మణిదీపాలు

వంద నీతులు చెబితే ఎవరూ వినరు. ఒక్క ఉదాహరణ చూపిస్తే అందఱికీ నమ్మ బుద్ధేస్తుంది. ఈ సత్యాన్ని మన పూర్వీకులు బాగానే ఆకళించుకున్నారు. అందుకనే ప్రపంచంలో ఎక్కడా లేనంత కథాసాహిత్యం భారతదేశంలో పోగుపడింది. మన ౧౮ పురాణాలూ, ౧౮ ఉపపురాణాలూ, ఇతిహాసాలూ, కథాసరిత్సాగరం, పంచతంత్రం అన్నీ కథామయం. ఇతరుల్ని ఒప్పించడంలో దృష్టాంతానికున్న ప్రాధాన్యాన్ని గమనించినవారు కనుకనే కథనీ, కవిత్వాన్నీ వేఱుచేసి చూడడానికి మన పూర్వీకులు అంగీకరించలేదు. వారు కథల్ని ఆలంబనగా చేసుకొని వాటి చుట్టూ రసమయ కావ్యాల్ని అల్లారు. ముఖ్యంగా పిల్లలకు కథలే మెదడుకు మేత. కథాశ్రవణం బాల్యానికి అద్దిన ఆజీవన పరిమళం. అలాగే అవంటే చెవి కోసుకునే పెద్దలకూ కొదవలేదు. “నాకో కథ చెప్పవూ ?” అనేది ప్రపంచవ్యాప్తంగా కోట్లాది హృదయాల మౌనఘోష.

పిల్లల్ని క్షణికంగా వినోదింపజేయడమే కాక వారి భావినైతిక జీవనాన్ని సైతం తీర్చిదిద్దాలంటే కల్పిత కథలు చెప్పి లాభం లేదు. ఒక వయసొచ్చాక కల్పిత కథల పట్ల గుఱి పోతుంది. అ దశలో ఆ నీతులకు ఉదాహరణభూతులై నిలబడిన పెద్దల గుఱించిన వాస్తవ ఘటనలు కావాలి. “మణిదీపాలు” అనే సంకలనగ్రంథం ద్వారా శ్రీ రెడ్డి రాఘవయ్యగారు సాధించిన ప్రయోజనం ఇదే. “బాలసాహిత్యం – పిల్లల కోసం పెద్దల కథలు” అనే ప్రచురణాపరంపరలో భాగంగా శ్రీ జయలక్ష్మీ పబ్లికేషన్సు (హైదరాబాదు) వారు ఈ పుస్తకాన్ని ప్రచురించారు.  ’మణిదీపాల వెలుగులు’ అనే పేరుతో దీనికి ముందుమాట వ్రాసిన ఏడిద కామేశ్వరరావుగారు ఇలా అన్నారు : “…శ్రవణకుమారుడు, ప్రహ్లాదుల కథలు విని…మోహన్‌దాసు కరమ్‌చంద్ గాంధి మహాత్ముడైనాడు. పోతన భక్తిమార్గ జీవితగాథను తెరపై చూచి పరవశుడైన కొత్తలంక పశువుల కాపరి సుబ్బారావు ముమ్మిడివరం బాలయోగి అయినాడు. మహనీయుల జీవితాలు మణిదీపాలు. ఆ దీపాల కాంతులు ప్రసరించితే చీకటిగుహలు కూడా వెలుగువెన్నెలలతో శోభిస్తాయి…”

ఈ గ్రంథంలో రచయిత ౫౬ మంది మహనీయుల జీవితాల నుంచి తలా ఒక చిరస్మరణీయమైన సంఘటనని రెండు పుటలకు మించకుండా బాలపాఠకులకు పరిచయం చేశారు. పిల్లలు చిత్రప్రియులు కనుక ప్రతి కథకూ ఒక నలుపు-తెలుపు రేఖాచిత్రంతో నిండుదనాన్ని సంతరించారు. ఈ మహనీయులు వివిధ కాలాలకూ, వివిధ మతాలకూ, వివిధ రాష్ట్రాలకూ చెందినవారు :

౧. బుద్ధభగవానుడు ౨. ఆనందుడు ౩. వర్ధమాన మహావీరుడు ౪. వాల్మీకి ౫. ఆచార్య నాగార్జునుడు ౬. తిరువళ్ళువర్ ౭. శంకరాచార్యులు ౮. తులసీదాసు ౯. మాణిక్యవాచకర్ ౧౦. జయదేవుడు ౧౧. నరసింహ మెహతా ౧౨. గురునానక్ ౧౩. అమరదాస్‌జీ ౧౪. అర్జునదేవ్ ౧౫. అవ్వైయార్ ౧౬. శంకరదేవుడు ౧౭. రైదాసు ౧౮. అన్నమాచార్యులు ౧౯. జ్ఞానేశ్వర్ ౨౦. మధ్వాచార్యులు ౨౧. బసవేశ్వరుడు ౨౨. బిసోబా ఖేచర్ ౨౩. దాదూ దయాళ్ ౨౪. అక్కమహాదేవి ౨౫. కనకదాసు ౨౬. పుండలీకుడు ౨౭. సూరదాసు ౨౮. కబీరుదాసు ౨౯. భానుదాసు ౩౦. మీరాబాయి ౩౧. చైతన్యప్రభువు ౩౨. చొక్కమేళ ౩౩. రామానుజాచార్యులు ౩౪. నామదేవ్ ౩౫. ధనుర్దాసు ౩౬. పురందరదాసు ౩౭. ఏకనాథుడు ౩౮. పోతనామాత్యుడు ౩౯. సక్కుబాయి ౪౦. సమర్థరామదాసు ౪౧. త్యాగరాజస్వామి ౪౨. తుకారామ్ ౪౩. రాఘవేంద్రస్వామి ౪౪. భక్త రామదాసు ౪౫. మహీపతి ౪౬. ప్రాణనాథుడు ౪౭. సాయిబాబా ౪౮. పవహారిబాబా ౪౯. రమణమహర్షి ౫౦. రామలింగస్వామి ౫౧. రామకృష్ణ పరమహంస ౫౨. త్రైలింగస్వామి ౫౩. వివేకానందస్వామి ౫౪. రామతీర్థస్వామి ౫౫. దయానందసరస్వతి ౫౬. సాధు వాస్వాని.

ఇంతమంది మహనీయుల గుఱించి వ్రాయాలంటే రచయిత రెడ్డి రామయ్యగారు ఎన్ని గ్రంథాల్ని సంప్రదించి ఉంటారో, ఎంత శ్రమపడి ఉంటారో ఎవఱికి వారే ఊహించుకోవచ్చు. “ఒక్కొక్క మహనీయుడి జీవితం నుంచి పిల్లలు ఏమేం నేర్చుకోవచ్చు ? దాన్ని పిల్లలకు ఎలా అందివ్వవచ్చు ?” అని ఆలోచించి ఆ కోణంలో తన రచనని తీర్చిదిద్దుకోవడం మిక్కిలి ప్రశంసనీయం. కానీ పెద్దల నుంచి పిల్లలు నేర్చుకోవాలా ? లేక పిల్లల నుంచే పెద్దలు నేర్చుకోవాలా ? అనే సందేహం నన్ను చాలా కాలం నుంచి పీడిస్తోంది. ఉదాహరణకు ఈ పుస్తకంలో ’కులభేదాలను పట్టించుకోకూడదు’ అనే సందేశంతో తొమ్మిది కథలున్నాయి. వాటిల్లో “కడజాతివాడు, మాలమాదిగలు, నిమ్నకులస్థులు” మొదలైన పదాలు సందర్భవశానే అనుకోండి, తఱచుగా ప్రయోగించబడ్దాయి. పిల్లలకు కులభావన ఏ వయసులో పరిచయమవుతుందనేది ఒక వివాదాస్పద విషయం. బహుశా అది ఆయా కులాల్ని బట్టి ఉంటుంది. ఇటువంటి బాలసాహిత్యం ద్వారా పిల్లలకు “కులమనేది ఒకటుందనీ, అందులో అగ్రనిమ్న భేదాలున్నాయనీ, అగ్రులు నిమ్నుల పట్ల ఉగ్రులవుతూంటారనీ, అలా కాక కడజాతివారి పట్ల సద్భావం ప్రదర్శించడం గొప్ప ఔదార్య”మనీ – ఇలాంటి భావాల్ని నూఱిపోయడం – ఎంత ఆదర్శవాద ధోరణితో నైనా కానివ్వండి, అవసరమేనా ? కులం సెక్సులాంటిది. దాన్ని చిన్నపిల్లలకు పరిచయం చేయడం Child Abuse తో సమానం. ఇటువంటి విభజనాత్మకమైన సామాజిక వాస్తవాల గుఱించి వారు కాస్త పెద్దవారయినాక తెలుసుకుంటేనే బావుంటుంది. వారిలో లేనిదాన్నుంచి దూరంగా ఉండమని వారికి ప్రబోధించడం కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది.

“పిల్లల కోసం పెద్దల కథలు” అన్నారు. బావుంది. పెద్దలంటే ఇక్కడ మహనీయులని ప్రాస్తావికార్థం అనుకోండి. కానీ పిల్లలకు పెద్దల ఆదర్శాల్ని – ఏ పెద్దలూ ఎప్పుడూ, ఎక్కడా ఆచరించడానికి ఇష్టపడని ఆదర్శాల్ని – బోధించడం హిపోక్రిసీ అవ్వదా ? అని కూడా నాకొక మూల మూలుగుతున్న సందేహం. సదరు ఆదర్శాలకి ఆ గతి పట్టడానికి అసలు కారణం – అవి సామాన్యుల లౌకిక జీవితంతో సంబంధం లేని పారలౌకిక, ఆధ్యాత్మిక ఆదర్శాలు కావడమేనని నా అనుమానం. ఎవఱికీ ఆచరణసాధ్యం కానివాటిని పిల్లలకు బోధించడంలో అర్థమేంటి ? ఉదాహరణకి ఈ పుస్తకంలో మమకారరాహిత్యం, ఎవరి పాపపుణ్యాలు వారివే, అహింస, క్షమాగుణం, గానంతో చనిపోయిన వ్యక్తిని బ్రతికించడం, చనిపోయినప్పుడు ఏదీ వెంట రాదు, గేదె చేత వేదం చదివించడం, విష్ణునామమహిమ, శ్రీకృష్ణుడు తప్ప లోకులంతా స్త్రీలే, ఆత్మసాక్షాత్కారం మొదలైన ఇతివృత్తాలతోను, సందేశాలతోను చాలా కథలున్నాయి. ఇవన్నీ పెద్దలకు మాత్రమే అర్థమయ్యే విషయాలు.అదీగాక ఇవి పిల్లలలో భక్తినే తప్ప నైతికస్థాయిని, ధర్మాచరణనీ, సత్సంస్కారాన్నీ ఏ విధంగా పెంపొందిస్తాయో అర్థం కాలేదు.

మన దేశంలో పిల్లల సాహిత్యమంటూ ఏమీ లేదనడానికి ఇదొక ఉదాహరణ. పెద్దల సాహిత్యమే పిల్లల భాషలో పునస్కథనం (Re-telling) చేయబడుతూ పిల్లల సాహిత్యంగా చెలామణి అవుతున్నది. పెద్దల సమస్యలూ, సంఘర్షణలూ, వారి అంతర్మథనాలూ – ఇవే బాలసాహిత్య సృష్టికి సైతం స్ఫూర్తి అయికూర్చున్నాయి. మన ఆధ్యాత్మిక అభినివేశాల్ని (మొండి పట్టుదలల్ని) పిల్లల మీద ఆ వయసులో అడుగడుగునా రుద్దడం వల్ల అంతగా ప్రయోజనం లేదు. మన భాషలో పిల్లల బాధల్నీ, భయాల్నీ, వారి జీవితాన్నీ, నమ్మకాల్నీ, భావోద్వేగాల్నీ అవసరాల్నీ చిత్రించి ప్రతిబింబించే సాహిత్యం అరుదుగా కంటబడుతుంది. పిల్లల్ని కూర్చోబెట్టి ఇఱవై నాలుగ్గంటలూ నీతులు చెప్పేవారే తప్ప వారిని ఆడించి, నవ్వించి ఆసక్తి కలిగించి వినోదింపజేసేవారెవఱూ లేరు. ఈ పరిస్థితి మారాలి. మారాలంటే మనం పిల్లలతో ఎక్కువసేపు గడపాలి. మనలోని పిల్లతనాన్ని, అమాయకత్వ పరిమళాన్ని, ఆటల ఆసక్తినీ, హాస్యధోరణిని పెద్దతనంలో కూడా నిలబెట్టుకోవాలి. విషయాల్ని పిల్లల కళ్ళతో చూడాలి.

రచయిత ఈ గ్రంథాన్ని వెంకటేశ్వరస్వామికి అంకితమిచ్చారు.

(మణిదీపాలు : రచన – రెడ్డి రాఘవయ్య ; పుటలు – ౧౨౪ ; వెల – తెలియదు ; ప్రచురణ – శ్రీ జయలక్ష్మీ పబ్లికేషన్స్ హైదరాబాదు ; పంపిణీదారులు – శ్రీ గోపాల్ పబ్లికేషన్స్, 3-3-860, ఆర్యసమాజ్ మందిర్ ఎదురు సందులో, కాచిగూడ చౌరస్తా, హైదరాబాదు 500027)

You Might Also Like

10 Comments

  1. తాడేపల్లి

    మీరు చదివిన సూత్రం ఉన్నమాట నిజమే. పునఃకథనం అనేదే ఎక్కువ సాధువు. కానీ దానికి పూర్వప్రయోగాల్లో చాలా మినహాయింపులు కూడా ఉన్నాయి. ఇక్కడి ’పునస్కథన’ శబ్దప్రయోగం అటువంటి మినహాయింపుల్ని ఒరవడిగా చేసుకొని ప్రయోగించబడింది. పూర్వగ్రంథాలలో ఉన్న నిపాతితాలు కొన్ని ఇలా ఉన్నాయి. (నిపాతితాలంటే – వ్యాకరణనియమాలతో నిమిత్తం లేకుండా ఒక పూర్వుడు స్వేచ్ఛగా ప్రయోగించగా శాబ్దికులు యథాతథంగా ఆమోదించినటువంటివి)

    యశస్కాములై (యశఃకాములై)
    వాచస్పతి (వాచఃపతి)
    మనస్పూర్తిగా (మనఃపూర్తిగా)
    ముండితశిరస్కుడు (ముండితశిరః కుడు)మొ||

    నేనిలా ప్రయోగించడానికి ముఖ్యకారణం ఉచ్చారణసౌలభ్యాన్ని అపేక్షించి. ఇప్పుడు విసర్గని చాలామంది పలకడం లేదు. ఉదాహరణకి దుఃఖం లోని విసర్గోచ్చారణని పరిహరించి దుక్ఖం అని పలికేవారే ఎక్కువమంది ఉన్నారు. అందుచేత విసర్గ యొక్క సంధిరూపాల్ని స్వీకరించక తప్పడంలేదు.

  2. వరరుచి

    Retelling ని రచయిత పునస్కథనం అన్నారు. పునస్కథనం సాధువా? అసాధువా? విసర్గకు క, ఖ, ప, ఫ లు పరమయినపుడు విసర్గ రూపాంతరం చెందదు అని చదివినట్టు గుర్తు. పునఃక్రియ, మనఃకమలము, ప్రాతః కాలము, శిరఃకంపనము మొదలైన పదాల్లో విసర్గ మారదు కదా? వివరించగలరు.

  3. తాడేపల్లి హరికృష్ణ

    >> ఇటువంటి విభజనాత్మకమైన సామాజిక వాస్తవాల గుఱించి వారు కాస్త పెద్దవారయినాక తెలుసుకుంటేనే బావుంటుంది

    ఇదో అభూత ప్రపంచంలోనో లేదా కులాతీత కట్టుబాట్లతో శుద్ధి చేసిన Clean Room లో నియంత్రిచబడ్డ మరమనుషులకో చెప్పుకోవలసిన నీతి వాక్యం. నేటి భారతంలో కులవివక్ష ఆరో తరగతి ప్రవేశాలు మొదలుకుని ఆజన్మాంతం పరీక్షల్లోనూ, ఉద్యోగాలలోనూ, ఉపకార వెతనాల్లోనూ, నియామకాల్లోనూ, న్యాయ స్థానాల్లోనూ, రైలు టిక్కేట్లలోనూ, పంచాయితీ నుండీ పార్లమెంటు ఎన్నికల వరకూ ఎక్కడ కావాలంటే అక్కడే చూడవచ్చు కులపురుషుడి వెయ్యితలల విరాడ్విశ్వరూపాన్ని. మేలుకున్నది మొదలుకుని పడుకునే దాకా అడుగడుక్కీ మనిషి చూసేదీ, అనుభవించేదీ, నడవడిని మలచుకునేదీ సమాజంలోని అసమానతలని చూస్తూనే చూడనట్లు పద్మపత్రమివామ్భోకణాల్లా బతికే నేర్పుకోసం కాదా. ఇది అన్ని దేశ కాలాల్లోనూ జరిగేదే, జరుగుతున్నదేను. ప్రతి సామాజిక సంపర్కంలోనూ కులం ప్రాతిపదికగా భోగదారిద్ర్యాలని అనుభవించడమనే నగ్నసత్యం ఒక్కొకరికి ఒక్కో వయస్సులో అనుభూతమౌతుంది. ఇక్కడ చెప్పబడుతున్నది అన్ని సామాజిక భేదాలనీ అధిగమించి, ఐహికావసరాలని కుచించుకుని చుట్టూ ఉన్న సమాజంతో స్పర్ధించకుండా బతకగలిగిన అతీత వ్యక్తుల గురించి. కులభేదాన్ని విస్మరించడం మన కాలానికో కృతకాలంకారం కానీ వారికి అంతకన్నా మహత్తరమైన జీవిత లక్ష్యాలున్నాయి. బలవంతుడు బలహీనుణ్ణి నలిపి తినకూడనేది మానవుల మనుగడకి అవసరమైన నీతి అనుకుంటే, కులబలమున్న వాడు కులబలం లేనివాడిని సంయమనంతో చూడాలనేది అంటే నిఖార్సైన నీతి వాక్యం. ఏ వయస్సులో దాన్ని ఆకళింప జేయలనేది మనస్తత్త్వపరంగా కొంత చర్చనీయమేను. కులం సెక్సు లాంటిదైతే మన ప్రకృత సామాజిక రాజకీయ వాతావరణం ఒక AIDS భూయిష్టమైన red light district. ఈ నైసర్గాల్లో మసలుకోడం పిల్లలకి తప్పనిసరి. మనకి మనం బ్రహ్మచర్యం పాటించినంత మాత్రాన మనకారోగం సోకదనే అభయమేక్కడా లేదు. కనక దాని అస్తిత్వాన్ని గౌరవించి తగిన మెళకువలూ అనుపానాలూ ఎరిగివుండటమే మంచిది.

    – తాడేపల్లి హరికృష్ణ

  4. లలిత (తెలుగు4కిడ్స్)

    సౌమ్యా,
    Thanks.
    అప్పుడు చదివినది ఇప్పుడు గుర్తు తెచ్చుకుని రాయడం సులభం ఏమీ కాదు.
    అప్పటికీ నీకు ఏమనిపించిందో ఉపయోగపడేలా రాశావు.
    చందమామ కథలు కూడా అన్నీ పిల్లలకి తగినవి కావు. నిజమే.
    చిన్నప్పుడే నేను నాకంటే చిన్న అమ్మాయికి ఒక చందమామ కథ చెప్తూ అనుకోవడం గుర్తు, “ఇది ఈ అమ్మయికెలా చెప్పాలి” అని. ఏదో మార్చి చెప్పేశాను. మా పిల్లలకీ పదేళ్ళు దగ్గరికి వస్తుండగా ఇప్పుడు చదివి వినిపిస్తున్నాను చందమామ కథలు.
    ఐతే రామాయణం, మహాభారతం మాత్రం ఇప్పుడు చదివినా నాకు చందమామవే బాగా అనిపిస్తాయి.

    నేను మరీ చిన్నప్పుడే చదవడానికి వేరే పుస్తకాలు అందుబాటులో లేక చదవాలనే కోరిక తీర్చుకోవడానికి దేవీ పురాణం చదివే దాన్ని. ఆ అనుభవం నాకు ఇప్పటికీ గుర్తు. అందుకే మా పిల్లలకి దేవుడి కథలు ఆలస్యంగా పరిచయం చేశాను. కానీ మా పెద్దబ్బాయి వెతికి మరీ రక రకాల mythology లు చదువుతాడు.
    అందరూ ఒక్కలాగా కూడా చదవరు. కొందరు బాగా ఆలోచిస్తారు చదివిన దాని గురించి. అంతే కాదు, మనం అన్వయించుకునేది తక్కువే ఉండవచ్చు కానీ, లోకాన్ని అర్థం చేసుకోవడంలో తప్పని సరిగా పుస్తకాల ప్రభావం ఉంటుంది.
    అన్నీ చెప్పాక ఎన్ని ఎక్కువ పుస్తకాలు, ఎంత వైవిధ్యం పరిచయం చెయ్య గలిగితే అంత మంచిది. ఆ పుస్తకాల గురించి చర్చించగలిగే వాతావరణం కల్పించడం చాలా అవసరం కూడా అనిపిస్తుంటుంది. పెద్ద సమస్య పిల్లల కన్నా, పెద్ద వాళ్ళుగా మనం వారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్ప గలమా అని.
    ఇది నాకు ఆసక్తికరమైన చర్చాంశం కనుక ఇక్కడి వరకూ పొడిగించాను. తాడేపల్లి గారు వ్యాసమూ, నీ జవాబూ రెండూ ఉపయోగకరంగా ఉన్నాయి. Thanks.

  5. ranjani

    archive.org లో రెడ్డి రాఘవయ్య గారి పుస్తకాలు :
    * Vignanodayam Pillala Vygnanika Kathalu (djvu)

    * Poola Potlaalu (pdf)

  6. లలిత (తెలుగు4కిడ్స్)

    సౌమ్యా, నువ్వు చిన్నప్పుడు చదివిన పుస్తకం అంటున్నావు కనుకా, నీ జ్ఞాపకాలు ఈ పుస్తకం విషయంలో బావున్నట్లు అనిపిస్తున్నందునా, నువ్వు ఆ జ్ఞాపకాలు పంచుకోగలిగితే బావుంటుందనిపిస్తోంది.
    ఎందుకంటే, తాడేపల్లి గారు ఈ పుస్తకం పిల్లలకు తగినది అవునా కాదా అనే సందేహం వెలిబుచ్చారు వ్యాసంలో. అది నా సందేహమూనూ.

    1. సౌమ్య

      @Lalitha: నాకు నచ్చాయి అంటే – నాకు సాధారణంగా వ్యక్తుల గురించిన యదార్థ కథలంటే ఇష్టం. అందుకని, వాటి వెనుక ఉన్న తాత్విక కోణాలు అర్థం కాకున్నా కూడా చదివేశేదాన్ని. ఈ పుస్తకం పిల్లలకి తగిందా కాదా – అంటే, చదువుకుని, విషయం తెల్సుకోడానికి తగినది….దాన్ని అనలైజ్ చేసి తత్వం గ్రహించడం ఆ వయసులో అనవసరం అని నా అభిప్రాయం (నేను పది-పన్నెండు సంవత్సరాలున్నప్పుడు చదివాను అనుకుంటా). దీనిమీద ’మంచిపూలు’ కొంచెం సింపుల్ పుస్తకం అనిపిస్తుంది – వెనక్కి తిరిగి చూస్కుంటే (ఇప్పుడు నాకు రెండింటిలో ఉన్న విషయాల గురించి చూచాయగా మాత్రమే గుర్తున్నా కూడా!). అయినా, నేను అప్పట్లో చదివిన చాలా తెలుగు పిల్లల పుస్తకాల్లో వయసుకి మించిన విషయాలే ఉండేవి. అంతెందుకు, కొన్ని చందమామ కథలు పెద్దై మళ్ళీ చదువుతూ ఉంటే, అప్పుడు అర్థమయ్యాయి -అందులో చెప్పదల్చుకున్న విషయాలు. పిల్లలుగా ఉన్నప్పుడు – చదివామా, కథ తెలిసిందా, అర్థమైందా : దీనిపై స్థాయిలో ఆలోచించినట్లు గుర్తులేదు నాకు…అంటే : ’మూడు చేపల కథ’ ని శ్రీపాద వారు రాసినంత సింపుల్గా రాసి తెలుగు పాఠ్యపుస్తకాల్లో పెట్టినప్పుడు తప్ప ఎప్పుడూ ’అయితే మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటి?’ అన్నది అర్థం చేస్కుని, జీవితానికి అన్వయించుకున్న దాఖలాలు లేవు – నాకు గుర్తున్నంత వరకూ. ఇప్పుడు పర్సనాలిటీ డెవెలప్మెంట్ పుస్తకాల్లో కేస్ స్టడీ కథలు చదివి, తక్కిన క్లాసంతా ఎలాగైతే వదిలేస్తున్నానో, అలాగే నేను ’మణిదీపాలు’ వంటి పుస్తకాలు కూడా చదివి ఉంటాను అని నా అభిప్రాయం. I read them as stories and I enjoyed them.

      ఈ సుత్తంతా ఎందుగ్గానీ – ఒక్క ముక్కలో చెప్పాలంటే – మన పిల్లల కథల్లో ఎక్కువ మోతాదులో ఉండే ’ప్రీచీనెస్’ వల్ల – నాకు చాలా మటుకు పిల్లల పుస్తకాలు ఆ వయసులో వారి స్థాయికి మించిన విషయాలు చర్చిస్తాయనిపిస్తుంది. ఇంకేమన్నా చెప్పాలంటే – మళ్ళీ ఆ మణిదీపాలు ఎక్కడుందో వెదికి చదివి చెప్పాల్సిందే!!

  7. సౌమ్య

    I read this as a kid!!
    Thanks for reminding me of my childhood!
    Theres another book by Reddy Raghavayya – incidents related to some great people…I think its title is ‘Manchi Poolu’
    Should check for these books when I go to Hyd next!

    [Sorry for typing in English. Using an illiterate computer!]

  8. అళక్కి శ్రీనివాస్

    మంచి పుస్తకాన్ని పరిచయం చేసినందుకు తాలబాసు గారికి అభినందనలు.

  9. లలిత (తెలుగు4కిడ్స్)

    తాడేపల్లి గారూ, మీ విశ్లేషణ ఆసక్తికరంగా ఉంది.
    ఒకప్పుడు సుమతీ శతకం పద్యాల గురించి మీరు మీ బ్లాగులో రాసుకున్నప్పుడూ కూడా మీ అభిప్రాయంతో అంగీకరించక తప్పలేదు:)

    పిల్లల సాహిత్యంలో ఇలాంటివి కూడా చోటు చేసుకుంటున్నాయి కాని, బాల సాహిత్యమే లేకుండా లేదండీ.
    కాకపోతే శ్రమపడి ఆసక్తి కలవారు వెతికి తీసి పది మందికీ పరిచయం చెయ్య వలసిన అవసరం ఎంతైనా ఉంది.

    పిల్లలకు పురాణేతిహాసాలు పరిచయం చెయ్యడానికి చందమామను ఆదర్శంగా తీసుకోవాలనిపిస్తుంది, నా మట్టుకు నాకు.

    ఎందుకో ఇది ఈ రోజు ప్రచురించినా పుస్తకం మొదటి పేజీలో కనిపించలేదు.
    కూడలిలో చూసి ఇటు వచ్చాను.

Leave a Reply