మునిపల్లె రాజు – ‘ అస్తిత్వనదం ఆవలి తీరాన’

అతిథి: బెల్లంకొండ లోకేశ్ శ్రీకాంత్
******************
మేజికల్ రియలిజం ఒక విలక్షణమైన సాహితీ ప్రక్రియ. సృష్టిలో జరిగే దైనందిన కార్యక్రమాలని అధ్యాత్మిక కోణంలో అన్వయించి చూసి మానవుడికి, జరుగుతున్న సంఘటనలకు మధ్యనున్న మార్మిక సంబంధాలని ఆవిష్కరించి, విశ్లేషించే ప్రయత్నం చేస్తుంది.కథలో ముఖ్యమైన సంఘటనలకు మధ్య తార్కికమైన వివరణ గానీ, సైకలాజికల్ వివరణ గానీ ఉండదు.రచయిత రియాలిటీనీ కాపీ కొట్టటం కానీ,దాని చుట్టూ కథను అల్లుకునే ప్రయత్నం గానీ చెయ్యడు.సాధరణ విషయాలని అద్భుతంగా,అద్భుతమైన వాటిని సాధారణంగా వర్ణిస్తూ నిగూఢమైన రహస్యాలని తేటతెల్లం చేసే ప్రయత్నం చేస్తాడు.ఉదాహరణకు ‘ సెరమోని ‘ అనే పాశ్చాత్య కథలో ఒక యువతి ఆగ్రహంతో నృత్యం చేస్తూంటుంది.ఎన్నో వేల మైళ్ళ దూరంలో,ఆమెను మోసం చేసిన ప్రియుడు రాత్రి వేళలో తన పశువులపాకలో చెలరేగుతున్న అలజడి చూసి విస్తుబోతూంటాడు.ఆవేశంతో ఆ యువతి కదిలిస్తున్న పాదాలకు,పాకలో పశువులు అసహనంగా కదిలిస్తున్న గిట్టలకు రిలేట్ చేస్తాడు రచయిత.చివరకి ఆ పశువుల దాడిలో అతను మరణిస్తాడు.అతను మరణించిన విషయం రచయిత స్పష్టంగా చెప్పడు కానీ ఒక మోసపోయిన యువతి ఆగ్రహానికి,ఆమె అగ్రహంతో నాట్యం చేస్తే,అతని ప్రియుడే ప్రాణాలు కోల్పోతాడనే విషయానికి రచయిత ఇక్కడ ప్రాముఖ్యతనిస్తాడు. తెలుగులో ఈ తరహా రచనలు చేసిన కొద్దిమంది ప్రముఖులలో మునిపల్లె రాజు గారొకరు.

రాజు గారు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ లో పనిచేసి రిటైరయ్యారు.చాలా చిన్న వయసునుంచే అనేక కథలు,కవితలు, వ్యాసాలు వ్రాసి పలు పురస్కారాలు పొందారు.’అస్తిత్వనదం ఆవలి తీరాన’ కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు పొందిన పుస్తకం.ఇందులో మొత్తం పదిహేను కథలు,ఒక మినీ నవల ( ‘పూజారి ‘.ఇదే 1964 లో బి.ఎన్.రెడ్డి గారి దర్శకత్వంలో నాగేశ్వరరావు హీరోగా ‘ పుజాఫలం ‘ సినిమాగా వచ్చింది),కొన్ని స్వగతాలు ఉన్నాయి.గత శతాబ్ది గొప్ప కథలలో ఒకటిగా కీర్తికెక్కిన రాయలసీమ కరువు సమస్యల గాథ ‘ వీరకుంకుమ ‘ కూడా ఇందులో ఉంది.కథ ఏదైనా,ఇతివృత్తం ఎటువంటిదైనా దానిలో మానసిక సంఘర్షణ, అస్తిత్వ వేదన, తాత్విక శోధన కనిపిస్తుంది. ‘ నైమిశారణ్యంలో సత్రయాగం’ లో విఫల ప్రేమతో అభయానంద గోస్వామి గా మారి నైమిశారణ్యంలో అధ్యాత్మిక పరివేదనలో మునిగిపోయి ఏళ్ళు గడిపి ఆఖరుకి అదే అరణ్యంలో ఒకప్పటి తన ప్రియురాలిని అంత్యదశలో కలుసుకొనే చక్రి , ‘ చేనేత చిత్రం’ లో కుగ్రామం నుంచి ఎంతో ఉత్సాహంగా ముంబయిలోని హస్తకళలపోటికి వచ్చి ద్వితీయ బహుమతి గెలుచుకొని,ఆ తర్వాత నగరంలోని జౌళిమిల్లులు,బట్టల ఖార్ఖానాలు చూసి వాటి ముందు తన చేనేత వృత్తి నిలబడగలదా అని పరితాపం చెందే ఓబయ్య,’ స్తపతి మహోత్సవం’ లో యానాది కుష్టుమహిళకు ఆలయంలోని బంగారు పంచామృత పాత్రలో పాయసం తినిపించే సీతారాం’, ‘ఒక బాకీ తీరలేదు’ లో బాల్యంలో తనకు అన్నం పెట్టి ఆదుకున్న కమలమ్మ రుణం తీర్చుకోవడం కోసం విదేశాలనుంచి వచ్చే డాక్టర్ మురళి,వారు గతించారని చెప్పి మళ్ళీ అతనికి ఆతిథ్యమిచ్చే ఆ ఇంటి ముసలమ్మ, ‘మహాబోధి ఛాయలో ‘ లో చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి చెరువు గట్టునున్న ఒక మహావృక్షంతో అనుబంధాన్ని అల్లుకొని, ఆ వృక్ష ఛాయలోనే తన జీవితాన్ని మలచుకొని ,అనేక ఆటుపోట్లకు తట్టుకొని పరాయి రాష్ట్రంలో స్థిరపడి,చివరికో పని మీద మళ్ళీ స్వగ్రామం వచ్చి ఆ చెట్టు కనబడక తల్లడిల్లే కథానాయకుడు..ఇలా ప్రతి పాత్రా మానసాకాశంలో కారుమబ్బులా కదిలిపోతూ భావుకత్వపు కుంభవృష్టిలో మనల్ని తడిపి ముద్ద చేస్తుంది.మనం కూడా కాసేపు సన్యాసులమై,కమండలాలు ధరించి,శాంతి వచనాలు వింటూ రావిచెట్టు నీడలో యోగముద్రలోకి వెళ్ళిపోతాం.నోరున్న మానవులే కాదు,నోరులేని చెట్టు,ఎద్దు, కుక్క, కూడా ఈయన కథలలో ముఖ్య పాత్రలు పోషించాయి.అంతులేని పోరాటాలతో,అంతరంగిక వేదనలతో అలసిపోయి చీకట్లో మ్రగ్గుతున్న సగటు మానవుడి జీవన విధానానికి వేదాంతపు వీవెన విసిరి, అస్తిత్వపు ఆసరానిచ్చి ఆవలి ప్రశాంత ప్రకాశ తీరాలను చేర్చే యత్నం కనిపిస్తుంది. ఆయనే అన్నట్లు ‘ కథలు రెండు రకాలు.మేధస్సుతో ప్రభావితమైనవి.హృదయంతో ప్రభావితమైనవి.ఎక్కడ మేధస్సు ప్రధానమో అక్కడ అనుభూతి తక్కువ. ఎక్కడ పునాది హృదయమో ఆ కథ కళాబంధురం.’

హృదయపు పునాదుల మీద కట్టిన కథలు చాలానే ఉన్నాయి ఇందులో.

అన్ని పెద్ద బుక్ షాపుల్లో ఈ పుస్తకం దొరుకుతుంది.దొరక్కపోతే ఈ క్రింది అడ్రస్సును సంప్రదించవచ్చు

నవోదయ బుక్ హౌస్
ఆర్యసమాజ్ మందిర్ ఎదురుగా
కాచిగూడ,హైదరాబాద్ -17
వెల:100/-

You Might Also Like

8 Comments

  1. palleti balaji

    munipalle raju gaari gurinchi entha cheppinaa thakkuve…konchamainaa cheppina meeku chaalaa thanks

  2. Gnana Prakash

    Good introduction on Muni-Palli-Raju Garu,
    Amazing……………
    I don’t know how u r balancing your life with all these skills…gr8.

  3. బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్

    కామేశ్వరరావు గారు,కొత్తపాళీ గారు కృతజ్ఞతలు

  4. కొత్తపాళీ

    బాగుంది.
    మునిపల్లె రాజుగారి కథలకి రావలసినంత గుర్తింపు రాలేదు, జరగాల్సినంత చర్చ జరగలేదు.

    పుస్తకం నిర్వాహకులకి సూచన – పైన లోకేష్ గారు వ్యాఖ్యగా రాసిన కథ విశ్లేషణని కూడ ప్రధాన వ్యాసంలో భాగంగా పెట్టండి.

  5. కామేశ్వర రావు

    మంచి పరిచయం, చాలా అవసరమైన పరిచయం కూడా! బహుశా మునిపల్లె రాజుగారి సాహిత్యం గురించి పుస్తకంలో ఇదే మొదటి పరిచయం అనుకుంటాను. మాజికల్ రియలిజం కథల గురించి మరిన్ని పరిచయాలు ఇక్కడ వస్తే బాగుణ్ణు.

  6. బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్

    గాజుల గారు,
    కృతజ్ఞతలు.

    హెచ్చార్కె గారు,
    మీ సూచన బావుంది.నిజమే.వ్యాసంలో ఒక ఉదాహరణ ఇచ్చి ఉండాల్సింది.ఆ ఆలోచన నాకు రాలేదు.
    ఇప్పుడైనా మించిపోయింది లేదు.

    ‘నైమిశారణ్యంలో సత్రయాగం’ అనే కథలో చక్రి ఒక భగ్నప్రేమికుడు.మనశ్శాంతి కోసం నైమిశారణ్యం వెళ్ళి అక్కడ జ్వరపీడితుడై దారితెన్నూ లేకుండా పడి ఉంటే ,ఒక కుక్క రాత్రంతా జాగారం చేసి అతనికి కాపలా కాస్తుంది.జగదీశ్ పాండే పుణ్యదంపతులు కాపాడి అతనికి అభయానంద స్వామిగా నామకరణం చేసి సన్యాసమిప్పిస్తారు.పన్నేండేళ్ళ పాటూ అతనా ప్రాంతంలో ఆశ్రమ ధర్మాలు నిర్వహించి అక్కడి ప్రాచీనతను కాపాడుతాడు.తన తల్లి వంటి జగదీశ్ పాండే భార్య మరణిస్తే చింతాక్రాంతుడై అతనితో కలిసి బదరిక వెళ్ళాలని సమాయత్తమవుతూండగా ఒకప్పుడు తనకు ప్రాణదానం చేసిన కుక్క ద్వార తన మాజీ ప్రేయసి కమల అంత్యదశలో ఉన్నదని,తన దర్శనాన్ని కాంక్షిస్తోందని తెలుస్తుంది.’ నేను కమలను ‘ అంటే ‘ఆ చక్రి లేడిక్కడ ‘ అంటాడు గోస్వామి.కమల మరణిస్తుంది.ఆమెతో పాటు కుక్క కూడా.

    ఈ కథలో శునకం ప్రధాన పాత్ర పోషిస్తుంది. చక్రి ,గోస్వామిగా మారడానికి కారణమవుతుంది.భవబంధాలు విడిచిపెట్టి పాండవులు మహాప్రస్థానం సాగించినప్పుడు ధర్మసుతుని వెంట శునకం వచ్చినట్లే ఈ కథలో శునకం గోస్వామి వెంట వస్తుంది.తన సోదరులు,పత్ని ఒకొరక్కరుగా పడిపోతున్నా చలించని ధర్మజునిలా గోస్వామి కూడా కమలను చూసి పాత జ్ఞాపకాలను తవ్వుకోకుండా బదరిక వెళ్ళిపోతాడు.ఇది అంతర్లీనంగా చెప్పబడుతుంది.

  7. హెచ్చార్కె

    వ్యాసం చాల బాగుంది. ముఖ్యంగా మొదటి పేరా. మ్యాజికల్‍ రియలిజం అంటే ఏమిటో చెప్పిన తీరు. ‘సెరమోని’ కథ ఉదాహరణగా చక్కగా వివరించారు. దానితో పాటు మునిపల్లె రాజు గారి కథలలో ఒకదాన్ని తీసుకుని, ఆ కథలో మ్యాజికల్‍ రియలిజం ఎలా ఉందో చెబితే మరింత బాగుండేది. ఇలా చేయని సందర్భాలలో… పాశ్చాత్య, ప్రాచ్య ధోరణులలో ఒక సుప్రసిద్ధమైన దాన్ని తీసుకుని, దాన్ని మన ఇష్ట రచయితకు అన్వయించారని అనిపించే ప్రమాదం ఉంది, పాఠకులు స్వయంగా ఆ కథలు చదివే వరకు.

  8. gajula

    munipallerajugaari perulone muni-palle-raju ..chaalaa vishayaalanu prathibimbustundi.rajugaari pustaka sameeksha chaalaa bhaagundi.

Leave a Reply