్నం చేసినపుడు కూడా, కొంత ఏకలవ్య శిష్యరికం చేస్తూ వచ్చాను. ఈ నేపథ్యంలో, ఏళ్ళ తరబడి ఆయన రచనల్ని ఇష్టపడ్డ వ్యక్తిగా బెజవాడెళ్ళి దుర్గగుడికెళ్ళలేదా? అంటే, గుడికెళ్ళా అనే సగర్వంగా చెప్పుకోగలను. 🙂 అయితే, అంతటి మేధావినీ వృద్ధాప్యం వదల్లేదు. వేరే ఏదన్నా సమస్య అంటే వేరే సంగతి కానీ – మరుపు ఆయనపై గెలవడం మాత్రం నేను సహించలేకపోతున్నాను. దాదాపు నాలుగైదేళ్ళ క్రితం మహీధర నళినీమోహన్ గారి మరణ వార్త పేపర్లో చదవడం నాకు బాగా గుర్తుంది. ఆయన కూడా ఆల్జీమర్స్ వల్ల చాలా ఏళ్ళుగా జ్ఞాపకశక్తిని కోల్పోతూ వచ్చారు. నా అభిమాన తెలుగు సైన్సు రచయితలిద్దరికీ వృద్ధాప్యంలో ఇంచుమించు ఒకటే సమస్య రావడం కాస్త ఆశ్చర్యం, బోలెడు బాధా కలిగించింది. ఒక క్షణం వేదాంత ధోరణిలో పడ్డాను – ఎందుకు కొందరికే ఈ సమస్యలొస్తాయి? అని. వెనక్కి వచ్చేశాక కూడా, ఇదే విషయం మనసులో తిరుగుతూనే ఉండింది కానీ, చివరకు వాస్తవాలతో సమాధానపడాల్సి వచ్చింది.

ఆయన రచనల గురించి అప్పటి వారికే కాక, ఇప్పటి వారికి కూడా తెలియాలంటే ఏం చేయవచ్చో, మీ సలహాలు మీరూ చెప్పండి. ఆయన సంపాదకీయ వ్యాసాల గురించి పుస్తకం.నెట్ లో వచ్చిన వ్యాసం ఇదిగో. ఆయన గురించి, ఆయన రచనల గురించి మీరంతా వ్యాసాలు రాస్తారని ఆశిస్తున్నాను 🙂 రామ్మోహనరావు గారి జీవిత విశేషాలతో కూడిన వ్యాసం ఆ స్వర్ణాభినందన సంచిక చివర్లో ఉంది. కాపీరైట్ ఇబ్బందులూ గట్రా లేని పక్షంలో ఆ వ్యాసం పుస్తకం.నెట్ లో పెట్టగలమేమో చూడాలి!

You Might Also Like

6 Comments

  1. పుస్తకం » Blog Archive » మా తాతయ్య

    […] గారి మనవరాలు. నండూరి గారి పై పుస్తకం.నెట్లో వచ్చిన వ్యాసానికి స్పందించి, ఆయనతో తన అనుభవాల […]

  2. sreelata kamaraju

    Namaskaram Soumya garu,

    nenu Nanduri RamamohanRao gari manavaralini. meeru raasina vyasam chala bagundi. ” పోనీ, ఆయన గురించి కుటుంబసభ్యులేమన్నా రాసారా? అంటే – ఇప్పటివరకూ అయితే రాయలేదన్నారు. ” mee vyasam choosina taruvata ippati daaka aayana gurinchi maaku telisina vishayalu ,aayana maaku cheppina tana chinnappati viseshalu raddamu anna aalochana inka balapadindi. mee andari abhimanam choosi maaku chala anandam ga undi.

  3. విష్ణుభొట్ల లక్ష్మన్న

    నండూరి వారి “విశ్వదర్శనం” పుస్తకాన్ని ఇక్కడ పరిచయం చేద్దామని ఆలోచించి ఆ పుస్తకాన్ని చదువుతూ ఉండగా ఆయన పేరు మళ్ళీ ఇక్కడ కనపడితే ఆనందం కలిగింది. 1998 సంవత్సరంలో అజో-విభొ ప్రతిభామూర్తి పురస్కార గ్రహీతగా ముఖఃపరిచయం నండూరివారితో కలిగింది.

    ఆరునెలలు ఆఫీసు పని మీద జెర్మనీ మొన్ననే వచ్చిన నేను విశ్వదర్శనం పుస్తకం నా వెంట తెచ్చుకోటం మరచాను. ఈ పుస్తక రచయితగా నండూరి వారి మేధస్సు ఈ పుస్తకంలో విశ్వదర్శనమిస్తుంది. వీలైనంత తొందరలో(మరెవ్వరూ ఈ పుస్తకాన్ని పరిచయం చెయ్యకపోతే)ఈ పుస్తకాన్ని ఇక్కద పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను.

    విష్ణుభొట్ల లక్ష్మన్న

  4. Sai Ganesh

    నండురి వారి “విశ్వరూపం” ఎన్ని సార్లు చదివానొ నాకే గుర్తు లేదు. అలాంటి వ్యక్తిని మీ వ్యాసం ద్వారా చూడడం ఆనందం కలిగిస్తుంది. అలాగే ఆయన పరిస్తితి చదివి బాధా కలుగుతుంది.

    ఆయన ఆరొగ్యం కుదుట పడలని, మన అందరం చదివేలాగా ఆయన మంచి పుస్తకం రాయాలని కొరుకుందం.

    సాయీ గణేషు పురాణం

  5. Independent

    WOW, You actually MET Nanduri garu!!!! Ento naa life Ptch 🙁 Guess I am going after wrong targets in life.

    “నండూరి రామ్మోహనరావు గారు నా మెడకాయెత్తి నేను ’వావ్’ అనుకుంటూ చూసేవారిలో తొలి వరుసలో ఉంటారు”. Same here.

    ఆయన సంక్లిష్టమయిన విషయాలని కూడా అరటిపండు వలచి నోట్లో పెట్టిన తీరుగా రాసే శైలంటే, నాకు ఎంతో అడ్మిరేషన్. నిజానికి నాకు ఫిలాసొఫీ అనే ప్రపంచానికి తలుపులు తెరచింది ఆయన పుస్తకాలే. వీరి పుస్తకాలు చూసి తరవాతెప్పుడో western philosophy పుస్తకాలతో చాలా కుస్తీ పడ్డా కాని, నండూరి గారు చెప్పినట్లు ఇంకెవ్వరూ చెప్పలేరు ప్రపంచంలో.

  6. రవి

    విశ్వదర్శనం – నా బాల్యంలో ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చేది. అప్పట్లో చంటబ్బాయ్, రెండు రెళ్ళు ఆరు, అభిలాష వంటి సీరియల్స్ తో బాటు విశ్వదర్శనం కూడా కలిపి ఆంధ్రజ్యోతి వైభవంగా వెలిగేది. ఇక బాలజ్యోతి సరే సరి.

    అప్పట్లో అర్థమయీ కాని ఆ పుస్తకం ఇప్పుడు భగవద్గీత. ఎన్ని సార్లు చదివానో లెక్కలేదు. విశ్వ రూపం – ఐన్ స్టీన్ సాపేక్ష సిద్దాంతం గురించి ఈ పుస్తకంలోకన్నా సింపుల్ గా ఎవరూ చెప్పి ఉండరు.

Leave a Reply