ఎందరో భామతులు..

అనగనగా ఒక ముని. యవ్వనంలోనే ఉన్నాడు. ధర్మశాస్త్రాలకు భాష్యం రాయాలని కూచున్నాడు. బైటి ప్రపంచాన్ని పూర్తిగా మరిచి పనిలో నిమగ్నమయ్యాడు. పాపం అతని తల్లి వృద్ధురాలైంది. ఆవిడ పక్క గ్రామం వెళ్లి అతనికి భార్యను ఎంపిక చేసింది. చాలా విధేయుడైన కుమారుడు, ఆ ఊరు పోయి, ఆ అమ్మాయిని వివాహమాడాడు. వివాహమైన తర్వాత కూడా లేఖన, పఠన కార్యక్రమంలో తలమునకలుగానే ఉన్నాడు. వయసు పెళ్లాం గురించి మరిచిపోయాడు. అతని ఏకాగ్రత అలాంటిది. కొన్నాళ్లకు అతని తల్లి చనిపోయింది. అతని భార్య విషయం తెలుసుకుని తనకై తాను భర్త ఇంటికొచ్చేసింది. భర్త పరిస్థితి అర్ధం చేసుకున్నది. బైట చాకిరి చేసి, డబ్బు సంపాదించి, కొడుక్కు తల్లి వండిపెట్టినట్లు, భర్తకు వండిపెడుతూ సేవలు చేస్తున్నది. మునిగారు తన పని కొనసాగించారు. ఏళ్లూపూళ్లూ గడిచాయి. ఒకరాత్రి మునిగారు తను రాయదలుచుకున్న విషయం చివరిగీత రాయడం ముగించారు. ఈలోకంలోకొచ్చి ఇంటిని కలియచూశాడు. ఒక ముసలావిడ నేలమీద పడుకొని నిద్రబోతుండడం గమనించారు. దగ్గరకొచ్చి పరిశీలనగా చూశాడు. ముఖం ఎప్పుడో చూసినట్లుంది.. కానీ ఈ వ్యక్తి ఎవరో గుర్తు రావడం లేదు. ఎవరామె? నిద్రలేపాడు. ‘అమ్మా! ఎవరు మీరు? ఇక్కడికెప్పుడొచ్చారు? ఎందుకు వచ్చారు?’ అని ప్రశ్నించాడు. ఆవిడ చాలా వినయంగా సమాధానం చెప్పింది. ‘స్వామీ! నేనే మీ భార్యను. మీ తల్లి చనిపోయిన తరువాత మీ సేవకు ఇక్కడ చేరాను. నలభై సంవత్సరాలుగా మీతో ఉండి సేవలు చేస్తున్నాను..’ మునిగారు అవాక్కయ్యారు. తన కళ్లను తానే నమ్మలేకపోయారు. ఇంట్లో ఒక ఆడమనిషి తనకోసం ఇంతగా శ్రమిస్తుండడం, తను గమనించనేలేదు. చాలా మర్యాదపూర్వకంగా అడిగాడు. ‘మీ పేరేమిటి?’
‘నా పేరు భామతి’ చెప్పిందావిడ.
వెంటనే అతను రాతపరికరం తీసుకుని తను రాసిన గ్రంధానికి ‘భామతి’ అని పేరు పెట్టాడు. ఈరోజుకూ భామతి సంస్కృత భాషా విద్యార్థులకు పరిశీలన గ్రంధంగా ఉపయోగపడుతున్నది. భర్తల బాగు కోసం యవ్వనాన్ని స్వసుఖాన్ని త్యాగం చేసిన మహిళామణులకు ప్రతీక భామతి. మునిగారి పేరెవరికీ తెలీదు. భామతి పేరు మాత్రం చరిత్రలో స్థిరమైంది.
—–
కథ పాతదే కావొచ్చు. మన సమాజంలో భామతులకేం కొదవ లేదు. భర్త పైకి రావడం కోసం నిచ్చెన మెట్లలా ఉపయోగపడే భార్యలకు తెలివి, లోకజ్ఞానమూ, తార్కికంగా ఆలోచించగల శక్తీ ఉంటే వాళ్ల ఆలోచనలెలా ఉంటాయి? నిస్సారమైన సంసార చట్రంలో ఇమడలేక, అలాగని విడిచిపోలేక వాళ్లనుభవించే క్షోభ ఎటువంటిది? వీటిని ప్రతిబింబించే నవల ‘ఎండీగారి భార్య’. ‘ఇన్ఫోసిస్‌’ విజయంలో సగపాలు పంచుకున్న సుధామూర్తి రాసిన తొలినవల ఇది. ‘ప్రతి ఒక్కరికీ మానసిక ఆనందం కావాలి. ఆ ఆనందం విశ్వాసంలోంచి పుడుతుంది. విశ్వాసం నువ్వు హృదయపూర్వకంగా చేసే పనిలోంచి వస్తుంది..’ అన్న నమ్మకాన్ని వెలిబుచ్చిన ‘ఎండీగారి భార్య’ చదివిస్తుంది.. ఆలోచింపజేస్తుంది. ద్వారక అనువాదం సరళంగా సాగింది.

పుస్తకం వివరాలు:

ఎండీగారి భార్య (MD gari bharya)
రచయిత్రి : సుధామూర్తి (Sudha Murthy)
అనువాదం : ద్వారక (Dwaraka)
ప్రచురణ : అలకనంద (Alakananda)
పేజీలు 163, వెల : రూ.90/

You Might Also Like

12 Comments

  1. స్నేహ

    @Achilles :పుస్తకం వైపుకి అంటే పుస్తకం సైట్ కి కాదండి. పుస్తకం లో ఈ పరిచయం ఉన్న పేజికి అని అర్థం. అయినా పుస్తకం ఏంచేసిందని రావడం మానేస్తాను.

  2. Achilles

    స్నేహ గారు- పుస్తకం వైపు రావడం ఎందుకు మానుకోవాలి? చిన్న చిన్న విషయాలు లైట్ తీస్కోండి 🙂

  3. స్నేహ

    అరుణ గారు,
    మీరిచ్చిన వివరణనాకే అని అర్థం అయ్యింది.
    “తమ బ్లాగుల్లో కామెంట్లే పెట్టే వీల్లేకుండా కట్టుదిట్టం చేసుకుని వేరే సైటుల్లో తమ అమూల్యమైన అభిప్రాయాలు వెలిబుచ్చడం – ప్చ్.. తప్పమ్మా. ఒరులేయవియొనరించిన నరవర, యప్రియంగు తనమనంబునకగు తానొరులకునవి సేయకునికి పరాయణము పరమధర్మ పథములకెల్లన్.. అని భారత సూక్తి. ఇతరులు ఏది చేస్తే మనకు నచ్చదో, అది మనం ఇతరులకు చెయ్యకూడదనేది అర్థం. అందరికీ నమస్కారం.”
    చాలా ధన్యవాదములండి. మీరు రాసిన వాటి గురించి వ్యాఖ్యానించాను అంతేగాని మీ పరిచయంలో లేని వాటిని నేనేమి కల్పించి అడగలేదు. నేను అడిగినదానికి వివరణ ఇవ్వడం ఇవ్వకపోవడం మీ ఇష్టం అంతేకాని నా బ్లాగు గురించి లాగడం అనవసరం. నా బ్లాగు గురించి మీకు ఎలాంటి అభిప్రాయం ఉన్నా నా బ్లాగులో రాయొచ్చు అంతే కాని ఇలా డొంకతిరుగుడు గా చెప్పడం సరికాదు.నాకు ఇలా వాదాలు పెట్టుకునే ఒపికలేదు. కాని మీరు ఇలా సమాధానం చెప్పమంటే అనవసరమైన విషయాలైన నా బ్లాగు గురించి ఇందులో లాగడం మాత్రం నాకు అసలు నచ్చలేదు. ప్రతి దానికి ఒక సమయం సందర్భం ఉంటాయి ఇక్కడ మీరు రాసిన పరిచయం గురించి చర్చిస్తున్నాం భేదాభిప్రాయాలు ఎన్ని వున్నా పరిధి దాటకూడదు. నా బ్లాగు కామెంట్లు ఇప్పటి చర్చ పరిధిలోకి రావు. మీకు నా బ్లాగు గురించి సందేహాలుంటే నా బ్లాగులో చర్చించుకుందాం రండి.
    పుస్త్కం వారికి: క్షమించండి. నా కామెంటు అనవసరం అనిపిస్తే తొలగిచాలనుకుంటే సదరు రచయిత రాసిన కామెంటులో కూడా నా మీద వ్యక్తిగత ఆరోపణలున్నాయి అవికూడా తొలగించగలరు.
    అరుణ గారు ఇక నేను పుస్తకం వైపు రావడం లేదు మీరు వివరణ ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు అనవసరం.

  4. అరుణ పప్పు

    పరిచయాన్ని చదివి తమ అభిప్రాయాలు వెలిబుచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఏదైనా ఒక విషయాన్ని చదువుతున్నప్పుడు మనకు తెలిసినదానితో అన్వయించుకుంటాం. తెలియనివాటిని అర్థం చేసుకునే ప్రక్రియలో అదొక భాగం. అయితే చాలాసార్లు అందులో స్వీయ పరికల్పనలకే అధిక ప్రాధాన్యమిస్తాం. అంటే నేను రెండురెళ్లు నాలుగు కాదు అన్నాననుకోండి. అయిదనో, ఎనిమిదనో నా భావం కాదు. ఇలాగెందుకన్నావూ అనడిగితే నేను చెబుతాను. ఎనిమిదని మీ భావమా.. అని ప్రశ్నించారనుకోండి. వాళ్లకేమీ చెప్పలేం. ‘క్షోభకు గురవుతున్న స్త్రీలు భర్త పైకి రావడానికి ఎలా సాయపడతారు.. తెలివిలేనివాళ్లే సంసారంలో హాయిగా ఉండగలరా..’ వంటి ప్రశ్నలు అలాంటివే. ఆధునిక సమాజంలో భామతిలాంటి మహిళలు అనేకమని మీకు తెలిస్తే కథలోని మంచిచెడులు అర్థం అయ్యేవి. ఎండీగారిభార్య అన్న పుస్తకం ఎందువల్ల మంచి పుస్తకమో అర్థమయ్యేది. లేదా చదివైనా తెలుసుకుందామనిపించేది. ఇలాగాకుండా నా పరిచయాన్ని జడ్జ్ చెయ్యడానికి కూచుంటే కాలహరణం తప్ప మరేం లేదు. ఇందులో స్వీయ పరికల్పనలకు అధిక ప్రాధాన్యమిచ్చిన వారికి చివరకు అవే మిగులుతాయి. అనుకోవడాలుగాకుండా వివిధ స్థాయుల్లోని మహిళల వాస్తవ స్థితిగతులను అర్థం చేసుకున్న అతివలెవ్వరూ పైన సంధించిన ప్రశ్నల్లాంటివి వెయ్యరు. సుధామూర్తి వ్యక్తిత్వం మీద, సమాజం పట్ల ఆమె అవగాహన మీద నాకు అఖండమైన గౌరవం ఉంది. వాటికి అద్దం పట్టిన ఈ పుస్తకం మీద కూడా. అదే నాతో ఈ పరిచయాన్ని రాయించింది.
    మరొక విషయం. తమ బ్లాగుల్లో కామెంట్లే పెట్టే వీల్లేకుండా కట్టుదిట్టం చేసుకుని వేరే సైటుల్లో తమ అమూల్యమైన అభిప్రాయాలు వెలిబుచ్చడం – ప్చ్.. తప్పమ్మా. ఒరులేయవియొనరించిన నరవర, యప్రియంగు తనమనంబునకగు తానొరులకునవి సేయకునికి పరాయణము పరమధర్మ పథములకెల్లన్.. అని భారత సూక్తి. ఇతరులు ఏది చేస్తే మనకు నచ్చదో, అది మనం ఇతరులకు చెయ్యకూడదనేది అర్థం. అందరికీ నమస్కారం.

  5. Vamsi

    “sudha murthy” tag is more than enough to read her books…always loved her works.. never heard about this one. thanks for your introduction..btw, wats the original version name?

  6. teresa

    ఈ పరిచయాన్ని బట్టి ఆ పుస్తకం చదవనే అక్ఖర్లేదనిపిస్తుంది.

  7. ప్రియ

    “నిస్సారమైన సంసార చట్రంలో ఇమడలేక, అలాగని విడిచిపోలేక వాళ్లనుభవించే క్షోభ ఎటువంటిది?”

    పై మాటలు ఎవరన్నా సాధకులు అని ఉంటే అద్భుతమైన మాట గా చెలామణి అయ్యేది.

    ఇదే దేశం లోని ఇల్లాళ్ళ భావన అయితే, ఇహ ఈ దేశాన్ని దేవుడు కూడా రక్షించలేడు!! ఎవరో మహానుభావుడన్నట్లు… “దేశం లో తోక చుక్క పుట్టినట్లే!!”

    The story depicts the pinnacle of sacrifice, the extent to which a woman can go for her family/husband. So sad that it was used the way it has been on this review.

  8. Niru

    @sneha: i too got the same doubts wat u expressed..Somehow felt that conclusion is understating the ability of women…

  9. chavakiran

    మీరు చెప్పిన కధ బాగుంది.

    పుస్తకం గురించి ఇంకొన్ని వివరాలు చెపుతారేమో అనుకున్నాను. బట్ ఓకే

    నేనయితే పుస్తకం చదువుదామనుకున్నాను ఈ రివ్యూ చదవగానే 🙂

  10. స్నేహ

    పుస్తకం ఎలా ఉంటుందో ఏమిటో కానీ మీ సమీక్ష మాత్రం పుస్తకం చదవాలి అనిపించేలా లేదు.మీ సమీక్ష చదివాక కలిగిన కొన్ని ప్రశ్నలు.
    భర్త పైకి రావడం కోసం నిచ్చెన మెట్లలా ఉపయోగపడే భార్యలకు తెలివి, లోకజ్ఞానమూ, తార్కికంగా ఆలోచించగల శక్తీ ఉంటే వాళ్ల ఆలోచనలెలా ఉంటాయి?

    అంటే తెలివి, లోకఙ్ఞానం, తార్కికంగా ఆలోచించగల శక్తీ లేని వాళ్ళే భర్త పైకి రావడానికి ఉపయోగపడతారా?

    నిస్సారమైన సంసార చట్రంలో ఇమడలేక, అలాగని విడిచిపోలేక వాళ్లనుభవించే క్షోభ ఎటువంటిది?

    ఇలా క్షోభ అనుభవించేవాళ్ళు భర్త పైకి రావడానికి ఎలా ఉపయోగపడతారంటారు?

  11. అరుణ పప్పు

    మహేష్ గారూ,
    ఇటువంటి వస్తువుతో వచ్చిన కథలూ నవలలూ అనేకం చదివి ఉండటమో లేదా అస్సలు చదవకపోవడమో జరిగితే ఈ నవల చదవాలా అనిపిస్తుంది. అవతలివారి (నాది కాదు, రచనలో పాత్రలదీ, రచయితదీ) దృష్టికోణం నుంచి చూసినప్పుడు సరిగానే అనిపించవచ్చు. పరిచయం చప్పగా ఉందంటారా.. అది మీ అభిప్రాయం.విశ్వవ్యాప్త సత్యం కానవసరం లేదు, ప్రశ్నార్థకం అసలే కాదు. 🙂

  12. కె.మహేష్ కుమార్

    పరిచయం చాలా చప్పగా ఉంది. “ఇక నవల చదవాలా!” అనిపించేలా ఎందుకు రాయాల్సొచ్చింది?

Leave a Reply