పుస్తకం.నెట్ రెండో వార్షికోత్సవం
పుస్తకం.నెట్ మొదలుపెట్టి ఈ రోజుకి రెండు సంవత్సరాలు అయింది. నిర్విఘ్నంగా, నిరాటకంగా ఈ సైటును నడిపినందుకు ముందుగా అందరికీ, పేరు పేరునా కృతజ్ఞతాభివందనాలు. పుస్తకం.నెట్ అనే ఒక ప్రయత్నం “సఫలం” అన్న పదానికి దరిదాపుల్లో ఉన్నట్టు అనిపించటానికి కారణం, మీ ఆదరాభిమానాలే! “ఈ కాలంలో పుస్తకాలు చదివి, రాసే తీరక ఎవరికుందబ్బ!” అని అనుమానంలా ధ్వనింపజేసే నమ్మకాన్ని తుడిచిపెట్టేసేలా జరిగిన ఈ ప్రయాణంలో కలిసి నడిసిన, నడుస్తున్న, నడవబోతున్న ప్రతి ఒక్కరికీ శత సహస్ర వందనాలు.
ఈ రెండో వార్షికోత్సవ తరుణాన, పుస్తకం.నెట్ రెండో సంవత్సరంలో పని చేసిన తీరుని రి-వైండ్ చేసుకొని, రాబోయే కాలంపై ఆలోచనలూ పంచుకోవడం ఈ వ్యాస ముఖ్యోద్దేశ్యం.
పుస్తకం.నెట్ అంటే..
అందరికీ తెలిసినదే! కాని, పుస్తకం.నెట్ని ఏ ఉద్దేశ్యంతో మొదలెట్టామో, ఆ ఉద్దేశ్యాన్ని ఎప్పుడూ గుర్తుచేసుకుంటూ, దాని నుండి మరీ దూరంగా జరగకుండా చూసుకోవడం మా ముందున్న మొదటి లక్ష్యం.
పుస్తకం.నెట్ ఒక వేదిక – చదువురులకు, తమ తమ పుస్తకానుభవాలను అందరితో పంచుకోవడానికి. చదువరి అంటే ఇష్టపడి చదివే ఎవరైనా. ఈ సైటులో వ్యాసాలు రాయడానికి అంతకు మించిన అర్హతలూ, ఆవగింజలూ మరేవీ అక్కరలేదు. పుస్తకాన్ని సమీక్షించేందుకు కావాల్సిన పాండిత్యం కన్నా, పుస్తకాన్ని అభిమానించే వారికే ఇక్కడ పెద్ద పీట. అలా అని సమీక్షలు వద్దనుకోవటం కాదు. సమీక్షలు మాత్రమే కాక, అనుభవాలగానో, జ్ఞాపకాలగానో, భావోద్వేగాలతోనో పంచుకునేందుకు వేదిక.
కేవలం ఏ ఒక్క పుస్తకంపైనో అయ్యుండి, ఇంత నిడివి ఉండి తీరాలన్న నిబంధనలు ఏవీ లేవు. పుస్తకం పై పరిచయ, సమీక్షా వ్యాసాలు కాక, పుస్తకం కొనుగోలు అనుభవాలు, బుక్ ఫేర్ విశేషాలు, అచ్చెరవొందేలా చదివే పాఠకుల పరిచయాలు – ఇలాంటివేవైనా రాయచ్చు.
పుస్తకం చదవడం గురించిన అనుభవాలను రాయొచ్చు అన్నాము కానీ, సమీక్షలే రాయాలి అనలేదు. ఒక్కొకళ్ళు రాసే తీరు ఒక్కోలా ఉంటుంది. కొందరు మెదడుతో వ్యాసం రాస్తారు. కొందరు మనసుతో వ్యాసం రాస్తారు. కొందరు తము చదివిన పుస్తకం/పుస్తకాల గురించి కథలా చెబుతారు. కొందరు ఆ పుస్తకం చదువుతూ ఉంటే, మనసెలా పరిపరివిధాల పోయిందో చెబుతారు (పుస్తకంలో ఏముంది అన్నది కాకుండా!). అలాగే, కొందరి మాటల్లోకి వ్యంగ్యం దొర్లనిదే మాట్లాడలేరు. అన్నీ వ్యంగ్యాలే వీరికి. మరికొందరికి ప్రతీదీ నవ్వులాటే. పుస్తకం గురించి రాయమన్నా అంతే, వాళ్ళ గురించి రాసుకున్నా అంతే- ఇలా ఒక పుస్తకం గురించో, లేదంటే రచయిత గురించో రకరకాల పద్ధతుల్లో రాయొచ్చు/చెప్పొచ్చు. అన్ని తరహా వ్యాసాలూ పుస్తకం లో రావాలి అన్నదే మా ఆకాంక్ష.
పుస్తకం.నెట్ లో ఎడిటర్లు, ఎడిటింగూ వంటి పద్ధతులు లేవు కనుక, ఇలా అన్ని వ్యాసాలూ వేస్తున్నప్పుడు, ఒక్కోసారి కొందరి భాష గురించి కొందరికి అభ్యంతరాలు కలుగవచ్చు. ఒక్కొక్కసారి కొందరి ‘టోన్’ గురించి కొందరికి అభ్యంతరాలు కలుగవచ్చు. అయితే, సైటు ప్రాథమిక ఉద్దేశ్యం చదువరులకి తమ అభిప్రాయాలు పంచుకునే వేదిక కల్పించడం కనుక, వ్యక్తిగత ఇష్టానిష్టాలకు అతీతంగా, అందరి అభిప్రాయాలకూ చోటివ్వడం సరైన మార్గం అని మా ఉద్దేశ్యం. [అయితే, అసభ్య పదజాలం ఉంటే మాత్రం వ్యాసాలు ప్రచురించలేమని సైటు హోం పేజీలోనే చెప్పేసాము కనుక, మరోసారి చెప్పాల్సిన అవసరం లేదు]
గత ఏడాదిలో పుస్తకం.నెట్:
రెండో ఏడాదిలో పుస్తకం.నెట్ మొదటి ఏడాది కన్నా అన్ని విషయాల్లోనూ చెప్పుకోదగ్గ పెరుగుదల నమోదు చేసుకుంది. వాటిని అంకెల్లో చూడాలంటే:
మొదటి ఏడాదిలో
వ్యాసాల సంఖ్య: 255
వ్యాఖ్యల సంఖ్య:
హిట్ల సంఖ్య : 106,486
సగటున రోజూవారి హిట్లు: 293
రెండో ఏడాదిలో
వ్యాసాల సంఖ్య: 334*
వ్యాఖ్యల సంఖ్య: 2436
హిట్ల సంఖ్య: 238, 385
సగటున రోజూవారి హిట్లు: 650
మొత్తంగా,
వ్యాసాల సంఖ్య: 586
వ్యాఖ్యల సంఖ్య:3,961
హిట్ల సంఖ్య: 344,868
పరిచయం కాబడ్డ, లేక సమీక్షించబడ్డ వివిధ భాషా పుస్తకాలు: నాలుగొందలు!
ఇక్కడ వ్యాసాల సంఖ్యలో గమనించదగ్గ విషయమొక్కటుంది. ఇలాంటి సైట్లు నిర్వహించేవారే దాదాపుగా అందులో ఉన్న కంటెంటునూ సమకూర్చుకోవలసి ఉంటుంది, కనీసం మొదలు పెట్టిన తొలినాళ్ళల్లో. కాని పుస్తకం.నెట్‍కు ముందునుండీ విశేష స్పందన లభించింది. ఈ రోజు ఉన్న ఆరొందల లోపు వ్యాసాల్లో ఈ సైటు నిర్వాహకుల భాగం, ఇరవై శాతానికి మించదు. మిగితా అంతా, అంటే నాలుగొందల పై చిలుకు వ్యాసాలన్నీ నిర్వాహకేతురులనుండే వచ్చాయి. ఏ ఒక్కరిపైనో ఆధారపడకుండా, అలా అని ఏ ఒక్కరినీ వదులుకోడానికి ఇష్టపడకుండా ఈ ప్రస్థానం జరిగింది.
వ్యాఖ్యల సంఖ్య కాస్త misleading అనుకోవచ్చునేమో. ఎంత ప్రయత్నించినా, వ్యాసానికి సంబంధం లేని చర్చలు జరగటం అనివార్యమై కూర్చొంది. కాని, “చెప్పాలని ఉందా?”, “మీరేం చదువుతున్నారు?” శీర్షికలకు వచ్చిన విశేష స్పందన ఒక చర్చా వేదిక ప్రారంభించటానికి మాకు ధైర్యాన్ని ఇచ్చింది. రాచమల్లు రామచంద్రారెడ్డి రచనల పై వ్యాసానికి వచ్చిన స్పందనలు పుస్తకాలను తెల్సుకోవాలి, చదువుకోవాలి అన్న తహతహ స్పష్టంగా కనిపిస్తుంది.
ముప్ఫై కు పైగా ఇంటర్వ్యూలు జరిపాం. కొత్తపల్లి, మంచి పుస్తకం, ప్రాజెక్ట్ గుటెన్‍బర్గ్, ఏవీకెఎఫ్ వారితో జరిపిన ముచ్చట్లు మాకు ఎంతో స్ఫూర్తినిచ్చాయి. తెలుగులో మీకు నచ్చిన పుస్తకాలు, మీరు అత్యుత్తమం అనుకునే పుస్తకాల గురించి ఫోకస్ నడిపాం. టివి నైన్ వారు నిర్వహిస్తున్న పుస్తక పరిచయం కార్యక్రమం గురించి ముందుగా తెలపాలన్న ఉద్దేశ్యంతో వారిని సంప్రదించి, కొన్ని వారాల పాటు కార్యక్రమ సమాచారాలని అందించాం.
ఇక్కడ పరిచయమవుతున్న పుస్తకాల పరిధిని పెంచాలని, సాంకేతిక పుస్తకాల గురించిన ఫోకస్ నిర్వహించాం. దీనికి స్పందన అంతగా రాకున్నా, ఇట్లాంటి పుస్తకాలకూ ఈ సైట్ వేదిక కాగలదు అన్న మెసేజ్ చేరిందనే అనుకుంటున్నాము. అలాగే, ఆడియో పుస్తకాలకు కూడా స్థానం కల్పించాలన్న ఆలోచనను కొద్దిగా నిర్వర్తించాం.
కొత్త శీర్షికలు:
జాలపఠనం: ఈ కాలంలో అంతర్జాలం మన పాఠాకావశ్యకతల్లో అంతర్భాగం అయిపోయింది. అందుకని పుస్తక పఠనంతోపాటు, జాలపఠనాల గురించీ పంచుకునే వీలుగా “జాలపఠనం” శీర్షిక మొదలెట్టబోతున్నాం.
ఇందులో మీరు జాలంలో (వెబ్‍లో) చదువుతున్న వాటిని గురించి పంచుకోవచ్చు. అవి సాహిత్యానికి సంబంధించినవి మాత్రమే కానవసరం లేదు. ఏ రంగానికి సంబంధించినవి అయినా సరే – అభ్యంతర, అసభ్య విషయాలు తక్క – మీరు పంచుకోవచ్చు. ఇట్లాంటివి ఓపిక, తీరికను బట్టి, వారానికో, నెలకో, మూడునెళ్లకో రాసుకోవచ్చు.
ఇందులో ముఖ్యంగా ఉండవలసిన అంశాలు: చదివిన అంశం ఏమిటి? జాలంలో దాని లంకె? దానిపై మీ ఆలోచనలూ, అభిప్రాయాలు. ఒకే లంకె గురించి పూర్తి వ్యాసం రాసినా సరే! (అంత సరుకుంటే!) లేదా, అనేక లెంకల సమాహారంతో ఒక వ్యాసం రాసినా, సరే!
త్వరలో ఒక నామూనా వ్యాసం ప్రచురిస్తాం. మిగితావాటిలానే, “ఇలానే ఉండాలి” అన్న పట్టింపు దీనికి కూడా లేదు.
పత్రికల పరిచయం: మీరేవైనా పత్రికకు అభిమానులా? ప్రతీ సంచికలోని, ప్రతీ శీర్షికా చదివితే గాని మీకు తృప్తి ఉండదా? అలా అయితే, మీ శీర్షిక మీరు మీ అభిమాన పత్రికను / సంచికను పరిచయం లేక సమీక్షించవచ్చు. మీకు నచ్చిందో, లేదో తెలపవచ్చు
ఈ విషయంలో కూడా సాహిత్యానికో / ఫలనా భాషకో పరిమితం కానవసరం లేదు. పత్రిక సాహిత్యేతర విషయాలకు సంబంధించి కావచ్చు. తెలుగేతరమైనది కావచ్చు. జాలపత్రికలైనా కావచ్చు.
తెలుగు సాహిత్యం పై ఆంగ్ల వ్యాసాలు: తెలుగు సాహిత్యంపై ఆంగ్ల వ్యాసాలను ఆహ్వానిస్తున్నాం. దీనికి రెండు కారణాలు:
౧. తెలుగు పుస్తకాల గురించి, ప్రపంచానికి తెలియజెప్పే చిరు ప్రయత్నం.
౨. తెలుగక్షరాలను చూడగానే “స్కిప్” చేసేసే తెలుగువారికి, ఆంగ్లంతో మొదలెడితే కాస్త గుణం కనిపిస్తుందన్న దూ(దు)రాలోచన!
అనుకుంటున్న మరికొన్ని విషయాలు (వీటిని అమలుపర్చడానికి ఇంకా సమయం పడుతుంది, కాని వీటిపై ఆసక్తి ఉన్నవాళ్ళతో పని మొదలెట్టే వీలు కలుగుతుందని, ఈ ముందస్తుగా చెప్పటం.)
రచయిత పేజీలు: రచయితలకు సంబంధించి, బయోడేటా నమూనాలో పేజీలు సృష్టించాలని. ఇందులో రచయితల గురించి వీలైనన్ని విషయాలు ఒక చోట ఉంటాయి. అలానే రచయితలపై వ్యాసాలు కూడా!
మరువలేని మాటలు: ఆంగ్ల సాహిత్యానికి సంబంధించిన ఎవరి మాటలైనా (కొటేషన్స్) చాలా తేలిగ్గా దొరుకుతున్నాయి. కాని తెలుగు సాహిత్యంలో మరువరాని, మరువలేని మాటలు, వాక్యాలు అంతర్జాలంలో కనిపించడం లేదు. అందుకని కొత్తగా ఈ శీర్షికను మొదలెడుతున్నాం. ముందుగా, మీరు చదివిన తెలుగు సాహిత్యంలో మీకు నచ్చిన మాటలను, ఎక్కువగా ఉంటే, ప్రత్యేక వ్యాసంగానూ, తక్కువగా ఉంటే, మీ పరిచయ / సమీక్షా వ్యాసంలో భాగంగా రాయండి. త్వరలో దీనికో ప్రత్యేక విభాగాన్ని మొదలెట్టే ఆలోచన, అప్పుడు అక్కడే పంచుకోవచ్చు.
గత రెండు సంవత్సరాల్లాగానే, మీరు మీ సహాయసహకారాలు అందించి, విరివిగా వ్యాసాలు రాసి, మన పుస్తకం.నెట్ పురోగతికి తోడ్పడగలరని ఆశిస్తున్నాము. మా ఈ ప్రయత్నాన్ని సాంకేతిక సహాయం అందిస్తున్న పొద్దువారికి మా కృతజ్ఞతలు.
ప్రపంచవ్యాప్త తెలుగు సాహిత్యాభిమానులకు వందనాలు!
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు!
ఇవి గాక, మీ సలహాలూ, సూచనలూ ఇక్కడ వ్యాఖ్యల ద్వారానో, editor@pustakam.net కు వేగు ద్వారా తెలియజేయగలరు.
పుస్తకం.నెట్ ఏడో వార్షికోత్సవం. | పుస్తకం
[…] రెండో సంవత్సరం […]
మల్లిన నరసింహారావు
ఎందుకో సరిగ్గా తెలియదు, కానీ ఈమధ్యన చాలాకాలం నుంచీ అంతర్జాలంలో తెలుగక్షరాలలో ఉన్నదానిని మాత్రమే చదవటానికి ఇష్టపడుతున్నాను. ఆంగ్లలిపిలోని సంగతులు ఎందుకో నాకు చదవబుద్ధేయటం లేదు. ఎక్కువగా అటువంటివానిని స్కిప్ చేస్తున్నాను. ఇటువంటి సమయంలో పుస్తకం.నెట్ వారు ఆంగ్లంలో కూడా ప్రచురిద్దామనుకుంటున్నారని వింటే ఏదో గొంతు కడ్డం పడ్డట్టుగా అనిపిస్తుంది. ప్రస్తుతానికి దయచేసి ఆ ప్రయత్నాన్ని విరమించమని నా విన్నపం. పైన రవిగారి అభిప్రాయమే నాది కూడా. గ్రహించగలరు.
రామ
“తెలుగక్షరాలను చూడగానే “స్కిప్” చేసేసే తెలుగువారికి, ఆంగ్లంతో మొదలెడితే కాస్త గుణం కనిపిస్తుందన్న >>దూ(దు)రాలోచన!”
నాదీ రవిగారి అభిప్రాయమే. గుర్రాన్ని ఈవిధంగా నీళ్ళ దగ్గరకి తీసుకురావచ్చుకాని, దానికి తాగడం ఇష్టం లేకపోతే మనం బలవంతం చెయ్యడం ఎందుకు?
నిరుత్సాహపరచడానికి కాదు – మీ విలువైన సమయాన్ని దాన్ని వృధా చేసే వాళ్ళకి కేటాయించకుండా చూడడానికే.
lyla yerneni
Very clean and crisp writing. From the first sentence to the last. I liked it a lot.
lyla
లలిత (తెలుగు4కిడ్స్)
పుస్తకం.నెట్ కి అభినందనలు.
మాలతి గారి వ్యాఖ్య చూశాక మళ్ళీ పూర్తిగా చదివాను.
“మరువలేని మాటలు” ఆలోచన చాలా బావుంది.
బాగా స్పందన వస్తుందని ఆశిస్తున్నాను.
నాకు వీటి ఉపయోగం / సరదా చాలా ఉంది.
కొత్త శీర్షికలలో జాలపఠనం చేర్చినందుకు సంతోషం.
అప్పుడప్పుడూ పంచుకోవలనిపించే ఆలోచనలకి వేదిక దొరికింది.
మొత్తానికి రాయడానికీ, చదవడానికీ ఉత్సాహపరుస్తున్నారు.
Best Wishes.
రాఘవ
అలాగా. శుభం భూయాత్.
మాలతి
బాగున్నాయి మీ కార్యకలాపాలు సూక్ష్మంగా.
మరువలేని మాటలు – నాకు ఈ ఊహ నచ్చింది. అక్షరలక్షలు!
విజయవర్ధన్
వార్షికోత్సవ, నూతన సంవత్సర శుభాకాంక్షలు.
కొత్తపాళీ
పుట్టినరోజు శుభాకాంక్షలు.
తెలుగు సాహిత్యాన్ని గురించి ఆంగ్లవ్యాసాలు – మంచి ఆలోచన. తప్పక అమలుచెయ్యండి. మిగతా ప్రతిపాదనలు కూడా బాగున్నాయి.
ఒకసారి సైటు మొత్తం రూపాన్ని కొత్తగా తీర్చి దిద్దే ఆలోచనని పరిశీలించండి. వ్యాసాలకి పెడుతున్న టేగులు ఉపయోగకరంగా లేవు – అలాగే వర్గీకరణలు కూడా. మీరు ప్రచురించిన ప్రతి వ్యాసమూ సమీక్ష కాదు. పరిచయం – సమీక్ష – విమర్శ: ఈ ముడిటికీ తేడాని గుర్తించాలి. ఈ మూడిటిలో ఒదగని రచనల్ని కలగురగంపలో వేసుకోవచ్చు.
ఎన్ వేణుగోపాల్
పుస్తకం.నెట్ నిర్వాహకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు, పుట్టినరోజు శుభాకాంక్షలు.
పుస్తకం ఇలాగే నిరంతరం దినదినాభివృద్ధి కావాలని ఆకాంక్షిస్తున్నాను
(దినదినాభివృద్ధి అని రాస్తుంటే ఒక గ్రంథాలయ సందర్శకుల పుస్తకంలో సంతకం చేస్తూ శ్రీశ్రీ చేసిన చమత్కారం గుర్తొస్తోంది. “ఈ గ్రంథాలయానికి దినదినాభివృద్ధి కోరను” అని రాసి ఫుల్ స్టాప్ పెట్టి నిర్వాహకుల చిన్నబోయిన ముఖాల్లోకి చూసి, ఒక్క క్షణం ఆగి, ఆ ఫుల్ స్టాప్ ను కామాగా మార్చి, “క్షణక్షణాభివృద్ధిని కోరుతాను” అని రాశాడట!!)
అంతర్జాలం మీది పత్రిక గనుక పుస్తకం.నెట్ కూడ క్షణక్షణాభివృద్ధి సాధించగలదనీ, సాధించాలనీ ఆకాంక్షిస్తూ…
తా.క. కమ్మెంట్లు బదులు వ్యాఖ్యలు అనీ, హిట్లు బదులు చూసినవారి సంఖ్య అనీ అంటే బాగుండేదేమో?!
Aruna Pappu
పుస్తకానికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అక్షర స్నేహితులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
చౌదరి జంపాల
పుట్టినరోజు, నూతన సంవత్సర శుభాకాంక్షలు.
నడుపుతున్న వారికీ, వ్రాస్తున్నవారందరికీ కృతజ్ఞతలు.
మందాకిని
నేను ఎంతగానో అభిమానించే పుస్తకం గురించి మరిన్ని వివరాలు వినటం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది.
నిర్వాహకులకు, పుస్తకం అభిమానులకు అభినందనలు.
పుస్తకం.నెట్ కు రెండేళ్ళోచ్! « sowmyawrites ….
[…] రెండేళ్ళు పూర్తైన సందర్భంగా పుస్తకం.నెట్లో వచ్చిన వ్యాసం ఇక్కడ చదవొచ్చు. […]
రవి
తెలుగు సాహిత్యంపై ఆంగ్లంలో వ్యాసాలు. ఇది వినగానే చేదుగా అనిపిస్తోంది. తెలుగు పుస్తకాల గురించి ప్రపంచానికన్నా, తెలుగువాళ్ళకు చెప్పవలసిన అవసరమే ఎక్కువయిన రోజులివి. ఆ అవసరం తీరితే ప్రపంచం మనలను వెతుక్కుంటూ వస్తుంది. అలా వస్తేనే మనకు విలువ. మనం ఎవడికో తెలియజెప్పడం – ఊహూ, బావోలేదండి.
>>తెలుగక్షరాలను చూడగానే “స్కిప్” చేసేసే తెలుగువారికి, ఆంగ్లంతో మొదలెడితే కాస్త గుణం కనిపిస్తుందన్న >>దూ(దు)రాలోచన!
అలాంటి వాళ్ళను వదిలించుకోవడం ఉత్తమం.
ఏమైనా మీ నిర్ణయం. మీరు మనఃస్ఫూర్తిగా చేయాలనుకుంటే చేసేయ్యడమే మంచిది.
SRRao
పుస్తకం.నెట్ కు రెండవ వార్షిక మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు
SRRao
శిరాకదంబం
సిరిసిరిమువ్వ
పుస్తకానికి జన్మదిన శుభాకాంక్షలు. మీ పుస్తకం ఇలాగే మరిన్ని పుట్టినరోజులు మరింత విజయవంతంగా జరుపుకోవాలని ఆశిస్తున్నాను.
పుస్తకం.నెట్‌తో రెండో ఏడాది..పండగే పండగ! « ఊహలన్నీ ఊసులై..
[…] Pustakam.net’s recap post here. […]