చీకటి వెలుగుల ఆవిష్కరణ

“పదమూడేళ్లు నిండకుండా, ఏడో క్లాసు కూడా గట్టెక్కకుండా, నిన్ను ఒక చదువులేని మూర్ఖుడికిచ్చి కట్టబెడితే, ఒక పిల్లాడు ఇంకా పాలుతాగే పసివాడుగా ఉండగానే మళ్లీ కడుపుతో ఉండి, అలా చూస్తుండగానే నువ్వు ముగ్గురు పిల్లల తల్లివైపోతే, పాతికేళ్ల వయసులో శరీరమూ మనసూ డస్సిపోయి, పిల్లల్తో సహా నువ్వు సుదూర ప్రాంతానికి, బొత్తిగా తెలియని చోటికి వెళ్లవలసి వస్తే పొట్ట నింపుకొనేందుకు వేరే దారి లేక, ఇల్లూడ్చి తుడిచి అంట్లు కడిగి, వంట చేసి డబ్బు సంపాదిస్తూ, పిల్లల విరోచనాలూ, జలుబూ దగ్గూ, తిండీతిప్పలూ, చదువూ సంధ్యా వీటన్నింటి గురించి నువ్వే అవస్థ పడాల్సి వచ్చి కూడా, నీలో ఉండే చదువుకోవాలన్న తపనని నువ్వు ఎప్పటికప్పుడు బతికి ఉంచుకోవడానికి ప్రయాసపడుతూ ఉంటే, ఏడో క్లాసు వరకూ చదువుకున్న వచ్చీ రాని భాషలోనే నువ్వు ఎంచుకున్న దారిలోని ఆపదల గురించి ఇతరులని హెచ్చరించాలని అనుకున్నప్పుడు, మిత్రమా! నీ మరో పేరు ‘బేబీ హాల్దార్‌’ అవుతుంది. బేబీ రాసిన ‘ఆలో ఆం«థారీ’ అనే బెంగాలీ నవల హిందీ అనువాదానికి ‘చీకటి వెలుగులు’ తెలుగు అనువాదం. శ్రామిక వర్గం ప్రతినిధి బేబీ హాల్దార్‌ ఈ ఆత్మకథలో పీడితుల, బాధితుల జీవితాలని చిత్రించింది. ఈ రచన భావాత్మకమైన, సాహిత్యపరమైన మార్పులకే కాక రాజకీయ, సామాజిక మార్పులకి కూడా ఒక ప్రక్రియగా దోహదం చెయ్యగలదు. ఒక స్త్రీ సంవేదనతో ఈ అన్యాయంతో నిండిన ప్రపంచం గుట్టుని ఎంతో లోతుగానూ, అదే సమయంలో ఎంతో సరళంగానూ రట్టు చెయ్యగలదు అనేదానికి ఈ పుస్తకం ఒక ప్రతీక” అంటారు మేథా పాట్కర్‌ ‘చీకటి వెలుగులు’ గురించి చెబుతూ.


వేరే ఏ ఉపమానాలు లేకుండా బేబీ కథ చెప్పవల్సివస్తే అది ఇలాగుంటుంది.. 1973 లోనో, 74లోనో ఆమె జమ్మూకాశ్మీర్‌లో పుట్టింది. తండ్రి ఆర్మీలో పనిచేసేవాడు. ఇల్లు గడవటానికి ఆయన ఒకోసారి డబ్బులిచ్చేవాడు, ఒకోసారి ఇచ్చేవాడు కాదు. ఎప్పుడూ ఇంట్లో దారిద్య్రం తాండవిస్తూ ఉండటం వల్లా, భర్తతో పోట్లాటలు జరుగుతూ ఉండటం వల్లా, బేబీ తల్లి ఇల్లు వదిలి వెళ్లిపోయింది. కొన్నాళ్ల తర్వాత తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడు, ఆ తరవాత మూడో భార్యని కూడా తెచ్చుకున్నాడు. ఆర్మీ ఉద్యోగంలో రిటైర్‌ అయిన తరవాత ఏవో చిన్నాచితకా ఉద్యోగాలు కొన్నాళ్లు చేసి, దుర్గాపూర్‌కి వచ్చి స్థిరపడ్డాడు. బేబీకి పదమూడేళ్లయినా నిండకుండానే ఆ పిల్లకన్నా రెండింతలు వయసున్న వాడికిచ్చి పెళ్లి చేసేశారు. దాంతో ఆ పిల్ల ఏడో తరగతితో చదువుకి స్వస్తి చెప్పాల్సి వచ్చింది. పెళ్లైన 12-13 ఏళ్ల తర్వాత భర్త ఇల్లు కూడా బేబీ వదిలెయ్యాల్సి వచ్చింది. భర్త అడుగడుక్కీ తనని శాసించటం ఆ పిల్ల భరించలేకపోయింది. తన ముగ్గురు పిల్లలతోనూ కలిసి ఒకరోజు దుర్గాపూర్‌ నుంచి ఫరీదాబాద్‌ వెళ్లే రైలెక్కేసింది. కొన్నాళ్లు అక్కడ ఉండి, గుర్గావ్‌ చేరుకుని అక్కడ ఒక పనిమనిషిగా ఇళ్లలో పని చెయ్యసాగింది. ఈరోజు తన  పిల్లలు స్కూల్‌కెళ్లటం చూస్తే ఆమెకి చాలా సంతోషంగా ఉంది. పెద్దయ్యాక వాళ్లు తమనితాము పరిచయం చేసుకోవటానికి జంకక్కర్లేదు కదా, అని ఆమెకి అనిపిస్తూ ఉంటుంది. ఆమె గుర్గావ్‌లో పని చెయ్యడానికి చేరింది ఆంత్రోపాలజిస్ట్‌ ప్రబోధ్‌కుమార్‌ ఇంట్లో. ఆయన మున్షీ ప్రేమ్‌చంద్‌ మనవడు. ఆయన బేబీలోని వ్యథను, దాన్ని కథగా మార్చగల ఆమె సత్తానూ గమనించారు. మరి కొద్దిగా రాయడం చదవడం నేర్పించి, తన జీవిత కథను రాసేలా ప్రోత్సహించారు. అలా ‘ఆలో ఆంధారీ’ రూపుదిద్దుకుంది.
‘బేబీ హాల్దార్‌ మంచి రచయిత్రి. తన జీవిత కథను ఎలాంటి ముసుగులు, నగిషీలు లేకుండా ఉన్నదున్నట్లు బిడియం లేకుండా చెప్పడం తేలిక కాదు.  అతిశయోక్తులు, నాటకీయత లేకుండా చెప్పడం కూడా సులభం కాదు. ఇవేవీ లేకుండా అందంగా, ఆసక్తికరంగా చెప్పటం చీకటివెలుగులు ప్రత్యేకత. చెయ్యి తిరిగిన రచయితలయితే ఈ పుస్తకంలోని ఒకొక్క సంఘటనని వారివారి రచనా చాతుర్యంతో అద్భుత కథలుగా మలిచి ఉండేవారేమో. కానీ అప్పుడది బేబీ జీవితం కాకుండా పోయేది. పన్నెండేళ్లకు వివాహం, పద్నాలుగేళ్లకు తల్లి కావ టాన్ని బేబీ ఎంత సామాన్యంగానో చెప్పింది. ఆ సామాన్యతలోనే ఒక గంభీరమైన అందం వచ్చింది. ఆమెలాంటివాళ్లు ఆంధ్రప్రదేశ్‌లో లక్షల మంది ఉంటారు. వారికి ఈ పుస్తకం చేరితే, బేబీ జీవితం వారికి స్ఫూర్తినిస్తే, బేబీలాంటి వారిగురించి పట్టించుకునే ప్రబోధ్‌కుమార్ల సంఖ్య పెరిగితే – ఆ ఆశతోనే అస్మిత ఈ పుస్తకాన్ని ప్రచురిస్తోంద’ని చెప్పారు ఓల్గా తన ముందుమాటలో.


రచన అంతా ప్రథమ పురుషలోనే సాగినా, బేబీ కొన్నిచోట్ల ‘నేను’కి బదులు బేబీ అని రాసింది. ఉదాహరణకి తన పెళ్లి గురించి రాస్తూ, ‘అంత బాధాకరమైన రోజుని బేబీ ఎంత సంతోషంగా గడిపేసింది..!’ అంటుంది. అలా అన్యపురుషలో రాయటానికి కారణం ఏమిటని అడిగినప్పుడు, తన జీవితంలోని కొన్ని సంఘటనలని మర్చిపోయే ప్రయత్నంలో అవి తన జీవితానికి సంబంధించినవి కావనీ, మరెవరో వాటిని అనుభవించారనీ అనిపిస్తుందని చెప్పింది. ‘భయం లేకపోవటం, స్పష్టమైన లక్ష్యం ఉండటం, ఆత్మగౌరవానికీ, స్వేచ్ఛకీ ప్రాముఖ్యం ఇవ్వటం, ఎటువంటి గడ్డుపరిస్థితి
వచ్చినా పోరాడటమే తప్ప తలవంచకపోవడం, మరోవైపు నిప్పులాంటి వ్యక్తిత్వం ఉండటం.. ఇవన్నీ నేర్చుకుంటే వచ్చేవి కావనీ, కష్టాలే ఒక్కోసారి ఇలాంటి వ్యక్తిత్వాలకి పునాదిగా ఉంటాయనీ బేబీ హాల్దార్‌ కథ చదివితే అర్థమవుతుంది..’ అన్నారు అనువాదకురాలు ఆర్‌. శాంతసుందరి. అవన్నీ తెలుసుకోవడానికి ‘చీకటివెలుగులు’ (Cheekati Velugulu) చదవాలి.

You Might Also Like

4 Comments

  1. varaprasaad.k

    సమీక్ష బావుంది,పుస్తకం వెంటనే చదవాలని అనిపించేలా ఉంది.విభిన్న కదాంశాలను సామాన్యుడికి కూడా అర్ధమయే ఇలాంటి ఆర్ద్రమైన రచనలను పరిచయం చేసినందుకు అభినందనలు.

  2. కొల్లూరి సోమ శంకర్

    మంచి పుస్తకానికి మంచి పరిచయం. చక్కటి సమీక్షనందించిన అరుణ పప్పు గారికి, పుస్తకం.నెట్ నిర్వాహకులకు అభినందనలు.

  3. పుస్తకం.నెట్

    Due to some technicalities, the end of the essay was truncated. It has been corrected now. Thanks for pointing out.

  4. దుప్పల రవికుమార్

    మంచి పుస్తకానికి మంచి పరిచయం. అరుణగారికి చిన్న మాట. ముగింపు కట్ అయింది. ఒక్కసారి చూడండి.

Leave a Reply