భరణికి ఒకట్రెండ్మూణ్ణాలుగైదు వీరతాళ్ళు!
ఇటీవలే ముగిసిన హైద్రాబాద్ పుస్తక ప్రదర్శనలో తనికెళ్ళ భరణి నాటికలు పుస్తకరూపేణా ఆవిష్కరించబడ్డాయి అని తెల్సుకొని, ఆయన ఫాన్యులకు ఆ మాట చేరవేశాను గాని, నేను కొనలేదు. ఆయణ్ణి సినిమాల్లో చూడ్డం తప్పించి, ఆయన రచనల్ని ఏవీ చదవలేదు. హాసం తదితర పత్రికల్లో ఆయన రచనలు వస్తుండేవి అని వినటమే కాని, చదవలేదు. ఇవి కొనాలంటే కాస్త భయం వేసింది, సినిమాల గురించో, సినిమా వాళ్ళ గురించో బానే రాస్తుండచ్చు గాని, నాటికలంటే రిస్క్ అనిపించింది.
రిస్క్ ఇచ్చే కిక్ కోసం పుస్తకాలు కొన్నాను. దిగితే గాని లోతు తెలియనట్టు, ఈ పుస్తకాలు చదివితే గాని తెలీలేదు, పొందిందేమిటో, పోగొట్టుకున్నదేమిటో..
నాటికలు చూడాలిగాని, చదవితే అంత బాగోవు అన్న వాదనలో కొంత బలం లేకపోలేదు. నాటకాల్లో సంభాషణలు మాత్రమే చదువుకోడానికి వీలుంటుంది. నటుల హావభావాలూ, స్థలకాలాల వర్ణనలు ఇవేవీ ఉండవు. అవన్నీ మనమే ఊహించుకోవాలి.
కానీ చూసే అవకాశం లేనప్పుడు చదువుకోవడమే ఏకైక మార్గాంతరం.
ఇంతకీ భరణి నాటికలను గురించి రాయాలంటే నేను సరిపోను. నేనేమిటో అనుకొని కొంటే, ఇవి ఊహాతీతంగా ఉన్నాయి. బహుశా, తెలుగు నాటకరంగంతో నాకెలాంటి పరిచయం లేకపోవటం అనుకుంటాను. అందులోనూ, ఇవ్వన్నీ నేను పుట్టకముందు రాసిన / వేసిన నాటికలాయే!
“ఛల్ ఛల్ గుర్రం” అని ఒక నాటిక – “సరదా” నాటిక అని భరణిగారే చెప్పుకున్నారు. తాగుడు వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి చెప్పీ చెప్పనట్టుగా ఉంటుంది. కొంచెం చప్పగా ఉంటుంది. ఘాటైన బిర్యాని తిన్నాక, చప్పిడి కూడు తిన్నట్టు. కథ, కథనం చాలా వరకూ పసిగట్టేయవచ్చు. కాకపోతే, భరణి గారి శైలిలో ఒక అంశం. అంత ప్రాధాన్యత లేని పాత్రని, ముక్తాయింపులో బాగా ఎలివేట్ చేయటం. మధ్యలో ఎక్కడో కనుమరుగయ్యిపోయింది అనుకున్న దాన్ని తీసుకొచ్చి, ముగింపుకి పూర్ణత్వం తెప్పించడం. ఈ ఛల్ ఛల్ గుర్రం నాటికలో కూడా వీటి ఛాయలు కనిపిస్తాయి.
నాకు అన్నింటికన్నా ఎక్కువ నచ్చిన నాటిక, “గోగ్రహణం”! అసలు దీని ముఖచిత్రమే “వావ్” ఫీలింగ్ కలిగిస్తుంది. దాదాపుగా కథ చెప్పేస్తుంది. దాదాపుగా మాత్రమే! పూర్తిగా చెప్పద్దు. పూర్తిగా నాటకం అర్థం కావాలంటే, దాన్ని చదవాల్సిందే! చదువుతూ పోతుంటే “వావ్!”లు వెలువల్లే పుట్టుకొచ్చాయి. నగ్నంగా పడున్న స్త్రీ. ఆమె వైపు గురి పెట్టిన తుపాకి. ఆ పై పంజా విసరబోతున్న పులి. ఇందులో ఒక స్త్రీ పాత్ర, ఆరుగురు మగ పాత్రలు. అనుకున్నట్టే, ఇది ఆడవాళ్ళ కడగండ్లకు అద్దం పట్టడానికి చేసిన ప్రయత్నం. అయితే, “హయ్యో, స్త్రీ ఇన్ని బాధలు పడి..పోతుందే!” అన్న మెలోడ్రామాతో సాగక, as-a-matter-of-fact గా సాగుతుంది. కథనంలో ఉన్న వేగం వల్ల, తక్కినవి పెద్దగా ఆనవు. ముఖ్యంగా, “ప్రేమించడానికి హృదయం ఒక్కటే వుంటే చాలదమ్మా.. వెన్నుముక్క కూడా కావాలి.”, “దొంగతనం చేసిన నేరానికి దొంగల్ని జైల్లో వేస్తే, ఆడదై పుట్టిన నేరానికి పెళ్ళిచేసి సంసారమనే జైల్లో తోస్తారు కాబోలు” లాంటి మాటలు.
పొరపాటున ఎవరైనా, ఎప్పుడైనా ఈ నాటిక వేస్తే, తప్పకుండా చూడాలి. ఇది ఈ కాలపు పరిస్థితులకు ఔట్డేటెడ్‍గా అనిపిస్తుంది, ఖచ్చితంగా. అలానే డిగ్రీలున్నా ఉద్యోగాలు లేక, వీథిన పడ్డ ఇద్దరు, యోగి, జోగిల కథ – కొక్కొరోకో! ఇందులో రెండే పాత్రలు.
జంబూద్వీపం అన్న నాటిక ఒక పొలిటికల్ సెటైర్. ఇది ముందంతా విపరీతంగా నవ్వించి, చివరాఖురన భారీగా నిట్టూర్చేలా చేస్తుంది. నాకీ నాటకం, on-the-surface అర్థమయ్యింది, కాని ఆలోచించే కొద్దీ, ఆయన సృష్టించిన పాత్రలు, పరిస్థితులకు సమాజంలో ఏవి సరితూగుతాయో అంతుపట్టలేదు. ఓ సారి చదివి, పక్కకు పడేసే రచనలు కావివి!
గార్థభాండం అన్నది మరో నాటిక. ఇదీ పొలిటికల్ సెటైరే! చదువుతుంటేనే బోలెడు నవ్విస్తుంది. గార్థభాండం అంటే గాడిదగుడ్డు. (అసలు తెలుగులో ఈ పదబంధం ఎలా ఏర్పడింది?) సెటైర్లలో భరణి సెటైర్లే వేరయా!
నాటికలన్నీ సమాజంలో ఉన్న అస్తవ్యస్థతకు అద్దం పట్టే విధంగా ఉన్నాయి. హాస్యాన్నీ, వ్యంగ్యాన్నీ ప్రధానంగా చేస్తూనే, అవకతవకలపై ’కలం’ ఝుళిపిస్తూనే ఉన్నారు. ఇందులో ఒక పుస్తకం వెనక అట్ట మీద, “ఈ నాటిక రాయడానికి రచయితకి పెన్నొకటే చాలదు – వెన్నెముక కూడా కావాలి” అని నగ్నముని గారన్న మాటలు ఉన్నాయి. రాయడానికే కాదు, చదవడానికి కూడా కావాలి. మనం సుఖశాంతులతో ఉంటే, చుట్టూ ఉన్న లోకం కూడా అలానే ఉందనే భ్రమలో హాయిగా బతికేస్తున్న మనకి, ఈ నాటికలు చేదు వాస్తవాలను గుర్తు చేస్తుంది.
ఒలింపిక్స్ మరియు ఇతర ప్రముఖ ఆరంభోత్సవాల్లో, పేద్ద.. పే..ద్ద బుడగల్లో మనుషులు నాట్యం చేస్తున్నట్టు చూపిస్తారు. అచ్చం అలానే, ఈ కాలపు సగటు మనిషి ఒక బుడగలో బతుకుతున్నాడు. ఆ బుడుగ లోపల, అతని జీవితం, అతని కుటుంబం, అతని సౌఖ్యం, అతని బాధలు ఇవే ఉంటాయి. బయట ప్రపంచంలో ఏమేమి జరుగుతున్నా, వాటి పరిణామాలు అతనికి తగలనంత వరకూ పట్టించుకోకుండా బతకడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ నాటికలు ఆ బుడుగను పేల్చి, మనం బయటకి తొంగి చూసేలా ఉంటాయి. వరకట్నం, నిరుద్యోగం ఇప్పటి మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద సమస్యలు కాకపోవచ్చు, ఓ రెండు దశాబ్దాల క్రితం ఉన్నట్టుగా లేకపోవచ్చు. కాని అవే రూపాంతరం చెందో, లేక అంతకు మించిన సమస్యలేవో వచ్చాయి. వాటిని గుచ్చి గుచ్చి గుర్తు చేస్తాయి. బాగ అంటిస్తాయి, చురకలు.
అసలు పుస్తకం తెరవగానే వేస్తారు ఓ చురక, “మొదటి, మలి ప్రచురణల మధ్య చాలా గ్యాప్ రావడానికి కారణం, నాటికలు కదా, ఎవరూ కొనరు, కొన్నా చదవరు!” అని.
నాకూ చదవడం రాదు. ఏదో, తిరగేయడం తప్ప! అలా తిరగేసి, “ఓహో, ఫలానా పుస్తకాలు ఉన్నాయోచ్” అని చెప్పడమే ఈ వ్యాసోద్దేశ్యం. ఇది సమీక్షా కాదు, విమర్శా కాదు, విశ్లేషణా కాదు. అట్టల మీద, అట్టల మధ్య ఉన్న విషయాలను మాత్రమే తెలియజెప్పే ప్రయత్నం. అలా కాకుండా, సమగ్ర విశ్లేషణను అందించగలవారుంటే, ఇక్కడ పంచుకునే ఆసక్తి ఉన్నవారు తప్పక రాయండి. మాకూ కొత్త విషయాలు తెల్సుకొని, చదువుకోవడం అలవాటు పడుతుంది.
తనికెళ్ళ భరణి ఈ నాటికల గురించి చెప్పడానికి, ఆయనదే ఒక డైలాగు.
“ఎవడైనా కోపంగా కొడతాడు. లేకపోతే బలంగా కొడతాడు. ఈడేంట్రా చాలా శ్రద్ధగా కొట్టాడు. ఏదో ఒక కోట కడుతున్నట్టు, గులాబి మొక్కకు అంటు కడుతున్నట్టు, చాలా జాగ్రత్తగా పద్ధతిగా కొట్టాడురా!”
వ్యంగ్యం, హాస్యం, సెటైర్, సామాజిక స్పృహనీ ఒకేసారి కలిగించే ఈ పుస్తకాలను చదివే అవకాశం వస్తే మాత్రం జారవిడ్చుకోకండి.
చివరిగా, ఈ పుస్తకాలపై ముఖచిత్రాలు అద్భుతంగా ఉన్నాయి. అసలు వాటికేసి చూస్తుంటే, నాటికలో ఎన్నెన్ని పొరలున్నాయో, వాటిని వలుస్తూ పోతుంటే, ఎన్నెన్ని సంగతులు తెలుస్తాయో అని అనిపిస్తుంది. అబ్బురపరిచాయి.
__________________________________
గోగ్రహణం, జంబూద్వీపం, గార్థభాండం, కొక్కోరోకో, ఛల్ ఛల్ గుర్రం (నాటికలు)
రచయిత: తనికెళ్ళ భరణి
ధర: ఒక్కోటి పాతిక రూపాయలు (ఐదూ కొంటే వంద!)
ప్రతులకు:
సౌందర్యలహరి
8-3-678-6, ప్రగతి నగర్,
యూసఫ్‍గూడ,
హైదరాబాద్ -500045
lakshmi narayana bv
manchi samacharam ichaaru.. inkaa marikonnitini koodaa parichayam cheyandi
వేణూశ్రీకాంత్
చాలా ఆసక్తిని కలుగచేశారు.. సాధ్యమైనంత త్వరలో కొని చదివేస్తాను..