పోస్టు చెయ్యని ఉత్తరాలు (ఆధ్యాత్మిక వాద,భౌతిక వాదాల సమన్వయం) -సమీక్ష
By సి.ఎస్.రావ్
గోపీచంద్ గారు ప్రఖ్యాత హేతువాది త్రిపురనేని రామస్వామి గారి కుమారులు.సహజంగానే బాల్యంలో వారి నాన్నగారి తాత్విక చింతనతో ప్రభావితులయ్యారు.కానీ వారి వ్యక్తిత్వంలోని చాలా గొప్ప గుణం ఓపెన్మైండెడ్నెస్స్. ఎటువంటి ప్రెజుడీసెస్ లేకపోవటం.సత్యాన్వేషణే ఆయన ధ్యేయం.ఎవరు చెప్పిన దాంట్లోంచి అయినా మంచి ఉంటే స్వీకరించే సద్బుద్ధి ,సంసిద్ధత ఆయన నైజం.మార్క్స్ ,లెనిన్ ల సాంఘిక న్యాయాన్ని అద్వైతంలోని మోనిజాన్ని ,గాంధీ గారి తాత్విక చింతనలోని నీతిని నెహ్రూ గారు మెచ్చుకొనడాన్ని సంతోషంతో ఉదహరిస్తారు.నెహ్రూజీ శాస్త్రీయదృక్పధాన్ని స్వాగతిస్తారు.నెహ్రూజీ ఎప్పటికప్పుడు నూతనజ్ఞానాన్ని తనలో కలుపుకుంటూ విశాలమవుతూ ప్రయాణం చేసుకపోతున్నారని కితాబిస్తారు. “ప్రకృతి గర్భం లోని అద్భుతాలు నన్నెప్పుడూ తన్మయుణ్ణి చేస్తాయి” అని నెహ్రూజీ అన్నప్పుడు సంతోషంతో ఐన్స్టైన్ మాటల్ని గుర్తుచేసుకుంటారు. ఐన్స్టైన్ అంటారు :” The most beautiful and the profound emotion we can experience is the sensation of the mystical.It is the power of all true science .”
అంటే భౌతిక ఆధ్యాత్మిక వాదాల సమన్వయాన్ని గోపీచంద్ కోరుకుంటున్నారన్నమాట .విల్బర్ మార్షల్ అర్బన్ వ్రాసిన “బియాండ్ రియలిజం అండ్ ఐడియలిజం” అనే గ్రంధం లో ఆయన “ఏ తత్వ వేత్త పూర్తిగా వాస్తవిక వాదిగా కానీ ,పూర్తి భావవాదిగా కాని అవడానికి వీలులేదు.పరిపూర్ణ తత్వ శాస్త్రం లో ఈ రెండూ ఉండాలి,” అనడం గోపీచంద్ గుర్తు చేస్తారు.గోపీచంద్ తనను భౌతికవాదిగానే చెప్పుకుంటారు.కానీ తాను నమ్మిన సిద్ధాంతానికి బందీ కాకుండా తన అనుభవంలోకి వస్తున్న కొత్త విషయాలను స్వీకరించి తాను నమ్మిన సిద్ధాంతంతో సమన్వయం చేసుకుంటూ పురోగమిస్తారు.నిత్యసత్యాన్వేషణతో ఓపెన్మైండెడ్ గా ముందుకు సాగిపోవడం ఆయన గొప్పదనం.
భౌతికవాదులు పదార్ధం నుండే అన్నీ వచ్చాయంటారు. కానీ ఏదీ స్థిరంగా ఉండేది కాదు.అంతా మార్పుకు లోనయ్యేదే. మార్పు స్థిరపరిణామంలో చోటు చేసుకుంటుంది.మార్పు ఎక్కడనుండో రాదు.పదార్ధం నుండి మనసు వచ్చింది.మనసు నుండి జ్ఞానం వచ్చింది . ఎప్పటికప్పుడు అనుభవం లోకి వస్తున్న జ్ఞానాన్ని పాత సిద్ధాంతాలకు కలుపుకుని మానవుడు పురోగమించాలంటారు గోపీచంద్ .
ఆర్ధిక శక్తులే కాక మరికొన్ని శక్తులు కూడా మానవుని మీద ప్రభావాన్ని చూపుతాయానే కార్ల్ మాన్ హీం మాటల్ని గోపీచంద్ ఉదహరిస్తారు:అవి హెరిడిటీ,సమిష్టి జీవితం ,సంస్కారం లాంటివి.మేధావులమీద భావ బలానికి ,జ్ఞానానికి ఉన్న ప్రభావం ఆర్ధికశక్తులకు ఉందదు.ప్రొలెటేరియట్ విప్లవానికి లెనిన్ నాయకత్వం వహించటం భావబలం వల్లే జరిగిందంటారు.మనిషి మారి పరిస్థితులను మార్చాలంటారు.
మనిషికి పరిస్థితులనధిగమించి ఆలోచించగల శక్తి ఎలా వచ్చిందని గోపీచంద్ ఆలోచించారు.ఆ శక్తి మానవుడికి పదార్ధంలో అంతర్లీనంగా ఉన్న శక్తి అయి ఉండాలి.భావశక్తి గురించి ఆధ్యాత్మికవాదులు ఎక్కువగా కృషి చేసారని భావించి ఆధ్యాత్మికవాదాన్ని అధ్యయనం చేసారు.ప్రాచ్య,పాశ్చాత్య తత్వ వేత్తల ఆలోచనా రీతులను ఆకళింపు చేసుకున్నారు. అరవిందులవారు ద్వంద్వాలగా కనబడేవన్నీ ద్వంద్వాలగా కాక ఒకే వస్తువు యొక్క రెండు గుణాలని చెప్పడం గోపీచంద్ గారిని అబ్బురపరచి ఆనందపరచింది.ఐన్స్టైన్ చెప్పిన రెలటివిటీ సిద్ధాంతం ప్రకారం, పదార్ధం శక్తిగా, శక్తి పదార్ధం గా మార గల వని చెప్పిన మాటలు తళుక్కుమని మెరిసాయి. కానీ దైవికశక్తి ఒకటి ఉందనీ అది తన ఆదర్శాన్ని నెరవేర్చుకోవడానికి పదార్ధానికి ఉపయోగించుకుంటూ ఉంటుందనే వాదం మీద ఆయనకు నమ్మకం కుదరలేదు .కానీ గోపీచంద్ విశిష్ట గుణం ఒపెన్మైండెడ్నెస్స్ అనుకున్నాం కదా .అరవిందులు నుడివిన దైవికశక్తి అనుభవంలోకి రావడానికి వారు చెప్పినట్లే యోగసాధనతో అతీతమానసిక ప్రవృత్తి ద్వారా సాధ్యమవుతుందేమోనని భావించారు. అదే ఇంటెగ్రల్ యోగా ద్వారా.
గోపీచంద్ తాను భౌతిక వాదినేనని చెప్పుకున్నా తన జీవిత పరిణామక్రమం లో తన తాత్విక చింతన క్రమక్రమానుగత వికాసం ద్వారా ఆధ్యాత్మిక వాదానికి కొంత దగ్గరవుతూ ,ఆ మేరకు భౌతికవాదానికి దూరమవుతూ పోయారని అనిపిస్తుంది.ఆధ్యాత్మికవాదులనేదేమిటంటే ఇటీవలి శాస్త్రజ్ఞుల పరిశొధనల వల్ల పదార్ధానికి అసలు అస్తిత్వమే లేకుండా పోయిందని ,విభజించుకుని చూడగా చూడగా మిగిలేది శక్తే గనుక శక్తే భిన్నరూపాలు ధరిస్తుందని అంచేత భౌతికవాదం తప్పని ౠజువయిందని అంటారు.కానీ గోపీచంద్ గారు ఈ అభిప్రాయంతో ఏకీభవించరు.దీని అర్ధం పదార్ధం పదార్ధంగా ఉండటంలేదని మాత్రమేనని పదార్ధం,చైతన్యం ఒకే వస్తువు యొక్క రెండు గుణాలని చెప్పడమేనని అంటారు .తాను భౌతికవాదే అయినా మానసిక శక్తిని అంగీకరిస్తున్నానని చెపుతారు. ఈ మానసిక శక్తి కూడా పదార్ధ పరిణామంలో నుండే వచ్చిందంటారు.”ప్రకృతి నియమాలను అర్ధం చేసుకోవటం వల్ల వచ్చే జ్ఞానమే నిజమైన జ్ఞానమని” లామార్క్ చెప్పటాన్ని గోపీచంద్ నిజమని నమ్ముతారు.జ్ఞానము,మనస్సు ఒకటి కాదనీ,మనస్సు వల్ల పుట్టి జ్ఞానం మనస్సునే మారుస్తుందంటారు.ఆయన జ్ఞానాన్ని నమ్ముతారు.జ్ఞానమంటే తెలుసుకునేవారికి ,తెలుసుకోబడేదానికి ఉన్న సంబంధం యొక్క ఫలితం .జ్ఞానం సంఘాన్ని మారుస్తూ తాను మారుతూ పురోగమిస్తుంది.గోపీచంద్ గారు భౌతికవాదే అయినా భౌతికవాదం లోని లోపాల్ని ఎత్తి చూపటం ఆయన నిష్పక్షపాత వైఖరిని తెలియజేస్తుంది.ప్రకృతి పరిణామక్రమంలో జ్ఞానాన్ని ప్రత్యేక శక్తిగా గుర్తించలేకపోవటం భౌతికవాద లోపమంటారు .దయ,సత్య,శౌచాలప్రాముఖ్యతను అది గుర్తించటం లేదు.సైన్స్ ని ,తత్వశాస్త్రాన్ని,ధర్మశాస్త్రాన్ని సమన్వయ పరచి వాటికి మన జీవన విధానంలో చోటు కలిగించాలంటారు.ప్రకృతి యొక్క, సంఘం యొక్క క్రమక్రమానుగత పరిణామంలో మానవుని యొక్క భావాలను ,మానవుని నిర్మాణాత్మకమైన కృషిని హేతు,భౌతికవాదాలు విస్మరించాయి .మానవుని ఊహాశక్తిని ,అతని స్వతంత్రతను పరిగణన లోకి తీసుకోలేకపోయినవి .కాబట్టి హేతువాదాన్ని,ఊహా వాదాన్ని సమన్వయం చేయాలంటారు గోపీచంద్
గోపీచంద్ గారి అభిప్రాయం ప్రకారం మన ఆధ్యాత్మికవాదులు,భౌతికవాదులు,పరస్పరం నేర్చుకోవాల్సిన విషయాలున్నాయంటారు.ఇద్దరూ ఈ ప్రపంచం ఒకే వస్తువు నుండి పరిణామం చెందిందంటారు.అయితే భౌతికవాదులు పదార్ధం పునాది అంటే,ఆధ్యాత్మికవాదులు సర్వం ‘ఆత్మే ‘ నంటారు. సాంఖ్యులు ఉపనిషత్తులలో నిర్దేశింపబడిన బ్రహ్మం ప్రకృతే నన్నారు.బ్రహ్మం సత్యమయినపుడు ప్రకృతి సత్యమే అవ్వాలిగా ? ఇటీవల సాంఖ్యులు ప్రకృతి ,పురుషుడు రెండూ ఒకే వస్తువు యొక్క గుణాలని చెపుతున్నారు. కారణం,కార్యం,ఒకటేనంటున్నారు.కారణం కార్యరూపం ధరిస్తుంది .కార్యం బహిర్గతం కాకముందు కారణంలో అంతర్లీనమై ఉన్నది.ఏదీ కొత్తది పుట్టదు.అంతకు ముందు అంతర్లీనమై ఉన్నది బహిర్గతమవుతుంది.దేనికీ నాశనం లేదు.మనం నాశనమయిందని అనుకున్నది మళ్ళీ కారణంలొ అంతర్లీనమై ఉంటుంది. కానీ బౌద్ధం ఉపనిషత్తులకు పూర్తిగా వ్యతిరేక సిద్ధాంతం అంటారు గోపీచంద్.పైకి కనబడే ఈ మార్పులవెనక మారని ఆత్మ ఒకటి ఉందని ఉపనిషత్తులంటాయి.బౌద్ధం ఈ వాదాన్ని అంగీకరించదు.ప్రతివస్తువు ,ప్రతిదీ ఎల్లప్పుడూ మారుతూ ఉంటుందని ,కార్యమూ,కారణము వేరనీ ,కార్యం కారాణాన్ని నాశనం చేసి పుట్టుకు వస్తుందనీ ,ఈ కార్యం రాబోయె కార్యానికి కారణమవుతుందనీ చెపుతారు.కానీ బౌద్ధం పునర్జన్మలను ఒప్పుకుంటుంది.వైశేషిక ధర్మం అటు ఉపనిషత్తులను ఇటు బౌద్ధాన్ని కూడా విమర్శిస్తుంది. వైశేషికులే మొదట అనుసిద్ధాంతాన్ని నిర్మించారు.ఆ ఘనత వారిదే .అస్తిత్వానికి కారణం స్థిరం గా ఉండే అనేకమైన అణువుల సముదాయమని వారు చెబుతారు.వీటి సమ్యోగం వల్ల ప్రపంచం ఉద్భవించింది అంటారు.కనిపించే భేదాలు అస్తిత్వంలో ఉన్న గుణాలవల్ల వచ్చిన భేదాలని చెబుతారు.ఈ ఆలోచనా ధోరణులన్నీమనపూర్వీకులభావస్వాతంత్ర్యాన్ని చాటుతాయి.వేదాంతశాస్త్రం గొప్పదనం భౌతిక ఆధ్యాత్మికవాదాల సమన్వయీకరణ అంటారు గోపీచంద్.
మానవుడు వేరు ప్రకృతి వేరు కాదు.మానవుడు ప్రకృతి యంశే .మానవుని మానసిక శక్తి అతని ప్రత్యేకత.మానవుడు ప్రకృతిని అర్ధం చేసుకోవాలంటే తన్ను తాను అర్ధం చేసుకుంటే చాలు..యోగసాధన లో తన్ను తాను అర్ధంచెసుకోవటానికి ప్రయత్నించే మానవునితో తనకు అభ్యంతరం లేదంటారు గోపీచంద్. అంటే ఆధ్యాత్మిక ,భౌతికవాదాల సమన్వయీకరణకు ప్రయత్నిస్తున్నారన్న మాట.ఆధ్యాత్మికవాదులు మానవుని సమగ్ర స్వరూపం తెలిసికొవటానికి ప్రయత్నించినట్లు గోపీచంద్ భావిస్తారు.” నేను ఆధ్యాత్మికవాదాన్ని అంగీకరించను.అయితే అందులో నాకు నచ్చిన భావాలను నేను నమ్మిన సిద్ధాంతంలోకి తెచ్చుకోవటానికి వెనుదీయను” అంటారు.
క్రమక్రమేణా ప్రకృతి నియమాల నుంచీ ప్రకృతి స్వభావం నుంచీ మానవుడు స్వతంత్రత పొందేట్లు చే యటం పరిణామం ఆదర్శం అనిపిస్తుంది అంటారు. కారణం మానవునికి ఆలోచనా శక్తి ఉంది.అది మానసికశక్తివల్ల వచ్చింది.ఇది ప్రయత్నం వల్ల మరింత వృద్ధి చేసుకోవచ్చు. అరవిందులవారి ప్రకారం స్వతంత్రతను పొందాలంటే ప్రకృతి స్వభావాన్ని అధిగమించగలిగిన మనస్తత్వాన్ని సంపాదించాలి.మానవుడు త్రిగుణాతీతుడు కావాలి.కోర్కెలు మననుంచి రాలిపోయినపుడే మనం ఆ స్థితిని పొందగలం .ఒక స్థితిలో విముక్తి పొందాలనే కోర్కె నుండి కూడా మనం విముక్తి పొందవలసి వస్తుంది అనే మాటలు చాలా అర్ధవంతంగా ఉన్నవని గోపీచంద్ సంతోషిస్తారు.పదార్ధవిజ్ఞాన శాస్త్రాన్ని ,మనస్తత్వ శాస్త్రాన్ని సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంది.ఎడిస్టన్ వ్రాసిన “స్పేస్,టైం,అండ్ గ్రావిటేషన్” చదివినవారెవరూ నూతన విజ్ఞానశాస్త్ర సహాయంతో ఇదివరకు సిద్ధాంతీకరించబడిన భౌతిక వాదాన్ని సమర్ధించలేరని బెర్ట్రాండ్ రసెల్ చెప్పే మాటలను గోపీచంద్ ఉదహరిస్తారు.
గోపీచంద్ గారు డాక్టర్ బ్రాడ్ చెప్పిన ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేస్తారు:మనస్సు నిర్మాణం భౌతికమేనని,కానీ పదార్ధానికి లేని లక్షణాలు మనస్సుకు ఉన్నాయని అంటారు.మానసికశక్తి కలిగిన మానవుణ్ణి కూడా పదార్ధంగా చూడటం సరికాదంటారు పదార్ధం అనాది అయి ,దాని పరిణామం లో మనసు వచ్చినట్లయితే అనాది పదార్ధం లో మనస్సు అంతర్లీనంగా ఉన్నట్లే కదా? అలాంటప్పుడు పదార్ధమే అనాది వస్తువని అనుకోవడం ఎలా? అంచేత ఈ రెండూ అనాది పదార్ధాలు కావనీ మరొక పదార్ధం యొక్క రెండు లక్షణాలు మాత్రమే పదార్ధమే,మనసూ అనీ అనుకొనవలసివస్తుందంటారు.దాదాపు రస్సెల్ అభిప్రాయం కూడా ఇదే .రసెల్ పదార్ధాన్నీ ,మనస్సునీ,సమన్వయం జేసి చూడగల “న్యూట్రల్ మోనిజం” అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు: పరిపూర్ణత్వం పొందిన శాస్త్రంలో మనస్సు,పదార్ధం అనే మాటలు మాయమయితే వాటి స్థానంలో సంఘటనలకు సంబంధించిన హేతువర్ధకమైన నియమాలు కనిపిస్తాయి” అని తన “ఏన్ అవుట్లైన్ ఆఫ్ ఫిలాసఫీ ” అనే గ్రంధంలో అంటారు.
మనస్సుకు క్రియేటివ్ ఇంటెలిజెన్స్ ఉంది.మెమరీ ఉంది,భవిష్యత్తు లోకి చూడగలిగే శక్తి ఉంది. అయినా సత్యాన్ని తెలుసుకోవటానికి గానీ ,పూర్తి స్వతంత్రతను సాధించటానికి గానీ మానసిక శక్తి చాలదని ఆధ్యాత్మికవాదులంటారు. మనస్సు యొక్క సంకుచిత స్వభావాన్ని అరవిందులవారు “ది రిడిల్ ఆఫ్ ది వరల్డ్ ” అనే తమ గ్రంధం లో ఈ విధంగా వర్ణించారు: “మనస్సుకి సత్యాన్ని తెలుసుకునే శక్తి లేదు.అది దాని శక్తినంతా ఉపయొగించుకుని చూసినా చివరకు నాకు తెలియదు,అవతల ఏదో ఉన్నట్లు కనిపిస్తుంది.అది సత్యం కావచ్చు,దానిని నెను ఊహించగలను కానీ తెలిసికోలేను.అది తెలుసుకోవడనికి వలను పడనిదో ,నాకు తెలియనిదో అయి ఉండాలి,అని మాత్రమే చెప్పగలుగుతుంది.”. వారే మరోచోట ” సత్యాన్ని గురించి ఆలోచించటం వల్ల కాక ,మనస్వభావాన్ని మార్చుకోవటం వల్ల జ్ఞానాన్ని అందుకోగలము,” అని వ్రాస్తారు.పరిణామం లో ప్రాణం, మనస్సు బహిర్గతమయినట్లు ఇప్పుడు అతీత మానసిక శక్తి బహిర్గతమవుతుంది.దాని చాయలు అపుడే మానవ మనః ప్రవృత్తిలో కనిపిస్తున్నాయని ,ఈ శక్తిని సంపాదించి దానితో క్రింది అంతస్తులైన మనస్సుని,జీవితాన్ని,శరీరాన్ని మార్చుకోవాలని,సత్యం తెలుసుకోవడానికి గానీ ,అభివృద్ధి చెందటానికి గానీ వేరు మార్గం లేదనీ అరవిందులవారు చెప్పటాన్ని గోపీచంద్ ఉదహరిస్తారు.
శ్రీ అరవిందులవారు చెప్పిన పరిణామంలో మరొకదశ ఆవిర్భవించబోతున్నదని చెప్పడాన్ని నమ్ముతూనే అంతమాత్రంచేత తాను ఆధ్యాత్మికవాదాన్ని నమ్మినట్లు కాదని అంటారు గోపీచంద్. అరవిందులవారు చెప్పిన అతీత మానసిక ప్రవృత్తి లక్షణాలను తాను సమన్వయించుకోలేకపోయినా ,వారు చెప్పిన సిద్ధాంతానికి ఆకర్షితుడనవుతున్నానంటారు.దానికి కారణం ఎవరిలోకాన్ని వారు సృష్టించుకుని మొత్తం లోకానికి ప్రతికూలంగా బ్రతుకుతున్నారు.మనం సాధించిన శక్తులని మనమే అదుపులో పెట్టుకోలేకపోతున్నాము.ఐన్స్టైన్ లాంటి మేధావి మానవకోటి ఆత్మహత్య చేసుకునే స్థితికి వచ్చిందంటున్నారు. ఎలెక్జీ కార్ల్ అంటారు,”ప్రస్తుత పరిస్థితులవల్ల కలిగిన మానసిక,నైతిక,భౌతిక,పతనాన్నుంచి మానవుణ్ణి వెలికితీయాలి…..విషయవాంచలకు ఆశ్రయం ఇవ్వని సంస్కారం,అందం,మానవుల్ని బానిసలని చేసే యంత్రాంగాలతో సంబంధం లేని యంత్రాలు ,పదార్ధాన్ని దేవుడి స్థానంలో పెట్టి పూజించని సైన్స్– ఇవి మనకు ప్రస్తుతం అవసరం.ఇవి మానవుని తెలివితేటలను ,శక్తిని ,నైతికదృష్టిని వృద్ధిచేసి అతని పురోభివృద్ధికి సహాయం చేస్తవి.దీనికి తోడు మెదదు పెరుగుదల మానవుడికి ఆగిపోయిందని కూడా శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.కాబట్టి మానవుడు మరో శక్తిని తెచ్చుకోవాలి.బహుశా అదే అరవిందులవారు చెప్పిన అతీత మానసిక శక్తి అయి ఉండవచ్చని గోపీచంద్ అభిప్రాయపడుతున్నారు. ఈ శక్తితో ప్రపంచమంతా ఒకటిగా కనిపిస్తుంది. “ఈ లోకాల గొలుసు పదార్ధం దగ్గర నుండి చైతన్యం దగ్గరకు తీసుకుపోయే నిచ్చెనగా కనిపిస్తుంది” అంటారు అరవిందులు.
నీషే నిర్వచించిన అతీత మానవునికి అరవిందులు ఊ హించిన అతీత మానవునికి చాలా తేడా ఉందని గోపీచంద్ అంటారు.నీషే ను అరవిందులు ఈ విధంగా విమర్శిస్తారు.”దుఃఖాన్ని ,సేవనీ,తృణీకరించేగుణాలను అతను అతీత మానవునికి అంటగట్టాడు.జడత్వాన్నీ ,బాధలను అధిగమించి విముక్తి పొందిన మానవులకు అధిపతిగా ఉండే లక్షణాలను అతను అతీత మానవునికి ఆపాదించలెదు.ప్రకృతి పరిణామంలొ ఉన్న నీతి నియమాలను విస్మరించీతను పెద్ద తప్పు చెసాడు…..రాబోయె వ్యక్తి తనకు తాను అధిపతి,ప్రపంచానికే అధిపతి“,అన్నారు అరవిందులు.
గోపీచంద్ భౌతికవాదం ,ఆధ్యాత్మికవాదాలలోని అసంపూర్ణతలను మన దృష్టికి తెస్తారు. అవి సాధించిన విజయాలను అభివర్ణిస్తారు.భౌతిక వాదం పదార్ధాన్ని దాని శక్తిని శోధించి లోకానికి ఎంతొ ఉపకారం చేసిందంటారు. ఆధ్యాత్మిక వాదం చైతన్యాన్ని,దాని వివిధ రూపాలను కనిపెట్టి లోకానికి అతి మధురమైన అనుభవాన్ని,అతి సుందరమైన అంతస్తులను అందించిందంటారు.ఈ రెండు సిద్ధాంతాల అసంపూర్ణతలను అరవిందుల వారే తన లైఫ్ డివైన్ లొ “ది టూ నెగేషన్స్” అంటారని గొపీచంద్ ఉదహరిస్తారు.ఒకదాన్ని “ది మెటీరియలిస్ట్ డినయల్ ‘ అని రెండవదాని ‘ది రెఫ్యూజల్ ఆఫ్ ది ఎసటిక్ ” అని అన్నారు.ఈ రెంటి మధ్య ప్రకాశవంతమైన సమన్వయం సాధింపబడాలంటారు గోపీచంద్.
జెడ్.ఎన్.ఎం .జెరిల్ తన “ది పర్సనాలిటీ ఆఫ్ మాన్ ” అనే గ్రంధం లో దివ్యదృష్టి ,దివ్యజ్ఞానం ఉండటానికి వీలుందని నిరూపించడానికి ప్రయత్నించారు.విలియం జేంస్ ,ప్రొఫెసర్ రైస్ ,మెక్డొవెల్ ,ప్రొఫెసర్ గార్డెన్ ,డబ్ల్యు ఆల్బర్త్ ,సర్ ఆలివర్ లార్జ్,డాక్టర్ ఎలెక్జీ కార్ల్ ,డాక్టర్ గస్టాల్ స్టాంబర్గ్ ఇంద్రియాలకు అందని అనుభూతులకు జ్ఞానానికీ అవకాశం ఉందన్నారు.ఇవల్యూషన్ ఆఫ్ మోడరన్ సైకాలజీ ” అనే తన గ్రంధంలో డాక్టర్ .రిచర్ద్ ముల్లర్ ఈ అభిప్రాయమే వెలిబుచ్చారంటారు గొపీచంద్.ఆధ్యాత్మిక దశ లొ ఈ శక్తులుంటాయని మన మహర్షులు ,యోగులు చెప్పనే చెప్పారు. ఇవి మన మహర్షులు స్వానుభవంతో చెప్పారని నమ్మవచ్చని గోపీచంద్ అంటారు .ఈ కారణాల వల్ల తనను అరవిందులు నుడివిన అతీత మానసిక శక్తి ,ప్రవృత్తి గాఢంగా ఆకర్షించాయని చెబుతారు.ఇంతకుముందు పరిణామం తెలియకుండా జరిగిందని,ఈ అతీత మానవ శక్తి వల్ల మనకు తెలిసి పరిణామం చెందుతుందని అరవిందులవారనడం గోపీచంద్ కి సంతోషం కలిగిస్తుంది.ఇందువల్ల ఆనందం,కాలం కలిసి రావడం (త్వరితగతిన జరగడం) స్వాగతించవలసిన విషయాలంటారు గొపీచంద్. అరవిందులవారు ఈ అతీత మానసిక శక్తిని సాధించడానికి ఒక నిర్దుష్టమైన పద్ధతి నియమం,టెక్నిక్ ఉందంటారు.అదే ఇంటెగ్రల్ యోగా సాధన. దీనివలన వారు నుడివిన సుప్రామెంటల్ కాన్షస్నెస్స్ సాధించడం జరుగుతుంది.సంకల్పం చేతనే పనులవుతాయంటారే మహర్షులు అది ఈ దశ. ఈ దశ లో నిత్యానందం కలుగుతుంది.గొపీచంద్ శ్రీ అరవిందులవారి తాత్విక మూలాలతో ఏకీభవిస్తారు. మరొక విషయం,తపస్సంటూ ముక్కు మూసుకుని ప్రపంచానికి దూరంగా తప్పుకునేవారని యొగులను నిరసించతం మనం చూస్తున్నదే. ఆధ్యాత్మికవాదులనేదేమిటంటే మహాయోగులు లోకకళ్యాణం కోసం ఉపయొగించే సాధనాలు ధ్యానం,తపస్సు .వారి ఆధ్యాత్మికభావ తరంగాలు లోకం మీద ప్రభావం చూపుతాయని.భారతదేశానికి స్వాతంత్ర్యం అరవిందులవారి ఆధ్యాత్మికశక్తే కారణమని,డంకర్క్ తర్వాత రెండవప్రపంచసంగ్రామం నడకను మార్చారని అరవిందాశ్రమం వారు ప్రచురించిన ఒక పుస్తకం లో పేర్కొన్నారు. అది చదివితే నవ్వు రాలేదు,ఆశ్చర్యం వేసిందని గోపీచంద్ అంటారు.విజనరీస్ ద్వారా ప్రపంచానికి ఎంతో మేలు కలిగిందని అంటారు.
తన ‘సైన్స్ అండ్ పర్సనాలిటీ ‘ అనే గ్రంధంలో డాక్టర్ విలియం బ్రౌన్ మరణానంతరం మనస్సు విదిగా ఉందటానికి వీలున్నదనే నిర్ణయానికి వచ్చారని గోపీచంద్ అంటారు. శరీరంతో ఉన్న మనస్సు శరీరంతో లేని మనస్సు తో ఎంతవరకు సంబంధం పెట్టుకోగలదో ఆ గ్రంధంలో చర్చిస్తారు డాక్టర్ బ్రౌన్ .ప్రొఫెసర్ యాడింగ్టన్ వ్రాసిన నేచర్ ఆఫ్ ది ఫిజికల్ వర్ల్డ్ అనే గ్రంధంలో “నేటి శాస్త్ర సిద్ధాంతాన్ని బట్టి సర్వవ్యాప్తమైన మనసు ఒకటి ఉందని అనుకోడానికి వీలుంది” అంటారు.
ఆధ్యాత్మికవాద భౌతికవాద సమన్వయానికి ప్రశంసార్హమైన ప్రయత్నం ఈ పుస్తకంలో ఆదినుండి చేస్తారు. గోపీచంద్.ఈనాడు శాస్త్రవేత్తలు చైతన్యాన్ని దానిచైద్యాలను నిరసించే నిరసించే భౌతికవాదం తో తృప్తి పడక దాని పొలిమేరలు దాటి ఆధ్యాత్మికవాదంలోకి దృష్టి సారిస్తున్నారు.పదార్ధాన్ని ,దాని వివిధ రూపాలను నిరసించే ఆధ్యాత్మికవాదంతో నేటి ప్రముఖ తత్వవేత్తలు తమ అసంతృప్తి ప్రకటిస్తున్నారు.శ్రీ అరవిందులు తమ ‘ Life Divine ‘ లో ఈ భౌతికపదార్ధం ఏహ్యమైనదీ,నిరసింపదగినదీ అయితే భగవంతుడికి అది ఎలా వాసయోగ్యమయింది……మరి అది బ్రహ్మపదార్ధమేగా ?” కాబట్టి పదార్ధం చైతన్యం ఒకటే అన్నారు.
గొపీచంద్ గారు నిర్ద్వంద్వంగా ఇలా అంటారు:” మానవుని పరిణామాన్ని గురించి ,ఈ పరిణామంలో వివిధ దశలకు సంబంధించిన శక్తులను గురించీ ఆధ్యాత్మికవాదులు చెప్పే ముఖ్యసూత్రాలను అంగీకరిస్తున్నాను. ఎప్పటికో ఒకప్పటికి శరీరం లేకుండా చైతన్యం ఉండే అవకాశం ఉండవచ్చని అనుకుంటున్నాను.ఇదేవిధంగా ఈ బాహ్యప్రపంచం ,పదార్ధ విజ్ఞాన శాస్త్రం ప్రోగుజేసిన జ్ఞానం నిజమే అనుకుంటున్నాను.ఆధ్యాత్మికవిలువలు అంగీకరించటానికి భౌతికవిలువలను గానీ ,భౌతికవిలువలని అంగీకరించటానికి ఆధ్యాత్మిక విలువలను కానీ నిరసించవలసిన అవసరం లేదని అనుకుంటున్నాను. ఏ వేదాంతి అయినా ఈ భౌతిక సుఖాలు తుచ్ఛం అంటే నేను అలానే ఏ ఆధ్యాత్మికవాదైనా ఆధ్యాత్మికవిలువలు బూర్జువా నాగరికత లక్షణాలంటే నేనంగీకరించను.ఇవన్నీ నిజమే .ఇవన్నీ అవసరమే ” అంటూనే నేనిప్పటికీ భౌతికవాదినేనంటారు గొపీచంద్.ఆయన అభిప్రాయంలో గొప్ప సంఘసేవకులందరూ గొప్ప జ్ఞానపరులే. బుద్ధుడు, వివేకానందులు, గాంధీ మహాత్ములు మొదలగువారు.ఉన్నతమైన జీవితాదర్శం కలిగి ధ్యానం ద్వారా ప్రేరణలను ఎనర్జైజింగ్ ఫొర్సెస్ గా తీర్చి దిద్దుకోవచ్చునంటారు గోపీచంద్. .
అతీత చైతన్య స్థితిలో సమాధిగతుడై మరలా బయటి ప్రపంచంలోకి వచ్చిన మానవుడు ఒక మహర్షిలా,ఒక ప్రవక్తగా,ఒక జ్ఞానిగా వస్తాడు.అతని స్వభావం మారుతుంది.అతని జీవితం మారుతుంది.సెయింట్ టెర్రిజీ, “ఈ సమాధ్యవస్థలో పొందే ఆనందం వర్ణింపనలవిగా ఉంటుంది.శరీరం పొందే ఆరోగ్యం, శాంతికూడా ఇంత అద్భుతంగానూ ఉంటుంది ” అంటారు .
ఈ సమాధ్యవస్థ రెందు రకాలు.
1.సవికల్ప సమాధి 2.నిర్వికల్పసమాధి
సవికల్పసమాధిలో మనం కోరిన గుణం అనుభవంలోకి వస్తుంది .అనుభవించేదీ ,అనుభవింపబడేదీ రెండూ వేరుగానే ఉంటాయి.ఆ వ్యక్తికి భౌతిక ప్రపంచ స్పృహ ఉండదు.కానీ ఆనందం గమనం లోనె ఉంతుంది.అతని మనస్సు భౌతిక ప్రపంచం నుండి లాగివేయబడుతుంది.ఈ స్థితిలో భక్తుడు తను కోరిన ఇష్టదేవతతో ప్రేమతొ కలిసిపోయి స్థిరసంబంధం పెట్టుకుని ఉంటాడు.నిర్వికల్పసమాధి అంతకన్నా పైమెట్టు. ఇందులో భక్తుడు తాను కోరిన దాంతొ ఏకత్వం పొందుతాడు.తెలుసుకునే వాడు,తెలుసుకోబడేదీ,తెలివీ అన్నీ ఒకటే అవుతవి. ఈ మూడూ బ్రహ్మం యొక్క మూడు రూపాలుగా దర్శనమిస్తవి.నేను ,నా తండ్రి ఒక్కడే అని జీసస్ అంటారే ఆ స్థితి.అదే అహం బ్రహ్మస్మి.ఈ స్థితిలో భక్తునికి భౌతికప్రపంచస్పృహే కాదు ,తన స్పృహ తనకే ఉండదు/.అతను తన లో లోపల చైతన్యంతో ఒకడై ఉంటాడు.అతని అంతర్గత జీవితం మారుతుంది.మొత్తం సృష్టితో ఏకత్వం పొందుతాడు మిగిలేది ఒక్క మాటలో చెప్పాలంటే ఆత్మ ఒక్కటే.మన మహాయోగులు చెప్పేదేమిటంటే నిర్వికల్ప సమాధి స్థితి సాధించినవారికి ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో పని లేదని.
గోపీచంద్ గారి అభిప్రాయంలో అరవిందుల వారు పాత సిద్ధాంతాలను నిర్మూలించలేదు.అన్ని పాత సిద్ధాంత అవసరాలను నిర్వచించి ,వాటిని సమన్వయ పరచి ,ఆ సమన్వయంద్వారా ఒక పూర్ణ సిద్ధాంతాన్ని సృష్టించారు.నూతన దృష్టిని కలిగించారు.ద్వంద్వాలు ,వైరుధ్యాలు తొలగింపబడ్డాయి.సమ్యక్దృష్టిని అలవరచుకొనవలసిన ఆవశ్యకతను వారి సిద్ధాంతం నొక్కి చెబుతుంది,ఇంటెగ్రెల్ యోగా సాధన ద్వారా.
గోపీచంద్ గొప్ప మేధావి.పండితుడు.తాత్వికుడు.సత్యాన్వేషి.నిరంతర చింతనాశీలి.గొప్ప రచయిత .బహుగ్రంధ రచయిత.అన్నిటినీ మించి ,అన్ని భావపవనాల్నీ ఆహ్వానించి వివేచనతో తాను నమ్మిన సిద్ధాంతాన్ని అవసరమయితే సంస్కరించుకోగలిగిన గొప్ప సంస్కారం కల వ్యక్తి.నిష్పక్షపాత వైఖరి కలిగిన వ్యక్తి.తాను నమ్మిన సిద్ధాంతానికి బందీ కాకుండా ఉండగలగటం చాలా గొప్ప గుణం.అది గోపీచంద్ గారికుంది.ఎందరో మేధావుల,తత్వవేత్తల ఆలోచనా రీతులను ఆకళింపు చేసికొని ,ఆ విజ్ఞానాన్ని జీవితాన్ని గురించి,ప్రపంచాన్ని గురించి,సృష్టిని గురించి తనదైన అవగాహనతో మేళవించి వ్రాయబడిన పుస్తకం “పోస్టు చెయ్యని ఉత్తరాలు”.లేఖల రూపంలో ఉండటంతో అక్కడక్కడా రిపిటీషన్ ఉన్నా అది పెద్ద విషయమేమీ కాదు.ఆమూలాగ్రం ఆకట్టుకుని థాట్ ప్రొవోకింగ్ గా,ఎన్లైటెనింగ్ గా ఉండే మంచి పుస్తకం.ఇది చదివిన తర్వాత గోపీచంద్ గారి మరొక పుస్తకం చదవాలనే తహతహ కలుగుతుంది.ఇది రచయితగా ,తాత్వికునిగా,ఒక మంచి మనిషిగా ఆయన గొప్పదనం వల్ల.వారు జీవించినది కేవలం 52 సంవత్సరాలు (1910-1962).ఈ కొద్ది జీవితకాలంలో ఎంత విస్తృతంగా చదివారు,ఎంతలోతుగా ఆలోచించారు,ఎంత నిశితంగా విశ్లేషించారు,ఎంతటి నిరంతర సత్యాన్వేషణ గావించారు,ఎంత బాహుళ్యంగా రచనలు జేసారు! అన్నిటినీ మించి ఆయన ప్రశంసార్హమైన సుగుణం,గొప్పదనం గురించి ప్రత్యేకంగా పేర్కొనాలి.విశ్లేషణ లో ఒక విషయాన్ని వివిధ కోణాలనుండి సాకల్యంగా పరిశీలించటం ఉంటుంది.సమస్యను సమగ్రంగా గుర్తించటం ఉంటుంది.దీనికి తోడు ఆ విషయాన్ని ఆవరించుకుని ఉన్న అనేకానేక విరుద్ధమైన స్వభావం కల వాస్తవాలతో తాత్విక స్థాయిలో సమన్వయం చేయగల నేర్పు ,సమ్యక్దృష్టి ,నిర్మాణాత్మక తత్వం గోపీచంద్ గారిలో చూస్తాము.
వారి శతజయంతి సంవత్సరంలో ఈ సమీక్షను వారి దివ్యస్మృతికి పూదండగా సమర్పించడంలో నాకెంతో ఆనందం ఉంది.
సి.ఎస్.రావ్
08/18/2010
ఈపుస్తకంపై, ఇంతకు మునుపు పుస్తకం.నెట్ లో వచ్చిన వ్యాసం ఇక్కడ చదవొచ్చు.
మెహెర్
చిత్రం! నేనూ ఇదే పుస్తకాన్ని చదువుతున్నానిపుడు. పుస్తక విషయ సారాంశం బాగా రాసారు. పుస్తకంలో విషయంపై కూడా మీ ఆలోచనలు రాసి వుంటే బాగుండేదనిపించింది.
“నీషే నిర్వచించిన అతీత మానవునికి అరవిందులు ఊ హించిన అతీత మానవునికి చాలా తేడా ఉందని గోపీచంద్ అంటారు.”… అవును, నీషే అతీతమానవుడిది దాదాపు హిట్లర్, నెపోలియన్ల మూసే.