కథా శిల్పం – వల్లంపాటి వెంకటసుబ్బయ్య

“1996-97 లో ఉత్తమ సాహిత్య విమర్శ గ్రంథంగా తెలుగు విశ్వవిద్యాలయంవారి అవార్డునూ, 1999 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డునూ పొందిన గ్రంథం”
-బహుశా, ఈ లైను గానీ, పుస్తకం తెరువగానే కనబడకుండా ఉంటే, నేనీ పుస్తకం అంత ఆసక్తిగా చదివేదాన్ని కాదేమో అనిపిస్తుంది.

వల్లంపాటి వెంకటసుబ్బయ్య గారి పేరు వినడమే కానీ, ఎప్పుడూ ఏమీ చదవలేదు. ‘మదనపల్లె రచయితల సంఘం’ వారి కథల సంకలనంలో ఒక కథ చూసినట్లు గుర్తు. అయితే, ఈ పుస్తకాన్ని నాకు చదవమని ఇస్తూ, ఇచ్చినవారు చెప్పిన మాటలు నన్ను ఈ పుస్తకం వెంటనే చదివేలా చేశాయి. ఈపుస్తకం, పేరులో ఉన్నట్లు, ‘కథా‌శిల్పం’ గురించి. కథ ఎలా ఉండాలి?‌అందులో ఏమేం ఉండాలి? వంటి అంశాలతో పాటు, కథ ఎలా పుట్టింది? కథకీ, ఇతర కాల్పనిక సాహిత్య ప్రక్రియలకి తేడా ఏమిటీ? అన్న సంగతులను కూడా, తెలుగు, ఆంగ్ల, ఇతర భాషలను కూడా ఉదాహరణగా తీసుకుని చర్చించారు.

ముందుగా పుస్తకం గురించి, కాస్త వివరంగా చెబుతాను. ఇందులో‌ ఎనిమిది అధ్యాయాలున్నాయి.

సాహిత్య ప్రక్రియగా కథ: ఇది కథ అన్న ప్రక్రియ గురించి ఒక చిన్న పరిచయ వ్యాసం.
కథ అవతరణ: పాశ్చాత్యుల్లో కథా ప్రక్రియ పుట్టుకకు దోహదం చేసిన అన్ని రకాల సామాజికాంశాలను వివరించారు.
మంచి కథ-నాలుగు లక్షణాలు: మంచి కథకి తప్పనిసరిగా ఉండాల్సిన లక్షణాలు నాలుగనీ, అవి – క్లుప్తత, అనుభూతి ఐక్యత, సంఘర్షణ, నిర్మాణ సౌష్టవం – అని తీర్మానించాక, ఒక్కొక్కటీ తీసుకుని సోదాహరణంగా వివరించారు ఇందులో.
కథాంగాలు: కథలో ఉండవలసిన భాగాలు ఏమిటి? అని ఐదు వస్తువులు తీసుకుని (కథాసంవిధానం, పాత్రలు, నేపథ్యం, దృష్టికోణం, కంఠస్వరం) – ఒక్కొక్కటీ కథ బాగా రావడానికి ఏ విధంగా దోహదం చేస్తాయో, ఎటువంటి కథా వస్తువుల్లో ఎటువంటి భాగం పై ఎక్కువ శ్రద్ధ చూపాలో, వివిధ రచయితల కథలు ఉదాహరణగా తీసుకుని వివరించారీ అధ్యాయంలో
కథాకథనం: ఇందులో,రకరకాల కథన పద్ధతుల గురించి చెప్పారు. అవి – వాస్తవిక కథనం, లేఖా కథనం, ఊహాకల్పనా కథనం, అంతరార్థ కథనం, చైతన్య స్రవంతి కథనం మరియు మాజికల్ రియలిజం (అన్నింటికీ తెలుగు సమానార్థకాలున్నాయి. మరి మాజికల్ రియలిజం మాత్రం ఎందుకలా వదిలేశారో!).
కల్పనాసాహిత్యం – శాఖలు, ఉపశాఖలు: ఈ అధ్యాయంలో, నవల, నవలిక, స్కెచ్, గల్కిక, కవితా కథ, కథా మాలిక : ఇలా వివిధ ప్రక్రియల గురించి వివరంగా రాశారు
పాశ్చాత్య కథా పరిణామం: పాశ్చాత్యుల్లో కథా ప్రక్రియ క్రమంగా ఎదిగిన వైనం, తమదైన ముద్ర వేసిన వివిధ రచయితల గురించీ చెప్పారు
తెలుగు కథా పరిణామం: పైన చెప్పిన విషయమే, తెలుగు కథల్ని వస్తువుగా తీసుకుని చెప్పారు.

ఈ పుస్తకంలో నాకు నచ్చిన అంశాలు:
* ఈ పుస్తకం రాయడంకోసం ఎంత మంది కథల్ని అధ్యయనం చేసి ఉంటారో! కొన్ని వందల కథల గురించిన ప్రస్తావన ఉంది ఈ పుస్తకంలో. కనుక, అంతకన్నా ఒక ఐదురెట్లన్నా ఎక్కువ కథల్ని అధ్యయనం చేసి ఉండాలి. వల్లంపాటి గారి ఓపిక్కి నమస్సులు.
* ఆట్టే చదవకున్నా, చదవాలి అనుకునేవారికి, ఎవర్ని చదవడంతో మొదలుపెట్టాలో అర్థం కాక అయోమయంలో ఉన్నవారికి కావాల్సినంత సరుకు దొరుకుతుంది ఇది చదివితే.
* క్లిష్టత లేకుండా, చాలా స్పష్టంగా రాసారు కనుక, తేలిగ్గానే అర్థమవుతుంది. కథాశిల్పం గురించి కూడా కథ చెబుతున్నట్లే రాశారు 🙂
* కథ ఎలా ఉండాలో, కథ ఎలా పుట్టిందో – ఇలాంటి అంశాలపై ఒక మంచి అవగాహన కలుగుతుంది.

నచ్చని అంశాలు:
* వీలైన చోటల్లా ఆయా రచయితల పేర్ల ఇంగ్లీషు స్పెల్లింగులు కూడా పెడితే బాగుండేది. అలాగే, చివర్లో, ఈ రచయితలందరిదీ ఇండెక్స్ ఒకటి ఉంటే కూడా బాగుండేది.
* ఈ పుస్తకం నడిచిన తీరు – ప్రపంచం లోని అన్ని దేశాల కథనూ ఒక వైపు, తెలుగు కథ మరొక వైపు – అన్నట్లు సాగింది.‌ కనీసం ఇతర భారతీయ భాషల ప్రస్తావనైనా రాలేదు. రష్యన్, జర్మన్ వంటి భాషల కథలు అనువాదాలు చదివారనుకుంటే, ఇతర భారతీయ భాషలవి కూడా అనువాదాలు చదివే ఉంటారు. అటువంటప్పుడు, వాటి గురించి కూడా రాసి ఉంటే బాగుండేది అనిపించింది.
* నాకెందుకో గానీ, ఒక విధంగా ఇది నిరాశ కలిగించింది. ఎందుకంటే, దాదాపు వందేళ్ళుగా ఆధునిక కథ తెలుగు భాషలోనూ ఉంది కనుక, కథా‌శిల్పం గురించి ఏమన్నా సిద్ధాంతీకరిస్తారేమో అనుకున్నాను. కానీ, మొదటంతా, ఇదివరలో ఆంగ్ల కథల గురించి విమర్శకులు చెప్పిన దాన్నే తీసుకుని తెలుగు కథకి కూడా ఆపాదించినట్లనిపించింది. అలా చేయడం తప్పా?‌ఒప్పా? అన్నది వేరే సంగతి. నా ఎక్స్పెక్టేషన్ సంగతి చెబుతున్నా అంతే. ‘ఒరిజినల్’ తెలుగు సిద్ధాంతం ఉంటుందనుకున్నాను.

-మొత్తానికి, ఒక్క ముక్కలో చెప్పాలంటే, కథలపై ఆసక్తి ఉన్నవారు, కథల చదువరులు, రచయితలు – అందరూ తప్పక చదవాల్సిన పుస్తకం!

నేనింకా అన్నీ చదవలేదు కానీ, వెబ్ లో వల్లంపాటి గారికి, ఆయన రచనలకీ సంబంధించిన వ్యాసాలు, నాకు దొరికినంతలో:

1.కథాశిల్పం గురించి ఈమాటలో విష్ణుభొట్ల లక్ష్మన్న గారు రాసిన చక్కటి వ్యాసం ఇక్కడ.
2.వల్లంపాటి మరణించినపుడు ‘ఈమాట’ లో వచ్చిన వ్యాసాన్నీ, అలాగే, ఆయన గురించి వెల్చేరు నారాయణరావు గారి వ్యాసాన్నీ, వల్లంపాటి ఈమాటకు రాసిన వ్యాసాల్నీ ఈ లంకె ద్వారా చదవండి.
3. వల్లంపాటి గారి గురించి డా.దార్ల వెంకటేశ్వరరావు గారి వ్యాసం‌ ఇక్కడ.
4. వల్లంపాటి గారి గురించి ఈనాడులో చీకోలు సుందరయ్య గారి వ్యాసం ఇక్కడ.
5. “వల్లంపాటిని ఎలా అర్థం చేసుకోవాలి?” – ఎన్.వేణుగోపాల్ గారి వ్యాసం రెండు భాగాలు ఇక్కడ మరియు ఇక్కడ.
6. “తెలుగు కథ-సమకాలీన విషాదం” – వల్లంపాటి వ్యాసం స్క్రిబ్డ్ లో చదవొచ్చు
7. DLI లో వల్లంపాటి సాహిత్య వ్యాసాలు పుస్తకం ఇక్కడ చదవొచ్చు.
8. వల్లంపాటి అనువదించిన ‘లజ్జ్జా నవలను కూడా DLI లో ఇక్కడ చదవొచ్చు.
9. వల్లంపాటి గారి మరో అనువాదం – ప్రాచీన భారత దేశ చరిత్ర – DLI లో ఇక్కడ చదవొచ్చు.

You Might Also Like

9 Comments

  1. పుస్తకం » Blog Archive » 2010లో చదివిన తెలుగు పుస్తకాలు

    […] కథాశిల్పం – వల్లంపాటి వెంకట సుబ్బయ్య… ఏడాది ప్రధమార్థంలోనే చదివిన పుస్తకం. ఎలా పరిచయమయ్యిందో గుర్తు లేదు గాని, చదివి చాలా మంచి పని చేశానని మాత్రం బలంగా అనిపించింది. ప్రపంచ సాహిత్యంలోని కథలను గురించి చాలా విషయాలు తెల్సుకునే అవకాశం కలిపిస్తుంది. కథలను రాసే ఆసక్తి ఉన్నవారే కాక, కథలను చదవడానికి ఇష్టపడే వారి వద్ద ఉండాల్సిన పుస్తకం. అనేకానేక కథలూ, కథకులూ, కథనాలూ, కథలో ప్రయోగాల గురించి ఆసక్తికరంగా చెప్పుకొస్తారు. వీరిది నవలా శిల్పం కూడా ఉన్నట్టు ఉంది. అదింకా చదవలేదు. […]

  2. పుస్తకం » Blog Archive » 2010 – నా పుస్తక పఠనం కథ

    […] : కన్నడ సాహిత్యం గురించి చిన్న పరిచయం కథా శిల్పం – వల్లంపాటి : కథా ప్రక్రియ, చరిత్ర, […]

  3. కొత్తపాళీ

    వల్లంపాటి గారు ఆంగ్ల సాహిత్య ఆచార్యులు అనుకుంటాను. ఆయన ప్రపంచ కథా సాహిత్యాన్ని బాగా లోతుగా అధ్యయనం చేశారు. ఈ పుస్తకం ముఖంగా కథని గురించి పాశ్చాత్య సిద్ధాంతాల క్రోడీకరణ. దాంట్లో భాగంగానే అనేక ప్రపంచ భాషల గొప్ప కథల్ని మనకి పరిచయం చేశారు. ఏదో ఇంగ్లీషు లిటరేచరు వాచకానికి తెలుగు అనువాదం లాగ కాకుండా, తెలుగు పాఠకుల కోసం రాసిన అంతర్జాతీయ సాహిత్య పుస్తకమిది.
    తెలుగు కథల చర్చ అనుకుని చదివితే నిరాశగానే ఉంటుంది. సుబ్బయ్యగారు ఇంకొన్నాళ్ళు ఉండి ఉంటే ఆయన సరదాకబుర్లలోనూ, ఉపన్యాసాల్లోనూ అలవోకగా చెబుతూ వచ్చిన ఎన్నో అమూల్యమైన తెలుగు సాహిత్య విశేషాలు పుస్తకరూపం దాల్చి ఉండేవి.

  4. Asooryampasya

    @Sivaramaprasad Kappagantu:
    “కంఠస్వరం” – was the term used by Vallampati Venkata Subbayya in the book. Since I did not coin the word, I can’t offer any explanations to why it is used and if it is appropriate. To give an opinion – though I felt its true translation, I got used to the usage as time passed with the book.

    [Pardon commenting in English. I am using someone else’s machine]

  5. విష్ణుభొట్ల లక్ష్మన్న

    ఈ పుస్తకంతో నా అనుభవాన్ని పంచుకొనే అవకాశం ఇప్పుడు వచ్చింది!

    దాదాపు పదేళ్ళ క్రితం అప్పటి “ఈమాట” వెబ్ పత్రిక సంపాదకుడిగా కథలు రాసే నా మిత్రులని అడిగేవాణ్ణి. కథలో “శిల్పం” అంటారు కదా! దాని అర్ధం ఏమిటి? ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఎన్నో కథలు (అవి కథలా అన్నది వేరే విషయం)రాసిన వారికి కూడా తెలియకపోటం ఆశ్చర్యాన్ని కలిగించింది. కొందరు “శిల్పం అంటే శిల్పమే. అంత కన్నా ఏముంది?” అన్న సమాధానం నాకు ఏమీ తృప్తిని ఇవ్వలేక పోయింది.

    డిసెంబర్ 1999 సంవత్సరం మొదటి వారంలో అనుకోకుండా యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్, ఆష్టిన్ గ్రంధాలయంలో తెలుగు పుస్తకాలు వెతుకుతుంటే వల్లంపాటి గారి ఈ పుస్తకం కళ్ళ బడింది. ఈ పుస్తకం ఇంటికి తెచ్చుకొని ఆత్రంగా చదివేసి, మళ్ళీ పుస్తకం తిరిగి ఇచ్చేయాలి కదా అన్న ఆదుర్దాతో మొత్తం పుస్తకాన్ని కాపీ చేసుకొని వేంటనే నా ఆనందాన్ని పంచుకోటానికి శ్రీ వల్లంపాటివారికి ఒక ఉత్తరం రాసాను (డిసెంబర్ 15, 1999). నాలుగు వారాల్లో వారి నుంచి సమాధానం, “ఈమాట” కోసం “అనువాదకళ – నా అనుభవాలు” అన్న వ్యాసం అందాయి. ఇది జరిగిన కొద్ది రోజులకే ఈ పుస్తకానికి కేంద్ర సాహిత్య బహుమతి రావటం నాకు ఇంకా ఆనందాన్ని ఇచ్చింది.

    తెలుగు కథల మీద ఈ పుస్తకంలో ఇంత లోతుగా చేసిన విశ్లేషణ మరెవ్వరూ చేయగా నాకు తెలియదు. విశ్వవిద్యాలయాల్లో తెలుగు విభాగాల్లో ఆచార్యులు పరిశోధన కోసం చెయ్యవలసిన “పని” శ్రీ వల్లంపాటి వారు చెయ్యటం మన అదృష్టం. వల్లంపాటి వారి ఇతర పుస్తకాలు (నవల, విమర్శ అన్న అంశాలపై వీరి రచనలు) అందుబాటులో ఉన్న మిత్రులు ఇక్కడ పరిచయం చేస్తే బాగుంటుంది.

    పాత జ్ఞాపకాలను గుర్తు చేసిన వ్యాసకర్తకి (అసలు పేరు ఏమిటో)ధన్యవాదాలు.

    విష్ణుభొట్ల లక్ష్మన్న

  6. శివరామప్రసాద్ కప్పగంతు

    ఆంగ్లంలో ఉన్న మాట “టోన్” కు తెలుగులో “స్వరం” దాదాపుగా సరిపోతుంది, కాని “కంఠస్వరం” సరిపోదు. టోన్ అనే మాట వాడుకలో ఉద్దేశ్యం ఆ మొత్తం రచనలో అంతర్లీనంగా ఉండే “ధ్వని” అని నా అభిప్రాయం. ధ్వని అంటే మళ్ళి శభ్దం కాదు.

  7. తాడేపల్లి

    గత అనేకానేక సంవత్సరాల్లో స్వరం చాలాచోట్ల చాలామంది వాడగా చదివాను. ఇది దేనికీ అనువాదమని అనిపించడంలేదు. ఇది నాకు బావుంది. వ్యాసరచయితకి నెనరులు.

    అలవాటుపడగా పడగా అన్నీ ఆమోదనీయాలవుతాయి. అయితే భాషాశాస్త్రాన్ననుసరించి మక్కికి మక్కి అనువాదాలైనవి కూడా ఆమోదనీయాలే. దాన్ని తద్వేత్తలు Loan Translation అనే పేరుతో వింగడించారు. పదాల అర్థం కాలక్రమంలో కొన్నిసార్లు విస్తృతమవుతుంది. కొన్నిసార్లు సంకుచితమవుతుంది. అవసరాన్ని బట్టి ఉద్దేశపూర్వకంగా పద-అర్థాన్ని విస్తృతం చేయడం కూడా అంగీకారయోగ్యమే.

  8. తాడేపల్లి

    ఆయన ఇంకొంతకాలం పాటు జీవించి ఉంటే బావుండేది.

  9. శివరామప్రసాద్ కప్పగంతు

    “కంఠస్వరం” I think this is the true translation of the word “Tone” from English.

    Whether it gives the exact meaning of the context in which the word “tone” was used? Please inform.

Leave a Reply