ఊరి చివర -అఫ్సరీకులు
రాసిన వారు: సి.బి.రావు
*************
జ్ఞాపకాలు ఎవరి జీవితంలో ఐనా ముఖ్యమైనవే, నిస్సందేహంగా. ఈ జ్ఞాపకాలు పరి విధాలుగా వ్యక్తుల జీవితాలను ప్రభావితం చేస్తాయి. కొన్ని మధుర స్మృతులైతే మరికొన్ని వెంటాడే జ్ఞాపకాలు. కొన్ని మనోపటం నుంచి చెరిపెయ్యాల్సినవి. మరికొన్ని సదా గుర్తుంచుకోవాల్సినవి. కొన్ని జ్ఞాపకాలు ఎంతకాలమైనా చెక్కుచెదరక సజీవంగా ఉంటాయి. స్మృతి లోంచి ఈ జ్ఞాపకాలు మరల మరల స్మరణకు వచ్చినప్పడు కవి అంతర్మధనంలోంచి పుట్టిన కవితలే ఈ ఊరి చివర -కవితా సంకలనం.
ఈ కవితలు కొన్ని జీవన చిత్రాలైతే, కొన్ని అధివాస్తవికతలు మరికొన్ని నైరూప్య చిత్రాలు (abstract paintings). నైరూప్య చిత్రాలలో రంగులు, రూపాలు ఉంటాయి కాని ఆ రూపాలు మనకు అపరిచితమైనవి. వీటిలో కేవలం రంగులు, రూపాలను మాత్రమే చూసి ఆనందించాలి. అఫ్సర్ కవితలు కొన్ని నైరూప్య చిత్రాల వలే అర్థమున్నట్లు తోచదు. పాఠకుడు ఆ కవితా రెక్కలగుర్రాలపై ఎక్కి ఊహా ప్రపంచంలో విహరించాలి. చిత్రకళాప్రపంచం తో పరిచయమున్న వారు అఫ్సర్ కవితలను ఎక్కువ ఆనందించగలరు.
అఫ్సర్ అమెరికాలో ఉన్నా అంధ్రదేశం గుండెచప్పుడుకు దూరం కాలేదు. ఈ కవికి తెలంగాణలోని పల్లె ప్రజల బీదరికం, అస్వాతంత్ర్యం గురించి బాగా తెలుసు. అక్కడి రైతుపై అవాజ్యమైన ప్రేమా ఉంది. అన్నల పై సానుభూతీ ఉంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టే తెలంగాణా 2002, నెత్తుటి నెమలీక కవితలు బాగా పండాయి. తెలంగాణా 2002 –
ఇది సుదీర్ఘ కవిత. ఇందులో తెలంగాణా పల్లెలలోని ప్రజల అజ్ఞానం, బానిస మనస్తత్వం బీదరికం చక్కగా వ్యక్తమయ్యాయి. చూడండి కొన్ని పంక్తులు.
నేలమీద వీచే గాలి ప్రశ్న గుర్తుల కొడవళ్లని
తిప్పుతూ ఊళ్లని చుట్టింది
వొంగి వొడిలిపోయిన బానిస దేహాలు
నిటారుగా నిల్చున్నాయి
రావుగారి ఇంటిముందు రాత్రి పగలు కాపలాల్లేవు
పుట్లకొలదీ వడ్లు దంచి పోటు వేయడాల్లేవు
గుట్టలకొద్దీ వంటకట్టెలు పగలకొట్టేది లేదు
కనులెర్ర జేయడాలు పండ్లు పటపటకొరకడాలూ
చింతబరిశెలతోటి వీపు చితక్కొట్టడాలు లేవు
ఇప్పుడు బానిస ఆకలి నాలుకల ప్రళయం.
కఠినుడైన నిజాం దుర్మార్గపు పరిపాలనకు, వత్తాసు పలికే గ్రామ వ్యవస్థలోని ఎల్లాపు కులస్థులైన దేష్‌ముఖ్, దేశాయ్, పటేళ్ల అకృత్యాలతో పల్లె ప్రజల, రైతుల జీవనం ఛిద్రం కావొచ్చింది. ఫలితం సాయుధ తిరుగుబాటు. జమీందారీ వ్యవస్థను నెత్తికెత్తుకున్న ఈ గ్రామ పటేళ్లు వారి నామాలలో రావు కలిగున్నా వీరిని గ్రామ ప్రజలు దొరలనో లేక పటేలనో పిలవటం సాధారణం. ఈ కవితలో రావు గారి బదులుగా పటేల్ అని పెడితే అనువుగా ఉండి ఉండేది.
భారతదేశం నుంచి అమెరికా వచ్చి, పదేళ్ళుగా అమెరికాలో ఉంటున్న అఫ్సర్ పై ఇక్కడి నైసర్గిక స్వరూప స్వభావాలు తమ ప్రభావం చూపక ఉంటాయా? జంగమం కవితలో అఫ్సర్ వ్రాస్తాడు –
అన్ని ఇళ్ల కూలిన గోడల
అన్ని ఫోర్ క్లోస్డ్ కలల శిధిలాల్లోంచి
ఇల్లు ఇల్లనియేవు ఇప్పుడు సూర్యుడి కూనిరాగం …
***
పాస్ పోర్టులు అంతర్జాతీయ అబద్ధాలు
లోపలి నిజ పౌరసత్వాన్ని దాచేస్తాయి
నెత్తిమీద ఒక ఆకాశమ్ముక్కని అతికించి
ఆ అద్దం లోంచి నన్ను చూస్తా
అమెరికాను అతలాకుతలం చేసిన sub-prime రుణాలు పొంది, నెలసరి వాయిదాలు కట్టలేక, కలల స్వగృహాలను బాంక్ లకు foreclosure విధానంలో,తిరిగి ఇచ్చివేసే వెతలు, అఫ్సర్ ఆర్ద్రత కన్నుకందకుంటాయా? అమెరికాలో ఉంటున్నా , మనసులో భారతీయుడే కదా. క్షుద్బాధార్తుల దీనస్థితిని అది భారతదేశం ఐనా అమెరికా ఐనా అఫ్సర్ పట్టనట్లు వుండలేడు. తోలుమందం కవితలో –
స్టేట్ స్ట్రీట్ మీద నడుస్తున్నప్పుడు
“డాలర్ ప్లీజ్” అనే గొంతులో
పేదరికం వినిపించదు
దాని, నల్ల బలుపు పులి మొహంతో బెదిరిస్తుంది
వొక కాకి
భీకరమైన స్వరాన్ని
నల్ల రెక్కల్లా చాచి
ఆకాశం వాకిలిని మకిలి చేస్తుంది.
వెంటాడండ్రా, ఈ నల్ల కాకుల్ని
కొయిలల్ని పేరడీ చేసే వాటి ఆకలి కేకల్ని!
అఫ్సర్ రచనా శైలిని విశదీకరించే కొన్ని కవితలను చూద్దాము.
కొయ్యకన్ను:
అతన్ని రోడ్డు దాటిస్తున్న
ఆ కర్ర చప్పుడు
నా వెనుక నీడలాగా.
తెరుచుకునే వున్న అతని చూపుకింద
ప్రపంచం ఒక శూన్యపు గులకరాయి
గిరగిర తిరుగుతూనే వుంటుంది
అనేకార్ధాల
అనేక వర్ణాల చక్రంలాగా
అతని కళ్లకింద పొందిగ్గా
వొదిగి కూర్చున్న వాటి అర్థాల కోసం
వెతుక్కుంటూ వుంటాను
అసలు అర్థం ఏమిటా అని
అదే పనిగా శోధిస్తూ వుంటాను.
ఈలోపు అతను రోడ్డు దాటి వెళ్లిపోయాడు.
నేను
రోడ్డు మధ్యలో
చిక్కుబడిపోయాను
కొయ్యబారిన కన్నుతో
కధ కవితైతే అది కొయ్యకన్ను కవితవుతుంది. అతను కర్ర సహాయంతో రోడ్డు దాటి వెళ్లితే, అతన్నే గమనిస్తూ, ఆలోచించే కవి రోడ్డు మధ్యనే కొయ్యబారిన కన్నుతో చిక్కుబడిపోవటం ఓ హెన్రి కధ ముగింపులా అనిపిస్తుంది.
కవితలకు శైలి ముఖ్యమా లేక కధా వస్తువు ముఖ్యమా అంటే నీకు కుడికన్ను ఇష్టమా లేక ఎడమకన్ను ఇష్టమా అని ప్రశ్నించటంలాంటిది.కవితలకు రెండూ ముఖ్యమే. అఫ్సర్ కవితలు కొన్ని కధలు చెప్తే కొన్ని శైలి ప్రధానం గా అనుభూతి కవితలయితే మరికొన్ని అవుతాయి సంబంధం లేని ఆలోచనల మాలలు (చాటువులు). ఈ Stray thoughts ను నైరూప్య చిత్రాల వలె భావించి ఆనందిస్తే పేచీలేదు.
అఫ్సర్ కవితలు భావకవిత్వం కాదు చదువుతూ మధుర ఊహలలో తేలిపోవటానికి. అవి మనస్సుకు పదును పెట్టే చిక్కుముళ్లు. కవితను చదువుతూ చిక్కుముళ్లను విడదీస్తూ కవి ఏమి చెప్తున్నాడనే విషయం తెలుసుకోవటానికి మనస్సుకు పనిపెట్టాల్సిందే. భావ కవితలు, సులభ వచన కవితలు, ఉద్వేగ పరిచే కవితలు చదివే వారికి ఈ కవితలు ఒక పట్టాన అంతుచిక్కక అయోమయంలో పడవేసే ప్రమాదముంది. అందుకు సిద్ధం కాని వారు ఈ కవితలకు దూరంగా వుండవచ్చు.
అఫ్సర్ కవితలు భావకవిత్వం కాదు అని పైన ఉదహరించాను. మరి అఫ్సర్ కవితలేమిటి? కవితలకు వర్గీకరణ అవసరమా? కవితలను కవితలలాగా చదివి ఆనందించలేమా? అఫ్సర్ కవితలలో రసాస్వాదన తక్కువే. అఫ్సర్ కవితలలో కొన్నింటిలో దాదాయిజం (Dadaism) ఛాయలు కనిపిస్తాయి. దాదా ఏమిటి? కళలు లో ఉండే రసానికి (aesthetics) దాదాయిజం వ్యతిరేకం. దాదాయిజం బూర్జువా శక్తుల రాజ్యకాంక్షకు, యుద్ధ ప్రీతికి వ్యతిరేకి. దాదా కళలలో గందరగోళం, తర్కానికి అందని ఆలొచనలు కూడా కనిపిస్తాయి. ఈ “వీరుడి శిరస్సు” కవిత చూడండి –
తెలిసింది కదా యిప్పుడు
వొక ధిక్కారం తల తెగనరకటానికి
ఎన్నెన్ని వ్యూహాలు కావాలి!
తెగిపడిన ప్రతి తలా సలసల మరిగే నెత్తుటి నగరం!
ఏ దిగులూ లేని ఒక మిట్టమధ్యాహ్నం
నగరం శిరస్సుపై
విరుచుకుపడిన బాంబుల వర్షం
ఎవరి నేరానికో ఎవరి దాహానికో
పేలిపోయిన వేల శరీరాల గావు కేకలు!
మరణాన్ని
రంగు రంగుల దృశ్యాలుగా
అల్లుతున్న తెల్ల మీడియా.
ఇరాక్ పై అమెరికా యుద్ధకాంక్షకు వ్యతిరేకంగా వ్రాసిన కవిత (తునక) ఇది.
అఫ్సర్ కవితలలో ముస్లిం వాద ఛాయలు కనిపిస్తాయి.
నువ్వు పోయాక
వొక మూలకి వొదిగి కూర్చున్న షెహ్నాయీ
పాడుకుంటుంది లోతయిన తన్హాయీని,
తనలో తనే తెగని రాగమై,
నువ్వు కని వదిలేసిన కలని
అశాంతంగా మోస్తూ!
వొక రొట్టి ముక్కా, వొక దేశమూ, వొక షెహనాయీ కవిత లోంచి, ఒక తునక ఇది. మహ్మద్ ప్రవక్త , ప్రవక్త కూతురు ఫాతిమా, కర్బలా కధల ప్రస్తావన ఈ కవితలో ఉంది.
మార్మికతతో కూడిన మూడో యామం లాంటి కవితలు పాఠకుడికి అంతుబట్టవు. పాఠకులకు మహమ్మద్ ప్రవక్త సూక్తులు, ఫాతిమ, కర్బలా కధ గురించి తెలిసింది తక్కువ. అసర్, అజా, దువా, దాదర్, ఫజర్, ఈద్‌గాహ్, తవ్వోడ, deja-vu (Fr), తకరార్లు లాంటి గొట్టు పదాలు పాఠకులకు పంటికింద రాయిలా తగుల్తాయి. పాద సూచిక ద్వారా ఈ విషయాలను పాఠకులకు తెలియచేయవచ్చు. కవితా సంకలనం సంపాదకుడు ఈ విషయం లో శ్రద్ధవహించాల్సుండింది.
అఫ్సర్ కవితలలో వామభావజాలం కనిపిస్తుంది. ఇంతకీ అఫ్సర్ అజెండా ఏమిటి?
జండాలో జాతీయ గీతాలో
పార్టీలో రాజ్యాంగాలో రాజ్యాలో
వోటుహక్కులో ఎన్నయినా వుండనీ
గుప్పెడు మెతుకులే రాజ్యాంగం మాకు
గుక్కెడు నీళ్లే జాతీయ గీతం మాకు
(ఎడారి నుంచి కాస్త తడి కవితలోంచి)
ఆంధ్రదేశాన ఎందరో కవుల కవితలు ఎవరూ పట్టించుకొక చీకటిలో అలమటిస్తున్న కాలంలో, అఫ్సరీకులకు (అఫ్సర్ కవితలు) పెక్కు విమర్శకులుండటం ఆ కవితా వైశిష్టమనే చెప్పాలి. చివరగా అఫ్సర్ కవిత్వం ఎందుకు చదవాలి? అఫ్సర్ కవితలకు అభిమానులు, నిరసన గళం వినిపించే విమర్శకులూ ఏక కాలంలో ఎలా వున్నారు? అఫ్సర్ కవిత్వం లో ఉంది అయోమయమేనా? అఫ్సర్ కవిత్వానికి అభిమానులు, విమర్శకులు ఇచ్చే కితాబుల్ని ఎలా నమ్మటం? ఈ ప్రశ్నలకు అఫ్సర్ బ్రాండ్ కవిత్వం చదివి పాఠకుడే ఒక నిర్ణయానికి రావల్సి ఉంది.
అఫ్సర్ గతంలో మూడు కవితా సంకలనాలు వెలువరించారు. అఫ్సర్ కవితకు 2007 లో భారత ప్రభుత్వ భాషా భారతి సమ్మాన్ జాతీయ పురస్కారం లభించింది.
ఊరి చివర -అఫ్సర్
ప్రధమ ముద్రణ: డిసంబర్ 2009
పాలపిట్ట ప్రచురణలు, హైదరాబాదు.
సంపాదకుడు: గుడిపాటి
ముఖ చిత్రం: లక్ష్మన్ ఏలే
ముందుమాట: జ్ఞాపకాన్ని కవిత్వంగా మార్చే రసవిద్య -ఎన్.వేణుగోపాల్
డెమి సైజ్: 142 పేజీలు ధర: రూ.60/-
అన్ని ప్రముఖ పుస్తక దుకాణాలలో లభ్యమవుతుంది.
ఈ పుస్తకం పై ఈమాట జులై 2010 సంచికలో వచ్చిన సమీక్ష ఇక్కడ.
తిలక్ బొమ్మరాజు
నాకు ఊరి చివరలో ఎంతగానో నచ్చిన కవిత,అఫ్సర్ గారు మీరు ఇలానే రాయాలి ఇంకా ఎన్నో,ఎంతో కవిత్వాన్ని మాకోసం/\
వెనకటి కొండ గుర్తు
వెనక్కి తిరిగితే దేహం బండరాయి
వొక శిలా మరణ శాసనం
కనుపాపల్నిపట్టి లాగుతుంది.
వెనక్కి తిరగలేనప్పుడు
దేహం నిలువెత్తు చావు
అయిననూ…
గిర గిరా వెనక్కి తిరుగు
నడిచో,పరిగెత్తో కుంటుతూనో
ముందు కాళ్ళతోనో
వెనక దెయ్యం కాళ్ళతోనో
తిరుగు వెనక్కి వెనక్కి
* * *
జన్మాంతరాల దిగుళ్ళ మాయాజలాల మధ్య
మరొక్కసారి
నిండా మునుగు
మళ్ళీ తేలిపో.
* * *
దాగుడుమూతల దండాకోర్ల
వెన్నెల కుప్పల చీకటి రహస్యాల
తుడుం ఆటల తొండి
మిత్రుడి ముఖం వెనక ముఖంలోకి చూడు.
* * *
వెనక్కి తిరుగుతున్నప్పుడు
వొక ముఖాన్ని
కాస్త ఎండ వైపు తిప్పు.
ఇవాల్టి చీకటి పాఠం ఇంకాస్త చిక్కనవుతుంది
కొండ నిజంగా గుర్తు అవుతుంది.
perugu
తెలుగు కవులకు విమర్శకుల కొరత వుంది అని పదే పదే చెబ్తుంటాను..
మీ సమీక్ష చదివాక మీలాంటి విమర్శకులు మరింత మంది వస్తారని ఆశ..
చాల బాగా రాసారు రావుజీ …
పుస్తకం » Blog Archive » ఊరిచివర – కవిత్వదేహం
[…] ఎన్.వేణుగోపాల్ గారి ముందుమాట ‘ఊరి చివర’ పై సి.బి.రావు గారి పరిచయ … ‘తెలంగీపత్తా’ కథపై […]
నాగలక్ష్మి
నువ్వు పోయాక
వొక మూలకి వొదిగి కూర్చున్న షెహ్నాయీ
పాడుకుంటుంది లోతయిన తన్హాయీని,
తనలో తనే తెగని రాగమై,
నువ్వు కని వదిలేసిన కలని
అశాంతంగా మోస్తూ!
చాలా బావుంది కవిత.
నైరూప్య చిత్రాల తో పోల్చడం సమంజసంగా ఉంది రావు గారు!నైరూప్య చిత్రాలలో వుండే మార్మికత ఎన్నెన్నో స్పష్టాస్పష్ట భావాలకు హింట్స్ ని అందిస్తుంది. అందుకే ఒకే చిత్రం అనేకమంది ప్రేక్షకులకు అనేక విధాలుగా గోచరిస్తుంది.చిత్రం గొప్పదైతే ,చూసిన కొద్దీ ,చూస్తున్నవ్యక్తి అనుభవసారం చిక్కబడిన కొద్దీ మరింత కొత్త కొత్త అనుభూతిని ప్రేక్షకుడికి అందిస్తుంది.ఈ కవిత నిస్సందేహంగా ఆ జాతికి చెందినదే.కవి గారికి అభినందనలు!
పూల పరిమళాలను అవలీలగా మోసుకెళ్ళే పవనం లాగా ఎంత బాగా సమిక్షించారండి రావు గారూ! మీకు అనేక ధన్యవాదాలు..
అఫ్సర్
పుస్తకం మిత్రులకి:
“ఊరి చివర” మీద రావు గారి సమీక్ష బాగుంది. తన వైపు నించి కాక, కవి వైపు నించి పుస్తకాన్ని చదివి, అందులో వున్న విషయాన్ని అర్ధం చేసుకోవాలన్న నిజాయితీ , పఠన ప్రియత్వం రావుగారిలో చూశాను నేను. ఆయన విమర్శ కూడా సున్నితంగా వుంది. (ఆ మాటకొస్తే, విమర్శ సున్నితంగానే వుండాలని నా అభిప్రాయం కాదు. ఈ విషయంలో నేను కొంచెం “మాగంటి” మార్గీయుడిని. ముక్కు బద్దలయ్యేట్టు నిజం చెప్పడం..మాగంటి మార్గం)
మాగంటి, రవి: జ్ఞాపకాల గురించి మంచి మాట చెప్పారు. అసలు సాహిత్యం అంతా ఏదో ఒక “స్మృతి” కదా!
రవి చెప్పినట్టు -చెరిపేస్తే అవి జ్ఞాపకాలు కావు. కాని, ఏ జ్ఞాపకాలు చెరిపేస్తాం, ఏవి చెరపకుండా వుంచుకుంటాం అన్నది ముఖ్యం. అక్కడ రాజకీయాలు వుంటాయని అనుకుంటాను .
శరత్: రావుగారిలో ఇంకా మనకి కనిపించని లోతులు వున్నాయని నాకూ అనిపిస్తోంది. ఆయన ఇప్పుడు సూఫీ సాగర మథనంలో వున్నారని ఒక ఈలేఖ ద్వారా తెలిసింది. చూద్దం ఆ మథనంలోంచి ఏం పుడుతుందో?!
చిత్రలేఖ, సుజాత గారూ: ధన్యవాదాలు.
chitralekha
“డాలర్ ప్లీజ్” అనే గొంతులో
పేదరికం వినిపించదు
దాని, నల్ల బలుపు పులి మొహంతో బెదిరిస్తుంది.
— nice gaa vundi
sujata
CB Rao garu.. Wonderful Wonderful. Is it really you ?
శరత్ 'కాలం'
ఏంటీ సి బి రావు గారేనీ ఇది వ్రాసింది ?! మీకు కవితల మీద ఇంత అవగాహన వుంది అని, ఇంత లోతుగా, గంభీరంగా సమీక్షించగలరని ఎప్పుడూ అనుకోలేదు. మీ మామూలు రచనలకన్నా ఈ సమీక్ష చాలా ఉన్నత శైలిలో వుంది. నిన్ననే నేను అఫ్సర్ గారిని కలిసాను. ఇది చదివి వారి గురించి, వారి గురించి మరింత తెలుసుకోగలిగాను.
రవి వీరెల్లి
సి.బి.రావు గారు,
సమీక్ష బాగుంది. సమీక్షతో సంభంధం లేనివిషయమే అయినా, అఫ్సర్ గారు గతంలో రాసిన మూడు కవితా సంకలనాల పేర్లు కూడా చెబితే బాగుండుననిపించింది.
మీరన్నట్టు “కొన్ని మనోపటం నుంచి చెరిపెయ్యాల్సిన జ్ఞాపకాలు” కూడా ఉంటాయి. కాని చెరిపేస్తే అవి జ్ఞాపకాలు కావు కదా.
-రవి వీరెల్లి
మాగంటి వంశీ
ఇవి సి.బి.రావుగారి రాతలేనా అని నాకు బోల్డు ఆశ్చర్యంగా వున్నది….మీ బ్రాండుకు భిన్నంగా ఇలా రాసేటట్టైతే మీరు ఫుల్టైము రచయితైపోవచ్చు…కనపడకుండా కుమ్మేసేలా వున్నారు… 🙂 ఇక మీరు బోల్డు వ్యాసాలు రాయాలి రావుగారు….
ఏదేమైనా కొత్త కొత్త (నాకు) కవులని పరిచయం చేస్తున్నందుకు ధన్యవాదాలు, అభినందనలు…అఫ్సర్ గారెవరో నాకు తెలియదు కానీ, మీ వ్యాసం చూసిన తర్వాత, ఓ లాటి తహ తహ కలిగింది….ముందు ఆ తహ తహ పక్కెనెట్టు, వీరు కూడా తెలీదా నీకు – ఐతే నీ ఖర్మ అంటే బహుదా శతధా సహస్రధా సంతోషం…
ఇహపోతే మీరన్న జ్ఞాపకాల మాటతో కొద్దిగా విభేదించినా – (అంటే చెరిపేసే విషయంలో అన్నమాట – జ్ఞాపకాలు అనేవి ఎప్పుడైనా చెరిపెయ్యకూడదు – అవి ఎంత దిగలాగినా, ఎగదోసినా అవి అలా ఉండాల్సిందే, చెరిపెయ్యకూడదు…మనిషిగా మట్టి మీద నిలబెడతాయి, మిగిలున్న మానవత్వాన్ని మంటకలపకుండా ఉంటాయి, కాదూ కూడదంటే వాడినే పాతాళానికి తీసుకునిపోతాయి…..అదండీ సంగతి…)- వ్యాసం / పరిచయం బాగుంది
మాగంటి వంశీ