మరపురాని మనీషి === తిరుమల రామచంద్ర.

వ్యాసం రాసిపంపిన వారు: తృష్ణ

_________________________________________________________________

వంటింట్లో కత్తిపీట ముందర కూర్చుని కూరలు తరుగుతున్న విశ్వనాధ సత్యనారాయణగారు,

కుటుంబ సభ్యులతో జాషువా గారు,

పడకకుర్చీలో కూచుని ఉన్న గన్నవరపు సుబ్బరామయ్యగారు,

గులాబిలు పట్టుకుని, పుస్తకం చదువుతున్న తాపీ ధర్మరావుగారు,

పిల్లలకు పాఠాలు చెప్తున్న తల్లావజ్ఝుల శివ శంకరశాస్త్రిగారు,

వీణ, తబల మొదలైన వాయిద్యాలు వాయిస్తున్న కాశీ కృష్ణాచార్యులు,

వాకింగ్ చేస్తున్న మాడపాటి హనుమంతరావు గారు,

వయొలిన్ నేర్పిస్తున్న ద్వారం వెంకటస్వామి నాయుడుగారు,

వివిధ భంగిమల్లో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు,

మహనీయులైన వీరందరి రకరకాల భంగిమల ఫోటోలు ఒక దగ్గర ఎప్పుడైనా చూసారా? నేనైతే చూడలే. మొదటిసారిగా ఈ మధ్యనే ఓ పుస్తకంలో చూసా..! ఆంధ్రప్రదేశ్ లో సుప్రసిధ్ధులైన ఓ 45మంది ప్రముఖ పండితులు,కవులు,చరిత్రవేత్తలు, కళాసిధ్ధులు అయిన మహనీయుల అపురూప చిత్రాలు, వారి జీవిత విశేషాలు పొందుపరిచిన అరుదైన పుస్తకం “మరపురాని మనీషి” గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇందులోని 45మంది మహనీయులు ఇరవైయ్యవ శతాబ్దం లో తెలుగు సాహిత్యానికి, వివిధ కళలలో,రంగాల్లో ప్రకాశించినవారు కావటం వల్ల ఈ పుస్తకానికి “మరపురాని మనీషి” అని నామకరణం చేసారు. 2001 సంవత్సరంలో “అజొ. విభొ ప్రచురణల” ద్వారా మొదటి ఎడిషన్ వెలువడింది. నలభై ఏళ్ల క్రితం “ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రిక”లో(1962-64లో) శ్రీ తిరుమల రామచంద్ర గారు ఈ రచనలను ఒక శీర్షికగా నిర్వహించారు. ఈ పండితులందరితో స్వయంగా ఇష్టాగోష్ఠి జరిపి, వారి వారి సాంస్కృతిక, కళా జీవితవిశేషాలను తెలుసుకుని వివరంగా రాసారు తిరుమల రామచంద్రగారు.

పుస్తకంలోని ఆకర్షణీయమైన అంశం – ఆయా వ్యక్తుల అపురూప ఛాయా చిత్రాలు. ఈ ఛాయా చిత్రాలు తీయటం ద్వారా శ్రీ నీలంరాజు మురళీధర్ గారు తెలుగువారికి చేసిన మేలు వర్ణించలేనిది.ఈ పుస్తకంలో పొందుపరిచిన ఆంతరంగిక చిత్రాలు కానీ, ఫోటోలు కానీ మరెక్కడా మనకు లభించవు. ఎంతో విలువైన ఫోటోలు అవి. శ్రీ ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారి సహకారంతో మురళీధర్ గారిని ఆ ఫోటోల తాలూకు నెగెటివ్స్ ను ప్రచురణకు ఇవ్వటానికి ఒప్పించారు అప్పాజోస్యుల సత్యనారాయణగారు. పత్రికలో ప్రచురించిన తిరుమల రామచంద్రగారి వ్యాసాలకు మరిన్ని వ్యాసాలు అవసరమైతే; మల్లాది కృష్ణానంద్ గారు మరొక పదహారు మంది ప్రముఖుల జీవిత చిత్రాలను రాసి అందించగా, మొత్తం 45మంది మహనీయులతో ఈ పుస్తకం తయారైంది. పుస్తక రూపకల్పనకు, ప్రచురణకు కారకులు డా. అక్కిరాజు రమాపతిరావుగారు. అందమైన ముఖచిత్రకల్పన చేసిందేమో ప్రముఖ చిత్రకారులు శ్రీ చంద్ర గారు.

ఇందులోని కొందరు ప్రముఖుల గురించి క్లుప్తంగా:

కాశీ కృష్ణాచార్యులు:

“అవధాని శిరోమణి” బిరుదు అందుకున్న సంస్కృతాంధ్ర విద్వాంసులు, అనేక భాషలు నేర్చిన పండితులు. సంగీతం, వీణా వేణూ,వయోలిన్ మృదంగాది వాద్యాలు, వడ్రంగం,కుమ్మరం, నేత,ఈత,వంటకం,వ్యాయామం,కుస్తి ,గారడీ మొదలైన చతుషష్ఠి కళలన్నీ నేర్చిన మహా మనీషి.

తాపీ ధర్మారావు:

తెలుగు భాషా పండితులు. భాషా అభివృధ్ధికి ఎంతో కృషి చేసారు. ‘వాడే వీడు’, ‘క్రొవ్వు రాళ్ళ” మొదలైన నవలలు వెలువరించారు. పత్రికలకు అనేకానేక వ్యాసాలు రాసారు. “కొంటెగడు” ” జనవాణి” “కాగడా” మొదలైన పత్రికలు నడిపారు. “సమదర్శిని” దినపత్రిక ద్వారా ఎంతో ప్రజాసేవ చేసారు. “కొత్తపాళీ” పేరుతో “ప్రజామిత్ర”లో ధారావాహికంగా భాషా విషయిక వ్యాసాలు రాసారు. ఆగర్భ శ్రీమంతులైనా వారి నదవడిలోని సౌమ్యత, సరళ ప్రవర్తన, కీర్తి కాంక్ష లేని ఉదాత్తత తాపీవారికి విశిష్ఠ వ్యక్తిత్వాన్ని ఆపాదించాయి.

గన్నవరపు సుబ్బరామయ్య:

“భారతి” పత్రికే తాముగా, తామే భారతి పత్రికగా నడిపించి పాత, కొత్త రచయితలెందరినో ప్రోత్సహించి ముందుకు నడిపించిన వ్యక్తి. దభ్భై రెండేళ్ళ వయసులో సుప్రసిధ్ధ కేరళ నవలా రచయిత శ్రీ తకళి శివశంకర్ పిళ్లె గారి నవలలు రెండింటిని కేంద్ర సాహిత్య అకాడమీ కోసం తెలుగులో అనువదించారు. పత్రికా రచనలోని ఈయన అనుభవ కార్య దీక్ష తెలుగు సంస్కృతి ఉన్నతికి ఎంతో దోహదపడింది.

రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ:

విశ్వకవి రవీంద్రులు మైసూరు వచ్చినప్పుడు ఆయన “భువన మన మోహిని” “జనగణ మన” పాడుతూంటే పాతికేళ్ళు నిండని అనంతుడు వెంఠ వెంఠనే వయొలిన్ పై స్వరపరుచుకున్నాడట. “i cannot imagine how this young pandit follows me with notations” అని రవీంద్రుడు ఆశ్చర్యపోయారట. అప్పటికే అతను మైసూరు మహారాజాస్థానంలో ఎనిమిది రూపాయిన జీతం పుచ్చుకునే పై స్థాయి వాగ్గేయకారుడుట. వీరు తన పదవ ఏటనే తారాబాయి, మీరాబాయి తెలుగు కావ్యాలు రచించారట. ఎన్నో విమర్సనా గ్రంధాలు రచించారు. సాలివాహన గాథా సప్తశతిని తెలుగులోకి అనువదించారు.

కనుపర్తి వరలక్ష్మమ్మ:

సంఘశ్రేయస్సు జీవిత లక్ష్యంగా పెట్టుకున్న సంఘ సేవా తత్పరురాలు. రవీంద్రుని రచనలను ఇష్టపడే ఈమె బహుకముఖ ప్రజ్ఞతో ఎన్నో రచనలు చేసారు. స్వాతంత్ర్యోద్యమంలో చురుకుగా పాల్గొన్న ధీరవనిత. మహిళాభ్యుదయనికి పాటుపడిన కనుపర్తివారి రచనలు ఆధునిక నారీలోకానికి ఆమె అందించిన గొప్ప సందేశాలు.

ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అందరి గురించీ రాయాలనే అనిపిస్తుంది. అంతటి విలువైన సమాచారం ఉంది ఈ పుస్తకంలో. చివరిగా చెప్పాలంటే మన తెలుగు వెలుగులు, తెలుగు సాహిత్యపు తీరుతెన్నులు, ముఖ్యంగా 20వ శతాబ్దంలోని విశిష్ట వ్యక్తుల జీవిత విశేషాలను భావితరాలకు అందించటానికి ఉపయోగపడే మంచి పుస్తకం ఈ “మరపురాని మనీషి.

ఈ పుస్తక పరిచయం విష్ణుభొట్ల లక్ష్మన్న గారి మాటల్లో ఇక్కడ.

You Might Also Like

9 Comments

  1. panyala jagannath das

    Dear Blogger
    ‘Vaade Veedu’ is written by Devaraju Venkata Krishna Rao not by Tapi Dharmarao. It’s for your kind information.

  2. విజయవర్ధన్

    @విష్ణుభొట్ల లక్ష్మన్న: బాగా చెప్పారు. అప్పాజోస్యుల సత్యనారాయణ గారిని కొనియాడాలి.
    ఇలాంటి సంపద ఇంకా చాలా వుంది. ఐతే వారు 40-50 సంవత్సరాలుగా దాచుకున్న దానికి వారికి తగిన గుర్తింపు, పారితోషికం ఇస్తే అవన్నీ వెలుగు లోకి వచ్చే అవకాశం వుంది.

  3. విష్ణుభొట్ల లక్ష్మన్న

    ఈ పుస్తకం వెనక ఒక కథ ఉంది!

    ఈ పరిచయ వ్యాసంలో చెప్పినట్టు ఎంతో మంది వ్యక్తులు ఈ పుస్తకాన్ని వెలుగులోకి తీసుకు రావటానికి కృషి చేసారు.

    జరిగింది ఇది!

    ఈ పుస్తకంలోని ప్రముఖుల పరిచయ వ్యాసాలు 60వ దశాబ్ధంలో ఫొటోలతో ప్రచురించబడ్డాయని అప్పాజోస్యుల సత్యనారాయణ గారికి(“అస”)తెలిసింది. కొంత ప్రయత్నాల తరవాత ఈ వ్యాసాలను పుస్తక రూంపంలో ముద్రించటానికి కావలసిన అంగీకారం, అనుమతి లభించాయి. మరి ఫొటోలు లేకుండా ముద్రిస్తే ఇంత గొప్ప పరిచయ వ్యాసాలు చప్పగా ఉంటాయి కదా! మరి ఆ ఫొటోలు సంపాదించటం ఎలా? అసలు అవి ఇప్పటికి ఇంకా ఉన్నాయా? ఉంటే ప్రచురించబండేందుకు తగ్గ నాణ్యత ఉంటుందా? ఇవి ఎవరి వద్ద దొరుకుతాయి? వారు ఇంకా జీవించే ఉన్నారా? ఉంటే ఎక్కడ దొరుకుతారు? ఈ ప్రశ్నలకి సమాధానంగా ఒక ఎడ్రస్ దొరికింది.

    కష్టపడి ఎడ్రస్ వెతుక్కుంటూ మురళీధర్ గారిని (రామచంద్ర గారితో కలసి ఇంటర్వ్యూలు చేస్తూ తీసిన ఫొటోగ్రాఫర్ ఈయన)కలవటం జరిగి నెగెటివ్స్‌ని ఇమ్మని కోరటం జరిగింది.

    ఎవరో అమెరికా నుంచి వచ్చి అడగ్గానే ఫొటోల నెగెటివ్‌లు, వాటిని పునర్ముద్రించుకొనే హక్కులు ఇచ్చేస్తారేమిటి? ఈ పుస్తకం ముద్రించి అజో-విభో డబ్బు చేసుకుంటుందేమో! అసలు ఫొటోల నెగెటివ్‌లు పట్టుకొని వారు అమెరికా ఉడాయిస్తే ఎవరు ఏమి చెయ్యగలరు? నమ్మకం కలగలా! రెండు మూడు సార్లు కలిసి, ఈ ప్రయత్నంలో తోడ్పడుతున్న గౌరవ మిత్రుల ద్వారా వప్పించి వారి భరోసాతో మొత్తానికి అనుమతి సంపాదించటానికి ఎంతో శ్రమించవలసి వచ్చింది.

    మొత్తానికి తెలుగు వారి పుణ్యామా అని ఈ ప్రయత్నం పుస్తకరూపం చూడటంతో తెలుగు వారికి ఒక అపురూపమైన పుస్తకం లభ్యమైంది.

    ఇంత ప్రయత్నం చేస్తే (ప్రచురణకు కావలసిన డబ్బు మిగిలిన శ్రమలను పక్కన పెడితే)గాని ఇటువంటి పుస్తకం వెలుగు చూడాక పోతే కాలగర్భంలో కలిసిపోయిన లేదా కలవబోతున్న మన అపూర్వ సాహితీ సంపదను ఎవరు పూనుకొని ప్రజలకి పరిచయం చెయ్యగలరు?

    విష్ణుభొట్ల లక్ష్మన్న

  4. విజయవర్ధన్

    @తృష్ణ: ఐతే మీ దగ్గర వున్నది 2001 editionది అయ్యుంటుంది.

  5. rAm

    అక్కిరాజు గారి ఆలోచనకి,సత్యనారాయణ గారి పట్టుదలకి,రామచంద్ర గారి రచనకి ఎన్ని సార్లు ధన్యవాదాలు చెప్పినా తక్కువే.మొదటి మరపురాని మనీషిగా దర్శనం ఇచ్చే కాశీ కృష్ణాచార్యులు గారిని చూస్తేనే ఎదో తెలియని ఒక ఆనందం.యిందరి ‘మరుపురాని మనీషీ’ల సమకాలికులు ఎంత అదౄష్టవంతులో.మరల ముద్రణలో అయినా ఆరుద్ర గారి వ్యాసాలని(1962-64 లో ఆంధ్రప్రభసచిత్రవార పత్రిక కి యీ వ్యాసాలు రాస్తున్న రామచంద్ర గారు ఎదో కారణం చేతనో ఆరుద్ర గారి చేత 5 వ్యాసాలు రాయించారు ‘ట’) రామలక్ష్మీ ఆరుద్ర గారు ఇస్తారు అని ఆశిస్తూ..

  6. తృష్ణ

    విష్ణు వర్ధన్ గారూ,
    మేం కొన్నది 2003లోనండి. విష్ణుభొట్ల లక్ష్మన్న గారి వ్యాసంలోని “ముఖచిత్రం” వేరుగా ఉంది. నేను రాసిన ఈ పుస్తకం ఆ తరువాత వచ్చిన ఎడిషనేమో అని అనుకుంటున్నానండి.పుస్తకం విలువైనది కావటానికి ముఖ్య కారణం దానిలో చిత్రించిన అరుదైన చిత్రాలేనండి. వ్యాఖ్యకు ధన్యవాదాలు.

  7. తృష్ణ

    విష్ణు వర్ధన్ గారూ,
    మేం కొన్నది 2003లోనండి. విష్ణుభొట్ల లక్ష్మన్న గారి వ్యాసంలోని “ముఖచిత్రం” వేరుగా ఉంది. నేను రాసిన ఈ పుస్తకం ఆ తరువాత వచ్చిన ఎడిషనేమో అని అనుకుంటున్నానండి.పుస్తకం విలువైనది కావటానికి ముఖ్య కారణం దానిలో చిత్రించిన విలువైన చిత్రాలేనండి. వ్యాఖ్యకు ధన్యవాదాలు.

  8. విజయవర్ధన్

    చాలా మంచి పుస్తకం. చాలా అరుదైన ఛాయాచిత్రాలు దీంట్లో చూడొచ్చు. ఈ వ్యాసంలో పెట్టిన అట్టబొమ్మ ఏ editionదో తెలుపగలరు. ఈ పుస్తకం 2001 జనవరి, మళ్ళీ 2007 డిసెంబరు లో ప్రచురింపబడింది. తర్వాత కొత్త edition వచ్చిందో తెలియదు. వచ్చుంటె ఏమైనా కొత్త బొమ్మలు వేసారా చెప్పగలరు.

Leave a Reply