ది వైట్ టైగర్, నవల – అరవింద్ అడిగ

ఈ నవల (The White Tiger -Aravind Adiga) 2008 సంవత్సరానికి మేన్ బుకర్ పురస్కారాన్ని గెల్చుకుంది. కామన్వెల్తు దేశాల్నించి నేరుగా ఆంగ్లంలో వెలువడే నవల్లకోసం నిర్దేశించిన ఈ ప్రతిష్ఠాత్మక బహుమతిని ఇదివరలో గెల్చుకున్న భారతీయ ఆంగ్ల రచయితలు .. సాల్మన్ రష్డీ (మిడ్నైట్స్ చిల్డ్రెన్, 1981), అరుంధతి రాయ్ (గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్, 1997), కిరణ్ దేశాయి (ది ఇన్‌హెరిటెన్స్ ఆఫ్ లాస్, 2005). అంతే కాక రూత్ ప్రావర్ జాబ్వాలా (హీట్ అండ్ డస్ట్, 1975), యాన్ మార్టెల్ (లైఫ్ ఆఫ్ పై, 2002) నవలలు కూడా భారత దేశంతో బలమైన అనుబంధం కలిగున్నాయి. ఇదంతా చెప్పడం ఎందుకంటే, బుకర్ పురస్కారం ఇండియాకీ ఇండియన్లకీ కొత్తకాదు అని చెప్పడం ఒక వంతు. రెండో వంతు .. సరికొత్తగా స్లండాగ్ మిలియనీర్ సినిమా అంతర్జాతీయంగా విజయఢంకా మోగిస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ వేదిక మీద అసలు మన కథల కమామిషు ఏవిటి అని బేరీజు వేసుకోడానికి ఒక ప్రాతిపదిక ఇస్తుందని.

టూకీగా కథ:
చైనా ప్రధాని వెన్ జ్యబావు త్వరలో భారత పర్యటనకి రాబోతున్నారు. నేనొక వ్యాపారదక్షుణ్ణి అని తనను తాను అభివర్ణించుకున్న బలరాం అనే వ్యక్తి ఒక అర్ధరాత్రి, బెంగుళూరులో తన కార్యాలయంలో కూర్చుని చైనా ప్రధానికి తనని తాను పరిచయం చేసుకుంటూ ఒక లేఖ రాయడం మొదలు పెట్టాడు. అది కాస్తా అతని ఆత్మకథగా పరిణమించింది. ఒక జీవిత కాలాన్ని ఒక్క రాత్రిలో చెప్పెయ్యడం కుదరదు కాబట్టీ, పగలు అతని వ్యాపార వ్యవహారాల్లో బిజీగా ఉంటాడు కాబట్టీ, బలరాం తన కథని ఏడు రాత్రుల్లో ఉత్తరాల ద్వారా చైనా ప్రధానికి చెప్పుకొచ్చాడు.

బీహారులో ఒక కుగ్రామంలో నిరుపేద రిక్షావాడి రెండో కొడుకుగా పుట్టి, ఆ ఉమ్మడి కుటుంబంలో మొదట అనామకంగా ఉన్నా, కేవలం తన పట్టుదలతో, నేర్పుతో, తెలివి టేటలతో ఆ పరిస్థితుల్నించి పైకి ఎగబాకి కడకి బెంగుళూరులో వ్యాపారవేత్త అయ్యాడు. మొదట పల్లెలో టీకొట్టులో గిన్నెలు కడుగుతున్నవాడు పట్నానికి చేరుకుని, పట్నంలో టీ కొట్టునించి బయటపడి కారు డ్రైవింగు నేర్చుకుని ఆ ప్రాంతాల్లో స్థానబలిమి ఉన్న ఒక నాయకుడి ఇంట్లో రెండో డ్రైవరుగా చేరాడు. ఆ నాయకుడి పెద్దకొడుకు ముకేష్ తండ్రికి బాసటగా వాళ్ళ బొగ్గు వ్యాపారం చూసుకుంటూ ఉంటున్నాడు. రెండో కొడుకు అశోక్ అమెరికాలో చదువుకుని అక్కడ ఒక దేశీ క్రిస్టియన్ అమ్మాయిని (పింకీ మేడం) పెళ్ళి చేసుకుని వచ్చాడు. ఈ జంట ధన్‌బాద్ లో ఇమడలేక పోతుంటే ఢిల్లీ దగ్గర గుర్గావ్ లో అధునాతనమైన తమ ఫ్లాట్ లో ఉంటూ తమ వ్యాపార లబ్ధికోసం కేంద్ర మంత్రుల్ని సర్దుబాటు చేస్తుండమని తండ్రి అశోక్ నీ భార్యనీ ఢిల్లీ పంపించాడు. ఈ సందర్భంలో బలరాం విధి తనకిచ్చిన అవకాశాన్ని నిర్దయగా ఉపయోగించుకుని మొదటి డ్రైవర్ని అధిగమించి తానే అశోక్ పింకీల డ్రైవరుగా ఢిల్లీ వెళ్ళాడు. అనేక సందర్భాల్లో తన విశ్వాసపాత్రత నిరూపించుకుని యజమానికి అభిమాన పాత్రుడయ్యాడు.

ఢిల్లీలో అంతా మొదట బాగానే ఉన్నా పింకీ మళ్ళీ గొడవ మొదలు పెట్టింది, అమెరికా తిరిగి వెళ్ళిపోవాలని. అశొక్ కీ ఈ లంచాలు, ఈ జీవితం చిరాగ్గానే ఉన్నా, అన్నకీ తండ్రికీ ఎదురు చెప్పలేక ఇటు భార్యనీ సముదాయించలేక సతమతమవుతున్నాడు. కొన్ని అవాంఛనీయ సంఘటనల తరవాత ఒక నడి రాత్రి పింకీ అశోక్ ని వదిలేసి అమెరికా తిరిగి వేల్లిపోయింది. అప్పటికే వ్యాపార రీత్యా తాను నమ్మిన ఆశయాల్ని వదులుకున్న అశోక్ భార్య నిష్క్రమణతో నైతికంగా ఇంకా దిగజారడం మొదలైంది. యజమాని దిగజారుతున్న కొద్దీ బలరాం ఆశయాలు దృఢపడుతున్నాయి. ఏడు లక్షల రూపాయలు తీసుకుని సరి కొత్తమంత్రికి సరికొత్త లంచమిచ్చేందుకు అశోక్ బయల్దేరగా, జోరువానలో, ఢిల్లీ నడిరోడ్డులో కారాపి, పగిలిన జానీవాకర్ సీసాతో పీక కోసి బలరాం అశోక్ ని హత్య చేశాడు. కంగారు పడకండి .. నేనేం సస్పెన్సు బయలు పరచడం లేదు. ఈ సంగతి నవల మొదలైన కొద్ది పేజీల్లోనే వెల్లడి అవుతుంది. ఆ ఏడు లక్షలూ తీసుకుని బలరాం బెంగుళూరులో తేలాడు. అక్కడ మళ్ళీ తన తెలివి తేటల్ని ఉపయోగించి బీపీవో కంపెనీలకి టేక్సీ సర్వీసు మొదలు పెట్టాడు. కథ ముగిసే సమయానికి అతను బలరాం అని కాక అశోక్ అనే పేరుతో 28 కార్లున్న టేక్సీ కంపెనీ యజమానిగా, విజయం సాధించిన వ్యాపారస్తుడిగా ఉన్నాడు.

కథ, పాత్రలు, కథనం .. సమాలోచన

ఈ నవలలో ముఖ్య పాత్రని, కథనీ, కథనాన్నీ విడదీసి చూడలేము. ముఖ్య పాత్ర అయిన బలరాం “నేను” అంటూ ఉత్తమ పురుషలో తన కథని తానే చెప్పుకోవడం ఒక కారణం. కథలో బలరాం తప్ప ఇంకో పాత్ర ఏదీ లేకపోవడం రెండో కారణం. అశోక్, పింకీ, ముకేశ్, బలరాం అన్న, ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు గానీ వారెవ్వరికీ కథలో బలరాంకి దీటైన స్థానం లేదు. బలరాం తన నోటితో చెబుతున్న కథనం వల్ల మనం ఆయా పాత్రల్నీ ఆయా సంఘటనల్నీ బలరాం కళ్ళద్వారా మాత్రమే చూస్తాము. అంతే కాకుండా, బలరాం పాత్ర వ్యక్తిత్వము కథలోని సంఘటనల్లో ఆ పాత్ర ప్రవర్తన వల్ల ఎంత వెలువడుతుందో, తనంత తాను చెప్పుకునే కథనం వల్ల అంతకన్నా ఎక్కువగానే వెలువడుతుంది. ఒక తరగతి గదిలో శాస్త్రీయమైన చర్చ జరిపేందుకు ఇదంతా చాలా ముడిసరుకునిస్తుందనడంలో ఏమీ సందేహం లేదు.

కథా గమనంలో బలరాం తన పుట్టుకకీ, జీవన స్థితికీ అతీతమైన మనిషిలాగా కనిపిస్తాడు. గొప్ప గొప్ప సామాజిక, రాజకీయ, ఆర్ధిక తత్త్వవేత్తలు చెయ్యగల అబ్జర్వేషనులు చేస్తుంటాడు. ఒక పోలిక చెప్పాలంటే, కేశవరెడ్డి గారి అతడు అడవిని జయించాడులో ముసలాడు లోతైన తత్త్వవిచారం చేసినట్టే. అంతేకాకుండా, కథలో అనేక కీలకమైన సందర్భాల్లో బలరాం సాధారణంగా మనిషి అనుభవించే భావోద్వేగాలకి అతీతంగా కనిపిస్తాడు. ఉదాహరణకి, యజమాని తనని ప్రత్యేకంగా మెచ్చుకున్నప్పుడు అక్కడ యజమాని ముందు కృతజ్ఞతతో తడిసి ముద్దైనట్టు కనబడినా, మనవంక కొంటెగా కన్నుకొట్టి ఇదంతా నటనే సుమా, చూడు ఇప్పుడు వీణ్ణి ఎలా వెధవని చేస్తానో అన్న అంతర్గత స్వగతం ఒకటి లీలగా సోకుతుంటుంది. అసలు సంగతేంటంటే ఇదే కథని ఒక నిష్పక్ష కథకుడు ప్రథమ పురుష కథనంలో రాసినట్టైతే బలరాం మనకి ఇంత ఉదాత్తమైన వ్యక్తిగా కచ్చితంగా కనబడ్డు. అస్సలు సిగ్గనేది లేకుండా ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ దూరేసి పైకెగబాకాలనుకునే దురాశాపరుడు కనిపిస్తాడు. తనని మురికి కూపంలోంచి బయటకి తెచ్చి ఒక ఉనికినిచ్చిన యజమాని పట్ల ఏమాత్రం కృతజ్ఞత లేకుండా నిర్దాక్షిణ్యంగా హత్య చేసి డబ్బుతో పరారీ అయిన దానవుడు కనిపిస్తాడు. ఇతరుల పతనమ్మీద తన విజయ ప్రాసాదాన్ని నిర్మించుకోవాలని చూసే అవకాశవాది కనిపిస్తాడు. అతని సొంత గొంతు దీన్నంతనీ మసిబూసి మారేడు కాయ చేస్తుంది.

(ఇంకా ఉంది)

You Might Also Like

11 Comments

  1. కొత్తపాళీ

    ఇది రాసినప్పుడు ఇంకా ఉందనే అనుకున్నాను.
    జాప్యాలస్యం జరిగి, పుస్తకపు జ్ఞాపకం పాతబడిన కొద్దీ, ఈ నవల గురించి ఇంకా రాసేందుకేం లేదులే అనిపిస్తూ వచ్చింది.
    కానీ మళ్ళీ ఈ మధ్య జరిగిన ఒకటి రెండు చర్చలు ఈ నవల మీద నా ఆసక్తిని తిరిగి నిద్ర లేపాయి. చేతిలో అర్జంటుగా ఉన్న పనులు పూర్తి కాగానే రాస్తాను తరువాయి భాగం.

  2. cbrao

    (ఇంకా ఉంది) ఇంకా ఉందా? ఎక్కడ?

  3. Ruth

    hmm…. waiting for the next part !!! 🙂

  4. కె.మహేష్ కుమార్

    అవునూ…ఈ వ్యాసం ఇంకా పూర్తవలేదా?

  5. Sowmya

    @Chetana: Thanks a lot for the info. 🙂

  6. Chetana

    తన కొత్త రచన “Between the assassinations” గురించి ఈరోజు NPRలో అరవింద్‌తో ఇంటర్వ్యూ వచ్చింది.

    http://marketplace.publicradio.org/display/web/2009/06/25/pm_assassinations_q/

  7. Yugandhar

    ‘ఇంకా వుంది’ అన్నారు … ఎక్కడ ఎప్పుడు ?

  8. రాకేశ్వర రావు

    ఈ పుస్తకంలో కొన్ని పుఠలు చదివాను. ఈ దేశీ అనుభవాలను ఆంగ్లంలో చదువుతుంటే వికారంగా అనిపించింది.
    దానికంటేఁ సిరిఁగన్నడం సరిగ్గా నేర్చుకొని గోపాలకృష్ణ అడిగ పుస్తకాలేమైనా చదువుకుంటే ఇంకా బాగుంటుందేమోననిపించింది.

    విదేశీయుల బహమతులొచ్చే పుస్తకాలు వారికే రుచిస్తాయనిపించింది. కానీ ఏం జేస్తాం మనకి మనమే పరాయివారైపోయాం.

    రాకేశ్వర

  9. teresa

    Very good write-up! presenting a gist of the story makes it an interesting read and motivates one to read /not read the book. Hoping to read your analysis in the next part.

  10. నవీన్ గార్ల

    పోలిక అంతగా లేకున్నా, ఈ కథ చదువుతూంటే “భారత్ బంధ్” సినిమా గుర్తొచ్చింది. నాకు నచ్చిన సినిమాల్లో ఇదీ ఒక్కటి. ఇందులో కూడా ఓ పాత్రధారి (కృష్ణ), సోడాలు కొట్టే స్థాయి నుంచి, ముఖ్యమంత్రి అవడం వరకు చూపారు.

  11. కె.మహేష్ కుమార్

    భారతీయ అభివృద్ధి వెనుకనున్న చీకటి కోణాన్ని entertaining గా చెప్పే చీకటిహాస్య నవల ఇది. నాకు నచ్చింది.

Leave a Reply