ఈశాన్యపవనం
రాసిన వారు: గరికపాటి పవన్ కుమార్
**********************
కవిత్వమంటే కవినుండి బయల్దేరిన హృదయప్రకంపన చదువరికి చేరడమే..ఈ ప్రకంపనలని సృష్టించడానికి కవి చేసే కృషే, కవిత్వంగా వెలువడుతుంది. ఈ ప్రకంపనలు భావ సౌందర్యం వల్ల , పదాల పొందిక వల్ల, లయ వల్ల, సూచించిన ఉపమల వల్ల సృష్టించబడతాయి.
కవి,చదువరి ఒకే ప్రకంపనానికి వచ్చినప్పుడు అనునాదం (resonance) వుంటుంది.ఈ అనునాదానికి రావడానికి ఒక్కొక్క కవి శైలిని బట్టి,చదువరికి సమయం పడుతూ వుంటుంది.భూషణ్ రాసిన కవిత్వంతో అనునాదానికి రావడానికి చదువరికి కొంత ఎక్కువ సమయం పడుతుంది.ఎందుకంటే
భూషణ్ రాసిన కవితలన్నీ జనపనారను చావగొట్టి నార తీసినట్టుగా-పదాల నారను ఉపయోగించి చేసిన రంగురంగుల డిజైనర్ బట్టలు.ప్రతి పదం వెనుక అగాధం వుంది.ఒక పదం నుంచి ఇంకొక పదంలోకి వెళ్ళే ముందు ఈ అగాధాన్ని చవిచూసి రావలసి వుంటుంది.ఆ అగాధంలో ఉండే జలపాతాలు,రంగురంగుల పూలమాలికలను చవిచూసిన వారు,ఈ కవితలను ఆనందించగలరు.
ఒక సున్నితమైనటువంటి కవిత-
” కరెంటు లేని
నిద్రపట్టని రాత్రి
చమురు దీపం వెలుగు
సాగే చువ్వల నీడలను
మాయం చేసే మెరుపుల్లా
నిశ్శబ్దంలో నీ నవ్వులు
గలగలా వినిపిస్తాయి. ”
(నిశ్శబ్దంలో నీ నవ్వులు)
పదాలనే కాదు,హృదయ ప్రకంపన కోసం,శబ్దాలనీ,వాసనలనీ,దృశ్యాలనీ కలిపి వదిలిన కవితలివి. కాకపోతే, భూషణ్ కవితలు రామానుజం సాధించిన లెక్కల వంటివి;మామూలు గణిత శాస్త్రజ్ఞుడికి పది స్టెప్పుల లెక్క,భూషణ్ కు ఒక స్టెప్పు.అలాగని,భూషణ్ అర్థాలని మింగడు;గుళిక చేసి అందిస్తాడు.
“తడిచిన ఇసుక మీద
బుడగలతో అంతర్దానమవుతున్న
పాదాల ముద్రలు,
నిమీలిత నేత్రాలతో
నిశ్శబ్దంగా వీక్షించు
నిద్రించు
స్వప్న వ్యూహాల అభిమన్యూ..
రేపు ..జలతారు మబ్బు !”
రొటీన్ జీవితానికి అలవాటు పడిపోయి రోజులు గడిపేస్తున్న మనకు హెచ్చరిక లాంటిది రోజూ అనే కవిత.
“చూపుల వ్యాపారి.. రెప్పల షట్టర్లు
పూర్తిగా.. దించివేస్తే రాత్రి
షట్టర్లు.. పెద్ద చప్పుడు
బార్లా తెరీచేస్తే పగలు “
వనరులను జాగ్రత్తగా వాడుకోక పోతే ,వచ్చే పరిణామాలని చాలా సూటిగా గుండెల్లో గుచ్చాడు భూషణ్.
” దాహం తీరక,దప్పిక ఆరక
నీవే కరిగి నీరై
నీవుంచిన బక్కెట్లో, నీవే మునిగిపోయి
ఊపిరాడక గిలగిలా తన్నుకునే రోజు
ఎదురవుతుంది “
రొటీన్ లో పడిపోక-
” నీ చేతుల మీదుగా
జోలె బరువు పెంచి
గుండె బరువు దించి”
సాటిమనిషి గుండెలోతుల్లోకి దూసుకెళ్లమంటున్నాడు కవి.
అన్నిటికన్నా నాకు నచ్చిన కవిత పూరకం. మనలో వున్న నిర్లిప్తత (objectivity)ని పెంచుకోవాలని భూషణ్ చెప్పే విధానం :
” బాధను పాటగా అనువదించకు
జారే నేల మీద మోపిన పాదం..వారించకు “
భూషణ్ శబ్ద సౌందర్యానికి ,అర్థ సౌందర్యానికి విలువనివ్వలేదు, అలా అని ,అన్ని కవితలు శబ్ద సౌందర్యం ,అర్థ సౌందర్యం లోపించినవి అని కాదు.అతని కవితల్లో భావ సౌందర్యం ఎక్కువ. కవిత్వానికి ఒక క్రమం, నడకా నిర్మాణం వుండాలని ఇస్మాయిల్ గారి వాదన. నిజం! పచ్చి నిజం!! క్రమం ,నడకా నిర్మాణం అవసరం, కానీ, కవిత్వంలో కావలసింది..భావక్రమం,భావాల పొందికైన నడక ,భావాల నిర్మాణం.
భూషణ్ భావక్రమం,నడకా నిర్మాణం అభావం అన్న ఈ క్రింది కవితలో గమనించండి.
” తేనెటీగలు లేచిపోతాయి..
కబోది కళ్ళతో మైనం తుట్టె మిగిలిపోతుంది.
విందు ముగిసిపోతుంది..
ఖాళీ గ్లాసు స్వగతం వినిపిస్తుంది.
బస్సూ బయలుదేరి వెళ్ళిపోతుంది..
అరటితొక్క కాలు జారిపడే వారికోసం ఎదురు చూస్తుంది “
భూషణ్ కవితల్లో శబ్దార్థాల క్రమాలు వెదికేవారికి నిరాశ ఎదురవుతుంది.
భూషణ్ కవితలు భావాల ,అనుభవాల దొంతరలు.ఒక్కసారిగా ,దొంతరగా, ధ్యానముద్రలో వుండే భావాల దొంతరలా..ఒక్కసారి జలపాతంలా ఉరికిపడే భావాలు.ఒక్కసారి పారే సెలయేరులాంటివి.
( “నిశ్శబ్దంలో నీ నవ్వులు” కవితా సంకలనం వెలువడి ఒక దశాబ్దం అయిన సందర్భంగా )
Srinivas Nagulapalli
“తెలియనివన్ని తప్పులని దిట్ట తనాన సభాంతరంబునన్
పలుకగ రాదు ……………..”.
“తెలిసినవొప్పు తప్పులను తేటగ చూప సభాంతరంబునన్ పలుకుట తిట్టు కాదు …”
“మీరింకా ఆ కవితతో అనునాద స్థాయికి రాలేదు, చదవగా చదవగా మీకే చమక్కుమంటుంది.”
చమక్కుమన్నాకే చెప్పింది.
=====
విధేయుడు
_శ్రీనివాస్
గరికపాటి పవన్ కుమార్
శ్రీనివాస్ గారూ,
“తెలియనివన్ని తప్పులని దిట్ట తనాన సభాంతరంబునన్
పలుకగ రాదు ……………..”.
క్రూరం అన్న తర్వాత మీ వ్యాఖ్య ఆగితే బాగుండేది. కానీ మీరు మోపిన పాదం నేను వారించడమెందుకు?
ఇకపోతే నా సమాధానం:
మీరింకా ఆ కవితతో అనునాద స్థాయికి రాలేదు, చదవగా చదవగా మీకే చమక్కుమంటుంది.
గరికపాటి పవన్ కుమార్
Srinivas Nagulapalli
ఓపికతో శ్రమతో సంకలనాన్ని సోదాహరణంగా పరిచయం చేసినందుకు కృతజ్ఞతలు.
“నీ చేతుల మీదుగా
జోలె బరువు పెంచి
గుండె బరువు దించి” అన్నవి బాగా తాకాయి సూటిగా ఆర్ద్రంగా.
“చూపుల వ్యాపారి.. రెప్పల షట్టర్లు
పూర్తిగా.. దించివేస్తే రాత్రి
షట్టర్లు.. పెద్ద చప్పుడు
బార్లా తెరీచేస్తే పగలు “ అన్నది కూడా చక్కని పదచిత్రణ.
రామానుజన్ గణితం స్టెప్పుల అన్వయం మాత్రం అర్థం కాలేదు.
ఎన్ని తక్కువ ఎక్కువ స్టెప్పులు అని కాదు, అవి చూపిన దారి, చేర్చిన గమ్యం, ఆవిష్కరించిన అద్భుత సుందర గణిత సత్యాలే ఆ స్టెప్పులకు సార్థకత ఆపాదిస్తాయి అనిపిస్తుంది. ఏ సృజనాత్మక ప్రక్రియకైనా అదే రీతేమో అని కూడా అనిపిస్తుంది.
గుచ్చుకున్న వాటి గురించి రెండు మాటలు.
———-
మనలో వున్న నిర్లిప్తత (objectivity)ని పెంచుకోవాలని భూషణ్ చెప్పే విధానం :
” బాధను పాటగా అనువదించకు
జారే నేల మీద మోపిన పాదం..వారించకు “
———
ఇదేమి రాత స్వామి- ఇట్లా ఎందుకు రాస్తున్నామో ఎందుకు ఆలోచిస్తామో అని ఆశ్చర్యం ఆవేదన. పోయిన డబ్బులు పోయి బాధే మిగిలినా “చేతిలో డబ్బులు పోయేనో అయ్యో జేబులు ఖాలీ ఆయెనో” అని పాటగా పాడుకుంటే పోయిన డబ్బులు రాకపోయినా, కలిగిన బాధ కరగక పోయినా ఏదో తృప్తి. బాధను పాటగా అనువదించకు అని ఎందుకు అంటారో, అంటే మాత్రం ఎవరు వింటారో తెలియదు. ఇక పోతే, జారే నేల మీద ఎవరన్నా పడుతుంటే అయ్యో పాపం అంటాం కానీ “వారించకు” అనడం ఏమిటండి, ఇదేమి హృదయప్రకంపన?! సాయం చేయకపోతే పోనీ, ఇంకెవరన్నా చేస్తారేమో, కాని వారించొద్దు అనడం- నిర్లిప్తత (objectivity) కాదు, క్రూరం. జారే పాదం సంగతేమో కాని ఇట్లాంటి రాతలే జారుతున్నాయి. ఇది మన కవిత్వం అనుకుంటే మనల్ని దిగజార్చుతున్న స్టెప్పులుగా మారుతున్నాయి అనిపిస్తుంది. ఇటువంటివి పెంచుకోవడం కన్నా త్రుంచుకోవడం మేలు అని వారించడం కాదు, విచారించడం మాత్రమే.
——-
విధేయుడు
_శ్రీనివాస్
గరికపాటి పవన్ కుమార్
ఈ వ్యాసం నేను ఈ పుస్తకం వచ్చిన కొత్తలో గౌహతిలో ఉన్న రోజుల్లో రాసినది.
నిశ్శబ్దంలో నీ నవ్వులు పుస్తకం మీది వచ్చిన మరో మంచి సమీక్ష ఈమాట మొదటి
సంపాదకులు కేవిఎస్.రామారావు గారు రాసినది.ఆసక్తి గల పాఠకుల కోసం లింకు.
http://www.eemaata.com/em/issues/200105/644.html
ఇంటర్నెట్ పత్రికలదే భవిష్యత్ అని గ్రహించిన మేధావి , దూరదర్శి కేవిఎస్.రామారావు గారు.
ఈ రోజు ఇన్ని పత్రికలు చూస్తున్నాము.అసలేమీ లేనప్పుడు ఒంటి చేత్తో ఒక ఒరవడి
సృష్టించడం అంత సులభం కాదు. భూషణ్ ను విమర్శ రాయమని ప్రేరేపించింది
కూడా వీరే. ఆ తర్వాత పరిణామాలు అందరికీ తెలిసినవే…
గరికపాటి పవన్ కుమార్