పుస్తక సమీక్ష – సౌశీల్య ద్రౌపది
రాసిన వారు: ఎమ్బీయస్ ప్రసాద్
(ఈ వ్యాసం మొదట జులై 2010 ’ఈభూమి’ పత్రికలో ప్రచురితమైనది.)
******************
మనకు పురాణాలలో లభించేదంతా అక్షరసత్యాలు కానక్కరలేదు. పురాణం అంటే జనశ్రుతంగా వస్తున్న కథ. మనిషి బతికుండగానే ఎన్నెన్ని అతిశయోక్తులు పుడుతున్నాయో, కళ్ళెదురుగుండా జరిగే సంఘటనకే టీవీ ఛానెల్సు వేర్వేరు తరహాలుగా ఎలా వ్యాఖ్యానాలు చెపుతున్నాయో చూస్తున్నాం. వేల ఏళ్ళ క్రితం గ్రంథస్తం అయిన గాథల్లో కూడా ఇలాటివి చోటు చేసుకోవచ్చని సులభంగా వూహించవచ్చు. అలా గ్రంథస్తం అయినవి ఇన్ని తరాలూ దాటుకుని ఉన్నదున్నట్టుగా దిగుమతి అయ్యాయని అనుకోవడానికి వీలు లేదు. మహాభారతం తన మూలరూపానికి ఆరురెట్లు పెరిగిందంటేనే అర్థం చేసుకోవచ్చు, ఆ పులుసులో ఎవరికి కావలసిన దినుసులు వాళ్ళు పడేశారని.
ఇలా తయారైన పులుసును కూడా రకరకాలైన దృష్టికోణాలతో చూశారు మనవాళ్ళు. వ్యాసుడు చెప్పలేదు కానీ, ఇలా జరిగిఉంటుంది అనుకుని వూహించి కొంత కల్పన చేశారు మరికొందరు. ప్రతినాయకుణ్ణి నాయకుణ్ణి చేసి భాసుడు నాటకాలు రాసినట్టే, ఎన్టీయార్ దుష్టపాత్రల చుట్టూ సినిమాలు తిప్పి రాయించుకున్నారు. రావణుడు, దుర్యోధనుడు, కర్ణుడు, కీచకుడు – ఇలా ఏ పాత్ర వేసినా, వాళ్ళలో మంచి గుణాల్ని వెదికిపట్టుకుని, లేకపోతే కల్పించి మనకు వండి వార్చారు. ఆయన హిండింబాసురుడి వేషం వేసుంటే భీముని వలచిన చెల్లెలికోసం ఆత్మత్యాగం చేసిన అన్నగా మలిచి వుండేవారు. అందరూ ఔనన్నది మళ్ళీ చెబితే మోజుండదని కొత్త తరహాగా, విపరీత పోకడలతో చెబితే గుర్తింపు వుంటుందనుకుని ఎప్పటికప్పుడు కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కళాకారులు.
యార్లగడ్డ ఇలాటి ప్రయత్నమే చేశారు తన ’ద్రౌపది’లో. నిజానికి తిక్కన ద్రౌపది కథను అలాగే రాసినా బోల్డంత డ్రామా ఉంది. ఈనాటి సమాజానికి రెలవెన్సు (ప్రాసంగికత) వుంది. ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా ఒక ఆచారానికి (ద్రౌపది విషయంలో అన్నదమ్ములందరినీ చేసుకోవలసి రావడం అయితే, తెలుగమ్మాయికి మేనరికం కావచ్చు, పంజాబీ పడతికి భర్త పోయాక మరిదిని చేసుకోవడం కావచ్చు) తలవొగ్గడం, అందం కారణంగా మరిది (దుర్యోధనుడు) చేత, ఆడపడుచు మొగుడి (సైంధవుడి) చేత, రాజ్యాధికారి (కీచకుడు) చేత ఇబ్బందులకు గురి కావడం – యీనాటి స్త్రీ కూడా ఎదుర్కునే సమస్యలే! ఫ్యామిలీ సర్కిల్‍లో (కురుసభ), వర్క్ ప్లేస్‍లో (కీచకుడు రాజు ఎదురుగా కింద పడేసి తన్నాడు) అవమానించినా అడ్డుకునేవాళ్ళు లేకపోయారు. సాక్షాత్తూ భర్త పణం ఒడ్డాడు. (యుద్ధంలో ఓడిపోయాక శత్రువుతో శాంతి కోసం పెళ్ళి పేరుతో కూతుర్ని వాడికి నాలుగో భార్యగా అప్పగించిన రాజులు చాలామంది వున్నారు). భర్తలను వెక్కిరించడానికి కౌరవులు చేసినది – యీమె గుడ్డలూడదీయడం! వారిపై పగ సాధించడానికి అశ్వత్థామ చేసినది – యీమె కొడుకులందరినీ నిద్రలో చంపడం! కీచకుడి హత్యకు ప్రతీకారం అంటూ ఉపకీచకులు చేసినది – వాడితో బాటు యీమెను తగలేయబూనడం! అంటే ఎక్కడ ఉరుము వురిమినా భరించే మంగలం మాత్రం – మహిళే! అప్పుడైనా సరే, యిప్పుడైనా సరే!
ఇంత కాంటెంపరరీ డ్రామా వున్నా యార్లగడ్డ వారికి సరిపోలేదనిపించింది. అందుకే తన ద్రౌపదిని ఆయన ’రస’వత్తరంగా తీర్చిదిద్దారు. పూర్వజన్మలో అమిత కాంక్షతో ఐదుగురు భర్తలను కోరుకుందన్న ఒక పాయింటు పట్టుకుని మొత్తం సెక్సు చుట్టూ కథ నడిపారు. దానికి యాంటీ-డోట్ గా రాసిన కస్తూరి మురళీకృష్ణ ’సౌశీల్య ద్రౌపది’ అని పేరు పెట్టడంలోనే ద్రౌపదిలో ఏ లక్షణాన్ని తను హైలైట్ చేయబోతున్నారో చెప్పేశారు. మురళీకృష్ణ పాండిత్యం, సృజనాత్మకత కలబోసిన రచయిత. బహు విషయపరిజ్ఞానం, అధ్యయనం ఆయన సొత్తు. వీటికి సంస్కృతిపై మమకారం, ఆ సంస్కృతిని అపమార్గాన్ని పట్టిస్తున్న వారిపై రోషం తోడయింది. అందువలన యార్లగడ్డ ఊహలకు పూర్తిగా వ్యతిరేకదిశలో ఆలోచించి పరిగెత్తించే కథనశైలితో యీ నవల రాశారు. మహాప్రస్థానంలో నేలకూలడంతో మొదలుపెట్టి తన జీవితం ఎలా అపార్థం పాలయిందో ద్రౌపది సింహావలోకనం చేసుకుంటూన్నట్టు ఫ్లాష్‍బ్యాక్‍లో, సినిమా దృశ్యమాలికలా కథ నడిపారు. క్రితం జన్మలో అపరిమిత వాంఛకై వెంపర్లాడడం చేత ఈ జన్మలో మొహం మొత్తి ఉంటుందన్న తర్కంతో ఐదుగురు భర్తలతోనూ బ్రహ్మచర్యం నెరపిందని రాశారు. (సత్సంతానకాంక్షతో కూడడం కూడా బ్రహ్మచర్యమేనని వివరణ).
ఏ ద్రౌపది పాత్రను అడ్డం పెట్టుకుని యార్లగడ్డ – ధృతరాష్ట్రుణ్ణి (వస్త్రాపహరణ సమయంలో కళ్ళుండి వుంటే నేనూ నా కోడలి సౌందర్యాన్ని చూసేవాణ్ణి కదా అని వాపోయాడట), కృష్ణుణ్ణి (పుస్తకం మొత్తం మీద ద్రౌపదిని సఖీ అని తప్ప సోదరీ అని పిలిచిన పాపాన పోయాడు కాదు), ధర్మరాజును (ద్రౌపది మీద కన్నేసి, స్వయంవరం కాగానే ఇంటికి వచ్చేసి తల్లితో ’భిక్ష పథకం’ పన్నాడట) భ్రష్టుపట్టించి ఆ పురాణ పురుషులందరికీ మసిపూసేస్తే, మురళీకృష్ణ ఆ మసి కడిగేయడమే కాదు, కస్తూరి పరిమళాలు అద్దాడు. పైగా, భారతీయ స్త్రీని ఉన్నతంగా నిలబెట్టడానికి మధ్యమధ్యలో స్వీయవ్యాఖ్యలు జోడించాడు. పాఠకులు వాటిని విస్మరించకుండా ’బోల్డు’ చేయించాడు కూడా. ఇది 100 పేజీల చిన్నపుస్తకం. కానీ, ప్రతిపుటలోనూ భారతీయ ధర్మాన్ని నిలబెట్టడానికి రచయిత చేసిన కృషి కనబడుతుంది. ముఖచిత్రంగా ఉత్తరప్రదేశ్‍లోని దశావతారాలయంలోని ద్రౌపదీ సమేత పంచపాండవ శిల్పాలు వేశారు. దారినపోయేవారి చేతివాటం వలన ముక్కు, వక్షోజాలు ఛిన్నమైనా తరతరాలుగా చెదరని శిలాసదృశమైన భారతీయత ధర్మానికి ప్రతీకగా నిలిచివున్న ద్రౌపది యీమెయే అనిపిస్తుంది.
పాతకాలం కవులకు దేవీదేవతలు స్వప్నంలో వచ్చి తమపై కావ్యాలు రాయమని కోరేవారట. ఈ సౌశీల్య ద్రౌపదికి లభిస్తున్న జనాదరణ చూసి పైన చెప్పిన పురాణపురుషులు మురళీకృష్ణ కలలోకి వచ్చి ’సౌశీల్య కృష్ణుడు’, ’సౌశీల్య ధర్మరాజు’ వగైరా పుస్తకాలు రాయమని ఒత్తిడి చేస్తారేమో పాపం!
-ఎమ్బీయస్ ప్రసాద్
పుస్తకం వివరాలు:
సౌశీల్య ద్రౌపది
రచయిత – కస్తూరి మురళీకృష్ణ
100 పేజీలు, 50 రూపాయలు
కస్తూరి ప్రచురణలు
సోల్ డిస్ట్రిబ్యూటర్స్ – నవోదయా బుక్ హౌస్, హైదరాబాదు.
(ఈ పుస్తకంపై సాక్షి పత్రికలో వచ్చిన వ్యాసం ఇక్కడ.)
Kinige Newsletter 19 May 2012 | కినిగె బ్లాగు
[…] సౌశీల్య ద్రౌపదిసమీక్ష ‘కినిగె’పై […]
Kinige Newsletter 19 May 2012 | Kinige Blog
[…] సౌశీల్య ద్రౌపదిసమీక్ష ‘కినిగె’పై […]
రవి
“…ప్రతినాయకుణ్ణి నాయకుణ్ణి చేసి భాసుడు నాటకాలు రాసినట్టే, …”
ఇక్కడ అపార్థాలో, లేక అనుకూలంగా మలుచుకోవడాలో జరుగుతాయేమోనని ఓ మాట చెప్పబూనుకుంటున్నాను.
ఊరుభంగం నాటకంలో భాసకవి, దుర్యోధనుణ్ణి ఉదాత్తంగా చిత్రీకరించారు. నాటక లక్షణాల దృష్ట్యా, ఆ నాటకంలో దుర్యోధనుడు నాయకుడయినప్పటికీ, ఎక్కడా కూడా దుర్యోధనుని దుశ్చేష్టలను సమర్థించలేదు. ఎక్కడా ఔచిత్యభంగం చేయలేదు.