న్యాయంకోసం నిరంతర పోరాటం కన్నబిరాన్ జీవితకథ – 24 గంటలు
నా మెడికల్ కాలేజీ చివరిరోజుల్లో, ఎమర్జెన్సీ అనంతరపు దినాల్లో, పౌరహక్కుల సంస్థలతో కలసి పని చేస్తున్నప్పుడు మొదటిసారిగా కన్నబిరాన్‌గారి పేరు విన్నాను. తార్కుండే కమిటీ పేరిట అప్పుడు ఎదురుకాల్పులపై విచారణ జరిపిన పౌరహక్కుల కమిటీకి ఆయన కార్యదర్శిగా ఉండేవారు. ఆ రోజుల్లో ఆయన పేరు కణ్ణాభిరాన్ లేక కన్నాభిరాన్ అని కనిపిస్తుండేది. ఈ మధ్య కొన్నాళ్ళు కన్నబీరన్ అని కూడా చదివాను. ఈరోజు ఆయన మరణవార్తను ప్రచురించిన ఆంధ్రజ్యోతి ఇంటర్నెట్ ఎడిషన్‌లోనూ కన్నబీరన్ అనే ఉంది. కానీ ఆయన పేరు కన్నబిరాన్ అని ఆయన ఆత్మకథ చదివినప్పుడే స్పష్టంగా తెలిసింది. (ఎక్కడో ఒక గుడి వైష్ణవ పూజారి ఆయన పేరును స్పష్టంగా పలికాడట. బహుశా ఎవ్వరూ అలా పలకకపోవడం వల్ల కాబోలు ఆయన ఆ సంఘటనను ప్రత్యేకంగా చెప్పుకున్నారు ఈ పుస్తకంలో.) ఆయన పేరు ఎలా రాసినా, పౌర హక్కుల గురించి అప్పటినుంచి ఇప్పటిదాకా ఏ విషయం చదివినా, ఆయన ప్రస్తావన లేకుండా ఉండేది కాదు.
తెలుగునాడి పత్రికలో ప్రసిద్ధ వ్యక్తుల జీవితాల్ని వ్యక్తిగతం అన్న శీర్షికలో పరిచయం చేస్తూ ఉంటాము. ఆ శీర్షికలో ప్రచురించటానికి 24 గంటలు పుస్తకానికి వసంత కన్నబిరాన్ వ్రాసిన ముందుమాటను మిత్రుడు వాసిరెడ్డి నవీన్ సూచించారు. అప్పుడే తెలిసింది కన్నబిరాన్ ఆత్మకథ ప్రచురితమయ్యిందని. వెంటనే తెప్పించుకొని చదివాను. దాదాపు ఏడు నెలలనుంచి ఈ పుస్తకాన్ని పరిచయం చేద్దామనుకొంటూనే బద్ధకిస్తూ వచ్చాను. ఆ బద్ధకానికి ఈ రోజు విచారపడుతున్నాను.
ఈ పుస్తకం మనం మామూలు అర్థంలో చెప్పుకొనే ఆత్మకథ కాదు. ఆంధ్ర ప్రదేశ్‌లో, భారతదేశంలో పౌరహక్కుల సంఘర్షణల చరిత్ర; పౌర హక్కుల ఉద్యమానికి సిద్ధాంత ప్రాతిపదిక; రాజ్యము, ప్రజల సంబంధాల గురించిన ఆలోచనా వ్యాసం; విధ్వంసమౌతున్న పరిపాలనా విలువలగురించిన ఆవేదన. కన్నబిరాన్‌గారి గురించిన వ్యక్తిగత విషయాలు ఈ పుస్తకంలో కంటే వసంతగారి ముందుమాటలోనే ఎక్కువ తెలుస్తాయి.
కన్నబిరాన్ పూర్వీకులు తమిళులు. తరతరాలుగా ఆయన కుటుంబీకులు నెల్లూరులో జీవిస్తున్నారు. మొదటిరోజుల్లో ఆర్థికమైన ఇబ్బందులు చాలా పడి చివరికి న్యాయవాదిగా హైదరాబాదులో నిలదొక్కుకొన్నారు. 1970ప్రాంతాల్లో హైదరాబాదులో న్యాయవాదులు కొంతమంది కూడి రాష్ట్రంలో జరుగుతున్న నిర్బంధకాండలకు వ్యతిరేకంగా పనిచేయడానికి నక్సలైట్ డిఫెన్స్ కౌన్సిల్‌ని ఏర్పాటు చేసి, దానికి కన్నబిరాన్‌గార్ని అధ్యక్షుడిగా ఎన్నుకొన్నారు. వీరందరూ కలిసి పార్వతీపురం, హైదరాబాద్ కుట్రకేసుల్లో డిఫెన్స్ న్యాయవాదులుగా వ్యవహరించసాగారు. అప్పుడు మొదలైన పౌరహక్కుల ఉద్యమం ఈరోజు ఉన్న స్థితికి రావటానికి ముఖ్యుల్లో ఒకరు శ్రీ కన్నబిరాన్. ఎమర్జెన్సీ రోజుల్లో డిటెన్యూలుగా ఉన్నవారి తరపున వాదించటానికి మిగిలిన ఒకే లాయరు శ్రీ కన్నబిరాన్. ఎమర్జెన్సీ తర్వాత ఆంధ్ర ప్రదేశ్ పౌరహక్కుల సంఘం (AP Civil Liberties Committee, APCLC)కు పదిహేనేళ్ళు అధ్యక్షుడిగా పనిచేశారు. దాదాపు అన్ని పౌరహక్కుల సంస్థలతోనూ, కార్యకర్తలతోనూ మంచి సంబంధాలు ఉన్నాయి. పి.యు.సి.ఎల్ దేశ స్థాయి కార్యవర్గ సభ్యులు.
కన్నబిరాన్‌గారు తనుగా ఈ పుస్తకం రాయలేదు. ఆయనతో అనేక గంటలు మాట్లాడి ఆ సంభాషణలను ఒక క్రమంలోకి చేర్చి ఒక కథగా చేసింది శ్రీ ఎన్. వేణుగోపాల్. ఈ పని పూర్తికాకుండానే ఈ ఆత్మకథ ప్రజాతంత్ర పత్రికలో ధారావాహికంగా ప్రచురితమయ్యిందట. ఐతే, మొత్తం ఒక్కసారి రాయటం కాక ఏవారానికి ఆవారం రాయడం జరిగిందనీ, శ్రీ కన్నబిరాన్ చెప్పిన మాటలతోపాటు ఆయన వ్యాసాలనుంచి కొన్నిభాగాలు ఉన్నాయని శ్రీ వేణుగోపాల్ తెలిపారు. దాదాపు దేశంలోనూ, రాష్ట్రంలోనూ ముఖ్యమైన పౌరహక్కుల ఉల్లంఘన సంఘటనలన్నిటిగురించి ఈ పుస్తకంలో వివరణాత్మకమైన చర్చ ఉంది. పౌర హక్కులు, బాధ్యతలు, రాజ్యం, రాజ్యాంగం, పోలీసు, న్యాయ వ్యవస్థల గురించి శ్రీ కన్నబిరాన్‌కి ఉన్న స్పష్టమైన అభిప్రాయాలు ఈ పుస్తకంలో తెలుస్తాయి. రాష్ట్ర చరిత్రలో ముఖ్యమైన అనేక సంఘటనలు కూడా మనకు తెలుస్తాయి.
ఈ పుస్తకంలో పార్వతీపురం కుట్రకేసునుంచి గుజరాత్ మారణహోమం వరకూ చాలా సంఘటనల వివరాలున్నాయి. కోర్టుల్లోనూ, కమిషన్లలోనూ, ఇతర ఫైలింగుల్లోనూ ఆయన వాదనల వివరాలున్నాయి. పోలీసులు తప్పుడుకేసులు పెట్టినప్పుడు ఆయన ఎంత చాకచక్యంగా వాటిలోని లొసుగుల్ని బయటపెట్టేవారో తెలుస్తుంది. పౌర హక్కుల అవగాహన, పరిరక్షణల అవసరం గురించి ఆయన చెప్పిన ఒక ఉదాహరణ మాత్రం ఇక్కడ ప్రస్తావిస్తాను.
సిరిసినగుండ్ల అన్న ఊరిలో దొంతుల అంకయ్య అనే వడ్డీవ్యాపారిని ఒక నక్సలైటు దళం చంపేసింది. దానికి ప్రతిగా పోలీసులు నలుగురు యువకుల్ని ఎన్‌కౌంటర్‌లో చంపేశారు. ఆ ఎన్‌కౌంటర్‌గురించి విచారణకు వెళ్ళిన శ్రీ కన్నబిరాన్ చెప్పిన ఉదంతం: “అక్కడ గ్రామస్తులతో మాట్లాడుతూ, “…ఆయన(అంతయ్య)ను వీళ్ళు చంపినారు. వాళ్ళని పోలీసులు చంపితే ఏం తప్పు?” అని అడిగాను. ఒక చదువూ సంధ్యా లేని గొల్లవాడు అక్కడ ఉన్నాడు. ఎన్నడూ బడి ముఖం కూడా చూసి ఉండడు. ఆయన, “మరి కోర్టులు ఎందుకున్నయయా” అని ప్రశ్నించాడు. నాకు హఠాత్తుగా ఏమనిపించిందంటే ఈ గొల్లవాడు ఇంతగా రూల్ ఆఫ్ లా గురించి, చట్టబద్ధ పాలన గురించి మాట్లాడుతున్నాడు. ఈ విషయం పోలీసులకు కూడా తెలియదు గదా అనిపించింది. పోలీసులకు మాత్రమే కాదు. ఈ రూల్ ఆఫ్ లా ఉండాలనే విషయం మన న్యాయవాదులలో కూడా చాలామందికి తెలియదు.”
కన్నబిరాన్‌గారి జీవితమంతా ఈ రూల్ ఆఫ్ లాని నిష్పాక్షికంగా అమలుచేయటం గురించే. ఒకవేళ ఆ ‘లా’యే న్యాయంగా లేకపోతే దాన్ని ప్రజాస్వామిక పద్ధతిలో సరిచేయటం గురించే.
తమ జీవితం గురించి వసంత గారు దాదాపు తొమ్మిది పేజీల్లో వ్రాసిన ముందుమాట వ్యక్తిగా కన్నబిరాన్‌ను మనకు పరిచయం చేస్తుంది. ఆరాధనీయకుడిగా మారిన వ్యక్తి తాలూకు మట్టికాళ్ళ గురించి తెలిసినదానిగా రాస్తున్నానని చెప్పినా, ఈ వ్యాసంలో మట్టి, మురికికన్నా ఆత్మీయత, అనురాగం, అసాధరణతే కనిపిస్తాయి.
ఒక ప్రణాళిక ప్రకారం చేసిన రచన కాకపోవడంతో ఈ ఆత్మకథలోనూ కోతికొమ్మచ్చి ఆట ఎక్కువగానే ఉంది. కొన్ని విషయాలు పునరుక్తం కావడమూ ఉంది. ఐనా ఇది తప్పకుండా చదవవలసిన పుస్తకం. ఈ పుస్తకం చాలావరకూ సరళమైన వచనంలోనే ఉంది. క్లిష్టమైన న్యాయ, తత్వ పరమైన విషయాలను కూడా సులభంగా అర్థంచేసుకోవటానికి వీలుగానే ఉంది. ఇందుకు వేణుగోపాల్‌గార్ని అభినందించాలి. కన్నబిరాన్‌గారిని ఈ ప్రయత్నానికి ఒప్పించిన దేవులపల్లి అమర్‌గారికి కృతజ్ఞతలు చెప్పాలి.
______________________________________________
కె.జి. కన్నబిరాన్
జననం: నవంబర్ 19, 1929; మరణం: డిశంబర్ 30, 2010
______________________________________________
24 గంటలు
కె.జి.కన్నబిరాన్ ఆత్మకథాత్మక సామాజిక చిత్రం
అక్షరీకరణ: ఎన్. వేణుగోపాల్
దేవులపల్లి పబ్లికేషన్స్
12-1-62, విజయా గార్డెన్స్, బండ్లగూడ, నాగోల్
హైదరాబాద్ – 500068
ఫోన్: 95023 20616
ప్రచురణ: జనవరి 2010
492 పేజీలు * 200 రూ.
matta lokanadham
how to get this book
budugoy
ఈ సమీక్ష చదవగానే ఈ పుస్తకం తప్పక చదవాలనుకున్నాను. ఇదేమీ ఈజీ రీడ్ కాదు. ఐనా గత వారం రోజులుగా వాయిదాల్లో చదువుతూ పూర్తి చేశాను. మొట్టమొదట నెనర్లు చెప్పాల్సింది ఈ అనుభవాలను అక్షరీకరించాలని ఆలోచన వచ్చిన వారికి(దేవులపల్లి అమర్), ఆలోచనను ఆచరణలో పెట్టిన వారికి(ఎన్. వేణుగోపాల్). ఇది జీవితచరిత్ర అనేకన్నా ఒక డైరీ అనొచ్చేమో. సమీక్షలో చెప్పినట్టు ఈ పుస్తకంలో ఆయన వ్యక్తిగతజీవితం కంటే ఆయన ఆలోచనా సరళి, వివిధ విషయాల మీద ఆయన అభిప్రాయాలు ఉంటాయి.
కంచే చేను మేసే మన మేడిపండు ప్రజాస్వామ్యం ఎన్ని విధాలుగా ఫెయిలవుతున్నది? ఈ ఫెయిల్యూర్‌కి పునాదులేంటి? విచారణ కమిషన్‌లనే కంటి తుడుపు చర్యలు ఇలా అనేక విషయాలపై ఆయన యాభయేళ్ళ న్యాయవాద వృత్తిలో జరిగిన అనుభవాలను వివరిస్తారు.
చిన్నప్పుడు చదువుతాం. రాజ్యానికి మూల మూడు స్తంభాలుంటాయి. లెజిస్లేటివ్, అడ్మినిస్ట్రేటివ్, జ్యుడీషియరీ అని. మొదటి రెండు ఎలాగూ భ్రష్టు పట్టి పోయాయి కనీసం మూడోదైనా సరిగా ఉందని మనలో అపోహ ఉంది. ఈ పుస్తకం చదివాక మూడో దాంట్లో ఉన్న లొసుగులేంటో స్పష్టంగా తెలుస్తాయి. చాలా విషయాల్లో మనకు భేదాభిప్రాయాలు ఉన్నా తప్పక చదవాల్సిన పుస్తకం. ముఖ్యంగా న్యాయశాస్త్రం, సామాజిక శాస్త్రం, రాజనీతి, వర్తమాన విషయాల్లో ఆసక్తి ఉన్నవాళ్ళు తప్పక చదవాలి. పుస్తకాన్ని పరిచయం చేసినందుకు నెనర్లు.
Jampala Chowdary
@ఎన్ వేణుగోపాల్:
వేణుగోపాల్‌గారూ.
మీకూ, వసంతగారికీ, కన్నబిరాన్‌గారి ఇతర సన్నిహితులకూ, పౌరహక్కుల ప్రపంచానికీ నా ప్రగాఢ సానుభూతిని ఈ రకంగా తెలుపుకోవాలనిపించింది.
హడావుడి పడకుండా వ్యాసాన్ని సరి చూసుకొని తప్పులు లేకుండా చూడవలసిన బాధ్యత నాదే.
పై విషయాల్ని ఇప్పుడు సవరించాను. కృతజ్ఞతలు.
ఎన్ వేణుగోపాల్
జంపాల చౌదరి గారికి కృతజ్ఞతలు. నిజానికి నిన్న సాయంత్రం కన్నబిరాన్ గారిని చివరిసారి స్పృశించి చివరి వీడ్కోలు చెప్పినప్పటినుంచీ ఆగకుండా ఉన్న దుఃఖాన్ని చౌదరిగారి రచన కాస్త ఉపశమింపజేసింది.
అయితే రెండు చిన్న పొరపాట్లు:
1. “…ఆంధ్ర ప్రదేశ్ పౌరహక్కుల సమాఖ్య (AP Civil Liberties Union)కు…” అని రాశారు.
కాదు. ఆ సంస్థ పేరు ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం. దాన్ని ఇంగ్లిషులో Andhra Pradesh Civil Liberties Committee (APCLC) అంటున్నారు.
2. “… ఈ పని పూర్తికాకుండానే ఈ ఆత్మకథ ప్రజాతంత్ర పత్రికలో ధారావాహికంగా ప్రచురితమయ్యిందట. ఈ సంభాషణలకు తోడుగా చివరిభాగంలో శ్రీ కన్నబిరాన్ అనేక ముఖ్య విషయాలపై వ్రాసిన వ్యాసాలను చేర్చారు..”
నా ముందుమాటలో అన్నది అది కాదు. మొత్తం ఒకేసారి రాసి ధారావాహికగా రావడం కాకుండా ఏ వారానికి ఆవారం రాయడం జరిగిందని. పుస్తకంలో ఆయన చెప్పిన విషయాలతో పాటు ఆయన వ్యాసాలలోంచి కొన్ని భాగాలు ఉన్నాయని. నా వాక్యాలలో స్పష్టత లోపించినట్టుంది.