మాండలిక రచన – వెలుఁగునీడలు

పి.ఎస్. తెలుఁగు విశ్వవిద్యాలయం భాగ్యనగర ప్రాంగణంలో ఇటీవల కేంద్రసాహిత్య అకాడమీవారి ఆధ్వర్యవంలో తెలుఁగు కథానికాసాహిత్యం మీద ఒక సభ జఱిగింది. అందులో శ్రీ అక్కిరాజు రమాపతిరావుగారు మాట్లాడుతూ, “మాండలికాల్లో సాహిత్యాన్ని సృష్టించడం మంచి పోకడ కా”దనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారనీ, అందుమీదట ఒక ప్రాంతానికి చెందిన రచయితలు అలిగి ఆ సమావేశాన్ని బహిష్కరించడమే కాకుండా తమ ప్రాంతం కోసం ప్రత్యేకంగా అకాడమీ యొక్క శాఖాకార్యాలయాన్ని నెలకొల్పాలంటూ డిమాండు చేశారనీ దినపత్రికలలో వార్తలొచ్చాయి. దురదృష్టవశాత్తు మన పత్రికల్లో సాహిత్యానికీ, సాహిత్యవేత్తలకీ – అదే విధంగా భాషకూ, భాషావేత్తలకూ ప్రాధాన్యం చాలా చాలా తక్కువ. ఎవఱో మాఱుమూల చిన్నాచితకా గల్లీ నాయకుడు మాట్లాడినవన్నీ కూడా విపులంగా ప్రచురిస్తారు, వర్ణరంజిత చ్ఛాయాచిత్రాలూ, బాక్సులూ కట్టి మఱీ ! అందుచేత శ్రీ అక్కిరాజుగారు ఖచ్చితంగా ఏమన్నారు ? అందుకు అలిగిన సదరు ప్రాంత రచయితలు వాస్తవంగా ఏమని సమాధానం చెప్పారు ? ఇవేవీ మనకు తెలియవు. ఎందుకంటే సమకాలీన వేర్పాటువాద ఉద్యమ నేపథ్యంలో పత్రికలు దీన్నొక సంచలనాత్మక ప్రాంతీయ గొడవగా చిత్రించి వార్తని నివేదించడం పట్ల చూపిన ఆసక్తిని వారి పూర్తి ప్రసంగపాఠాలను అందించడం పట్ల కనబఱచలేదు. అదీ గాక మాండలికాలనేవి కేవలం తెలంగాణకో, రాయలసీమకో పరిమితం కావు. దేశమంతటా ఉన్నాయి. ప్రతి ఒక్కఱమూ ఏదో ఒక మాండలికమే మాట్లాడుతున్నాం. అటువంటప్పుడు అన్ని ప్రాంతాలవారూ కోపం తెచ్చుకోవాలి. కానీ మిహతావారికి రాని పుస్సు ప్రత్యేకంగా ఒక ప్రాంతానికి చెందిన రచయితలకే ఎందుకొచ్చిందో అది కూడా అర్థం కాలేదు. సరే ! బహుశా ఇవి అనంతరాలోచనలు (after-thoughts).

మాండలికాల ఉనికి ఒక సజీవ వాస్తవం. దాన్నుంచి మనం తప్పించుకోలేం. అవి గతంలో ఉన్నాయి. వర్తమానంలోనూ ఉన్నాయి. భవిష్యత్తులో సహితం బహుశా ఉంటాయి. ప్రపంచంలో ఉన్న మానవులందఱినీ ఒకే బళ్ళో వేసినా మాండలికాలనేవి ఏర్పడకుండా ఆపడం మన తరం కాదు. మనుషులంతా ఒకే సంస్థ రూపొందించిన సాఫ్టువేర్ తో పనిచేసే యంత్రాల్లాంటివారు కారు కనుక ఎవఱి అవగాహనకూ, అవసరాలకూ, ఉచ్చారణకూ అనువుగా వారు భాషని కొన్ని అసంకల్పిత మార్పులు చేసుకొని వాడుకుంటారు. దాన్నే మనం మాండలికం అంటాం. మాండలికం భాషకున్న వర్తమాన వాస్తవ స్వరూపం. అది ప్రామాణిక భాషలా వ్యాకృతం కానంత మాత్రాన, లేదా మనం మాట్లాడనంత మాత్రాన అది భాష కాదనడానికి లేదు. మన (శిష్ట విద్యావంతుల) దృష్టి నుంచి మాండలిక పదజాలంలో అవగాహనలోపాలు ఉండొచ్చు. అర్థాలు వ్యత్యస్తం కావచ్చు. ఉచ్చారణ నిర్దుష్టం కాకపోవచ్చు. తొలి వినికిడిలో మొఱటుగా ధ్వనించొచ్చు. అన్ని సందర్భాలోనూ అన్నిరకాల వ్యక్తీకరణలకూ పనికిరాకపోవచ్చు. కానీ అది ఒక ప్రాంతపు సంస్కృతిశకటానికి ఇరుసు. మన మాతృభాషాదేవత స్థానికులపై కరుణించి ఆ ప్రాంతంలో ఆ స్వరూపంలో సాక్షాత్కరిస్తున్నదని అర్థం చేసుకోవాలి. నగరాల్లో పంచభక్ష్య పరమాన్నాల్ని నైవేద్యంగా తీసుకునే అమ్మవారు గ్రామాల్లో పెరుగన్నంతో తృప్తి చెందుతారు. అలాంటిదే భాషామాత పరిస్థితి కూడా.

భాషాచరిత్రనీ, పరిణామక్రమాన్నీ సమగ్రంగా రూపొందించుకోవాలంటే ప్రామాణిక భాషతో పాటు మాండలికాలు కూడా సలక్షణంగా బతికుండాలి. పక్షాంతరంలో – ప్రామాణిక భాష మాండలిక వాడుకల్ని సహితం తనవిగా స్వీకరించి విలీనం చేసుకోవాలి. ఎందుకంటే ప్రామాణిక పట్టణ భాషలో లేని అనేక వ్యక్తీకరణలూ, ప్రాచీన వాడుకలూ, పదాలూ మాండలికాల్లో ఇంకా మిగిలే ఉన్నాయి. అవి ఎంత మంచి వాడుకలంటే – జటిలమైన సంస్కృత పదాల్ని రూపొందించుకునే అవసరం నుంచి తప్పించి, కొన్ని ఆంగ్లపదాలకు దీటైన ప్రత్యామ్నాయ దేశి పదాల్ని సరళ సుందరంగా అవి మనకు సరఫరా చేయగలవు. భాష ఎంత సుసంపన్నమైనదో, ఎంత శక్తిమంతమైనదో మాండలికాల పరిజ్ఞానం ఉన్నవారికే బోధపడుతుంది. ఉదాహరణకు – తెలుఁగువాళ్ళకు ఎన్నిరకాల వర్షాలున్నాయో ఎస్.సుధారాణిగారు సాక్షి దినపత్రిక ఆదివారం అనుబంధంలో ఒకమారు వివరించారు. ఈ ప్రక్కన జేపెగ్ బొమ్మపై నొక్కి చదవండి. అలాగే కళింగదేశపు తెలుఁగు మాండలికంలో మనం ఎన్నడూ ఊహించని భావాలకు పదాలున్నాయి.

తేజపత్రి – బిరియానీ ఆకు
ఇక్కిలిపేర్లు – కర్పూరపు దండలు
ఆమితి – పెళ్ళిభోజనం
అవిది – పనిఒత్తిడి (busy)
మిత్తనాన్న – తండ్రి స్నేహితుడు
మిత్తమ్మ – తండ్రి స్నేహితుని భార్య
మిత్తోరు – తండ్రి స్నేహితుని ఇల్లు/ తల్లి స్నేహితురాలి ఇల్లు

(వీటిని పత్రికాముఖంగా ప్రకటించిన ఇచ్ఛాపురం వాస్తవ్యులు శ్రీ జన్నెల బాబూరావుగారికి నెనర్లు)

తెలుఁగులో ఆఱు ప్రాంతీయ మాండలికాలున్నాయన్నారు భారతదేశ భాషల్ని సమగ్రంగా అవలోడన (survey) చేసిన ప్రొఫెసర్ గ్రియర్‌సన్. జిల్లాకో మాండలికం ఉందని కొందఱి అభిప్రాయం. ప్రతి పదిమైళ్ళకూ భాష మారిపోతుందని చెప్పే భాషాశాస్త్రవేత్తలు కూడా ఉన్నారు. కానీ ఆ మాట తెలుఁగుకు వర్తించకపోవచ్చు. తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాలలో కూడా మిలియన్లాదిమంది తెలుఁగు మాట్లాడుతున్నారు. వారు తరతరాలుగా అక్కడివారే తప్ప ఆంధ్ర నుంచి వలసపోయినవారు కారు. 2001 లో తమిళనాడు శాసనసభలో అప్పటి ముఖ్యమంత్రిణి కుమారి జె.జయలలితగారు ప్రకటించినదాని ప్రకారం జనాభాలెక్కల్లో రెండుకోట్లమంది తమిళనాడువాసులు తాము తెలుఁగువారమని చెప్పుకున్నారు. కనుక మఱో నాలుగు మాండలికాల్ని కలుపుకోవచ్చు. శ్రీలంకలో పాములు పట్టి జీవించే ఒక జనజాతి ఇప్పటికీ తెలుఁగే మాట్లాడుతున్నది. వారి తెలుగులో కళింగ పదాలు అధికంగా ఉండడం వల్ల వారు ఉత్తరాంధ్ర నుంచి ఏ శతాబ్దంలోనో శ్రీలంకకు వలసపోయారని భావించబడుతున్నది. అది పదకొండోది అనుకుంటే ప్రామాణిక తెలుఁగును పన్నెండో ప్రాంతీయ మాండలికం అనుకోవచ్చు. ఇహపోతే అమెరికాలో మాట్లాడే తెలుగు ఒక ప్రత్యేక మాండలికంగా గుర్తించేటంత విశిష్టతని సంతరించుకున్నట్లుగా నాకు అనిపించలేదు. తెలుఁగువారికి అక్కడ ఉమ్మడిగా ఒక స్థిరనివాస భూభాగం లేకపోవడమూ, చెల్లాచెదఱుగా నివసిస్తూండమూ మొదలైన కారణాల వల్ల అక్కడి తెలుఁగు కొనసాగింపునకు అవకాశం గల సాంస్కృతిక అంశం (cultural item) కాకపోవచ్చు. మనకు తెలియవస్తున్నంతవఱకు – సాధారణంగా తొలితరం వలసదార్లు మాత్రమే తెలుఁగులో మాట్లాడతారు. మలితరంవారు పూర్తిగా ఇంగ్లీషువారైపోతారు.

తెలుఁగులో మాండలికవాదాలు సమసిపోయాయనుకున్నాను నేనీ మధ్య దాకా ! అయితే సమకాలీన వేర్పాటువాదం భూమికగా మళ్లీ అవి తలెత్తుతున్నట్లు కనిపిస్తున్నది. మన రాష్ట్రంలో గడిచిన దశాబ్దకాలం పాటు ఒక ప్రాంతానికి చెందిన నేతలు ప్రాంతీయ సంకుచితత్వాల్ని ఒక పద్ధతిలో క్రమానుగతంగా, నింపాదిగా అభివృద్ధి చేస్తూ వచ్చారు. అన్ని ఇతర రాష్ట్రాల ప్రజల్లో మాదిరే తెలుగువారిలో కూడా సహజంగా ఉండిన, ఉండాల్సిన స్వజాత్యభిమానాన్ని, స్వరాష్ట్రాభిమానాన్నీ, భాషాభిమానాన్నీ – ఒకటని లేదు, “మనది” అనుకున్న ప్రతి కాన్సెప్టునీ వారు వధ్యశిల మీద పట్టాకత్తితో నిలువునా వధించారు. దాని ప్రతిధ్వనే రచయితల్లో స్వమాండలికం పట్ల ఈ కృత్రిమ ప్రేమప్రకోపం. పి.ఎస్.తెలుగు విశ్వవిద్యాలయంలోని అఱుపుల్నీ, కేకల్నీ, బహిష్కరణల్నీ ఈ కోణంలోంచి అర్థం చేసుకోవాల్సి ఉంది. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి మీద భీకరంగా అఱిచేస్తున్నాడంటే – సాధారణంగా దాని మూలాలు తత్‌క్షణ ఘటనల్లో ఉండవు. అంతకు ముందునుంచే చాలాకాలంగా మనసులో నాటుకొని గూడుకట్టుకున్న ప్రతీపభావాలే మనుషుల చేత హఠాత్తుగా అలా అఱిపిస్తాయి. ఒక తెలుఁగుప్రాంతంలో ఆ మానసిక పూర్వరంగం ఎలా సిద్ధమయిందనేది అందఱికీ తెలుసు. నేనిక్కడ ప్రత్యేకంగా వివరించాల్సిన పనిలేదు.

మాండలికవాదానికున్న మఱో కోణం పచ్చివ్యావహారికవాదం. వ్యావహారికవాదం వెఱ్ఱితలలు వేస్తే అది బహుముఖాలుగా వికృతి చెందుతుంది. వాటిల్లో కొత్త దేశిపదాల కల్పనకూ, వాడుకకూ వ్యతిరేకతా, “నువ్వు వ్రాసే ప్రతీదీ నాకు అర్థమయ్యేలాగానే వ్రాయాలి. లేకపోతే నిన్నూ, నీ రచననీ చెత్తబుట్టలోకి గిరవాటు వేస్తా” ననే నాటు పాఠక జబర్దస్తీ, మాండలికోన్మాదమూ ప్రముఖమైనవి. ఉన్మాదం అని ఎందుకంటున్నానంటే ఇప్పటికే సిద్ధాన్నంలా, వడ్డించిన విస్తరిలా ఉన్న ప్రామాణిక తెలుగు స్థానాన్ని మాండలికాలతో ప్రతిక్షేపించాలనే తహతహ వారిలో కనిపిస్తున్నది. వ్యావహారికవాదాన్ని తొలితరాల గ్రాంథిక పండితులు వ్యతిరేకించడానికి గల కారణాల్లో ఒకటి – ప్రతివారూ వ్యావహారికం పేరిట తమ మాండలికంలోనే వ్రాస్తే ఇతరులకు ఇబ్బందవుతుంది అని ! అదే శ్రీ అక్కిరాజుగారు కూడా వ్యక్తం చేశారు. తప్పేముంది ? మన అనుభవం కూడా అదే ! మనలో ఎంతమందిమి సుదూర జిల్లాలవారి మాండలిక రచనల్ని అర్థం చేసుకోగలం ? ఏ మాత్రం అర్థం చేసుకోగలం ?

అంటే, ఇక్కడ మాండలికవాదులు అవగాహన చేసుకోవాల్సిన విషయాలు కూడా చాలా ఉన్నాయి. వారు ప్రామాణిక తెలుఁగును అర్థం చేసుకుంటున్న విధానమూ, దాన్ని వారు అభిదర్శిస్తున్న కోణమూ (perspective) లోపభూయిష్ఠమైనవి. మాండలికాలకు ప్రామాణిక తెలుఁగు హానిచేయదు. అవి సమాంతర వాహినులుగా కొనసాగుతూనే ఉంటాయి. ఎందుకంటే ప్రపంచంలో ఏ దేశంలోనైనా, ఏ కాలంలో నైనా రాసే భాషా, మాట్లాడే భాషా పూర్తిగా ఒక్కలా ఉండవు. మాట్లాడే భాష కోసమని చెప్పి రాసే భాషని కాలదన్నే మూర్ఖులెవఱూ ప్రపంచంలో లేరు. మన దురదృష్టవశాన అలాంటివారు ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే కొంతమంది ఉన్నారు. ప్రామాణిక తెలుగు మౌలికంగా మూఁడు జిల్లాల (కృష్ణా, గుంటూరు, గోదావరి) భాష అనీ, అందుచేత అది మిహతా జిల్లాలకు శిరోధార్యం కాదనీ వారు సెలవిస్తున్నారు. “గాంధీగారు వైశ్యు” డన్నట్లుంది ఇది. భాషకు రాజకీయ ప్రజాస్వామ్య సూత్రాల్ని వర్తింపజేయడమే ఇందులోని వైచిత్రి. ఎవఱు ఎంతమంది ? అనేది సాంస్కృతిక విషయాల్లో ఎక్కువ సందర్భాల్లో అప్రస్తుతం. ఒక తరగతిలో యాభైమంది విద్యార్థులుంటారు. ఉపాధ్యాయుడు ఒక్కఱే ఉంటారు. రాజకీయ ప్రజాస్వామ్య సూత్రాల ననుసరించి ఎవఱు ఎవఱి మాట వినాలి ? అలా వింటే పని జఱుగుతుందా ? అలాగే ఏ భాషలోనైనా ప్రామాణిక శైలి ఒక్కటే ఉంటుంది. ప్రతి మాండలికానికీ ప్రామాణ్యసిద్ధి అంటే అది పొసగదు. ప్రామాణిక మాండలికాలు ముందు ఏదో ఒక చిన్న ప్రాంతంలోనే పిల్లకాల్వలుగా బయల్దేఱి, మహాప్రవాహాలై, ఉపనదులై, మహానదులై దిగ్విజయం చేస్తాయి. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఆంగ్లవ్యాకరణం నిజానికి లండన్ ప్రాంతపు వాడుక మాత్రమే.  అదే విధంగా యావత్తు బెంగాల్ కూ ఆదరణీయమైన బెంగాలీ మాండలికం కోల్కతా నగరమాండలికం మాత్రమే. అలా పోలిస్తే నిజానికి మాండలికవాదులు అనుకుంటున్నంత పరిధి కూడా ప్రామాణిక తెలుగుకు మొదట్లో లేదు. అది ఆరంభంలో కేవలం ఒక మైనారిటీ కులమాండలికం. అది యావత్తు రాష్ట్రానికీ ప్రామాణిక మాండలికమై, పత్రికల్నీ, సినిమాల్నీ, టీవీలను, రేడియోనీ, అంతర్జాలాన్నీ ఆక్రమించుకోవడం వెనక చాలా సుదీర్ఘమైన బృహత్తరమైన సాంఘిక ప్రక్రియ ఉంది. అదంతా ఇక్కడ ప్రాస్తావికం కాదు. అయితే భాషాపరమైన పరిణామ ప్రక్రియ విషయానికొస్తే దాన్ని ఒకప్పుడు ఇళ్ళల్లో మాట్లాడిన వర్గం యొక్క విద్యాగంధాన్నీ, పరిణతినీ పురస్కరించుకొని అది ఎనభయ్యేళ్ళ క్రితమే, అంటే ఇతర మాండలికాల కంటే చాలా ముందే, చాలా శీఘ్రంగా అభివృద్ధి చెందింది. అభివృద్ధి చెందినాక అది సార్వజనీకరణ (universalization) కి లోనయింది. ఆ రకంగా తన కులస్వభావాన్ని కోల్పోయింది. అందఱికీ చెందిన ఆస్తి (public property) గా మారింది. ఇహ ఇప్పుడది ప్రత్యేకంగా ఏ ఒక్కఱిదీ కాదు. అందఱిదీను. ఈరోజు దాని స్థానాన్ని తగ్గించడం సాధ్యమూ కాదు, వాంఛనీయమూ కాదు. కనుక అనవసరంగా పాత కథలు త్రవ్వడం అవివేకం.

ప్రతియింటికీ ఒక యింటిపెద్ద అవసరం. ప్రతి దేశానికీ ఒక నాయకుడు/ నాయకురాలు అవసరం. అలాగే ఛప్పన్న స్థానిక మాండలికాల మధ్య సర్వజనామోదనీయమైన ఒక ప్రామాణిక మాండలికం కూడా తప్పనిసరిగా అవసరం. ఈనాడు ఇంగ్లీషుని అందఱమూ నేర్చుకోగలుగుతున్నామంటే దానిక్కారణం – ఆ భాష మనదాకా రాకముందే దాని స్వదేశంలో దానికొక ప్రామాణిక మాండలికమూ, ప్రామాణిక పదజాలమూ, వ్యాకరణమూ అంతకుముందే ఏర్పడడమే. ఆ భాగ్యం తెలుక్కి లేకుండా చేస్తే ఱేపు మన భాషని నేర్చుకోవడం బయటివారికి కష్టమవుతుంది. ఎన్ని మాండలికాలని నేర్చుకుంటాడొక పరదేశి ? చెప్పండి ! జాతికంతా కలిపి ఒక ప్రామాణిక మాండలికం ఉండడం నాగరికతాలక్షణం కూడా. ఎవఱి జిల్లాలో ఎవఱివారు వారికి బాగానే అర్థమవుతారు. కానీ సుదూర జిల్లాలవారిని కూడా అర్థం చేసుకోవడం ఈనాటి గడ్డు అవసరం. రాష్ట్రాన్ని మూఁడుముక్కలు చేసినా ఈ అవసరంలో మార్పుండదు. ఈ అవసరాన్ని చక్కగా తీర్చేది ప్రామాణిక తెలుఁగు. దాన్ని సక్రమంగా వినియోగించుకుంటే అది జాతిని సుసంపన్నం కావిస్తుంది. ఉదాహరణకు – మీరు మీ మాండలికంలో పుస్తకం వ్రాసి అచ్చేస్తే ఒక 1,000 – 3,000 ప్రతుల కంటే అమ్ముకోజాలరు. ఎందుకంటే మీ పుస్తకాన్ని మీ ప్రాంతీయులు తప్ప మిహతావారెవఱూ కొనరు. ప్రచురణకర్తకు నష్టం, రచయితకూ నష్టం. ఎందుకంటే ప్రాంతీయ మాండలికాల్లో ధైర్యంగా పెట్టుబడి పెట్టి మాస్ ప్రొడక్షన్ చేయలేం. మాండలికాలలో సినిమాలు తీసినా అదే పరిస్థితి. అదే ప్రామాణిక తెలుగులో వ్రాసినా, తీసినా ఆయా సబ్జెక్టుల్ని బట్టి ఇబ్బడిముబ్బడిగా లాభాలూ, పేరుప్రతిష్ఠలూ సిద్ధిస్తాయి.

బళ్ళలో ఆంగ్లమాధ్యమ విద్య తాకిడికి అసలు మాతృభాషే జీవన-మరణ సమస్యలో పడి మునగానాం తేలానాం అన్నట్లు కుయ్యో మొఱ్ఱోమంటూంటే మళ్ళీ ఆ మాతృభాషలో మాండలికాల గుఱించి విప్లవాలు లేవదీయడం ఏమైనా బావుందా ? ఇల్లు కాల్తూంటే చుట్టకు నిప్పు వెతుక్కున్నట్లు లేదూ ? ఇది బహుశా మనం (తెలుఁగువాళ్ళం) మాత్రమే చేయగల, మనకు మాత్రమే పేటెంట్ ఉన్న అతితెలివి కార్యకలాపం.

You Might Also Like

13 Comments

  1. Srinivas Nagulapalli

    పైన “ఎంత ఘాటు ప్రేమయో, ఇంత లేటు వయసులో” అని చదువుకో మనవి.

  2. Srinivas Nagulapalli

    “ఆ భాషారూపాన్ని విచక్షణారహితంగా ఎక్కడ పడితే అక్కడ, ఎంత పరిమాణంలో పడితే అంత పరిమాణంలో గుప్పించాలన్న తహతహే ఉన్మాదం.”

    ఎక్కడ పడితే అక్కడ ఎంత అయితే అంత ప్రేమించుకుంటే “ఎంత ఘాటు ప్రేమయో” అంటాం ఇంకొకటి అంటాం. ప్రేమికురాలి గొంతు తెగ్గోసేస్తేనో, ముఖం పై యాసిడ్ పోసేస్తేనో లేక ఇంకెటువంటి హానిని చేసినా ప్రేమోన్మాదం అంటాం. ఎవరినీ కించపరచక దేనికీ హాని చేయనంతవరకు ఉన్మాదం కాదు, ఏదైనా.

    ఇంకా చెప్పాలంటే, సంస్కృతానికే ప్రామాణికత ఉన్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ, ఎంత పడితే అంత తెలుగు గుప్పించడం, సంస్కృత ఛందాలు ప్రామాణికతను కలిగున్నప్పుడు దేశీ ఛందాలను ఎక్కడ పడితే అక్కడ గుప్పించడం, పద్యాలకే ప్రామాణికత ఉన్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ వచనం గుప్పించడం, గ్రాంథికమే ప్రామాణికతగా ఉన్నప్పుడు వ్యావహారిక భాషను ఎక్కడ పడితే అక్కడ గుప్పించడం-
    ఇట్లా ఎక్కడ పడితే అక్కడ, ఎంత పరిమాణంలో పడితే అంత, విమర్శలకు వెరవక, నచ్చింది గుప్పించే తహతహ తరతరాలుగా తెలుగువారికున్న వారసత్వం, ఉబలాటం. ఉన్మాదం కాదు.

    Two wrongs don’t make one right. తెలంగాణా మాండలికాన్ని దారుణంగా చిత్రీకరించారు అంటే, కాదు అంతకంటే ముందుగానో అంతకంటే ఎక్కువగానో ఇంకో మాండలికాన్ని చేసారు అని చెప్పుకోవడం, తింటున్న దాంట్లో ఉప్పు ఎక్కువ అయింది అంటుంటే, కాదు మొన్నటి విందు ఇంకా ఉప్పిసం అయింది అన్నట్లు ఉంది. పాపం వాళ్ళు భరించి తిన్నారు ఫలానా వాళ్ళే ఉమ్మేస్తున్నారు, ఇట్లా రియాక్ట్ అవుతారని ఊహించలేకపోయారు అన్నట్లు కూడా ఉంది. ఇక సాంతాం ఒక ప్రాంత వాసులకు ఇంఫీరియారిటీ కాంప్లెక్సు నిర్ధారణ చేయడం మాత్రం మస్తుగా ఉంది.

  3. తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

    రచయిత అననివి అన్నట్లుగా తార్కాణించడం సమీచీనం కాదు. ఏ భాషారూపమూ ఉన్మాదం కాదు. ఆ భాషారూపాన్ని విచక్షణారహితంగా ఎక్కడ పడితే అక్కడ, ఎంత పరిమాణంలో పడితే అంత పరిమాణంలో గుప్పించాలన్న తహతహే ఉన్మాదం.

    మనోవేత్తలు కానివారు సాహితీవేత్తలు కూడా కాజాలరు. మనోవేదిత్వం సాహిత్యవిద్యకు ప్రాథమికార్హత.

    ప్రామాణిక భాషలో మాండలిక పదాల చొప్పింపు మిక్కిలి స్వాగతనీయం. అదే ఈ వ్యాసరచయిత కూడా ఈ టపాలో ప్రస్తావించినది. ప్రామాణిక భాష నిజంగా ప్రామాణిక భాష అనిపించుకోవాలంటే ఈ ప్రక్రియ తప్పనిసరిగా జఱగాలి. ప్రామాణికంలో ఇంగ్లీషుపదాలే విఱివిగా చొఱబడుతున్నప్పుడు మన స్వంతమైన తెలంగాణ తెలుగుపదాల్ని చొప్పించడానికి సహేతుక అభ్యంతరమేముంటుంది ? అయితే దురదృష్టవశాత్తు అది మనం ఆశిస్తున్నంత బాగా జఱగడం లేదు. ఉదాహరణకు తెలంగాణ మాండలిక పదాల పేరుతో వ్యాప్తిలోకి వచ్చినవి (హవా, బల్దియా, షురూ, కిరికిరి, గడ్‌బడ్, గోల్‌మాల్, ఝలక్ మొ||) అన్నీ ఉర్దూపదాలే తప్ప పట్టుమని పది స్వచ్ఛమైన తెలంగాణ తెలుగుపదాల్లేవు. మన దినపత్రికలవారు ఒక విధమైన ప్రాంతీయ బహుపాత్రాభినయం చేస్తూండడం వల్ల ఆ కొద్ది తెలంగాణ పదాలు కూడా తెలంగాణ ఎడిషన్లలోనే తప్ప ఆంధ్రా ఎడిషన్లలో కనిపించవు.

    మళ్ళీ నాచేత చెప్పిస్తున్నారు. మీయంతట మీరు గ్రహించలేదు గనుక పునరుక్తిదోషానికోర్చి నేను చర్వితచర్వణంలా తిరిగి నొక్కివక్కాణించక తప్పడంలేదు. తెలుగు సినిమాలలో నాయకేతర నీచ, దుష్ట, హాస్యకారాది పాత్రలకు అత్యధికంగా అనువర్తించబడిన మాండలికం గోదావరిజిల్లాలది, తెలంగాణది కాదు. తెలగాణ్యం తెఱమీదికి చాలా ఆలస్యంగా రంగప్రవేశం చేసింది. నాయికానాయక పాత్రలకు తెలగాణ్యాన్ని అనువర్తించక పోవడానికి కొన్ని కారణాలు (నేను అర్థం చేసుకున్నంతవఱకు) దోహదించాయి. ఒకటి – తెలగాణ్యమైనా తెలంగాణలో అందఱూ మాట్లాడే మాండలికం కాదు. అందఱూ స్థానికంగా అర్థం చేసుకునే మాండలికం మాత్రమే. అన్ని మాండలికాల మాదిరే తెలగాణ్యం ప్రాథమికంగా ఒక విభిన్న ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక వాతావరణానికి చెందినది. ఆ వాతావరణానికి చెందని పాత్రతో ఆ మాండలికంలో మాట్లాడించడం హాస్యాస్పదంగా ఉంటుంది. హైదరాబాదులో తరతరాలుగా స్థిరపడ్డ ఉన్నతవర్గాలవారెవ్వఱూ – డొమిసైల్డ్ తెలంగాణవారితో కలిపి – తెలగాణ్యంలో మాట్లాడరు. కానీ సినిమాలో హీరోపాత్ర చాలా సందర్భాలలో హైదరాబాదుకు చెందిన ఉన్నతవర్గపు విద్యావంతుడై ఉంటుంది. హీరోయినూ అంతే. వాటి చేత తెలగాణ్యంలో డైలాగులు చెప్పిస్తే అది అవాస్తవికంగా, అపాత్రోచితంగా ఉంటుంది. మీరే స్వయంగా ఒక సినిమా రచయిత అయినప్పుడు ఇందులో ఉన్న కష్టాన్ని బాగా అర్థం చేసుకోగలుగుతారు. తెలుగు చిత్రపరిశ్రమలో చాలామంది తెలంగాణ రచయితలూ, దర్శకులూ, నిర్మాతలూ ఉన్నారు. వారు కూడా తెలంగాణాభిమానులే. కానీ అదే సమయంలో వారికి సినిమాకళ గుఱించిన వాస్తవాలు బాగా తెలుసు. అందుకే వారీ విషయమై గట్టిగా పట్టుపట్టడం లేదు.

    రెండోది – సినిమాలకి లలితాకళాకోణమే కాకుండా ఒక బలీయమైన వాణిజ్యపార్శ్వం (commercial dimension) కూడా ఉందని మఱువరాదు. సాధారణంగా సాంస్కృతిక రంగంలో విజయం సాధించిన ప్రయోగాలు వాణిజ్యరంగంలో పునఃప్రయోగానికి లోనవుతాయి. తెలుగు సినిమా తొలిరోజుల్లో నాటకాలుగా బహుళ జనాదరణ పొందిన ఇతివృత్తాలే వెండితెఱకెక్కి అద్భుత కమర్షియల్ విజయాల్ని సాధించాయి. అంటే వాణిజ్యరంగంలో దేన్నయినా ప్రవేశపెట్టాలంటే అంతకుముందే దానికొక విజయవంతమైన పూర్వోదాహరణ (successful precedent) ఆవశ్యకం. తెలగాణ్యానికి సంబంధించి అలాంటిదేదీ లేదు. పూర్తిగా తెలగాణ్యంలో తీసిన సినిమాలు బాక్సాఫీసుల్ని బద్దలు కొట్టిన ఉదాహరణలు అఱుదు. “వాణిజ్యపరంగా ఏవరేజి, ఫర్వాలే”దనిపించుకున్న ఆ ఒకటి-రెండు సినిమాలు కూడా ఇతివృత్తపరంగా – నేనిందాక చెప్పిన ప్రత్యేక వాతావరణానికి సంబంధించినవి. ఆ వాతావరణాన్ని దాటి ఆ మాండలికానికి అనువర్తనీయత (applicability) మృగ్యం (కనీసం ప్రస్తుతానికి)! ఇది కేవలం తెలగాణ్యానికే కాదు, బహుశా అన్ని మాండలికాలకూ సమానంగా వర్తిస్తుందనుకుంటా. ఉదాహరణకు – గోదావరిజిల్లాల మాండలికాభిమాని అయిన ప్రఖ్యాత సినీదర్శకుడు వంశీ తీసిన ’శ్రీ కనక మహాలక్ష్మీ రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్” (1987-88) సినిమా కోస్తాలో బాగా ఆడింది. కానీ తెలంగాణ, రాయలసీమల్లో బోల్తాపడింది. హాస్యరసప్రధానంగా నిర్మించిన ఆ సినిమా ఇంటీరియర్ ఆంధ్రుల్ని మాత్రం నవ్వించలేకపోయింది. కారణం – ఆ సినిమాలో హీరో, హీరోయినూ, కమెడియనూ అనే తేడా లేకుండా మొదట్నుంచీ కొసకంటా మొత్తం గోదావరి మాండలికపు డైలాగులతో లాగించారు. గోదావరి జిల్లాల మాండలికం ఆ పక్కనున్న కృష్ణా-గుంటూరు జనాలకే అర్థం కావడం కొన్నిసార్లు కష్టం. ఎందుకంటే అది మలయాళంలాగా అత్యంత వేగంగా, ధారాళంగా మాట్లాడబడే తెలుగు వేరియంట్. అదే దర్శకుడు పదేళ్ళ క్రితం తీసిన “అవును, వాళ్ళిద్దఱూ ఇష్టపడ్డారు” తో దాన్ని పోల్చండి. ఈసారి వంశీగారు కొంచెం ట్రాక్ మార్చారనిపిస్తుంది. మిహతా పాత్రల సంగతెలా ఉన్నా హీరో-హీరోయిన్లకు మాత్రం ప్రామాణిక మాండలికాన్ని ఉపయోగించారు. ఇది మాత్రం రాష్ట్రమంతటా విజయం సాధించింది. కారణం సుబోధం.

    ఏతావతా చెప్పొచ్చేదేంటంటే – ప్రాంతీయాభిమానాలకు రాజకీయరూపం కావాలనుకోవడం లాంటిదే మాండలికాలకు సాహిత్య, శాస్త్రగౌరవాన్ని సంపాదించాలనుకోవడం కూడా. ఆర్థికంగా వర్కౌట్ కాకపోవడమే అభిమానాలన్నింటికీ ఉన్న ఉమ్మడి లక్షణం. ప్రామాణిక తెలుగు వ్యావహారిక భాష మూడు జిల్లాల మాండలికమే అనడం, దాని వ్యాప్తి వెనక ఎవఱిదో బలాత్కార హస్తం ఉందనడం చారిత్రికంగా అవాస్తవికమైన దుర్మార్గవాదం. మాండలికవాదుల వక్కాణింపులు ప్రధానంగా ఈ దురభిప్రాయాన్ని ఆలంబనగా చేసుకొని చేయబడుతున్నవి. ప్రామాణిక తెలుగు వ్యావహారికం 19 వ శతాబ్దం దాకా ఒక కులమాండలికం మాత్రమే. ఆ కులస్థులు తప్ప దాన్ని ఆ మూడు జిల్లాలలో సహితం ఎవఱూ మాట్లాడేవారు కారు. ఇప్పటికీ కొంతమేఱకు అదే పరిస్థితి కొనసాగుతున్నదని చెప్పుకోవచ్చు. సదరు కులస్థులు ఆర్థికసత్తా ఉన్న జనం కారు. ఈ సామాజిక అంశాన్ని విస్మరించి ప్రామాణిక వ్యావహారిక ప్రాబల్యానికీ, మధ్యకోస్తా ప్రాంతపు ఆర్థిక ముందంజకూ అనవసరంగా ముడిపెట్టడం ఆక్షేపణీయం. మధ్యకోస్తా విజయగాథ సాపేక్షంగా ఇటీవలిది మాత్రమే. స్వాతంత్ర్యం వచ్చేనాటికి అది అన్ని ప్రాంతాల్లాగానే ఉండేది. కానీ ప్రామాణిక తెలుగు ఎనభయ్యేళ్ళ క్రితమే ప్రాచుర్యంలోకి వచ్చింది.

    భాషాసాహిత్యాలే కాదు, ఏ రంగంలోనైనా ప్రామాణికత్వానికి నిజమైన అర్థం చలనశీలత, వ్యాప్తి. అవి లోపించినవాటిని సుప్రతిష్ఠిత ప్రామాణికాలకు ప్రత్యామ్నాయంగా నిలబెట్టడం – మైనర్ పిల్లవాడి చేత మేజర్ పిల్లకు తాళి కట్టించడం మాదిరిగా ఒక వైరుద్ధ్యం అనిపించుకుంటుంది.

    ఎక్కువ వ్రాసి ఉంటే క్షమించండి.

  4. Srinivas Nagulapalli

    Nativity కోసమో వినోదం కోసమో, ఏ మాండలికాన్నైనా విపరీతంగా చూపించడం లో చూపిన చొరవ మరి హీరో పాత్రలకు పొరపాటుగానైనా అంతే చొరవతో చూపించకపోవడం అసంకల్పితం కాదు అనూహ్య పరిణామమూ కాదు. ఒక్కటే భాషారూపాలు అన్నీ అన్న స్పృహ విమర్శకులకు, సాహితీవేత్తలకు నిజాయితీగా ఉంటే ప్రాంతీయ భేషజాలు ఇంతగా ముదిరేవి కావేమో, కనీసం భాషాపరంగానైనా. రాజకీయనేతల రగడకన్నా సాహితీవేత్తల మేధావుల అలసత్వమే ఎక్కువ ఆజ్యం పోసి నష్టం కలిగిస్తుందేమో అనిపిస్తుంది.

  5. Srinivas Nagulapalli

    “నేనంటున్నది గ్రాంథికానికున్నట్లే మాండలికాలక్కూడా పరిమితులున్నాయని ! ఆ పరిమితుల్ని గమనించి వాడకపోతే అది ఉన్మాదమే అవుతుంది.”

    పరిమితుల్ని గమనించి వాడకపోతే ఏమైనా కావచ్చు కాని ఉన్మాదం ఎందుకు అవుతుందో అర్థం కాలేదు. భాషలు, కళలు, సైన్సులు సొంత పరిమితుల్ని స్వయంగా చెరిపేస్తూ పోతుంటేనే పురోగతి అని, liberal arts అని అంటాం కదా. అన్ని ప్రయోగాలు పేలకపోవచ్చు, ఎన్నో తప్పిదాలు కావచ్చు, లోపాలూ ఉండొచ్చు. అయితేనేం, దేనినీ కించపరచనప్పుడు, ఎవ్వరికీ హాని చేయనంతవరకు ఏదైనా, అందునా ఒక భాషా రూపం ఉన్మాదం ఎట్లా అవుతుందో అర్థం కాదు.

    “ఇతరవిధాలైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సుల నేపథ్యం అంతకుముందే సిద్ధంగా ఉన్నప్పుడు ప్రతిదీ అవమానిస్తున్నట్లే కనిపిస్తుంది.”

    సాహిత్యకారులు అంత అలవోకగా మానసిక నిపుణులు ఎట్లా అవుతారో ఆశ్చర్యం. సాంతం ఒక ప్రాంతం వారే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సుల తో ఉంటే పుస్తకాలకన్నా మానసిక ఆసుపత్రులు కట్టిస్తే ఎక్కువ సహాయమేమో.

    సినిమాల ప్రస్తావన రాజకీయ ఆర్థిక కారణాలు ఎంతగా ప్రామాణిక భాష యొక్క దిశ దశ నిర్దేశం చేయగలవో చూపిస్తుంది. చిత్రపరిశ్రమ ఏఏ మాండలికాన్ని ఏఏ కాలంలో ఏం చేసినా వదిలేసినా, పత్రికా భాషలో ప్రసార మాధ్యమాలలో ప్రచురిస్తున్న పుస్తకాలలో, ముందెన్నడూ లేనంతగా నేడు తెలంగాణా మాండలిక పదజాలం కనపడడం, చోటుచేసుకోవడం యాదృచ్చికం అయితే కాదు అని కూడా అనిపిస్తుంది. అంటే నిన్నటి ప్రామాణిక భాష నేడు మారుతునే ఉంది, సజీవ భాషకు సాక్ష్యంగా.

  6. తాడేపల్లి

    వ్యాసరచయిత మాండలికాల అభిమానే కానీ వ్యతిరేకి కాదు. ఎందుకంటే అతనిక్కూడా ఒక మాండలికం ఉన్నది. మాండలికం ఒక ప్రతిపాదన కాదు. అది ఒక వాస్తవం. ఉనికిలో ఉన్నదానిని వ్యతిరేకించేదేముంటుంది ? తన పుస్తకమంతా గానీ, లేదా ఒక ప్రాంతపు సాహిత్యమంతా గానీ ఆ మాండలికంలో ఉండాలనుకోవడమే ఉన్మాదం. ఎందుకు ? అనేది నా పై వ్యాసంలోనూ, వ్యాఖ్యల్లోనూ విపులంగా తెలియజేశాను. పదసాధుత్వం నా సబ్జెక్టు గానీ ప్రస్తావన గానీ కాదు. నేను దాని గుఱించి వ్రాయలేదు. నేనంటున్నది గ్రాంథికానికున్నట్లే మాండలికాలక్కూడా పరిమితులున్నాయని ! ఆ పరిమితుల్ని గమనించి వాడకపోతే అది ఉన్మాదమే అవుతుంది. అయితే ఈ మనఃస్థితికి విశాలప్రజాదరణ ఇప్పటికీ లేదు. బహుశా ఎప్పటికీ ఉండదు. అందుచేత మాండలికవాదుల దృక్కోణంలోని లోపాలను ఎత్తిచూపడానికే నేను పరిమితమయ్యాను.

    ఇహపోతే తెలుగు సినిమాలలో నీచపాత్రలకు అత్యంత అధికంగా బహువిస్తారంగా ఉపయోగించబడ్డ మాండలికం గోదావరి జిల్లాలది. తెలంగాణది కాదు. కావాలంటే పాత సినిమాలలో దేనినైనా తీసుకొని పరిశీలించవచ్చు. తెలంగాణ మాండలికాన్ని వాడడం చాలా ఆలస్యంగా 1985 లో ప్రతిఘటన సినిమాతో మొదలయింది. అయితే ఒక తేడా ఉన్నది. తమ మాండలికాన్నీ, తద్ద్వారా తమనూ అలా అవమానించారని గోదావరిజిల్లాలవారెప్పుడూ భావించలేదు. కానీ తెలంగాణవారు అలా భావించారు. ఇతరవిధాలైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సుల నేపథ్యం అంతకుముందే సిద్ధంగా ఉన్నప్పుడు ప్రతిదీ అవమానిస్తున్నట్లే కనిపిస్తుంది. వాస్తవమేమంటే – సినిమా పరిశ్రమ మద్రాసు నుంచి పూర్తిగా హైదరాబాదుకు తరలివచ్చిన తరువాత తమ కథలన్నీ హైదరాబాద్ లో బేస్ అయినట్లు తీయదల్చుకున్నారు నిర్మాతలు. స్థానికత (నేటివిటీ) కోసం తెలంగాణ మాండలికాన్ని ప్రవేశపెట్టారు. అంతకుముందు నిర్మాతలు షూటింగులన్నీ గోదావరి జిల్లాలలోనే జఱిపేవారు. తెలంగాణ మాండలికం ఇలా Backfire అవుతుందని అప్పట్లో వారు ఊహించలేకపోయారు. వారికి అనుభవం లేదు. ఎందుకంటే మాండలిక వాడకానికి అంతకుముందు ఏ జిల్లావారూ తెలంగాణవారిలా రియాక్ట్ అవ్వలేదు. ఈ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం చిత్రపరిశ్రమ ఏ పాత్రకైనా సరే తెలంగాణ మాండలికాన్ని వాడడం మానేసింది. శుభం.

  7. Srinivas Nagulapalli

    “ఉన్మాదం అని ఎందుకంటున్నానంటే ఇప్పటికే సిద్ధాన్నంలా, వడ్డించిన విస్తరిలా ఉన్న ప్రామాణిక తెలుగు స్థానాన్ని మాండలికాలతో ప్రతిక్షేపించాలనే తహతహ వారిలో కనిపిస్తున్నది”
    అన్నది చదివాక ఎందుకో నేను అభిమానించే బేతవోలు రామబ్రహ్మం గారి మాటలు గుర్తొచ్చాయి. బేరాగారి దేవీభాగవతం పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు వచ్చిన తరువాత ముళ్ళపూడి వెంకట రమణగారి సలహాతో పుస్తకం మలి ముద్రణలో అందులో “దొర్లిన” ఉర్దూ జన్య పదాలను తొలగిస్తానని చెప్పారు. అంటే “రోజు” అన్నటువంటివి. అంటే ఎక్కడో పుట్టి ఇంకో దేశాలకు వలస వెళ్ళీ అక్కడి పౌరులుగా స్థిరబడి బతుకుతున్న కాలంలో, ఎప్పుడో “మనది” అయిపోయిన పదాలను మెచ్చుకొని సన్మానించిన సిద్ధాన్నంలా వడ్డించిన పుస్తకం లోనుంచి నొచ్చుకొని తొలగించాలనుకోవడం లేదా తక్కువచేయడం వెర్రితనం. ఇదెందుకు చెప్పడమంటే “ప్రామాణికత” ముసుగులో మాండలికాలను తక్కువచేయడం మన తెలుగు భాష యొక్క వారసత్వంలో చీకటి కోణం. ఏ భాషలో కూడా అదే భాషలో ఒదిగిపోయిన రెండు పదాలను కలిపే ప్రయోగాన్ని “దుష్టసమాసం” అని ఘాటుగా తిట్టే దుష్ట సాంప్రదాయం ఒక్క తెలుగులో తప్ప లేదేమో. తెలుగు వ్యాకరణ పండితులకు వారి అల్లుల్లు కోడళ్ళు వేరే భాషవారైన పరవాలేదు కాని, ఎన్నాళ్ళనుంచో తెలుగులో అంతర్భాగమయిపోయిన పదాలను “సంస్కృతాలు” తత్సమాలు అని, వాటి సంయోగం దుష్టసమాసమని అనడం, లేదా, అన్నవారిని కాదనకపోవడం ఉన్న మాటను నొక్కి చెప్పడమే. నచ్చితే అభిమానం, నచ్చని వెర్రితనం ఉన్మాదం అంటుంటారు కొన్నిసార్లు.

    తెలంగాణా లొల్లి వేడెక్క ముందు వరకు కూడా సినిమాల్లో యే యాస రౌడీలకు బఫూన్లకు మాత్రమే, హీరోలకు ఎప్పుడూ కాదు, వాడేవారో, అప్పుడది ఎందుకు ఉన్మాదం లాగా అనిపించలేదో ఆశ్చర్యం. “ఉన్మాదం” అయితే అయింది, మాండలికంలో ఎక్కువ రాసినా అదీ తెలుగు భాషే కాబట్టి భాషాభిమానులు సంతోషించాల్సినదే ఎక్కువ. ప్రామాణిక భాష అన్నది మారని బ్రహ్మ పదార్థం కాదు. ఎక్కువగా మాండలికాలలో రాస్తే భాషకు భాగ్యమే. అందులో ఏ పదాలు ఏ రూపాలు కాలప్రవాహంలో బలంగా నిలబడితే వాటితో ప్రామాణిక భాష నిత్యనూతనంగా మారుతూనే ఉంటుంది. మారుతుంటేనే భాషకు జీవం, లేకపోతే శవం.

  8. సౌమ్య

    ఇంకా వ్యాసం పూర్తిగా చదవలేదు. కానీ, ంఇరు ఇక్కడ ఇచ్చిన ‘వానల పేర్లూ చదివి, పంచుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుకునేందుకు ఈ వ్యాఖ్య రాస్తున్నాను.

  9. మెహెర్

    కాల్పనిక రచనల్లో అయినా (కథల్లో, నవలల్లో) పాత్రలు సంభాషించేటపుడో, లేదా మొత్తం కథను ఒక పాత్ర ఉత్తమపురుషలో చెప్తున్నపుడో మాత్రమే మాండలిక వాడకం ఒప్పుతుందని నాకనిపిస్తుంది. ఇలాంటపుడు సదరు పాత్రల ప్రాంతీయతను బట్టి మాండలికం వాడటమే సముచితం. కానీ రచయితే సర్వసాక్షి కథకుడై (థర్డ్‌ పెర్సన్‌లో) కథనాన్ని నడిపిస్తున్నపుడు కూడా, ప్రాంతీయ మాండలికపు గొంతుతో కథ చెప్పడం అంతగా నప్పదు. కొట్టొచ్చినట్టుండే మాండలికపు గొంతులో ఇలాంటి కథనాన్ని చదువుతున్నపుడు, ఆ రచనా ప్రపంచానికీ అందలి పాత్రలకీ వెనుక ఒక రచయిత వున్నాడన్న స్పృహ పాఠకునికి అనునిత్యం వుంటుంది. ఈ పద్ధతిలో పాఠకుడు కథలో అంతగా లీనం కాలేడు. సాధారణంగా మనం ఒక కాల్పనిక రచన చదువుతున్నపుడు ఆ ప్రపంచాన్ని వేలిదారాల్తో ఆడిస్తున్న ఆటగాని ఉనికిని మర్చిపోవటానికే ఇష్టపడతాం కదా! కేవలం మాండలికంపై ప్రేమతో, అప్పటిదాకా శృత మాధుర్యమైన దాన్ని రాతల్లో గుర్తించి ఆనందించాలనుకునే పాఠకులను మాత్రమే ఇలాంటి రచనలు ఆకట్టుకోగలవు.

    నేను ఇలాంటి రచనలు కొన్ని చదివాను. పైపెచ్చు ఈ రచయితలు తమ మాండలికాన్ని వాడే తీరు కూడా, ఏదో వాడాలన్న నిబద్ధతతో వాడుతున్నట్టు వుంటుందే తప్ప సహజత్వం వుండదు. పదాలకు మాండలికపు ప్రత్యామ్నాయం దొరికినపుడు మాత్రమే వాడుతూ, అవి దొరకనపుడు ప్రామాణిక భాషకు బదిలీ అయిపోయే వాళ్ళే ఎక్కువ.

  10. కామేశ్వర రావు

    నా ఉద్దేశంలో భాష విషయమై కాల్పనిక రచనలని (కవిత్వం, కథలు మొదలైనవి) వేరేగా చూడాల్సిన అవసరం ఉంది. ఇందులో మాండలిక భాషా ప్రయోగం మంచిదని నా అభిప్రాయం. ఎలాగూ వీటికి పాఠక వర్గం పరిమితమే. అంతకన్నా ముఖ్యంగా ఇలాంటి రచనలు రచయిత హృదయానికి దగ్గరగా ఉంటాయి కాబట్టి, వాతవరణ కల్పనలో కాని, సంభాషణలో కాని మాండలికం సహజత్వాన్ని ఇస్తుంది. రచయిత కూడా తను చెప్పదలచుకున్న భావాలని స్పష్టంగా శక్తివంతంగా చెప్పగలుగుతాడు. దీని వల్లనే స.వెం.రమేశ్ గారి కథలు నాకు చాలా నచ్చుతాయి. అలాగే పెద్దింటి అశోక్‌ కుమార్‌ గారి కొన్ని కథలు కూడా.

    కల్పనేతర రచనలు(non-fiction) మాత్రం ప్రామాణిక భాషలో ఉండడం అవసరం. ప్రామాణిక భాష అంటే అదేదో వ్యాకరణ చట్రంలో పూర్తిగా బిగుసుకుపోయినది అనుకోవడం పొరపాటే. వ్యాకరణం ఒక విశాలమైన భూమికనే ఇస్తుంది. అందులో మాండలిక భేదాలకు చోటుంది. ఉదాహరణకి పండితులైన వాళ్ళు ప్రామాణికభాషలో రాసిన వ్యాసాలలోనే “వచ్చిరి, వచ్చినారు, వచ్చారు” లాంటి భేదాలు కనిపిస్తాయి. వ్యాసంలో చెప్పినట్టుగా మాండలిక భేదాలు కూడా ప్రామాణిక భాషలోకి వచ్చి చేరతాయి.

    ఈ విషయాలు దృష్టిలో పెట్టుకుంటే మాండలిక ప్రామాణిక భాషల మధ్య వైరుధ్యం ఉండక్కరలేదని తెలుస్తుంది.

  11. తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

    లాభానికీ, పేరుప్రతిష్ఠలకూ భరోసా లేకుండా వ్రాయడం వల్లా, ప్రచురించడం వల్లా ఏమైనా ప్రయోజనముందా ? ఎవఱు ఆర్థికంగా తమ చేతులు కాల్చుకోవడానికీ, పడిన శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరుగా చేసుకోవడానికీ సిద్ధంగా ఉన్నారు? నేనీ మాట చెప్పనక్కఱలేదు. నేను చెప్పినా చెప్పకపోయినా జనం మాండలికాల జోలికి వెళ్ళరు. వాళ్ళు నా కంటే ప్రాక్టికల్.

    “…తెలుగు కూడా ఆంధ్రా తెలుగు, తెలంగాణా తెలుగుగా మారితే తప్పేమిటి? “

    ఆ మాండలిక భేదం ఇప్పటికే ఉన్నది. ఇందులో తప్పొప్పుల ప్రసక్తీ ifs and buts ప్రసక్తీ ఏమున్నాయి ? అది ఉన్నది. అంతే.

    “…అసలు ప్రామాణిక తెలుగుతో తెలంగాణావాసులకు ఉన్న సమస్యలపై ఒక వ్యాసం వ్రాయాలి మీరు.”

    అది తెలంగాణవారే వ్రాస్తే బావుంటుంది. నా అభిప్రాయంలో – నేను గమనించినంత వఱకు – తెలంగాణవారికి ప్రామాణిక తెలుగుతో ఎలాంటి సమస్యలూ లేవు. అది కూడా వారి భాషే కనుక. తెలంగాణలో మీడియా మొత్తం ప్రామాణిక తెలుగులోనే నడుస్తున్నది. వారికి అది చిరపరిచితమూ, సులభబోధ్యమూ కూడా.

    సమస్య ఉన్నదల్లా కొద్దిమంది మాండలిక అహంకారంతోనూ, సదరు అహంకారులతోనూ మాత్రమే. వీరు కేవలం అహంకారులే కాక ప్రాంతీయద్వేషులు కూడాను. నేనీ వ్యాసంలో చెప్పినట్లు మాండలికవాదం పచ్చివ్యావహారికవాదానికి కాచిన కుక్కమూతిపిందె. గ్రాంథికానికి పరిమితులున్నట్లే వ్యావహారికానికీ, మాండలికానికీ తమ పరిమితులు తమకున్నాయి. ఈ సంగతి అందఱూ గుర్తించే రోజు రావాలి.

  12. chavakiran

    తాబాసు గారు,
    మీరు బేసిగ్గా ఆర్థికంగా లాభదాయకం కాదు కాబట్టి ప్రామాణికంలో వ్రాయండి అనే ఆర్గ్యుమెంటు ఇస్తున్నట్టు ఉన్నారు. కానీ డబ్బులు ఎవరికి కావాలండి మా ఆత్మాభిమానం మాకు ముఖ్యం. ఆంగ్లం మాత్రం అమెరికా ఇంగ్లీష్, బ్రిటన్ ఇంగ్లీష్ గా మారలేదా. అలానే తెలుగు కూడా ఆంధ్రా తెలుగు, తెలంగాణా తెలుగుగా మారితే తప్పేమిటి? అని వాదించవచ్చు కదా. మీ వ్యాసంలో వీటికి సమాధానం లేదు. అసలు ప్రామాణిక తెలుగుతో తెలంగాణావాసులకు ఉన్న సమస్యలపై ఒక వ్యాసం వ్రాయాలి మీరు.

  13. కొత్తపాళీ

    చాలా విలువైన విషయాలు చెప్పారు, ఆలోచించాల్సిన అంశాలు లేవనెత్తారు. ఇంకొంచెం సమయం పడుతుంది ఇదంతా అర్ధం చేసుకోవడానికి. ఈ వ్యాఖ్య ముఖ్యంగా – ప్రామాణిక తెలుగు గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లాల భాష – అనే తీర్మానాన్ని గురించి. అసలు ఈ తీర్మానం ఎలాగొచ్చిందో నాకు అర్ధం కాదు. విజయవాడ, అవనిగడ్డ, నూజివీడు వీధుల్లో ఎవరూ ఈ “సో కాల్డ్” ప్రామాణిక తెలుగు మాట్లాడరు. నేను విజయవాడ వీధుల్లోనే పెరిగాను. నా చిన్నతనంలో నేను వింటూ ఉన్న భాష, నా బడి నేస్తాలతో నేను మాట్లాడుకున్న భాష ఈ ప్రామాణిక భాష కానే కాదు. ఏదో ఒకటి రెండు పలుకుబడుల గురించి నేనీ మాట చెప్పడం లేదు. నా వుద్దేశం ఏవిటంటే ఏ జిల్లా అయినా ఏ మండలం అయినా వీధిలో, దైనందిన జీవితంలో ప్రజలు మాట్లాడే భాష “ప్రామాణిక భాష”కి భిన్నంగానే ఉన్నది.

Leave a Reply