నాన్న-నేను : చిన్న పరిచయం
చిన్నప్పుడు బుజ్జాయి గారి కార్టూనులు చూస్తూ ఉన్నప్పుడు, ఒకసారి ‘డుంబు’ కార్టూన్లు కొన్ని కలిపి వేసిన చిన్న పుస్తకం ఒకటి మా నాన్న తెచ్చారు. అందులో చదివాను – బుజ్జాయి కృష్ణశాస్త్రి గారి కొడుకని. అయితే, అప్పటికి కృష్ణశాస్త్రెవరో నాకు తెలీదనుకోండి. కానీ, వాళ్ళు రాసినదాన్ని బట్టి ఆయన ఎవరో పెద్దాయన అనుకున్నా అనమాట. కార్టూనులు బాగా ఎంజాయ్ చేసిన విషయం మాత్రం జ్ఞాపకం ఉంది. పెద్దైపోయాక (అదే, అలాగని అందరూ భావించడం మొదలుపెట్టాక…) బుజ్జాయి గారి బొమ్మలు మరి చూసినట్లు జ్ఞాపకం లేదు. ఇటీవలే ‘నాన్న-నేను’ అన్న ఆయన స్వీయకథ గురించి తెలిసింది. నాచేతికి రాగానే చదవడం మొదలుపెట్టి రెండు మూడు గంటల్లోనే పూర్తి చేసేసాను. ఇటీవలి కాలంలో ఇలా ఏకబిగిన ఒక పుస్తకంపూర్తి చేసిన సందర్భాలు తక్కువే.
పేరులో చెప్పినట్లు, ఇది కృష్ణశాస్త్రిగారితో బుజ్జాయిగారి కథ. బుజ్జాయి గారిని కృష్ణశాస్త్రి గారు అందరిలా పాఠశాలకు పంపకపోవడంతో, ఆయనకి సంప్రదాయ పద్ధతుల్లో విద్యాభ్యాసం జరుగలేదు. అయితే, దీని వల్ల ఆయనకి కీడు జరిగిందనుకోవచ్చు కానీ, మేలు కూడా చాలా జరిగింది. ఇలా సంప్రదాయిక చదువుల వాసన సోకకుండా కూడా, బుజ్జాయిగారు తనకంటూఓ పేరు ఏర్పరుచుకోవడం, తండ్రి నీడలో ఉండకపోవడం నాకు బాగా నచ్చిన అంశాలు. కృష్ణశాస్త్రి గారికి కొడుకుపై ఉన్న వెర్రి అభిమానం చూసి నాకు ఆశ్చర్యం కలిగింది, ఎందుకో గానీ. ఇలా తండ్రి వెన్నంటే ఉన్నందుకేమో,ఆకాలం నాటి గొప్పవారెందరితోనో చాలా దగ్గరగా మెలిగారు బుజ్జాయిగారు. శ్రీశ్రీ అంతటివారు బుజ్జాయిగారికి సభలో బోరు కొడుతోందని, ఎత్తుకుని షికారు తీసుకెళ్ళి ఆడించారంటే, ఏమని స్పందించగలం, అవాక్కై పేజీని చూడ్డం తప్పించి! ఇలాగే, విశ్వనాథవారు బుజ్జాయిని ఏడిపించిన సందర్భం ఒకటి ఉంది. అలా కవీంద్రుల మధ్య చిన్నపిల్లవాడిగా ఇంద్రభోగాలు అనుభవించారన్నమాట 🙂 అలా, అప్పటి రచయితలు, కవులు, ఇతర ప్రముఖులందరితోనూ తనకి గల అనుభవాలను చిన్న చిన్న కథల్లా చెబుతూ పోయారాయన… చదువుతూ పోతాము మనము. బుజ్జాయి గారితో పాటు మనమూటైం ట్రావెల్ చేస్తాము.
అసలింతకీ అలా ఆపకుండా చదివించేందుకు ఇందులో ఉన్నదేమిటి? అంటే – తాతగారో, అలాంటి మరొకరో పడక్కుర్చీలో కూర్చునో, డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చునో -వాళ్ళ చిన్నప్పటి కబుర్లు, అప్పటి అనుభవాల గురించి చెబుతూ ఉంటే వినడం అంటే చచ్చేంత ఇష్టం నాకు. ఈ పుస్తకం అంతా అదే పంథాలో సాగింది.బుజ్జాయి గారు “ఈ పుస్తకం ఇలా ఉండాలి” అనుకోకుండా, తన అనుభవాలను ఒక ఫ్రీ ఫ్లోలో చెప్పుకుంటూ పోవడమే ఈ పుస్తకం అంత చదివించేలా ఉండేదుకు గల కారణం అని నేనంటాను. స్వతహాగా బుజ్జాయిగారు రచయిత కాకపోవడం ఈ శైలికి బాగా నప్పింది, ముందుమాటలో గొల్లపూడి గారన్నట్లు. దీనిలో అసలు లోపాలు లేవని కాదు. నాకు మధ్య మధ్య ఎడిటింగ్ కాస్త సరిగా లేదనిపించింది. ఒకట్రెండు చోట్ల అవే విషయాలు రిపీట్ అయ్యాయి. అయినా సరే, ఆపకుండా చదివించేసింది కనుక, నా దృష్టిలో మంచి పుస్తకమే.
నిజం చెప్పొద్దూ, అర్జెంటుగా బుజ్జాయి బొమ్మలు చూడాలనుందిప్పుడు!
ఈ పుస్తకంకొనాలనుకుంటే: ఈవెనింగ్ అవర్లో ఇక్కడకొనవచ్చు.
వెల : నూటా యాభై రూపాయలు
పుస్తకం » Blog Archive » 2010లో చదివిన తెలుగు పుస్తకాలు
[…] నాన్న-నేను – బుజ్జాయి: ఈ పుస్తకం వెనుక అట్ట మీద ఒక చిన్న బొమ్మ ఉంటుంది. ఓ నడివయస్సు వ్యక్తి పంచెకట్టుతో ఉంటారు. ఆయన చేయిని పట్టుకొని ఒక చిన్నవాడు ఉంటాడు. ఇద్దరూ అలా నడుచుకుంటూ పోతుంటే, మనకి వెనక నుండి కనిపిస్తారు. పుస్తకాన్ని చదవడానికి సిద్ధపడ్డం అంటే ఆ చిన్నపిల్లవాడి చేయి పట్టుకొని మనం కూడా వాళ్ళతో అలా కులాసా నడవడం. మనం వేలు పట్టుకున్నవాడు ప్రముఖ చిత్రకారుడు కావచ్చు గాక! అతను వేలు పట్టుకున్నవాడు పేరెన్నికగన్న కవే కావచ్చు. వారిద్దరి నడకలో మనకు ఇంకెందరో ప్రముఖులు కనిపించవచ్చు. కాని మనల్ని ఆ తండ్రీ కొడుకుల ఆప్యాయతానురాగాలకు మించి మరేమీ కనిపించవు. బా రాయడమేమో కాని, చదివించేంత బాగా విషయాలను పంచుకోవడమూ ఒక కళ! […]
పుస్తకం » Blog Archive » 2010 – నా పుస్తక పఠనం కథ
[…] and the saint: Life and times of Bangalore Nagaratnamma – వీ.శ్రీరాం. నాన్న-నేను: బుజ్జాయి -వీటిల్లో దుర్గాభాయ్ దేశ్ముఖ్ […]
విజయవర్ధన్
@budugoy: Thank you. ఇప్పుడే వారికి phone చేస్తే పంచతంత్రంలోని రెండు పుస్తకాలు ప్రస్తుతానికి అమ్మకానికి వున్నాయి. మూడోది ఈ నెలాఖరుకు రావచ్చు అన్నారు. మిగతావి కూడా త్వరలో వస్తాయి అన్నారు. 16-26 Dec లో జరిగే Hyderabad book fair మరియు 1-11 Janలో జరిగే విజయవాడ book fairలో stall పెడ్తున్నారంట. కావలిస్తే VPP ద్వారా కూడా పంపుతామన్నారు.
budugoy
@విజయవర్ధన్,
“మంచిపుస్తకం” ప్రధానంగా పిల్లల పుస్తకాలు అచ్చు వేసే పబ్లిషర్స్. కొన్నాళ్ళ క్రింద పుస్తకంలో వాళ్ళ ఇంటర్వ్యూ/వ్యాసం కూడా వచ్చినట్టు గుర్తు. వారి వెబ్‌సైట్.
http://manchipustakam.in ఫోన్ /ఈమెయిల్ ద్వారా సంప్రదించొచ్చు.
@మానస, నాకు పుస్తకం.నెట్ గురించి తెలియకముందు నా బ్లాగులో రాసిన సమీక్ష.
http://budugoy.blogspot.com/2009/08/blog-post_12.html
Manasa
@budugoy:
The book you have mentioned in your comment -“yaadi” – that sounds very interesting. Why don’t you write a review on it for us?
or probably you can write a lil’ more right here and leave it in these comments if time does not permit to write a detailed review.
Pretty please..?
విజయవర్ధన్
@budugoy:
“బుజ్జాయి గారి బొమ్మల పుస్తకాలు ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్నాయి. పంచతత్రం కార్టూన్ పుస్తకాలను మంచిపుస్తకం వాళ్ళు ఈ మధ్యే అచ్చు వేశారు.”
Thank you. ఎక్కడ దొరుకుతున్నాయో చెప్పండి please.
budugoy
బుజ్జాయి గారి బొమ్మల పుస్తకాలు ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్నాయి. పంచతత్రం కార్టూన్ పుస్తకాలను మంచిపుస్తకం వాళ్ళు ఈ మధ్యే అచ్చు వేశారు.
“తాతగారో, అలాంటి మరొకరో పడక్కుర్చీలో కూర్చునో, డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చునో -వాళ్ళ చిన్నప్పటి కబుర్లు, అప్పటి అనుభవాల గురించి చెబుతూ ఉంటే వినడం అంటే చచ్చేంత ఇష్టం నాకు”
ఐతే మీకు సదాశివ గారి “యాది” అన్న పుస్తకం కూడా నచ్చొచ్చు. కాస్త బయో, కాస్త సంగీతం, కాస్త ఉర్దూ గజళ్ళ కబుర్లు..అలాగే తాతగారి కబుర్లు విన్నట్టు ఉంటుంది.
లలిత(తెలుగు4కిడ్స్)
Good to know.
పరిచయం బావుంది. నేను కొనాలనుకునే పుస్తకాల లిస్టులో ఇదీ చేరింది.