జాబిలి నేర్చిన వెన్నెల పాట = వేసవిలో వచ్చిన ‘వెన్నెల పాట’

రాసిన వారు: యరమాటి శశి ప్రపూర్ణ
[ఈ వ్యాసం మొదట మే 24, 1992, ఉదయం పత్రిక ఆదివారం అనుబంధం లో వచ్చింది. పుస్తకం.నెట్ లో ప్రచురించేందుకు పంపిన అనిల్ పిడూరి గారికి ధన్యవాదాలు – పుస్తకం.నెట్]
********************
మనిషి జీవితంలో అరమరికలు లేని అందమైన దశ బాల్యం. పాపపుణ్యాలూ, కష్టనష్టాలూ, ప్రపంచం పోకడలూ ఏమీ తెలియని వయస్సది. అమ్మ ఒడిలోనో, తాతయ్య బొజ్జ మీదనో పడుకుని, లాలి పాటలూ, రామ కథలూ వింటూ, అచ్చమైన మనస్సు ఫలకం మీద అందమైన దృశ్యాలను ఆవిష్కరించుకుంటూ, చిన్నారులు చిదానంద మూర్తులై ఉంటారు. ఆ దశలో మనం నేర్పిందే వేదం. అలా నేర్పడానికి పుట్టిందే బాల సాహిత్యం. ఆదిలో పిల్లల పదాలన్నీ ఇళ్ళల్లో అమ్మలూ, బామ్మలూ, అల్లిన బొమ్మల పదాల అల్లికలే! ఆ తరువాత మహా మహా కవులు కూడా ఏదో ఒక దశలో బాల సాహిత్యాన్ని సృష్టించారు. ఆధునిక యుగ కర్త గురజాడ కూడా –
“ మిరప కాయ బజ్జి
మినప్పప్పు సొజ్జి” అంటూ పిల్లాడిలా పదాలు కట్టారు. ఆ తరువాత కొందరైనా పిల్లల సాహిత్యం కోసం కృషి చేశారు. రోజులు మారి పోయాయి. మమ్మీ, డాడీ సంస్కృతి మన సమాజాన్ని ఆపాద మస్తకం ఆవహించింది. “చిట్టీ చిలకమ్మ! అమ్మ కొత్తిందా” అని పాడుకొనే పిల్లలు ఏరీ! వాళ్ళలా పాటలను నేర్చుకుని పలికినా ఊరుకునే పెద్దలూ లేరు. మన పిల్లలు “ అ, ఆ, ఇ, ఈ ….. లతో అక్షరాభ్యాసం చేయడం లేదు. ముద్దు పలుకులు నేర్చుకునేటప్పుడే ఇంగ్లీషు a b c d ” లు రుద్దుతున్నాం. అ -అమ్మ ; ఆ – ఆవు అని దీర్ఘాలు తీయడం మన పిల్లలకు రాదు. “ఎ ఫర్ ఆపిల్ అంటూ పిల్లకాయలు ఎగురుతూంటే మనం వాళ్ళ ముఖాల్లో డాక్టర్లనో, ఇంజనీర్లనో చూసి ఉబ్బి తబ్బిబ్బవుతున్నాం. గోచీ పెట్టుకోవడం రాని దశలోనే గొట్టాం పేంట్లు తొడిగి నర్సరీలకూ, L.K.G. లకూ తోలి,
వాళ్ళ నోళ్ళలో నానుతున్న rhymes విని మురిసిపోతున్నాం. ఇట్టి దశలో ఒకావిడ అమాయకంగా పిల్లల కోసం గేయాలు రాశారు. ఆమె పేరు పి.కుసుమ కుమారి. రాస్తే రాశారు గానీ, “జాబిలి నేర్చిన వెన్నెల పాట” అంటూ పరమ కవితాత్మకమైన పేరు పెట్టి, మరీ అందంగా పుస్తకం అచ్చు వేశారు. పిల్లల కోసం రాసిన ఈ పుస్తకంలో పేజీ పేజీకి పిల్లలు గీసిన బొమ్మలను సూపర్ ఇంపోజ్ చేసి, “ఇది పిల్లల పుస్తకం సుమా!” అని ముఖం మీద గుద్ది మరీ చెప్పారు. బాల సాహిత్యానికి ఆదరణ లేని ఈ కాలంలో ఈ అతి సాహసం చేసినందుకు రచయిత్రిని అభినందించాల్సిందే! ఈ పుస్తకంలో మొత్తం 30 గేయాలున్నాయి. అన్నీ తేట తెలుగులో రాసినవే!

“ పట్టెడంచు పావడాలు – పాపాయికి
పట్టె మంచం పావు కోళ్ళు – తాతయ్యకు”
– అని మొదలై,
“పెద్ద వాళ్ళందరినీ పిల్లలుగ పుట్టించు దేవుడూ!”
అనే అమాయకమైన “ఒక్క కోరిక”తో పుస్తకం ముగుస్తుంది. మధ్యలో ఎన్నో రంగులు, ఎన్నో వెలుగులు. పుస్తకం ఒక హరివిల్లై కనిపిస్తుంది. ఈ గేయ రచనలో రచయిత్రి ఒక విలక్షణమైన రీతిని అవలంబించారు. ప్రాచీనమైన మన సంస్కృతీ సంప్రదాయాలనూ , పౌరాణిక గాథలనూ చెప్పడానికి ప్రతీకలను ఎంచుకున్నారు.
“ విభూతి పండు – వెండి కొండలు
కస్తూరి బొట్టు – పాల సముద్రం
తామర పువ్వు – వేద పారాయణం –
తిరుగో తిరుగు, స్వామీ స్వామీ – ప్రదక్షిణం”
-ఇలా నాలుగైదు పాదాల్లో కేవలం ప్రతీకలతో త్రిమూర్తులను రూపు కట్టించారు.

అలాగే,
“ అష్ట దిగ్గజం – భువన విజయం
కృష్ణ రాయలు – ఆముక్త మాల్యద
సాల గ్రామం – నారాయణాయ నమోస్తుతే!
సైకత లింగం – నమ శ్శివాయ”

అంటూ ప్రతీకలతో ఆంధ్ర దేశం గురించి చెప్పడానికి ప్రయత్నించారు.
రామాయణం గురించి కూడా కట్టె, కొట్టె, తెచ్చె”
అన్నట్లు మూడు ముక్కల్లో కొత్త ప్రతీకలతో చెప్పారు. ఈ పద్ధతి అన్ని గేయాల్లోనూ రాణించింది. చమత్కారం, హాస్యం తదితరాలు ఉన్నా మన గత సంస్కృతిని ఈ నాటి పిల్లలకు చెప్పాలనే తపనే మొత్తం గేయాలన్నిటిలోనూ కనిపిస్తుంది. రచయిత్రి చేసిన ఈ ప్రయత్నాన్ని తప్పనిసరిగా అభినందించాలి.

You Might Also Like

One Comment

  1. sarma p.

    జాబిలి నేర్చిన వెన్నెల పాట – పేరు చాలా నైస్ గా ఉన్నది.
    ఇలాంటి పుస్తకాలలోని చిన్నారి గీతాలను,
    రేఖామాత్రంగా వీలైనంత వరకూ పూర్తి పాటలనే రాస్తే మేలు.
    రాజేశ్వర్ శర్మ

Leave a Reply