రియల్ స్టోరీస్ – కస్తూరి మురళీకృష్ణ

వ్యాసం రాసిపంపిన వారు: కొల్లూరి సోమ శంకర్

realstoriescover“స్ఫూర్తినిచ్చే వాస్తవ విజయ గాథలు” అన్న ఉపశీర్షిక ఈ పుస్తకానికెంతో ఉపయుక్తంగా ఉంది. ప్రముఖ రచయిత కస్తూరి మురళీకృష్ణ వార్త దినపత్రిక ఆదివారం అనుబంధంలో వారం విడిచి వారం రాసిన ‘రియల్ స్టోరీస్’ అనే శీర్షికలోంచి ఎంచుకున్న 50 వాస్తవ గాథలని ఈ సంకలనంలో అందించారు.

సాధారణంగా మనుషులు కష్టాలు రాగానే క్రుంగిపోతారు, బెంబేలెత్తిపోతారు. కొందరేమో సమస్యనుంచి పారిపోయి, తాత్కాలికంగా ఉపశమనం పొందుతారు. మరికొందరు మౌనంగా, నిస్సహాయంగా విలపిస్తారు. మరొకొద్దిమంది మాత్రమే తాము అనుభవించిన కష్టాలు మరెవ్వరూ అనుభవించకూడదనే ఉద్దేశ్యంతో ఇతరులను జాగృతం చేస్తారు, తోటివారికి మార్గదర్శనం చేస్తారు. అటువంటి వ్యక్తుల గాథలే ఇవి.

తల్లిదండ్రులు తిట్టారని అలగి ఇంట్లోంచి పారిపోయే పిల్లలు, ఉద్యోగాలు దొరకడం లేదనో, పెళ్ళిళ్ళు కావడంలేదనో జీవితం అంతం చేసుకునే వ్యక్తులు…. ఇంకా అనేక చిన్న పెద్దా సమస్యలతో తాము చికాకు పడుతూ, తోటివాళ్ళని ఇబ్బంది పెట్టే ఎందరికో ఈ పుస్తకం స్ఫూర్తినిస్తుంది.

‘ఎవరైనా మనమీద స్వారీ చేస్తున్నారంటే తప్పు వాడిది కాదు, వంగి వాడిని స్వారీ చేయనిస్తున్న మనది ఆ తప్పు. అందుకే ప్రతివారు విద్యావంతులవ్వాలి, తమ హక్కుల కోసం న్యాయబద్ధమైన పోరాటం సాగించాలి…’ అంటుది కేటీ. బర్మాలోని పేదల కోసం అమెరికన్ మల్టీ నేషనల్ కంపెనీతో పోరాడిన కేటీ కథ ‘న్యాయం గెలిచింది’.

‘తడి ఇసుకలో పూచిన పువ్వు’ కథ కుటుంబ బాంధవ్యాల ప్రాముఖ్యతని చాటుతుంది. ఈ కథ తన రచన ద్వారా సంతానాన్ని కోల్పోయిన తల్లిదండ్రుల వ్యధకి ఉపశమనం కలిగించిన రచయిత గురించి చెబుతుంది. సమాజంలో మార్పు బీజాలని నాటి, ఆలోచనలకు దిశానిర్దేశం చేయడమే రచయిత బాధ్యతని ఈ కథ స్పష్టం చేస్తుంది.

ధైర్యవంతుడికి, పిరికివాడికి పెద్ద తేడా ఏమీ లేదు. ఇద్దరూ భయపడతారు. కాని పిరికివాడు తన భయాన్ని వ్యక్తం చేస్తాడు, ధైర్యవంతుడు చూపించడు…..” అని చెబుతుంది ‘పడగ విప్పిన తుపాకీ’ కథ.

‘భయాలన్నీ మన శరీరానికే. ఈ శరీరం లోపల మరో సజీవ శక్తి ఉంది. మనం పైపై శరీరాన్ని చూసి భ్రమ పడతాం. కానీ ఈ లోపలి సజీవ శక్తిని గుర్తిస్తే మనకు భయం ఉండదు, కోపం రాదు, ద్వేషం దూరమవుతుంది, నిరాశ నిస్పృహలు దరిదాపుల్లోకి రావు….” అని చెబుతుంది ఓ మహిళ ‘మానవ మృగాల మధ్య’ అనే గాథలో.

‘మనిషికి చావు ఒకేసారి వస్తుంది. కానీ మరణ భయంతో మనిషి అనుక్షణం చస్తూ బతుకుతుంటాడు. ఆ భయాన్ని జయిస్తే గానీ, మనిషి జీవితం ఆరంభం కాదు’ అని తన కొడుకుతో అంటుంది ఓ తల్లి. తన కొడుకుకి జరిగిన నష్టం మరెవ్వరికి జరగకూడదనుకున్న ఆ మాతృమూర్తి ఓ ఉద్యమమే చేపట్టిన వైనం ‘మరో సత్యాగ్రహం’ అనే కథలో చదవచ్చు.
వైద్య రంగంలో వస్తున్న కొత్త మార్పులను ఎప్పటికప్పుడు అందుకుంటూ ఆధునిక వైద్య పద్దతులకు మానవత్వం రూపు కల్పించిన వైద్యుల గురించి ‘చిన్నారుల బతుకు పోరాటం’, ‘వైద్యోనారాయణో సెమ్’, ‘ప్రేమే గెలిచింది’, ‘అరుదైన అద్భుతం’ అనే కథలు తెలుపుతాయి.

పాశ్చాత్య దేశాలలో దంపతులు ఎక్కువ కాలం కలసి ఉండరనీ, చీటికి మాటికి విడిపోతుంటారని వింటూంటాము. అలాంటి వారి మధ్య ఒకరికోసం మరొకరు బతికే జంటలు ఉంటారని నిరూపిస్తుంది ‘తడి మనసు వెనుక’ కథ.

నిరాశని ఆశగా మలచుకోడం అంటే ఏమిటో తెలుసుకోవాలంటే ‘అనుభవం నేర్పిన పాఠం’ అనే గాథ చదవాలి.

బాక్సింగ్‌లో గెలుస్తున్నప్పుడు ఓ క్రీడాకారుడికి ప్రజలు అందించిన అభినందనలకు, మానవతని జాగృతం చేసినందుకు అతడికే లభించిన అభినందనలకు మధ్య ఉన్న తేడాని అద్భుతంగా వివరిస్తుంది – ‘ ఓడి గెలిచిన యోధుడు’ కథ.

కళాకారుడికి కళని మించి వేరే మత్తు అవసరం లేదు. అలా అవసరమైందంటే అతడి కళలోనే ఏదో లోపముంటుందని తెలిపిన గాథ ‘మత్తు నుంచి మానవత్వం వైపు’.

ఈ పుస్తకంలో ఇటువంటి ఆసక్తికరమైన, స్ఫూర్తిదాయకమైన గాథలు మరెన్నో ఉన్నాయి. ‘ఇలాంటివన్నీ కథలుగా చదువుకోడానికి మాత్రమే బావుంటాయి’ అని అనుకునే వారికి తెలియజేసేదేంటంటే ఇవన్నీ వేర్వేరు దేశాలలో వివిధ కాలాలలో నిజంగా జరిగిన ఘటనలే. వివిధ పత్రికలలో వార్తలుగా ప్రచురితమైన ఆయా ఘటనలను కథారూపంలోకి మలచి, ఉన్నత ఆలోచనలు జోడించి ఆసక్తికరంగా అందించిన కస్తూరి మురళీకృష్ణ అభినందనీయులు.

ఈ పుస్తకంలోని మరో సౌలభ్యం ఏంటంటే, చివరిగా దాక ఒకేసారి చదివేయాల్సిన అవసరం ఉండదు. ఏ గాథనుంచైనా మొదలుపెట్టచ్చు. చదివిన దాన్ని కాసేపు జీర్ణించుకుని, ఇంకో గాథ కొనసాగించవచ్చు. ఏ గాథతో ప్రారంభించినా, అన్నింటిని చదివింపజేస్తాయి – ఆయా గాథలలోని సంఘటనలు, రచయిత శైలి. సాటి మానవులకి ఎంతో కొంత మేలు చేయాలన్న ఉత్సాహాన్ని, చేయగలమన్న నమ్మకాన్ని మనకి కలిగిస్తుందీ పుస్తకం.

Real Stories – Kasturi Muralikrishna
ఎమెస్కో బుక్స్ వారు డిసెంబరు 2008లో ప్రచురించిన ఈ 296 పేజీల పుస్తకం ఖరీదు 125/- రూపాయలు. ప్రతులు, ఎమెస్కో బుక్స్ విజయవాడ, హైదరాబాదు వారి వద్ద లభ్యమవుతాయి. హైదరాబాదులో వీరి కార్యాలయం – దోమల్‌గూడాలోని సాధూరాం కంటి ఆసుపత్రి దగ్గర ఉంది.

You Might Also Like

3 Comments

  1. Kolluri Soma Sankar

    I am sorry, now it appears full…
    Thanks
    Soma Sankar

  2. Kolluri Soma Sankar

    Dear Editorial team,
    Thanks for posting my article. Seems some text is missing at the end of the article. Please give full article.
    Regards,
    Soma Sankar

  3. kasturimuralikrishna

    అందమయిన సమీక్షను అందించిన కొల్లూరి సోమ శంకర్ కూ, ప్రచురించిన పుస్తకం.నెట్ కూ బహు కృతఙ్నతలు. ఈ కథల రచనలో నా ఉద్దేశ్యాన్ని బహు చక్కగా చెప్పారు సోమ శంకర్. అయితే, రచయితగా ఈ కథలు మరో విషయంలో నాకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆదివారం అనుబంధాలలో నేర కథలే పాఠకులు ఇష్టపడతారనీ, నేరేతర కథలు చదవరని ఒక అభిప్రాయం వుండేది. అది కేవలం అపోహనేననీ ఈ కథల ద్వారా నిరూపించాను. రచయితలో రచనా పటిమ వుంటే, చెట్టు నుంచి ఆకు రాలి నేలపైన పడటాన్ని కూడా పాఠకులను అలరించేరీతిలో రచించి మెప్పించగలడన్న నా ప్రగాఢ విశ్వాసానికి నిరూపణలీ కథలు. ఇవి ప్రచురితమవుతున్న సమయంలో పాఠకుల స్పందన, ఎమెస్కో వారు ఈ కథలను ప్రచురించటం, చదివిన తరువాత పాఠితల స్పందనలు పాఠకులు ఉత్తమ సాహిత్యాన్ని ఎన్నడూ విస్మరించరన్న నా నమ్మకాన్ని నిరూపిస్తోంది. వారివే చదువుతారని భావిస్తూ అలాంటి కథలే అందించటం వల్ల ప్రత్యామ్నాయం లేక పాఠకులు అవే చదువుతున్నారు, నచ్చని వారు చదవటం మానేస్తున్నారు, మంచి కథ లభిస్తే ఆదరిస్తారన్న నా వాదనను ఈ పుస్తకం అమ్మకాలు నిరూపిస్తున్నాయి. ఇంకా నమ్మనివారు, ఇందులోని కథలను చదివి నిగ్గు తేల్చుకోవచ్చు. పుస్కం.నెట్ కూ సోమ శంకర్ కూ మరో సారి ధన్యవాదాలు.

Leave a Reply