నందితిమ్మన పారిజాతాపహరణం
రాసిన వారు: కాశీనాథుని రాధ
*****************
పదహారో శతాబ్దంలో కృష్ణ దేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలలో ఒకడై , పెద్దనతో బాటు రాయల వారికి కావ్యాన్ని అంకితం చేసిన కవి నంది తిమ్మన. కృష్ణ రాయల వారి భార్య వెంట అరణం వచ్చిన కవి అనీ, రాజుగారికి, రాణిగారికి వచ్చిన అపార్ధాన్ని సవరించడం కోసం పారిజాతాపహరణ కావ్యాన్ని రాసాడని అంటారు. ఏది ఏవైనా అయిదొందల ఏళ్ళనాటి ప్రాచీన సాహిత్యాన్ని మనం ఎందుకు చదవాలి? అంటే …
పాత వాళ్లైనా కొత్త వాళ్లైనా కవులు కవులే. ఆనాటి కవులు సృష్టించిన పాత్రలు వాటి గుణగణాలు, స్వభావాలు మనకి పరిచయం ఉన్నవే. వాళ్ళ భాషాప్రయోగాలు చూసి పెదవి విరిచిన సందర్భాల కంటే ‘ ఔరా’ అనుకున్న సందర్భాలే మోతాదులో కాస్త ఎక్కువని చెప్పాలి.
భాగవత దశమస్కంధంలో మూడు శ్లోకాలని తీసుకుని ఐదు ఆశ్వాసాల పారిజాతాపహరణాన్ని సృష్టించాడు నంది తిమ్మన. నిజానికి ఈ కావ్యం విషయంలో సృష్టి అనే పదం చక్కగా నప్పుతుంది. ఎందుకంటే మూల కథలో చిరుగీతల్లా ఉన్న పాత్రలని తీసుకుని, మరువలేని,మరపురాని సజీవశిల్పాలుగా తీర్చి దిద్దాడు తిమ్మన.
ముక్కు తిమ్మనార్యు ముద్దు పలుకు అన్న నానుడే కాదు
“లోకమునం గల కవులకు
నీ కవనపు ఠీవి యబ్బునే కూపనట
ద్భేకములకు గగనధునీ
శీకరముల చెమ్మ నంది సింగయతిమ్మా! “
-నీకూ తక్కిన కవులకి హస్తిమశకాంతరభేదం ఉంది అంటూ నాటి పండిత కవులచే మెప్పులు పొందిన కవి యితడు. సరళ సుందరమైన శైలి, నాటకీయత, పాత్ర పోషణాచాతురి, అతిసుందరంగా ప్రయోగించిన అలంకారాలు, చక్కగా ఎంపిక చేసి తూచి తూచి చేసినట్టుండే పదప్రయోగం – ఇవన్నీ వాటంతట అవే పోటీలు పడి తోసుకుంటూ వచ్చి తిమ్మన కవితలో చోటు చేసుకున్నాయి.
కావ్యారంభంలో –
శ్రీ మదికిం ప్రియంబెసగ చేర్చిన యుయ్యెల లీల వైజయం
తీమిళితాచ్చకౌస్తుభము నిద్దపుకాంతి దనర్చి యాత్మవ
క్షోమణి వేది బొల్పెసగ చూడ్కుల పండువు సేయు వెంకట
స్వామి కృతార్ధుజేయు నరసక్షితినాధుని కృష్ణరాయునిన్
– అన్న ప్రార్థనా పద్యంలో …వైజయింతీమాలతో బాటు ప్రకాశిస్తున్న కౌస్తుభాన్ని వక్షస్థలం మీద ధరించిన వెంకటేశ్వరుడు లక్ష్మీదేవికి ప్రీతి కలిగించడానికి వైజయింతీమాల అనే ఉయ్యాలలో ఆవిడని ఊపుతున్నట్లున్నాడని – అంటూ శృంగారనాయకునిగా వేంకటేశ్వరుని ప్రార్ధించి, తరవాత మహేశ్వరుని ప్రార్థనలో
పొలతుల్కౌగిటం గ్రుచ్చి యెత్తి తలబ్రాల్ వోయించు నవ్వేళ నౌ
దలగంగం దన నీడ తాను గాంచి, మౌగ్ధ్యంబొప్ప వేరొక తొ
య్యలియంచున్మదినెంచు పార్వతి యసూయావ్యాప్తికి నవ్వు క్రొ
న్నెలతాలుపు కృష్ణరాయునికి సంధించున్ మహైశ్వర్యముల్
– చెలికత్తెల సహాయంతో శివుడికి తలంబ్రాలు పోస్తూ, అతని తలపైనున్న గంగలో తన నీడ తానే చూచి వేరొక స్త్రీ అనే భ్రమతో అసూయపడుతున్న పార్వతిని చూచి నవ్వుకుంటున్న ఆ పరమేశ్వరుడు రాయలకి ఐశ్వర్యాలని ప్రసాదించాలని కోరుతున్న పద్యంలో, నాయిక అసూయా భావాన్ని సూచించి, కావ్యానికి నాంది ప్రస్తావనలు చేసి ఈ కావ్యం నాటకం అని చెప్పకుండానే చెప్పాడు. నంది తిమ్మన సృష్టించిన కృష్ణుడు ,సత్యభామ, నారదుడు, రుక్మిణి పాత్రలు తరతరాలుగా నాటకరంగంలో నిలిచిపోయాయి.
ఇక పదప్రయోగం విషయం చూస్తే… కథ చదువుతూ ముందుకెళుతున్న పాఠకుడు వెనక్కి తిరిగి చూసినప్పుడు అంతకుముందు ఉపయోగించిన పదాలన్నీ మరింత అర్థవంతంగాను, ఉచితంగాను, అద్భుతంగాను తోస్తాయి.
రుక్మిణిమందిరానికి నారదుడు రావడము, పారిజాతపుష్పాన్ని కృష్ణునికి సమర్పించగా, దానిని అతడు రుక్మిణికి ఇవ్వటము మొదలుగా జరిగిన వృత్తాంతాన్ని చూచి చెలికత్తె సత్యభామకు ఆ సంగతులు చెప్పవచ్చింది. సత్యకు కలగబోయే ఆగ్రహానికి తగిన ప్రేరకాలని సిద్ధం చేస్తున్న ఆ చెలికత్తెను వర్ణిస్తూ.. నెచ్చెలి కనుగవ నెఱసంజ వొడమగ (ఎర్రబడ్డకళ్ళతో అంటే కోపాన్ని సూచిస్తూ…ఇట్లనియెన్) ఇలా అందిట “అమ్మా ఏమని చెప్పుదు “ అంటూ మొదలెట్టి,
“అన్నెలతయు కొప్పులోన నవ్విరిదాల్చెన్ … అంతలోన అద్భుతంబావహిల్ల రాజాస్యబింబ రుక్మిణి తేజరెల్లె సానబట్టిన మకరాంకుశస్త్రమనగ” అంటు చెలికత్తె సెలవిస్తుంది.
సౌందర్యాన్ని వర్ణించడానికి ఎన్నెన్ని పదాలు లేవు మరి సానబట్టిన మన్మధుని బాణం అన్న పదం తన సౌందర్యాతిశయం చేత భర్తని కొంగున కట్టుకున్నానని గర్వపడే సత్యభామలో ముందు చెలరేగబోయే కోపాగ్నిలో వేసిన మరో సమిధ అయింది.
ఆరణభోజను మతకములా రుక్మిణి
నటనములా మురాంతకు చెయ్వుల్
చేరి కనుంగొనుచో నెవ్వారికి
కోపంబు రాదు వారిజనేత్రా!
– ఆ నారదుడి మాటలు, ఆ రుక్మిణి నటనలు, ఆగోపాలుడి చేతలు – ఊరికే పైపైన చూడ్డంకాదు చేరి కనుంగొనుచో అంటే “attention pay” చేసి చూసేరనుకోండి … ఎవ్వారికి కోపంబురాదు ? అంటూ ఇతరులకే వస్తే ఇక నీమాట చెప్పాల్సిందేముంది?… అనడం అంతేకాదు… సత్యభామ ఈ విషయాన్ని పొరపాటున తేలిగ్గా తీసుకుంటుందేమో అని ముందుగానే జాగ్రత్త తీసుకుంటోంది చెలికత్తె. ఆసలు ఈ చెలికత్తెలు, మంథరలు, శూర్పణఖలు లేకపోతే కథలు ఉప్పుకారం లేకుండా వండిన వంటల్లా చప్పగా ఉంటాయి. పై మాటలు విన్న సత్యభామ –
“అన విని వ్రేటువడ్డ యురగాంగనయుంబలె నేయివోయ భగ్గన దరికొన్న భీషణ హుతాశనకీల యనంగ లేచి “ అంటూ, దెబ్బతిన్న పాములా లేచిందంటూ వర్ణించి, చెలికత్తెతో సంభాషణ ముగిసేక (16 పద్యాల తరవాత)
“అని వగల బొగులుచు
జనితామర్షమున కోపసదనంబునకున్
జనియె లతాంగి హరిచం
దన కోటరమునకు నాగతరుణియు బోలెన్”
– అని మర్చిపోకుండా, ఆవిడ తోకతొక్కిన త్రాచని గుర్తు చేస్తాడు పాఠకులకి.
తిమ్మన వర్ణనలు: సాధారణంగా వర్ణన చేసేటప్పుడు కవులకి ఏకాగ్రత పోతుంది. కాని నందితిమ్మన ప్రత్యేకత ఏమిటంటే కథ చెబుతున్నా, పాత్రలతో సంభాషణలు చేయిస్తున్నా దృష్టిని మాత్రం మళ్ళనివ్వడు. అంతేకాదు ముందు పద్యాలలో ఈ రంగం రక్తి కట్టటానికి కావలసిన అలంకరణలన్నీ చేసి సిద్ధంగా ఉంచుతాడు. వగల బొగులుచు కోపగృహాన్ని చేరుకుంది సత్యభామ. అక్కడ కృష్ణుడు “ముని నాకిచ్చిన పూవు చెందమును నేమున్నాడి యా భోజనందన కర్పించిన జాడయుం” అంటూ ఒక పక్క తన తప్పు తానే ఒప్పుకుంటూనే… “ చెంతం బొంచి వీక్షించిన సాత్రాజితి బోటి నావలన తానేమి కల్పించెనో” అంటూ అమాయకునికి మల్లె కంగారు పడుతూ సత్య సముదంచిత కాంచనసౌధ వీధికి విచ్చేసేడు. కోపగృహంలో ఉన్న సత్య వద్దకు ఊరికే వచ్చాడా తనతో బాటు దివ్యకుసుమం తాలూకు వాసనలు పట్టుకుని మరీ ఏతెంచాడు.
అప్పుడు ఆ సత్యభామ పారిజాతకుసుమాగత నూతన దివ్యవాసనల్వింతలు చేయ తావి యది విస్మయమంచు ముసుగుం ద్రోచి … కోపగృహంలో నాలుగు పక్కలా చూసి సంభృత తాలవృంతుని కాంతుని జూచి… కన్నీళ్ళు పెట్టుకుని మళ్ళీ ముసుగు వేసింది. కోపం రావడాన్ని ఒళ్ళు మండడం అనడం పరిపాటేకదా…ఒళ్ళు మండుతున్న ఆ సత్య ఒక్క నిట్టూర్పు వదిలితే ఆ వేడిగాలికి కప్పుకున్న ముసుగు చివర పైకి లేచింది. అదీ ఇందులో వర్ణన.
ఓర్పొకయింత లేని వికచోత్పలలోచన చిత్తవీధిం జ
ల్లార్పగ నీలనీరదశుభాంగుడు వేఁసనుదెంచె నంచుఁ గం
దర్ప హుతాశనున్వెలికిఁ దార్చు సఖుండును బోలె వేడి ని
ట్టూర్పు దళంబుగా నిగిడె నున్నమితావరణాంశుకాంతమై
– ఏమాత్రం ఓర్పు లేని సత్యభామ మనోవీధిలో రగులుతున్న కోపాగ్నిని చల్లార్చడానికి వట్టికృష్ణుడుకాదు మరి నీలనీరదశుభాంగుడు (వాన కురిపించడానికి సిద్ధంగా ఉన్న నల్లటి మబ్బులా ఉన్నవాడు) వస్తున్నాడు, పదవయ్యా అంటూ స్నేహితుడైన అగ్నిని బయట పడవేయడానికి తోడ్పడుతున్న వాయుదేవునిలా ఉన్నదట కప్పుకున్న ముసుగుని తోసుకుంటూ వస్తున్న సత్యభామ యొక్క వేడి నిట్టూర్పు.
దీనికి రెండు పద్యాలకు ముందు… కోపగృహాన్ని ప్రవేశించిన … ధూర్తగోపాలుడు తాలవృంతమొక భామిని సత్య పిఱుంద నుండి మందాలస లీలమై విసర నాదటఁ గైకొని వీచె తద్వపుః కీలిత పంచసాయకశిఖిం దరికొల్పుచునున్న కైవడిన్ … ( చెలికత్తె ఒకతె నెమ్మదిగా విసురుతున్న విసెనకర్రను తీసుకుని, కొంటె గోపాలుడు సత్యలోని మన్మధాగ్నిని మరింత రగుల్కొల్పుతున్నట్లుగా వీచసాగేడు) అంటూ ముందుగానే సత్యభామలో అగ్నిని సిద్ధం చేశాడు.
ద్వితీయాశ్వాసంలో సాయంకాలాన్ని, అంధకారాన్ని, చంద్రోదయాన్ని గురించిన వర్ణనలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి రెండు చెప్పి ముగిస్తాను. చీకటిని వర్ణిస్తూ…
“దన మణి పడిపోవ ధరణీ తలంబున
నెమకంగ వచ్చిన నింగి యనగ …”
– అంటూ తన వంటి మించి సూర్యుడనే మణి జారి పడిపోతే ఆ నల్లటి ఆకాశం భూమ్మీదికొచ్చి వెతుక్కుంటోందా అన్నట్లు రాత్రివేళ చీకట్లు ముసురుకున్నాయట! ఎంత అద్భుతమైన ఊహ.
అలాగే మొనసిన దీపికా నికరముల్గృహ కార్యగతాభిసారికా
వనితల యూర్పు గాడ్పుల నెపంబున గంపము నొంద నోడకుం
డని తిమిరంబు తానభయ హస్తములిచ్చె ననంగ వానిపై
గనుగొనఁ బొల్చె నంకురితకజ్జలముల్నవధూమ మాలికల్
– అన్న పద్యంలో రాత్రి అభిసారికలైన వనితలు ఇంట్లో పనులు చేస్తూ వదిలే ఊపిరి గాలులకి దీపాలూ వణుకుతుంటే ఓడిపోకండని తిమిరుడు(చీకటి) అభయ హస్తం ఇస్తున్నట్టుగా వాటి చుట్టూ చేతులడ్డం పెట్టి కూర్చున్నాడా అన్నట్టుందిట – దీపపు వత్తులనుండి బయటికి వచ్చి వాటి చుట్టూ చేరిన పొగ.
ఆర్భాటం ఏమాత్రం లేని పదజాలాన్ని వాడుతూ, తీగెలా సాగే భావాన్ని వాటిల్లో పొందుపరచటమూ, దూదిపింజల్లా తేలిపోయే భాషా ప్రయోగంతో మేఘగంభీరమైన భావాన్ని అందించటమే తిమ్మన సరళసుందరమైన శైలిలోని విశిష్ట లక్షణం.
swathi
గొనిపోవా గనీక పెనంగు లీల గల్ప లతిక లెల్ల ప్రాణవిభుమ్ బేడబాయ నేర్తురే పద్యం కూడా రాయండి
విష్ణుభొట్ల లక్ష్మన్న
రాధ గారూ:
న్యూజెర్సీ లో “పారిజాతాపహరణం” దృష్టిలో పెట్టుకొని సాహిత్య సభ జరిపారని తెలుసు. ఆ సభకి రాకపోయినా ఈ వ్యాసం ద్వారా మీ ఆలోచనలని తెలిపినందుకు సంతోషం. మంచి వ్యాసం.
విష్ణుభొట్ల లక్ష్మన్న
Vaidehi Sasidhar
రాధ గారూ,
మీ చక్కటి వ్యాసం ఇక్కడ చూసి సంతోషించాను.
అభినందనలు
మాలతి
మీ విశ్లేషణ చాలా బాగుందండీ. ధన్యవాదాలు.
తెలుగుయాంకి
పారిజాతావహరణ కావ్యాన్ని అదు్భతముగా పరిచయము చేసినందుకు ధన్యవాదములు.
మందాకిని
అద్భుతం! చాలా బాగా వ్రాశారు. అప్పుడే అయిపోయిందా అనిపించింది.